Sangareddy district
-
సంగారెడ్డిలో దారుణం.. కూతురితో చనువుగా ఉంటున్నాడని..
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. తన కూతురితో చనువుగా ఉంటున్నాడని యువకుడిని తండ్రి హత్య చేశాడు. మెగ్యానాయక్ తండాలో 9 తరగతి చదువుతున్న తన కూతురితో చనువుగా ఉండటంతో దశరథ్(26)పై తండ్రి కక్ష పెంచుకున్నాడు. యువకుడిని హత్య చేసి నిజాంపేట మండల శివారు అటవీప్రాంతంలో మృతదేహాన్ని తగలబెట్టినట్టు సమాచారం.అనంతరం నిందితుడు గోపాల్ నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మృతదేహం కోసం దశరథ్ కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు. దశరథ్ నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు. తన భర్త కనిపించడం లేదంటూ దశరథ్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
హైదరాబాద్ మహానగరంలోని చెత్త ఇక్కడికే..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్ (Pyaranagar)లో ఏర్పాటు చేస్తున్న వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టుపై స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నగరంలో ప్రతీరోజు సుమారు 7,500 టన్నుల చెత్త ఉత్పత్తి కాగా ఇందులో శేరిలింగంపల్లి, కూకట్పల్లి (Kukatpally) జోన్ల పరిధిలో నిత్యం ఉత్పత్తి అయ్యే సుమారు 1,900 టన్నుల చెత్తను ప్యారానగర్ డంప్‌యార్డుకు తరలించనున్నారు. ఈ భారీ డంప్‌యార్డుతో తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానికులు పోరాటం చేస్తున్నారు.గుమ్మడిదల (Gummadidala) మండలం ప్యారానగర్, నల్లవల్లి, మాంబాపూర్ తదితర గ్రామాలతోపాటు, మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే శివంపేట, నావపేట గ్రామస్తులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అఖిలపక్షంగా ఏర్పడి ఈ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ యార్డు నిర్మాణానికి అవసరమైన మెటీరియల్‌ను తరలించడంతో స్థానికులు ఒక్కసారిగా నిరసనకు దిగారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారీ ఎత్తున మోహరించిన పోలీసులు నిరసన వ్యక్తం చేస్తున్న వారిని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు.పచ్చని పంట పొలాల్లో ఈ డంప్‌యార్డు (Dump Yard) ఏర్పాటు చేస్తున్న ప్యారానగర్ చుట్టుపక్కల మొత్తం పచ్చని పంట పొలాలే ఉన్నాయి. వ్యవసాయమే జీవనాధారమైన మా పంట పొలాల్లో చెత్త డంప్‌యార్డు పెట్టొదంటూ రైతులు వాపోతున్నారు. ఈ యార్డుతో వెలువడే కాలుష్యంతో చెరువులు, కుంటలే కాదు, భూగర్భ జలాలు కూడా కలుషితమై పంటలు పండించుకునే పరిస్థితి లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణం ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.చదవండి: ‘టక్కరి దొంగ’.. ఎవరికీ అర్థం కాకుండా కొట్టేశాడునాయకుల ముందస్తు అరెస్ట్ డంపింగ్‌యార్డ్ నిర్మాణ పనులను అడ్డుకోకుండా కొంతమంది నాయకులను పోలీసులు అర్ధరాత్రి ముందస్తు అరెస్టు చేసి కంది మండలంలోని బేగంపేట్ పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు. ఇక అదేసమయంలో జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు డంపింగ్‌యార్డ్ నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నించారు. డంపింగ్‌యార్డ్ పనులతోపాటు అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తూ అఖిలపక్ష నాయకులు, గ్రామస్తులతో కలసి ఆందోళనకు దిగారు. పోలీసులు ఆందోళనకారులందర్నీ అరెస్టు చేశారు. ప్యారానగర్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. -
సాఫ్ట్వేర్ దంపతుల ఆత్మహత్య
పటాన్చెరు టౌన్: కుటుంబ కలహాలతో సాఫ్ట్వేర్ దంపతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సంగారెడ్డి జిల్లా మియాపూర్‌కు చెందిన సందీప్ (36)కు ఆరేళ్ల కిందట మంచిర్యాలకు చెందిన కీర్తి (34)తో వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ మియాపూర్‌లో ఉండేవారు. 9 నెలల కిందట అమీన్పూర్ పరిధిలోని బంధంకొమ్ము శ్రీదామ్ హిల్స్‌లో సొంతిల్లు కొనుగోలు చేసి కూతురు గగనహిత(3), కుమారుడు సాకేత్‌రామ్ (ఏడాదిన్నర)తో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ చిన్న చిన్న గొడవలు జరుగుతుండేవి. సోమవారం పాప గగనహిత పుట్టినరోజు ఉంది.వేడుక జరిపే విషయంలో 5వ తేదీ (ఆదివారం) ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సందీప్ ఇద్దరు పిల్లల్ని తీసుకొని తల్లిగారింటికి మియాపూర్ వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న కీర్తి తాడుతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సాయంత్రం ఒక్కడే ఇంటికొచ్చిన సందీప్‌కు కీర్తి ఉరేసుకొని కనిపించింది. వెంటనే అతడి తండ్రికి ఫోన్లో కీర్తి ఉరేసుకుందని విషయం చెప్పాడు. సందీప్ తల్లిదండ్రులు అక్కడికి వచ్చేలోపు అతడు కూడా తాడుతో ఉరేసుకున్నాడు. కీర్తి తండ్రి ప్రభాకర్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమీన్పూర్ సీఐ నాగరాజుతోపాటు ఎస్ఐ సోమేశ్వరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
సు‘జలం’.. సు‘ఫలం’!
ఒక ఆలోచన, సమష్టి కృషి ఆ గ్రామ రూపురేఖలను మార్చేసింది. తాగునీటి కోసం తండ్లాట, బీడువారిన పొలాలు, కరువు కాటకాలు, వలసలతో సతమతమైన ప్రాంతం.. ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చని పంటలతో కళకళలాడుతోంది. భూగర్భ జల మట్టాలు పెరగడంతో రైతులు ఏటా మూడు పంటలు పండిస్తున్నారు. నాడు కూలి పనులకు వలస వెళ్లినవారే.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల కూలీలకు పనులు కల్పిస్తున్నారు. ఇక్కడ అవలంబించిన నీటి సంరక్షణ పద్ధతులను రాజస్తాన్ రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నారంటే.. ఈ పథకం ఎంత విజయవంతం అయిందో అర్థమవుతుంది. ఇలా కరువును జయించిన సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని గొట్టిగారిపల్లి (Gotigarpally) గ్రామంపై గ్రౌండ్ రిపోర్టు ఇది.సంగారెడ్డి జోన్: సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో రైతులు వర్షాధారంగానే పంటలు పండించేవారు. వానలు సరిగా కురవకపోయినా, క్రమం తప్పినా పంటలు దెబ్బతిని నష్టపోయేవారు. నీళ్లులేక, పంటలు వేయలేక కూలి పనులకు వెళ్లేవారు. అయితే 2001లో చేపట్టిన నీటి సంరక్షణ చర్యలు గ్రామ గతిని మార్చేశాయి. వాటర్ షెడ్ పథకం (watershed scheme) ఆరో దశ కింద గొట్టిగారిపల్లికి రూ.22 లక్షలను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. నీటి వనరుల నిపుణుడు టి.హనుమంతరావు తక్కువ వ్యయంతో చతుర్విద జల ప్రక్రియ పద్ధతిపై గ్రామస్తులకు అనేక సార్లు అవగాహన కల్పించారు. చైనాలోని హుబై రాష్ట్రంలో ఆ విధానంతో మంచి ఫలితాలు వచ్చాయని రైతులకు వివరించారు. వాన నీళ్లు వృథా పోకుండా ఎక్కడికక్కడ ఇంకిపోయేలా చర్యలు చేపట్టారు. సమీపంలోని గుట్టలపై నుంచి దిగువకు వచ్చే నీటిని పొలాల వైపు వచ్చేలా మట్టి కట్టలు నిర్మించారు. కందకాలు తవ్వారు, నీటి చెక్‌డ్యాంలు కట్టారు. ఆ నీరు చెక్ వాల్వ్‌లోకి వెళ్లే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో కురిసిన వాన నీరు (Rain Water) ఊరు దాటడం లేదంటే ఎంత పకడ్బందీగా నీటి సంరక్షణ చర్యలు చేపట్టారో అర్థమవుతుంది. తక్కువ లోతులోనే భూగర్భ జలాలు గతంలో ఇక్కడ 500 ఫీట్ల దాకా బోరు వేసినా చుక్క నీటి జాడ కనిపించకపోయేది. ఇప్పుడు 60 నుంచి 120 అడుగుల లోతులోనే సమృద్ధిగా నీరు లభిస్తోంది. గ్రామంలో 350కిపైగా బోరుబావులు, 50 వరకు బావులు ఉన్నాయి. వాటితో గ్రామంలోని సుమారు 1,600 ఎకరాల భూమిని సాగు చేస్తున్నారు. పొలం గట్లు, పంటల చుట్టూ వేసిన ఫెన్సింగ్‌పై సైతం తీగ జాతికి చెందిన పంటలు సాగు చేస్తున్నారు. ఒక ఎకరా విస్తీర్ణంలో చుట్టూ ఫెన్సింగ్ వేసి కంది, పసుపు, ఆవాలు, కర్బూజా, మిరప, ఉల్లి, బెండకాయ, పలు ఇతర రకాల పంటలను సాగు చేస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో మడులుగా ఏర్పాటు చేసి వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలను సాగు చేస్తున్నారు. చెరుకు, మొక్కజొన్న, ఆలుగడ్డ తదితర పంటలు కూడా సాగు చేస్తున్నారు. ఏటా మూడు పంటలు వేసి మంచి ఆదాయం పొందుతున్నారు. జాతీయ స్థాయి అవార్డువాటర్ షెడ్‌తో పాటు 2010– 11లో ఇందిరా జలప్రభ పథకంలో భాగంగా వ్యవసాయ బో ర్లు తవ్వించి, విద్యుత్ కనెక్షన్ సౌకర్యం కల్పించారు. రూరల్ డె వలప్మెంట్లో భాగంగా అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో చేపట్టడంతో.. 2010 అక్టోబర్ 2న నిర్వహించిన ఉపాధి హామీ ఉత్సవాల్లో గ్రామానికి జాతీయస్థాయిలో అవార్డు దక్కింది. పంటలు సమృద్ధిగా పండుతుండటంతో జీవన ప్రమాణాలు మారాయి. తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తున్నారు.ఎంబీఏ చదివి వ్యవసాయం చేస్తున్నా.. నేను ఎంబీఏ చదివిన. మూడెకరాల్లో వ్యవసాయం చేస్తున్నాను. చెరుకుతోపాటు అన్నిరకాల కూరగాయలు సాగు చేస్తున్నా. వాటర్ షెడ్ పథకంతో పుష్కలంగా నీరు ఉండటంతో ఏడాదికి మూడు పంటలు పండిస్తూ.. ఎకరాకు రూ.లక్షన్నర వరకు సంపాదిస్తున్నా. – కనకరాజు, యువ రైతు, గొట్టిగారిపల్లివలసలు ఆగిపోయాయి.. గతంలో గ్రామంలో పనులు లేకపోవటంతో ఉపాధి కోసం దుండిగల్, గోమారాం, మద్దికుంట తదితర ప్రాంతాలకు వలసలు వెళ్లేవాళ్లం. వాటర్ షెడ్ పథకం చేపట్టిన సమయంలో చేసిన పనులకు కూలీ ఇచ్చారు. ప్రస్తుతం పరిస్థితులు మారి పంటలను సాగు చేసుకుంటున్నాం. వలసలు ఆగిపోయాయి. – బాలప్ప, రైతు, గొట్టిగారిపల్లిరైతులకు అవగాహన కల్పించి పనులు చేపట్టాం వాటర్ షెడ్ పథకం ప్రారంభంలో రైతులు అంతగా ఆసక్తి చూపలేదు. అప్పటి నీటి వనరుల నిపుణుడు హనుమంతరావు గ్రామానికి వచ్చి ఆ పనులు చేయటంతో కలిగే ప్రయోజనాలపై సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. అందరి కృషితో పథకాన్ని పూర్తి చేశాం. రెండేళ్ల తర్వాతి నుంచి మంచి ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం నీటి సమస్య అనేది లేకుండా అన్ని సమయాల్లో అన్ని రకాల పంటలు సాగు చేయగలుగుతున్నాం. – రాచయ్య, మాజీ సర్పంచ్, గొట్టిగారిపల్లి -
కోహీర్ గజగజ
యెర్భల్ శ్రీనివాస్‌రెడ్డి / జహీరాబాద్: అక్కడ ఉదయం తొమ్మిది అయినా ఎక్కడా జనం కనిపించరు.. సాయంత్రం ఆరు దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యం.. ఉదయం, రాత్రే కాదు.. మధ్యాహ్నం పూట కూడా స్వెట్టర్లు వేసుకోనిదే బయటికి వెళ్లలేని పరిస్థితి. ఇది ఎక్కడో మంచు ప్రాంతాల్లోనో, పర్వతాలున్న చోటనో కాదు.. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండల కేంద్రంలో పరిస్థితి ఇది. ఏటా చలికాలం వచ్చిందంటే ఇక్కడి జనం గజగజ వణికిపోతుంటారు.ఆ ప్రాంతంలోని నేలలు.. చుట్టూరా పచ్చదనం.. చెరువులు, ఇతర జల వనరులు గణనీయంగా ఉండటం వంటివి ఈ పరిస్థితికి కారణమని నిపుణులు చెబుతున్నారు. కోహీర్ గ్రామ శివార్లలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీజీడీపీఎస్) ఆధ్వర్యంలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌ను ఏర్పాటు చేసి.. వాతావరణ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు.నల్లరేగడి నేలలు, పెద్ద సంఖ్యలో చెట్లతో..కోహీర్ గ్రామ పరిధిలో 7 వేల ఎకరాల మేర వ్యవసాయ భూములు ఉన్నాయి. అందులో 5 వేల ఎకరాల మేర నల్ల రేగడి భూములు, 500 ఎకరాలు పడావ్పడ్డ భూములున్నాయి. ఈ నేలల్లో నీటి నిల్వ మిగతా వాటితో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. ఇక గ్రామం చుట్టూరా పెద్ద సంఖ్యలో చెట్లు ఉన్నాయి. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోటిగార్పల్లిలో 1,500 ఎకరాల్లో, బడంపేట, పర్శపల్లిలో వెయ్యి ఎకరాల చొప్పున అడవులు ఉన్నాయి. గోటిగార్పల్లికి సరిహద్దుగా ఉన్న కర్ణాటకలోని కుంచవరం, బోనస్పూర్, శివరాంపూర్ ప్రాంతాల్లో సుమారు 5 వేల ఎకరాలకుపైగా అడవి ఉంది.చుట్టూ నీటి వనరులే..కోహీర్కు ఎగువన ఐదు కిలోమీటర్ల దూరంలోని బడంపేటలో రెండు చెరువులు, పక్కనే ఉన్న గొటిగార్‌పల్లిలో 1,100 ఎకరాలకు నీరందించే పెద్దవాగు ప్రాజెక్టు ఉంది. 6 కిలోమీటర్ల దూరంలోని పర్శపల్లిలో తైదల, రాముని చెరువులు ఉన్నాయి. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పైడిగుమ్మల్లో మైసమ్మ చెరువు, నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సజ్జాపూర్‌లో చిన్న చెరువు ఉంది. కోహీర్‌లో భూగర్భ జలమట్టం 10 అడుగులలోపే. పలుచోట్ల బావుల్లో నీళ్లు బిందెలతో ముంచుకునేంత పైవరకు ఉంటాయి. కొన్ని బోర్లలో నుంచి నీళ్లు పైకి ఉబికి వస్తుంటాయి. దీనికితోడు కోహీర్ ప్రాంతం సముద్ర మట్టానికి 629 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ అంశాలన్నీ కలసి ఇక్కడ అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. రెండేళ్ల కింద 6.2 డిగ్రీలకు.. కోహీర్ ప్రాంతంలో 2022 సంవత్సరంలో 6.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత ఏడాది 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈసారి చలికాలం ప్రారంభంలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు 9 డిగ్రీల వరకు తగ్గాయి. ఈ నెల 19న 9.5 డిగ్రీలు, 20న 9.0 డిగ్రీలు, 21న 12 డిగ్రీలు, 22న 10.9 డిగ్రీలు, 23న 10.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక డిసెంబర్, జనవరిలలో ఉష్ణోగ్రతలు ఇంకెంత తగ్గుతాయోనని స్థానికులు పేర్కొంటున్నారు.ఐదింటికే ఇంటి ముఖం చలి తీవ్రత అధికంగా ఉండటంతో కోహీర్‌లో రైతులు, వ్యవసాయ కూలీలు, ఇతర పనులకు వెళ్లేవారు సాయంత్రం ఐదు గంటలకే ఇళ్లకు తిరిగి వస్తున్నారు. సాయంత్రం ఆరు గంటలకే ప్రధాన కూడళ్లు, రోడ్లు జన సంచారం లేక వెలవెలబోతున్నాయి. ఉదయం 8, 9 గంటల వరకు ఎవరూ బయటికి రావడం లేదు.గ్రీనరీ, జల వనరులు కారణంకొన్నిరోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. పొగ మంచు కురుస్తోంది. కోహీర్‌లో నేల స్వభావం, చెట్లు అధికంగా ఉండటం, చుట్టుపక్కల అడవులు ఉండటం, జల వనరులు ఉండటం వంటివి అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి కారణం. నీటి పారుదల ప్రాజెక్టులు, పెద్ద చెరువులు వంటివి ఉన్నచోట చలి తీవ్రత పెరుగుతుంది. – వెంకటరమణ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీజీడీపీఎస్, హైదరాబాద్ -
అమ్మానాన్నల మాట.. సివిల్స్‌కు బాట
చదువుకోవాలి.. చదువుకొని తన కాళ్లపై తాను నిలబడి, ఆదర్శంగా ఉండాలని చెప్పిన అమ్మ మాట.. సమాజంలో ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజాసేవలో ఉండాలని చూపిన నాన్న బాట.. ఇలా తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఆలోచనలో పడేశాయి. అప్పుడే తాను ఒక ఉన్నతాధికారిగా ప్రజాసేవ చేయాలని సంకల్పంతో 24 ఏళ్లకే ఐఏఎస్ సాధించారు. దేశంలోనే యువ ఐఏఎస్‌లలో ఒకరిగా నిలిచి పాలనలో పరుగులు పెట్టిస్తున్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సక్సెస్ స్టోరీ మీకోసం..బాల్యం.. విద్యాభ్యాసంవల్లూరు క్రాంతి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌ని కర్నూలు పట్టణం. తండ్రి డా.రంగారెడ్డి, తల్లి డాక్టర్ లక్ష్మి. ఇద్దరూ కూడా వైద్యులే. అక్క కూడా వైద్యురాలే, అమెరికాలో స్థిరపడ్డారు. ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు కర్నూల్లోనే చదువుకున్నారు. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుకున్నారు. బీటెక్ ఢిల్లీ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) లో మెకానికల్ ఇంజనీర్ పూర్తి చేశారు.మూడో ప్రయత్నంలోనే..అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఓ వైపు వచ్చిన జాబ్‌ను వదలకుండా ఉద్యోగం చేసుకుంటూ సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. తొలిసారిగా 2013లో సివిల్స్‌కు హాజరై 562 ర్యాంకు రావటంతో (ఐఆర్టీఎస్) ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌లో ఉద్యోగం వచ్చింది. అయినా నిరాశ చెందకుండా రెండోసారి 2014లో సివిల్స్ పరీక్ష రాసి 230 ర్యాంకు సాధించి, ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌లో ఉద్యోగం సాధించారు. ఐఏఎస్ కావాలని పట్టుదల, నాన్న సూచన సలహా మేరకు 2015లో జరిగిన సివిల్స్‌లో 65 ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపిక అయ్యారు. 24 సంవత్సరాలకే ఐఏఎస్ సాధించి యువ ఐఏఎస్‌గా నిలిచారు. ముస్సోరిలో ఐఏఎస్ శిక్షణ పూర్తి చేసి, 2016 బ్యాచ్ తెలంగాణ క్యాడర్‌కు ఎంపిక అయ్యారు.శిక్షణలో క్షేత్రస్థాయి సమస్యలుముస్సోరిలో ఐఏఎస్ శిక్షణ తీసుకోవడం జరిగింది. శిక్షణలో భాగంగా వారం రోజుల పాటు ఓ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ప్రజాసేవలో ఎలా ముందుకు సాగాలో నేర్పించారు. అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు తెలుసుకున్నాను. ట్రెక్కింగ్ నేర్పించారు.కొత్త ఆశల ఉగాది అంటే ఇష్టంపండుగలలో కొత్త ఆశ ఆశయాలతో ప్రారంభమయ్యే ఉగాది పండుగ అంటే నాకెంతో ఇష్టం. చదువుతోపాటు ఆటలు కూడా ఆడేవాళ్లం.ప్రతీ విజయం వెనుక ఎంతో కష్టంప్రతి ఒక్కరూ తమ జీవితంలో ముందుగానే ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి. ఎంత కష్టం వచ్చినా నిరాశ చెందకుండా లక్ష్యం వైపు ముందుకు సాగాలి. లక్ష్యం సాధించే వరకు అదే పనిగా ఉంటూ ఆత్మస్థైర్యం, నమ్మకంతో ఉండాలి. ప్రణాళికబద్ధంగా సిలబస్ ప్రిపేర్ అవుతూ పరీక్షలకు సన్నద్ధం కావాలి. విజయం అనేది ఊరికే రాదు. ప్రతీ విజయం వెనుక ఎంతో కష్టం ఉంటుందనేది గుర్తు పెట్టుకోవాలి. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కాకుండా సరైన ప్రణాళికతో ముందుకెళ్లాలి.అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే..ఇంట్లో అందరూ సైన్స్ పై ఎక్కువగా ఇష్టం.. తనకు మాత్రం మ్యాథ్స్‌పై ఇష్టం ఎక్కువ. తనకు చిన్నప్పటి నుంచే లీడర్ షిప్ లక్షణాలపై ఇష్టం. ప్రజలకు సేవ చేయాలనే తపన ఉండేది. ఒక ఉన్నత స్థానంలో ఉంటేనే ప్రజాసేవ చేయగలుగుతామనే ఆలోచన, చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న చెప్పిన మాట లు మ్యాథ్స్ ఉన్న ఇంట్రెస్ట్‌తోనే ఐఏఎస్ సాధించేలా చేశాయి. ప్రైవేటుగా ఉండి ఎంత సంపాదించినా సరైన విధంగా ప్రజాసేవ సాధ్యం కాదు. అందుకే ఉన్నతమైన ఐఏఎస్‌ను సాధించడం జరిగింది. నిర్మల్ జిల్లాలో ట్రైనీగా, మహబూబ్ నగర్ జిల్లా ప్రత్యేక అధికారిగా, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్, జోగులాంబ కలెక్టర్‌గా నిర్వహించి ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా కొనసాగుతున్నారు.భార్యాభర్తలిద్దరూ కలెక్టర్లువల్లూరి క్రాంతి సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్నారు. భర్త ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా కొనసాగుతున్నారు. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. వీరికి పాప(ఆర్యన్) ఉంది. -
తైవాన్ పింక్.. వియత్నాం వైట్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: డ్రాగన్ ఫ్రూట్ అంటే సాధారణంగా గుర్తొచ్చేది.. పింక్, వైట్ రకాలు. కానీ ఏకంగా 32 రకాల డ్రాగన్‌ఫ్రూట్ వెరైటీలతో సంగారెడ్డిలో మేళా నిర్వహించారు. తైవాన్ పింక్.. వియత్నాం వైట్.. ఆస్ట్రేలియన్ ఐఎస్ఐఎస్.. అపోలో ఇజ్రాయెలీ.. వివిధ దేశాల్లో సాగయ్యే వెరైటీలతో పాటు, ఆసుంట.. బ్లడ్మేరీ.. బేబీ సెరడో.. వంటి చిన్న రకాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. పెద్ద సైజులో ఉండే జంబోరెడ్, కాన్డార్, ఓరిజోన వంటి ప్రత్యేక రకాలు.. మెక్సికో, సెంట్రల్ అమెరికా వంటి దేశాల్లో సాగయ్యే సాన్ వంటి వెరైటీని సైతం ఈ మేళాలో ప్రదర్శించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డిలోని ఫల పరిశోధన స్థానంలో డ్రాగన్పూట్ మేళా జరిగింది. ఈ పంట పట్ల రైతుల్లో అవగాహన కలి్పంచేందుకు ఈ మేళా నిర్వహించినట్లు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా రంజోల్ గ్రామానికి చెందిన యువ రైతు రమేశ్‌రెడ్డి వ్యవసాయక్షేత్రం, సంగారెడ్డి ఫల పరిశోధన స్థానంలో సాగవుతున్న ఈ రకాలతో ఈ ప్రదర్శన నిర్వహించారు. పోషక విలువలు పుష్కలం.. డ్రాగన్‌ఫ్రూట్‌తో కూడిన ప్రత్యేక ఉత్పత్తులను సైతం ఈ ప్రదర్శనలో ఉంచారు. డ్రాగన్‌ఫ్రూట్‌తో చేసిన చిప్స్, వడియాలు, కుక్కీస్ (బిస్కెట్లు), చాక్లెట్లు, డ్రైపౌడర్ వంటివాటితో పాటు, ఈ ఫ్రూట్‌తో చేసిన సబ్బులు, ఫేస్‌ప్యాక్ వంటి సౌందర్య సాధనాలు ప్రదర్శనలో సందడి చేశాయి. ఈ ఉత్పత్తులు ఆశ్చర్యానికి గురి చేశాయి. ఎడారి మొక్కగా పేరున్న డ్రాగన్ఫ్రూట్లో పోషక విలువలు మెండుగా ఉంటాయి. పీచుపదార్థాలతో కూడిన బలవర్థకమైన ఫలం కావడంతో దీన్ని నిత్యం తీసుకుంటే కేన్సర్ వంటి రోగాల బారిన పడకుండా ఉండవచ్చు. సమశీతోష్ణ వాతావరణానికి తట్టుకునే ఈ పంటను చౌడు నేలల్లోనూ సాగుచేసేందుకు వీలుంది. ఈ పంట ఈదురు గాలుల వంటి ప్రకృతి వైపరీత్యాలను సైతం తట్టుకుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అన్ని నేలలూ అనుకూలమే..ఈ పంట సాగుకు అన్ని నేలలూ అనుకూలమే. కొంత జాగ్రత్తలు తీసుకుని పంట సాగు చేస్తే మంచి లాభాలను ఆర్జించవచ్చు. కమర్షియల్ వెరైటీలతో పాటు మరో 30 వరకు వెరైటీలను పండిస్తున్నా ను. ఇతర రైతులు కూడా ఈ పంట సాగు చేస్తే బాగుంటుంది. ప్రస్తుతం వియత్నాం నుంచి ఈ పండ్లు దిగుమతి అవుతున్నాయి. –రమేశ్‌రెడ్డి, డ్రాగన్‌ఫ్రూట్ రైతు, రంజోల్, సంగారెడ్డి జిల్లాఉద్యానవన రైతులకు ప్రోత్సాహంఉద్యానవన పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం అన్ని ప్రోత్సాహకాలు ఇస్తోంది. మా యూనివర్సిటీ ద్వారా రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నాము. డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తీర్ణం రాష్ట్రంలో పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాము. –బి.నీరజ, వీసీ, ఉద్యానవన విశ్వవిద్యాలయం. -
చిన్నారిపై హత్యాచారం కేసులో దోషికి మరణశిక్ష..
సంగారెడ్డి జోన్: ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో సంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచి్చంది. బాలికపై అత్యాచారం, హత్య చేసిన కేసులో దోషికి కోర్టు మరణ శిక్ష విధించినట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. ఆయన గురువారం ఎస్పీ కార్యాలయంలో మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. బిహార్‌లోని సికిందర్ ప్రాంతానికి చెందిన గఫాఫర్ అలీఖాన్ (61) బీడీఎల్ పరిధిలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గత అక్టోబర్ 16న ఆదిత్రి కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే భార్యాభర్తలు తమ మనవరాలిని సెక్యూరిటీ గార్డు వద్ద ఉంచి పనికివెళ్లారు. అదేరోజు వీరి పక్క రూములో ఉండే గఫాఫర్ అలీ పనికి వెళ్లకుండా మద్యం తాగి తిరుగుతున్నాడు.11 గంటల ప్రాంతంలో సెక్యూరిటీ గార్డు వద్ద ఉన్న చిన్నారిని గమనించాడు. బాలికకు కూల్‌డ్రింక్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. చిన్నారికి నిందితుడు మద్యం కలిపి ఉన్న కూల్‌డ్రింక్ తాగించి పత్తి చేనులోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయం అందరికీ చెబుతుందేమోనని చిన్నారిని అక్కడే హత్య చేశాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పటి బీడీఎల్ భానూర్ పోలీస్‌స్టేషన్ ఎస్ఐ రవీందర్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అప్పటి డీఎస్పీ పురుషోత్తం రెడ్డి చార్జ్‌షీటు దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలు విన్న ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి జయంతి.. బాలికపై హత్యాచారం చేసిన గఫాఫర్ను దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించారు. అతడి కుటుంబ సభ్యులు చిన్నారి కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని తీర్పు ఇచ్చారు. 27 ఏళ్ల తర్వాత జిల్లాలో మరణశిక్ష: 27 ఏళ్ల తర్వాత జిల్లాలో కోర్టు మరణశిక్షను విధించినట్లు ఎస్పీ చెన్నూరి రూపేష్ వెల్లడించారు. కేసును త్వరితగతిన విచారించేందుకు హైకోర్టు నుంచి అనుమతి తీసుకున్నామని, కేవలం 11 నెలల వ్యవధిలోనే విచారణ పూర్తిచేసి నిందితుడికి కోర్టు మరణ శిక్ష విధించిందని చెప్పారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి ఎస్ఐ, విచారణ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఎస్పీ అభినందించారు. -
ప్రేమ పేరుతో వేధింపులు.. బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, సంగారెడ్డి జిల్లా: దోమడుగు గ్రామంలో బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో వేధింపులు భరించలేక తేజస్విని అనే యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఇంటి నాలుగవ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేయగా, ఆసుపత్రికి తరలిస్తుండగా యువతి మృతి చెందింది.సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలను ట్రాప్ చేసి వేధింపులకు పాల్పడుతున్న గంజాయి బ్యాచ్.. అదే గ్రామానికి చెందిన యువకుడు ఆ అమ్మాయి కుటుంబాన్ని కూడా కూడా బెదిరించినట్లు సమాచారం. వేధింపులు తాళలేక తేజస్విని ఆత్మహత్యకు పాల్పడింది. యువకుడిని కఠినంగా శిక్షించాలని బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న గుమ్మడిదల ఎస్ఐ మహేశ్వర్‌రెడ్డి విచారణ చేపట్టారు. -
సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్‌లో భూసేకరణ
-
ఒకే రోజు 350 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో కళ్లు బైర్లు కమ్మే అక్రమాలు వెలుగు చూశాయి. ఇటీవల బదిలీపై వెళ్లిన ఓ సబ్ రిజిస్ట్రార్ వెళుతూ.. వెళుతూ పెద్ద ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చింది. ఒకే రోజు ఏకంగా సుమారు 350 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలింది. ఒక్కరోజే ఈ స్థాయిలో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయడంతో అనుమానం వచ్చిన ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం ఈ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం విదితమే.తనిఖీలు రాత్రంతా జరిగాయి. శుక్రవారం ఉదయం ఏడు గంటల వరకు అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీలు చేస్తున్న సమయంలో కార్యాలయంలోని ఓ అధికారి రూ.96 వేల నగదును కార్యాలయం కిటికీలోంచి బయటకు విసిరేయడం కలకలం సృష్టించింది. ఈ క్రమంలో ఏసీబీ.. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న 64 డాక్యుమెంట్లను ఏసీబీ సీజ్ చేసింది. ఈ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు.ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు..!ఏసీబీ అదుపులోకి తీసుకున్న అధికారులిద్దరూ ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. పటాన్చెరు ప్రాంతంలో రూ.వందల కోట్లు విలువ చేసే భూములను ఈ అధికారులు రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. జిల్లా ఏసీబీ అధికారులకు తెలియకుండా..ఈ తనిఖీలు నిర్వహించేందుకు హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయం నుంచి ఏసీబీ అధికారులు రావడం గమనార్హం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏసీబీ డీఎస్పీ కార్యాలయం ఉంటుంది. అయితే ఈ కార్యాలయం అధికారులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా నేరుగా రాష్ట్ర కార్యాలయంలోని సీఐయూ విభాగం అధికారులు తనిఖీలు చేపట్టారు. -
స్టాక్ మార్కెట్ పేరిట మోసం... రూ. కోటి పోగొట్టుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి
పటాన్చెరు టౌన్: స్టాక్ మార్కెట్ పేరిట సాఫ్ట్వేర్ ఉద్యోగికి టోకరా వేసి భారీగా నగదు కాజేశారు. ఈ ఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసు కథనం ప్రకారం... పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఏపీఆర్‌కు చెందిన బెజవాడ నాగార్జున ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. తన వాట్సాప్‌కు జులై 5న స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన మెసేజ్‌ను నాడియా కామి అనే మహిళ పంపితే వివరాలను నమోదు చేశాడు. తర్వాత ఐడీని క్రియేట్ చేసి ఇచ్చారు. దీంతో దఫాలవారీగా ఇన్వెస్ట్ చేసిన నగదు రూ.82 లక్షలతో కలిపి మొత్తంగా వాలెట్లో రూ.కోటీ 30 లక్షలు చూపించారు. ఒక రోజు నగదు డ్రా చేసుకుంటానంటే రూ.17 లక్షలు టాక్స్ చెల్లిస్తేనే అంతా డ్రా చేసుకోవచ్చని నమ్మించారు. దీంతో బాధితుడు అప్పు చేసి, తన వద్ద ఉన్న బంగారాన్ని అమ్మి రూ.17 లక్షలు చెల్లించిన తర్వాత అటు వైపు ఉన్న అపరిచిత వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించి ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు, సోమవారం అర్ధరాత్రి పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో నగదు వేసిన అకౌంట్లో ఉన్న రూ. 24 లక్షల నగదు హోల్డ్ చేసినట్లు పటాన్చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు. సైబర్ నేరాలపై 1930 నంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట.. పటాన్చెరు టౌన్: నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట ప్రైవేట్ ఉద్యోగి భారీగా నగదు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఏఆర్ బృందావన్ కాలనీకి చెందిన ప్రైవేట్ ఉద్యోగికి జూన్ 17న ట్రేడింగ్‌కు సంబంధించిన మెసేజ్ వచ్చింది. లింకును ఓపెన్ చేసి తన వివరాలను నమోదు చేశారు. దీంతో అపరిచిత ట్రేడింగ్ నిర్వాహకులు ఐడీని క్రియేట్ చేసి ఇచ్చారు. ముందుగా బాధితుడు లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేయగా మూడు లక్షలు లాభాలు చూపించారు. పలు దఫాలుగా స్నేహితుల వద్ద నగదు తీసుకొని, బంగారం అమ్మి మొత్తం రూ.98.40 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. తాను పెట్టిన నగదుతో పాటు, వచ్చిన లాభాలు ఇవ్వాలని అడుగగా అపరిచిత వ్యక్తి స్పందించలేదు. దీంతో తాను మోసపోయినట్లుగా గుర్తించి ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి, అనంతరం సోమవారం రాత్రి అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు వేసిన అకౌంట్లో ఉన్న రూ. లక్షను హోల్డ్ చేశామన్నారు. -
ఇష్టంలేని వారు వెళ్లిపోండి
గురువారం శ్రీ 27 శ్రీ జూన్ శ్రీ 2024● వైద్యులపై ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆగ్రహం ● సూపరింటెండెంట్, ఆర్ఎంఓ గైర్హాజరు ● పలువురు సిబ్బంది సైతం విధులకు డుమ్మా నారాయణఖేడ్: విధి నిర్వహణ పట్ల అలసత్వం వహించే వైద్యులు, సిబ్బంది పట్ల ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి హెచ్చరించారు. స్థానిక వైద్య విధాన పరిషత్ ఆస్పత్రిని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలువురు వైద్యులు, సిబ్బంది విధులకు డుమ్మా కొట్టడం, అనుమతి లేకుండా సెలవులు వేసుకొని వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టంలేని వారు వెళ్లిపోవాలని, బాధ్యతగా పనిచేసే వారే ఉండి సేవలు అందించాలని సూచించారు. వైద్యుడిని అయిన తన నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. పేద రోగులకు సేవలందిస్తూ బాధ్యతగా విధులు నిర్వర్తించాల్సిన సిబ్బంది ఇలా డుమ్మాలు కొట్టడం ఏమిటని మండిపడ్డారు. సూపరింటెండెంట్, ఆర్ఎంఓ గైర్హాజరు కావడం, అనుమతి లేకుండా సెలవులు తీసుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. డెంటిస్ట్ అయిన ఆర్ఎంఓ 19న అనుమతి తీసుకున్నట్టు ఉండగా 26 వరకు అడ్వాన్స్‌గా సీఎల్ వేశారు. ఫార్మాసిస్ట్ భీంరావు సదాశివపేటకు డిప్యూటేషన్ వేసుకొని వెళ్లారు. అతను ఒక్కసారి కూడా నారాయణఖేడ్‌లో విధులకు రాకపోవడం, గతంలో ఉన్న నేతల సిఫారసులతో డిప్యూటేషన్ వేసుకొని వెళ్లిన విషయం వెల్లడి కావడంతో వెంటనే సరెండర్ చేయాలని ఆదేశించారు. మరో ఫార్మాసిస్ట్ శ్యాంరావు కూడా జోగిపేటకు డిప్యూటేషన్ వేసుకొన్నాడు. మరికొన్ని విభాగాల్లోని సిబ్బంది కూడా విధులకు డుమ్మా కొట్టడం బయట పడింది. ఈ విషయాలపై జిల్లా వైద్య విధాన పరిషత్ వైద్యులు సంగారెడ్డితో ఫోన్లో మాట్లాడి వీరిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. శానిటేషన్ సిబ్బందికి డ్రెస్సింగ్, ఇతర విధులు ఎలా చెబుతారన్నారు. -
తెలంగాణలో భూప్రకంపనలు.. పరుగులు తీసిన జనం
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో కలకలం రేగింది. జిల్లా కేంద్రంతో పాటు న్యాల్కల్, ముంగి తదితర గ్రామాల్లో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి ప్రకంపనలు రావడంతో జనం ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. భూ ప్రకంపనలపై అధికారులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మాడిగి అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద భారీగా బంగారం సీజ్
-
కాంగ్రెస్‌వి దొంగ డిక్లరేషన్లు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ ప్రకటించినవన్నీ దొంగ డిక్లరేషన్లేనని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. వాటిని నమ్మితే ప్రజలు నిలువునా మోసపోతారన్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు టౌన్షిప్లో జీహెచ్ఎంసీ నిర్మించిన డబుల్ బెడ్రూం గృహాలను గురువారం 4,800 మంది లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో హరీశ్‌రావు మాట్లాడు తూ కేసీఆర్ కిట్టు.. న్యూట్రీషియన్ కిట్టు.. ఎన్సీడీ కిట్టు.. ఇలా బీఆర్ఎస్ సర్కారు లబ్ధిదారులకు కిట్లు పంపిణీ చేస్తుంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు తిట్లకే పరిమితం అవుతున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధిని చూసి సినీ నటుడు రజనీకాంత్ మెచ్చుకున్నప్పటికీ., ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన గజనీగాళ్లకు మా త్రం అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ బెంగళూరును మించి పోయిందనీ, ఇప్పుడు ఈ రంగంలో దేశంలోనే హైదరాబాద్ నం.1 స్థానంలో నిలుస్తోందన్నారు. ఇచ్చే రూ.60 వేలల్లోనూ లంచాలు తీసుకునేవారు.. కాంగ్రెస్ హయాంలో ఇంటి నిర్మాణానికి ఇచ్చే రూ.60 వేలల్లోనూ ఆ పార్టీ నేతలు లంచాలు అడిగే వారని హరీశ్‌రావు ఆరోపించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎలాంటి లంచాలు లేకుండా ఇంటిని కేటాయిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఒక్కొక్కరు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదీ జలాల్లో 90 టీఎంసీల నీటి వాటా మనకే దక్కిందని, పాలమూరు ఎత్తిపోతల పథకానికి కూడా అనుమతి తెచ్చుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, దానం నాగేందర్, ప్రకాశ్‌గౌడ్, మాగంటి గోపీ నాథ్, సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ పాల్గొన్నారు. -
సంపద పెరగాలంటే పరిశ్రమలు రావాలి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు సహకరించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాజకీయా లు ఎన్నికలు వచ్చినప్పుడు చేసుకోవచ్చన్నారు. రాష్ట్రం బాగుపడాలన్నా, సంపద పెరగాలన్నా కొత్త పరిశ్రమలు రావాలన్నారు. పరిశ్రమలు పెడితే స్థానికులకు నష్టం జరుగుతుందని కొందరు రాజకీయం కోసం వదంతులు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి అపోహలకు గురికాకుండా స్థానిక నాయకులు పరిశ్రమల స్థాపనకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఫ్రాన్స్‌కు చెందిన ప్రీమియం సిరప్ తయారీ కంపెనీ మొనిన్ రూ.300 కోట్ల పెట్టుబడితో సంగారెడ్డి జిల్లా గుంతపల్లిలో నిర్మించతలపెట్టిన ఫ్యాక్టరీకి బుధవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న ప్రగతిశీల విధానాలను చూసి వివిధ దేశాలకు చెందిన కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. మొనిన్ కంపెనీ యాజమాన్యం దేశంలో 18 రాష్ట్రాల్లో తిరిగిందని, చివరకు తెలంగాణలో యూనిట్‌ను స్థాపిస్తోందని చెప్పారు. స్థానిక యువత నైపుణ్యాలు పెంచుకుంటే ఈ కంపెనీల్లో మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో మొదటి స్థానం.. రాష్ట్రం వ్యవసాయ రంగంలో గణనీయ వృద్ధిని సాధించిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి 68 వేల మెట్రిక్ టన్నుల నుంచి మూడున్నర లక్షల టన్నులకు చేరి దేశంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. పారిశ్రామిక రంగం కూడా అభివృద్ధి బాటలో కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్, మొనిన్ సంస్థ చైర్మన్ ఓలివర్ మొనిన్ తదితరులు పాల్గొన్నారు. -
జహీరాబాద్ లో టమోటాలు చోరీ
-
గోదాములు ఫుల్.. ఇక్కడ స్థలం లేక.. బీదర్‌కు మన బియ్యం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో ఉన్న ఎఫ్‌సీఐ గోదాముల్లో స్థలసమస్య తలెత్తింది. దీని ప్రభావం ఈ యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లపై పడుతోంది. సంగారెడ్డితోపాటు మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన సీఎంఆర్ బియ్యాన్ని మిల్లర్లు ఇప్పటివరకు హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఎఫ్‌సీఐ గోదాములకు డెలివరీ చేసేవారు. అయితే ఈ గోదాముల్లో ఇప్పుడు స్థలం లేకపోవడంతో నిల్వలన్నీ పేరుకుపోయాయి. దీంతో కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఉన్న ఎఫ్‌సీఐ గోదాములకు తరలించాలని నిర్ణయించారు. అక్కడ కూడా స్థల సమస్య తలెత్తడంతో రాష్ట్రం నుంచి వెళ్లిన లారీలు అన్లోడ్ కావడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో సంగారెడ్డి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు బీదర్‌కు వెళ్లి అక్కడి ఎఫ్‌సీఐ అధికారులతో చర్చలు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క సంగారెడ్డి జిల్లా నుంచే 1.02 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని బీదర్‌కు తరలించాలని ఎఫ్‌సీఐ నిర్ణయించింది. ఆ బియ్యం రవాణా అయితేనే... మిల్లుల్లో గత యాసంగి, వానాకాలం సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన బియ్యం రవాణా అయితేనే స్థలం ఖాళీ అవుతుంది. అప్పుడే ఈ యాసంగి సీజన్లో కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లు దించుకునేందుకు వీలవుతుంది. కానీ ఎఫ్‌సీఐ గోదాముల్లో స్థలాలు లేక గత యాసంగి, వానాకాలం సీజన్లకు సంబంధించిన బియ్యమే మిల్లుల్లో ఉండిపోయింది. దీంతో ఈ యాసంగి సీజనులో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. మిల్లర్ల వద్ద స్థలం లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ కారణంగానే చాలాచోట్ల కొనుగోలు కేంద్రాలు తెరిచినా, ధాన్యం తూకాలు జరగడంలేదు. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే 77 కొనుగోలు కేంద్రాలు తెరిచారు. కానీ ఇప్పటివరకు 400 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా ఆ కేంద్రాల నుంచి మిల్లులకు రవాణా చేయలేకపోయారు. -
దొంగను కొట్టి చంపిన గ్రామస్థులు
-
బోనమెత్తి..మొక్కులు చెల్లించి
పటాన్చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ శివారులో జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మ జాతరలో గవర్నర్ తమిళిసై బోనమెత్తి మొక్కులు సమర్పించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నేత నందీశ్వర్‌గౌడ్ ఆధ్వర్యంలో జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. ఆయన ఆహ్వానం మేరకు ఆదివారం గవర్నర్‌కు ఇక్కడికి వచ్చారు. ముందుగా ఆలయ పూజారులు పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. అమ్మవారికి చేయించిన బంగారు ఆభరణాలను గవర్నర్ అలంకరించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని గవర్నర్ తెలిపారు. ఆధ్యాత్మిక సంస్కృతిని కాపాడుకోవాలి: దత్తాత్రేయ ఆధ్యాత్మిక సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆయన ఆదివారం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ జాతర ఉత్సవాల్లో పాల్గొన్నారు. -
దారుణం.. బైక్‌ను ఢీకొట్టడంతో భార్యాభర్తలిద్దరూ లారీ కింద ఇరుక్కుని..
హత్నూర(సంగారెడ్డి): బైక్‌ను లారీ ఢీ కొన్న ఘటనలో భార్యాభర్తలకు తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఎస్ఐ లక్ష్మారెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన ఊట్ల శ్రీకాంత్, అర్చన భార్యాభర్తలు. శుక్రవారం పటాన్ చెరు మండలం ఇస్నాపూర్‌లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు. శనివారం స్వగ్రామమైన మెదక్ జిల్లా వెంకట్రావ్ పెట గ్రామానికి పల్సర్ బైక్ పై బయలుదేరారు. దౌల్తాబాద్ లోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్ ఉండటంతో శ్రీకాంత్ బైక్‌ను స్లో చేశాడు. ఈ క్రమంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఒక్కసారిగా వారి బైక్‌ను బలంగా ఢీ కొట్టింది. దీంతో భార్యాభర్తలిద్దరూ కింద పడిపోయారు. వారిద్దరినీ లారీ కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. లారీ టైర్ల కింద ఇరుక్కుపోయిన వారిని స్థానికులు అతి కష్టం మీద బయటకు తీశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ వారిని పోలీసు వాహనంలో నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. -
ఎద్దు ఖరీదు రూ.1.3 లక్షలు
న్యాల్కల్(జహీరాబాద్): సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్ గ్రామ సమీపంలో కొనసాగుతున్న ఉర్సే షరీఫ్ పీర్ గైబ్ సాహెబ్ దర్గా ఉత్సవాల్లో ఆదివారం భారీ పశువుల సంత నిర్వహించారు. ఝరాసంగం మండల పరిధిలోని ప్యాల వరం గ్రామానికి చెందిన రైతు తన ఎడ్ల జత ధర రూ.3 లక్షలని చెప్పగా.. అందులోని ఒక్క ఎద్దును మునిపల్లి మండలం పెద్దలోడి గ్రామానికి చెందిన రైతు సంగమేశ్వర్ రూ.1.3 లక్షలు పెట్టి కొనుగోలు చేశాడు. మరో ఎడ్ల జత రూ.1.45 లక్షలు పలికింది. సదాశివపేట మండలం కొల్కూర్‌కు చెందిన శివకుమార్ అనే రైతు తన ఆవు ధర రూ.6 లక్షలుగా నిర్ణయించగా.. రూ.3 లక్షలకు ఇవ్వమని రైతులు కోరినా అంగీకరించలేదు. -
ఆదాయం.. ఆరోగ్యం మహిళల ‘చిరు’ యత్నం.. ఫలిస్తున్న పాత పంటల సాగు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సామలు.. కొర్రలు.. అరికెలు.. ఊదలు.. జొన్నలు.. ఇలా పలు పాత పంటలు సేంద్రియ పద్ధతిలో సాగు చేయడమే కాకుండా వాటిని వినియోగిస్తూ తమతో పాటు తమ కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు ఆ మహిళా రైతులు. అంతేకాదు వారి అవసరాలు పోను మిగతా ధాన్యాన్ని మంచి ధరకు అమ్ముకుంటూ లాభాలు ఆర్జించడంతో పాటు ఇతరులకు ఆరోగ్యాన్ని పంచుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఈ పాత పంటల సాగు దాదాపు కనుమరుగైందనే చెప్పాలి. అయితే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇటీవలి కాలంలో చాలామంది తృణ ధాన్యాల వైపు మొగ్గు చూపుతుండటంతో.. కొద్ది సంవత్సరాలుగా కొన్ని ప్రాంతాల్లో మళ్లీ వీటి సాగు మొదలైంది. అయితే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంత రైతులు మాత్రం ఏళ్ల తరబడి తృణ ధాన్యాల సాగును కొనసాగిస్తుండటం గమనార్హం. ఒక సంఘం..3 వేలమంది సభ్యులు జహీరాబాద్ ప్రాంతంలో సరైన సాగునీటి సౌకర్యం లేదు. వరుణుడు కరుణిస్తేనే పంటలు చేతికందుతాయి. ఈ ఎర్ర నేలల్లో ప్రస్తుతం సుమారు తొమ్మిది వేల ఎకరాల్లో చిన్న సన్నకారు రైతులు చిరుధాన్యాలను సాగు చేస్తున్నారు. అందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఈ పంటలను పండిస్తున్నారు. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన గ్రూపుల్లో సుమారు మూడు వేల మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు. ఒక్క కరోనా మరణం లేదు చిరుధాన్యాలను సాగు చేయడం ద్వారా రూ.లక్షల్లో లాభాలను గడించకపోయినప్పటికీ.. నిత్యం వాటినే వినియోగిస్తుండడంతో ఆ రైతులు ఆరోగ్యంగా ఉంటున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని పొట్టనబెట్టుకుంది. కానీ ఈ చిరుధాన్యాలు వినియోగించిన రైతు కుటుంబంలో ఒక్క కరోనా మరణం కూడా జరగలేదని డీడీఎస్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. మూడు వేవ్‌ల్లో అసలు ఈ మహమ్మారి బారిన పడిన రైతులే చాలా తక్కువని చెబుతున్నారు. రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, ఇతరత్రా వ్యాధుల బారిన పడిన వారి సంఖ్య కూడా తక్కువేనని అంటున్నారు. కొనసాగుతున్న జాతర చిరుధాన్యాల ఆవశ్యకత.. పౌష్టికాహార భద్రత.. సేంద్రియ వ్యవసాయం ప్రాధాన్యతపై రైతుల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా గత 23 ఏళ్లుగా పాత పంటల జాతర జహీరాబాద్ ప్రాంతంలో కొనసాగుతోంది. సంక్రాంతి నుంచి మొదలుపెట్టి కనీసం రోజుకో గ్రామం చొప్పున నెల రోజుల పాటు సుమారు 40 గ్రామాల్లో ఈ జాతర సాగుతుంది. సుమారు 80 రకాల చిరుధాన్యాలను ఎడ్ల బండ్లపై ఆయా గ్రామాలకు తీసుకెళ్లి వాటి సాగు ప్రాధాన్యతను రైతులకు వివరిస్తూ ఆయా పంటల సాగును ప్రోత్సహిస్తుంటారు. డీడీఎస్ ఆధ్వర్యంలో జాతర కోసం ఏర్పాటైన ప్రత్యేక బృందం.. రసాయనాలు లేకుండా విత్తనాలు భధ్ర పరుచుకోవడం, సేంద్రియ ఎరువుల తయారీ, భూసార పరీక్షల కోసం మట్టి నమూనాల సేకరణ వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తుండటం విశేషం. జహీరాబాద్ కేంద్రంగా ఈ సంస్థ 35 గ్రామాల్లో రైతులను ప్రోత్సహిస్తోంది. జహీరాబాద్, మొగుడంపల్లి, ఝరాసంగం, న్యాల్కల్ తదితర మండలాల రైతులకు తృణధాన్యాల సాగుపై అవగాహన కల్పిస్తోంది. పండిన పంటలు రైతులు వినియోగించేలా వారిని చైతన్యం చేస్తోంది. మిగిలిన పంటలను మార్కెట్ ధర కంటే సుమారు పది శాతం ఎక్కువ ధరకు రైతుల వద్ద డీడీఎస్ కొనుగోలు చేస్తోంది. మేం పండించిన సాయి జొన్నలనే తింటున్నం.. నాకు ఏడు ఎకరాలు ఉంది. టమాటా, మిర్చి వంటి కూరగాయల పంటలకు భూమి అనుకూలంగా ఉన్నప్పటికీ.. చిరుధాన్యాలను సాగు చేయాలనే ఉద్దేశంతో రెండు ఎకరాల్లో సాయి జొన్న పండిస్తున్న. కూరగాయల పంటలతో పాటు శనగలు, కందులు కూడా సాగు చేస్తున్నా. చిరుధాన్యాలు ఆరోగ్యానికి మంచివనే ఉద్దేశంతో మేం పండించిన సాయి జొన్నలనే ఎక్కువగా తింటాం. ఇవి తింటేనే మాకు ఆరోగ్యంగా అనిపిస్తుంది. – గార్లపాటి నర్సింహులు, బర్దిపూర్, సంగారెడ్డి జిల్లా ఐదు ఎకరాల్లో 20 రకాల పంటలు మాకు ఐదు ఎకరాలుంది. వర్షం పడితేనే పంట పండుతుంది. నీటి సౌకర్యం లేదు. తొగర్లు, జొన్నలు, సామలు, కొర్రలు.. ఇట్లా 20 రకాల పంటలు వేస్తున్నాం. విత్తనాలు మావే.. కొనే అవసరం లేదు. మేమే సేంద్రియ ఎరువులను తయారు చేసుకుంటున్నాం. దీంతో పెట్టుబడి వ్యయం చాలా తక్కువగా ఉంటోంది. – పర్మన్గారి నర్సమ్మ, మెటల్‌కుంట, సంగారెడ్డి జిల్లా ఎంతో ఆరోగ్యంతో ఉంటున్నారు.. నెల రోజుల పాటు జరిగే పాతపంటల జాతరలో రైతులకు చిరుధాన్యాల సాగు ఆవశ్యకతను వివరిస్తున్నాం. వివిధ రకాల పంటలు సాగు చేయడం ద్వారా వాతావరణం అనుకూలించక ఒక పంట నష్టపోయినా.. మరో పంట చేతికందుతుంది. ఈ చిరుధాన్యాలను పండించడంతో పాటు వాటిని వినియోగిస్తే వచ్చే ఆరోగ్యపరమైన ప్రయోజనాలపై మహిళా రైతులను చైతన్యం చేస్తున్నాం. చిరు ధాన్యాలను వినియోగిస్తున్న రైతులు, వారి కుటుంబాల వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నారు. – బూచనెల్లి చుక్కమ్మ, జాతర కోఆర్డినేటర్ -
పాతపంటల జాతర షురూ
జహీరాబాద్: చిరుధాన్యాల ప్రాధాన్యాన్ని చాటిచెప్పే పాత పంటల జాతర ఉత్సాహంగా ప్రారంభమైంది. శనివారం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని జాంగార్‌బౌలి తండాలో జాతరను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ పి.సంజనారెడ్డి జ్యోతి వెలిగించి ఎడ్లబండ్ల ఊరేగింపును మహిళా రైతులతో కలసి ప్రారంభించారు. ఊరేగింపులో మహిళా రైతులు చిరు ధాన్యాలతో ముందుకు సాగారు. ఆరు ఎడ్ల బండ్లలో చిరుధాన్యాలను తీసుకువచ్చారు. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) డైరెక్టర్ పీవీ సతీశ్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 28 రోజుల పాటు 23 గ్రామాల్లో ఎడ్లబండ్ల ఊరేగింపు, ఉత్సవాలు జరుగుతాయి. జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. జాతర సందర్భంగా జీవవైవిద్య సంరక్షకులను సత్కరించి అభినందించారు. రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న చిరుధాన్యాల సాగుపై రూపొందించిన 9 నిమిషాల నిడివిగల డాక్యుమెంటరీని ఈ సందర్భంగా ప్రదర్శించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాశెట్టి చౌహాన్, డీడీఎస్ కోడైరెక్టర్ చెరుకూరి జయశ్రీ, సంస్థ సభ్యులు, మహిళా రైతులు పాల్గొన్నారు. -
ఊరూరా పాతపంటల జాతర
జహీరాబాద్: పాతపంటలకు కొత్తకళ వస్తోంది. చిరు ప్రాధాన్యం కలిగిన చిరుధాన్యం ఇప్పుడు అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఐక్యరాజ్యసమితి ఈ ఏడాదిని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంతో అందరూ పాతపంటలైన చిరుధాన్యాల వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో 28 రోజులపాటు 23 గ్రామాల మీదుగా డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) ఆధ్వర్యంలో 23వ పాతపంటల జాతర సాగనుంది. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం జాంగార్‌బౌలి తండా నుంచి జాతర ప్రారంభమై ఫిబ్రవరి 11న ఝరాసంగం మండలం మాచ్నూర్లో ముగియనుంది. ఎడ్లబండ్లలో చిరుధాన్యాలను ప్రదర్శిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించనున్నట్లు డీడీఎస్ డైరెక్టర్ పీవీ సతీశ్ వివరించారు. సమృద్ధి పోషకాలతో కూడిన చిరుధాన్యాల సాగును ప్రోత్సహించి, అవగాహన కల్పించేందుకు రైతులు, మహిళలతో ఆయా శాఖల అధికారులు, వ్యవసాయ నిపుణులు సమావేశాలు నిర్వహిస్తారు. జహీరాబాద్ మండలం పస్తాపూర్‌లో ఏర్పాటు చేసిన సంఘంలో ఐదువేల మంది మహిళారైతులు సజ్జ, కొర్ర, తైద, సామ, పెసర, మినుము, అవిశ తదితర 30 నుంచి సుమారు 50 రకాల చిరుధాన్యాలను పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. చిరుధాన్యాల ఆవశ్యకత, సేంద్రియ విధానంలో సాగు, పెట్టుబడి వ్యయం తగ్గించేందుకు జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, మొగుడంపల్లి, రాయికోడ్ మండలాల్లోని 70 గ్రామాల్లో డీడీఎస్ కొంతకాలంగా అవగాహన కల్పిస్తోంది. ఝరాసంగం మండలం మాచ్నూర్లో 50 నుంచి 60 రకాల విత్తనాలతో చిరుధాన్యాల విత్తన బ్యాంకును నిర్వహిస్తున్నారు. రైతులు పండించిన పంటలో నాణ్యమైనవాటిని విత్తనంగా సేకరించి నిల్వచేసి వానాకాలం, యాసంగిలో సాగు చేస్తున్నారు. పాతపంటల జాతర షెడ్యూల్ ఈ నెల 14వ తేదీన మొగుడంపల్లి మండలం జాంగార్‌బౌలి తండాలో పాత పంటల జాతర ప్రారంభం అవుతుంది. 16న మన్నాపూర్, 17న ఉప్పర్‌పల్లి తండా, 18న జాడీ మల్కాపూర్, 19న లచ్చునాయక్ తండా, 20న జీడిగడ్డ తండా, 21న అర్జున్‌నాయక్ తండా, మోడ్ తండా, 23న జహీరాబాద్, 24న శేఖాపూర్ తండా, జంలైతండా, 25న శేఖాపూర్, 26న కోహీర్ మండలం గొటిగార్‌పల్లి, 27న బిలాల్పూర్, 28న ఝరాసంగం మండలం చిల్కెపల్లి, 30న బిడకన్నె, ఫిబ్రవరి 1న ఝరాసంగం, 2న పొట్పల్లి, 3న న్యాల్కల్ మండలం రేజింతల్, 4న హూసెళ్లి, గుంజోటి, 6న శంశల్లాపూర్, 8న న్యాల్కల్లో జాతర సాగుతుంది. 11న ఝరాసంగం మండలం మాచ్నూర్లోని డీడీఎస్ పచ్చసాలెలో ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. -
రసాయన పరిశ్రమలో ప్రమాదం
జిన్నారం (పటాన్చెరు): మైలాన్ రసాయన పరిశ్రమ యూనిట్ – 1లో రసాయనాలను వేరు చేస్తున్న క్రమంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో ఆది వారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మైలాన్ పరి శ్రమ లోని లిక్వి డ్ రా మెటీరియల్స్ శాంపిల్ డిస్పెన్సింగ్ గదిలో 1.1.3.3 టెట్రా మిథైల్ డిసిలోక్సేన్ అనే రసాయన మెటీరియల్‌ను (దీనితో మతిస్థిమితం సరిగాలేని వ్యక్తులకు అవసరమైన మందులు తయారు చేస్తారు) సుమారు 400– 500 డిగ్రీ సెల్సియస్‌లో వేడి చేసి దాని నుంచి జిప్రసైడోన్ ఇంటర్మీడియెట్ రసాయనం తయారు చేస్తుంటారు. ఈ ప్లాంటులో పది మంది వరకు విధులు నిర్వహిస్తుంటారు. ఎప్పటిలాగానే రసా యనాలను వేరు చేస్తున్న క్రమంలో ఒక్క సారిగా ఒత్తిడి ఎక్కువై మెరుపులు వచ్చా యి. యాసిడ్ మాదిరి కాలే గుణం ఉన్న రసాయనాలు ఒక్కసారిగా బయటకు ఎగ జిమ్మాయి. అవి ఒంటి మీద పడటంతో చర్మం కాలి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన వేర్‌హౌస్ అసిస్టెంట్ మేనేజర్ లోకేశ్వర్‌రావు (38), కార్మికులు వెస్ట్ బెంగాల్‌కు చెందిన పరితోష్ మెహతా (40), బిహార్‌కు చెందిన రంజిత్‌కుమార్ (27) అనే ముగ్గురు అక్కడికక్కడే కాలి పోయారు. మంటలు కూడా చెలరేగినప్పటికీ సిబ్బంది వెంటనే స్పందించి ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్నిమాపక శకటాలు మంటలను పూర్తిస్థాయిలో అదుపులోకి తెచ్చాయి. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే..: ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను యాజమాన్యం హుటాహుటి న ఆస్పత్రికి తరలించింది. ఘటన జరిగిన గంటసేపటి తర్వాత పోలీసులు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు పరిశ్రమకు చేరుకున్నారు. మరోవైపు వార్తను కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులను యాజమాన్యం ఘటనా స్థలా నికి పంపలేదు. కాగా యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, తమకు న్యాయం జరిగేలా చూడాలని మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయడంతో పాటు కార్మికులకు రక్షణ కల్పించేలా యాజ మాన్యం చర్యలు తీసు కోవాలని సీఐటీయూ నాయకులు, కార్మికులు ఆందోళన చేపట్టారు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతు న్నామని సీఐ సురేందర్‌రెడ్డి తెలిపారు. పరిశ్రమపై చర్యలు తీసుకుంటామని ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాకర్టీస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. -
రెట్టింపు లాభం అంటూ రూ.కోట్లు కొట్టేశారు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మా కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టండి..మీ డబ్బు రెట్టింపు అవుతుందంటూ సైబర్ నేరగాళ్లు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వద్ద ఏకంగా రూ.1.90 కోట్లు కొట్టేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో నివాసముంటున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు కొంతమంది వ్యక్తులు పరిచయమై తమ కంపెనీ షేర్లు కొనుగోలు చేయాల్సిందిగా కోరారు. అలాచేస్తే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వస్తుందని ఆశ చూపారు. దీంతో సదరు ఇంజనీరు అత్యాశకు పోయి కొన్ని షేర్లు కొనుగోలు చేశాడు. అయితే సైబర్‌నేరగాళ్లు చెప్పినసమయానికి అనుకున్నట్లు గానే రెట్టింపు మొత్తాన్ని ఇంజనీరు ఖాతాలో జమ చేశారు. ఇలా పలుమార్లు షేర్లు కొనుగోలు చేయగా..మంచి లాభాలు వచ్చాయి. దీంతో ఏకంగా రూ.1.90 కోట్లను పెట్టుబడిగా పెట్టారు. అయితే తిరిగి డబ్బులు రావాల్సిన గడువు ముగుస్తున్నప్పటికీ రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంగారెడ్డి జిల్లా పోలీసులను ఆశ్రయించగా...కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తాగుబోతు భర్తతో వేగలేక..
జహీరాబాద్ టౌన్: నిత్యం తాగి గొడవకు దిగుతున్న భర్త వైఖరికి మనస్తాపంతో భార్య వ్యవసాయ బావిలోకి దూకింది.. అది గమనించిన భర్త కూడా బావిలో దూకాడు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో నీట మునిగి మృత్యువాత పడ్డారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవింద్‌పూర్‌లో ఆదివారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. మృతుని తల్లి పెంటమ్మ, పోలీసుల కథనం ప్రకారం.. జహీరాబాద్ మండలం ఆనేగుంటకు చెందిన రాజగిర వెంకటి (35)కి భార్య లక్ష్మి (28), కూతుళ్లు గీతాంజలి, మల్లీశ్వరి, కుమారుడు సాయి ఉన్నారు. వెంకటి కుటుంబంతో గోవింద్‌పూర్‌లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉంటూ కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తాగుడుకు బానిసైన వెంకటి తరచూ భార్యతో గొడవ పడేవాడు. గతంలో ఒకసారి గొడవ జరిగినప్పుడు వెంకటి బావిలో దూకగా చుట్టుపక్కల వారు రక్షించారు. ఆ సమయంలో కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం కూడా మద్యం తాగిన వెంకటి భార్యతో గొడవకు దిగాడు. దీంతో మనస్తాపానికి గురైన భార్య లక్ష్మి సమీపంలోని వ్యవసాయ బావిలో దూకింది. ఆమెను కాపాడేందుకు వెంకటి కూడా బావిలోకి దూకగా, ఇద్దరు నీట మునిగారు. ఇది గమనించిన వెంకటి తల్లి పెంటమ్మ ఇద్దరినీ కాపాడేందుకు డ్రిప్ పైపులు బావిలోకి జార విడిచినా ప్రయోజనం లేకుండా పోయింది. దంపతుల మృతితో పదేళ్ల లోపున్న ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. బావిలోంచి మృతదేహలను వెలికితీసిన చిరాగ్పల్లి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ఆస్పత్రికి తరలించారు. మృతుడు వెంకటి తల్లి పెంటమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చిరాగ్పల్లి ఎస్ఐ కాశీనాథ్ తెలిపారు. అనాథలైన చిన్నారులు -
కంట్లో కారం చల్లి.. చేతులు నరికి
మునిపల్లి(అందోల్): పాత కక్షలతో ఒక వ్యక్తిని అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచల్మెడ గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బేగరి ఆనంద్ (28), తలారి అంబయ్య చిన్నకొడుకు ప్రవీణ్ 2020 అక్టోబర్ 10వ తేదీన పేకాట ఆడారు.ఆనంద్‌తో పాటు ఇతరుల డబ్బును ప్రవీణ్ గెలుచుకున్నాడు. ఆ ఉక్రోషంతో అతన్ని ఆనంద్ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి ఆనంద్‌ను జైలుకు పంపించారు.బెయిల్‌పై ఇటీవలే బయటకు వచ్చిన అనంద్‌ను ఎలాగైనా చంపాలని ప్రవీణ్ కుటుంబ సభ్యులు పథకం వేసుకు న్నారు. శుక్రవారం గ్రామంలోని చర్చి సమీపంలో ఆనంద్ కనిపించగానే.. వెంట తెచ్చుకున్న కారం పొడిని అతని కంట్లో చల్లారు. తేరుకునేలోపే ఆనంద్ మెడపై తలారి అంబయ్య, స్వరూప, ప్రభుదాస్ గొడ్డలితో నరకడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బతికి ఉన్నాడనే అనుమానంతో ఆనంద్ రెండు చేతు లు నరికి మృతదేహం పక్కన పెట్టినట్లు గ్రామస్తులు తెలిపారు. సీఐ సంతోష్ కుమార్, సి బ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. -
కలుషిత ఆహారం.. 60 మంది విద్యార్థినులకు అస్వస్థత
నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారు. శనివారం ఉదయం అల్పాహారంగా తాలింపు అటుకులు, రవ్వతో పాయసం అందించారు. అటుకులు, పాయసంలో పురుగులు రావ డంతో వాటిని తిన్న విద్యార్థినులు కడుపునొప్పితో బాధపడుతూ పాఠశాలలో కుప్పకూలారు. దాన్ని గమనించిన మిగతా విద్యార్థినులు తినడం మానేశారు. పాఠశాల ప్రత్యేక అధికారి, వార్డెన్, వంట సిబ్బంది ఆ పదార్థాలను పడేశారు. కడుపునొప్పితో బాధపడుతున్న విద్యార్థినుల్లో 25 మందిని మాత్రమే ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు, ప్రజాసంఘాల నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారు. తహసీల్దార్ మురళీధర్, ఆర్ఐ మాధవరెడ్డి, సీఐ రామకృష్ణారెడ్డిలు పాఠశాలకు చేరుకుని మిగతావారిని పోలీసు వాహనాల్లో ఆస్పత్రికి తరలించారు. డీఈవో నాంపల్లి రాజేశ్ ఆస్పత్రిలో విద్యార్థుల పరిస్థితిని తెలుసుకున్నారు. బాధ్యులైన ప్రత్యేక అధికారితో పాటు నలుగురు ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. -
రహదారులపై మృత్యు ఘోష.. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృతి
జోగిపేట (అందోల్)/ధారూరు: రాష్ట్రంలో రహ దారులు నెత్తురోడాయి. గురువారం జరిగిన వే ర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృత్యువాత పడ్డారు. వికారాబాద్ జిల్లా ధారూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, సంగారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు కారణంగా దారికనిపంచక జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. దారి కనిపించక కుటుంబం బలి జీడిమెట్లలో నివాసం ఉంటున్న ఓ కుటుంబం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా షాపూర్ నుంచి హైదరాబాద్‌కు కారులో బయలుదేరింది. ఉదయం 6.30 గంటల ప్రాంతంలో జోగిపేట వైపు నుంచి వస్తున్న నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాంసానిపల్లి వద్ద జాతీయ రహదారిపై వారి వాహనాన్ని బలంగా ఢీకొంది. పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనం కనిపించకపోవడంతో స్పీడ్‌గా వస్తున్న బస్సు కారును ఢీకొట్టి సుమారు 200 అడుగుల దూరం ఈడ్చుకెళ్లింది. కారు ముందుభాగం బస్సుకింద ఇరుక్కుపోయి నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో జీడిమెట్ల సుభాష్‌నగర్‌కు చెందిన ఎలక్ట్రిషియన్ దిలీప్ (50), భార్య వినోద (44), కూతురు సుప్రతిక (24), మనవరాలు కాన్షీ (ఏడాదిన్నర) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరగగానే అక్కడే రోడ్డు పక్కన పనిచేస్తున్న కూలీలు కారు వద్దకు పరుగెత్తివెళ్లి చూడగా, చిన్నారితోపాటు దిలీప్, వినోద మృతి చెందారు. తీవ్రగాయాలపాలైన సుప్రతిక కొట్టు మిట్టాడుతోంది. ఆమెను కాపాడేందుకు కారు డోర్లు తెరిచేందుకు ప్రయత్నించినా రాలేదు. చివరకు ఆమె కూడా పది నిమిషాల్లో మృత్యు ఒడిలోకి జారుకుంది. కారు డోర్లు ఇరుక్కు పోవడంతో ఆమెను కాపాడలేకపో యామని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. కళ్ల ముందే జరిగిన ఈ ఘోరమైన ఘటనను మరిచిపోలేక పోతున్నా మన్నారు. తల్లి ఒడిలోనే చిన్నారి తనువు చాలించడం అక్కడున్న వారి హృదయాలను కలిచి వేసింది. జేసీబీ, క్రేన్ సహాయంతో గంటకుపైగా శ్రమించి కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటికి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సీఐ నాగరాజు తెలిపారు. వద్దన్నా వెళ్లాడు.. దిలీప్ కూతురు సుప్రతిక, అల్లుడు ప్రదీప్‌రెడ్డికి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతు న్నాయి. దీంతో గత నెల 31న అడ్వొకేట్‌తో మాట్లాడేందుకు కుటుంబంతోసహా మహారాష్ట్ర లోని స్వగ్రామమైన షాపూర్‌కు వెళ్లారు. కుమా రుడు వంశీని అక్కడే ఉంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఇంతలోనే ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కుటుంబసభ్యులంతా మృతి చెందడంతో వంశీ అనాథయ్యాడు. వంశీ ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. మహారాష్ట్రలోని షాపూర్‌కు వెళ్లిన దిలీప్ తన స్నేహితుడైన సంజీవరెడ్డి వద్దనే ఉన్నారు. తెల్లవారుజామున 4.30 గంటలకు జీడిమెట్లకు వెళ్లేందుకు సిద్ధ మయ్యారు. ఇంతపొద్దున ఎందుకు, టిఫిన్ చేసి 8 గంటలకు బయలుదేరండి అని చెప్పినా వినకుండా వెళ్లాడని సంజీవరెడ్డి జోగిపేటలో ఆవేదనతో చెప్పారు. తమ ఇంటి నుంచి బయ లుదేరిన రెండు గంటల్లోనే చనిపోయాడన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. నిద్రమత్తులో లారీ నడిపి.. వికారాబాద్ జిల్లా ధారూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమా దంలో ఐదుగురు మృతిచెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పెద్దేముల్ మండలం రేగొండికి చెందిన ఆటో డ్రైవర్ జమీర్ తన ఆటోలో 10 మందిని ఎక్కించుకుని వికారాబాద్‌కు బయలుదేరాడు. వీరిలో ఎనిమిది మంది అడ్డా కూలీలున్నారు. వీరంతా వికారాబాద్‌లోని ఓ క్రషర్ మిషన్‌లో పనిచేస్తారు. బాచారం గ్రామ సమీపంలోకి రోడ్డు మలుపు వద్ద అతివేగంతో ఎదురుగా వచ్చిన లారీ వీరి ఆటోను ఢీకొట్టి కొద్ది దూరం లాక్కెళ్లింది. ప్రమాదంలో డ్రైవర్ జమీర్ (35), హేంలానాయక్ (45), రవి (40) అక్కడికక్కడే మృతిచెందారు. క్షతగాత్రులను తొలుత వికారాబాద్ ఆస్పత్రికి తరలించగా అక్కడ నేనావత్ కిషన్(40) తుదిశ్వాస వదిలాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో మిగిలిన వారిని హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా అక్కడ నెనావత్ వినోద్ (35) మృతి చెందాడు. ప్రస్తుతం ఆరుగురు నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. లారీ డ్రైవర్ ఎం.కుమార్ (28) నిద్రమత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగిన ట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినా పట్టనట్లు వ్యవహరించిన డ్రైవర్ కుమార్.. అదే లారీని నడుపుకొంటూ తాండూరు వరకు సుమారు 30 కిలోమీటర్లు వెళ్లాడు. అక్కడ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ కోటిరెడ్డి, డీఎస్పీ సత్యనా రాయణ, సీఐ తిరుపతిరాజు, ఎస్ఐ నరేందర్ ఘటనాస్థలానికి వెళ్లి విచారణ జరిపారు. తండాకు చెందిన ముగ్గురు మృతిచెందడంతో మదనంతపూర్‌లో విషాద ఛాయలు అలుముకు న్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే 108కు సమాచారం ఇచ్చినా సకాలంలో రాలేదని, దీంతో క్షతగాత్రులను తరలించేందుకు పోలీసులు ఇబ్బంది పడినట్లు స్థానికులు చెప్పారు. ఆపకపోతే ప్రాణాలు దక్కేవి మదనంతాపూర్ వద్ద కూలీలను ఎక్కించుకున్న ఆటో డ్రైవర్ జమీర్.. క్రషర్లో పనిచేసే టిప్పర్ డ్రైవర్ శ్రీనివాస్ కోసం బాచారం వద్ద ఐదు నిమిషాలు ఆపాడు. అక్కడి నుంచి వెళ్లిన నిమిషాల వ్యవధిలోనే ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడ ఆపకపోయి ఉంటే ఆటో సురక్షితంగా బాచారం మలుపు దాటి ఉండేదని బాధిత కుటుంబ సభ్యులు రోదించారు. -
తెలంగాణ సరిహద్దు వద్ద ప్రత్యేక చెక్‌పోస్ట్.. ఎందుకంటే?
జహీరాబాద్: పశువులకు వ్యాపిస్తున్న ముద్ద చర్మపు వ్యాధి తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా ముందు జ్రాగత్తగా అధికారులు కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని మాడ్గి శివారులో రాష్ట్ర సరిహద్దు వద్ద 65వ జాతీయ రహదారిపై ఆదివారం ప్రత్యేక చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. కలెక్టర్ శరత్ ఉత్తర్వులతో పోలీస్, పశు సంవర్థక, రవాణా శాఖల అధికారులు చెక్‌పోస్టు వద్ద సంయుక్తంగా పశువుల తనిఖీ నిర్వహిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి పశువులతో వస్తున్న వాహనాలను పరిశీలిస్తున్నారు. వ్యాధి లేనట్లు నిర్ధారణకు వచ్చాకే పశువులను రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. ఆదివారం గేదెలు, మేకలతో ఉన్న వాహనాలు 15 వచ్చాయని, వ్యాధులు ఉన్న పశువులు ఏవీ రాలేదని అధికారులు పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: నాడు కల్లోలం.. నేడు ప్రశాంతం) -
తెలంగాణలో గ్రూప్–4 నోటిఫికేషన్‌పై మంత్రి హరీష్‌రావు క్లారిటీ
సాక్షిప్రతినిధి,సంగారెడ్డి/సదాశివపేట: వారం రోజుల్లో 28 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తా మని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు. కొద్ది రోజుల్లోనే గ్రూప్–4 నోటిఫికేషన్ కూడా వస్తుందని తెలిపారు. గురువారం ఆయన సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పను లకు శంకుస్థాపనలు చేశారు. కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులను లబ్ధిదా రులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి, సదాశివపేట, కంకోల్లలో జరిగిన సమావేశాల్లో హరీశ్‌రావు మాట్లా డుతూ, నిరుపేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథ కాలను వివరించారు. మరో పక్క బీజేపీపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో రూ.2,016 ఆసరా పింఛన్ ఇస్తుంటే, పక్కనే ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటకలో కేవలం రూ.600 ఇస్తున్నార న్నారు. పొరుగునే ఉన్న బీదర్ (కర్ణాటక) వెళ్లి ఈ విషయాన్ని పరిశీలించాలని ప్రజ లకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.75 మాత్రమే పింఛన్ ఇచ్చేవారని, లబ్ధిదారులెవరైనా చనిపోతే.. వారి స్థానంలో మాత్రమే కొత్త లబ్ధిదారు లకు పింఛన్లు మంజూరయ్యేవని గుర్తు చేశారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు కావడం లేదనే విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఉచితాలు వద్దంటున్న కేంద్రం మాటలపై హరీశ్‌రావు స్పందిస్తూ, పేద లకు సంక్షేమ పథకాలు అమలు చేయ వద్దని చెబుతున్నారా..? అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. దసరా నుంచి రూ.3 లక్షలు.. ఇంటి స్థలం ఉన్న పేదవారికి ఇంటి నిర్మా ణంకోసం రూ.3 లక్షలు ఇచ్చే పథకాన్ని దసరా నుంచి ప్రారంభిస్తామని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఈ కార్య క్రమాల్లో జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, ఎమ్మెల్యే క్రాంతికిరణ్ తదితరులు పాల్గొ న్నారు. కాగా, మంత్రి హరీశ్‌రావు పాల్గొన్న సదాశివపేట సభలో కోలుబావి ప్రాంతానికి చెందిన వడ్డె శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక్కసారిగా వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే అతడిని అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎందుకు కిరోసిన్ పోసుకున్నావని విలేకరులు ప్రశ్నిం చగా, ఎన్కెపల్లి రోడ్డులో గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఎకరా ఐదు గుంటల భూమిని అధికారులు తిరిగి తీసుకున్నా రన్నారు. అందులో గోదాం నిర్మించారని, ఇన్నాళ్లూ వేచిచూసినా ఎవరూ పరిహారం గురించి పట్టించుకోకపోవడంతో ఆత్మహ త్యాయత్నం చేసినట్లు తెలిపాడు. -
కన్నపేగును తెంచుకుని..
కల్హేర్(నారాయణఖేడ్): కుటుంబానికి భారంగా మారొద్దని భావించిన అంధురాలైన ఓ తల్లి, దివ్యాంగుడైన కొడుకు బలవన్మర ణానికి పాల్పడ్డారు. ఈ హృదయ విదారక ఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మాసాన్‌పల్లి చౌరస్తాలో ఆదివారం చోటుచేసుకుంది. మాసాన్‌పల్లికి చెందిన కమ్మరి గంగామణి(55), చంద్రయ్య దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. గంగామణి అంధురాలు కాగా, కొడుకు సంగమేశ్వర్(35) శారీరక వైకల్యంతో బాధపడుతున్నాడు. ఆమె కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతోంది. కొడుకుతోపాటు తన ఆరోగ్యం కూడా సరిగ్గా లేకపోవడంతో కుటుంబానికి భారంగా మారామని మథనపడుతోంది. ఈ నేపథ్యంలో జీవితంపై విరక్తి చెంది కొడుకుతోసహా బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయించుకుంది. ఇటీవల చంద్రయ్య కొత్తగా నిర్మించిన ఇంటి ఆవరణలోని సంపులోకి సంగమేశ్వర్‌ను తోసేసింది. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్నాక ఆమె కూడా అందులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని కల్హేర్ ఎస్ఐ ప్రశాంత్‌కుమార్ తెలిపారు. -
గురుకులంలో ఫుడ్ పాయిజన్
నారాయణఖేడ్: కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం వండిన పప్పు మిగలడంతో శుక్రవారం ఉదయం వేడిచేసి విద్యార్థులకు వడ్డించారు. దీంతో అది తిన్న కొద్దిసేపటికే విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. అస్వస్థతకు గురైన పిల్లలకు ఓఆర్ఎస్ పాకెట్లు తాగించారు. కాగా నిత్యం అన్నం పలుకుగానే ఉంటుందని, సరిగా ఉడకడం లేదని విద్యార్థులు వాపోయారు. మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని.. రోజూ అన్నం, పప్పు, సాంబారునే వడ్డించడంతో తినలేకపోతున్నామని పేర్కొన్నారు. ఇదే విషయమై గురుకులం వార్డెన్ ఎల్లంను వివరణ కోరగా, గురువారం సాయంత్రం వండిన పప్పు ఉదయం బాగుందని చెబితేనే వడ్డించామన్నారు. విద్యార్థుల్లో కొందరు మాత్రమే అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ దశరథ్‌సింగ్ గురుకులాన్ని సందర్శించి అస్వస్థతకు గురైన విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
ఆజాది కా గౌరవ్ యాత్రకు కాంగ్రెస్ శ్రీకారం
-
నువ్వొస్తేనే నేనెళ్తా.. హామీ ఇచ్చేవరకు కదిలేదే లేదు!
తెలంగాణలో విద్యార్థులను బడులకు రప్పించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే బతిమాలి మరీ పిల్లలను పాఠశాలలకు తీసుకువస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం డీఈవో, సంగారెడ్డి జిల్లాలో ఓ ప్రధానోపాధ్యాయుడు వినూత్నంగా స్పందించి విద్యార్థులను బడికి రప్పించారు. నువ్వొస్తేనే నేనెళ్తా: డీఈవో జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖర శర్మ గురువారం జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులు ఎక్కువ మంది రాకపోవడాన్ని ఆయన గమనించారు. దీంతో విద్యార్థుల చిరునామాలు తీసుకుని వారి ఇళ్లకు వెళ్లారు. విద్యార్థి పాలెపు జశ్వంత్ మరికొద్ది రోజుల తర్వాత వస్తానని చెప్పగా.. ఈరోజే రావాలంటూ శర్మ అక్కడే బైఠాయించారు. చివరకు ఒప్పించి విద్యార్థిని తీసుకెళ్లి పాఠశాలలో దిగబెట్టారు. కదిలేదే లేదు: హెచ్ఎం పుల్కల్ (అందోల్): బడి మానేసిన పిల్లలను తిరిగి బడికి పంపిస్తామని తల్లిదండ్రులు హామీ ఇచ్చేవరకు కదిలేది లేదంటూ సంగారెడ్డి జిల్లా ముదిమాణిక్యం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్‌రావు వినూత్న ప్రచారం చేస్తున్నారు. మొండికేసిన, బడి మానేసిన పిల్లల్ని పాఠశాలకు పంపాలంటూ బుధవారం గ్రామంలో కొందరి ఇళ్ల ముందు నేలపై పడుకున్నారు. రెండు రోజుల్లో బడి మానేసిన నలుగురు విద్యార్థులను పాఠశాలలో చేర్పించడంలో ఆయన సఫలీకృతులయ్యారు. (క్లిక్: కుమార్తెను ప్రభుత్వ బడిలో చేర్పించిన జూనియర్ సివిల్ జడ్జి) -
జరిమానా వేశారని బండినే తగలబెట్టాడు
జోగిపేట (ఆందోల్): ద్విచక్ర వాహనానికి ఇన్సూరెన్స్ లేదని పోలీసులు ఫైన్ వేసినందుకు తన బైకునే తగలబెట్టుకున్నాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన శనివారం సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం అన్నా సాగర్ కట్టపై జరిగింది. జోగిపేట పోలీసులు అన్నాసాగర్ కట్టపై వాహనాల తనిఖీ చేపట్టారు. వాహ నాలకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించి జరిమానా వేస్తున్నారు. జోగిపేట వైపు వెళ్తున్న బైక్‌ను ఆపి డాక్యుమెంట్లు తనిఖీ చేసి ఇన్సూరెన్స్ లేకపోవడంతో పోలీసులు రూ.1,100 ఫైన్ వేశారు. రశీదు తీసుకున్న వాహనదారుడు అక్కడే 2, 3 సార్లు చక్కర్లు కొట్టి కట్టపై కల్వర్టు వద్ద బైక్ (స్లె్పండర్)ను నిలిపి పెట్రోల్ పైపును బయటకు తీసి వాహనానికి నిప్పంటించాడు. అక్కడే ఉన్న పోలీసులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం వాహనదారుడిని పోలీసు వాహనంలో స్టేషన్‌కు తరలించారు. అతన్ని చౌటకూరు మండలం శివ్వంపేట గ్రామానికి చెందిన పాండుగా గుర్తించారు. -
వంటపని చేస్తున్న గురుకుల విద్యార్థి.. సాంబారు పడి తీవ్రగాయాలు
పుల్కల్(అందోల్): సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి ఒంటిపై సాంబారు పడటంతో తీవ్రగాయాలపాలైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుల్కల్ గ్రామానికి చెందిన మైసనగారి ప్రణయ్ సింగూరు గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 15న ఉదయం క్యాంటీన్‌లోంచి సాంబారును డైనింగ్ హాల్లోకి తీసుకురావడానికి ప్రణయ్ సహకారాన్ని వంటమనిషి కోరాడు. సాంబరు గిన్నె తీసుకెళ్తుండగా వేడివేడి సాంబారు ప్రమాదవశాత్తు ప్రణయ్ రెండు చేతులు, కాళ్లపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రిన్సిపాల్ బాలస్వామి వెంటనే ప్రణయ్ కుటుంబసభ్యులకు సమాచారమందించి అతడిని సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వాస్తవానికి గురుకులంలో నలుగురు వంటమనుషులు ఉండాలి. కానీ, ఒక్కరే ఉండటంతో రోజూ సీనియర్ విద్యార్థులను సహాయకులుగా వాడుకుంటున్నారని విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థులతో పనులు చేయించుకుంటున్న సింగూరు గురుకుల ప్రిన్సిపాల్, కేర్ టేకర్‌పై చర్యలు తీసుకోవాలని స్వేరోస్ నాయకులు డిమాండ్ చేశారు. -
పిల్లల చేతిలో పేలిన ఎయిర్‌గన్
జిన్నారం(పటాన్చెరు): ఎయిర్‌గన్ నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలను బలిగొంది. పొట్టకూటి కోసం వలస వచ్చిన కుటుంబంలో విషాదం నింపింది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామంలోని ఓ ఫాంహౌస్‌లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నా యి. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం మోతె గ్రామానికి చెందిన నాగరాజు, సుకన్యలు వావిలాలలోని ఓ ఫాంహౌస్‌లో వ్యవసాయ పనులు చేసేందుకు మూడునెలల క్రితం వలస వచ్చారు. వీరికి నాలుగేళ్ల కుమార్తె సాన్వి, రెండేళ్ల కుమారుడు ప్రేమ్కుమార్లు ఉన్నారు. ఫాంహౌస్‌లో వివిధ రకాల పంటలను సాగు చేస్తుండటంతో కోతులు, పక్షులను చెదరగొట్టేందుకు ఎయిర్‌గన్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే ఇప్పటివరకు నాగరాజు దానిని ఉపయోగించలేదు. అందులో గుండ్లు ఉన్న విషయం కూడా అతనికి తెలియదు. సాన్వి, ప్రేమ్కుమార్లు గన్‌తో ఆడుకుంటుండగా ఒక్కసారిగా పేలింది. ఎదురుగా ఉన్న సాన్వి కణతలోకి గుండు గుచ్చుకుపోయి రక్తస్రావంతో కింద పడిపోయింది. హుటాహుటిన సాన్విని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాన్వి బుధవారం ఉదయం మృతి చెందింది. వైద్యులు పోలీసులకు సమాచారాన్ని అందించటంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఎయిర్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని డీఎస్పీ భీంరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాఖపూర్ గ్రామంలోనూ ప్రాక్టీస్ చేస్తుండగా ఎయిర్‌గన్ పేలి ఐదు నెలల క్రితం ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. -
బంగారు తెలంగాణ చేసుకున్నం.. ఇక బంగారు భారతం చేద్దాం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేసుకున్న మాదిరిగానే దేశాన్ని కూడా బంగారు భారతదేశంగా మార్చుకుందామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. అమెరికా కంటే గొప్పగా మన దేశాన్ని తయారు చేసుకునే విధంగా ముందుకు వెళ్దామని అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో నిర్మించతలపెట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ‘మనం అమెరికాకు వెళ్లడం కాదు, ఇతర దేశాల ప్రజలే మన దేశం వీసాలు తీసుకొని వచ్చే గొప్ప సంపద, వనరులు, యువశక్తి మనకున్నాయి. రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర షోషించాలి. రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ఢిల్లీ వరకు కొట్లాడతా. నేను జాతీయ రాజకీయాల్లో పనిచేస్తున్నా.. పోదా మా? జాతీయ రాజకీయాల్లోకి వెళ్దామా..? ఢిల్లీ వరకు కొట్లాడుదామా..? దేశాన్ని బాగు చేసుకుందామా..?’అని కేసీఆర్ ప్రజలను ప్రశ్నిం చారు. దీంతో ‘కొట్లాడదాం..కొట్లాడదాం’అంటూ సభికులు ప్రతిస్పందించారు. ‘ఎక్కడైనా శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి.. మతం పేరు తో ఘర్షణలు పడితే పెట్టుబడులు రావు. దీనిపై గ్రామాల్లో చర్చించాలి. అన్ని వర్గాలు, కులాలు, మతాలు బాగుండాలి..’అని సీఎం ఆకాంక్షించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు ‘తెలంగాణలో రైతులు చనిపోతే దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బీమా అమలు చేస్తున్నాం. ఎలాంటి లంచం ఇవ్వకుండానే రైతులకు రైతుబంధు అందుతోంది. ఠంచనుగా వారి ఖాతాల్లో పడుతోంది. రూ.రెండు వేలు పింఛన్లు ఇవ్వడంతో తెలంగాణాలోని వృద్ధులకు గౌరవం పెరిగింది. కల్యాణలక్ష్మి, విదేశీ విద్యకు రూ.20 లక్షలు స్కాలర్షిప్లు ఇస్తున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే. రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమతో 15 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. జహీరాబాద్ నిమ్జ్‌లో ఉద్యోగాలు రానున్నాయి..’అని కేసీఆర్ తెలిపారు. మన పథకాల కోసం మహారాష్ట్ర ప్రజల ఒత్తిడి రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను మహరాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మెచ్చుకున్నారని సీఎం చెప్పారు. తెలంగాణ సరిహద్దుల్లోని మహారాష్ట్ర ప్రజలు ఈ పథకాలను తమకు కూడా అమలు చేయాల్సిందిగా తమపై ఒత్తిడి తెస్తున్నారని ఠాక్రే తెలిపినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాగా తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని ఎద్దేవా చేసిన వారే ఇప్పుడు చీకట్లో ఉంటున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నది ఒక్క తెలంగాణలోనే అని చెప్పారు. రెండోసారి ప్రజలు దీవించడంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. బహిరంగ సభలో ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి (నారాయణఖేడ్), చంటి క్రాంతికిరణ్ (అందోల్), మాణిక్‌రావు (జహీరాబాద్), మదన్‌రెడ్డి (నర్సాపూర్), పద్మా దేవేందర్‌రెడ్డి (మెదక్), గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్చెరు) తదితరులు పాల్గొన్నారు. చిమ్నీబాయి అనే ఓ గిరిజన మహిళను సీఎం కేసీఆర్ వేదికపైకి పిలిపించుకొని కాసేపు ముచ్చటించారు. చిమ్నీబాయిది సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం సర్దార్ తండా. గతంలో నారాయణఖేడ్ ఉప ఎన్నిక సందర్భంగా తాను ఆ తండాకు వెళ్లిన సందర్భంలో.. గ్రామంలోని సమస్యలను ఆమె వివరించిన విషయాన్ని మంత్రి హరీశ్ తన ప్రసంగంలో తెలిపారు. ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా గ్రామానికి తాగునీరు వస్తోందని, రోడ్డు సౌకర్యం కూడా కల్పించామని చెప్పారు. ఈ నేపథ్యంలో చిమ్నీబాయిని వేదికపైకి ఆహ్వానించిన కేసీఆర్, ఆ గ్రామం బాగోగులపై కాసేపు ముచ్చటించారు. -
సంగారెడ్డికి గోదారమ్మ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాకు సాగు నీరు అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు రూపుదిద్దుకోబోతున్నాయి. సముద్రమట్టానికి ఎత్తై న ప్రాంతంలో ఉండే నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి నియోజకవర్గాలకు గోదావరి జలాలను తరలించాలనే ఇక్కడి రైతుల ఎన్నో ఏళ్ల కళ సాకారమవబోతోంది. ఈ రెండు ఎత్తిపోతల పనులకు సీఎం కేసీఆర్ సోమవారం భూమి పూజ చేయనున్నారు. తర్వాత నారాయణఖేడ్ శివారులో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. మల్లన్నసాగర్ నుంచి 12 టీఎంసీలు తరలించి.. సంగమేశ్వర, బసవేశ్వర పథకాలకు రాష్ట్రం రూ.4,427 కోట్లు ఖర్చు చేయనుంది. వీటి నిర్మాణం పూర్తయితే జిల్లాలోని 4 నియోజకవర్గాల పరిధిలో 3.84 లక్షల ఎకరాలు సాగులోకి రానున్నాయి. మొత్తం 397 గ్రామాలకు చెందిన రైతులు లబ్ధి పొందనున్నారు. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన కొమురవెల్లి మల్లన్నసాగర్ జలాశయం నుంచి సుమారు 12 టీఎంసీల నీటిని సింగూరు జలాశయానికి తరలిస్తారు. అక్కడి నుంచి లిఫ్టుల ద్వారా ఆయకట్టుకు మళ్లించేలా ఈ పథకాలను డిజైన్ చేశారు. రెండు ఎత్తిపోతల పథకాలకు కలిపి 5 పంప్‌హౌజ్‌లను నిర్మించనున్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి నీటి పారుదల శాఖ ఇప్పటికే టెండరు ప్రక్రియను పూర్తి చేయగా మెగా కంపెనీ పనులు దక్కించుకుంది. సంగారెడ్డి సస్యశ్యామలం: హరీశ్ నారాయణఖేడ్: సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న రెండు ఎత్తిపోతల పథకాలు సంగారెడ్డి జిల్లాకు వరప్రదాయనిగా మారనున్నాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సోమవారం నారాయణఖేడ్‌లో జరగనున్న సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ రమణకుమార్, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో కలసి ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఈ ప్రాంత అభివృద్ధికోసం రూ.4,500 కోట్లతో రూ.3.89 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టులను మంజూరు చేశారన్నారు. ఈ ప్రాజెక్టులతో జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లోని 19 మండలాల్లో 406 గ్రామాల రైతులకు లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితమే ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టామని, సర్వే పనులు పూర్తయ్యేందుకు ఏడాది పట్టిందని తెలిపారు. -
నన్ను అంతం చేసే కుట్ర ఎమ్మెల్యే రాజాసింగ్
కల్హేర్(నారాయణఖేడ్): ధర్మం కోసం పని చేస్తున్న తనను అంతం చేసేందుకు కొన్నిశక్తులు కుట్ర చేస్తున్నాయని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం గరిడెగాంలో ఆదివారంనాడు శివాజీ మహరాజ్ విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తన నోరు మూయించాలని చూస్తే.. వంద మంది రాజాసింగ్‌లు పుట్టుకొస్తారన్నారు. కొందరు విదేశాల నుంచి డబ్బు పంపి మతమార్పిడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మహారాష్ట్రలోని దెగ్లూర్‌కు చెందిన చంద్రశేఖర్ మహరాజ్, మాజీ ఎమ్మెల్యేలు విజయపాల్‌రెడ్డి, గంగారం, బీజేపీ రాష్ట్ర నాయకులు ఆలె భాస్కర్ పాల్గొన్నారు. -
గొంతుకు చున్నీ బిగించి..
జహీరాబాద్: సంగారెడ్డి జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థిని హత్యకు గురైంది. జహీరాబాద్ మండలంలోని హుగ్గెల్లి గ్రామానికి దగ్గర్లో మామిడి తోటలో సోమవారం మధ్యాహ్నం ఓ బాలిక మృతదేహాన్ని చూసిన గ్రామస్తులు పోలీ సులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. గొంతుకు చున్నీ బిగించి బాలికను హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. హుగ్గెల్లికి చెందిన బుజ్జమ్మ భర్త 15 ఏళ్ల కిందట చనిపోయాడు. దీంతో కూలీ పనులు చేస్తూ కొడుకు సురేశ్, కుమార్తె మౌనిక (16)ను పోషిస్తోంది. మౌనిక జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఈసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో ఆదివారం తల్లి డ్వాక్రా గ్రూపు సమావేశానికి వెళ్లి రాత్రి 11.30 గంటలకు ఇంటికి చేరింది. కుమార్తె మరో గదిలో పడుకొని ఉంటుందని తల్లి భావించి నిద్రపోయింది. ఉదయం కుమార్తె కనిపించకపోవడంతో గ్రామంలో విచారించింది. మధ్యాహ్నం గ్రామ శివారులో మృతదేహం ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్లి చూసి అది మౌనిక మృతదేహమేనని బోరున విలపించింది. సర్పంచ్ రాజు ఫిర్యాదు మేరకు డీఎస్పీ శంకర్రాజు, సీఐ రాజశేఖర్ సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జహీరాబాద్ ప్రభుత్వా స్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. -
తల ఓ చోట.. మొండెం మరో చోట
పటాన్చెరు టౌన్: ఓ యువకుడిని దారుణంగా హత్య చేసి తల, మొండెంను వేర్వేరు చోట్ల పడేసిన సంఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. హైదరాబాద్ శివారులోని రామచంద్రాపురం వెలిమెల తండాకు చెందిన కేడావత్ రాజు నాయక్ (32) దారుణ హత్యకు గురయ్యాడు. రాయికోడ్ మండలం కుస్నూర్ శివారులోని వాగు వద్ద తల, న్యాల్కల్ మండలం రాఘవాపూర్ గ్రామ శివారులోని మంజీరా బ్రిడ్జి పరిసరాల్లో మొం డెం గుర్తించారు. పటాన్చెరు డీఎస్పీ భీం నాయ క్ కేసును పరిశోధిస్తున్నారు. రాజునాయక్ తల, మొండెం భాగాలను పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇంద్రకరణ్ స్టేషన్ పరిధిలోనే హత్య! రాజునాయక్‌ను కంది మండల పరిధిలోని ఇంద్రకరణ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోనే హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు. రాజునాయక్ ఈ నెల 25న రాత్రి ఓ ఫోన్ కాల్ వస్తే ఇంటి నుంచి కారులో బయటికెళ్లాడు. అదే రాత్రి రాజునాయక్ అదృశ్యంపై అతని సోదరుడు గోపాల్ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. రామచంద్రాపురం మండలం వెలిమెల తండాకు చెందిన మృతుడు కేడవత్ రాజునాయక్ (32) ఎర్ర మట్టి వ్యాపారం చేస్తుంటాడు. ఆయన టీఆర్ఎస్ మండల ఎస్టీ విభాగం అధ్యక్షునిగా కూడా పని చేస్తున్నాడు. 32 గుంటల భూమి వివాదమే రాజునాయక్ హత్యకు కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ సందర్భంగా ఏడుగురిని అదుపులో తీసుకున్నట్టు సమాచారం. నిందితుల్లో మృతుని తమ్ముడు గోపాల్ నాయక్ కూడా ఉన్నాడు. భూ వివాదానికి కారణమైన రాంసింగ్ నాయక్‌తో పాటు గ్రామానికి చెందిన మహేష్, బాలు, మల్లేష్‌లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. -
ఔటర్‌రింగు రోడ్డుపై దుర్ఘటన.. మొక్కలకు నీరు పడుతుండగా..
జిన్నారం (పటాన్చెరు): మొక్కలకు నీరు పడుతున్న ఇద్దరు కార్మికులను కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. గురువారం సంగారెడ్డి జిల్లా బొల్లారం సమీపంలో ఔటర్‌రింగు రోడ్డుపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హత్నూర మండలం వడ్డెపల్లి గ్రామానికి చెందిన కంటిగారి సత్తయ్య (50) జీహెచ్ఎంసీలో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా తడ్వాయ్ గ్రామానికి చెందిన పాపల నవీన్ (19) లారీ ట్యాంకర్ క్లీనర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వీరిద్దరూ రోజులాగే జిన్నారం మండలంలోని బొల్లారం సమీపంలో ఓఆర్ఆర్పై మొక్కలకు ట్యాంకర్లో తీసుకువచ్చిన నీళ్లు పోస్తున్నారు. అదే సమయంలో రామచంద్రాపురానికి చెందిన మహేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి కారులో వేగంగా వస్తూ మొక్కలకు నీళ్లు పోస్తున్న నవీన్, సత్తయ్యలను ఢీకొట్టాడు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కారు అదుపు తప్పి ట్యాంకర్‌నూ ఢీ కొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో మహేశ్వర్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను పటాన్చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ ప్రశాంత్ చెప్పారు. -
‘మిల్లెటు’ బండెక్కి వచ్చేత్తమూ..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఆహారమే ఔషధం.. ఇది ఆయుర్వేదానికి సంబంధించిన ఒక నానుడి. ఔషధం లాంటి ఆహారాన్ని ‘ఔరా’అనిపించే విధంగా ఓ బువ్వబండి అందిస్తోంది. ‘తింటే గారెలే తినాలి..’అంటారు కదా! ఈ బువ్వబండిని చూస్తే, ‘తింటే.. చిరుధాన్యాల బువ్వే తినాలి’అని అనిపిస్తుంది. సామల అన్నం, నోరూరించే టమాటా పచ్చడి, పసందైన ఆకుకూర పప్పు, గంజి సూప్.. ఇది బువ్వబండి మెనూ. ఇది గుడ్‌ఫుడ్ మాత్రమేకాదు, హెల్దీ ఫుడ్ కూడా. సంపూర్ణ ఆరోగ్యాన్ని పంచే చిరుధాన్యాల ప్రాధాన్యం తెలియజేసేందుకు ప్రతిరోజూ ఉచితంగా మిల్లెట్ భోజనాన్ని వడ్డిస్తున్నారు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌కు చెందిన కొల్లూరు సత్తయ్య, అమృతమ్మ దంపతులు. సామలు, అరికెలు, కొర్రలు, అండుకొర్రలు, ఊదలు వంటి చిరుధాన్యాలతో ఆహారం అందిస్తున్నారు. ఇందుకోసం ఆయన ‘బువ్వబండి’ని తయారుచేశారు. ఈ బువ్వబండిని రోజూ ఉద యం 8.30 నుంచి 10.30 గంటల వరకు తెల్లాపూర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉంచుతారు. వందలాది మంది నిరుపేదలు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఈ బండి వద్ద ‘చిరు’బు వ్వ తింటారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. రోజూ రూ.4 వేలు.. ఐదు రకాల చిరుధాన్యాలు ఒక్కో రకం చిరుధాన్యం భోజనం ఐదు రోజుల చొప్పున వడ్డిస్తుంటారు. ఈ చిరుధాన్యాలను మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతం నుంచి కొనుగోలు చేస్తున్నారు. రోజూ 25 కిలోల చిరుధాన్యంతో చేసిన భోజనం వడ్డిస్తున్నారు. ఈ మిల్లెట్ భోజనంలో రోజూ ఒక రోటి పచ్చడి కూడా ఉంటుంది. టమాటా, పుంటికూర (గోంగూర), మెంతికూర, కొత్తిమీర వంటి వాటితో రోటిపచ్చడి వడ్డిస్తున్నారు. ఈ ఆహారంలో ఆకుకూర పప్పు కూడా ఉంటుంది. ఒక్కో ఆకుకూర ఒక్కోరోజు అందిస్తున్నారు. వీటితోపాటు గంజి సూప్ ఇస్తున్నారు. ఈ బువ్వబండిని సత్తయ్య 2021 నవంబర్‌లో ప్రారంభించారు. సత్తయ్య కుటుంబసభ్యులు ఉదయం 5 గంటలకే లేచి ఈ బువ్వబండి పనులు మొదలుపెడుతుంటారు. బువ్వబండి నిర్వహణ కోసం ప్రతిరోజూ కనీసం రూ.4 వేల ఖర్చు అవుతోందని సత్తయ్య పేర్కొంటున్నారు. -
కోటి హోం ఐసోలేషన్ కిట్లు.. రెండు కోట్ల టెస్టింగ్ కిట్లు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోందని ఆ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. కోటి హోం ఐసోలేషన్ కిట్ల(ఎనిమిది రకాల మందుల)ను పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఎంతమందికైనా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు రెండు కోట్ల కరోనా టెస్టింగ్ కిట్లు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. మంగళవారం జరిగిన సంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హరీశ్‌రావు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ ఫస్ట్‌వేవ్‌లో కరోనా కేసుల సంఖ్య తారాస్థాయికి చేరడానికి 8 నెలలు పడితే, రెండో వేవ్‌లో నాలుగు నెలలే సమయం పట్టిందని, ఈ థర్డ్ వేవ్‌లో రెండు నెలల్లోనే కేసులు భారీ స్థాయికి చేరుతాయని వైద్యనిఫుణులు అంచనా వేస్తున్నారని వివరించారు. అరవై ఏళ్లు దాటినవారికి బూస్టర్ డోసు ఇచ్చే ప్రక్రియను ఈ నెల 10 నుంచి ప్రారంభిస్తామని మంత్రి హరీశ్ ప్రకటించారు. మాతాశిశు మరణాల రేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని పేర్కొన్నారు. దశలవారీగా సబ్సెంటర్లలో వైద్యులను నియమించి పల్లె దవాఖానాలుగా మార్చుతామన్నారు. బంగారు తెలంగాణలో ఆరోగ్య తెలంగాణ ఒక భాగమని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 66 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా, అందులో 44మంది వ్యాక్సిన్ వేసుకోనివారేనని తెలిపారు. జగ్గారెడ్డి వచ్చారు.. వేదికపై కుర్చీ వేయండి.. రాజకీయ ప్రత్యర్థులుగా పేరున్న మంత్రి హరీశ్‌రా వు, సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిల మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. జెడ్పీ సమావేశం కొనసాగుతుండగా జగ్గారెడ్డి సమావేశం హాలులోకి రాగా.. ‘‘ఎమ్మెల్యే వచ్చారు.. వేదికపై కుర్చీ వేయండి’’అని హరీశ్‌రావు అన్నారు. అభివృద్ధి పనులు ప్రారంభ కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని హరీశ్‌రావుకు జగ్గారెడ్డి వినతిపత్రం అందజేశారు. ఏఎన్ఎంల పట్ల మంత్రి అసహనం.. ఉద్యోగుల కేటాయింపుల్లో తమను ఇతర జోన్లోకి మార్చారని, న్యాయం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ ఏఎన్ఎంలు మంత్రి హరీశ్‌కు వినతిపత్రం అందజేయగా ఆయన తీవ్ర అసహనానికి లోనయ్యారు. వారి ముందే వినతిపత్రాన్ని చింపివేశారు. -
రాయితీలు.. ఇంకా రాలే..
►సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు గోమతి కాటన్ ఇండస్ట్రీస్ ఆరేళ్ల క్రితం కార్యకలాపాలు ప్రారంభించింది. పెట్టుబడి రాయితీ ఇవ్వాలని దరఖాస్తు చేసుకోగా రూ.10 కోట్లు విడుదల చేయాలని రాష్ట్రస్థాయి కమిటీ సిఫారసు చేసింది. అయినా నేటికీ నయాపైసా విడుదల కాలేదు. ►కామారెడ్డి జిల్లా లింగంపేటకు చెందిన మన్నె జానకి 2017లో ఉపాధి కోసం జేసీబీ యంత్రాన్ని కొనుగోలు చేశారు. ఎస్సీ, ఎస్టీల రాయితీలకు ఉద్దేశించిన ‘టీ ప్రైడ్’కింద రూ.6.91 లక్షలు సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సబ్సిడీ ఇవ్వాలని 2018 అక్టోబర్‌లో కమిటీ సిఫారసు చేసింది. అయినా డబ్బులు బ్యాంకు ఖాతాలో జమకాలేదు. సబ్సిడీ అందకపోవడంతో అప్పులపై వడ్డీ భారం పెరుగుతోందని ఆమె ఆవేదన చెందుతున్నారు. ►సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన రేండ్లపల్లి కాంతమ్మ వాహనం కొనుగోలు కోసం దరఖాస్తు చేసుకోగా 2018లో యూనిట్ మంజూరైంది. రుణం కోసం బ్యాంకును ఆశ్రయించగా, పరిశ్రమల శాఖ నుంచి పెట్టుబడి సబ్సిడీ విడుదలైతేనే రుణం మంజూరు చేస్తామని షరతు విధించింది. అటు బ్యాంకు, ఇటు పరిశ్రమల శాఖ తీరుతో తనకు ఉపాధి లేకుండా పోయిందని కాంతమ్మ వాపోతున్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబ డులతో వచ్చే వారికి ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు, ప్రోత్సాహకాలు అందడం లేదు. ఏళ్ల తరబడి వేచిచూస్తున్నా.. పరిశ్రమల యాజమాన్యాలు దరఖాస్తులు చేసుకుంటున్నా విడుదల కావడం లేదు. గత నవంబర్ వరకు రాష్ట్రంలో 43 వేలకుపైగా యూనిట్లకు రూ.3,389.95 కోట్లు రాయితీలు పెండింగ్‌లో ఉన్నాయి. దీనిపై రాష్ట్రస్థాయి కమిటీ ఇప్పటివరకు 72 పర్యాయాలు ప్రభుత్వానికి తీర్మానాలు చేసి పంపినా ఫలితం శూన్యమే. నవంబర్ 30న జరిగిన 72వ రాష్ట్రస్థాయి కమిటీ సమావేశం 369 యూనిట్లకు సంబంధించి మరో రూ.47.67 కోట్లు విడుదల చేయాలని ప్రతిపాదించింది. జనరల్ కేటగిరీలో 2016–17 నుంచి, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో 2018–19 నుంచి రాయితీలు పెండిం గులో ఉన్నాయి. కరోనాతో కార్యకలాపాలు దెబ్బతినడంతో ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఊరటనిస్తాయ ని పారిశ్రామికవర్గాలు భావించాయి. దీనికితోడు బ్యాంకు రుణాలపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మారటోరియం కూడా అమలుకాకపోవడంతో ఇటు రుణాలపై వడ్డీ, అటు ప్రోత్సాహకాలు అందక యాజమాన్యాలు సతమతమవుతున్నాయి. ఊరటనివ్వని ‘టీ ఐడియా’, ‘టీ ప్రైడ్’ పరిశ్రమల శాఖ లెక్కల ప్రకారం 2014–15 నుంచి ఇప్పటివరకు రూ.26.46 లక్షల కోట్ల పెట్టుబడులతో 18వేలకు పైగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. వీటి ద్వారా 21 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని లెక్కలుగట్టారు. పెట్టుబడులతో వచ్చే వారికి ప్రోత్సాహకాలిచ్చేందుకు ప్రభుత్వం 2014లో ‘టీ ఐడియా’, ‘టీప్రైడ్’పేరిట మార్గదర్శకాలు రూపొందించింది. జనరల్ కేటగిరీకి టీ ఐడియా ద్వారా, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు ‘టీ ప్రైడ్’ద్వారా ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది. వీటికింద రాయితీ, స్టాంప్ డ్యూటీ, సేల్స్ టాక్స్, భూమి ధర, విద్యుత్ బిల్లులు, పావలావడ్డీ తదిరాలకు సంబంధించి రాయితీలు, ప్రోత్సాహకాలు అందాల్సి ఉంది. ఇదిలాఉంటే సీనియారిటీ ప్రకారం బకాయిలు విడుదల కావాల్సి ఉండగా, సిఫారసు లేఖలు తెచ్చిన 24 మెగా కంపెనీలకు గత నవంబర్‌లో రూ.250 కోట్లు విడుదలైనట్లు సమాచారం. బడ్జెట్లో కేటాయించినా..! రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లోని వేలాది మంది పారిశ్రామికవేత్తలకు రూ.3,389 కోట్ల రాయితీలు, ప్రోత్సాహకాలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం వార్షిక బడ్జెట్ 2021–22లో పారిశ్రామిక రంగానికి రూ.3,077 కోట్లను ప్రతిపాదించి, అందులో రూ.2,500 కోట్లు రాయితీలు, ప్రోత్సాహకాలకే కేటాయించినప్పటికీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. అంతకుముందు బడ్జెట్లో రాయితీల బకాయిలు చెల్లించేందుకు 1,500 కోట్లు కేటాయించినా అరకొర చెల్లింపులే జరిగాయి. ఇప్పటివరకు రూ.100 కోట్లు మాత్రమే విడుదలైనట్లు పరిశ్రమల శాఖ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఆశలు ఆవిరై చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉసూరుమంటున్నాయి. -
జహీరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం దిడిగి గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. జహీరాబాద్-బీదర్ రహదారిపై అదుపు తప్పి పల్టీలు కొడుతూ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు సహా 8నెలల చిన్నారి, కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. బైక్ పైన ప్రయాణిస్తున్న భార్యాభర్తలు, చిన్నారి అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లి చెందిన బాలరాజు(28), శ్రావణి(22), అమ్ములు( 8నెలలు)గా పోలీసులు గుర్తించారు.కారులో ప్రయాణిస్తూ మృతి చెందిన వ్యక్తి వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పట్లూర్‌కు చెందిన మొహమ్మద్ ఫరీద్(25)గా గుర్తించారు. మృతదేహలు జహీరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. -
ఫరీదుద్దీన్‌కు కన్నీటి వీడ్కోలు
జహీరాబాద్ టౌన్/ఝరాసంగం (జహీరాబాద్): అజాత శత్రువుగా పేరుగాంచిన మాజీ మంత్రి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ ఫరీదుద్దీన్‌కు జనం కన్నీటి వీడ్కోలు పలికారు. సంగారెడ్డి జిల్లాలోని ఆయన స్వగ్రామమైన హోతి(బి) శ్మశానవాటిలో గురువారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గుండెపోటుతో కన్నుమూసిన ఫరీదుద్దీన్ పార్థివ దేహాన్ని రాత్రి ఆయన స్వగ్రామం హోతి (బి)కి తీసుకొచ్చారు. గ్రామస్తు ల సందర్శనార్థం గురువారం ఉదయం 10 గంట ల వరకు ఇంటివద్దనే ఉంచారు. తర్వాత ఆయన పార్థివ దేహాన్ని జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియానికి తీసుకువచ్చారు. కడసారి చూపుకోసం పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చా రు. అనంతరం ప్రత్యేక వాహనంలో ఆయన పార్థి వ దేహాన్ని ఉంచి ఊరేగింపుగా ఈద్గా మైదానం వద్దకు తీసుకెళ్లారు. పార్థనల తర్వాత హోతి(బి)లో సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలను పూర్తి చేశారు. పోలీసులు గౌరవ వందనం చేసి గాలిలో కాల్పులు జరిపారు. మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, ఎంపీ బీబీపాటిల్ పలువురు ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలు పొల్గొన్నారు. పార్టీకి తీరని లోటు: మంత్రి కేటీఆర్ మంచి మనిషి ఫరీదుద్దీన్ అకాల మరణం టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫరీదుద్దీన్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన తర్వాత మంత్రి మాట్లాడుతూ ఆయన మరణ వార్త వినగానే సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారన్నారు. ముఖ్యమంత్రికి స్వల్ప అనారోగ్యం వల్ల జహీరాబాద్‌కు రాలేకపోయారన్నారు. -
ఆధునిక యుద్ధ ట్యాంకులను పరీక్షించిన ఓడీఎఫ్
కొండాపూర్(సంగారెడ్డి): సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ చెరువులో శనివారం రెండు యుద్ధ ట్యాంకుల ట్రయల్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓడీఎఫ్ పరిశ్రమ అధికారులు మాట్లాడుతూ దేశంలో ఇలాంటి ట్యాం కులను చెన్నై, మెదక్‌లోని ఓడీఎఫ్‌లో మాత్రమే తయారు చేస్తారన్నారు. ఒక్కో ట్యాంక్‌లో పది మంది కూర్చునేందుకు వీలుంటుందని తెలిపారు. ఈ యుద్ధ ట్యాంక్‌కు కేవలం పగలు మాత్రమే కాకుండా రాత్రి వేళల్లోనూ ప్రయాణించే సామర్థ్యం ఉంటుందని, నీటితో పాటు బురద, నేలపై దూసుకుపోతుందని పేర్కొన్నారు. శత్రువులపై దాడి చేసే సమయంలో పెద్దపెద్ద సరస్సులను దాటేందుకు అనువుగా ఈ యుద్ధ ట్యాంకులను తయారు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్ బ్రిగేడియర్ నేవిబుట్ట, జాయింట్ కంట్రోలర్ శరవణన్, డిప్యూటీ కంట్రోలర్ బాలషణ్ముగం తదితరులు పాల్గొన్నారు. -
తనకంటే ముందే తనువు చాలించాలని..
సాక్షి, రాయికోడ్(అందోల్): తన భాగస్వామికన్నా ముందే తనువు చాలించాలనుకున్న ఓ వృద్ధురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె అంత్యక్రియలు ముగిసి 24 గంటలు గడవకముందే భర్త అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ విషాధ సంఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం శంశోద్దీన్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శంశోద్దీన్‌పూర్ సర్పంచ్ బి.నర్సింలు పెద్దనాన్న మల్లయ్యకు వారం క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆస్పత్రికి తరలించారు. చదవండి: (భార్యను భరించలేను.. విడాకులు కావాల్సిందే: సాఫ్ట్వేర్ ఇంజనీర్) భర్త అనారోగ్యాన్ని చూసి తట్టుకోలేక భార్య లక్ష్మమ్మ(75)భర్త కంటే ముందే తనువు చాలించాలని గురువారం పురుగులమందు తాగింది. వెంటనే బీదర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ అదే రాత్రి 9.30 గంటలకు మృతి చెందింది. శుక్రవారం సాయంత్రం ఆమె అంత్యక్రియలు పూర్తికాగా రాత్రి 10 గంటల ప్రాంతంలో అనారోగ్యంతో ఉన్న లక్ష్మమ్మ భర్త మల్లయ్య(80) మృతి చెందాడు. వృద్ధ దంపతులిద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. లక్ష్మమ్మ అంత్యక్రియలు చేసి వెళ్లిన బంధువులు శనివారం సాయంత్రం మల్లయ్య అంత్యక్రియలు జరిపారు. చదవండి: (భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే..) -
మరో 25 మంది విద్యార్థినులకు అస్వస్థత
పటాన్చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగిలోని మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల విద్యాలయం కరోనా కలకలం నుంచి తేరుకోక ముందే మరో 25 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు లోనైన ముగ్గురిని చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 48 మంది ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్ టెస్టులో నెగెటివ్ వచ్చిన విద్యార్థినుల్లో మంగళవారం 25 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థ తకు లోనయ్యారు. సమాచారం తెలుసుకున్న వైద్యాధికారులు వారికి చికిత్స చేశారు. వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించాలని డాక్టర్లు సూచించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ఓ డాక్టర్, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని ఉన్నతాధికారులు చెప్పారు. కరోనా సోకిన విద్యార్థినుల ఇంటిబాట కరోనా బారిన పడిన విద్యార్థినులను గురుకులంలో ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స చేయిస్తున్న విషయం తెలిసిందే. అయితే 47 మంది విద్యార్థినుల్లో కొందరిని వారి తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లారు. -
48 మందికి కరోనా పాజిటివ్
పటాన్చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ముత్తంగి గ్రామంలో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల విద్యాలయంలో ఇంటర్, టెన్త్ చదివే 47 మంది విద్యార్థినులు, ఒక ఉపాధ్యాయురాలు కరోనా బారిన పడ్డారు. వీరందరినీ గురుకులంలోని ‘ఎ’బ్లాక్‌లో ఐసోలేషన్ గది ఏర్పాటు చేసి అందులో ఉంచారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభమైన సంగతి తెలిసిందే. కేసుల సంఖ్య తగ్గడంతో గురుకులాలు తెరిచేందుకూ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో అంతా స్కూళ్లు, కళాశాలలు, వసతి గృహాలకు చేరుకున్నారు. ఈ క్రమంలో ముత్తంగి గురుకులంలో పదోతరగతి చదువుతున్న ఓ విద్యార్థిని జ్వరం బారిన పడింది. తల్లిదండ్రులు శనివారం ఆమెను తీసుకెళ్లి కరోనా టెస్ట్ చేయించగా పాజిటివ్ తేలింది. దీంతో వారు గురుకుల టీచర్లకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన సిబ్బంది గురుకులంలో 470 మంది విద్యార్థినులు ఉండగా.. ఆదివారం 261 మంది విద్యార్థినులు, సిబ్బందికి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు జరిపించారు. పరీక్షల్లో 37 మంది పదో తరగతి విద్యార్థినులు, ఐదుగురు ఇంటర్ విద్యార్థినులు, ఒక ఉపాధ్యాయురాలు మొత్తం 43 మందికి పాజిటివ్ తేలింది. సమాచారం తెలుసుకున్న జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి గాయత్రీదేవి, ఆర్డీఓ నాగేష్, పటాన్చెరు తహసీల్దార్ మహిపాల్ గురుకులాన్ని సందర్శించి కోవిడ్ బారిన పడిన విద్యార్థినులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. సోమవారం మిగిలిన 209 మంది విద్యార్థినులకు జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో టెస్టులు నిర్వహించగా, మరో ఐదుగురు ఇంటర్ విద్యార్థినులకు కూడా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో కరోనా బారిన పడిన విద్యార్థినుల సంఖ్య 47కు చేరింది. -
తుక్కు కింద కుక్కి
సంగారెడ్డి అర్బన్: అనుమానం రాకుండా ఇనుప తుక్కు లోడ్ కింద రహస్యంగా గంజాయిని తరలిస్తున్న ముఠా గుట్టురట్టయింది. హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వైపు వెళుతున్న ఓ లారీని సంగారెడ్డి రూరల్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు కలసి సోమవారం ఉదయం 6 గంటల సమయంలో కంది చౌరస్తాలో తనిఖీ చేయగా గుట్టుగా గంజాయిని తరలిస్తున్న విషయాన్ని గుర్తించారు. లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి ఆరు క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రధాన సూత్రదారి పరారీలో ఉన్నాడు. సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా మాలెగావ్ గ్రామానికి చెందిన అనిల్ గోవింద్ చిరు వ్యాపారంతో పాటు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన గణేశ్ నందకిషోర్ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరికి సంగారెడ్డి జిల్లాలోని ఎంకేపల్లి వాసి అనిల్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో వీరంతా ముఠాగా ఏర్పడ్డారు. ఈ క్రమంలో గంజాయిని మహారాష్ట్రలోని పండరీపూర్‌కి తరలిస్తే రూ.50 వేలు ఇస్తానని అనిల్‌రెడ్డి చెప్పడంతో మిగతా ఇద్దరు ఏపీలోని తుని వద్ద ప్లాస్టిక్ సంచుల్లో ఆరు క్వింటాళ్ల గంజాయిని ఇనుప స్క్రాప్ కింద లారీలో లోడ్ చేశారు. అక్కడినుంచి బయలుదేరి హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వైపు వెళ్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు లారీని పట్టుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ మార్కెట్లో సుమారు రూ.60 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను కోర్టు ముందు హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. ప్రధాన సూత్రధారి అనిల్‌రెడ్డి పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడిని పట్టుకుంటామని చెప్పారు. -
వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయల సాగు.. లక్షల్లో ఆదాయం
వరి నాటేసేటప్పుడు కూలీల కొరత.. పాలుపోసుకునే దశలో చీడపీడల బెడద.. కోసేటప్పుడు హార్వెస్టర్ చార్జీల మోత.. చేతికందే సమయంలో అకాల వర్షాలు.. అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాల్లో అష్టకష్టాలు.. ఇకపై యాసంగిలో ధాన్యం కొనబోమని తేల్చి చెబుతున్న ప్రభుత్వాలు.. ఈ పరిస్థితులను అధిగమించేందుకు వరి సాగు చేస్తున్న పలువురు రైతులు ఇప్పటికే లాభాలనిచ్చే ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లడమే కాకుండా మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులు కూరగాయల సాగుకు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉండడంతో అమ్మడం కూడా సులభంగా ఉంటోంది. ఉమ్మడి జిల్లాలో కూరగాయల పంటలతో లాభాలు ఆర్జిస్తున్న రైతుల విజయగాథపై ప్రత్యేక కథనం.. ఆలు సాగుతో ఆదర్శంగా.. ఆలుగడ్డ పంట సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు సల్లోల్ల నారాయణరెడ్డి. సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం మండలం కుప్పనగర్‌కు చెందిన ఈ రైతు తనకున్న మూడు ఎకరాలతో పాటు, మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని మొత్తం తొమ్మిది ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. ఎకరానికి 40 నుంచి 50 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. 3నెలల్లో పంట చేతికి.. ఏటా దసరా పండగకు కాస్త అటూఇటుగా రైతులు ఆలుగడ్డ పంట వేసుకుంటారు. ప్రస్తుతం ఈ పంట పూత దశలో ఉంది. మూడు నెలల్లో ఈ పంట పూర్తిస్థాయిలో చేతికందుతుంది. కొందరు రైతులు 65 నుంచి 70 రోజుల్లోనే తవ్వుకుంటారు. మూడు నెలల వరకు ఆగితే ఎక్కువ దిగుబడి వస్తుంది. ఏటా జనవరిలో ఆలుగడ్డ తవ్వకాలు ప్రారంభమవుతాయి. బోయిన్పల్లి మార్కెట్లో విక్రయం రైతులు ఎక్కువగా ఈ పంటను హైదరాబాద్ మార్కెట్‌కు తరలిస్తారు. బోయిన్పల్లి మార్కెట్లో విక్రయిస్తుంటారు. హోల్‌సేల్ మార్కెట్లో ఆలుగడ్డకు క్వింటాల్‌కు కనీసం రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు ధర ఉంటుంది. ప్రస్తుతం ఆలుగడ్డకు రూ.రెండు వేల వరకు ధర పలుకుతోంది. మార్కెట్లో ధర బాగుంటే సాగు వ్యయం పోగా, ఎకరానికి సగటున రూ.40 వేల వరకు చేతికందుతుందని రైతులు పేర్కొంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో సుమారు 3,200 ఎకరాల్లో ఆలుగడ్డ పంట సాగవుతోందని ఉద్యానవన శాఖాధికారులు చెబుతున్నారు. నాలుగేళ్లుగా సాగు చేస్తున్నా వరితో లాభంలేదని చెరకు వేసిన.. అడవిపందుల బెడదతో అదీ మానుకున్నా.. నాలుగేళ్లుగా ఆలుగడ్డ సాగుచేస్తున్నా. మార్కెట్లో రేటు బాగుంటే లాభాలు మంచిగుంటయి. గతేడాది ఆలుగడ్డ ధర కొంత తక్కువగా ఉండే. అంతకు ముందు మంచి ధర వచ్చింది. – సల్లోల్ల నారాయణరెడ్డి, ఆలుగడ్డ రైతు గెర్కిన్.. కాసుల పంట గెర్కిన్ పంట సాగు కాసుల వర్షం కురిపిస్తోంది. దోసకాయల మాదిరిగా ఉండే ఈ పంట.. మనకు కొత్త. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఇప్పగూడెనికి చెందిన రైతు కె.యాదవరెడ్డి ఈ పంట సాగుచేస్తూ లాభాలను గడిస్తున్నారు. అంతకుముందు వరి, ఇతర పంటలు వేసిన ఆయన అప్పుల పాలై.. వ్యవసాయ శాఖ ప్రోత్సాహంతో 1.2 ఎకరాల్లో గెర్కిన్ పంట వేశారు. వ్యవసాయ శాఖ గ్లోబల్ గ్రీన్ కంపెనీ సహకారంతో గెర్కిన్ విత్తనాలను ఇప్పించింది. గెర్కిన్ కాయలు పంట కాలం 75 రోజులు. పంట కాలం ముగిసే నాటికి 23 కోతలతో కాయలను తెంచాల్సి ఉంటుంది. గ్లోబల్ గ్రీన్ కంపెనీ వారే నేరుగా రైతుల దగ్గరి నుంచి కోనుగోలుచేసి వారికి డబ్బులను బ్యాంక్ ఖాతాలో జమచేస్తున్నారు. యాదవరెడ్డి మొత్తం 1.2 ఎకరాల విస్తీర్ణంలో వేసిన గెర్కిన్ కాయలను విక్రయించగా రూ.2,33,926 వచ్చాయి. పంట ప్రారంభం నుంచి కోసే వరకు పెట్టుబడి రూ.85,500 వరకు అయ్యింది. రైతుకు ఖర్చులన్నీ పోను రూ.1,48,426 నికర ఆదాయం వచ్చింది. ఈ పంటను యాసంగిలో సాగు చేసు కోవచ్చని అధికారులు చెబుతున్నారు. గెర్కిన్ కాయలు చూసేందుకు కీరాదోసకాయల్లా ఉంటాయి. వీటిని ఇతర దేశాల్లో స్నాక్స్‌గా అధికంగా వినియోగిస్తుం డడంతో విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం మనదగ్గర ఇవి వినియోగంలో లేవు. లాభాలు కురిపిస్తున్న కూరగాయల సాగు కూరగాయల సాగు ఎప్పుడూ లాభదాయకమే. అందులోనూ ఆధునిక పద్ధతిలో సాగు చేస్తే మంచి లాభాలు సొంతం చేసుకోవచ్చు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మమ్మద్నగర్కు చెందిన మహిపాల్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి అన్నదమ్ములు.. తమకున్న ఐదెకరాలతో పాటు మరో 13 ఎకరాలు కౌలుకు తీసుకుని గతంలో వరి సాగుచేసే వారు. పంట చేతికొచ్చేదంతా దైవాధీనంగా మారడంతో 18 ఎకరాల్లో బీర, కాకర, టమాట పంటల సాగు ప్రారంభించారు. పదెకరాల్లో బీర సాగును పందిరి, డ్రిప్, మల్చింగ్ పద్ధతిలో సాగుచేస్తున్నారు. పందిరి ఒకసారి ఏర్పాటుచేస్తే 20 ఏళ్ల వరకు ఉంటుందన్నారు. అలాగే కాకర పంటను 4 ఎకరాల్లో సాగు చేశారు. మరో 4 ఎకరాలలో 15 రోజుల క్రితమే టమాట వేశారు. బీర, కాకర సాగు ఖర్చులు ►బీర సాగుకు ఎకరాకు రూ.లక్ష ఖర్చు ఉంటుంది. ►నాలుగు నెలల్లో బీర ఎకరాకు 20 నుంచి 22 టన్నుల దిగుబడి వస్తుంది. ►మార్కెట్లో హాల్‌సేల్ ధర కిలోకు ప్రస్తుతం రూ.25 నుంచి రూ.30 పలుకుతోంది. దీంతో ఎకరాకు రూ. 4 లక్షల ఆదాయం వస్తోంది. ►పెట్టుబడి రూ.లక్ష పోను ఎకరంలో నాలుగు నెలల కాలంలో రూ.3 లక్షల ఆదాయం మిగులుతుందని చెబుతున్నారు. ►ఇక కాకరకు ఎకరానికి పెట్టుబడి రూ. 50 వేలు ఖర్చు కాగా పెట్టుబడిపోను రూ.60వేల నుంచి 70 వేలు మిగులుతుంది. ఏడాదికి 3 పంటలు వస్తాయి. -
ఆ జైలు భలే భలే.. అడిగినప్పుడల్లా వీడియో కాల్.. కోరినప్పుడల్లా..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కోరినప్పుడల్లా బిర్యానీ.. ప్రత్యేక మెనూతో భోజనాలు.. అడిగిన వెంటనే వీడియోకాల్.. బోర్ కొడితే ఆసుపత్రిలో హెల్త్ చెకప్ పేరుతో బయట షికార్లు.. సంగారెడ్డి జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న కొందరు ఖరీదైన ఖైదీలకు అందుతున్న రాజభోగాలివి.. ఈ సౌకర్యాలు కల్పించినందుకు జైలులో కొందరు అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ముడుపుల పంపకాల్లో తేడాలు రావడంతో ఇద్దరు అధికారులు పరస్పరం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ వ్యవహరంపై ఇటీవల అంతర్గత విచారణ చేపట్టిన జైళ్లశాఖ డీఐజీ మురళీబాబు ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. ఈ నివేదిక మేరకు త్వరలో సంబంధిత అధికారులపై చర్యలుండే అవకాశాలున్నట్లు ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. చదవండి: ఎంతటి విషాదం.. స్కూటీపై వెళుతుండగానే గుండెపోటు.. అక్కడికక్కడే ♦వరంగల్ జైలు ఎత్తివేయడం, ఇటీవల కాలంలో ఎన్డీపీఎస్ కేసులు పెరిగిపోవడంతో రాష్ట్రంలో వివిధ జైళ్లలో రిమాండ్ ఖైదీల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో చర్లపల్లి, కూకట్పల్లి జైలు నుంచి కొందరు రిమాండ్ ఖైదీలను సంగారెడ్డి జైలుకు తరలిస్తున్నారు. దీంతో ఈ జైలు రిమాండ్ ఖైదీలతో కిక్కిరిసిపోయింది. ♦సుమారు 300 మంది నుంచి 350 వరకు ఖైదీల సామర్థ్యం కలిగిన ఈ జైలులో ప్రస్తుతం 600 పైగా ఖైదీలున్నారు.హైదరాబాద్ పరిధిలో వివిధ కేసుల్లో రిమాండ్ తరలించిన ఖరీదైన ఖైదీల తాకిడి పెరిగింది. ♦ఇది ఇక్కడి జైలు అధికారులకు వరంగా మారింది. వారికి నిబంధనలకు విరుద్ధంగా సకల సౌకర్యాలు కల్పిస్తూ పెద్ద మొత్తంలో ముడుపులు దండుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ♦ఇటీవల కూకట్‌పల్లికి చెందిన ఓ రియల్టర్ రిమాండ్ నిమిత్తం ఈ జైలుకు తలిస్తే జైలులోకి కొందరు అధికారులు రియల్టర్ రిమాండ్ ఖైదీకి సకల సౌకర్యాలు కల్పించారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ♦ఓ పారిశ్రామికవేత్త హత్యకేసులో నిందితులను కూడా ఈ జైలుకే రిమాండ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. ఖరీదైన ఈ నిందితులకు కూడా రాజభోగాలు కల్పించి పెద్ద మొత్తంలో దండుకున్నారనే విమర్శలున్నాయి. జైలు నుంచే మొరం తవ్వకాలు ♦ఈ జైలు ఆవరణ నుంచి పెద్ద మొత్తంలో మొరం అక్రమ తవ్వకాలు జరిగాయి. భద్రతా సిబ్బంది కాపలా కాసే గోడకు అత్యంత సమీపంలోని జైలు స్థలం నుంచి భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టినా ఈ జైలు ఉన్నతాధికారులు కిమ్మనలేదు. ♦ఈ వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో మొక్కుబడిగా స్థానిక పోలీసులకు జైలు అధికారులు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు ఆ కేసు ఊసేలేదు. సంబంధిత అధికారిపై కనీస చర్యలు లేవు. అంతర్గత విచారణ ♦అక్రమాలకు నిలయంగా మారిన సంగారెడ్డి జైలులో జరుగుతున్న వ్యవహారాలపై ఆశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీంతో ఆశాఖ డీఐజీ ఇటీవల అంతర్గత విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ♦ఈ అంతర్గత విచారణ తూతూ మంత్రంగా సాగిందా, జైలులో జరుగుతున్న అక్రమాలపై విచారణ పకడ్బందీగా జరిగిందా అనేది ఆశాఖ తదుపరి చర్యలబట్టి స్పష్టమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నివేదిక ఇచ్చాం సాధారణ తనిఖీల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా జైలును ఇటీవల ఆకస్మిక తనిఖీ చేశాం. ఇద్దరు అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. విచారణ చేపట్టి, ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చాం. నిబంధనల మేరకు జైలు క్యాంటీన్లో బిర్యానీ ఇస్తారు. వీడియోకాల్, హెల్త్ చెకప్‌లు ఉంటాయి. నిబంధనలు అతిక్రమించి ఈ సౌకర్యాలు కల్పించినట్లు మా దృష్టికైతే రాలేదు. – మురళీబాబు, జైళ్లశాఖ డీఐజీ -
కోహ్లీ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు: వైరల్ కావడంతో ఆత్మహత్యకు ప్లాన్!
Hyderabad Engineer Ramnagesh Akubathini Who Arrested For Rape Threats To Virat Kohli's Daughter సాక్షి, హైదరాబాద్: కోహ్లీ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టయిన సంగారెడ్డి వాసి రాంనగేష్ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడని కేసు దర్యాప్తు చేస్తున్న ముంబైలోని వెస్ట్ రీజియన్ సైబర్‌క్రైమ్ పోలీసులు గుర్తించారు. నగేష్ వ్యాఖ్యలపై కేసు నమోదైన తర్వాత అనేకమంది అతడి ట్విట్టర్ హ్యాండిల్‌ను వదిలివెళ్లారని చెప్తున్నారు. అప్పటివరకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వాళ్లు కూడా హఠాత్తుగా తప్పుకున్నారని వివరిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రకరణ్ పోలీసుస్టేషన్ పరిధిలో ఉండే శ్రీనివాస్.. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఫిట్టర్‌గా పని చేస్తున్నారు. ఈయన కుమారుడైన రాంనగేష్ హైదరాబాద్ ఐఐటీ నుంచి సాఫ్ట్వేర్ విద్యనభ్యసించాడు. బెంగళూర్ కేంద్రంగా పని చేసే ఓ ఫుడ్ డెలివరీ సంస్థల్లో ఉద్యోగం చేసిన నగేష్.. ఎంఎస్ కోసం విదేశాలకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తన ట్విట్టర్ హ్యాండిల్ (@criccrazyygir) ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై దర్యాప్తు చేసిన ముంబై పోలీసులు గత మంగళవారం రాత్రి సంగారెడ్డికి వచ్చి నగేష్‌ను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. విచారణలో భాగంగా నగేష్ ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు అతడు ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు గుర్తించారు. దీనికోసం గూగుల్‌లో వివిధ విధానాలను పరిశీలించాడు. అయితే తల్లిదండ్రులపై ఉన్న ప్రేమ కారణంగా ఈ నిర్ణయాన్ని మార్చుకున్నాడని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ముంబై చేరుకున్న రాంనగేష్ తండ్రి అతడి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. (చదవండి: బ్యాంక్ ఉద్యోగి: భార్య వేధిస్తోంది.. చనిపోతున్నా.. ) -
ప్రారంభించకుండానే.. గృహప్రవేశాలు
జోగిపేట(అందోల్): డ్రా పద్ధతిలో డబుల్బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేశారు. మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా సామూహిక గృహప్రవేశాలు చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో ఎంపికలో అవకతవకలు జరిగాయని ప్రచారం. అయితే జాబితా మారుతుందన్న అనుమానంతో అనధికారికంగా కేటాయించిన ఇళ్లలోకి లబ్ధిదారులు చేరిపోయారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం డాకూర్‌లో చోటుచేసుకుంది. డాకూరులో రూ.5.65 కోట్లతో 104 డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించారు. ఈ నెల 6న లబ్ధిదారుల సమక్షంలో డ్రా పద్ధతిలో నంబర్లుసహా ఇళ్లను కేటాయించారు. 10న మంత్రి హరీశ్ సమక్షంలో ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. పలు కారణాల వల్ల ఆ కార్యక్రమం రద్దయింది. అదే సమయంలో లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని పత్రికలు, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అధికారుల రీ సర్వేతో జాబితా మారుతుందన్న ఆందోళనలో ఆయా లబ్ధిదారులు పెట్టె, బేడ సదరుకొని కేటాయించిన ఇళ్లలోకి పరుగులు తీశారు. 2, 3 రోజులుగా వారంతా గృహ ప్రవేశాలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు అవాక్కయ్యారు. ఇప్పుడు ఇళ్లను ప్రారంచేది ఎలా అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
24 లక్షల ప్యాకేజీ.. ఛీ ఇలాంటి పని చేశావ్!
చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది కదా అని ఏది బడితే అది టైప్ చేయకండి. ముఖ్యంగా సోషల్ మీడియాను ఫాలో అవుతున్నవారు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి. మారు పేర్లు, నకిలీ ఖాతాలతో విద్వేషపు రాతలు రాసేసి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేసి తప్పించుకోవచ్చు అనుకుంటే తప్పులో కాలేసినట్టే. తాజాగా ఆకుబత్తిని రామ్‌నగేష్ అనే యువకుడు ఇలాంటి నేరంలోనే పోలీసులకు చిక్కాడు. సంగారెడ్డి జిల్లాకు చెందిన 23 ఏళ్ల రామ్‌నగేష్ బెంగళూరు చెందిన ఓ ఫుడ్ డెలివరీ యాప్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భార్య అనుష్కశర్మతో పాటు తొమ్మిది నెలల కుమార్తె వామికానూ ఉద్దేశించి ట్విటర్లో అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణతో ముంబై పోలీసులు రామ్‌నగేష్‌ను అరెస్ట్ చేశారు. టీ–20 ప్రపంచ కప్ భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడంతో అతడు వివాదాస్పద ట్వీట్ చేశాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఢిల్లీ ఉమెన్ కమిషన్ సైతం తీవ్రంగా పరిగణించింది. ఈ ట్వీట్‌పై కేసు నమోదు చేసుకున్న ముంబై సైబర్ క్రైమ్ పశ్చిమ విభాగం పోలీసులు సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలోని ఓడీఎఫ్ క్వార్టర్స్‌లో రామ్‌నగేష్ పట్టుకున్నారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 354(ఏ), 506, 67(బీ) కింద అభియోగాలు మోపారు. మారు పేరుతో ట్విటర్ ఖాతా... రాంనగేశ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో కొత్తగా ట్విట్టర్ ఖాతా తెరిచాడు. అది పాకిస్థాన్‌కు చెందిన ఖాతాగా నమ్మించేందుకు మార్పు చేర్పులు చేశాడు. ‘గప్పిస్తాన్ రేడియో’పేరుతో ఉన్న ట్విటర్ హేండిల్ ద్వారా కోహ్లిని బెదిరిస్తూ అక్టోబర్ 24న వివాదాస్పద ట్వీట్ చేశాడు. దీంతో స్పందించిన ఢిల్లీ పోలీసులు, ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం రామ్‌నగేశ్ పనే అని తేల్చారు. మంగళవారం రాత్రి సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రకరణ్ పోలీసుస్టేషన్‌కు వచ్చిన ముంబై పోలీసులు దీనిపై సమాచారం ఇచ్చి రామ్‌నగేశ్‌ను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు ఐఐటీ- హైదరాబాద్ రెండేళ్ల క్రితం గ్రాడ్యుయేషన్ చేసిన రామ్‌నగేశ్ ఏడాదికి రూ.24 లక్షల ప్యాకేజీతో జాబ్ చేశాడు. అమెరికా వెళ్లాలన్న ఉద్దేశంతో నెల క్రితమే ఉద్యోగం మానేశాడు. క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే తన కుమారుడు ఇలాంటి హేయమైన వ్యాఖ్యలు చేయడం పట్ల రామ్‌నగేశ్ తండ్రి శ్రీనివాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదని వాపోయారు. చదువులో టాపర్ అయిన రామ్‌నగేశ్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సన్నిహితులు తెలిపారు. కావాలని చేయలేదు.. అయితే రామ్‌నగేశ్ ఇదంతా కావాలని చేయలేదని పొరపాటున జరిగిందని శ్రీనివాస్ స్నేహితుడు కృష్ణమూర్తి తెలిపారు. ‘భారత్ మ్యాచ్ ఓడిపోయిందన్న బాధలో రాంనగేశ్ ఈ మెసేజ్ టైప్ చేశాడు. దీన్ని ట్వీట్ చేయాలని అతడు అనుకోలేదు. అదే సమయంలో ఫోన్ అతడి చేతిలో నుంచి జారిపడిపోయింది. జరిగిన నష్టాన్ని నివారించేందుకు అతడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అప్పటికే ఆ మెసేజ్ వైరల్ అయింది. ఆ రోజు నుంచి రామ్‌నగేశ్ భయంగా రోజులు గడిపాడు. పోలీసులు వచ్చి అరెస్ట్ చేసే వరకు కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియదు’అని కృష్ణమూర్తి వివరించారు. నకిలీ ఖాతాలతో ట్రోలింగ్ ఫేక్ ప్రొఫైల్స్‌తో సోషల్ మీడియాలో తాము ఏం చేసినా ఎవరూ పట్టుకోలేరన్న భ్రమలు సరికాదని ముంబై సైబర్ క్రైమ్ విభాగం డీసీపీ డాక్టర్ రష్మి కరాండికర్ అన్నారు. ఇలాంటి వారి ఆట కట్టించేందుకు అవసరమైన సాంకేతికత తమ దగ్గర ఉందని తెలిపారు. అనేక నకిలీ ఖాతాలతో రామ్‌నగేశ్ ట్రోలింగ్ చేసినట్టు గుర్తించామన్నారు. క్రిక్‌క్రేజీగర్ల్, రమన్‌హీస్ట్, పెళ్లకూతురుహియర్ ట్విటర్ హేండిల్స్ ద్వారా ట్రోలింగ్‌కు పాల్పడినట్టు తేల్చారు. -
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ
పటాన్‌చెరుటౌన్(హైదరాబాద్): ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని ఆదివారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. పటాన్చెరు నుంచి ఆదివారం తెల్లవారుజామున సికింద్రాబాద్‌కు బయల్దేరిన బస్సు బస్టాండ్ నుంచి బయటకు వచ్చి యూటర్న్ తీసుకుంటున్న సమయంలో హైదరాబాద్‌లో చెరకు అన్లోడ్ చేసి కంకోల్ వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ వెంకటరమణ, కండక్టర్ పద్మావతితో సహా ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. లారీలో చెరకు అన్లోడ్ చేసేందుకు వచ్చిన మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడ్నుంచి పరారయ్యాడు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న భెల్ డిపో మేనేజర్ సత్యనారాయణ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సందర్శించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. -
ఒక్కసారి అధికారం ఇవ్వండి
జోగిపేట/వట్పల్లి(అందోల్): టీఆర్ఎస్తో కలిసే పార్టీ కాదు.. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించే పార్టీ బీజేపీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చేరుకున్న సందర్భంగా హనుమాన్ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ.. జోగినాథస్వామి ఆశీస్సులతో సీఎం గడీల కోటను బద్ధలుకొట్టాలని పిలుపునిచ్చారు. ఫామ్‌హౌస్, ప్రగతిభవన్ తప్ప.. రాష్టంలో పాలన పడకేసిందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రజలు బీజేపీకి పట్టంకడితే.. పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేంద్రం రాష్ట్రానికి 3 లక్షల ఇళ్లను కేటాయిస్తే.. కేసీఆర్ ఇప్పటికి ఇచ్చింది 12వేలేనని మండిపడ్డారు. ముఖ్యమంత్రి దళితబంధుకు నిధులను ఎక్కడి నుంచి ఇస్తాడో స్పష్టం చేయాలన్నారు. ధనిక రాష్ట్రమని చెప్పిన సీఎం.. రూ.4 లక్షల కోట్లు అప్పులు చేశాడని ఆరోపించారు. అంబేడ్కర్‌ను అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో బీజేపీ గెలుస్తుందని, రాష్ట్రంలో టీఆర్ఎస్ పవర్‌కట్ చేస్తామని చెప్పారు. ఢిల్లీకి పోయి వంగి, వంగి దండాలు పెట్టి వచ్చిన కేసీఆర్.. పోయి ఫౌంహౌస్‌లో పడుకున్నాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అవినీతి పాలనను అంతం చేయడానికే సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ వర్గీయ అన్నారు. టీఆర్ఎస్ వచ్చాక యువతకు ఉద్యోగాలు వచ్చాయా? నిరుద్యోగ భృతి వచ్చిందా? అని ప్రశ్నించారు. -
వరదలతో ప్రజలు అల్లాడుతుంటే పట్టించుకోరా!
జోగిపేట (అందోల్): రాష్ట్రవ్యాప్తంగా భారీ వరదల కారణంగా ప్రజలు అల్లాడుతుంటే పట్టించుకోకుండా సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. బుధవారం ప్రజా సంగ్రామ యాత్ర సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలోని శివ్వంపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వరదలతో పంటలు నష్టపోతే రాష్ట్రంలో ఏడేళ్లలో ఏఒక్క రైతును ఆదుకున్న దాఖలాలు లేవన్నారు. రైతులకిచ్చిన హామీలు నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, సీఎం కేసీఆర్ మీద అన్ని వర్గాల ప్రజలు కోపంతో ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో పంటలు పండించి కోట్లు సంపాదిస్తుంటే 50 ఎకరాలున్న రైతులు అప్పుల పాలవుతున్నారన్నారు. రైతులను సన్నరకం వడ్లు పండించాలని చెబుతూ కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్‌లో దొడ్డు రకం పండిస్తున్నారని ధ్వజమెత్తారు. వరదల్లో నష్టపోయిన రైతలకు పరిహారం చెల్లించాలన్నారు. యువతకు ఇంటికో ఉద్యోగం అని చెప్పి మోసం చేశారని, జర్నలిస్టులకు ఇళ్లు ఇస్తానని చెప్పి ఎక్కడా ఇవ్వలేదని అన్నారు. పండుగలకు పర్మిషన్ కావాలా? హిందువులు పండుగ చేసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి కావాలా? అని బండి సంజయ్ ప్రశ్నిం చారు. హిందువులు పండుగలు చేసుకోవాలంటే పోలీసుల అనుమతి కావాలనడం దుర్మార్గమని మండిపడ్డారు. వినాయక చవితి పండుగకు ఆంక్ష లు పెట్టొద్దని డీజీపీని హెచ్చరించారు. డ్రగ్స్ వాడుతున్న టీఆర్ఎస్ లీడర్లు టీఆర్ఎస్ పార్టీలోని ముఖ్య నాయకులు చాలా మంది మాదక ద్రవ్యాలు వాడుతున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారికి రక్త పరీక్షలు చేయిస్తామని బండి సంజయ్ అన్నారు. హుజురాబాద్ ప్రచారానికి అమిత్‌షా... శుక్రవారం వినాయక చవితి పండుగ సందర్భంగా, 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బహిరంగసభ సందర్భంగా రెండురోజుల పాటు పాదయాత్రకు బండి సంజయ్ విరామం పాటించనున్నారు. అక్టోబర్ 2న బాసరలో తొలివిడత పాదయాత్రను ముగించాలని తొలుత భావించినా, ఈ నెల 17న అమిత్‌షా సభ నేపథ్యంలో హుజురాబాద్ వైపు దానిని మార్చాలని భావిస్తున్నారు. -
నేను చనిపోలేదు మహాప్రభో..
సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి: బతికుండగానే తనకు మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేశారని సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశీపూర్‌కు చెందిన 74 ఏళ్ల షాపురం పండరిగౌడ్ గురువారం అదనపు కలెక్టర్ రాజర్షిషాను కలసి ఫిర్యాదు చేశారు. పంచాయతీ అధికారులు తనను మనస్తాపానికి గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పింఛన్‌ను ప్రతినెలా తీసుకుంటున్నానని, రేషన్‌షాపుల్లో కూడా ప్రతినెలా నిత్యావసరాలను తీసుకుంటున్నానని పేర్కొన్నారు. తన ఆస్తికి సంబంధించి రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లగా ఈ విషయం బయటపడిందని తెలిపారు. 2010 అక్టోబర్ 11న పంచాయతీ అధికారులు తన మరణ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసినట్లు తేలిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటానని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌మోహన్ ‘సాక్షి’తో తెలిపారు. -
ఆర్థిక ఇబ్బందులతో..
పటాన్చెరు టౌన్: సమయానికి డబ్బులు చేతికందకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తిచెందిన ఓ మహిళ.. ఐదేళ్ల కుమార్తెతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. పటాన్చెరు పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం దోవుర్ గ్రామానికి చెందిన రాజు పటాన్చెరు శాంతినగర్‌లో ఉంటూ ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. రాజు సోదరి వింధ్య (30)భర్త ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకోగా, అప్పటినుంచి ఐదేళ్ల కూతురు గ్లోరితో కలసి పటాన్‌చెరులోని రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటూ ఓ మెడికల్ కళాశాలలో నర్సుగా పని చేస్తోంది. బుధవారం వింధ్య, తన భర్తకు సంబంధించిన డబ్బుల విషయంలో నారాయణఖేడ్ వెళ్దామని శాంతినగర్‌లో ఉండే సోదరుడు రాజు ఇంటికి వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత డబ్బులు అప్పుడే రావడం లేదని తెలుసుకొని, సోదరుడికి చెప్పి వెళ్లిపోయింది. అలా వెళ్లిన వింధ్య.. కూతురు గ్లోరిని తీసుకుని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేశారు. తల్లీకూతుళ్ల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందని వింధ్య సోదరుడు రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
తెలంగాణలో ఉద్యోగాలు.. అప్లై చేయండి ఇలా
డబ్ల్యూడీసీడబ్ల్యూ పటాన్చెరువు అంగన్వాడీల్లో 32 ఖాళీలు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సంగారెడ్డి జిల్లా మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ.. పటాన్ చెరువు పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 32 ► పోస్టుల వివరాలు: అంగన్వాడీ టీచర్–08, అంగన్వాడీ ఆయా–24. ► అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు స్థానికంగా నివసిస్తూ ఉండాలి. ► వయసు: 01.07.2021 నాటికి 21 నుంచి 35ఏళ్లు మించకుండా ఉండాలి. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరాఖాస్తులకు చివరి తేది: 27.08.2021 ► వెబ్సైట్: https://mis.tgwdcw.in or https://wdcw.tg.nic.in యాదాద్రి భువనగిరి జిల్లా అంగన్వాడీల్లో 57 పోస్టులు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ విభాగం.. యాదాద్రి భువనగిరి జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 57 ► పోస్టుల వివరాలు: అంగన్వాడీ టీచర్లు–08, అంగన్వాడీ ఆయాలు–45, మినీ అంగన్వాడీ టీచర్లు– 04. ► ప్రాజెక్టుల వారీగా ఖాళీలు: ఆలేరు–18, భువనగిరి–14, మోత్కూర్–10, రామన్నపేట–15. ► అర్హత: పదో తరగతి ఉత్తీర్ణురాలై ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా వివాహితురాలై, స్థానికంగా నివసిస్తూ ఉండాలి. ► వయసు: 01.07.2021 నాటికి 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: సంబంధిత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలు: 26.08.2021 నుంచి 28.08.2021 వరకూ. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.08.2021 ► వెబ్సైట్: https://wdcw.tg.nic.in డీహెచ్ఎస్, జగిత్యాలలో 10 ఖాళీలు తెలంగాణ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విభాగానికి చెందిన జగిత్యాల జిల్లా హెల్త్ సొసైటీ.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 10 ► పోస్టుల వివరాలు: సివిల్ అసిస్టెంట్ సర్జన్–04, ల్యాబ్ టెక్నీషియన్–01, ఫార్మసిస్ట్–05. ► సివిల్ అసిస్టెంట్ సర్జన్: అర్హత: ఎంబీబీఎస్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ► ల్యాబ్ టెక్నీషియన్: అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు ఫార్మసీలో డిప్లొమా/బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. ► ఫార్మసిస్ట్: అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు డీఎంఎల్టీ/బీఎస్సీ(ల్యాబ్ టెక్నీషియన్) ఉత్తీర్ణులవ్వాలి. తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. ► ఎంపిక విధానం: సంబంధిత అర్హత పరీక్షలో మెరిట్ మార్కులు, సీనియారిటీ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, జగిత్యాల చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 23.08.2021 ► వెబ్సైట్: https://jagtial.telangana.gov.in మేనేజ్, హైదరాబాద్‌లో వివిధ ఖాళీలు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్(మేనేజ్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 05 ► పోస్టుల వివరాలు: డైరెక్టర్(అగ్రికల్చర్ మార్కెటింగ్)–01, రీసెర్చ్ అసోసియేట్ (అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్)–01, రీసెర్చ్ అసోసియేట్(నాలెడ్జ్ మేనేజ్మెంట్)–01, జూనియర్ స్టెనోగ్రాఫర్–01, అసిస్టెంట్ క్యాషియర్–01. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టైపింగ్ స్కిల్స్ ఉండాలి. ► ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ డైరెక్టర్(అడ్మినిస్ట్రేషన్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్(మేనేజ్), రాజేంద్రనగర్, హైదరాబాద్–500030, హైదరాబాద్, తెలంగాణ చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 13.09.2021 ► వెబ్సైట్: https://www.manage.gov.in టీఎస్ పోస్టల్ సర్కిల్లో 55 స్పోర్ట్స్ కోటా పోస్టులు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయం.. స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 55 ► పోస్టుల వివరాలు: పోస్టల్ అసిస్టెంట్–11, సార్టింగ్ అసిస్టెంట్–08, పోస్ట్‌మ్యాన్/ మెయిల్ గార్డ్–26, ఎంటీఎస్–10. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత స్థానిక భాష వచ్చి ఉండాలి. ► వయసు: పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్/పోస్ట్‌మ్యాన్/మెయిల్ గార్డ్ పోస్టులకు 18 నుంచి 27ఏళ్లు, ఎంటీఎస్ పోస్టులకు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. ► క్రీడాంశాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బేస్‌బాల్, బాక్సింగ్, క్రికెట్, జూడో, కబడ్డీ, కరాటే, ఖో ఖో, షూటింగ్ తదితరాలు. ► క్రీడార్హతలు: సంబంధిత క్రీడలో అంతర్జాతీయ, జాతీయ, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. ► ఎంపిక విధానం: అభ్యర్థులు పాల్గొన్న క్రీడా ప్రాథమ్యాల ప్రాధాన్యతా క్రమం ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 24.09.2021 ► వెబ్సైట్: https://tsposts.in -
పొలిటీషియన్లంటే.. గెస్ట్ ఆర్టిస్టులు అనుకుంటరు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/పటాన్చెరు: ‘‘ప్రభుత్వ పథకాల అమల్లో అవాంతరాలు ఉంటాయి. కొత్త ఆలోచనతో వచ్చే పథకాల విషయంగా.. అధికారుల నుంచి అమలు చేయలేమనే సమాధానమే మొదట వస్తుంది. రాజకీయ నాయకులు గెస్ట్ ఆర్టిస్టులని వారు భావిస్తారు. వారే పర్మినెంట్ ఆర్టిస్టులుగా భావిస్తారు..’’ అని మంత్రి కె.తారకరామారావు వ్యాఖ్యానించారు. మార్పు కోరడం అంత సులువైనది కాదని పేర్కొన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, లెక్చరర్లతో మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సక్సెస్‌కు షార్ట్‌కట్ ఉండదు మీ రాజకీయ జీవితంలో విఫలమైన ఘటనలు ఉన్నాయా అని గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు శ్రీభరత్ ప్రశ్నించగా.. జీవితంలో వైఫల్యం చెందని వ్యక్తి అంటూ ఎవరూ ఉండరని కేటీఆర్ బదులిచ్చారు. ‘‘ఫెయిల్యూర్‌ను సెలబ్రేట్ చేసుకోవాలి. మార్గం ఏదైనా కష్టపడి పనిచేయడానికి మించినది ఏదీ లేదు. సక్సెస్‌కు షార్ట్‌కట్ ఉండదు. నా జీవితంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం ఆలస్యమైనప్పుడు కొంత బాధేసింది. ఎందరో ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఇటీవల కేంద్ర మంత్రిని కలిసి.. హైదరాబాద్– బెంగూళూరు మధ్య డిఫెన్స్ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరాను. కానీ యూపీలో పెట్టాలని నిర్ణయం జరిగిపోయిందని కేంద్రమంత్రి చెప్పారు. కారణం యూపీలో ఎంపీ సీట్లు ఎక్కువ, ఇక్కడ తక్కువ.’’ అని తెలిపారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరూ ఇవ్వలేరు రాష్ట్రంలో నియామకాల మాటేమిటని ఓ లెక్చరర్ ప్రశ్నించగా.. నిరుద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం ప్రపంచంలో ఎక్కడా సాధ్యం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రైవేట్ ఎంప్లాయిమెంట్‌పై దృష్టి సారిస్తోందన్నారు. టీఎస్ఐపాస్తో పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. పొలిటీషియన్లు తక్కువనే భావన ఉంటుంది పథకాల అమల్లో ఎదుర్కొన్న అవరోధాలేమైనా ఉన్నాయా అని ఓ విద్యార్థిని కేటీఆర్‌ను ప్రశ్నించింది. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. ‘‘అధికారుల్లో అయితే తాము చాలా చదువుకున్నామని, పొలిటీషియన్లు తక్కువనే భావన ఉంటుంది. ఏదైనా కొత్త పథకాన్ని అమలు చేయాలని చెప్పగానే.. ‘అది సాధ్యం కాదు’ అనే సమాధానం ఐఏఎస్ అధికారుల నుంచి వస్తుంది. సహజంగానే ఈ రకమైన మైండ్‌సెట్ అందరిలోనూ ఉంటుంది. మార్పు కోరడం అంత సులువైంది కాదు. అది మానవ సహజ లక్షణం. అయితే బ్యూరోక్రాట్లు రాజకీయ నాయకులను గెస్ట్ ఆర్టిస్టులుగా భావిస్తారు. ఐదేళ్ల కాలానికి వచ్చిపోతారనే భావననే దీనికి కారణం. వారేమో పర్మనెంట్ ఆర్టిస్టులుగా భావిస్తుంటారు..’’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ సహా విద్యార్థులు, లెక్చరర్లు అందరూ గొల్లుమని నవ్వారు. నేను ఐఏఎస్ కావాలనుకున్నారు మరికొందరు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు. తాను ఐఏఎస్ అవ్వాలన్నది తన తండ్రి కేసీఆర్ కోరికగా ఉండేదని చెప్పారు. ఢిల్లీలో చదువుకునేందుకు వెళ్లానని, మేనమామ ఒకరు ఇచ్చిన సలహాతో వదిలేశానని తెలిపారు. తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశానని.. ఉద్యోగ రీత్యా చాలా దేశాలు తిరిగానని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో.. తన తండ్రి కేసీఆర్‌కు చెప్పకుండానే 2008లో కార్యకర్తగా టీఆర్ఎస్లో చేరి, రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. దళితబంధుతో ఆర్థిక స్వావలంబన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధుతో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న దళిత కుటుంబాలు ఆర్థిక స్వావలంబన సాధిస్తాయని కేటీఆర్ చెప్పారు. గతంలో రైతుబంధు ప్రకటించినప్పుడు విమర్శలు వచ్చాయని.. కానీ ఇప్పుడా పథకాన్ని 11 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గాయన్నారు. కేసీఆర్ దేన్నైనా సంకల్పిస్తే సాధించి తీరుతారని.. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ సంక్షేమ పథకాలను కొనసాగించేలా రూపకల్పన చేస్తున్నారని వివరించారు. ‘మోదీ ఇచ్చే 15 లక్షలకు’ దరఖాస్తు చేసుకోండి బీజేపీపై కేటీఆర్ వ్యంగ్యాస్త్రం సాక్షి, హైదరాబాద్: ‘ప్రతి పౌరుడికి రూ.15 లక్షలు ఇస్తానని ప్రధాని మోదీ ఇచ్చిన హామీకి అనుగుణంగా తెలంగాణ బీజేపీ దరఖాస్తులు స్వీకరించడాన్ని నేను స్వాగతిస్తున్నా. జన్‌ధన్ ఖాతాల్లోకి ధనాధన్ లబ్ధి జరిగేందుకు తెలంగాణవాసులందరూ తమ దరఖాస్తులను బీజేపీ నాయకులకు పంపాల్సిందిగా కోరుతున్నా’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్లో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు అర్హులైన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి ప్రభుత్వానికి పంపేందుకు బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ చేపట్టిన దరఖాస్తుల ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేసిన ట్వీట్‌కు కేటీఆర్ స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. -
900 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
జహీరాబాద్: అక్రమంగా తరలిస్తున్న 900 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని సత్వార్ గ్రామ సమీపంలోని కోహినూర్ దాబా వద్ద బియ్యం లారీలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పౌరసరఫరాల అధికారులు.. పోలీసు, విజిలెన్స్ అధికారుల సహాయంతో తనిఖీ చేయగా మూడు లారీల్లో 900 క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమంగా హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహనాలను సీజ్ చేసి ఎస్‌డబ్ల్యూసీ గోదాముకు తరలించారు. ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా బియ్యం లోడ్ చేసి ఉన్నందున ఓ లారీ డ్రైవర్ గుల్జార్, యజమాని ఇర్ఫాన్, మరో లారీ డ్రైవర్ అవేష్జీ, యజమాని ఇస్మాయిల్బాయ్, మరో లారీ డ్రైవర్ షకీల్ అహ్మద్, యజమాని ఇస్మాయిల్ మతకియాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తనిఖీల్లో పౌరసరఫరాల శాఖ అధికారులు సురేశ్ కుమార్, ఎండీ షఫీ, శ్రీనివాస్, విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు. -
అతివేగానికి ఐదుగురు బలి
జోగిపేట (అందోల్)/ కొల్చారం(నర్సాపూర్): అతివేగం ఐదుగురి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. సంగారెడ్డి నుంచి వస్తున్న కారు.. ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న మెదక్ జిల్లా రంగంపేటకు చెందిన పాస్టర్ లూకా (46), ఆయన భార్య దీవెన (44), అదే జిల్లా సంగాయిపేటకు చెందిన అంబదాస్ (45), ఆయన భార్య పద్మ (30), వారి కుమారుడు వివేక్ (5) అక్కడిక్కడే మృతి చెందారు. అపెండిసైటిస్‌తో బాధపడుతున్న వివేక్‌కు నాలుగు రోజుల కింద సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగింది. శుక్రవారం డిశ్చార్జి కావడంతో పాస్టర్ లూకాకు చెందిన కారులో వారంతా తిరుగుపయనమయ్యారు. ఇంతలోనే వారిని మృత్యువు కబళించింది. కారు అతివేగంగా నడిపిన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని డీఎస్పీ బాలాజీ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చర్చిలో ఇరు కుటుంబాలకు స్నేహం అంబదాస్ కుటుంబం ప్రతి ఆదివారం రంగంపేటలోని చర్చిలో ప్రార్థనలకు వస్తుండేది. ఈ క్రమంలో ఆ చర్చిలోని పాస్టర్ లూకా, అంబదాస్ కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. సంగారెడ్డి ఆసుపత్రి నుంచి తమ కుమారుడి డిశ్చార్జికి వెళ్లాలని చెప్పగా పాస్టర్ లూకా తన కారు తీసుకొచ్చాడు. రెండు కుటుంబాల్లో విషాదం అంబదాస్–పద్మ దంపతులకు వినయ్, వివేక్ ఇద్దరు కుమారులు. ప్రమాదంలో అంబదాస్, పద్మ, వివేక్ చనిపోవడంతో వినయ్ అనాథగా మిగిలాడు. పాస్టర్ లూకా–దీవెన దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. తల్లిదండ్రుల మృతితో ఆ నలుగురికీ పెద్ద దిక్కు లేకుండా పోయింది. సీటు బెల్ట్ ధరించి ఉంటే.. ముందు సీటులో కూర్చున్న పాస్టర్ దంపతులు సీటు బెల్టు ధరించలేదు. సీటు బెల్టు ధరించి ఉంటే ప్రాణాలు కోల్పోకపోయేవారని అంటున్నారు. సీటు బెల్ట్ ధరించకపోవడం వల్లే ఎయిర్ బ్యాగ్‌లు తెరుచుకోలేదని, ఒకవేళ అవి తెరుచుకుని ఉం టే ప్రమాద తీవ్రత ఇంతగా ఉండేది కాద ని స్థానికులు చెబుతున్నారు. కాగా, లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మృత్యు రహదారి సంగారెడ్డి–నాందేడ్–అకోలా హైవేకు మృత్యు రహదారి అనే పేరుంది. చౌటకూరు నుంచి శివ్వంపేట వరకు ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు యాభైకి పైగా ప్రమాదాలు జరిగాయి. రహదారి విస్తరణ పనులు మొదలుకాక ముందు డబుల్ రోడ్డుగా ఉండేది. అప్పుడు తరచుగా ప్రమాదాలు జరిగేవి. ఇదీ లూకా నేపథ్యం పాస్టర్ లూకాది సంగారెడ్డి జిల్లా శివంపేట మండలం గూడూరు. 20 ఏళ్ల కింద రంగంపేటకు వచ్చి స్థిరపడ్డాడు. తొలుత చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని చర్చి ప్రారంభించాడు. ఆ తర్వాత సొంతంగా స్థలం తీసుకొని చర్చి నిర్మించాడు. చర్చికి వచ్చేవారికి దీవెనయ్యగా సుపరిచితుడు. డివైడర్లు ఉంటే.. ప్రాణాలు దక్కేవి నాందేడ్–అకోలా జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరిస్తున్నారు. ఈ క్రమంలో ఇంకా డివైడర్ల ఏర్పాటు చేయలేదు. పనులు కూడా పూర్తికాలేదు. దీంతో అన్ని వాహనాలు ఎదురెదురుగా ప్రయాణిస్తున్నాయి. ప్రమాదస్థలి వద్ద రోడ్డు వెడల్పుగానే ఉంది. లారీ ఎడమవైపు వస్తుండగా, కుడివైపున కారు ఢీకొంది. ఎడమవైపు వెళ్లాల్సిన కారు కుడి వైపు ఎందుకు వెళ్లిందో..? అతి వేగంగా వెళ్లడమా..? లేదా ఏదైనా వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోతే ఈ ఘటన జరిగిందా..? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకట్లేదు. ‘భయంగా ఉందిరా..’ అంబదాస్ ఆటోడ్రైవర్ కాగా, భార్య పద్మ కూలి పనులకు వెళ్తుంటుంది. చుట్టుపక్కల వారిని తల్లో నాలుకగా ఉంటారు. శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే సమయంలో కొడుకు వినయ్‌కు ఫోన్‌చేసి తనకు భయం అవుతోందని, సంగారెడ్డికి రమ్మని చెప్పగా.. జోగిపేట వరకు వస్తానని, అక్కడ కారు దిగితే బస్సులో వెళ్దాం అని తన తండ్రితో వినయ్ చెప్పాడు. అయితే జోగిపేట రాకముందే దారుణమైన ప్రమాదం జరిగింది. -
ఏమంత కష్టమొచ్చె తల్లీ..
సంగారెడ్డి అర్బన్: పిల్లలకు నయం కాని అనారోగ్యం, ఆస్పత్రులకు అవుతున్న ఖర్చులు.. మనస్తాపంలో ఓ తల్లి తన ఇద్దరు కుమారులను చున్నీతో ఉరేసి.. తానూ ఆత్మహత్యాయత్నం చేసింది. భర్త ఉద్యోగానికి వెళ్లిన సమయం చూసి ఈ దారుణానికి ఒడిగట్టింది. ఇండియన్ బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్న శివశంకర్ ఏడు నెలల కింద ఆదిలాబాద్ నుంచి బదిలీపై వచ్చి భార్య జోస్నా, ఇద్దరు కుమారులతో కలసి సంగారెడ్డి జిల్లా కేంద్రం శాంతినగర్‌లో నివాసం ఉంటున్నాడు. పెద్దబాబు రుద్రాక్షు (6)కు పుట్టినప్పటి నుంచి కిడ్నీల సమస్య ఉంది. చిన్నబాబు దేవాన్షు(4)కు మోషన్ (మలవిసర్జన సరిగా లేకపోవడం) సమస్యతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. దీంతో ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. డాక్టర్లు కూడా ఈ జబ్బులు నయం కావని చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన జోస్నా తన ఇద్దరు పిల్లలను చంపి తానూ చనిపోవాలని నిర్ణయించుకుంది. భర్త శివశంకర్ శుక్రవారం ఉదయం బ్యాంకుకు వెళ్లిన సమయం చూసి మధ్యాహ్నం సమయంలో ఇద్దరు కుమారులను చున్నీతో ఉరేసింది. ఇంటికి తాళం వేసి పట్టణ పరిధిలోని మహబూబ్‌సాగర్ చెరువు వద్దకు వెళ్లి భర్తకు వాట్సాప్‌లో ఫొటో పెట్టి చెరువులో దూకింది. ఆ సమయంలో అక్కడ ఉన్న వారు ఆమెను పైకి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న శివశంకర్ చెరువు వద్దకు చేరుకున్నాడు. అక్కడి నుంచి ఇంటికి వచ్చి తాళం తీసి చూడగా, ఇద్దరు పిల్లలు బెడ్‌పై విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే భార్య, పిల్లలను ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. పరీక్షించిన డాక్టర్లు పిల్లలిద్దరూ మృతి చెందారని నిర్ధారించారు. ప్రస్తుతం జోస్నా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. శివశంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు చిన్నారుల ప్రాణం తీసిన కన్నతల్లి.. ఆపై ఆత్మహత్యాయత్నం
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా శాంతినగర్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఒక తల్లి.. తన ఇద్దరు చిన్నారులను ఉరేసి చంపింది. ఆ తర్వాత తాను కూడా.. చెరువులోకి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. అక్కడే ఉన్న కొంత మంది జాలరులు మహిళను గమనించారు. వెంటనే వారు.. చెరువులో దూకి మహిళ ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
‘మొక్క’వోని దీక్ష.. అంత పెద్ద చెట్టును మళ్లీ నాటాడు!
అతనికి చెట్లంటే ప్రాణం. పర్యావరణ ప్రేమికుడు. ఏటా వందల సంఖ్యలో మొక్కలు నాటుతాడు. అడవులను పెంచే ఉద్దేశంతో విత్తన బంతులు తయారుచేసి చెట్లు లేనిచోట విసురుతాడు. చిన్న మొక్కనూ ఎండనివ్వడు. పెద్ద చెట్లను నరకనివ్వడు. అతనే సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలం ముక్తాపూర్‌కు చెందిన జ్ఞానేశ్వర్. ఇటీవల తన సొంత గ్రామంలో గ్రామస్తులు పెద్ద రావిచెట్టును నరికివేశారు. అది తెలుసుకుని వెంటనే జేసీబీ సాయంతో పెద్ద గుంత తవ్వి మళ్లీ ఆ చెట్టును నాటించాడు. రోజూ నీళ్లుపోస్తూ దానికి ప్రాణం పోస్తున్నాడు. ఇలా చెట్లు నరుక్కుంటూ పోతే పర్యావరణానికి హాని జరుగుతుందని.. చెట్లను నరకొద్దని సూచిస్తున్నాడు. -
మెరిసి మురిసిన తెలంగాణ పల్లెలు
తెలంగాణ పల్లెలు మురిశాయి. పారిశుధ్యం, స్వచ్ఛత, అభివృద్ధి.. తదితర అంశాల్లో వరించిన అవార్డులతో మెరిశాయి. జాతీయ స్థాయిలో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ‘దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సశక్తికరణ్ పురస్కార్ (డీడీయూపీఎస్‌పీ)’ కింద ఏటా అందజేసే జాతీయ పంచాయతీ అవార్డులు 2021 సంవత్సరానికి.. తెలంగాణను ఏకంగా 12 వరించాయి. ఇందులో అత్యధికంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు లభించాయి. జాతీయ స్థాయిలో వివిధ కేటగిరీల్లో ఎంపిక చేసిన అవార్డుల్లో రాష్ట్రానికి 12 ప్రకటించగా, అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 2 మండల పరిషత్‌లు, 5 గ్రామ పంచాయతీలకే ఏడు దక్కడం విశేషం. మొత్తం అవార్డుల్లో సంగారెడ్డి జిల్లాకు ఉత్తమ జిల్లా పరిషత్ అవార్డు లభించగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల, ధర్మారం మండలాలకు ఉత్తమ మండల పరిషత్ అవార్డులు దక్కాయి. మిగతా 9 గ్రామ పంచాయతీ అవార్డుల్లో ఐదు అవార్డులు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే దక్కడం విశేషం. సిద్దిపేట జిల్లాలోని రెండు గ్రామ పంచాయతీలకు ఆయా కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. ఆయా అవార్డుల కింద కేంద్ర ప్రభుత్వం పురస్కారంతో పాటు నగదు మొత్తాన్ని నేరుగా ఆయా స్థానిక సంస్థల అకౌంట్లలో జమ చేయనుంది. కేంద్ర పురస్కారాలను పొందిన మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీల ప్రత్యేకతలు.. ఏయే కేటగిరీల్లో అవార్డులు పొందాయనే వివరాలు.. మల్యాల.. మెరిసేనిలా గ్రామం: మల్యాల జిల్లా: సిద్దిపేట సిద్దిపేట రూరల్: సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని మల్యాల గ్రామం అభివృద్ధి, పరిసరాల పరిశుభ్రత, అభివృద్ధి ప్రణాళిక తదితర అంశాల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఈ గ్రామంలోని పల్లె ప్రకృతి వనం జిల్లాకే శోభ తెచ్చే స్థాయిలో ఉంది. గ్రామం మొత్తం ఆకుపచ్చని కళను సంతరించుకుంది. ఇక, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు నిర్వహించే విషయంలో ఈ గ్రామం తన ప్రత్యేకతను చాటుకుంటోంది. చక్రాపూర్కు చక్కని గుర్తింపు గ్రామం: చక్రాపూర్ జిల్లా: మహబూబ్‌నగర్ మూసాపేట(మహబూబ్‌నగర్ జిల్లా): దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తి కరణ్ పురస్కారానికి ఎంపికైం/న చక్రాపూర్‌లో 286 నివాసాలు, 1,638 మంది జనాభా ఉంది. సర్పంచ్ కొండం పల్లిపల్లి శైలజ ఆధ్వర్యంలో ఇంకుడుగుంతలు, మరుగుదొడ్ల నిర్మాణం వంద శాతం పూర్తి చేశారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఇచ్చారు. గ్రామంలోని ఇంటించి నుంచి చెత్తను సేకరించి సేంద్రియ ఎరువును తయారు చేసే విషయంలో ఈ గ్రామం ముందంజలో ఉంది. ఇప్పటికే ఇక్కడ మొదటి విడత తయారుచేసిన ఎరువును స్థానికంగా రైతులకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిట్టపల్లి.. మిలమిల గ్రామం: మిట్టపల్లి; జిల్లా: సిద్దిపేట సిద్దిపేట రూరల్: సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామం పారిశుధ్యం, పరిశుభ్రత, చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తోంది. ఇవే అంశాల్లో ఈ గ్రామం సశక్తికరణ్ అవార్డు అందుకుంది. అలాగే, ఇక్కడ స్వయం సహాయక సంఘాలు మంచి ఆర్థిక ప్రగతి సాధిస్తున్నాయి. వ్యర్థాల సేకరణ, నిర్వహణలో ఈ గ్రామం ప్రత్యేకంగా నిలుస్తోంది. రుయ్యాడి.. ఐక్యత దండి గ్రామం: రుయ్యాడి, జిల్లా: ఆదిలాబాద్ తలమడుగు: పారిశుధ్య పనుల సమర్థ నిర్వహణలో రుయ్యాడి గ్రామం సశక్తికిరణ్ అవార్డును దక్కించుకుంది. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులతోపాటు ఇంటిపన్ను వంద శాతం వసూలు చేయడం, మియావాకి పద్ధతిలో మొక్కలు నాటడం, డంపిగ్యార్డులో చెత్తను వేరుచేసి సేంద్రియ ఎరువుగా మార్చడం, వానపాములను పెంచడం, ఆన్లైన్లో జనన, మరణ, వివాహాల ధ్రువీకరణపత్రాలు అందించడం, పంచాయతీకి వచ్చే నిధులు ఎలా ఖర్చు చేయాలి?, ఏ సమయంలో, ఎంత ఖర్చు చేయాలి? అనే అంశాలపై అధికారులు, సర్పంచ్ పోతారెడ్డి చేసిన కృషికి గాను జాతీయస్థాయిలో ఈ అవార్డు వచ్చింది. ఐక్యత విషయంలోనూ రుయ్యాడి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ముస్లింల పండుగైన మొహర్రంను గ్రామస్తులంతా కలిసికట్టుగా నిర్వహిస్తారు. వేడుకలు ముగిసే వరకు మద్యానికి దూరంగా ఉంటారు. మొహర్రం అంటేనే రుయ్యాడిగా రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిందంటే ఇక్కడ వేడుకలు ఎలా నిర్వహిస్తారో అర్థం చేసుకోవచ్చు. ధర్మారం.. పనితీరులో బంగారం మండలం: ధర్మారం (మండల పరిషత్), జిల్లా: పెద్దపల్లి పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంగా పెద్దపల్లి ఆవిర్భవించిన తర్వాత మండల పరిషత్ కేటగిరీలో ఇప్పటివరకు వరసగా కాల్వశ్రీరాంపూర్, మంథని, సుల్తానాబాద్ అవార్డులను కైవసం చేసుకోగా ఈసారి కేంద్రప్రభుత్వం ప్రకటించిన జాతీయ పంచాయతీ రాజ్ అవార్డును ధర్మారం మండల పరిషత్ కార్యాలయం దక్కించుకుంది. మండల పరిధిలో ప్రభుత్వ పథకాల అమలు, పంచాయతీ రికార్డుల నిర్వహణ, తదితర అంశాలలో పనితీరు మెరుగ్గా ఉండడంతో ఈ అవార్డు దక్కింది. ధర్మారం మండల పరిషత్‌కు రూ.25 లక్షల పారితోషికం దక్కనుంది. సుందిల్ల.. డబుల్ ధమాకా గ్రామం: సుందిల్ల, జిల్లా: పెద్దపల్లి పెద్దపల్లిరూరల్: జిల్లాలోని రామగిరి మండలం సుందిల్ల గ్రామ పంచాయతీ రెండు అవార్డులను పొందింది. గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ (జీపీడీపీ) అవార్డుతోపాటు నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ పురస్కార్ (ఎన్‌డీఆర్‌జీజీఎస్‌పీ) అవార్డును దక్కించుకుంది. అప్పటి కలెక్టర్ సిక్తా పట్నాయక్, డీపీఓ సుదర్శన్ సూచనల మేరకు గ్రామ పంచాయతీ రికార్డుల నిర్వహణ, గ్రామాభివృద్ధిలో ప్రజలు ముఖ్యంగా మహిళలు, వృద్ధుల ఆలోచనల మేరకు ప్రణాళికలను రూపొందించి అమలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామాభివృద్ధికి అనుసరించిన పద్ధతులను అప్లోడ్ చేయడంతో అవార్డులకు ఎంపికైంది. జీపీడీపీ అవార్డు కింద రూ.5లక్షలు, ఎన్‌డీఆర్‌జీజీఎస్‌పీ కింద రూ.10లక్షల పారితోషికాన్ని సుందిల్ల పంచాయతీ పొందనుంది. కోరుట్ల.. అభివృద్ధి నలుదిశలా.. మండలం: కోరుట్ల (మండల పరిషత్) జిల్లా: జగిత్యాల కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల మండల పరిషత్‌కు జాతీయ స్థాయి దీనదయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తి కరణ్ పురస్కారం దక్కింది. మండల పరిధిలోని గ్రామాల్లో స్వచ్ఛ భారత్, పచ్చదనం పెంపు, ఉపాధి హామీ పనుల నిర్వహణ, కూలీల జీతభత్యాల పెంపు, మహిళా స్వయం సహాయక సంఘాల పనితీరు వంటి 52 అంశాల్లో ఉత్తమ ప్రగతిని కనబరిచిన క్రమంలో ఈ మండలానికి విశిష్ట అవార్డు దక్కింది. పిల్లల అభివృద్ధి.. వికాసం గ్రామం: మోహినికుంట, జిల్లా: రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్(సిరిసిల్ల): పిల్లల అభివృద్ధి, మానసిక వికాసానికి సంబంధించిన అంశాల్లో విశేష ప్రతిభ కనబరిచినందుకు.. చిన్నారుల స్నేహపూర్వక అభివృద్ధి ప్రణాళిక విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామం జాతీయ అవార్డుకు ఎంపికైంది. పై అంశాలతో పాటు ప్రణాళికబద్ధమైన అభివృద్ధి పనులను చేపట్టినందుకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. గ్రామంలో పిల్లల పార్క్, ఓపెన్ జిమ్, సమావేశాలు, స్పోకెన్ ఇంగ్లిష్, పాఠశాలలో వివిధ స్థాయిలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేశారని ఎంపీడీవో రమాదేవి తెలిపారు. ‘సిరి’దాస్‌నగర్ గ్రామం: హరిదాస్‌నగర్ జిల్లా: రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సహజ వనరులు, హరితహారం, పారిశుధ్య నిర్వహణ, ఉపాధి హామీ పనుల నిర్వహణలో చూపిన ప్రతిభకు గాను రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌కు అవార్డు లభించింది. పదేళ్ల క్రితం హరిదాస్‌నగర్ జాతీయ స్థాయి నిర్మల్ పురస్కార్ అవార్డును అందుకుంది. పదేళ్లలో అభివృద్ధి పనులతో గ్రామం రూపురేఖలు మార్చడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయడంలో ఈ గ్రామం వంద శాతం విజయవంతమైంది. వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ఇక్కడ అవలంబిస్తున్న నీటి నిల్వ పద్ధతులు పేరొందాయి. పర్లపల్లి.. కేరాఫ్ సమగ్రాభివృద్ధి గ్రామం: పర్లపల్లి, జిల్లా: కరీంనగర్ తిమ్మాపూర్(మానకొండూర్): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లికి ఆదర్శ గ్రామంగా మరో అరుదైన గౌరవం దక్కింది. అన్ని వర్గాలు సమగ్రంగా అభివృద్ధి చెందిన పంచాయతీగా గుర్తించి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ దీన్‌దయాళ్ సశక్తి కరణ్ అవార్డుకు ఎంపిక చేసింది. గ్రామంలో 5 వేల జనాభా ఉండగా, ప్రజల జీవన స్థితిగతులు, సమగ్ర అభివృద్ధి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల సద్వినియోగం, గ్రామ సమగ్రాభివృద్ధి అంశాలను పరిశీలించి ఈ అవార్డును ప్రకటించారు. పల్లె ప్రగతిలో భాగంగా శ్మశానవాటిక, నర్సరీలు, పల్లె ప్రకృతివనం నిర్మించారు. అర్హులైన గ్రామీణులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా సర్పంచ్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిలో గ్రామస్తులు పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నట్లు కేంద్ర బృందం నిర్ధారించింది. పాలనలో భేష్.. సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి (జిల్లా పరిషత్) సంగారెడ్డిఅర్బన్: అభివృద్ధి పరిపాలన విభాగం (జనరల్ కేటగిరి)లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు సంగారెడ్జి జిల్లా పరిషత్‌కు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తి కరణ్ అవార్డు దక్కింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు అందించిన సేవలను పరిగణలోకి తీసుకొని పంచాయతీరాజ్ శాఖ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. జిల్లా పరిషత్ ద్వారా జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను జిల్లా పరిషత్ సిబ్బంది ఎప్పటికప్పుడు కేంద్రానికి రిపోర్టు చేయడం ఇక్కడ ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది. -
సదాశివపేట పోలీసుల ఓవరాక్షన్
-
సంగారెడ్డి: బొలెరో డ్రైవర్‌పై.. పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, సంగారెడ్డి: జిల్లాలో బొలెరో వాహన డ్రైవర్‌పై అమానుషంగా ప్రవర్తించారు పోలీసులు. బూటు కాలితో తంతు.. లాఠీలతో చితకబాదారు. లబోదిబోమని మొత్తుకుంటున్నా వినకుండా ఇష్టం ఉన్నట్లు కొట్టారు. ఇంతకు ఆ డ్రైవర్ చేసిన పాపం ఏంటో తెలుసా.. పోలీసులు వాహనం ఆపమనగానే ఆపకుండా.. కాస్తా ముందుకు వెళ్ళి ఆపడం. దానికే రెచ్చిపోయిన సదాశివపేట పోలీసులు ఆ అమాయకునిపై తమ ప్రతాపం చూపారు. ఆ వివరాలు.. సదాశివపేటకు చెందిన వాజిద్ బొలేరో వాహనం నడుపుతుంటాడు. సింగూరుకు కిరాయికి వెళ్తుండగా అయ్యప్ప స్వామి గుడి వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రధాన రహదారిపై సడెన్‌గా పోలీసులు రావడంతో వాహనాన్ని కాస్తా దూరంగా తీసుకెళ్లి ఆపాడు వాజిద్. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కానిస్టేబుల్ అతని చేతిలో ఉన్న లాఠీతో చితకబాదాడు. అక్కడితో ఆగకుండా బూటు కాలితో తంతూ.. బండ బూతులు తిట్టాడు. పోలీసుల దాడిలో వాజిద్‌కి గాయాలయ్యాయి. ఓవైపు రాష్ట్రంలో ప్రైండ్లీ పోలీస్ అని పోలీసు ఉన్నతాధికారులు చెబుతుంటే... కింది స్థాయిలో అమలు కాకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: ‘డీజిల్‌కి డబ్బులివ్వు.. బిడ్డను వెతుకుతాం’ -
తెలుంగాణపురం ఎక్కడుందో తెలుసా?
త్రిలింగ దేశం.. ఆ తర్వాత తిలింగరాజ్యం.. కొందరు మహమ్మదీయ రాజులు తిలింగ్, తెలింగ అని.. మరికొందరు విదేశీయులు ట్రిలింగాన్ అని.. వేర్వేరు సామ్రాజ్యాలు, కాలాల్లో ఇలా రకరకాల పేర్లతో సంబోధించారు. ఆ ప్రాంతమే ప్రస్తుత తెలంగాణ. మరి మొదటిసారి తెలంగాణ అన్న పదాన్ని ఎవరు, ఎప్పుడు వాడారో తెలుసా? ఇప్పుడు దానికి సంబంధించిన శాసనమే ఆసక్తి రేపుతోంది. ఆరు శతాబ్దాల క్రితం వేయించిన ఆ శాసనం ఇరుకు సందులో ఇళ్ల మధ్య బందీ అయిపోయింది. దాని గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియకుండా పోయింది. కొంతమంది చరిత్రకారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు రికార్డు చేసినా, అది కొంతమందికే పరిమితమైంది. దేశంలో 29వ రాష్ట్రం (కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారకముందు)గా ఆవిర్భవించిన తెలంగాణ పేరును తొలిసారి లిఖితపూర్వకంగా వాడింది ఈ శాసనంలోనే. అంటే ‘తెలంగాణ’అస్తిత్వానికి తొలి నిదర్శనం అన్నమాట. - సాక్షి, హైదరాబాద్ ‘తెలుంగాణపురం’ఎక్కడుంది? ఈ ప్రశ్నకు...‘అది మన రాష్ట్రం పేరు, ఆ పేరుతో ఊరు కూడా ఉందా?’అన్న ఎదురు ప్రశ్నే సమాధానంగా వస్తుంది. కానీ ఆ పేరుతో ఓ ఊరు కూడా ఉండేది.. అది ఎక్కడో కాదు... భాగ్యనగర శివార్లలోనే. అత్యంత వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ పురోగతికి ఇప్పుడు చిరునామాగా కనిపిస్తున్న తెల్లాపూరే... ఒకప్పటి తెలుంగాణపురం. కాలక్రమంలో తెలుంగాణపు రం కాస్తా క్రమంగా తెల్లాపూర్‌గా మారిపోయింది. తెలంగాణ అన్న పదం ఉన్న తొలి తెలుగు శాసనం వెలుగుచూసింది ఈ గ్రామంలోనే. ఇది సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం పరిధిలోకి వస్తుంది. 604 ఏళ్ల కిందట.. బహమనీ సుల్తాన్ ఫిరోజ్ షా తన రాజ్యాన్ని విస్తరించే క్రమంలో 1417లో విజయనగర రాజు రెండో దేవరాయల అధీనంలో ఉన్న పానగల్లు కోట మీద దాడికి బయలుదేరాడు. దారిలో కనిపించిన హిందూ సంప్రదాయ కట్టడాలను ధ్వంసం చేయటం ఆ సైన్యం పనిగా పెట్టుకుంది. ఈ క్రమంలో పలు మందిరాలు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో తెల్లాపూర్ కూడా ప్రణాళికాబద్ధంగా ఎదిగిన పట్టణం. తెలుంగాణ పురమన్న పేరుతో అభివృద్ధి చెందిన ప్రాంతం. కొందరు విశ్వకర్మలు ఈ ప్రాంతంలో మంచి పనిమంతులైన శిల్పులుగా పేరుపొంది ఉన్నారు. వారు నగల తయారీలోనే కాకుండా, నగర ప్రణాళికల రూపకల్పనలోనూ నేర్పు ఉన్నవారు. అందులో కొండమీది మల్లోజు, అతని కొడుకులు నాగోజు, అయ్యలోజు, వల్లబోజు తదితరులు ఇక్కడ పెద్ద మామాడి తోటను నిర్వహించేవారు. దానికి నీటి కోసం విశాలమైన దిగుడు బావి తవ్వించి ఏతాం పద్ధతిలో నీటి సాగుకు వాడేవారు. పానగల్లు కోటపై దాడి కోసం ఫిరోజ్ షా ఇదే మార్గంలో వెళ్లనున్నారని తెలిసి, వారు ఈ ప్రాంతాన్ని ధ్వంసం చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఫిరోజ్ షా భార్యకు బంగారు పూదండలు దిద్దిన కంఠాభరణం, బంగారు గాజులు అందంగా తయారు చేసి బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాలను వివరిస్తూ ప్రత్యేకంగా ఆ మల్లోజు వంశస్తులు ప్రశస్తి శాసనం చెక్కి దిగుడుబావి పైన ఏతాం కోసం ఏర్పాటు చేసిన రాతి స్తంభాల మధ్య ఏర్పాటు చేయించారు. అదే ఈ శాసనం. అందులో ఈ ప్రాంతాన్ని తెలుంగాణపురంగా పేర్కొన్నారు. ఆ శాసనంపై తెలుగులో24 పంక్తుల వివరాలున్నాయి. రాష్ట్రం ఉమ్మడిగా ఉండగా పురావస్తు శాఖలో స్తపతి ఈమని శివనాగిరెడ్డి ఈ శాసనాన్ని 2008లో పరిశీలించారు. అప్పటికే బావిని సింహభాగం పూడ్చేశారు. కొన్ని మెట్లు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. పైగా గిరక కోసం ఏర్పాటు చేసిన రెండు రాతి శిలలు పడిపోయే పరిస్థితిలో ఉండటంతో ఆయన వాటిని క్రమపద్ధతిలో పూర్వపు స్థితిలో తిరిగి ఏర్పాటు చేయించారు. ఆ శిలల దిగువన కాకతీయ శైలిలో కళాత్మకంగా చెక్కిన భారీ రాతి బేస్ ఉంది. ఆ తర్వాత మొత్తం బావిని స్థానికులు పూడ్చేశారు. ఇప్పుడు దాని చుట్టూ ఇళ్లు వెలియటంతో పూర్తి ఇరుకు స్థలంలో ఆ శాసనం బందీగా ఉండిపోయింది. అప్పట్లోనే శివనాగిరెడ్డి... నేతలను తీసుకెళ్లి దీన్ని చూపించారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి ‘తెలంగాణ అన్న పేరును వాడిన తొలి శాసనానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రాధాన్యం దక్కాలి. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి. ఇంత పెద్ద ఉద్యమంతో ఏర్పడ్డ రాష్ట్రంలో.. రాష్ట్రం పేరును తొలిసారి వాడిన శాసనంగా దానికి అందలం దక్కాల్సి ఉంది. -శివనాగిరెడ్డి, చరిత్రకారులు -
చూస్తుండగానే రైతును నీళ్లల్లోకి లాక్కెళ్లిన మొసలి
సాక్షి, సంగారెడ్డి: మొసలి దాడిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఇసోజిపేట-కోడూరు గ్రామ శివారులోని మంజీరా నదిలో ఈ ఘటన జరిగింది. ఇసోజిపేట గ్రామానికి చెందిన గొల్ల రాములు (45) మంజీరా నదిలోకి దిగి గేదెలను కడుగుతుండగా ఒక్కసారిగా మొసలి అతనిపై దాడి చేసింది. ఆ సమయంలో ఒడ్డుపై ఉన్న మరికొంత మంది రైతులు గట్టి అరుస్తూ కర్రలతో మొసలిపై దాడి చేసే యత్నం చేయగా విఫలమయ్యారు. వారంతా చూస్తుండగానే మొసలి రాములును నీటిలోకి లాక్కెళ్లింది. కొద్దిసేపటికి నీళ్లలో వెతగ్గా రాములు మృతదేహం లభించింది. చదవండి: పోలీస్‌స్టేషన్‌లో షణ్ముఖ్ రచ్చరచ్చ యాంకర్‌గా అవకాశం ఇప్పిస్తానని నమ్మించి... -
చిన్నారికి ఉపరాష్ట్రపతి అభినందనలు
జిన్నారం (పటాన్చెరు): సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్న అల్పన అనే విద్యార్థినిని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ వేదికగా అభినందించారు. అందమైన చేతిరాతతో ఇతరులకు మేలు చేయాలనే ఉద్దేశంతో అల్పన రాసిన సందేశం ఉపరాష్ట్రపతిని చేరింది. స్పందించిన ఆయన ‘చక్కని చేవ్రాలుతో మంచి మాటలు, మనసును మరింత హత్తుకుంటాయని, సద్గుణాలు, మానవత్వం గురించి అల్పన తెలుగులో ఎంతో ముచ్చటగా రాసిందని, చిన్న వయస్సులోనే ఇంత చక్కని చేతిరాతను అలవాటు చేసుకున్న ఆ చిన్నారికి అభినందనలు’అని ట్వీట్ చేశారు. దీంతో చిన్నారికి చక్కటి చేతి రాతను నేర్పించిన పైసా సత్యంతో పాటు చిన్నారి అల్పనను పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు. చదవండి: మనకూ బ్రాండ్ ఉండాలి.. సర్కార్ బ్రాండ్‌తో మార్కెటింగ్