
హైదరాబాద్: ఆదిలాబాద్ కు ఆయువుపట్టు సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) అని, దానిని తుక్కుగా అమ్మే కుట్ర బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తోందని, ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీని తుక్కు ఫ్యాక్టరీగా చూస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ తలుచుకుంటే ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీ తెరుచుకోదా? అని ప్రశ్నించారు కేటీఆర్. సిర్పూర్ పేపర్ మిల్లును కేసీఆర్ తెరిపించి నడిపిస్తున్నారన్నారు.
తెలంగాణ ప్రయోజనాలంటే బీజేపీకి పట్టింపులేదన్నారు కేటీఆర్ సీసీఐని పునఃప్రారంభిస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి, ఓట్లు దండుకున్న బీజేపీ, ఇప్పుడు ఆ సంస్థను స్క్రాప్ కింద అమ్మాలనుకోవడం ప్రజలను వంచించడమేనన్నారు. బీజేపీ అంటే నమ్మకం కాదు.. అమ్మకం అంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. కేంద్ర మంత్రులు అమిత్ షాతో సహా ప్రతీ ఒక్కరూ ఎన్నికల్లో లబ్ధికోసం సీసీఐ తెరుస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు అప్పనంగా అమ్మడానికి సిద్ధమయ్యారని కేటీఆర్ మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, అప్పటివరకూ కార్మికులతో కలిసి ఉద్యమిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. సంస్థ పరిరక్షణ కోసం ఎంతవరకూ అయినా పోరాడతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment