అదృష్టవశాత్తూ ఎమ్మెల్యేలు 4 ఏళ్లు ఆగలేదు: సుప్రీం కోర్టు | Supreme Court Hearing On Telangana BRS MLAs Defection Case March 25th Updates, Check Top News Headlines In Telugu | Sakshi
Sakshi News home page

తెలంగాణ: ఫిరాయింపులపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు

Published Tue, Mar 25 2025 7:29 AM | Last Updated on Tue, Mar 25 2025 1:25 PM

Supreme Court Telangana BRS MLAs Defection Case March 25th Updates

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపై సుప్రీం కోర్టు(Supreme Court)లో  మంగళవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపులపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయారాం, గయారాంలను నిరోధించేందుకే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ఉందని, అలాంటప్పుడు ఫిరాయింపులపై  ఏ నిర్ణయం అనేది తీసుకోకపోతే ఆ షెడ్యూల్‌ను అపహాస్యం చేయడం కిందకే వస్తుందని స్పష్టం చేసింది.

కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించారని.. ఆ 10 మందిపై అనర్హత వేటు విషయంలో తెలంగాణ స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని, కాబట్టి అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్‌(BRS) తరఫున ఈ జనవరిలో వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, ఆగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం వాదనలు వింటోంది. 

మంగళవారం వాదనలు మొదలవ్వగానే.. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్‌ సంగతిని స్పీకర్‌ తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్‌ లాయర్‌ ముకుల్‌ రోహత్గీ వాదనలు ప్రస్తావించారు. ఈ వ్యవహారంలో స్పీకర్‌ను ఆదేశించే అధికారం న్యాయస్థానానికి ఉంటుందా? లేదంటే రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలా? అని కోరారు. 

బీఆర్‌ఎస్‌ తరఫున న్యాయవాది ఆర్యమా సుందరం వాదనలు వినిపిస్తూ.. ‘‘ఫిర్యాదులపై ఏం చేస్తారో.. 4 వారాల్లో షెడ్యూల్‌ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయినా పార్టీ మారిన వారికి స్పీకర్‌ నోటీసులు ఇవ్వలేదు. ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాతే నోటీసు ఇచ్చారు. 3 వారాల్లో రిప్లై ఇవ్వాలని.. ఫిబ్రవరి 13న స్పీకర్‌ నోటీసులు ఇచ్చారు. ఇప్పటికి 3 వారాలైంది.. నోటీసులు ఎటు వెళ్లాయో తెలియదు. మేము ఫిర్యాదు చేసి ఏడాదైనా స్పీకర్‌ షెడ్యూల్‌ కూడా చేయలేదు’’ అని సుందరం వాదించారు. 

బీఆర్‌ఎస్‌ వాదనలు.. కీ పాయింట్స్‌ 

  • 2024 మార్చి 18న మొదట ఫిరాయింపులపై శాసనసభ స్పీకర్‌ ఫిర్యాదు చేశాం
  • మొదటి ఫిర్యాదు చేసినా నోటీసులు ఇవ్వలేదు
  • హైకోర్టుకు వెళ్లేంత వరకు కూడా నోటీసులు ఇవ్వలేదు
  • రీజనబుల్‌ టైంలోనే చర్యలు తీసుకోవాలని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ చెప్పింది
  • హైకోర్టు చెప్పినా ఎలాంటి చర్యలు లేవు
  • దానం నాగేందర్‌పై ఫిర్యాదు చేసినా.. ఆయనకు నోటీసులు ఇవ్వలేదు
  • దానం ఎంపీగా పోటీ చేసినా చర్యల్లేవ్‌
  • కడియంకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నా.. చర్యలు లేవ్‌
  • అనర్హత పిటిషన్‌ విచారణపై షెడ్యూల్ చేయాలని.. హైకోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చింది‌
  • స్పీకర్‌ 7 రోజుల సమయం ఇస్తూ నోటీసులు ఇచ్చారు
  • ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకేరకంగా సమాధానం ఇచ్చారు
  • పార్టీ మారినవాళ్లు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేశారు
  • ముగ్గురు  ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు ప్రచారం చేశారు
  • నోటీసులు ఇచ్చామని స్పీకర్‌ అంటున్నారు.. కానీ, ఆ కాపీలు మాకు అందజేయలేదు
  • స్పీకర్‌ అధికారాలు సైతం న్యాయసమీక్ష పరిధిలోనే ఉంటాయి
  • న్యాయ సమీక్షకు స్పీకర్‌‌ అతీతులు కాదు
  • ఫిరాయింపులపై స్పీకర్‌ నిర్ణయంపై నిర్దిష్టమైన గడువు విధించాలి
  • నాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలి

ఈక్రమంలో స్పందించిన జస్టిస్‌ గవాయ్‌.. పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా? అని వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి వ్యవహారాల్లో గతంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులు ఉన్నప్పటికీ.. ఎప్పటిలోగా తేల్చాలనే విషయంపైనే స్పష్టత కొరవడిందని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ధర్మాసనం వ్యాఖ్యానించింది.  అలాంటప్పుడు ఆ తీర్పును కాదని ఎలా ముందుకు వెళ్లగలమని చెప్పింది. ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలా తిరిగి రాయగలమని ప్రశ్నించింది.

ధర్మాసనం ఇంకా ఏమందంటే..

  • ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికి ఇంకా ఎంత కాలం పడుతుంది?: ధర్మాసనం
  • ఆలస్యం చేసే ఎత్తుగడలు అనుసరించొద్దు
  • ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఫిర్యాదు వచ్చి ఎంతకాలమైంది?
  • రీజనబుల్‌ టైం అంటే గడువు ముగిసేవరకా?
  • మొదటి ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత టైం గడిచింది.
  • నాలుగు వారాలైనా షెడ్యూల్‌ ఫిక్స్‌ చేయలేదా?
  • అదృష్టవశాత్తూ.. ఎమ్మెల్యేలు 4 ఏళ్లు ఆగలేదు
  • మూడు వారాల సమయం విషయంలో మాత్రం స్పీకర్‌ రీజనబుల్‌గా ఉన్నారు
  • తెలంగాణ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ జడ్జి ఇచ్చిన తీర్పులో  డివిజన్‌ బెంచ్‌ జోక్యం సరైందో కాదో చూస్తాం?

కౌంటర్‌ దాఖలుకు ప్రతివాదులు మరింత సమయం కోరగా.. కాలయాపన చేసే విధానాలు మానుకోవాలి బెంచ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ బీఆర్‌ఎస్‌ తరఫున వాదనలు ముగియడంతో తదుపరి విచారణను ఏప్రిల్‌ 2వ తేదీకి వాయిదా వేసింది. ఆరోజు స్పీకర్‌ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు.

తెలంగాణ: ఫిరాయింపులపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు


 

మరోవైపు.. స్పీకర్‌ తరఫున సోమవారం(మార్చి 24వ తేదీన) అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన కౌంటర్‌లో.. ‘‘రీజనబుల్ టైం అంటే గరిష్టంగా  మూడు నెలలే అని అర్థం కాదు. ఒక్కో కేసు విచారణకు ఒక్కో రకమైన సమయం అవసరం. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాం. కానీ, స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే కోర్టుకు వెళ్లారు. స్పీకర్ ఈ అంశంపై నిర్ణయం తీసుకున్న తర్వాతే.. న్యాయపరమైన పరిష్కారం కోసం ప్రయత్నించాలి. అప్పటిదాకా న్యాయస్థానాల జోక్యం కుదరదు. 

.. అనర్హత పిటిషన్ లను విచారించి నిర్ణయం తీసుకునే అధికారం కేవలం స్పీకర్ కే ఉంది. గత సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఇదే అంశాన్ని చెబుతున్నాయి. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే....పిటీషనర్లే దురుద్దేశపూర్వకంగా కోర్టును ఆశ్రయించారు. ఫిరాయింపులపై స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడం లేదన్నది సరికాదని.. చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని.. కాబట్టి ఈ పిటిషన్లను డిస్మిస్‌ చేయాలి’’ అని కోరారు. 

👉కారు గుర్తుపై గెలిచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టేలా స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ పార్టీ(BRS Party) జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌లపై స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (SLP) దాఖలు అయ్యింది. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌ రెడ్డి, అరికెపూడి గాంధీలపై రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. వీటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపింది సుప్రీం కోర్టు(Supreme Court). కేటీఆర్‌, పాడి కౌశిక్‌రెడ్డి, ఇతర బీఆర్‌ఎస్‌ నేతలు ఈ పిటిషన్లు వేశారు. అయితే.. 

👉ఈ పిటిషన్లకు సంబంధించి.. కొద్దిరోజుల క్రితం మహిపాల్‌రెడ్డి, తాజాగా బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి సుప్రీం కోర్టులో అఫిడవిట్‌లు దాఖలు చేశారు. తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని, పార్టీ ఫిరాయింపు ఆరోపణల్లో వాస్తవం లేదని అందులో పేర్కొన్నారు. కేవలం ఎమ్మెల్యే హోదాలోనే సీఎంను కలిశామని తెలిపారు. అందువల్ల తమపై దాఖలైన కేసులను కొట్టివేయాలని అభ్యర్థించారు. బీఆర్ఎస్‌కు తాము రాజీనామా చేయ‌లేదని.. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ చేర‌లేదని.. మీడియాలో వ‌చ్చిన వార్త‌ల‌లో నిజం లేదని.. కాబట్టి ఈ అన‌ర్హ‌త పిటీష‌న్ల‌కు విచార‌ణ అర్హ‌త లేదని వాటిల్లో పేర్కొన్నారు. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  కేటీఆర్ తో ఉన్న ఫొటోలు, పోస్ట‌ర్ల‌ను, తమ ఫొటోలతో కూడిన పార్టీ ఫ్లెక్సీల ఫొటోలనూ అఫిడ‌విట్‌లో జ‌త చేశారు. 

ఇప్పటికే ఈ కేసు విచారణలో సర్వోన్నత న్యా‍యస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. గతంలో తెలంగాణ స్పీకర్​పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తగినంత సమయం అంటే ఎంతో చెప్పాలని కోరింది. గత విచారణలో.. ఆపరేషన్ సక్సెస్ , పేషంట్ డెడ్ అనే తీరు సరికాదన్న పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement