‘కూత’ పెడితే మోతే | Kabaddi Player Selected To Asian Games | Sakshi
Sakshi News home page

‘కూత’ పెడితే మోతే

Published Fri, Jul 13 2018 11:02 AM | Last Updated on Mon, Aug 20 2018 2:14 PM

Kabaddi Player Selected To Asian Games - Sakshi

అభిషేక్‌బచ్చన్, ఐశ్వర్యారాయ్‌ దంపతులతో...

హుస్నాబాద్‌ : కబడ్డీ అంటే అతడికి ప్రాణం.. ఓ కుగ్రామంలో పేద కుటుంబంలో జన్మించి చిన్నతనం నుంచే కబడ్డీపై మక్కువ పెంచుకున్నాడు. కూత పెడతూ ప్రత్యర్థి జట్టులో మోత మోగించి జాతీయస్థాయి ప్రో కబడ్డీ క్రీడాకారుడిగా పేరు ప్రఖ్యాతలు సాధించి గర్వకారణంగా నిలిచిన మల్లేశ్‌కు ఏషియన్‌ గేమ్స్‌లో మన దేశ జట్టు నుంచి ఆడే సువర్ణావకాశం వరించిన సందర్భంగా ప్రత్యేక కథనం.... హుస్నాబాద్‌ మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన గంగాధరి మల్లేశ్‌ నేడు జాతీయస్థాయిలో ప్రముఖ క్రీడాకారుడిగా చరిత్రపుటలో స్థానం సంపాదించాడు.

మల్లే‹శ్‌ కుటుంబ నేపధ్యం నిరుపేద కుటుంబం. గంగాధర్‌ భద్రయ్య, సత్తెమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇందులో చిన్నవాడు మల్లేష్‌. చిన్న వయసులోనే తండ్రి మరణించాడు. కుటుంబ పోషణభారం తల్లి సత్తెమ్మపై పడింది. కూలీనాలీ చేసుకుంటూ పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దింది. గ్రామంలో యువకులు సరదాగా అడుతున్న కబడ్డీ చూసి ఆకర్షితుడయ్యాడు.

అంతకపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి వరకు చదివాడు. తెలంగాణ కబడ్డీ క్రీడకు పుట్టినిల్లు.. కానీ ఇక్కడ కబడ్డీ ఆట ఆటేందుకు క్రీడా మైదానం ఉండదు. మెలకువలు నేర్పడానికి కోచ్‌లు ఉండరు. ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ సున్నంతో కోర్టును తయారు చేసుకొని సరదాగా ఆడిన కబడ్డీ ఆట నేడు వారి జీవితాల్లో వెలుగులు నింపుతుతోంది.

చీకటి బతుకుల నుంచి వెలుగులోకి వచ్చిన ఆణిముత్యం మల్లే‹శ్‌ నేషనల్‌ నుంచి ప్రో కబడ్డీ లీగ్‌ మ్యాచ్‌ల వరకు తన సత్తా చాటి నేడు ఆదే కబడ్డీ క్రీడా కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి  గర్వకారణంగా నిలిచాడు. ఇప్పటికే ప్రో కబడ్డీ పోటీల్లో మరోసారి తన సత్తా చాటుకునేందుకు జైపూర్‌ జట్టుకు ఎంపిక కాగా, తాజాగా ఏషిషన్‌ గేమ్స్‌లో మన దేశ జట్టులో ఆడేందుకు తెలంగాణ నుంచి ఆడే సదవకాశం మల్లేశ్‌ను వరించింది.

గల్లీ నుంచి ప్రోకబడ్డీ వరకు..

గల్లీలో స్వయంకృషితో కబడ్డీ ఆట పై పట్టు పెంచుకున్న మల్లేశ్‌ ఎన్నికష్టాలు వచ్చినా వాటిని అధిగమించి గర్వించే క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అండర్‌ –19 నేషనల్‌ కబడ్డీ పోటీల్లో పాల్గొని సత్తా చాటాడు. ఇంటర్‌ చదువుతూనే హిమాలయలో జరిగిన నేషనల్‌ స్థాయి పోటీలలో ఆడి తన క్రీడకు పదును పెట్టాడు. కబడ్డీ ఆటే ప్రాణంగా రోజు ప్రాక్టీస్‌ చేస్తుండగా, హైదరాబాద్‌లోని కబడ్డీ అకాడమీలో చేరి అక్కడే చదువుతో పాటు క్రీడపై మరిన్ని మెలకువలు నేర్చుకున్నాడు.

అక్కడి నుంచి వెనుకడుగు వేయలేదు. చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, చెన్నై, మధురలో జరిగిన నాలుగు జూనియర్‌ నేషనల్‌ స్ధాయి కబడ్డీ పోటీలు, అలాగే హైదరాబాద్, కేరళ, తమిళనాడు, రాజస్ధాన్, కర్ణాటక సీనియర్‌ నేషనల్‌ కబడ్డీ పోటీల్లో పాల్గొని మరింత పరిణితి సాధించాడు. అనంతరం గోవా, విశాఖపట్టణంలో జరిగిన బీచ్‌ కబడ్డీ పోటీల్లో తన ప్రతిభను చాటాడు. బెంగుళూర్, భూపాల్‌లో జరిగిన సీనియర్‌ ఇండియన్‌ క్యాంప్‌లో ప్రాతినిధ్యం వహించాడు. భారత దేశంలో మొదటి సారిగా ప్రొకబడ్డీ బూమ్‌లో మల్లేశ్‌కు చోటుదక్కింది. 

తాజాగా ఏషియన్‌ గేమ్స్‌కు....

ఇప్పటికే ప్రొకబడ్డీ లీగ్‌ పోటీల్లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ జట్టుకు ఆడుతున్న మల్లేశ్‌ తాజాగా ఏషియన్‌ గేమ్స్‌కు ఎంపికయ్యాడు. మన దేశం జట్టు నుంచి ఏషిషన్‌ గేమ్స్‌లో ఆడేందుకు సౌత్‌ ఇండియా నుంచి మల్లేష్‌ ఒక్కడికే అవకాశం దక్కింది. జట్టులో 12 మంది క్రీడారులను ఎంపిక చేయగా. ఇందులో మల్లేశ్‌కు చోటు దక్కింది. ఆగస్టు 18 నుంచి ఇండోనేషియాలో జరిగే ఏషియన్‌ గేమ్స్‌లో మరోసారి అదృష్టాన్ని పరిక్షించుకోనున్నాడు.

అదృష్టంగా భావిస్తున్నా 

మాది పేద కుటుంబం, నా తల్లి కూలీ నాలీ చేసి నన్ను పోషించింది. సీనియర్‌ క్రీడాకారుల స్ఫూర్తితో ఈ స్థాయికి ఎదిగాను. చిన్న పల్లె నుంచి వచ్చిన నాకు ప్రోకబడ్డి లీగ్‌ పోటీల్లో ఆడటం నా పూర్వజన్మ సుకృతం. గ్రామస్తులు, స్నేహితులు ఎంతోగానో సహకరించారు.

స్పోర్ట్స్‌ కోటాలో కమర్షియల్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగ అవకాశం రావడం ఆనందంగా ఉంది. క్రీడలను నమ్ముకుంటే భవిష్యత్‌ ఉంటున్నదనడానికి నా ఉద్యోగమే నిదర్శనం. ఏషియన్‌ గేమ్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నాను. – గంగాధరి మల్లేశ్, కబడ్డీ క్రీడాకారుడు   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement