
‘‘నాకు విడాకులు మాత్రమే కావాలి.. అతడి నుంచి ఒక్క పైసా కూడా అవసరం లేదు’’ అంటూ భారత బాక్సర్, ప్రపంచ చాంపియన్ స్వీటీ బూరా (Saweety Boora) తీవ్ర భావోద్వేగానికి గురైంది. భర్త దీపక్ హుడా (Deepak Hooda)తో వీలైనంత త్వరగా వైవాహిక బంధం తెంచుకోవాలని మాత్రమే భావిస్తున్నట్లు తెలిపింది. కాగా స్వీటీతో పాటు దీపక్ కూడా దేశానికి ప్రాతినిథ్యం వహించిన ప్రముఖ కబడ్డీ ఆటగాడు.
అంతేకాదు.. 2019- 2022 వరకు భారత కబడ్డీ జట్టు కెప్టెన్‌గానూ ఉన్నాడు. ప్రొ కబడ్డీ లీగ్‌లోనూ తెలుగు టైటాన్స్, పుణేరి పల్టన్, పట్నా పైరేట్స్ తదితర జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. మరోవైపు.. స్వీటీ బూరా 81 కిలోల విభాగంలో 2023లో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం సాధించింది.
అదనపు కట్నం కోసం
ఇక దీపక్‌తో పాటు స్వీటీ కూడా అర్జున అవార్డు గ్రహీత కావడం విశేషం. ఈ క్రీడా జంట 2022లో వివాహం చేసుకున్నారు. అయితే, భర్తతో పాటు అత్తింటి వారు తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని స్వీటీ బూరా ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాళ్లు కోరినట్లుగా గతంలోనే విలాసవంతమైన కారు ఇచ్చినా.. ఇంకా డబ్బు కావాలంటూ తనను హింసిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.

ఈ క్రమంలో ఫిబ్రవరి 25న దీపక్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే, ఇందుకు సంబంధించి పోలీసులు నోటీసులు ఇచ్చినా దీపక్ కుటుంబం నుంచి ఎలాంటి స్పందనా రాలేదని హిస్సార్ పోలీసులు జాతీయ మీడియాకు తెలిపారు.
ఈ నేపథ్యంలో తన భర్తలో మార్పు రావడం కష్టమని భావించిన స్వీటీ బూరా విడాకుల కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇటీవల పోలీస్ స్టేషన్‌లో స్వీటీ- దీపక్‌లు తమ మద్దతుదారులతో కలిసి సెటిల్‌మెంట్ కోసం రాగా.. కోపోద్రిక్తురాలైన స్వీటీ భర్తపై దాడి చేసింది.
పోలీస్ స్టేషన్‌లోనే అతడిపై పిడిగుద్దులు కురిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో స్వీటీ సహనం నశించినందు వల్లే ఇలా చేసిందని కొంతమంది మద్దతునివ్వగా.. భరణం కోసం డిమాండ్ చేస్తోందంటూ మరికొంత మంది ఆరోపించారు. అయితే, స్వీటీ మాత్రం వీటిని కొట్టిపారేసింది. మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నాకు విడాకులు కావాలి. అతడి నుంచి ఎలాంటి భరణం అక్కర్లేదు.
నేనేమీ బికారిని కాదు.. ఆ దెయ్యం డబ్బు నాకొద్దు
నా వస్తువులు నాకు తిరిగి ఇచ్చేస్తే చాలు. ఈ సమస్యకు శాంతియుతమైన పరిష్కారం లభించాలని మాత్రమే కోరుకుంటున్నా. హింసకు, అణచివేతకు వ్యతిరేకంగా గొంతెత్తడమే నేను చేసిన తప్పు అనుకుంటా.
విడాకుల కోసం నేను కోర్టులో పిటిషన్ వేశాను. ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలు సమర్పించా. ఆ వ్యక్తి విడాకులు వద్దంటూ నాపై ఒత్తిడి తెస్తున్నాడు. అయినా ఆ దెయ్యం డబ్బులు నాకెందుకు? నేనేమీ బికారిని కాదు. నాకు న్యాయం మాత్రమే కావాలి. ఇంకేమీ వద్దు’’ అంటూ స్వీటీ బూరా తీవ్ర భావోద్వేగానికి లోనైంది.
చదవండి: చహల్ మాజీ భార్య అంటే రోహిత్ శర్మ సతీమణికి పడదా.. ఎందుకు ఇలా చేసింది..?
Comments
Please login to add a commentAdd a comment