
బాలీవుడ్ జంటల్లో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ దంపతులకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అభిషేక్ సినీ ఇండస్ట్రీలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వారసుడు కావడంతో ఏ చిన్న విషయమైనా అందరిదృష్టి వారిపైనే ఉంటుంది. గతంలో వీరిద్దరిపై పలుసార్లు విడాకుల రూమర్స్ వినిపించాయి. ఈ జంట త్వరలోనే విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి.
అయితే గత కొద్ది నెలలుగా వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగా కనిపిస్తున్నారు. ఏదైనా శుభకార్యం జరిగితే ఇద్దరు కలిసి వెళ్తున్నారు. ఇటీవల తమ బంధువుల పెళ్లికి హాజరయ్యారు. మహారాష్ట్రలోని పూణెలో తన కజిన్ శ్లోకా శెట్టి సోదరుడి వివాహానికి తన ముద్దుల కూతురు ఆరాధ్యతో కలిసి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక నుంచైనా సోషల్ మీడియా వీరిపై వస్తున్న విడాకుల వార్తలకు చెక్ పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.
కాగా.. అభిషేక్ - ఐశ్వర్య రాయ్ 2007లో వివాహ చేసుకున్నారు. ఆ తర్వాత 2011లో వీరిద్దరి కుమార్తె ఆరాధ్య జన్మించింది. గతేడాది డిసెంబర్‌లో ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన ఆరాధ్య వార్షిక కార్యక్రమానికి కూడా జంటగా కలిసి వచ్చారు. దీంతో విడాకుల వార్తలకు చెక్‌పెట్టేశారు. కొత్త ఏడాది జనవరిలో న్యూ ఇయర్ వేకేషన్ నుంచి తిరిగి వస్తూ విమానాశ్రయంలో కూడా కనిపించారు. వరుసగా ఐశ్వర్య దంపతులు కలిసి హాజరు కావడంతో ఇకపై విడాకుల వార్తలకు చెక్ పడినట్లే.
ఇక సినిమాల విషయానికొస్తే అభిషేక్ చివరిసారిగా బి హ్యాపీలో కనిపించాడు. ఈ చిత్రంలో తన నటనకు ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత అక్షయ్ కుమార్, రితీష్ దేశ్‌ముఖ్‌లతో కలిసి హౌస్‌ఫుల్- 5లో కనిపించనున్నారు. అంతేకాకుండా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించబోయే షారుఖ్ ఖాన్ రాబోయే చిత్రం కింగ్‌లో విలన్‌గా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఐశ్వర్య విషయానికొస్తే చివరిసారిగా పొన్నియన్ సెల్వన్- 2లో కనిపించింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్, కార్తీ, త్రిష కృష్ణన్, శోభితా ధూళిపాళ కీలక పాత్రలు పోషించారు. ఆ తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఇంకా ప్రకటించలేదు.