హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపుల ఎపిసోడ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఫిరాయింపుల ఫిర్యాదుపై.. లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని కోరారు. అయితే వివరణ ఇవ్వడానికి వాళ్లు గడువు కోరినట్లు సమాచారం.
తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ మీద గెలిచి.. పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్‌లోకి వెళ్లారు. అయితే ఈ ఫిరాయింపులపై బీఆర్‌ఎస్ పార్టీ న్యాయస్థానాలను ఆశ్రయించింది. కిందటి ఏడాది.. నాలుగు నెలల్లోగా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో సుప్రీం కోర్టులో బీఆర్‌ఎస్ అనర్హత పిటిషన్ వేసింది.
ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఇంకా ఎంత సమయం తీసుకుంటారని న్యాయస్థానం నిలదీసింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలకు కనీసం నోటీసులు జారీ చేయించాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఇవాళ అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు పంపించారు. మరోవైపు.. ఫిరాయింపుల అంశంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్లను కలిపి ఫిబ్రవరి 10వ తేదీన సుప్రీం కోర్టు విచారణ జరపనుంది.
ధృవీకరించిన ఎమ్మెల్యేలు
తమకు అసెంబ్లీ సెక్రెటరీ నుంచి నోటీసులు అందిన మాట వాస్తవమేనని పార్టీ మారిన ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, తెల్లం వెంకట్రావులు అన్నారు. ‘‘అసెంబ్లీ స్పీకర్ కార్యాలయ నుండి నోటీసులు ఇచ్చింది వాస్తవమే. న్యాయ నిపుణులను సంప్రదించి తగు నిర్ణయం చెప్పుతాం’’ అని మీడియాకు తెలిపారు.
స్పీకర్‌తో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు అందిన వేళ.. ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిశారు. భేటీలో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్ తదితరులు ఉన్నారు. అసెంబ్లీ సెక్రెటరీ నోటీసుల కారణంగా ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment