నిశ్శబ్ద వ్యూహకర్త | Silent strategist JP Nadda rises to the helm in BJP | Sakshi
Sakshi News home page

నిశ్శబ్ద వ్యూహకర్త

Published Tue, Jan 21 2020 3:56 AM | Last Updated on Tue, Jan 21 2020 3:56 AM

Silent strategist JP Nadda rises to the helm in BJP - Sakshi

న్యూఢిల్లీ: అధికార బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన హిమాచల్‌ ప్రదేశ్‌ కు చెందిన జగత్‌ ప్రకాష్‌ నడ్డా(59)కు మృదు స్వభావిగా పేరుంది. స్వభావరీత్యా ఒదిగి ఉండే నడ్డా కార్యాచరణలో మాత్రం దృఢ సంకల్పంతో వ్యవహరిస్తారు. ఆర్భాటాలపై  ఆసక్తిలేని నడ్డా అనతికాలంలోనే ఎదిగి, అపరచాణుక్యుడిగా పేరొందిన అమిత్‌షా నిర్వర్తించిన బాధ్యతల్ని స్వీకరిస్తున్నారు. నడ్డా నిశ్శబ్ద వ్యూహకర్త. ఆయన నిశ్శబ్దం వెనుక పట్టుదల, నిబద్ధత, సంస్థాగత నైపుణ్యం దాగి ఉన్నాయంటారు ఆయనను ఎరిగిన వారు.

ఆరెస్సెస్‌కు నమ్మకస్తుడు
ఆరెస్సెస్‌తో పాటు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాల విశ్వాసాన్ని చూరగొన్న వ్యక్తి నడ్డా.  బీజేపీలో ప్రస్తుతం నడ్డా అత్యంత బలమైన మూడో వ్యక్తి. పార్టీ భవిష్యత్‌ వ్యూహంలో భాగంగానే గత ఏడాది నడ్డాని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించారు.

విద్యార్థి దశనుంచే రాజకీయాల్లోకి
జేపీ నడ్డా 1960 డిసెంబర్‌ 2వ తేదీన బిహార్‌లోని పట్నాలో జన్మించారు. నడ్డా తండ్రి ఎన్‌.ఎల్‌. నడ్డా. ఈయన పాట్నా యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌గా పనిచేశారు. విద్యార్థి దశనుంచే బీజేపీ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ)లో చురుకైన కార్యకర్తగా పనిచేసిన అనుభవం జేపీ నడ్డాకి ఉంది. పాఠశాలలను అప్‌గ్రేడ్‌ చేయాలంటూ నిర్వహించిన ఉద్యమానికి నాయకత్వం వహించినందుకు నడ్డాని 45 రోజుల పాటు నిర్బంధంలో ఉంచారు. ‘ఛత్రా సంఘర్‌‡్ష సమితిలో చేరడానికి జేపీ ఉద్యమం నుంచి ప్రేరణ పొందాను’ అని నడ్డా ఒకచోట ప్రస్తావించారు. ఆ తరువాత ఏబీవీపీ, బీజేపీ యువజన సంఘం భారతీయ యువ మోర్చాతో కలిసి పనిచేశారు.  

రాజకీయ కుటుంబం కాదు
నడ్డాది సామాన్య బ్రాహ్మణ కుటుంబం. కానీ, రాజకీయ నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన యువతిని వివాహం చేసుకున్నారు. నడ్డా భార్య మల్లిక జబల్‌పూర్‌ ఎంపీ జయశ్రీ బెనర్జీ కుమార్తె. జేపీ నడ్డా రాజకీయాల్లో ఆసక్తి కనపరిస్తే, మల్లిక నడ్డా విద్యారంగం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు.  

బిలాస్‌పూర్‌ నుంచి అసెంబ్లీలోకి
డిగ్రీ వరకు బిహార్‌లో చదివిన నడ్డా.. ఎల్‌ఎల్‌బీని హిమాచల్‌ప్రదేశ్‌లో చదివారు. బిలాస్‌పూర్‌ నుంచి 1993లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పలుమార్లు నడ్డా ఇదే స్థానం నుంచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. రాష్ట్రంలో అటవీశాఖ, పర్యావరణ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిగా కూడా నడ్డా పనిచేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement