
ప్రణాళికతో చదివా.. ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి
‘సాక్షి’తో గ్రూప్– 2 మూడో ర్యాంకర్ మనోహర్‌రావు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ‘తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత మారుమూల ప్రాంతమైన సిర్గాపూర్ మండలంలోని ఉజ్జంపాడ్ గ్రామం మాది. ప్రభుత్వ ఉద్యోగాల పట్ల మా ప్రాంతంలో అవగాహన అంతంతే. నీళ్లు, నిధులు, నియామకాల అంశంపై సాగిన తెలంగాణ (Telangana) ఉద్యమంతో మాకు ప్రభుత్వ ఉద్యోగాలపై కొంత అవగాహన వచ్చింది.. కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగాలు (Govt Jobs) సాధించొచ్చనే నమ్మకంతో ప్రిపరేషన్ మొదలుపెట్టి ఆరు ఉద్యోగాలు సాధించాను. పక్కా ప్రణాళికతో చదివితే ఉన్నత ఉద్యోగాలను సాధించొచ్చు’ అని అంటున్నారు ఇటీవల విడుదలైన గ్రూప్– 2 ఫలితాల్లో మూడో ర్యాంక్ (Third Rank) సాధించిన బీర్‌దార్ మనోహర్‌రావు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...
కుటుంబ నేపథ్యం.. విద్యాభ్యాసం
మాది వ్యవసాయ కుటుంబం. నాన్న పండరినాథ్ కీర్తనకారుడు. పండరిపూర్ విఠలేశ్వరుని కీర్తనలు, ప్రవచనాలు బోధిస్తారు. మా ఉజ్జంపహాడ్ గ్రామం కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉటుంది. నా భార్య మనీష గృహిణి. కూతురు మనస్విని 3వ తరగతి, కొడుకు మహేశ్వర్ ఒకటో తరగతి చదువుతున్నారు. కుటుంబమంతా ఆధ్యాత్మిక బాటలో నడుస్తున్నారు. నేను నిత్యం హనుమాన్‌చాలీసా చదువుతాను. ప్రస్తుతం మెదక్ జిల్లా కుల్చారం మండలం అంసాన్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాను. ఎకనామిక్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈడీ పూర్తి చేశాను.
ఒక దాని తర్వాత మరోటి
ఇప్పటివరకు నాకు గవర్నమెంట్ కొలువులు ఆరు వచ్చాయి. గురుకుల పాఠశాలలకు సంబంధించి పీజీటీలో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు టీజీటీలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు (State First Rank) వచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్‌లో రెండో ర్యాంకు, 2016 గ్రూప్–2లో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగంలో చేరా. కరోనా సమయంలో అనారోగ్య సమస్యలతో ఆ ఉద్యోగం మానేశా. తిరిగి స్కూల్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరా. జూనియర్ లెక్చరర్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు, తాజా గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్ర స్థాయి 3వ ర్యాంకు వచ్చింది. బుధవారం రవీంద్రభారతిలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా జూనియర్ లెక్చరర్ ఉద్యోగ నియమక పత్రం అందుకున్నా. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరాను.
డిప్యూటీ కలెక్టర్ కావాలని ఉంది
రాష్ట్ర ప్రభుత్వ నియామకాల్లో అత్యున్నతమైనది గ్రూప్–1. డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం సాధించడమే నా ముందున్న లక్ష్యం. గ్రూప్–1 పరీక్షలు కూడా రాశాను. 430 మార్కులు వచ్చాయి. త్వరలోనే ఈ ఫలితాలు వెలువడితే గ్రూప్–1 ఉద్యోగం కూడా వచ్చే అవకాశాలున్నాయి.
చదవండి: గ్రూప్– 2 టాపర్ హరవర్ధన్‌రెడ్డి
సిలబస్‌లో లేని అంశాలు చదివితే ఫలితముండదు
నోటిఫికేషన్ వచ్చాకే ప్రిపేర్ అవుతానంటే కష్టం. సంబంధిత సబ్జెక్టు మరిచిపోకుండా కనీసం రెండు గంటలైనా చదవాలి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ముఖ్యంగా నాలుగు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. సిలబస్‌పై పూర్తి అవగాహన ఉండాలి. సిలబస్‌లో లేని అంశాలు చదివితే ఫలితం ఉండదు. పాత ప్రశ్నపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రశ్నలు ఎలా వస్తున్నాయనే దానిపై అవగాహన పెంపొందించుకోవాలి. సమయం వృథా చేసుకోవద్దు. ముఖ్యంగా సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే అంత సమయం కలిసొస్తుంది. కనీసం 8 గంటలు చదవాలి.
Comments
Please login to add a commentAdd a comment