సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న పారిశ్రామిక పార్కుల్లో కాలుష్య నియంత్రణ కోసం అవసరమైన ప్రణాళిక, చర్యలు చేపట్టాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఆదేశించారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) కార్యాలయంలో గురువారం పారిశ్రామిక పార్కుల అభివృద్ధిపై కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశ్రామిక పార్కుల అభివృద్ధిలో అనుసరించాల్సిన ప్రణాళికపై అధికారులకు పలు సూచనలు చేశారు. కాలుష్య నియంత్రణ మండలితో సమన్వయం చేసుకుంటూ పారిశ్రామిక పార్కుల్లో కాలుష్య సమస్య లేకుండా చూడాలన్నారు. నగరం నడిబొడ్డున ఉన్న పరిశ్రమలను ఔటర్ రింగు రోడ్డు వెలుపలకు తరలించేందుకు జరుగుతున్న పనులను వేగవంతం చేసేందుకు పరిశ్రమల శాఖ డైరెక్టర్లు సమన్వయం చేసుకోవాలని సూచించారు.
స్థానిక యువతకు ఉపాధి కల్పించండి
హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని పరిశ్రమల్లో స్థానికులకు 70 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే పారిశ్రామిక విధానం కింద ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు ఇస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విజ్ఞప్తి మేరకు నియోజకవర్గంలోని సిమెంట్ కంపెనీల యాజమాన్యాలతో కేటీఆర్ హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. సిమెంటు పరిశ్రమల అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్థానిక యువతకు సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఆదిలాబాద్ సీసీఐ ప్లాంట్‌ను పునరుద్ధరించండి
► కేంద్ర పరిశ్రమల మంత్రికి కేటీఆర్ లేఖ
ఆదిలాబాద్‌లో మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్లాంట్‌ను పునరుద్ధరించాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. ఈమేరకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండేకు కేటీఆర్ లేఖ రాశారు. ఈ అంశాన్ని గతంలోనూ కేం ద్రం దృష్టికి తెచ్చినా సానుకూల నిర్ణయం రాలేదనే విషయాన్ని గుర్తు చేశారు. 1984లో మర ఠ్వాడ, విదర్భ, ఉత్తర తెలంగాణ ప్రాంత సిమెం టు అవసరాలు తీర్చేందుకు రూ.47 కోట్ల వ్య యంతో ఆదిలాబాద్‌లో 772 ఎకరాల్లో ప్లాంటు, 170 ఎకరాల్లో టౌన్‌షిప్ నిర్మించారన్నారు. నిధుల లేమితో 1996లో కార్యకలాపాలు నిలిచిపోగా, 2008లో మూసివేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment