
సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలో నడుస్తుంది ప్రజా పాలన కాదని, రాక్షస పాలన అని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్లెవరూ లేదరని తేల్చిచెప్పారు. వరద బాధితులకు సహాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ముందుగా మేల్కొంటే మరింత ప్రాణనష్టం తగ్గే అవకాశం ఉండేదన్నారు.
ఈ మేరకు సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో గురువారం ఖమ్మం వరద బాధితులకు సరుకులు పంపే వాహనాలను హరీష్ రావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం, మహబూబాబాద్‌లో వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. సిద్దిపేట నుంచి ఉడుతా భక్తిగా సహాయం చేస్తున్నామన్నారు. మానవ సేవయే మాధవ సేవ అని అందరూ ముందుకు వచ్చి వరద బాధితులకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నెల వేతనం వరద బాధితులకు అందిస్తున్నామని చెప్పారు. తమలాగే బీజేపీ, మిగతా పార్టీల నాయకులు సహాయం చేయడానికి మందుకు రావాలని కోరారు. తాము వరద సహాయం చేయడానికి ఖమ్మం వెళ్తే తమపై దాడి చేసి కేసులు నమోదుచేస్తున్నారని ఆరోపించారు. అక్కడి ప్రజలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారని చెప్పారు తమకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేకే దాడులు చేస్తున్నారని విమర్శించారు. బాధితులకు అన్నం, నీళ్లు ఇవ్వలేకపోయారని చెప్పారు. నీళ్లలో ఇళ్లు మునిగిపోయినవారికి రూ.2 లక్షలు ఇచ్చి ఆదుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment