నిందితుడిని చూపుతున్న పోలీసులు ( ఇన్‌సెట్‌లో)
సాక్షి, ఆదిలాబాద్: తాను ఓ జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్.. ఉన్నతమైన చదువు.. ఎలాంటి నేరప్రవృత్తి లేకపోయినప్పటికీ ఉద్యోగం లేక ఖాళీగా ఉండడంతో చెడు అలవాట్లకు బానిసయ్యాడు.. తరచూ మత్తుపదార్థాలు తీసుకోవడం.. ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉన్నావని స్నేహితులు ప్రశ్నించడంతో.. అదే మద్యం మత్తులో దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. చివరకు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు.
మావల గ్రామ పంచాయతీ పరిధిలోని దస్నాపూర్ సవారి బంగ్లాలో ఈనెల 4న అర్ధరాత్రి సమయంలో అదే కాలనీకి చెందిన ముండె శాంతికిరణ్ దొంగతనానికి పాల్పడి తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు రెండు రోజుల్లోనే కేసును ఛేదించారు. ఖాళీగా ఉన్న శాంతికిరణ్‌పై అనుమానంతో విచారించగా పూర్తి వివరాలు వెల్లడించాడు. విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. మత్తు పదార్థాలకు బానిసైన శాంతికిరణ్ బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తిచేసి జాతీయ అండర్–17 కబడ్డీ పోటీల్లో పాల్గొన్నాడు. మద్యం మత్తులో తాను ఈ పనిచేసినట్లు పోలీసులకు తెలుపడంతో వారుసైతం విస్తుపోయారు. నిందితుడి నుంచి రూ.2.7 లక్షల విలువ చేసే తొమ్మిది తులాల బంగారం, రూ.4200 నగదు స్వా ధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment