బీజేపీ రెండో జాబితాపై ఉత్కంఠ | Suspense Over The Second List Of Bjp Lok Sabha Candidates | Sakshi
Sakshi News home page

బీజేపీ రెండో జాబితాపై ఉత్కంఠ

Published Tue, Mar 12 2024 8:38 AM | Last Updated on Tue, Mar 12 2024 11:24 AM

Suspense Over The Second List Of Bjp Lok Sabha Candidates - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి లోక్‌సభ బరిలో నిలిచే అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఓ కొలిక్కి తెచ్చింది. రెండు రోజుల్లో సుమారు 100 నుంచి 150 మంది అభ్యర్థులతో ఈ జాబితాను విడుదల చేయనున్నట్టు ఆ పార్టీవర్గాలు తెలిపాయి. ఈ జాబితాలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యత కల్పించేలా బీజేపీ అధిష్టానం ప్రత్యేక కసరత్తు చేసిందని వెల్లడించాయి. తెలంగాణలో పెండింగ్‌ ఉన్న ఎనిమిది స్థానాలలో 7 అభ్యర్థులను ఖరారు చేసింది. 

గత నెల 29న తొలిసారి భేటీ అయిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ.. ప్రధాని మోదీ సహా మొత్తం 195 అభ్యర్థులతో తొలి జాబితాకు ఆమోదముద్ర వేసింది. మార్చి 2న తొలి జాబితాను అధికారికంగా విడుదల చేసింది. రెండో జాబితాపై సోమవారం రాత్రి 8 గంటలకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది.

ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బీఎల్‌ సంతోష్‌, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఇతర సభ్యులు ఈ సమావేశంలో పాల్గొని రెండో జాబితాపై చర్చించారు. తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులపై కసరత్తు పూర్తి చేశారు. 370 సీట్ల లక్ష్యాన్ని బీజేపీ పెట్టుకుంది. తమ అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం ద్వారా ప్రచారంలోకి దూసుకెళ్లాలని బీజేపీ ఎత్తుగడ వేస్తోంది.

తెలంగాణలో ఖరారైన అభ్యర్థులు వీరేనా?
మహబూబ్‌నగర్- డీకే అరుణ
మెదక్-రఘునందన్‌రావు
మహబూబాబాద్- సీతారాం నాయక్ 
ఖమ్మం-జలగం వెంకట్రావు 
నల్గొండ- శానం సైదిరెడ్డి
పెద్దపల్లి- గోమాస శ్రీనివాస్
వరంగల్- కృష్ణ ప్రసాద్

ఢిల్లీ చేరిన ‘ఆదిలాబాద్‌ సీటు పంచాయితీ’ 
మరోవైపు, ఆదిలాబాద్‌ బీజేపీ సీటు వ్యవహారం హస్తినకు చేరింది. తొలి జాబితాలో సిట్టింగ్‌ ఎంపీ సోయం బాపూరావ్‌ పేరును బీజేపీ అధిష్టానం పక్కనపెట్టడంతో మొదలైన పంచాయితీ.. ఆదివారం బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ నగేష్‌ కాషాయ కండువా కప్పుకోవడంతో తారస్థాయికి చేరింది. నగేష్‌ బీజేపీలో చేరినందున ఆదిలాబాద్‌ ఎంపీ స్థానాన్ని ఆయనకే ఇస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆదిలాబాద్‌కు చెందిన బీజేపీ నేతలు రమేష్‌ రాథోడ్, రాథోడ్‌ బాపూరావ్‌ సహా పలువురు సోమవారం ఢిల్లీకి చేరుకొని బీజేపీ పెద్దలను కలిసే ప్రయత్నం చేశారు. పారీ్టలో మొదటి నుంచి పనిచేసినవారికి కాకుండా ఇటీవల పారీ్టలో చేరిన వారికి ఆదిలాబాద్‌ ఎంపీ స్థానాన్ని కేటాయించొద్దని అధిష్టాన పెద్దలకు విజ్ఞప్తి చేశారు.  

చేరి 24 గంటలు కాకముందే సీటు ఎలా? రమేష్‌ రాథోడ్‌ 
రమేష్‌ రాథోడ్‌ మీడియాతో మాట్లాడుతూ, ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ విషయంలో  బీజేపీ కేంద్ర పెద్దలను కలిశామని చెప్పారు. నగేష్‌ పార్టీలో చేరి 24 గంటలు కూడా కాకుండానే... ఆదిలాబాద్‌ సీట్‌ తమదే అంటున్నారని మండిపడ్డారు. నగేష్‌కు ఇతర పార్టీల్లో అవకాశం దొరకక చివరికి బీజేపీలో చేరారని ఆరోపించారు. బీజేపీలో అభ్యర్థులకు కొరత ఏమాత్రంలేదన్నారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్న వారికి ఎలాంటి హామీలు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఆదివాసీల కంటే లంబాడీలే ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు. బీజేపీ పెద్దలతో తనకు ఎలాంటి విభేదాలు లేదని రమేష్‌ రాథోడ్‌ స్పష్టం చేశారు.  

ఇదీ చదవండి: నేను గేట్లు తెరిస్తే.. బీఆర్‌ఎస్‌ ఉండదు: సీఎం రేవంత్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement