సాక్షి, హైదరాబాద్: తమ పార్టీపై కాంగ్రెస్ విష ప్రచారం చేసినా తెలంగాణ ప్రజలు విశ్వసించలేదని, రాష్ట్రంలో పార్టీ బలాన్ని పెంచుకుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని తప్పుడు ప్రచారం చేసినప్పటికీ ప్రజలు నమ్మలేదని, పొత్తు లేకుండా సొంతంగా పోటీచేసి తెలంగాణలో 8 స్థానాలు సాధించామన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించి కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఆరు నెలలుగా బీఆర్‌ఎస్ సర్కార్ చేసినట్టే చేస్తోందని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకు ఒక ఆశాదీపంగా బీజేపీ కనిపించిందన్నారు. పార్లమెంట్ ఫలితాలు వెలువడ్డాక మంగళవారం రాత్రి పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజల గొంతుకగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని, తెలంగాణలో బీజేపీ రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని ధీమాను వ్యక్తంచేశారు.
‘బీజేపీని ప్రజలు ఆశీర్వదించారు. మోదీ పట్ల సంపూర్ణ విశ్వాసం ఉంచారు. మేము ఓటమి పొందిన సీట్లలో కూడా మా పారీ్టకి గతంకన్నా ఎక్కువగా ఓట్లు వచ్చాయి’అన్నారు. ‘బీఆర్‌ఎస్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ఆ పార్టీ కంచుకోట మెదక్‌లో కూడా బీజేపీ జెండా ఎగురవేసింది’అని చెప్పారు. ‘ఈ ఎన్నికలు రెఫరెండం అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.. 50 శాతం సీట్లు కూడా రాలేదు... ప్రజలకు ఇప్పుడు ఏం చెబుతారు’అని ఆయన ప్రశ్నించారు. బీజేపీని ఆదరించిన ఓటర్ మహాశయులకు కృతజ్ఞతలు చెప్పారు.
బీజేపీని మరింత బలోపేతం చేస్తాం..
సికింద్రాబాద్: రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ బలీయమైన శక్తిగా ఎదుగుతుందని కిషన్‌రెడ్డి ప్రకటించారు. సికింద్రాబాద్ నుంచి రెండోసారి విజయం సాధించిన కిషన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం ఓయూలోని కౌంటింగ్ కేంద్రానికి వచ్చారు. పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికల అధికారి నుంచి ధృవీకరణ పత్రం అందుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలో 8 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం గొప్ప పరిణామమని, ఇంకొన్ని సీట్లు గెలవాల్సి ఉన్నప్పటికీ విపక్షాల ఒత్తిళ్ల కారణంతో చేజారాయన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర పారీ్టపైనే ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment