హిందువుల విభజనే కాంగ్రెస్‌ రణనీతి | PM Modi Fires On Congress Party | Sakshi
Sakshi News home page

హిందువుల విభజనే కాంగ్రెస్‌ రణనీతి

Published Sat, May 11 2024 3:31 AM | Last Updated on Sat, May 11 2024 3:31 AM

PM Modi Fires On Congress Party

ఓటు బ్యాంకును సంతోషపరచడంపైనే ఆ పార్టీ దృష్టి 

ప్రధాని మోదీ ఫైర్‌

బీసీల రిజర్వేషన్లు ముస్లింలకు కట్టబెట్టే మోడల్‌ను దేశవ్యాప్తం చేయాలని చూస్తోంది 

నేడు భారత్‌ డిజిటల్‌ పవర్‌.. ఫిన్‌టెక్‌ పవర్‌..  స్టార్టప్‌ పవర్‌.. స్పేస్‌ పవర్‌ 

ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ.. ఇది నా ట్రాక్‌ రికార్డ్‌ 

లూటీ, లూటీ, లూటీ.. దోచుకోవడమే కాంగ్రెస్‌ ట్రాక్‌ రికార్డ్‌ 

తెలంగాణకిచ్చిన రూ.లక్షల కోట్లు అవినీతి ఏటీఎంలోకి వెళ్లాయి  

నాడు బీఆర్‌ఎస్‌ చేసిన పనే నేడు కాంగ్రెస్‌ కూడా చేస్తోంది 

డబుల్‌ ఆర్‌కు మరో ఆర్‌.. రజాకార్‌ ట్యాక్స్‌ కూడా తోడైంది 

తెలంగాణ మూడ్‌ అంతా బీజేపీనే గెలిపిద్దాం అన్నట్టుగా ఉంది 

పాత రికార్డులు బద్ధలు కొట్టి 17కు 17 సీట్లలో గెలిపించబోతోందంటూ ధీమా.. హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియం, నారాయణపేట సభల్లో మోదీ ప్రసంగం

హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన సభలో మాట్లాడుతున్న మోదీ

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: వెనుకబడిన వర్గాలకు దక్కాల్సిన రిజర్వేషన్లను లాక్కొని ముస్లింలకు కట్టబెట్టే మోడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ చూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. హిందువులను విభజించి తమ ఓటుబ్యాంక్‌ను సంతోషపరచడమే కాంగ్రెస్‌ రణనీతి అని ధ్వజమెత్తారు. తెలంగాణలోని జీహెచ్‌ఎంసీలో బీసీలకు దక్కాల్సిన మెజారిటీ సీట్లను మత రిజర్వేషన్ల పేరిట ముస్లింలకు కట్టబెట్టినట్టుగానే దేశమంతా చేయాలని కాంగ్రెస్‌ యోచిస్తోందని, ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను లాక్కొని మత ప్రాతిపదికన ముస్లింలకు ఇవ్వాలని రాహుల్‌గాంధీ చూస్తున్నారని విమర్శించారు.

దీనికి ఇండియా కూటమికి చెందిన బెయిల్‌పై ఉన్న నేత (లాలూప్రసాద్‌ యాదవ్‌).. ముస్లింలకు రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో ఇవ్వాల్సిందేనంటూ వంతపాడుతున్నారని మండిపడ్డారు. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లను గుంజుకునేందుకు ప్రయత్నిస్తే మీరు ఊరుకుంటారా? అందుకే మీ హక్కులు, అధికారాలను కాపాడడానికి మోదీ చౌకీదార్‌లా ఉంటాడు..’ అని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచి్చనప్పటి నుంచి డబుల్‌ ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తూ హైదరాబాద్, తెలంగాణలను తమ ఏటీఎంగా మార్చుకుందని ఆరోపించారు.

వాస్తవానికి ఈ డబుల్‌ ఆర్‌కు మరో ఆర్‌.. రజాకార్‌ ట్యాక్స్‌ కూడా తోడయ్యిందని చెప్పారు. రజాకార్‌ ట్యాక్స్‌ హైదరాబాద్‌ పాతబస్తీ వారికి పూర్తిగా తెలుసునని అన్నారు. ఢిల్లీలో కూడా డబుల్‌ ఆర్‌ ట్యాక్స్‌పైనే చర్చ నడుస్తోందని చెప్పారు. వాస్తవానికి నేను ఎవరికోసం ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారో చెప్పలేదు కానీ ఇక్కడి సీఎం భుజాలు తడుముకుంటున్నాడని, అవి ఎవరికి వెళ్తున్నాయో అర్థం చేసుకోవాలని అన్నారు.  శుక్రవారం హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేటలో బీజేపీ ఎంపీ అభ్యర్థులు జి.కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్‌), ఈటల రాజేందర్‌ (మల్కాజిగిరి, మాధవీలత (హైదరాబాద్‌), కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (చేవెళ్ల), బూర నర్సయ్యగౌడ్‌ (భువనగిరి), డీకే అరుణ (మహబూబ్‌నగర్‌)లకు మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభల్లో మోదీ మాట్లాడారు.

మీ ఓటుతోనే అన్నిటికీ పరిష్కారం 
    ‘హైదరాబాద్‌ సొల్యూషన్‌ సిటీ. ఇక్కడ ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అయితే భారత్‌ అవినీతి వంటి సమస్యతో ముందుకెళ్ల గలుగుతుందా? లక్షల కోట్ల స్కాములు చేసిన పార్టీలతో ముందుకెళ్లగలమా? ఇలాంటి పార్టీలు మీకు మేలు చేస్తాయా? దేశ భవిష్యత్తును మారుస్తాయా? ఇవన్నీ మోదీ కూడా చేయలేడు.. కానీ ఒక్క మీ ఓటు బలంతో ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. బీజేపీ, ఎన్డీఏలకు ఓటేసి గెలిపిస్తే భారత్‌లో దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కారమవుతాయి..’ అని ప్రధాని చెప్పారు.  

కొత్త ఓటర్లు పదేళ్లలో జరిగింది తెలుసుకోవాలి 
    ‘నేడు భారత్‌ డిజిటల్‌ పవర్‌. ఫిన్‌టెక్‌ పవర్‌. స్టార్టప్‌ పవర్, స్పేస్‌ పవర్‌. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ. ఇది మోదీ ట్రాక్‌ రికార్డ్‌. కానీ కాంగ్రెస్‌ ట్రాక్‌ రికార్డ్‌ ఏంటి? లూటీ లూటీ లూటీ. దోచుకోవడమే కాంగ్రెస్‌ ట్రాక్‌ రికార్డ్‌. సంతుష్టికరణ రాజకీయాలు, ఉగ్రవాదులను కాపాడుకోవడమే కాంగ్రెస్‌ ట్రాక్‌ రికార్డ్‌. మొదటిసారి ఓట్లు వేసేవారు ఒక్కసారి గత పది, పదిహేనేళ్లలో ఏమి జరిగిందో తెలుసుకోవాలి. గతంలో దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పేలుళ్లు జరిగాయనే విషయం వారు తెలుసుకోవాలి.

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా ఎప్పుడూ ఇలాంటి న్యూసే వినిపించేది. కానీ ఇప్పుడు ఇలాంటి న్యూస్‌ ఏదైనా మీకు విని్పస్తోందా? ఈ బాంబు పేలుళ్లను మీ ఒక్క ఓటే ఆపింది. కేంద్రంలో మీరు బీజేపీకి అవకాశం ఇచ్చారు. అందువల్లే ఈ పేలుళ్లు ఆగాయి. కాంగ్రెస్‌కు ఓటు వేయడమంటే మళ్లీ పాత రోజులు వచి్చనట్లే..’ అని మోదీ అన్నారు. 

కాంగ్రెస్‌ది నరానరాన జాత్యహంకారమే.. 
‘గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు మధ్యతరగతి ప్రజలను అవమానించేలా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు మిడిల్‌ క్లాస్‌ ప్రజల ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు మధ్యతరగతి ప్రజల ఆదాయం, సంపత్తిపై కన్నేసింది. మీ సంపత్తి మీ సంతానానికి, వారసులకు దక్కకుండా లాక్కోవడం మీకు అంగీకారమేనా? కాంగ్రెస్‌ నరానరాన జాత్యహంకారం నిండి ఉంది. యువరాజు రాహుల్‌గాంధీ గురువు దేశవాసుల శరీరరంగు ఆధారంగా చైనా, ఆఫ్రికాకు చెందినవారని అవమానిస్తున్నారు. అయోధ్య రామమందిర నిర్మాణం జరగొద్దని, పూజలు జరగొద్దని చెప్పాడు. శ్రీరాముడికి పూజలు చేయడం దేశద్రోహమా? తప్పా? ’ అని మోదీ నిలదీశారు. 

కాంగ్రెస్‌ ఐడియా ఆఫ్‌ ఇండియాకే వ్యతిరేకం...
‘దేశాన్ని విదేశీ కళ్లద్దాల్లో చూసే కాంగ్రెస్‌కు ఐడియా ఆఫ్‌ ఇండియా అనేదానిపై కనీసం అంచనా కూడా వేయలేదు. వెయ్యేళ్ల సంస్కృతి, సత్యమేవ జయతే, అహింస పరమోధర్మ, బుద్ధం శరణం గచ్చామీ, గాడ్‌ ఈజ్‌ గ్రేట్‌.. ఇవన్నీ.. ఐడియా ఆఫ్‌ ఇండియా..నాకు జన్మనిచి్చన భూమి స్వర్గం కంటే ఎక్కువ.. ఇది ఐడియా ఆఫ్‌ ఇండియా. కానీ కాంగ్రెస్‌ పార్టీ ఐడియా ఆఫ్‌ ఇండియాకే వ్యతిరేకం.. ’ అని ప్రధాని విమర్శించారు. 

మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధికి గ్యారంటీ 
    ‘కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు దశాబ్దాలుగా తప్పుడు వాగ్దానాలు ఇస్తూ వచ్చాయి. ఇప్పుడు దేశం మోదీ గ్యారంటీని నమ్ముతోంది. మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధికి గ్యారంటీ. రాష్ట్ర, జాతీయ భద్రతకు గ్యారంటీ, ప్రపంచంలో భారత్‌  గౌరవం పెంపొందించే గ్యారంటీ, రానున్న ఐదేళ్లలో పేదలకు మూడు కోట్ల ఇళ్లు నిర్మించి ఇచ్చే గ్యారంటీ..70 ఏళుŠల్‌ పైబడిన వృద్ధులకు ఉచితంగా వైద్య చికిత్స అందించే గ్యారంటీ. మోదీ గ్యారంటీ అంటేనే పక్కాగా పూర్తి చేసే గ్యారంటీ.

తెలంగాణలో వేగవంతమైన అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. తెలంగాణ గ్లోబల్‌ స్థాయిలో నిలుస్తోంది. డిఫెన్స్‌ మొదలు బయో టెక్నాలజీ, ఏఐ, మేనేజ్‌మెంట్, సేవా రంగాల్లో రాబోయే ఐదేళ్లలో మరింత వేగవంతమైన అభివృద్ధిని సాధించబోతోంది. పదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి లక్షల కోట్లు అందజేశాం. ఈ డబ్బులు అవినీతి ఏటీఎంలోకి వెళ్లగా.. బీఆర్‌ఎస్‌ జేబులో నింపుకుంది. ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా అదే పనిచేస్తోంది. అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ.. బీఆర్‌ఎస్‌కు జిరాక్స్‌ కాపీలా మారింది..’ అని మోదీ ధ్వజమెత్తారు. 

బీఆర్‌ఎస్‌కు వేసే ప్రతి ఓటూ కాంగ్రెస్‌కే.. 
    ‘మీరు బీఆర్‌ఎస్‌కు వేసే ప్రతి ఓటూ కాంగ్రెస్‌కు మద్దతునిస్తుంది. కాంగ్రెస్‌కు వేసే ఓటుతో ఆ పార్టీ అధికారంలోకి రాదు. అందుకే కమలం పువ్వు గుర్తుపై భారీగా ఓట్లు వేసి గెలిపించాలి. నా తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో పెద్దెత్తున ఓటింగ్‌ శాతం పెంచుకోవడం ద్వారా పాత రికార్డులను బద్దలు కొట్టి బీజేపీని 17కు 17 సీట్లలో గెలిపించబోతోంది. ఎన్నికల్లో ప్రతి పోలింగ్‌ బూత్‌లో బీజేపీని గెలిపించండి..’ అని ప్రధాని విజ్ఞప్తి చేశారు. ప్రసంగానికి ముందు మోదీ అక్షయ తృతియ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.  

సభికుల మధ్యలోనే రాజాసింగ్‌ 
బహిరంగ సభ వేదికపై గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కనిపించలేదు. సభకు ఆయన ఇరవై నిమిషాలు ముందే వచ్చినప్పటికీ వేదికపై ప్రధాని మోదీతో పాటు కూర్చునే బీజేపీ నాయకుల జాబితాలో పేరు లేకపోవడంతో ఆయన స్టేజీ పైకి వెళ్లేందుకు ఎస్పీజీ బలగాలు అనుమతించలేదు. దీంతో సాధారణ కార్యకర్తలాగా సభికుల మధ్యనే కూర్చుండిపోయారు.

దివ్యాంగ బాలికను ముందుకు పిలిచిన మోదీ 
ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో ప్రజల మధ్య వీల్‌చైర్‌లో కూర్చున్న ఓ దివ్యాంగ బాలిక యాదగిరి అక్షిత సీతారాముల చిత్రపటాన్ని ప్రదర్శించింది. దీన్ని గమనించిన మోదీ ముందుకు తీసుకురమ్మని సూచించడంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని అక్షితను వీల్‌చైర్‌తో సహా ముందుకు తీసుకొచ్చి ప్రధాని ముందు ఉన్న గ్యాలరీలో కూర్చోబెట్టారు.  

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ నక్కో అంటున్నారు..
‘తెలంగాణ మూడ్‌ అంతా కాంగ్రెస్‌ నక్కో, బీఆర్‌ఎస్‌ నక్కో, ఎంఐఎం నక్కో.. బీజేపీ కో ఇచ్‌ ఓట్‌ దియెంగే.. జితాయేంగే (కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం వద్దు.. బీజేపీనే గెలిపిద్దాం)’ అన్నట్టుగా ఉంది. (ఈ వాక్యాన్ని హైదరాబాదీ ఉర్దూ యాసలో పలికారు) తెలంగాణ వ్యాప్తంగా నేను జరిపిన పర్యటనల్లో ఇదే స్పష్టమైన విప్లవం కనిపిస్తోంది. తెలంగాణలో వచ్చే  ఫలితాలు దేశవ్యాప్తంగా ఉత్సాహాన్ని తీసుకురాబోతున్నాయి.

జూన్‌ 4న వెలువడే ఫలితాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. 4న దేశం విజయం సాధిస్తుంది. 140 కోట్ల మంది ప్రజల సంకల్పం గెలుస్తుంది. భారత్‌ విరోధులు పరాజయం పాలవుతారు. ఆత్మనిర్భర్, సీఏఏ, యూసీసీ విరోధులు, ఆరి్టకల్‌ 370, ట్రిపుల్‌ తలాక్‌ను సమరి్థంచేవారు, అవినీతి, సంతుష్టికరణ రాజకీయాలు నమ్మేవారు ఓడిపోతారు..’ అని మోదీ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement