
సాక్షి, సిద్ధిపేట: ఓ చిన్నారి కథ విని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు భావోద్వేగానికి గురయ్యారు. సిద్ధిపేటలో విద్యార్థుల కోసం లీడ్ ఇండియా ఆధ్వర్యంలో 'భద్రంగా ఉండాలి.. భవిష్యత్‌లో ఎదగాలి' అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హరీష్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి మాటలకు ఆయన చలించిపోయారు.. కంటతడి పెట్టారు.

ఆ విద్యార్థిని మాట్లాడుతూ తన తండ్రి చిన్నప్పుడే చనిపోయాడని.. తల్లే తనను కష్టపడి చదివిస్తోందని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ చిన్నారి మాటలు విన్న హరీష్‌రావుతో పాటు ఆ వేదికపై ఉన్న వారంతా ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ఆ బాలికను ఆత్మీయంగా దగ్గరికి తీసుకునన్న హరీష్‌రావు.. వేదికపై తన పక్కన కూర్చోబెట్టుకుని ఓదార్చారు.


