Sweety
-
Anushka Shetty Birthday: లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి బర్త్‌డే ఫోటోలు
-
Womens World Boxing Championships 2023: ప్రపంచాన్ని గెలిచిన మన బంగారాలు
ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్(ఐబీఏ) న్యూదిల్లీలో (మార్చి15–మార్చి26) నిర్వహించిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ (50 కేజీల విభాగం), స్వీటీ బూరా (81 కేజీల విభాగం), లవ్లీనా (75 కేజీల విభాగం), నీతూ గంగాస్ (48 కేజీల విభాగం) స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. నిఖత్ నుంచి నీతూ వరకు ఎవరిదీ నల్లేరు మీద నడక కాదు. అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. వాటికి దీటుగా పంచ్‌లు ఇచ్చి తమను తాము నిరూపించుకున్న ఈ స్వర్ణవిజేతలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు... నిఖత్ జరీన్: పదమూడేళ్ల వయసులోనే బాక్సింగ్ బరిలోకి దిగింది తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్. నిఖత్లోని ప్రతిభ సంగతి పక్కనపెట్టి ‘మగరాయుడిలా ఈ ఆటలు ఏమిటి’ అన్న వాళ్లే ఎక్కువ. ‘ఎందుకొచ్చిన తలనొప్పి’ అని ఆమె తండ్రి నిఖత్‌ను ఆట మానిపించి ఉంటే విశ్వ విజేతగా నిఖత్‌ను చూసేవాళ్లం కాదు. రింగ్‌లో ఒత్తిడి ఎదురైతే బిత్తరపోయే రకం కాదు నిఖత్. ఆ ఒత్తిడినే బలంగా చేసుకునే నైజం ఆమెది. ఆటకు సంబంధించిన వ్యూహాల పైనే కాదు ఆహార నియమాల విషయంలోనూ దృష్టి సారించే నిఖత్ ప్రతికూల వ్యాఖ్యల గురించి పట్టించుకోలేదు. ఆటలో వ్యూహ ప్రతివ్యూహాలపైనే తన ఆసక్తి. వరుసగా రెండో ఏడాది ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచి తన ప్రత్యేకత చాటుకుంది నిఖత్. మేరీ కోమ్ తరువాత ఒకటి కంటె ఎక్కువ స్వర్ణాలు గెలిచిన బాక్సర్‌గా నిలిచింది. పోరాటమే తన మార్గం. బలం. స్వీటీ బురా: హరియాణాలోని హిసార గ్రామీణ ప్రాంతానికి చెందిన స్వీటీ బురా తండ్రి మహేంద్రసింగ్ ఒకప్పటి బాస్కెట్‌బాల్ ప్లేయర్. తండ్రి ప్రభావంతో ఆటలపై స్వీటిలో ఆసక్తి మొదలైంది. బాక్సింగ్‌లో ఓనమాలు నేర్చుకోవడానికి ముందు స్వీటీ రాష్ట్ర స్థాయి కబడ్డీ ప్లేయర్. కబడ్డీలో స్వీటీ దూకుడు చూసి తండ్రితో సహా చాలామంది ‘ఈ అమ్మాయికి బాక్సింగ్ అయితే కరెక్ట్’ అనుకున్నారు. తండ్రి సూచనతో బాక్సింగ్ వైపు వచ్చింది స్వీటీ. ఒక ఆటలో ‘సూపర్’ అనిపించుకున్నవారికి కొత్తగా వేరే ఆటలోకి వెళ్లి నిరూపించుకోవడం అంత సులువైన విషయం ఏమీ కాదు. స్వీటీ బడ్డింగ్ బాక్సర్‌గా ఉన్నప్పుడు తనకు పెద్దగా సౌకర్యాలు ఉండేవి కావు. ఎక్కడైనా ఖాళీ స్థానం కనిపిస్తే కోచ్ అక్కడ శిక్షణ ఇచ్చేవాడు. పొలం భూముల్లో నేర్చుకున్నామా, పట్టణంలోని ప్రసిద్ధ కోచింగ్ సెంటర్లో నేర్చుకున్నామా అనేదాన్ని స్వీటీ ఎప్పుడూ మనసు మీదికి తీసుకోలేదు. గురువు చెప్పినదానికి తనదైన వ్యూహాన్ని జోడించి ఆటలో రాణించేది. ఒకసారి బాక్సింగ్ రింగ్‌లో ఉన్నప్పుడు స్వీటీకి ప్రత్యర్థి గట్టి పంచ్ ఇచ్చింది. ‘చుక్కలు కనిపించి ఉంటాయి నీకు’ అని తమ్ముడు అరిచాడు. అతను ఎగతాళిగా అన్నాడా, వ్యూహాత్మకంగా అన్నాడా అనేది వేరే విషయంగానీ తమ్ముడు చేసిన కామెంట్‌తో స్వీటీకి బాగా కోపం వచ్చింది. ఆ కోపం బలంగా మారి ప్రత్యర్థికి చుక్కలు చూపించింది! స్వీటీ పంచింగ్ గ్రామర్‌ను చూసి ప్రేక్షకులు వేనోళ్ల పొగిడారు. ఆ విజయంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్‌లో స్వీటీ విజయపరంపర కొనసాగుతూనే ఉంది. ‘ఆట అనేది నా రక్తంలోనే ఉంది’ అని సగర్వంగా చెప్పే స్వీటీ బురాకు రాబోయే ఒలింపిక్స్ అనేది లక్ష్యం. నీతూ గంగాస్: హరియాణా రాష్ట్రంలోని బివానీ జిల్లాలోని ఒక గ్రామంలో పుట్టింది నీతూ గంగాస్. తల్లి మాటల్లో చెప్పాలంటే చిన్నప్పుడు నీతూ చిలిపి అమ్మాయి. స్కూల్లో తగాదాలు, ఫైట్లు! బాక్సింగ్‌లో ఓనమాలు తెలియకపోయినా ప్రత్యర్థులకు బాక్సర్‌లా పంచ్‌లు ఇచ్చేది. ఇది చూసిన తండ్రి జై భగవాన్ కుమార్తెకు బాక్సింగ్‌లో శిక్షణ ఇప్పించడం ప్రారంభించాడు. అప్పుడు నీతూ వయసు 12 సంవత్సరాలు. శిక్షణ తీసుకుంటోందన్న మాటేగానీ బాక్సింగ్‌లో ఎలాంటి ప్రతిభా చూపేది కాదు. ఎప్పుడూ ఎవరో ఒకరి చేతిలో ఓడిపోతూనే ఉండేది. ఒకరోజు ‘ఇక నా వల్ల కాదు నాన్నా. నాకు బాక్సింగ్ వద్దు’ అని ధైర్యంగా తండ్రితో చెప్పింది. ‘అలాగే తల్లీ’ అని ఆయన అని ఉంటే కొత్త చరిత్ర ఆవిష్కరణ అయ్యేది కాదు. కుమార్తెను బాక్సర్‌గా తీర్చిదిద్దడం కోసం చేస్తున్న ఉద్యోగానికి సెలవు(నాన్–పెయిడ్ లివ్) పెట్టి మరీ కుమార్తె ట్రైనింగ్ నుంచి డైట్ వరకు దగ్గరుండి పర్యవేక్షించాడు. కొంతకాలం తరువాత ప్రసిద్ధ బాక్సింగ్ కోచ్, బివానీ బాక్సింగ్ క్లబ్ (బీబీసి) వ్యవస్థాపకుడు జగ్దీష్ సింగ్ దృష్టిలో పడింది నీతూ. ‘బీబీసి’లో చేరడం నీతూకు టర్నింగ్ పాయింట్‌గా మారింది. నిజంగా చెప్పాలంటే అసలు సిసలు శిక్షణ అప్పుడే మొదలైంది. బాక్సింగ్‌లోని మెలకువలను ఔపోసన పట్టి రింగ్‌లో ప్రత్యర్థులను మట్టి కరిపించడం ప్రారంభించింది. గత సంవత్సరం కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం గెలుచుకొని ప్రపంచ దృష్టిని ఆకర్షించింది నీతూ. లవ్లీనా బోర్గో హెయిన్: అస్సాంలోని గోలగాట్ జిల్లాకు చెందిన టికెన్ బోర్గోహెయిన్ చిన్న వ్యాపారి. ‘పాపం ఈయనకు ముగ్గురూ ఆడపిల్లలే’ అని ఎప్పుడూ ఎవరో ఒకరు అకారణ సానుభూతి చూపుతుండేవారు. ముగ్గురు కుమార్తెలలో చిన్న అమ్మాయి లవ్లీనా బోర్గో హెయిన్ అక్కలను స్ఫూర్తిగా తీసుకొని బాక్సింగ్ నేర్చుకుంది. ‘మనకెందుకు బాక్సింగ్’ అని తల్లిదండ్రులు ఎప్పుడూ అనలేదు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చిన్న కుమార్తెను బాక్సింగ్ ఛాంపియన్‌గా చూడాలని కలులు కనేవాడు తండ్రి. 2018, 2019 ఉమెన్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు గెలుచుకొని తల్లిదండ్రుల కళ్లలో వెలుగులు నింపింది లవ్లీనా. గత సంవత్సరం ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలుచుకుంది. అంతర్జాతీయ స్థాయిలో బాక్సర్‌గా పేరు తెచ్చుకున్నా తన మూలాలు మరిచిపోలేదు లవ్లీనా. ఇప్పటికీ తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయం చేస్తుంటుంది. పాదాలెప్పుడూ నేల మీదే ఉండాలనేది తన సిద్ధాంతం. 2020 ఒలింపిక్స్‌లో కాంస్యం గెలుచుకుంది లవ్లీనా. ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలుచుకోవాలనేది తన కల. -
Nikhat Zareen: నిఖత్ తడాఖా
సొంతగడ్డపై భారత మహిళా బాక్సర్లు పసిడి పంచ్‌లతో అదరగొట్టారు. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో తమ అత్యుత్తమ ‘స్వర్ణ’ ప్రదర్శనను సమం చేశారు. ఆదివారం ముగిసిన ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ నాలుగు బంగారు పతకాలతో తమ ప్రస్థానాన్ని ముగించింది. శనివారం నీతూ (48 కేజీలు),స్వీటీ (81 కేజీలు) పసిడి పతకాలు సాధించగా... ఆదివారం నిఖత్ జరీన్ (50 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు) ‘గోల్డెన్’ ఫినిషింగ్ ఇచ్చారు. న్యూఢిల్లీ: గత ఏడాది తాను సాధించిన ప్రపంచ చాంపియన్‌షిప్ పసిడి పతకం గాలివాటమేమీ కాదని భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ నిరూపించింది. ఈ తెలంగాణ అమ్మాయి వరుసగా రెండో ఏడాది ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకంతో మెరిసింది. న్యూఢిల్లీలో ఆదివారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 26 ఏళ్ల నిఖత్ 50 కేజీల విభాగంలో విజేతగా అవతరించింది. ఫైనల్లో నిఖత్ 5–0తో రెండుసార్లు ఆసియా చాంపియన్‌గా నిలిచిన ఎన్గుయెన్ థి టామ్ (వియత్నాం)పై గెలుపొందింది. గత ఏడాది తుర్కియేలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నిఖత్ 52 కేజీల విభాగంలో బంగారు పతకం గెలిచింది. తాజా ప్రదర్శనతో నిఖత్ ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో రెండు స్వర్ణ పతకాలు గెలిచిన రెండో భారతీయ బాక్సర్‌గా గుర్తింపు పొందింది. దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆరు స్వర్ణాలు, ఒక రజతంతో కలిపి ఏడు పతకాలు సాధించింది. 2006లో న్యూఢిల్లీయే ఆతిథ్యమిచ్చిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ నాలుగు స్వర్ణాలు, ఒక రజతంతో కలిపి ఐదు పతకాలు గెలిచింది. దూకుడుగా... థి టామ్‌తో జరిగిన ఫైనల్లో నిఖత్ ఆద్యంతం దూకుడుగా ఆడింది. ఒకవైపు అవకాశం దొరికినపుడల్లా ప్రత్యరి్థపై పంచ్‌ల వర్షం కురిపించింది. మరోవైపు ప్రత్యర్థి విసిరిన పంచ్‌లను కాచుకుంది. తొలి రౌండ్లో నిఖత్‌ను ఒడిసిపట్టుకొని కింద పడేసినందుకు వియత్నాం బాక్సర్‌కు రిఫరీ పెనాల్టీ పాయింట్ విధించారు. ఆ తర్వాత నిఖత్ ఎదురుదాడికి దిగి రెండు రైట్ హుక్ పంచ్‌లతో, ఆ తర్వాత స్ట్రెయిట్ పంచ్‌లతో విరుచుకుపడింది. ఫలితం తొలి రౌండ్లో నిఖత్‌దే పైచేయిగా నిలిచింది. రెండో రౌండ్లో థి టామ్ పుంజుకుంది. నిర్ణాయక మూడో రౌండ్లో నిఖత్ మళ్లీ జోరు పెంచింది. నిఖత్ సంధించిన పంచ్‌కు వియత్నాం బాక్సర్‌కు దిమ్మదిరిగిపోయేలా చేసింది. చివరకు నిఖత్ అదే జోరు కొనసాగించి విజయాన్ని ఖరారు చేసుకుంది. టోర్నీ మొత్తం నిలకడగా రాణించిన నిఖత్‌కు ‘బెస్ట్ బాక్సర్’ అవార్డు కూడా లభించింది. విజేతగా నిలిచిన నిఖత్‌కు లక్ష డాలర్లు (రూ. 82 లక్షల 34 వేలు) ప్రైజ్‌మనీతోపాటు ‘బెస్ట్ బాక్సర్’ పురస్కారం కింద ‘మహీంద్రా థార్’ వాహనం లభించింది. ఓవరాల్ చాంపియన్ భారత్ ఆతిథ్య భారత్ నాలుగు స్వర్ణ పతకాలతో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. చైనా మూడు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలతో ఏడు పతకాలతో రన్నరప్‌గా నిలిచింది. ర్యాంక్ వర్గీకరణలో నెగ్గిన స్వర్ణ పతకాల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటారు. రష్యా ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యంతో మూడు పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. మొత్తం 12 వెయిట్ కేటగిరీలలో 48 పతకాల కోసం బౌట్లు జరగ్గా... 20 దేశాలు కనీసం ఒక్క పతకమైనా సాధించాయి. రష్యా బాక్సర్లను అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) ఈ మెగా ఈవెంట్లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వడంపై పలు దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఐబీఏ నిర్ణయాన్ని నిరసిస్తూ 17 దేశాలు ఈ పోటీలకు దూరంగా ఉన్నాయి. లవ్లీనా తొలిసారి... అస్సాం బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ మూడో ప్రయత్నంలో ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. 2018, 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్న లవ్లీనా ఈసారి మాత్రం విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో లవ్లీనా 5–2తో కైట్లిన్ పార్కర్ (ఆ్రస్టేలియా)పై విజయం సాధించింది. చాంపియన్‌గా నిలిచిన లవ్లీనాకు లక్ష డాలర్లు (రూ. 82 లక్షల 34 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
Womens World Boxing Championship 2023:‘డబుల్’ గోల్డెన్ పంచ్
ప్రపంచ మహిళల బాక్సింగ్‌లో భారత జెండా మరోసారి సగర్వంగా ఎగిరింది. భారత్‌నుంచి మరో ఇద్దరు కొత్త ప్రపంచ చాంపియన్లు రావడంతో ఆ ఘనత సాధించిన బాక్సర్ల సంఖ్య ఏడుకు చేరింది. హరియాణాకే చెందిన నీతూ ఘంఘాస్, స్వీటీ బూరా విశ్వవేదికపై విజేతలుగా నిలిచారు. గతంలో యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రెండు సార్లు విజేతగా నిలిచిన నీతూకు సీనియర్ విభాగంలో ఇది తొలి టైటిల్ కాగా... తొమ్మిది సంవత్సరాల క్రితం సీనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లోనే రజతంతో సరిపెట్టుకొని ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు స్వర్ణం అందుకోవడం స్వీటీ బూరా సాధించిన ఘనత. న్యూఢిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు చేరాయి. 48 కేజీల విభాగంలో నీతూ ఘంఘాస్, 81 కేజీల కేటగిరీలో స్వీటీ బూరా విశ్వ విజేతలుగా నిలిచారు. శనివారం జరిగిన ఫైనల్ పోరులో నీతూ తన ప్రత్యర్థిపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించి అగ్రస్థానంలో నిలవగా...హోరాహోరీ సమరంలో స్వీటీ పైచేయి సాధించింది. వీరిద్దరు తొలి సారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టైటిల్ సాధించడం విశేషం. ఫైనల్లో నీతూ 5–0తో లుట్‌సైఖన్ అల్టాన్సెట్సెగ్ (మంగోలియా)ను చిత్తు చేయగా, స్వీటీ 4–3తో వాంగ్ లినా (చైనా)ను ఓడించింది. ఈ చాంపియన్‌షిప్‌లో భారత్‌నుంచి నలుగురు బాక్సర్లు ఫైనల్ చేరగా, శనివారం ఇద్దరు చాంపియన్లుగా నిలిచారు. నేడు జరిగే ఫైనల్లో భారత్ మరో రెండు స్వర్ణాలను ఆశిస్తోంది. 50 కేజీల కేటగిరీలో నిఖత్ జరీన్, 75 కేజీల విభాగంలో లవ్లీనా బొర్గొహైన్ ఫైనల్ బరిలోకి దిగుతారు. ఏకపక్షంగా... భివానికి చెందిన నీతూ భారీ ప్రేక్షకసమూహం మధ్య తొలి రౌండ్లో ప్రత్యర్థిపై వరుస పంచ్‌లతో విరుచుకుపడింది. లుట్‌సైఖన్ వద్ద జవాబు లేకపోవడంతో 5–0తో ఆధిక్యం లభించింది. రెండో రౌండ్ మాత్రం సమంగా సాగింది. అటాక్, కౌంటర్ అటాక్‌తో సమరం పోటాపోటీగా నడిచింది. ఈ క్రమంలో నీతూకు రిఫరీలు ఒక పాయింట్ పెనాల్టీ కూడా విధించారు. దాంతో రెండో రౌండ్ 3–2తో ముగిసింది. చివరి మూడు నిమిషాల్లో నీతూకు ఎదురు లేకుండా పోయింది. ఒత్తిడికి గురైన మంగోలియా బాక్సర్ కోలుకోలేకపోయింది. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తనను ఓడించిన లుట్‌సైఖన్‌పై ఈ రీతిలో నీతూ ప్రతీకారం తీర్చుకుంది. ప్రేక్షకుల మధ్య ఉన్న నీతూ మెంటార్, ఒలింపిక్ కాంస్యపతక విజేత విజేందర్ సింగ్ ఆమెను ప్రోత్సహిస్తూ కనిపించాడు. అటాక్...డిఫెన్స్... గతంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు గెలిచిన వాంగ్ లినాతో స్వీటీ పోరు హోరాహోరీగా సాగింది. ఆరంభంలో స్వీటీ పంచ్‌లు ప్రభావం చూపలేదు. వాంగ్ సమర్థంగా వాటినుంచి తప్పించుకోగలిగింది. అయితే ఆ తర్వాత నేరుగా స్వీటీ విసిరిన పంచ్‌లు సరిగ్గా వాంగ్‌ను తాకాయి. దాంతో తొలి రెండు రౌండ్లను ఆమె 3–2 ఆధిక్యంతో ముగించింది. మూడో రౌండ్లో స్వీటీ అటు అటాక్, ఇటు డిఫెన్స్ కలగలిపి జాగ్రత్తగా ఆడింది. వాంగ్ పంచ్‌లను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎదుర్కోగలిగింది. దాంతో చివరి రౌండ్లో స్కోరు 4–1గా తేలింది. అయితే ఈ బౌట్‌పై వాంగ్ రివ్యూ కోరినా అంతిమ విజయం స్వీటీదే అయింది. విజేతలుగా నిలిచిన నీతూ, స్వీటీలకు చెరో లక్ష డాలర్లు (సుమారు రూ. 82.7 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. భారత్ నుంచి గతంలో ఐదుగురు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతలుగా నిలిచారు. మేరీకోమ్ (ఆరు సార్లు – 2002, 2005, 2006, 2008, 2010, 2018), సరితా దేవి (2006), ఆర్ఎల్ జెన్నీ (2006), కేసీ లేఖ (2006), నిఖత్ జరీన్ (2022) ఈ ఘనత సాధించగా, ఇప్పుడు ఈ జాబితాలో నీతూ, స్వీటీ చేరారు. 22 ఏళ్ల నీతూ అతి వేగంగా బాక్సింగ్ తెరపైకి దూసుకొచ్చింది. తన ఎడమ చేతి వాటం శైలితో ‘మరో మేరీకోమ్’గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె 2016లో యూత్ నేషనల్స్‌లో తొలిసారి విజేతగా నిలిచి అందరి దృష్టిలో పడింది. కేవలం ఏడేళ్ల వ్యవధిలోనే ఆమె ప్రపంచ చాంపియన్‌గా నిలవడం విశేషం. గత ఏడాది జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించడం ఇప్పటి వరకు నీతూ అత్యుత్తమ ప్రదర్శన. 30 ఏళ్ల స్వీటీ ఆరంభంలో కబడ్డీ క్రీడాకారిణి. కబడ్డీలో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తర్వాత తండ్రి ప్రోత్సాహంతో బాక్సింగ్ వైపు మారింది. మూడు ఆసియా చాంపియన్‌షిప్ పతకాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. 2014లో వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరింది. అయితే ఆ తర్వాత వేర్వేరు కారణాలతో కొంత కాలం ఆటకు దూరమైనా ఇప్పుడు తిరిగొచ్చి సత్తా చాటింది. భారత కబడ్డీ జట్టు కెప్టెన్ దీపక్ నివాస్ హుడా ఆమె భర్త. -
నీతూ, స్వీటీ ‘పసిడి’ పంచ్ పోరు
ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నేడు ఇద్దరు భారత బాక్సర్లు నీతూ (48 కేజీలు), స్వీటీ బూరా (81 కేజీలు) పసిడి పతకాల కోసం పోటీపడనున్నారు. నేటి ఫైనల్స్‌లో లుత్సయ్ఖాన్ (మంగోలియా)తో నీతూ... లీనా వాంగ్ (చైనా)తో స్వీటీ తలపడతారు. హరియాణాకు చెందిన 22 ఏళ్ల నీతూ 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం నెగ్గింది. 2017, 2018 ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకాలను సొంతం చేసుకుంది. సీనియర్ ప్రపంచ చాంపియన్‌లో నీతూ తొలిసారి ఫైనల్‌కు చేరింది. హరియాణాకే చెందిన 30 ఏళ్ల స్వీటీ రెండోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. 2014లో రజత పతకం నెగ్గిన స్వీటీ ఈసారైనా తన పసిడి కలను సాకారం చేసుకుంటుందో లేదో వేచి చూడాలి. ఆదివారం జరిగే ఫైనల్స్‌లో నిఖత్ జరీన్ (50 కేజీలు), లవ్లీనా (75 కేజీలు) పోటీపడతారు. -
పెళ్లికి సిద్ధమైన స్వీటీ?
-
స్వీటీ అని పిలిస్తే స్పందిస్తా!
మనిషి జీవితం మహా సముద్రంలోని అలలలాంటిది. మన జీవితం మన చేతుల్లోనే ఉంటుందని కొందరు అంటుంటారు గానీ, నిజానికి విధి రాతను ఎవరూ మార్చలేరు. అయితే అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. ఇలా ఎదిగిన వారిలో నటి అనుష్క ఒకరు. గత ఒక అనుభవం. దాన్ని తలచుకుంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఎక్కిన మెట్లు మధురాను భూతినిస్తాయి. ఒకప్పటి యోగా టీచర్ ఇప్పుడు మేటి బహుభాషానటి. ఎలాంటి పాత్రనైనా అవలీలగా నటించి మెప్పించగల నాయకి. అందాలు ఆరబోసి యువతను గిలిగింతలు పెట్టగలరు. కత్తి పట్టి అరివీర భయంకరంగా పోరు భూమిలో వీరవిహారం చేయగలరు. జేజెమ్మ లాంటి పాత్రల్లో ప్రేక్షకుల చేత జేజేలు కొట్టించుకోగలరు. సైజ్ జీరో చిత్రంలో బొద్దుగానూ స్వీటీ అనిపించుకోగలరు. 36 ఏళ్ల వయసులోనూ 16 ఏళ్ల పరువాల పడతిలా నిగనిగలాడుతున్న అనుష్క తన గతాన్ని ఒక్క సారి తిరగేసుకుంటే. ఆ సంగతులేమిటో ఆమె మాటల్లోనే చూద్దాం.నేను యోగాలో శిక్షణ పొంది హైదరాబాద్‌లో క్లాసులు నిర్వహిస్తున్నాను.అలాంటి సమయంలో నటిగా అవకాశం వచ్చింది. టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగార్జునకు జంటగా సూపర్ చిత్రంలో నటించే అవకాశాన్ని దర్శకుడు పూరిజగన్నాథ్ కల్పించారు.అప్పటి వరకూ నాకు నటనలో ఓనమాలు తెలియవు. అంతే కాదు సుమారు ఏడాది వరకూ సినిమారంగంలో ఇమడలేక పోయాను. నటనపై ప్రత్కేక దృ ష్టి కూడా పెట్టలేక పోయాను. నటులతో కలిసి నటించేటప్పుడు చాలా సిగ్గు పడేదాన్ని. అంతే కాదు అది తలచుకుని ఎన్నో రాత్రులు బాధపడ్డాను. చాలాసార్లు ఏడ్చేశాను కూడా. అలా మనసు వద్దు అంటున్నా ప్రయత్నం, పట్టుదలతో నటనపై పట్టు సాధించాను. ఆరంభంలో నన్ను గుర్తు పట్టడానికి చేతిలో పాస్‌పోర్టు ఫొటో మినహా ఏమీ లేదు. ఆ తరువాత ఫొటో సెషన్ చేశారు. మీకో విషయం చెప్పాలి. నా అసలు పేరు అనుష్క కాదు. అది సినిమ కోసం పెట్టిందే. అసలు పేరు స్వీటీ.నా పాస్‌పోర్టు, చదువుకున్న సరిఫికెట్స్లో స్వీటీ అనే ఉంటుంది. మరో విషయం ఏమిటంటే మొదట్లో అనుష్క అని ఐదారు సార్లు పిలిస్తేగానీ తిరిగి చూసేదాన్ని కాదు.అదే స్వీటీ అని పిలిస్తే వెంటనే స్పందించేదాన్ని అని తన గతాన్ని గుర్తు చేసుకున్నారు అనుష్క.