పటాన్‌చెరు టౌన్: స్టాక్ మార్కెట్ పేరిట సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి టోకరా వేసి భారీగా నగదు కాజేశారు. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసు కథనం ప్రకారం... పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఏపీఆర్‌కు చెందిన బెజవాడ నాగార్జున ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. తన వాట్సాప్‌కు జులై 5న స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన మెసేజ్‌ను నాడియా కామి అనే మహిళ పంపితే వివరాలను నమోదు చేశాడు. తర్వాత ఐడీని క్రియేట్ చేసి ఇచ్చారు. దీంతో దఫాలవారీగా ఇన్వెస్ట్ చేసిన నగదు రూ.82 లక్షలతో కలిపి మొత్తంగా వాలెట్‌లో రూ.కోటీ 30 లక్షలు చూపించారు.
ఒక రోజు నగదు డ్రా చేసుకుంటానంటే రూ.17 లక్షలు టాక్స్ చెల్లిస్తేనే అంతా డ్రా చేసుకోవచ్చని నమ్మించారు. దీంతో బాధితుడు అప్పు చేసి, తన వద్ద ఉన్న బంగారాన్ని అమ్మి రూ.17 లక్షలు చెల్లించిన తర్వాత అటు వైపు ఉన్న అపరిచిత వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించి ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు, సోమవారం అర్ధరాత్రి పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో నగదు వేసిన అకౌంట్‌లో ఉన్న రూ. 24 లక్షల నగదు హోల్డ్ చేసినట్లు పటాన్‌చెరు సీఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు. సైబర్ నేరాలపై 1930 నంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.
ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట..
పటాన్‌చెరు టౌన్: నకిలీ ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట ప్రైవేట్ ఉద్యోగి భారీగా నగదు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఏఆర్ బృందావన్ కాలనీకి చెందిన ప్రైవేట్ ఉద్యోగికి జూన్ 17న ట్రేడింగ్‌కు సంబంధించిన మెసేజ్ వచ్చింది. లింకును ఓపెన్ చేసి తన వివరాలను నమోదు చేశారు. దీంతో అపరిచిత ట్రేడింగ్ నిర్వాహకులు ఐడీని క్రియేట్ చేసి ఇచ్చారు.
ముందుగా బాధితుడు లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేయగా మూడు లక్షలు లాభాలు చూపించారు. పలు దఫాలుగా స్నేహితుల వద్ద నగదు తీసుకొని, బంగారం అమ్మి మొత్తం రూ.98.40 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. తాను పెట్టిన నగదుతో పాటు, వచ్చిన లాభాలు ఇవ్వాలని అడుగగా అపరిచిత వ్యక్తి స్పందించలేదు. దీంతో తాను మోసపోయినట్లుగా గుర్తించి ముందుగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి, అనంతరం సోమవారం రాత్రి అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు వేసిన అకౌంట్‌లో ఉన్న రూ. లక్షను హోల్డ్ చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment