సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు వెళ్లింది. ఆయన ప్రవర్తన మీద జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. తనతో దురుసుగా ప్రవర్తించారని, కాబట్టి కౌశిక్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కోరారాయన.
కరీంనగర్ కలెక్టరేట్‌లో అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై ఆదివారం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల జారీ సన్నద్ధతపై నిర్వహించిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్(MLA Sanjay) మాట్లాడే సమయంలో.. ఆయన పక్కనే కూర్చున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి లేచి అభ్యంతరం తెలిపారు.
‘ఈయనకు మైకు ఇవ్వొద్దు.. నువ్వు ఏ పార్టీవయా..?’ అంటూ వేలెత్తి చూపిస్తూ మాటల దాడికి దిగారు. దీంతో డాక్టర్ సంజయ్ ‘నీకేం సంబంధం.. నాది కాంగ్రెస్ పార్టీ.. నువ్వు కూర్చో’ అన్నారు.
దీంతో.. తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో సంజయ్ చేతిని కౌశిక్‌రెడ్డి తోసేశారు. అనంతరం కౌశిక్‌రెడ్డి పరుష పదజాలం వాడటంతో గొడవ పెద్దదై పరస్పరం తోసుకునే స్థాయికి చేరింది. ఆ అనూహ్య పరిణామానికి వేదికపై ఉన్న మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు నిర్ఘాంతపోయారు. పక్కనే ఉన్న ప్రజాప్రతినిధులు వారించే యత్నం చేసినా కౌశిక్‌రెడ్డి వినలేదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆయనను బలవంతంగా సమావేశం నుంచి బయటకు తీసుకెళ్లారు. కౌశిక్ వెంట మిగతా బీఆర్‌ఎస్ ప్రతినిధులు వెళ్లిపోయారు.
నీటిపారుదల శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో ఈ ఘటన జరగడం గమనార్హం. ఏడుసార్లు గెలిచిన తాను రాజకీయంగా ఇలాంటి ప్రవర్తనను ఎన్నడూ చూడలేదంటూ తోటి శాసనసభ్యుడితో కౌశిక్‌రెడ్డి ప్రవర్తించిన తీరును ఉత్తమ్ తప్పుబట్టారు.
నాలుగు కేసులు నమోదు
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై (Padi kaushik Reddy) పలు సెక్షన్ల కింద మూడు కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్‌తో దురుసుగా ప్రవర్తించారని.. ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమావేశంలో గందరగోళం, పక్కదారి పట్టించారని ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథాలయ ఛైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై ఇంకో కేసును ఫైల్ చేశారు. వీటితో పాటు గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ కాంగ్రెస్ మరో ఫిర్యాదు చేసింది. ఈమేరకు వేర్వేరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై నాలుగు కేసులను పోలీసులు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment