
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల(Telangana Defected MLAs) వ్యవహారంపై సుప్రీం కోర్టు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన తమ పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్‌ఎస్ పార్టీ వేర్వేరుగా రెండు పిటిషన్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా.. రీజనబుల్ టైం అంటే ఎంతో కచ్చితంగా చెప్పాలంటూ తెలంగాణ స్పీకర్‌ను కోరింది.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యల కోసం రీజనబుల్ టైం కోసం స్పీకర్ ఎదురు చూస్తున్నారని అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి మరోసారి సుప్రీం కోర్టుకు తెలిపారు. అయితే.. సుప్రీంకోర్టు గత తీర్పుల ప్రకారం రీజనబుల్ టైమ్ అంటే మూడు నెలలు మాత్రమేనని బీఆర్‌ఎస్ వాదించింది. ఈ నేపథ్యంలో ఆ రీజనబుల్ టైం ఎంతో చెప్పాలంటూ కోర్టు తెలంగాణ స్పీకర్‌ను ప్రశ్నిస్తూ.. విచారణ వాయిదా వేసింది. మార్చి 4వ తేదీన బీఆర్‌ఎస్ పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం మరోసారి విచారించనుంది.
ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు సహా 10 మంది విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయడం లేదంటూ.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పిటిషన్ వేశారు. అలాగే.. ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అమలు చేయడం లేదంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లను కలిపి ద్విసభ్య ధర్మాసనం విచారిస్తోంది.
ఆ పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా తెలంగాణ స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్‌ఎస్ సుప్రీం కోర్టును అభ్యర్థిస్తోంది. ఈ క్రమంలో గత వాదనల్లో.. తెలంగాణ స్పీకర్(Telangana Speaker) తీరుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తగిన సమయం.. సరైన సమయం.. అంటూ స్పీకర్ చెబుతూ కాలయాపన చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర తరహాలో ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసేదాకా ఆగుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ పిటిషన్లపై పూర్తి వాదనలు విన్నాకే ‘ఆ సరైన సమయం’పై తామే ఓ నిర్ణయం తీసుకుంటామని, అవసరమైతే స్పీకర్‌కు సూచనలు చేయడానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడనుందా అనే ఆసక్తి నెలకొంది.
నిబంధనల ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారని గత విచారణలో అసెంబ్లీ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు. అయితే సుప్రీం కోర్టు జోక్యం తర్వాతే స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యాయని బీఆర్‌ఎస్ అంటోంది.
Comments
Please login to add a commentAdd a comment