
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ అసెంబ్లీలో మీడియాతో చిట్‌ఛాట్ సందర్భంగా.. సినిమాటోగ్రఫీ శాఖ, రోడ్లు భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ నటుడు, ఏపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Bala Krishna)ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆయన రోజుకొకరినీ కొడతారంట కదా అని వ్యాఖ్యానించారు.
బాలకృష్ణ రోజుకొకరిని కొడతారంట కదా. ఆయన సినిమాలు ఎవరు చూస్తారు? బాలయ్య కంటే రోజూ తనతోనే ఎక్కువమంది ఫొటోలు దిగుతారన్న కోమటిరెడ్డి.. అయినా ఆయన సినిమాలకు కలెక్షన్స్ వస్తాయట అంటూ మంత్రి కోమటిరెడ్డి చమత్కరించారు. మరోవైపు అసెంబ్లీలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ వ్యవహరిస్తున్న తీరుపైనా ఆయన పలు విమర్శలు చేశారు.
బీఆర్ఎస్ వాళ్లకు ధరణితో దోచుకుతినడం తప్పా ఏమి తెల్వదు. వాళ్లకు మాటలతోనే బతకడం అలవాటైంది. కేటీఆర్ తండ్రి చాటు కొడుకు. హరీష్ రావు మామ చాటు అల్లుడు. వాళ్లు కనీసం డిప్యూటీ లీడర్లు కూడా కారు. అలాంటప్పుడు మేం వాళ్లతో ఏం మాట్లాడతాం?. వేముల ప్రశాంత్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఆయన కేబినెట్‌లోనూ డమ్మీ మంత్రి ఉండే. ఆయనను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కనీసం గుర్తు కూడా పట్టరు అని కోమటిరెడ్డి అన్నారు. ఉప్పల్..నారపల్లి ఫ్లై ఓవర్ పనులపై ఇప్పటికే తాను కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడినట్లు తెలిపిన కోమటిరెడ్డి.. త్వరలో ఉస్మానియా ఆస్పత్రికి టెండర్లు కూడా పిలుస్తామని తెలిపారు.
యాగాల కామెంట్.. బీఆర్‌ఎస్ వాకౌట్
అంతకు ముందు.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభలో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో జాప్యం విషయమై మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు.. ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం యాగాలు చేయడానికి ఇచ్చిన ప్రాధాన్యం రహదారుల అభివృద్ధికి కేటాయించలేదన్నారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్‌ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోండి
కోమటిరెడ్డి వ్యవహారంపై శాసనసభా స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేయాలని హరీష్‌రావు నేతృత్వంలోని బృందం స్పీకర్‌ను కోరింది. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ఉండి అన్ని అబద్ధాలే చెబుతూ సభను తప్పు దోవ పట్టిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను బీఆర్‌ఎస్ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment