
ఉరివేసుకుని ఎల్‌ఐసీ ఏజెంట్ ఆత్మహత్య
సమృద్ధి జీవన్ కస్టమర్లకు అప్పులు చేసి చెల్లింపులు
సంగారెడ్డి జిల్లా: సమృద్ధి జీవన్ సంస్థలో ఏజెంట్‌గా చేసి, డిపాజిట్లు చేసిన వారికి తిరిగి చెల్లించేందుకు అప్పులు చేసి, వాటిని తీర్చలేక ఓ ఎల్‌ఐసీ ఏజెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్.ఐ కాశీనాథ్, మృతుడి భార్య తుల్జమ్మ వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని అల్గోల్ గ్రామానికి చెందిన వెంకన్న (48) గురువారం సాయంత్రం గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకన్న గతంలో సమృద్ధి యోజన సంస్థలో ఏజెంట్‌గా చేశాడు. ఈ క్రమంలో ప్రజల నుంచి పెద్దమొత్తంలో బాండ్లు (డిపాజిట్లు) కట్టించాడు.
సంస్థను అర్ధాంతరంగా ఎత్తివేయడంతో ప్రజల వద్ద నుంచి సేకరించిన డిపాజిట్ డబ్బులు చెల్లించేందుకు బయట అప్పులు చేశాడు. ఇందుకోసం భూమిని సైతం తాకట్టు పెట్టాడు. చేసిన అప్పుల బాధలు పెరిగిపోవడం, రుణంతీర్చే దారిలేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకన్న రాసిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, వెంకన్న పెద్ద కుమార్తె పరమేశ్వరికి వివాహం కాగా, రెండో కుమార్తె ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కుమారుడు ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
రూ.100 బాండ్ పేపర్‌పై సూసైడ్ నోట్
ఆత్మహత్యకు పాల్పడే ముందు వెంకన్న బాండ్ పేపర్‌పై సూసైడ్ నోట్ రాశాడు. ‘టి.వెంకన్న తండ్రి అంజన్న గ్రా: అల్గోల్ అను నేను. అప్పుల బాధ భరించలేకపోతున్నాను. సమృద్ధి జీవన్ ఫౌండేషన్‌లో ఏజెంట్‌గా చేశాను. కస్టమర్లకు మొత్తం డబ్బు నేనే చెల్లించాను. దానివల్ల అప్పులు ఎక్కువై.. ఇప్పుడు ఇతరులకు అప్పుకట్టలేక పోతున్నాను. అప్పుల బాధ భరించలేక నేను సూసైడ్ చేసుకుంటున్నాను. నన్ను క్షమించండి. అప్పు ఇచ్చినవారిని క్షమాపణలు కోరకుంటున్నాను. శివుని దయతో మీకందరికి లాభం జరుగుతుంది. ఓం నమఃశివాయ’ అని రాసిపెట్టిన సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.