ఇష్టంలేని వారు వెళ్లిపోండి
గురువారం శ్రీ 27 శ్రీ జూన్ శ్రీ 2024
● వైద్యులపై ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆగ్రహం ● సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓ గైర్హాజరు ● పలువురు సిబ్బంది సైతం విధులకు డుమ్మా
నారాయణఖేడ్: విధి నిర్వహణ పట్ల అలసత్వం వహించే వైద్యులు, సిబ్బంది పట్ల ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి హెచ్చరించారు. స్థానిక వైద్య విధాన పరిషత్ ఆస్పత్రిని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలువురు వైద్యులు, సిబ్బంది విధులకు డుమ్మా కొట్టడం, అనుమతి లేకుండా సెలవులు వేసుకొని వెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టంలేని వారు వెళ్లిపోవాలని, బాధ్యతగా పనిచేసే వారే ఉండి సేవలు అందించాలని సూచించారు. వైద్యుడిని అయిన తన నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. పేద రోగులకు సేవలందిస్తూ బాధ్యతగా విధులు నిర్వర్తించాల్సిన సిబ్బంది ఇలా డుమ్మాలు కొట్టడం ఏమిటని మండిపడ్డారు. సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓ గైర్హాజరు కావడం, అనుమతి లేకుండా సెలవులు తీసుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. డెంటిస్ట్ అయిన ఆర్‌ఎంఓ 19న అనుమతి తీసుకున్నట్టు ఉండగా 26 వరకు అడ్వాన్స్‌గా సీఎల్ వేశారు. ఫార్మాసిస్ట్ భీంరావు సదాశివపేటకు డిప్యూటేషన్ వేసుకొని వెళ్లారు. అతను ఒక్కసారి కూడా నారాయణఖేడ్‌లో విధులకు రాకపోవడం, గతంలో ఉన్న నేతల సిఫారసులతో డిప్యూటేషన్ వేసుకొని వెళ్లిన విషయం వెల్లడి కావడంతో వెంటనే సరెండర్ చేయాలని ఆదేశించారు. మరో ఫార్మాసిస్ట్ శ్యాంరావు కూడా జోగిపేటకు డిప్యూటేషన్ వేసుకొన్నాడు. మరికొన్ని విభాగాల్లోని సిబ్బంది కూడా విధులకు డుమ్మా కొట్టడం బయట పడింది. ఈ విషయాలపై జిల్లా వైద్య విధాన పరిషత్ వైద్యులు సంగారెడ్డితో ఫోన్‌లో మాట్లాడి వీరిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. శానిటేషన్ సిబ్బందికి డ్రెస్సింగ్, ఇతర విధులు ఎలా చెబుతారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment