సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కోమోరిన్‌లకు నైరుతి రుతు పవనాలు విస్తరించాయి. రాగల 48 గంటల్లో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమోరిన్, నైరుతి, ఆగ్నేయ బంగాళా ఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశ మున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పుమధ్య అరేబియా సముద్ర ప్రాంతాల్లో మే 31న అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. రాగల 48 గంటల్లో ఉత్తర ఈశాన్య దిశగా రుతుపవనాలు ప్రయాణించి తూర్పు మధ్య అరేబియా సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రప్రాంతాల్లో వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో జూన్ 1న కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని, ఇది 24 గంటల్లో వాయు గుండంగా మారి, మరింత బలపడే అవకాశముంది. దీని వల్ల శని, ఆదివారాల్లో వడగండ్లు, ఉరుములు, ఈదురుగాలులతో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, హైదరాబాద్, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment