kabaddi player
-
ఆట కాదు సుమా!
క్రీడాకారుడి పాత్ర చేయడం అంటే ఆట కాదు సుమా అనాలి. ఎందుకంటే ఆ క్రీడ మీద ఎంతో కొంత అవగాహన సంపాదించాలి. అలాగే ఆ క్రీడకు తగ్గట్టుగా శరీరాకృతిని మార్చుకోవాలి. రామ్‌చరణ్ త్వరలో ఈ పని మీదే బిజీ కానున్నారు. బుచ్చిబాబు సన (ఆర్సీ 16) దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చరణ్ కబడ్డీ ప్లేయర్‌గా కనిపించనున్నారని... కాదు రన్నర్‌గా కనిపిస్తారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి.ఏది ఏమైనా క్రీడాకారుడి పాత్రలో కనిపించడం ఖాయం. ఇందుకోసం రామ్‌చరణ్ కండలు పెంచాలనుకుంటున్నారట. ఈ మేకోవర్ కోసం ఆస్ట్రేలియా వెళతారని సమాచారం. అక్కడ దాదాపు రెండు నెలలు శిక్షణ తీసుకుంటారని భోగట్టా. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రంలో నటిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసి, ఆస్ట్రేలియా ప్రయాణమవుతారని తెలిసింది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ‘ఆర్సీ 16’ షూటింగ్‌ని సెప్టెంబర్ లేదా అక్టోబరులో ఆరంభించేలా యూనిట్ ప్లాన్ చేస్తోందని టాక్. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించనున్నారు. -
ఓ చాంపియన్ కథ
భారతదేశానికి 1980లలో ప్రాతినిధ్యం వహించిన కబడ్డీ ఆటగాడు అర్జున్ చక్రవర్తి జీవితం ఆధారంగా రూపొందిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘అర్జున్ చక్రవర్తి: జర్నీ ఆఫ్ యాన్ అన్సంగ్ ఛాంపియన్’. విజయ రామరాజు టైటిల్ రోల్లో, సిజా రోజ్ కీ రోల్లో విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో శ్రీని గుబ్బల ఈ చిత్రాన్ని నిర్మించారు. -
బలవంతంగా లోబర్చుకున్నాడు.. ఆ ఫోటోలు భర్తకు చూపిస్తానంటున్నాడు..!
శిష్యరికం చేసిన అమ్మాయిని తీర్చిదిద్దవలసిన బృహత్తర బాధ్యత కలిగిన ఓ కామంధ కోచ్, ఆ అమ్మాయి జీవితాన్ని చిదిమేసిన ఉదంతం న్యూఢిల్లీలోని బాబా హరిదాస్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కామాంధ కోచ్ సదరు యువతిని బలవంతంగా లోబర్చుకుని బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు తనతో ప్రైవేట్‌గా ఉన్న ఫోటోలను భర్త చూపిస్తానని బెదిరించి 43.5 లక్షలు కాజేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కామంధ కోచ్‌పై కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుని విచారిస్తామని పేర్కొన్నారు. నిందితుడితో 2012లో పరిచయం ఏర్పడిందని, జాతీయ క్రీడలకు ప్రిపేర్ అయ్యే క్రమంలో తాను కోచింగ్ అకాడమీ చేరానని, 2015లో కోచ్ తనను బలవంత పెట్టి లోబర్చుకున్నాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది. కోచ్ 2018లో తాను సంపాదించిన మొత్తంలో వాటా ఇవ్వాలని బెదిరించాడని, ఆ సమయంలో తాను దాదాపు అర కోటి వరకు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసానని బాధితురాలు తెలిపింది. 2021లో తనకు వివాహం అయ్యాక కోచ్ బెదిరింపులు పతాక స్థాయికి చేరాయని, అతను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తనతో గడిపిన ప్రైవేట్ ఫోటోలను భర్తకు చూపిస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. బాబా హరిదాస్ నగర్ పోలీసులు బాధితురాలి పేరును కానీ నిందితుడి పేరును కానీ బహిర్గతం చేయలేదు. కాగా, ఇటీవలికాలంలో కోచ్‌లు తమ వద్ద శిష్యరికం చేసే అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతుండటం ఎక్కువై పోయాయి. గురువు స్థానంలో ఉన్న వ్యక్తులు తమ వద్ద శిక్షణలో ఉన్న యువతులకు కల్లబొల్లి మాటలు చెప్పి లోబర్చుకుని బ్లాక్ మెయిల్ చేయడం, డబ్బులు డిమాండ్ చేయడం లాంటి నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బాధితులు,సామాన్య ప్రజలు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
పిలిప్పీన్స్‌లో భారత కబడ్డీ కోచ్ దారుణ హత్య!
మనీలా: పిలిప్పీన్స్ రాజధాని మనీలాలో దారుణం సంఘటన వెలుగు చూసింది. భారత్‌లోని పంజాబ్, మోగా ప్రాంతానికి చెందిన కబడ్డీ కోచ్ గుర్ప్రీత్ సింగ్ గిండ్రూ(43)ను దుండగులు కాల్చి చంపినట్లు మనీలా పోలీసులు తెలిపారు. గుర్ప్రీత్ నాలుగేళ్ల క్రితం పిలిప్పీన్స్ వెళ్లాడు. పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన క్రమంలో బుధవారం ఇంట్లోకి చొరబడిన కొందరు దుండగులు కాల్పులు జరిపారు. దీంతో తలలో తూటాలు దిగి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కబడ్డీ కోచ్‌ను దుండగులు ఎందుకు హత్య చేశారు, దాడికి గల కారణాలేంటనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. కెనడాలో మరో ఘటన.. కెనడాలోని ఒంటారియాలో మరో భారతీయుడు హత్యకు గురయ్యాడు. పంజాబ్‌కు చెందిన మోహిత్ శర్మ(28) నిర్మాణుష్య ప్రాంతంలో కారు వెనకసీటులో మృతి చెంది కనిపించాడు. కొద్ది రోజులుగా విదేశాల్లో భారత సంతతి వ్యక్తులపై దాడులు, హత్యలు పెరిగిపోతున్నాయి. భారతీయులపై దాడులు పెరిగిన క్రమంలో కెనడాలో ఉన్న పౌరులు అప్రమతంగా ఉండాలని భారత విదేశాంగ శాఖ మార్గదర్శకాలు సైతం జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ‘స్పీకర్‌ను ఎన్నుకోలేకపోవడం సిగ్గుచేటు’.. రిపబ్లికన్లపై బైడెన్ విమర్శలు! -
కబడ్డీ ప్లేయర్ దారుణ హత్య.. 20 రోజుల్లో 20 మంది..!
చండీగఢ్: పంజాబ్‌లో హత్యల పరంపర కొనసాగుతుంది. రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం కొలువుదీరిన 20 రోజుల్లో 20 హత్యలు జరిగాయని ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, శిరోమణి అకాలీదల్ ఆరోపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో నమోదైన హత్య కేసుల్లో అధిక భాగం క్రీడాకారులవే కావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. గత నెల అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్, భారత స్టార్ రైడర్ సందీప్ నంగల్ హత్య ఉదంతం మరవకముందే తాజాగా మరో కబడ్డీ ప్లేయర్ హత్య చేయబడ్డాడు. పటియాలలోని పంజాబీ యూనివర్సిటీ ప్రాంతంలో ధర్మేంద్ర సింగ్ అనే కబడ్డీ ప్లేయర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా తుపాకులతో కాల్పులు జరిపి హతమార్చారు. ఓ విషయంలో (ఎన్నికలు) ధర్మేంద్రకు అదే ప్రాంతానికి చెందిన కొందరు యువకులతో విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లే గత మంగళవారం ధర్మేంద్రను రాజీకని పిలిపించి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. చదవండి: అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ దారుణ హత్య -
అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ దారుణ హత్య
International Kabaddi Player Sandeep Nangal Shot Dead: దశాబ్ద కాలానికి పైగా కబడ్డీ ప్రపంచాన్ని శాసించిన అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్, భారత స్టార్ రైడర్ సందీప్ నంగల్ సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు. జలంధర్‌లోని మాలియన్ గ్రామంలో స్థానిక కబడ్డీ టోర్నీమెంట్ జరుగుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు సందీప్‌ను అతి దారుణంగా కాల్చి చంపారు. సందీప్ తల, ఛాతీపై దాదాపు 20 రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. కాల్పుల విషయాన్ని జలంధర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లఖ్వీందర్ సింగ్ ధృవీకరించారు. కబడ్డీ సమాఖ్యలో గొడవల కారణంగా సందీప్‌ను హత్య జరిగి ఉండవచ్చని డీఎస్పీ లఖ్వీందర్ సింగ్ అనుమానాన్నివ్యక్తం చేశారు. కాగా, సందీప్‌కు భారత్‌లోనే కాకుండా కెనడా, అమెరికా, యూకేలలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. సందీప్‌ను అభిమానులు డైమండ్ పార్టిసిపెంట్ అని పిలుస్తారు. International Kabaddi player Sandeep Singh Nangal shot dead in #Jalandhar It has started… the deterioration.. Mark my words.. AAP has no interest nor experience in running law & order.. especially in a border state.. I shudder to think what Punjab will become pic.twitter.com/x2VXxfPB8q — Shehzad Jai Hind (@Shehzad_Ind) March 14, 2022 చదవండి: చరిత్ర సృష్టించిన రోహిత్.. అరుదైన ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు -
ఆయుధాలు స్మగ్లింగ్.. జాతీయ క్రీడాకారుడు అరెస్ట్
భోపాల్: ఆయుధాలను అక్రమంగా రవాణా చేస్తున్న జాతీయ కబడ్డీ క్రీడాకారుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతనితోపాటు మరో ముగ్గురు కూడా పోలీసులకు చిక్కారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని గుణలో చోటు చేసుకుంది. నిందితుల నుంచి 5 తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన రింకు జాట్ జాతీయ కబడ్డీ క్రీడాకారుడు. అతను గతంలో ప్రో కబడ్డీ లీగ్ టోర్నమెంట్లతో పాటు దబాంగ్ ఢిల్లీ జట్టు తరపున ఆడాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు ఆయుధాలను అక్రమంగా రవాణా చేయడానికి క్రెటా కారులో గుణ వైపు నుంచి శివపురి వైపు వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఓ బృందంగా ఏర్పడి మైనా ఓవర్ బ్రిడ్జికి చేరుకొని ఆ రూటును పోలీసులు బ్లాక్ చేశారు. కొంతసేపటికి నిందితులు కారు అటు వైపు రావడంతో ఆ కారుని ఆపి అందులో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 5 పిస్టల్ మ్యాగజైన్లతో సహా మూడు అదనపు మ్యాగజైన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుర్హాన్‌పూర్‌కు చెందిన సిగ్లిగార్ల నుంచి పిస్టల్స్ తీసుకువచ్చినట్లు నిందితులు విచారణలో చెప్పారు. వీటిని సరఫరా చేసిన వ్యక్తి సమాచారం కూడా నిందితులు ఇవ్వడంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు ఒక బృందాన్ని కూడా అక్కడకు పంపినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తనయుడి నిర్వాకం.. చీటింగ్ కేసు నమోదు -
కబడ్డీ క్రీడాకారుడికి ఆర్థిక సాయం
సాక్షి, నల్గొండ: కబడ్డీ క్రీడాకారుడికి ఆర్థిక ఇబ్బందులు బంధనాలుగా మారిన తరుణంలో దాతలు ముందుకొచ్చి ఆదుకున్నారు. నల్గొండ జిల్లా నిడమనూర్ మండల కేంద్రంలో గోకికార్ సురేష్ అనే కబడ్డీ క్రీడాకారుడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన మన్నెం రంజిత్ యాదవ్ తన వంతు సాయంగా రూ.10,000 అందించి ఉదారతను చాటుకున్నారు. స్థానిక ఎంపీపీ బొల్లం జయమ్మ, పీఏసీఎస్ జిల్లా డైరెక్టర్ విరిగినేని అంజయ్య చేతుల మీదుగా బాధితుడికి ఈ మొత్తాన్ని అందించారు. కార్యక్రమంలో ఎర్రబెల్లి మాజీ ఎంపీటీసి మన్నెం వెంకన్న యాదవ్, టీఆర్ఎస్ మాజీ యూత్ అధ్యక్షులు ఉన్నం ఈశ్వర్ ప్రసాద్, టీఆర్ఎస్వీ నాగార్జునసాగర్ నియోజకవర్గ కార్యదర్శి కుంటిగొర్ల రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రముఖ కబడ్డీ ప్లేయర్‌ను కాల్చి చంపిన పోలీసు
చండీగఢ్ : కారు పార్కింగ్‌లో గొడవ జరిగి ప్రముఖ కబడ్డీ ఆటగాడిని ఓ పోలీసు అధికారి కాల్చి చంపిన ఘటన పంజాబ్‌లోని కపుర్తాలా జిల్లాలో చోటు చేసుకుంది. మృతి చెందిన కబడ్డీ ప్లేయర్ అర్విందర్ జీత్ సింగ్‌గా గుర్తించారు. కాగా, కాల్పులకు పాల్పడిన ఏఎస్సై పరమ్‌జీత్ సింగ్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగిందంటే.. పంజాబ్‌కు చెందిన ప్రముఖ కబడ్డీ ప్లేయర్ అర్విందర్ జీత్ సింగ్ గురువారం రాత్రి తన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్(ఎస్యూవీ) కారులో రైడింగ్‌కు వెళ్లారు. రాత్రి 9.30 గంటలకు ఓ రోడ్డు పక్కన వారి కారును పార్క్ చేసి అందులోనే కూర్చొని ఉన్నారు. ఇదే సమయంలో... మరో ఎస్‌యూవీలో ఏఎస్సై పరంజీత్‌సింగ్ అటుగా వచ్చాడు. ఇక్కడ ఎందుకు పార్కింగ్ చేశారు? అని అర్విందర్‌ను ప్రశ్నించారు. దీనికి అర్విందర్ సమాధానం చెప్పకుండా కారును స్టార్ట్ చేసి స్పీడ్‌గా దూసుకెళ్లాడు. దీంతో ఏఎస్సైకి అనుమానం వచ్చి వారి కారును ఛేజింగ్ చేశారు. అర్విందర్ సింగ్(ఫైల్ ఫోటో) పోలీసులు వదలట్లేదని భావించిన అర్విందర్... ఓ చోట కారు ఆపి తనతోపాటూ కారులో ఎవరెవరు వచ్చారో చెప్పడానికి వెనక్కి తిరిగాడు. ఇంతలో తన వెహికిల్ నుంచి కిందకు దిగిన ఏఎస్సై... అర్విందర్‌పై కాల్పులు జరిపాడు.దీంతో అర్వింద్ అక్కడికక్కడే మృతి చెందాడు. పక్కనే ఉన్న మరో స్నేహితుడు ప్రదీప్ సింగ్‌కి గాయాలయ్యాయి. వెంటనే అతని ఫ్రెండ్స్... కారు దిగి... ఫైరింగ్ ఆపమని వేడుకున్నారు. దాంతో ఏఎస్సై ఆగాడు. ఆ తర్వాత అదే వెహికిల్‌లో అర్విందర్‌ను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందారని వైద్యులు పేర్కొన్నారు. కాగా, అర్విందర్ స్నేహితుల ఫిర్యాదు మేరకు ఏఎస్సైపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేశారు. -
సౌత్ ఏషియన్ గేమ్స్‌కు ‘కూత’ వేటు దూరంలో...!
కబడ్డీ.. కబడ్డీ అంటూ కూతపెడుతూ గ్రామసీమల్లో సరదాగా ఆడుకునే ఆట నుంచి దేశసరిహద్దులు దాటిఅంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం మూల శివగణేష్‌రెడ్డికి లభించింది. నేపాల్‌లో నిర్వహింనున్న సౌత్ ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనే ఇండియన్ కబడ్డీ జట్టు ప్రాబబుల్స్‌లో చోటు సంపాదించాడు. ఈనెల 26వ తేదీ వరకు హర్యాణలోని రోహ్తక్లో నిర్వహించే ఇండియన్ కబడ్డీ టీం సన్నాహక క్యాంపునకు ఈయన ఎంపికయ్యాడు. అక్కడ సత్తాచాటితే సౌత్ ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనే ఇండియన్ టీంకు ప్రాతినిథ్యం వహించే అవకాశాలు ఉన్నాయి. దేశానికి ప్రాతినిత్యం వహించడమే తన లక్ష్యమని చెబుతున్న మూల శివగణేష్రెడ్డిపై ప్రత్యేక కథనం.. కడప స్పోర్ట్స్ : వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన మోటార్‌మెకానిక్ రామసుబ్బారెడ్డి, నాగమల్లమ్మ దంపతుల కుమారుడైన మూల శివగణేష్‌రెడ్డికి అరుదైన అవకాశం లభించింది. కాగా శివగణేష్‌రెడ్డి ఈ యేడాది నిర్వహించిన ప్రొ కబడ్డీ లీగ్ పోటీల్లో తెలుగుటైటాన్స్ జట్టుకు ఎంపికయ్యాడు. రాయలసీమ నుంచి ప్రొకబడ్డీకి ఎంపికైన తొలి క్రీడాకారుడుగా ఈయన చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి ముగ్గురు క్రీడాకారులు మాత్రమే ప్రొ కబడ్డీలో వివిధ ప్రాంఛైజీలకు ప్రాతినిథ్యం వహించగా అందులో శివగణేష్‌రెడ్డి ఒకరు కావడం విశేషం. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు నేపాల్‌లో నిర్వహించనున్న సౌత్ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనే ఇండియన్ జట్టుకు సన్నాహక క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపులో పాల్గొనే క్రీడాకారులకు ఈనెల 5 నుంచి 26వ తేదీ వరకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ క్యాంపునకు రాష్ట్రం నుంచి మూల శివగణేష్‌రెడ్డికి అవకాశం లభించింది. క్యాంపులో వీరు చూపే ప్రతిభ ఆధారంగా ఇండియన్ టీం తుది జట్టును ప్రకటించనున్నారు. తల్లిదండ్రులతో శివగణేష్‌రెడ్డి మూడు సంవత్సరాల కాలంలోనే అసమాన్య ప్రతిభ.. తన సోదరుడు జనార్ధన్‌రెడ్డి కబడ్డీ క్రీడలో రాణిస్తుండటం చూడటంతో పాటు ఆయన సైతం ప్రోత్సహించడంతో ఇంటర్ పూర్తయిన తర్వాత కబడ్డీ సాధన ప్రారంభించాడు. కబడ్డీ శిక్షకుడు టి. జనార్ధన్ ఆధ్వర్యంలో కబడ్డీలో ఓనమాలు దిద్దుకున్న ఈయన అనతికాలంలోనే పలు అవకాశాలను దక్కించుకున్నాడు. 2018లో నరసాపురంలో నిర్వహించిన జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో ఏపీ జట్టుకు ప్రాతినిథ్యం వహించి రన్నరప్‌గా నిలిచారు. అదే విధంగా ఈ యేడాది ముంబైలోని రోహులో నిర్వహించిన సీనియర్ నేషనల్స్ కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీల్లో సైతం ఏపీ నుంచి ప్రాతినిథ్యం వహించాడు. గత సీజన్లో ప్రొ కబడ్డీ ఎంపికలకు వెళ్లిన ఈయన తృటిలో జట్టులో అవకాశం కోల్పోయాడు. వైజాగ్‌లో నిర్వహించిన క్యాంపులో ఈయన ప్రతిభను గుర్తించిన తెలుగుటైటాన్ నిర్వాహకులు తెలుగుటైటాన్స్లో ఆల్‌రౌండర్‌గా అవకాశం కల్పించారు. ప్రొకబడ్డీ లీగ్ ఏడోసీజన్ కోసం నిర్వహించిన వేలంలో శివగణేష్‌రెడ్డిని రూ. 6లక్షలకు టైటాన్స్ జట్టు సొంతం చేసుకుంది. ఈ సీజన్లో తెలుగుటైటాన్స్ నుంచి ఈయన ప్రొ కబడ్డీలో సత్తాచాటారు. కాగా ఈయన ప్రస్తుతం విజయవాడలో ఇండియన్ కబడ్డీ సాయ్ కోచ్ పద్మజబాల పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నాడు. కబడ్డీ సంఘం ప్రతినిధులు హర్షం.. ఇండియన్ కబడ్డీ కోచింగ్ క్యాంపునకు శివగణేష్‌రెడ్డి ఎంపికకావడం పట్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. గోవర్ధన్‌రెడ్డి, కార్యదర్శి చిదానందగౌడ్, కోశాధికారి టి.జనార్ధన్ సంతోషం వ్యక్తం చేశారు. దేశానికి ప్రాతినిథ్యం వహించడమే లక్ష్యం.. దేశానికి ప్రాతినిథ్యం వహించడమే నా లక్ష్యం. మాది సాధారణ కుటుంబం. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన నాకు ఇంత మంచి అవకాశం లభించడం సంతోషంగా ఉంది. భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా.– మూల శివగణేష్‌రెడ్డి, ఇండియన్ కబడ్డీ టీం క్రీడాకారుడు, కడప -
నాటి కబడ్డీ టీం కెప్టెన్.. నేడు సచివాలయం ముందు..
సాక్షి, మహబూబాబాద్: సచివాలయంలో సీబ్లాక్ ముందు గతంలో ఇండియా కబడ్డీ టీంకు కెప్టెన్‌గా పనిచేసిన కొమురయ్య అనే యువకుడు తనకు ఉద్యోగం రాని కారణంగా మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపాడు. నాలుగేళ్లుగా ఉద్యోగం కోసం చెప్పులరిగేలా తిరిగినా ఉద్యోగం రాకపోవడంతో కొమురయ్య ఆందోళన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ నరసింహ్మలు పేట మండలం కొముల వంచ గ్రామానికి చెందిన కొమురయ్య, మోడల్ స్కూల్లో పీఈటీ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. తనకు ఉద్యోగానికయ్యే అన్ని అర్హతలున్నా ఉద్యోగం ఇవ్వక పోవడం సరికాదన్నారు. గతంలో తాను ఏడాది పాటు భారత కబడ్డీ టీంకు కెప్టెన్‌గా ఉన్నానని, అంతర్జాతీయ కబడ్డీ పోటీలలో భారత్‌కు నేతృత్వం వహించానని కొమురయ్య ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
కూతకు వెళ్తే పతకం కానీ అడ్డుగా పేదరికం
సాక్షి, పత్తికొండ(కర్నూలు) : ప్రతిభ ఉన్న ఎంతో మంది గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం కరువై ఇంటికే పరిమితమవుతున్నారు. అలాంటి వారిలో నరేష్ ఒకరు. అతని ప్రతిభకు పేదరికం అడ్డుగా మారింది. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈ క్రీడాకారుడు కబడ్డీలో రాణిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఏ జట్టులో ఉన్న ప్రత్యేకత చాటుతూ పతకాలు సాధిస్తున్నాడు. ప్రోత్సహిస్తే సత్తా చూపుతానంటున్నాడు. మిగతా వివరాలు అతని మాటల్లో ‘మాది పత్తికొండ మండల పరిధిలోని దేవనబండ గ్రామం. వంకాయల నాగప్ప, సువర్ణమ్మలకు నేను రెండో సంతానం. మోడల్ స్కూల్‌కు ఎంపిక కావడంతో 9వ తరగతిలో చేరా. ప్రస్తుతం అక్కడే సీఈసీ సెకండియర్ చదువుతున్నా. పొలం పనుల్లో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటూ క్రీడలపై ఆసక్తితో కబడ్డీ బాగా అడేవాడిని. ఉపాధ్యాయుల సహకారంతో స్కూల్ స్థాయి టోర్నమెంట్లో పత్తికొండ, పుచ్చకాయలమాడ, బినిగేరి, ఎం.అగ్రహారం, పత్తికొండ, మొలగవల్లి, జొహరాపురంలో టీం తరఫున ఆడాను. ఆదోని జోనల్ పోటీల్లో రాణించడంతో గుర్తించిన జిల్లా అసోషియేషన్ సహకారంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న జాతీయ పోటీలకు అవకాశం లభించింది. ఇండియన్ రూరల్ ఒలంపిక్ అసోషియేషన్ తరఫున మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయి ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జూన్ 7వ తేదీ నుంచి 9వతేదీ వరకు జరిగిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో విద్యార్థి ప్రతిభ చాటాను. ఈ పోటీల్లో ఫైనల్స్ మ్యాచ్‌లో హర్యానా జట్టుపై ఆంధ్రజట్టు రన్నర్స్‌గా నిలిచింది. జట్టులో నేను ప్రతిభ కనపరచడంతో జూన్ 27న రాజస్థాన్‌లో యూత్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలకు అవకాశం కల్పించారు. అక్కడ కూడా ప్రతిభ చాటాను. -
బరువు పెరిగారు
ముంబైలో జరగనన్న కబడ్డీ మ్యాచ్‌కి వచ్చారు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. వచ్చింది గెస్ట్‌గా కాదు. ప్లేయర్‌గా. కంగనా కథానాయికగా ‘బరేలీకి బర్ఫీ’ ఫేమ్ అశ్వనీ అయ్యర్ తివారి దర్శకత్వంలో ‘పంగా’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తున్నారామె. పాత్ర కోసం కంగనా కాస్త బరువు పెరిగారు. ఈ సినిమా ముంబైషెడ్యూల్ శుక్రవారం మొదలైంది. ఈ షెడ్యూల్ పదిహేను రోజులు సాగుతుంది. ‘‘స్టూడెంట్‌గా ఉన్నప్పుడు కూడా నేను అథ్లెటిక్ పర్సన్‌ని కాదు. కానీ నాకు కబడ్డీ ఆట తెలుసు. కబడ్డీ ప్లేయర్స్ ఎలా ఉంటారు? వాళ్ల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? అనే విషయాలపై నాకు అవగాహన ఉంది. దర్శకుడు అశ్వనీ కోరుకున్నట్లుగా నేనీ సినిమా కోసం మారాను. నా నటన పట్ల ఆమె సంతృప్తిగా ఉన్నారు. అది నాకు హ్యాపీ’’ అన్నారు కంగనా రనౌత్. ‘పంగా’ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
సిక్స్ ఫ్లస్ ఫోర్
మూడు సంవత్సరాల క్రితం హిందీ చిత్రం ‘తను వెడ్స్ మను: రిటర్న్స్’లో హాకీ ప్లేయర్‌గా కనిపించారు బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్. ఇప్పుడు తన తర్వాతి చిత్రం ‘పంగా’ కోసం ఆమె కబడ్డీ ప్లేయర్‌గా మారనున్నారు. ‘బరెలీ కీ బర్ఫీ’ ఫేమ్ అశ్విని అయ్యర్ తివారీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. మారుమూల గ్రామానికి చెందిన ఓ యువతి జాతీయస్థాయి కబడ్డీ క్రీడాకారిణి స్థాయికి ఎలా చేరుకుంది? అనేదే చిత్ర కథాంశం. ఈ సినిమాలోని పాత్ర కోసం కంగనా పది కిలోల బరువు పెరగనున్నారు. కానీ ఒకేసారి పది కిలోలు కాకుండా ముందు ఆరు కేజీలు పెరిగి, ఆ తర్వాత మరో నాలుగు కేజీలు పెరుగుతారట. అంటే... సిక్స్ ఫ్లస్ ఫోర్ ఈక్వల్ టు టెన్ అన్నమాట. ఇందుకోసం స్పెషల్ డైట్‌ని కూడా ఫాలో అవుతున్నారట ఆమె. ప్రస్తుతం న్యూయార్క్‌లో హాలీడేని ఎంజాయ్ చేస్తోన్న కంగనా అక్కడ్నుంచి రాగానే కబడ్డీ శిక్షణలో పాల్గొంటారు. కబడ్డీలో కంగనాకు ట్రైనింగ్ పూర్తయ్యాక ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ భోపాల్‌లో స్టార్ట్ అవుతుందట. ఇదిలా ఉంటే కంగనా నటించిన ‘మణికర్ణిక’ వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్ కానుంది. -
కబడ్డీ క్రీడాకారుడి బలవన్మరణం
గుళ్ళపల్లి(చెరుకుపల్లి): విధి ఆడిన ఆటలో జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడు మరణం ఎదుట ఓటమి అంగీకరించాడు. వివరాల్లోకి వెళితే చెరుకుపల్లి మండలంలోని గుళ్ళపల్లి గ్రామానికి చెందిన కె. శంకరరావు, అరుణలకు ఇద్దరు కుమారులున్నారు. చిన్నకుమారుడైన సాయికుమార్(16) కావూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గత కొంత కాలంగా సాయి కుమార్ తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే ఉండటంతో అప్పులు చేసి మరీ వైద్యం చేయిస్తున్నారు. అప్పులపాలు కావటంతో తీసుకున్న బాకీలు ఎలా తీర్చాలో అర్థం కాక తీవ్ర మనస్తాపం చెందిన సాయి కుమార్ ఈ నెల 21వ తేదీన కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనం ద్వారా తెనాలి ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొంది నయమైన తర్వాత ఇంటికి వచ్చారు. ఈ నెల 27వ తేదీన మరలా సాయి కుమార్ ఆరోగ్యం విషమించటంతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ 28వ తేదీన మరణించాడు. దీంతో వైద్యశాల నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ వీరయ్య తెలిపారు. కబడ్డీ అంటే ప్రాణం సాయికుమార్‌కు చిన్ననాటి నుంచి కబడ్డీ క్రీడ అంటే ఎంతో అమితమైన ఆసక్తి. చిన్ననాటి నుంచి పేదరికంలో పుట్టి పెరగటంలో ఎలాగైనా సరే క్రీడల్లో రాణించి స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సాధించలనేది సాయికుమార్ కల, లక్ష్యం. అందుకు తగిన్నట్లుగానే గుళ్ళపల్లి జెడ్పీహెచ్ఎస్లో 10వ తరగతి పూర్తిచేశాడు. పాఠశాల స్థాయిలోనే కబడ్డీ క్రీడలో విశేషంగా రాణించి జోన్లో, రాష్ట్రస్థాయిలో జట్టుగెలుపులో కీలక పాత్రను పోషించాడు. అంతేకాకుండా కబడ్డీలో రాష్ట్రస్థాయిలో రాణించి ఎట్టకేలకు జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. దీంతో అతడికి కోచింగ్ ఇచ్చిన ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో సంబరపడిపోయారు. కానీ అంతలోనే సాయికుమార్ చనువు చాలించటం ఎంతో బాధాకరమని ఉపాధ్యాయులు, ప్రజలు కన్నీరుమున్నీరయ్యారు. -
వరుసగా ఎనిమిదో స్వర్ణం సాధిస్తాం: రాహుల్ చౌదరీ
సనత్‌నగర్: వరుసగా ఏడుసార్లు విజేత... ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్టు ఘనత. ఇదే ఆనవాయితీని కొనసాగించేందుకు అజయ్ ఠాకూర్ సేన సిద్ధమైంది. ఆగస్టులో ఇండోనేసియా వేదికగా జరుగనున్న ఈ క్రీడల్లో ఎనిమిదో స్వర్ణాన్ని సాధించడమే తమ లక్ష్యమంటున్నాడు భారత స్టార్ రైడర్ రాహుల్ చౌదరి. మషాల్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ‘రైడ్ ఫర్ గోల్డ్’ పేరిట జరుగుతోన్న ప్రచార కార్యక్రమంలో రాహుల్ చౌదరి పాల్గొన్నాడు. బేగంపేట్‌లోని గీతాంజలి స్కూల్ ప్రాంగణంలో పాఠశాల విద్యార్థులతో కలిసి సందడి చేశాడు. చిన్నారులతో కబడ్డీ ఆడుతూ వారిని ప్రోత్సహించాడు. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ కార్యక్రమంలో గీతాంజలి స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ జయకరణ్, ప్రిన్సిపల్ మాయ సుకుమారన్, ఫిజికల్ ట్రైనర్ శశాంక్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులతో రాహుల్ చౌదరీ విద్యార్థుల ప్రశ్న: 1990లో తొలి స్వర్ణం సాధించి నప్పటికీ, ఇప్పటికీ జట్టులో తేడా ఏమైనా ఉందా? రాహుల్: మొదటిసారి పోటీలకు వెళ్లినప్పుడు ప్రత్యర్థి ఆటగాళ్లు ఎలా ఉంటారో? వారి బలాలు, బలహీనతలు ఏంటి? అనే అంశాలపై అవగాహన లేదు. ఇప్పుడు ఆ పరిస్థితిని అంచనా వేయగలుగుతున్నాం. కానీ అప్పుడు ఇప్పుడూ ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. రోజూ ప్రాక్టీస్‌కు ఎంత సమయం కేటాయిస్తారు? ఉదయం 45 నిమిషాల వ్యాయామం, వాకింగ్‌తో సరిపెడితే కుదరదు. కోచ్ పర్యవేక్షణలో 6 గంటలు, స్వతహాగా టీమ్ సభ్యులందరం కలిసి మరో 6 గంటలు... మొత్తం 12 గంటలు ప్రాక్టీస్‌కే అంకితమవుతాం. ఫిట్నెస్ కోసం ఎలాంటి ఆహారం తీసుకుంటారు? పిజ్జాలు, బర్గర్లకు చాలా దూరంగా ఉంటాం. సహజమైన పోషకాలు లభించే ఆహారానికే ప్రాధాన్యత ఇస్తాం. డ్రైప్రూట్స్, నట్స్ ఎక్కువగా తీసుకుంటాం. వరుసగా ఎనిమిదోసారి బంగారు పతకం సాధిస్తామని గట్టిగా ఎలా చెబుతున్నారు? ఏడేళ్లుగా వివిధ దేశాల జట్ల ఆటతీరును నిశితంగా పరిశీలించాం. వారి బలాలు, బలహీనతలు స్పష్టంగా అవగతమయ్యాయి. వీటితో పాటు యావత్ భారత జాతి కూడా మాకు మద్దతుగా ఉంది. కచ్చితంగా స్వర్ణం సాధిస్తామనే విశ్వాసం బలంగా ఉంది. -
‘కూత’ పెడితే మోతే
హుస్నాబాద్ : కబడ్డీ అంటే అతడికి ప్రాణం.. ఓ కుగ్రామంలో పేద కుటుంబంలో జన్మించి చిన్నతనం నుంచే కబడ్డీపై మక్కువ పెంచుకున్నాడు. కూత పెడతూ ప్రత్యర్థి జట్టులో మోత మోగించి జాతీయస్థాయి ప్రో కబడ్డీ క్రీడాకారుడిగా పేరు ప్రఖ్యాతలు సాధించి గర్వకారణంగా నిలిచిన మల్లేశ్‌కు ఏషియన్ గేమ్స్‌లో మన దేశ జట్టు నుంచి ఆడే సువర్ణావకాశం వరించిన సందర్భంగా ప్రత్యేక కథనం.... హుస్నాబాద్ మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన గంగాధరి మల్లేశ్ నేడు జాతీయస్థాయిలో ప్రముఖ క్రీడాకారుడిగా చరిత్రపుటలో స్థానం సంపాదించాడు. మల్లే‹శ్ కుటుంబ నేపధ్యం నిరుపేద కుటుంబం. గంగాధర్ భద్రయ్య, సత్తెమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇందులో చిన్నవాడు మల్లేష్. చిన్న వయసులోనే తండ్రి మరణించాడు. కుటుంబ పోషణభారం తల్లి సత్తెమ్మపై పడింది. కూలీనాలీ చేసుకుంటూ పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దింది. గ్రామంలో యువకులు సరదాగా అడుతున్న కబడ్డీ చూసి ఆకర్షితుడయ్యాడు. అంతకపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి వరకు చదివాడు. తెలంగాణ కబడ్డీ క్రీడకు పుట్టినిల్లు.. కానీ ఇక్కడ కబడ్డీ ఆట ఆటేందుకు క్రీడా మైదానం ఉండదు. మెలకువలు నేర్పడానికి కోచ్‌లు ఉండరు. ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ సున్నంతో కోర్టును తయారు చేసుకొని సరదాగా ఆడిన కబడ్డీ ఆట నేడు వారి జీవితాల్లో వెలుగులు నింపుతుతోంది. చీకటి బతుకుల నుంచి వెలుగులోకి వచ్చిన ఆణిముత్యం మల్లే‹శ్ నేషనల్ నుంచి ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్‌ల వరకు తన సత్తా చాటి నేడు ఆదే కబడ్డీ క్రీడా కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి గర్వకారణంగా నిలిచాడు. ఇప్పటికే ప్రో కబడ్డీ పోటీల్లో మరోసారి తన సత్తా చాటుకునేందుకు జైపూర్ జట్టుకు ఎంపిక కాగా, తాజాగా ఏషిషన్ గేమ్స్‌లో మన దేశ జట్టులో ఆడేందుకు తెలంగాణ నుంచి ఆడే సదవకాశం మల్లేశ్‌ను వరించింది. గల్లీ నుంచి ప్రోకబడ్డీ వరకు.. గల్లీలో స్వయంకృషితో కబడ్డీ ఆట పై పట్టు పెంచుకున్న మల్లేశ్ ఎన్నికష్టాలు వచ్చినా వాటిని అధిగమించి గర్వించే క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అండర్ –19 నేషనల్ కబడ్డీ పోటీల్లో పాల్గొని సత్తా చాటాడు. ఇంటర్ చదువుతూనే హిమాలయలో జరిగిన నేషనల్ స్థాయి పోటీలలో ఆడి తన క్రీడకు పదును పెట్టాడు. కబడ్డీ ఆటే ప్రాణంగా రోజు ప్రాక్టీస్ చేస్తుండగా, హైదరాబాద్‌లోని కబడ్డీ అకాడమీలో చేరి అక్కడే చదువుతో పాటు క్రీడపై మరిన్ని మెలకువలు నేర్చుకున్నాడు. అక్కడి నుంచి వెనుకడుగు వేయలేదు. చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, చెన్నై, మధురలో జరిగిన నాలుగు జూనియర్ నేషనల్ స్ధాయి కబడ్డీ పోటీలు, అలాగే హైదరాబాద్, కేరళ, తమిళనాడు, రాజస్ధాన్, కర్ణాటక సీనియర్ నేషనల్ కబడ్డీ పోటీల్లో పాల్గొని మరింత పరిణితి సాధించాడు. అనంతరం గోవా, విశాఖపట్టణంలో జరిగిన బీచ్ కబడ్డీ పోటీల్లో తన ప్రతిభను చాటాడు. బెంగుళూర్, భూపాల్‌లో జరిగిన సీనియర్ ఇండియన్ క్యాంప్‌లో ప్రాతినిధ్యం వహించాడు. భారత దేశంలో మొదటి సారిగా ప్రొకబడ్డీ బూమ్‌లో మల్లేశ్‌కు చోటుదక్కింది. తాజాగా ఏషియన్ గేమ్స్‌కు.... ఇప్పటికే ప్రొకబడ్డీ లీగ్ పోటీల్లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టుకు ఆడుతున్న మల్లేశ్ తాజాగా ఏషియన్ గేమ్స్‌కు ఎంపికయ్యాడు. మన దేశం జట్టు నుంచి ఏషిషన్ గేమ్స్‌లో ఆడేందుకు సౌత్ ఇండియా నుంచి మల్లేష్ ఒక్కడికే అవకాశం దక్కింది. జట్టులో 12 మంది క్రీడారులను ఎంపిక చేయగా. ఇందులో మల్లేశ్‌కు చోటు దక్కింది. ఆగస్టు 18 నుంచి ఇండోనేషియాలో జరిగే ఏషియన్ గేమ్స్‌లో మరోసారి అదృష్టాన్ని పరిక్షించుకోనున్నాడు. అదృష్టంగా భావిస్తున్నా మాది పేద కుటుంబం, నా తల్లి కూలీ నాలీ చేసి నన్ను పోషించింది. సీనియర్ క్రీడాకారుల స్ఫూర్తితో ఈ స్థాయికి ఎదిగాను. చిన్న పల్లె నుంచి వచ్చిన నాకు ప్రోకబడ్డి లీగ్ పోటీల్లో ఆడటం నా పూర్వజన్మ సుకృతం. గ్రామస్తులు, స్నేహితులు ఎంతోగానో సహకరించారు. స్పోర్ట్స్ కోటాలో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ అవకాశం రావడం ఆనందంగా ఉంది. క్రీడలను నమ్ముకుంటే భవిష్యత్ ఉంటున్నదనడానికి నా ఉద్యోగమే నిదర్శనం. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నాను. – గంగాధరి మల్లేశ్, కబడ్డీ క్రీడాకారుడు -
మేటి ఆటగాడవ్వడమే నేరం!
ప్రకాశం, చీరాల రూరల్: కబడ్డీ ఆటలో జాతీయ స్థాయిలో రాణిస్తుండటమే అతను చేసిన నేరం, దానికి తోడు పాత కక్షలు తోడు కావడంతో మద్యం మత్తులో కళ్లు మూసుకుపోయిన దుర్మార్గులు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కబడ్డీ క్రీడాకురుడు నరేష్‌ది హత్యగా పోలీసులు గుర్తించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు 9 మంది నిందితులను అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. బుధవారం కొత్తపేటలోని తన కార్యాలయంలో డీఎస్పీ ప్రేమ్‌కాజల్ నిందితుల వివరాలను, హత్యకు దారితీసిన పరిస్థితులను వెల్లడించారు. చినగంజాం మండలం కడవకుదురు గ్రామానికి చెందిన టంగుటూరి నరేష్‌కు అదే గ్రామానికి చెందిన బత్తిన పున్నయ్య, బత్తిన చిన్న సుబ్బారావు, పేరాబత్తుల రామకృష్ణ, కేశన సుబ్బయ్య, పాల కేంద్రం రామయ్య, బత్తి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేష్, సోమిశెట్టి సుబ్బారావు, బత్తిన శ్రీరాం, బత్తిన చైతన్య, బత్తిన చిరంజీవితో కబడ్డీ ఆట విషయంలో మాటామాటా పెరిగింది. దీనికి తోడు పాత కక్షలు కూడా మనసులో ఉండటంతో ఈ నెల 8వ తేదీ రాత్రి వివాదం జరిగింది. నిందితులంతా మద్యం సేవించి నరేష్‌ను బూతులు తిట్టి కొట్టి గాయపరచడంతో స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత అందరూ కలిసి నరేష్‌ను రెండు బైకుల సాయంతో సమీపంలోని పాలపర్తి వెంకటేశ్వర్లుకు చెందిన జామాయిల్ తోటలోకి తీసుకెళ్లి మెడకు తాడు బిగించి హత్య చేశారు. ఆత్మ హత్యగా చిత్రీకరణ అమానుషంగా నరేష్‌ను అంతమొందించిన నిందితులు జామాయిల్ తోటలోని ఒక చెట్టుకు లుంగీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించారు. యజమాని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. తన భర్తను ఎవరో హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని భార్య సంధ్య చినగంజాం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొదట అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. డీఎస్పీ డాక్టర్ ప్రేమ్‌కాజల్ ఆధ్వర్యంలో ఇంకొల్లు సీఐ శేషగిరిరావు, చినగంజాం ఎస్సై వెంకటేశ్వర్లు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులు కడవకుదురు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉండగా అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన లుంగీతో పాటు నైలాన్ తాడు, కర్రలు, ఇనుప చువ్వ, రెండు బైకులను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండుకు తరలించారు. కసి పెంచుకొని.. మృతుడు నరేష్ నిందితులకు చెందిన భార్యలను బూతులు తిడుతుంటాడని, కబడ్డీ ఆట విషయంలో తన అంతటి వాడులేడని నరేష్ చెబుతుండటంతో జీర్ణించుకోలేని హత్యకు పాల్పడ్డారని డీఎస్పీ తెలిపారు. అందరిపై రౌడీషీట్లు ఓపెన్ చేసినట్లు చెప్పారు. ఇంకొల్లు సీఐ శేషగిరిరావు, చినగంజాం ఎస్సై వెంకటేశ్వర్లు, ఎస్సై అజయ్ కుమార్, పోలీసు సిబ్బంది ఉన్నారు. ఉధృత ఆందోళనలు నరేష్ కాళ్లు భూమికి ఆనుకుని ఉండటంతో బంధువులు ఆందోళన చేపట్టారు. వారికి తోడు నాయీ బ్రాహ్మణ సంఘాలు, ప్రజా సంఘాల నేతలు కూడా వారికి తోడవ్వడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది. నరేష్ హత్యను నిరసిస్తూ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టారు. బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల నగదుతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్లు చేశారు. -
పెళ్లికి ఒప్పుకోని ప్లేయర్.. రూంలో వేసి లాక్!
హర్యానా: జాతీయ స్థాయి మహిళ కబడ్డీ ప్లేయర్ హర్యానా మహిళ కమిషన్‌ను కలిసింది. ఆమె రోహ్తక్ జిల్లా నుంచి ఎంపిక అయ్యింది. తన తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నారని మహిళ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ‘పెళ్లికి నేను నిరాకరించాను. అందుకే వారు నన్ను ఒక గదిలో పెట్టి బీగం వేశారు. నా చదువును, ఆటలను ఇంకా కొనసాగించాలని ఉంది’ అని ఆమె మహిళ కమిషన్ ముందు తన బాధలను తెలిపింది. -
దొంగగా మారిన కబడ్డీ ప్లేయర్
సాక్షి, ఆదిలాబాద్: తాను ఓ జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్.. ఉన్నతమైన చదువు.. ఎలాంటి నేరప్రవృత్తి లేకపోయినప్పటికీ ఉద్యోగం లేక ఖాళీగా ఉండడంతో చెడు అలవాట్లకు బానిసయ్యాడు.. తరచూ మత్తుపదార్థాలు తీసుకోవడం.. ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉన్నావని స్నేహితులు ప్రశ్నించడంతో.. అదే మద్యం మత్తులో దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. చివరకు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. మావల గ్రామ పంచాయతీ పరిధిలోని దస్నాపూర్ సవారి బంగ్లాలో ఈనెల 4న అర్ధరాత్రి సమయంలో అదే కాలనీకి చెందిన ముండె శాంతికిరణ్ దొంగతనానికి పాల్పడి తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు రెండు రోజుల్లోనే కేసును ఛేదించారు. ఖాళీగా ఉన్న శాంతికిరణ్‌పై అనుమానంతో విచారించగా పూర్తి వివరాలు వెల్లడించాడు. విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. మత్తు పదార్థాలకు బానిసైన శాంతికిరణ్ బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తిచేసి జాతీయ అండర్–17 కబడ్డీ పోటీల్లో పాల్గొన్నాడు. మద్యం మత్తులో తాను ఈ పనిచేసినట్లు పోలీసులకు తెలుపడంతో వారుసైతం విస్తుపోయారు. నిందితుడి నుంచి రూ.2.7 లక్షల విలువ చేసే తొమ్మిది తులాల బంగారం, రూ.4200 నగదు స్వా ధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
కబడ్డీకి సరైన ప్రాధాన్యత లేదు
మన దేశంలో కబడ్డీ క్రీడకు సరైన ప్రాధాన్యత లభించడం లేదని బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ వాపోయాడు. తన తదుపరి చిత్రం ‘తేవర్’లో అర్జున్ కాలేరూ. విద్యార్థిగా, కబడ్డీ ఆటగానిగా కనిపించనున్నాడు. తెలుగులో మహేశ్‌బాబు నటించిన ‘ఒక్కడు’ సినిమాను అర్జున్ తండ్రి బోనీకపూర్ హిందీలో తేవర్గా రీమేక్ చేస్తున్నారు. సోనాక్షి సిన్హా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అమిత్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు చిత్రానికి కొన్ని మార్పులు చేశామని అర్జున్ తెలిపాడు. ఈ చిత్రంలో తాను కాలేరూ. విద్యార్థిగా, కబడ్డీ క్రీడాకారునిగా నటిస్తున్నానని చెప్పాడు. తన యాంగ్రీ యంగ్‌మ్యాన్ ఇమేజ్‌కు కాస్త భిన్నంగా ఈ పాత్ర ఉందని తెలిపాడు. ఈ పాత్ర కోసం తాను కబడ్డీ నేర్చుకున్నానని, ఆ క్రమంలో తీవ్రంగా గాయపడ్డానని కూడా చెప్పాడు. ఆ గాయం కారణంగా డిసెంబర్ నెల అంతా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందన్నాడు. ఆ సమయంలోనే కొంతమంది కబడ్డీ క్రీడాకారులను కలుసుకొని ఆటపై అవగాహన పెంచుకున్నానని చెప్పాడు. అయితే ఈ సినిమా కథ కబడ్డీ క్రీడపై కాదని అన్నాడు. ఇది యాక్షన్ చిత్రమని, ఓ సాధారణ యువకుడు, అసాధారణ పరిస్థితులను ఎదుర్కోవడమే చిత్ర కథాంశమని చెప్పాడు. తొలిసారిగా తన తండ్రితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నాడు. ఇది తన చిరకాల స్వప్నమని అర్జున్ చెప్పాడు. తన కోసం ఈ సినిమాను నిర్మించడం లేదని, చిత్ర నిర్మాణం ఆయన వృత్తి అని అన్నాడు.