Cement Corporation of India
-
కొత్త పారిశ్రామిక పార్కుల్లో కాలుష్య నియంత్రణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న పారిశ్రామిక పార్కుల్లో కాలుష్య నియంత్రణ కోసం అవసరమైన ప్రణాళిక, చర్యలు చేపట్టాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఆదేశించారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) కార్యాలయంలో గురువారం పారిశ్రామిక పార్కుల అభివృద్ధిపై కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశ్రామిక పార్కుల అభివృద్ధిలో అనుసరించాల్సిన ప్రణాళికపై అధికారులకు పలు సూచనలు చేశారు. కాలుష్య నియంత్రణ మండలితో సమన్వయం చేసుకుంటూ పారిశ్రామిక పార్కుల్లో కాలుష్య సమస్య లేకుండా చూడాలన్నారు. నగరం నడిబొడ్డున ఉన్న పరిశ్రమలను ఔటర్ రింగు రోడ్డు వెలుపలకు తరలించేందుకు జరుగుతున్న పనులను వేగవంతం చేసేందుకు పరిశ్రమల శాఖ డైరెక్టర్లు సమన్వయం చేసుకోవాలని సూచించారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించండి హుజూర్నగర్ నియోజకవర్గంలోని పరిశ్రమల్లో స్థానికులకు 70 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే పారిశ్రామిక విధానం కింద ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు ఇస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విజ్ఞప్తి మేరకు నియోజకవర్గంలోని సిమెంట్ కంపెనీల యాజమాన్యాలతో కేటీఆర్ హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. సిమెంటు పరిశ్రమల అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్థానిక యువతకు సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆదిలాబాద్ సీసీఐ ప్లాంట్‌ను పునరుద్ధరించండి ► కేంద్ర పరిశ్రమల మంత్రికి కేటీఆర్ లేఖ ఆదిలాబాద్‌లో మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్లాంట్‌ను పునరుద్ధరించాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. ఈమేరకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండేకు కేటీఆర్ లేఖ రాశారు. ఈ అంశాన్ని గతంలోనూ కేం ద్రం దృష్టికి తెచ్చినా సానుకూల నిర్ణయం రాలేదనే విషయాన్ని గుర్తు చేశారు. 1984లో మర ఠ్వాడ, విదర్భ, ఉత్తర తెలంగాణ ప్రాంత సిమెం టు అవసరాలు తీర్చేందుకు రూ.47 కోట్ల వ్య యంతో ఆదిలాబాద్‌లో 772 ఎకరాల్లో ప్లాంటు, 170 ఎకరాల్లో టౌన్షిప్ నిర్మించారన్నారు. నిధుల లేమితో 1996లో కార్యకలాపాలు నిలిచిపోగా, 2008లో మూసివేశారన్నారు. -
సీసీఐలో ఉద్రిక్తత
తాండూరు రూరల్: మండల పరిధిలోని కరన్‌కోట్ గ్రామ శివారులో ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)లో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలోని ఇళ్లు, ఆహారపదార్థాలు, తాగునీటిపై సిమెంట్ తో కూడిన దుమ్ము విపరీతంగా పడుతోందని గ్రామ యువకులు ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన చేపట్టారు. పర్సనల్ మేనేజర్ గుప్తాను అడ్డుకున్నారు. కార్మికులను విధుల్లోకి వెళ్లకుండా అడ్డుతగిలారు. దీంతో కంపెని ప్రతినిధు లు, యువకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. కరన్‌కోట్ గ్రామానికి చెందిన 50 మంది యువకులు సోమవారం ఉదయం సీసీఐ ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన చేపట్టారు. పర్సనల్ మేనేజర్ గుప్తాను అడ్డుకున్నారు. లిఖిత పూర్వంగా హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించబోమని పట్టుబట్టారు. గుప్తాను తొలుకొని ఫ్యాక్టరీ పక్కనే ఉన్న అడ్మినిస్ట్రేషన్ భవనంలోని తీసుకెళ్లారు. సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. గతంలో ఇచ్చిన హామీ ఏమైంది...! గతంలో సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి విపరీతంగా దుమ్ము వస్తే ఆందోళన చేసిన గ్రామస్తులకు త్వరలో పరిష్కరిస్తానని ఇచ్చిన హామీ ఏమైందని కంపెని ప్రతినిధులను యువకులు ప్రశ్నించారు. అనేకసార్లు వినతిపత్రం ఇచ్చినా ఎందు కు స్పందించ లేరని నిలదీశారు. స్థానిక యువకులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. దుమ్ము వదిలితే కంపెనీకి తాళం వేస్తామని హెచ్చరించారు. రెండు నెలల్లో పరిష్కరిస్తా: జీఎం ఉన్నతాధికారులతో మాట్లాడి రెండు నెల ల్లో దుమ్మును నివారించేందుకు కృషి చేస్తానని కంపెనీ జీఎం వీకే పాండ్యా యువకులకువివరించారు. గ్రామ యువకులకు ఉద్యోగాలు కల్పించే అంశంపై కూడా ఉన్నతాధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని యువకులు డిమాండ్ చేయడంతో కంపెనీ ప్రతినిధులు, యువకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న కరన్‌కోట పోలీస్‌స్టేషన్ ఎస్ఐ ప్రకాష్‌గౌడ్ యువకులతో మాట్లాడి సర్దిచెప్పారు. -
పండుగపూట పస్తులుండాల్నా..?
తాండూరు రూరల్: మండల పరిధిలోని కరన్‌కోట్ శివారులో ఉన్న సీసీఐ (సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఫ్యాక్టరీ ఎదుట కాంట్రాక్టు కార్మికులు బుధవారం ఆందోళనకు దిగారు. దసరా పండుగకు సంబంధించి కంపెనీ యజమాన్యం బోనస్ చెల్లించలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీలో మొత్తం 400 మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా యజమాన్యం బోనస్ చెల్లించాలని కార్మికులు కోరగా యజమాన్యం నిరాకరించింది. కాంట్రాక్టు కార్మికులకు 6 నెలలకు ఓసారి ఇచ్చే డీఏ కూడా ఇవ్వడం లేదని కార్మికులు ఆరోపించారు. బోనస్ చెల్లించకపోతే పండుగపూట పస్తులుండాల్నా..? అని జీఎం శ్రీవాస్తావను కంపెనీలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. యజమాన్యం స్పందించకపోవడంతో కార్మికులు కంపెనీ ఎదుట వంటవార్పు నిర్వహించారు. యజమాన్యం దిగివచ్చే వరకు ఆందోళన ఆపబోమని కార్మికులు స్పష్టం చేశారు. కార్మికుల ఆందోళనకు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు హేమంత్‌కుమార్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో కాంట్రాక్టు కార్మికుల సంఘం నాయకులు జంగయ్య, గౌసొద్దీన్, శంకర్, సుధాకర్, రూప్సింగ్ తదితరులున్నారు. -
ఉద్యోగాలు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)కు చెందిన పానిపట్ రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ కాంప్లెక్స్ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్: 65 విభాగాలు: ఫైర్ అండ్ సేఫ్టీ, ఇన్స్ట్రుమెంటేషన్, పవర్ అండ్ యుటిలిటీస్( ఓ అండ్ ఎం/ బీ అండ్ ఎ), మెకానికల్ ఫిట్టర్ కమ్ రిగ్గర్, ప్రొడక్షన్ అర్హతలు: పదో తరగతి, సబ్ - ఆఫీసర్ కోర్సు(ఫైర్ అండ్ సేఫ్టీ)/ఇన్స్ట్రుమెంటేషన్/ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్/ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/ఐటీఐ ఉండాలి. సంబంధిత విభాగంలో డిప్లొమా అభ్యర్థులకు ఏడాది, ఐటీఐ అభ్యర్థులకు రెండేళ్ల అనుభవం ఉండాలి. జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఎనలిస్ట్: 9 అర్హతలు: బీఎస్సీ (కెమిస్ట్రీ)/ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ) ఉండాలి. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం అవసరం. వయసు: 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: అకడమిక్ మెరిట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబర్ 11 వెబ్సైట్: http://www.panipatrefinery.in/ కెన్‌ఫిన్ హోమ్స్ లిమిటెడ్ బెంగళూరులోని కెన్‌ఫిన్ హోమ్స్ లిమిటెడ్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జూనియర్ ఆఫీసర్ అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ట్రెజరీ/సెక్రటేరియల్ ఆపరేషన్స్‌లో అనుభవం అవసరం. వయసు: 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 18 వెబ్సైట్: http://www.canfinhomes.com/ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెమీ-స్కిల్డ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎలక్ట్రీషియన్ కమ్ స్విచ్‌బోర్డ్ అటెండెంట్ ఆటో ఎలక్ట్రీషియన్(గ్రేడ్-2) వెల్డర్ (గ్రేడ్-2), డీజిల్ మెకానిక్ (గ్రేడ్-2) జూనియర్ ఆపరేటర్(కంప్రెసర్)మిల్లర్ అర్హతలు: ఎలక్ట్రీషియన్/వెల్డర్/ఫిట్టర్(ఆటోమొబైల్/మెషినిస్ట్) ట్రేడ్‌లో ఐటీఐతో పాటు సంబంధిత విభాగంలో నాలుగేళ్ల అనుభవం ఉండాలి. జూనియర్ ఇంజనీర్ (ప్రాసెస్) అర్హతలు: సైన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా కెమికల్ / ఎలక్ట్రికల్ / మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమాతో పాటు రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 10 వెబ్సైట్: www.cementcorporation.co.in/ సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ రాంచీలోని సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సెక్యూరిటీ గార్డ్: 500 అసిస్టెంట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్: 15 అకౌంటెంట్: 12 అర్హతలు తదితర వివరాల కోసం వెబ్సైట్ చూడొచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబర్ 31 వెబ్సైట్: http://www.ccl.gov.in/ -
కాలుష్య కోరల్లో కరన్‌కోట్
తాండూరు రూరల్: మండలంలోని కరన్‌కోట్ గ్రామం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. గ్రామశివారులో ఉన్న ‘సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (సీసీఐ) ఫ్యాక్టరీ నుంచి ప్రతి రోజు గ్రామంలోకి దుమ్ము, ధూళి వస్తోంది. దీంతో గ్రామస్తులు కాలుష్యంతో రోగాల బారిన పడుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అధికారులు దీన్ని చూసీచూడనట్లు నిద్రావస్థలో ఉన్నారు. కరన్‌కోట్ చుట్టూ నాపరాతి నిక్షేపాలు ఉండటంతో 1983లో కేంద్ర ప్రభుత్వం సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీని గ్రామ శివారులో స్థాపించింది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని అప్పట్లో గ్రామస్తులు కం పెనీ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఉపాధి సంగతేమో గానీ కంపెనీ వచ్చినప్పటినుంచి గ్రామస్తులకు రోగాలు మాత్రం ఎక్కువయ్యాయి. రోగాలపాలు కంపెనీ నుంచి వచ్చే దుమ్ము ఇళ్ల ఆవరణలో పెద్ద మొత్తంలో పేరుకుపోతోం దని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చేదబావులు, వాటార్ట్యాంక్ల్లో సైతం దుమ్ము చేరి జనం అస్వస్థతకు గురవుతున్నారు. ముఖ్యంగా ఎక్కువమంది ఊపిరితిత్తులు, అస్తమా వ్యాధులకు గురవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలకు సమీపంలో సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే దుమ్ముతో చిన్నారుల కంటి నుంచి నీరుకారుతోందని తల్లిదండ్రులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి పూట గ్రామస్తులు నిద్రపోయిన తర్వాత కంపెనీ నుంచి దుమ్ము విపరీతంగా వదులుతున్నారు. ఉదయం చూసేసరికి ఇంటి ఆవరణలో, ఇంట్లో వస్తువులపై పెద్దఎత్తున దుమ్ము పేరుకుపోతోంది. యజమాన్యానికి అనేకసార్లు చెప్పినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.