K T Rama Rao
-
బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి కేటీఆర్ గైర్హాజరు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి బీఆర్ఎస్ జాతీయ విధానాన్ని ఆవిష్కరించనున్నారు. అయితే, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి కేటీఆర్ హాజరుకాలేకపోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. జపాన్ బిజినెస్ వరల్డ్ లీడర్స్‌తో సమావేశం ఉన్న నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ క్రమంలోనే జపాన్ కంపెనీ బోష్ ఆఫీస్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు కేటీఆర్.ఇందుకోసం సీఎం కేసీఆర్ అనుమతి తీసుకున్నారు. ఇదీ చదవండి: KCR BRS: మరో ప్రస్థానం -
మున్సిపల్ శాఖ మంత్రిగా అందరూ నన్నే ట్రోల్ చేస్తారు: కేటీఆర్
హైదరాబాద్: క్యాన్సర్ రోగుల కోసం హైదరాబాద్‌లోని ఖాజాగూడలో నూతనంగా నిర్మించిన స్పర్శ్ హాస్పిస్ భవనాన్ని మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్పర్శ్ హాస్పిస్ నుంచి ఆహ్వానం వచ్చే వరకు పాలియేటివ్ కేర్ అంటే ఏంటో తెలియదని అన్నారు. పాలియేటివ్ కేర్ గురించి స్వయంగా తెలుసుకుంటే గొప్పగా అనిపించిందని తెలిపారు. ఐదేండ్లలోనే స్పర్శ్ హాస్పిస్‌కు మంచి భవనం రావడం సంతోషకరమని పేర్కొన్నారు. చదవండి: బతికుండగానే చంపేశారు.. రోటరీ క్లబ్ చేసే ఆరోగ్య కార్యక్రమాలకు ప్రభుత్వం తరపున సహకారం ఉంటుందన్నారు. స్పర్శ్ హాస్పిస్‌కు నీటి బిల్లు, విద్యుత్ బిల్లు, ఆస్తిపన్ను రద్దుచేస్తామని హామీ ఇచ్చారు. మహాకవి శ్రీశ్రీ అన్నట్లు స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదేనని పేర్కొన్నారు. ప్రభుత్వమే అన్ని చేయాలంటే కుదరదని, ప్రైవేటు సంస్థలతో కూడా ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో వర్షం పడితే ట్రాఫిక్ ఉంటుందన్నారు. అయితే ట్రాఫిక్‌కు సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రిగా అందరూ తననే ట్రోల్ చేస్తారని, కానీ హైదరాబాద్‌లో వర్షం పడితే ట్రాఫిక్ జామ్‌కు తానొక్కడినే బాధ్యుడిని కాదన్నారు. చదవండి: మా పిన్ని ఓ లేడీ టైగర్.. రక్షించండి సార్ -
కొత్త పారిశ్రామిక పార్కుల్లో కాలుష్య నియంత్రణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న పారిశ్రామిక పార్కుల్లో కాలుష్య నియంత్రణ కోసం అవసరమైన ప్రణాళిక, చర్యలు చేపట్టాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఆదేశించారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) కార్యాలయంలో గురువారం పారిశ్రామిక పార్కుల అభివృద్ధిపై కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశ్రామిక పార్కుల అభివృద్ధిలో అనుసరించాల్సిన ప్రణాళికపై అధికారులకు పలు సూచనలు చేశారు. కాలుష్య నియంత్రణ మండలితో సమన్వయం చేసుకుంటూ పారిశ్రామిక పార్కుల్లో కాలుష్య సమస్య లేకుండా చూడాలన్నారు. నగరం నడిబొడ్డున ఉన్న పరిశ్రమలను ఔటర్ రింగు రోడ్డు వెలుపలకు తరలించేందుకు జరుగుతున్న పనులను వేగవంతం చేసేందుకు పరిశ్రమల శాఖ డైరెక్టర్లు సమన్వయం చేసుకోవాలని సూచించారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించండి హుజూర్నగర్ నియోజకవర్గంలోని పరిశ్రమల్లో స్థానికులకు 70 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే పారిశ్రామిక విధానం కింద ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు ఇస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విజ్ఞప్తి మేరకు నియోజకవర్గంలోని సిమెంట్ కంపెనీల యాజమాన్యాలతో కేటీఆర్ హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. సిమెంటు పరిశ్రమల అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్థానిక యువతకు సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆదిలాబాద్ సీసీఐ ప్లాంట్‌ను పునరుద్ధరించండి ► కేంద్ర పరిశ్రమల మంత్రికి కేటీఆర్ లేఖ ఆదిలాబాద్‌లో మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్లాంట్‌ను పునరుద్ధరించాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. ఈమేరకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండేకు కేటీఆర్ లేఖ రాశారు. ఈ అంశాన్ని గతంలోనూ కేం ద్రం దృష్టికి తెచ్చినా సానుకూల నిర్ణయం రాలేదనే విషయాన్ని గుర్తు చేశారు. 1984లో మర ఠ్వాడ, విదర్భ, ఉత్తర తెలంగాణ ప్రాంత సిమెం టు అవసరాలు తీర్చేందుకు రూ.47 కోట్ల వ్య యంతో ఆదిలాబాద్‌లో 772 ఎకరాల్లో ప్లాంటు, 170 ఎకరాల్లో టౌన్షిప్ నిర్మించారన్నారు. నిధుల లేమితో 1996లో కార్యకలాపాలు నిలిచిపోగా, 2008లో మూసివేశారన్నారు. -
‘కృష్ణా’పై టీఆర్ఎస్ రాజీలేని పోరు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల విషయంలో టీఆర్ఎస్ మాత్రమే రాజీలేని పోరాటం చేస్తోందని, తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంతవరకైనా తెగించి కొట్లాడుతామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్, ఘట్కేసర్ మున్సిపాలిటీకి చెందిన పలువురు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు టీఆర్ఎస్లో చేరారు. మంత్రి మల్లారెడ్డి అధ్యక్షతన తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. నదీ జలాల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నాయని అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్పై ప్రజల విశ్వాసం వల్లే గెలుపు సాధ్యమైందన్నారు. గతంలో జీవో 58, 59 తరహాలో జవహర్‌నగర్‌లో ఇళ్ల స్థలాలకు పట్టాలిచ్చే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. కొందరికి పదవులు దొరకగానే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు వ్యవహరిస్తున్నారని, అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కేటీఆర్ సమక్షంలో సోమవా రం టీఆర్ఎస్లో చేరిన వారిలో జవహర్‌నగర్ ము న్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు బల్లి శ్రీనివాస్, కూతడి సాయి, జమలాపూర్ నవీన్, చింతల ప్రేమ ల శ్రీనివాస్ ఉన్నారు. వీరితో పాటు ఘట్కేసర్ ము న్సిపాలిటీకి చెందిన కౌన్సిలర్లు అనురాధ రాఘవరెడ్డి, రాజ్‌పుత్ పూజా భరత్‌సింగ్, సింగిరెడ్డి మధుసూదన్‌రెడ్డి ఉన్నారు. శామీర్‌పేటకు చెందిన ఎంపీటీసీ సభ్యులు సింగిరెడ్డి ఇందిర, మౌనిక శివ వీరప్రసాద్, కోడూరు అశోక్ కూడా టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్లోకి శ్రీశైల్‌రెడ్డి ఈనెల 16న సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు టీజేఎస్ సీనియర్ నాయకుడు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు శ్రీశైల్‌రెడ్డి పంజుగుల తెలిపారు. సోమవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఆయన భేటీ అయ్యారు. ఎల్.రమణకు టీఆర్ఎస్ సభ్యత్వం ఇటీవల టీటీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఎల్.రమణ సోమవారం తొలిసారి తెలంగాణ భవన్‌కు వచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రమణకు టీఆర్ఎస్ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ నెల 16న సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో అధికారికంగా చేరేందుకు రమణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలంగాణ భవన్‌కు వచ్చిన రమణకు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం మంత్రుల నివాస సముదాయంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్‌తో ఎల్.రమణ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్టీలో చేరికపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిసింది. ఎల్.రమణతో పాటు పార్టీలో చేరే టీటీడీపీ నేతల ఎవరెవరనే అంశం ప్రస్తావనకు వచ్చింది. ‘తెలంగాణ సమగ్రాభివృద్ధి, బడుగుబలహీన వర్గాల కోసం కేసీఆర్ చేస్తున్న కార్యక్రమాలతో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నా. ప్రజల కోసం కేసీఆర్‌తో కలసి పనిచేస్తా’అని ఎల్.రమణ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న తర్వాత ఆయన మాట్లాడారు. -
హైదరాబాద్‌లో మెడ్‌ట్రానిక్ ఆర్ అండ్‌డీకేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మెడికల్ టెక్నాలజీ రంగంలో ఉన్న యూఎస్ దిగ్గజం మెడ్‌ట్రానిక్ ఇంజనీరింగ్, ఇన్నోవేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. నానక్‌రామ్‌గూడలో వంశీరామ్ బిల్డర్స్ నిర్మించిన బీఎస్ఆర్ టెక్ పార్క్‌లో 1,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది కొలువుదీరింది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు బుధవారం ఈ ఫెసిలిటీని ప్రారంభించారు. యూఎస్ వెలుపల సంస్థకు ఇది అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రం కావడం విశేషం. మెడ్‌ట్రానిక్ ఈ ఫెసిలిటీకి రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తోందని కేటీఆర్ ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించారు. వచ్చే అయిదేళ్లలో 1,000 మందిని నియమించుకోనుందని చెప్పారు. 150కిపైగా పేటెంట్లు సంస్థ సొంతమని గుర్తు చేశారు. ఏడాది చివరికల్లా 20 కంపెనీలు.. భాగ్యనగరి సమీపంలోని సుల్తాన్పూర్ వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెడికల్ డివైసెస్ పార్క్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇక్కడ ఏడు కంపెనీలు నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయని తారక రామారావు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా మొత్తం 20 కంపెనీల ఫెసిలిటీలు సిద్ధం అవుతాయని వెల్లడించారు. ఇక్కడ ప్లాంట్ల ఏర్పాటుకు కంపెనీలకు ఆసక్తి పెరుగుతోందని గుర్తుచేశారు. పార్క్ విస్తీర్ణం 276 ఎకరాలు. ఇప్పటికే 40 కంపెనీలకు స్థలాన్ని కేటాయించామని తెలంగాణ లైఫ్ సైన్సెస్, ఫార్మా డైరెక్టర్ శక్తి నాగప్పన్ తెలిపారు. ఈ సంస్థలు మొత్తం రూ.1,200 కోట్లు పెట్టుబడి పెడుతున్నాయని చెప్పారు. వీటి ద్వారా 6,700 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని వివరించారు. 4 దశాబ్దాలుగా..: భారత్‌లో నాలుగు దశాబ్దాలుగా మెడ్‌ట్రానిక్ సేవలు అందిస్తోందని సంస్థ వైస్ ప్రెసిడెంట్, ఇండియా ఎండీ మదన్ కృష్ణన్ తెలిపారు. ‘160 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాం. వార్షికాదాయం రూ.9.6 లక్షల కోట్లు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు ఇద్దరు రోగులు మెడ్‌ట్రానిక్ సేవలు అందుకుంటున్నారు. మహమ్మారి ఉన్నప్పటికీ హైదరాబాద్ కేంద్రానికి 150 మందిని నియమించుకున్నాం. ప్రస్తుతం 450 మంది పనిచేస్తున్నారు. ఇక్కడ చేసిన పెట్టుబడులు ఫలితాలను ఇస్తున్నాయి. భారత్‌లో తయారీ కేంద్రం ఏర్పాటును పరిశీలిస్తాం’ అని వివరించారు. -
యువత భాగస్వామ్యంతో పల్లెల్లో మార్పు
సిరిసిల్ల: యువత భాగస్వామ్యంతో పల్లెల్లో మార్పు వస్తోందని ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో బుధవారం ఆయన 30 రోజుల పల్లె ప్రణాళిక అమలు తీరుపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ఎవరికివారు తమ ఇంటిని, వీధిని, ఊరును బాగు చేసుకోవాలన్న సంకల్పం ఉండాలన్నారు. ప్రజాసంకల్పంతోనే పల్లె ప్రణాళిక కొనసాగాలన్నారు. ఈ కార్యక్రమంతో పల్లె ముఖచిత్రం మారిందని తెలిపారు. యువకులు స్వచ్ఛందంగా పల్లెబాగుకు నడుం బిగిస్తే మంచి పనులు జరుగుతాయన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పథకాలు విజయవంతమవుతాయని చెప్పారు. పారిశుధ్యం మెరుగు, పచ్చదనం పెంచేందుకు ఈ ప్రణాళిక పనికొచ్చిందని, ఇదే స్ఫూర్తి కొనసా గించాలని, ప్రజల్లో చైతన్యం వచ్చే వరకు దీనిని ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఊరు ఎలా ఉంది..: మండెపల్లిలో మహిళలు, యువకులు, వృద్ధులతో కేటీఆర్ ముచ్చటించారు. ఊరు ఇప్పుడెలా ఉందని ప్రశ్నించగా.. మంచిగా అయిందని గ్రామస్తులు అన్నారు. ఊరును పాడుచేసే వారికి జరిమానా విధిద్దామా..! అని మంత్రి కోరగా.. చెడ గొట్టే వాళ్లకు జరిమానా వేయాలన్నారు. అంతకుముందు మంత్రి కేటీఆర్ సిరిసిల్ల క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో 30 రోజుల ప్రణాళిక ప్రగతిపై సమీక్షించారు. ఏడాది పొడవునా పల్లెల్లో చేపట్టే కార్యక్రమాల క్యాలెండర్‌ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీ కార్మికులకు బీమా: పంచాయతీ కార్మికులకు ఆరోగ్య బీమా కల్పించేందుకు కేటీఆర్ తన సొంత డబ్బులు రూ.4 లక్షలను ప్రీమియంగా చెల్లించారు. జిల్లాలో పనిచేసే 1,200 మంది పంచాయతీ కార్మికులకు బీమా కల్పించేందుకు చొరవ చూపారు. ఈ చెక్కును కలెక్టర్ కృష్ణభాస్కర్‌కు కేటీఆర్ అందించారు. -
అది ప్రజల మాటే
సాక్షి, హైదరాబాద్: ‘జానాబాబా 40 దొంగలు’అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన కుసంస్కారానికి నిదర్శనమంటూ సీఎల్పీ నేత జానారెడ్డి విమర్శించడాన్ని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తప్పుబట్టారు. రాష్ట్రాన్ని 60 ఏళ్లు పాలించి దోచుకున్న కాంగ్రెస్ నేతల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మంత్రి కేటీఆర్ కూడా అదే మాట అన్నారని, ఇందులో అనుచితమేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను నిత్యం బండ బూతులు తిట్టే కాంగ్రెస్ నేతలు నీతులు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. పార్టీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్, ఎమ్మెల్సీలు గంగాధర్‌గౌడ్, పూల రవీందర్‌తో కలసి శుక్రవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో జగదీశ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. గుడ్డలు ఊడదీసి కొడతాం, దవడలు పగులగొడతామంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుంటే ఆ పార్టీ పెద్దలకు సంస్కా రం గుర్తురాలేదా అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. జానారెడ్డికి కాంగ్రెస్‌లో గౌరవం లేకు న్నా, సీఎం కేసీఆర్ గౌరవం ఇస్తున్నారని చెప్పారు. నల్లగొండ సభలో జాతీయ నాయకుల ముందే కాంగ్రెస్‌లో కొత్తగా చేరిన నాయకులు అసభ్యంగా మాట్లాడితే జానారెడ్డి ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిపై ప్రజలు సంతో షంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ నేతలను ఇంటికి పంపించడానికే ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. మంత్రి కేటీఆర్ ప్రజల మెప్పు పొంది నాయకుడయ్యారని జగదీశ్‌రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని, కాంగ్రెస్ నేతలకు చేతనైతే అసెంబ్లీలో మాట్లాడాలని సవాల్ చేశారు. కాంగ్రెస్‌పైనే ప్రజాగ్రహం తెలంగాణ వస్తే చీకటి రోజులు వస్తాయంటూ నాటి కాంగ్రెస్ నేత, ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి బెదిరించారని...కానీ ప్రస్తుతం తెలంగాణ ప్రజలు, రైతులకు 24 గంటల నిరంతర కరెంటును ఇస్తున్నామని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. విత్తనాల కోసం రోజుల తర బడి క్యూలలో నిలబెట్టిన పాలన కాం గ్రెస్ పార్టీదని... ఇంటికే విత్తనాలను పంపిస్తున్న పార్టీ తమదన్నారు. మోస కారి కాంగ్రెస్ నేతలపై ప్రజలకు కోపం ఉంటుందా లేక అన్ని హామీలనూ నెరవేరుస్తున్న టీఆర్ఎస్ మీద ప్రజలకు కోపం ఉంటుందా అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి వల్ల తెలంగాణ పేరు మూడేళ్లలోనే ప్రపంచంలో మారుమోగిపోతోందన్నారు. గ్రామస్థాయి నుంచి కుటుంబ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని విమర్శించారు. -
‘మంత్రుల గైర్హాజరు సిగ్గుచేటు’
సాక్షి, హైదరాబాద్: నగరంలో వరద పరిస్థితిపై మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నిర్వహించిన సమీక్ష సమావేశానికి హైదరాబాద్‌కు చెందిన మంత్రులెవ్వరూ లేకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి దానం నాగేందర్ విరుచుకుపడ్డారు. నగరంపై అవగాహన ఉన్న మంత్రులను పిలవకుండా నిన్నగాక మొన్న వచ్చి అవగాహనలేమితో నిర్ణయాలు తీసుకుంటున్న కేటీఆర్‌కు ఏమి తెలుసని ప్రశ్నించారు. బుధవారం బంజారాహిల్స్ రోడ్‌నం 10లోని సింగాడికుంట, నాయుడునగర్ బస్తీలలో ఆయన పర్యటించి వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది ఇలాంటి వరదలే వచ్చినప్పుడు కేటీఆర్ ఆరు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. మళ్లీ మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలోను, ఒక్క రోజులో అంతా సర్ధుకుంటుందని మంత్రి చెప్పారు. కానీ ఇప్పుడు ఎక్కడైనా పరిస్థితి సద్దుమణిగిందా అని నిలదీశారు. హైదరాబాద్‌లో వరస వస్తే చెరువులను తలపిస్తున్నాయని పక్కా ప్రణాళిక లేకుండా అధికారులు మీన మేషాలు లెక్కిస్తున్నారని దానం ఆరోపించారు. నాయుడు నగర్లో చుట్టూ మట్టి కుప్పులతో పాటు రాళ్లు పేరుకుపోయాయని సోమవారం నాటి వరదలు మళ్లీ వస్తే ఇవన్నీ కొట్టుకొచ్చి గుడిసెలను ముంచెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా స్థానికులు తినడానికి తిండి లేక ఇక్కట్లు పడుతున్నా ప్రభుత్వం స్పందించిన పాపాన పోలేదన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు నష్టపరిహారం ఇస్తామని పేర్కొన్నారని ఈ డబ్బుతో పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అని ప్రశ్నించారు. వైట్ ట్యాపింగ్ రోడ్లు వేస్తున్నట్లు గతంలో ప్రకటించారని ప్రధాన రోడ్లు సన్నగా చేసి అంతర్గత రహదారులను గాలికి వదిలేశారన్నారు. ఇక్కడి మృతుల కుటుంబానికి కాంగ్రెస్ తరపున ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు దానం నాగేందర్ వెల్లడించారు. నా ఇంటి ముందు చెట్టు విరిగిపడ్డా.. సోమవారం భారీ వర్షానికి జంబారాహిల్స్ రోడ్ నం.3లోని తన ఇంటి ముందు ఓ చెట్టు విరిగిపడిందని దీంతో తాను జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని దానం ఆరోపించారు. తరువాత మెస్సేజ్ పెట్టానని అన్నారు. ఆ కొద్దిసేపటికి డీఎంసీకి కూడా ఫోన్ చేసి ఈ సమస్యను చెప్పానన్నారు. 24 గంటలు గడిచినా రెస్య్కూ టీమ్ రాలేదని మాజీ మంత్రి ఇంటి వద్దే ఈ పరిస్థితి ఉంటే సామాన్యుల ప్రాంతాల్లో ఎంతటి అలక్ష్యం చోటు చేసుకుంటున్నదో ఈ ఘటన అద్దం పడుతుందని ఆయన చెప్పారు. -
ఫిబ్రవరి 13న ఐటీ, స్టార్టప్ పాలసీ!
హైదరాబాద్‌లో నాస్కామ్ 10 కే వేర్‌హౌజ్: కేటీఆర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో :దేశంలో ఎప్పుడూ లేని విధంగా స్టార్టప్ కంపెనీల గురించి మాట్లాడుకోవటం చూస్తున్నామని, అది కూడా దేశ ప్రధాని నుంచే మొదలుకావటం శుభపరిణామమని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి కేటీ రామారావు చెప్పారు. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఎలాగైతే స్టార్టప్ పాలసీని ప్రకటించిందో... దానికి ఏమాత్రం తీసిపోని విధంగా తెలంగాణలోనూ ఐటీ, స్టార్టప్ పాలసీని తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పాలసీ ఆవిష్కరణను వాయిదా వేశామని, ఎన్నికల అనంతరం ఫిబ్రవరి 13న పాలసీని విడుదల చేస్తామని వెల్లడించారు. సోమవారమిక్కడ టీ-హబ్‌లో ‘నాస్కాం 10కే వేర్‌హౌజ్’ను ప్రారంభించిన సందర్భంగా నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్, చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘అకాడమీ స్థాయి నుంచే యువ పారిశ్రామికవేత్తలను తయారు చేయాలి. అందుకే త్వరలోనే కోర్స్ క్రెడిట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. పాఠశాల, కళాశాల స్థాయిలోనే పారిశ్రామిక ఆలోచనలను వెలికితీసి సరైన మార్గదర్శనం చేయడానికిది ఉపకరిస్తుంది. టీ- హబ్‌లో మరిన్ని వేర్‌హౌజ్‌ల ప్రారంభానికి ప్రయత్నిస్తున్నాం’’ అన్నారాయన. సోషల్ రిలేషన్స్‌లోనే అవకాశాలు: చంద్రశేఖర్ దేశంలో యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సంప్రదాయ వ్యాపార పద్ధతుల నుంచి టెక్నాలజీ బిజినెస్‌ల వైపు అడుగులేస్తున్నారని నాస్కామ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ చెప్పారు. ‘‘గతంలో ఈ-కామర్స్, లాజిస్టిక్ రంగంలో ఎక్కువగా స్టార్టప్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు సామాజిక సంబంధమైన (సోషల్ రిలేషన్స్) రంగంలో అవకాశాలు ఎక్కువ’’ అన్నారాయన. సోషల్ రిలేషన్స్ అంటే ఎక్కువ మందికి అవసరమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలన్నారు. త్వరలో విశాఖలోనూ నాస్కామ్ వేర్‌హౌజ్‌ను ఆరంభిస్తామన్నారు. దీన్లో స్టార్టప్ కంపెనీలకు ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలుంటాయి. పారిశ్రామికవేత్తలు, నిపుణుల సల హాలు, సూచనలు, శిక్షణ శిబిరాలు, సదస్సులు, మెంటారింగ్‌లు ఉంటాయి. ఆచరణతోనే విజయం: మోహన్‌రెడ్డి చక్కని ఆలోచనతో స్టార్టప్‌ను తెచ్చినా, దాన్ని ప్రణాళికాబద్ధంగా ఆచరణయోగ్యం చేస్తేనే విజయం దక్కుతుందని నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి చెప్పారు. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడమంటే మౌలిక సదుపాయాలు సమకూర్చడం కాదని, వాటికి అవసరమైన దిశానిర్దేశం, మెంటారింగ్, ఫండింగ్ సమకూర్చాల్సి ఉంటుందని చెప్పారు. టీ-హబ్ అలాగే మొదలైందన్నారు. ‘‘నేటి యువ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అదృష్టవంతులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ స్టార్టప్‌లను బాగా ప్రోత్సహిస్తున్నాయి. మౌలిక సదుపాయాలే కాదు గ్రాంట్లు, రాయితీలూ అందిస్తున్నాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, తయారీ.. ఇలా అన్ని రంగాల్లోనూ సవాళ్లు ఎదురవుతున్నాయి. వాటిని టెక్నాలజీ ద్వారా నివృత్తి చేసి అవకాశాలను అందిపుచ్చుకోవాలి’’ అన్నారాయన. -
ప్లానర్స్‌కు మోడల్ స్టేట్‌గా తెలంగాణ
సీఐఐ సదస్సులో కేటీఆర్ హైదరాబాద్: రానున్న రోజుల్లో నిర్మాణ రంగ ప్లానర్ల్లకు మోడల్ స్టేట్‌గా తెలంగాణ నిలుస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడంలో భాగంగా పట్టణీకరణతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల అనుసంధానానికి భారీగా వ్యయం చేస్తున్నట్టు చెప్పారు. మౌలిక రంగంపై శుక్రవారమిక్కడ సీఐఐ ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్య అతిథిగా విచ్చేసి పారిశ్రామికవేత్తలను ఉద్ధేశించి మంత్రి ప్రసంగించారు. పారిశ్రామిక పార్కులు, విమానాశ్రయాలు, డ్రై పోర్టులతోపాటు సామాజిక మౌలిక వసతులైన విద్యుత్, నీరు, ఇల్లు, ప్రజా రవాణాపైనా దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగానే ఇంటింటికీ నల్లాల ద్వారా మంచి నీటి సరఫరా ప్రాజెక్టును ప్రాధాన్యతగా తీసుకున్నామని వివరించారు. మరిన్ని పీపీపీ ప్రాజెక్టులు.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)లో తెలంగాణలో మరిన్ని మౌలిక ప్రాజెక్టులు రావాలని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సీఈవో ఎస్జీకే కిశోర్ సూచించారు. ఏరోస్పేస్ రంగంలో మానవ వనరుల కొరతను తీర్చేందుకు శిక్షణ సంస్థ ఏర్పాటు అవసరమన్నారు. హైదరాబాద్‌తోసహా ఇతర ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలని సీఐఐ తెలంగాణ శాఖ చైర్పర్సన్ వనిత దాట్ల అభిప్రాయపడ్డారు. శంషాబాద్ విమానాశ్రయం విస్తరణ... పెరుగుతున్న ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌ను జీఎంఆర్ విస్తరించనుంది. ఈ విస్తరణ పనులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించనుంది. విస్తరణ పూర్తి అయితే వార్షిక సామర్థ్యం 1.2 కోట్ల నుంచి 2 కోట్ల ప్రయాణికులకు చేరనుందని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సీఈవో ఎస్జీకే కిశోర్ వెల్లడించారు. 80 వేల టన్నులున్న కార్గో సామర్థ్యం 2016 మార్చికల్లా లక్ష టన్నులకు చేరుతుందని చెప్పారు. ప్రయాణికుల రద్దీ 2014-15లో ఒక కోటి కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 1.2 కోట్లుగా ఉండొచ్చని.. అయిదేళ్లలో 2 కోట్లను తాకుతుందని భావిస్తున్నామని అన్నారు. విస్తరణకు రూ.1,000 కోట్ల వ్యయం అయ్యే అవకాశం ఉంది. -
కొత్త ఇళ్లకు 'సోలార్' తప్పనిసరి: కేటీఆర్
హైదరాబాద్: విద్యుత్ కొరతను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో కొత్తగా నిర్మించే ఇళ్లకు సోలార్ ప్యానల్స్ తప్పని చేయాలని భావిస్తోంది. మెరుగైన, నాణ్యమైన విద్యుత్ కోసం సోలార్ ప్యానల్స్ వాడకాన్ని ప్రోత్సహించనున్నట్టు తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) తెలిపారు. అడ్మినిస్ట్రేటివ్ కాలేజీ నిర్వహించిన వర్క్‌షాపులో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ లో కొత్తగా నిర్మించే ఇళ్లకు సోలార్ ప్యానల్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకునేలా చూడాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించినట్టు కేటీఆర్ తెలిపారు. నగరాల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించినంత మాత్రానా స్మార్ట్ సిటీలు అయిపోవని అన్నారు. పౌరులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందితేనే స్మార్ట్ సిటీలు అవుతాయని అభిప్రాయపడ్డారు. -
ఐటీ వినియోగంతోనే అభివృద్ధి : మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : ఐటీ వినియోగంతోనే సమాజం అభివృద్ధి సాధిస్తుందని ఐటీ మంత్రి కె.టి.రామారావు అన్నారు. నగరంలోని ఒక హోటల్లో సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) ఆధ్వర్యంలో గురువారం జరిగిన సదస్సుకు ఆయన హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ ఐటీ ఉపయోగంతోనే సమాజంలో అభివృద్ధి సాధ్యపడుతుందని, అందుకోసం తీసుకోవాల్సిన చర్యల కు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అనుమతులన్నీ ఒకేచోట లభించేలా సింగిల్ విండో ఏర్పాటుకు కృషి చేస్తామని వెల్లడించారు. అనుమతులు త్వరితగతిన వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. సెల్టవర్ల రేడియేషన్ కార ణంగా క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్ వంటి వ్యాధులు వస్తాయన్న ప్రచారంలో వాస్తవం లేదని సీఓఏఐ డెరైక్టర్ జనరల్ రాజన్ ఎస్.మ్యాథ్యూ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గతంలో పలు సెల్‌ఫోన్ కంపెనీలకు చెందిన 4800 టవర్లపై పరిశోధించగా వాటి రేడియేషన్‌తో సమీపంలోని మనుషులు, పక్షులు, జంతువులకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని స్పష్టమైందని అన్నారు. -
కాంగ్రెస్ మద్దతు తీసుకునే అవకాశమే రాదు: కేటీఆర్
హైదరాబాద్: ఎవరి మద్దతు లేకుండా సొంతంగానే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆపార్టీ ఎమ్మెల్యే కే తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణలో హంగ్ ఏర్పడుతుందని వస్తున్న వార్తలను కేటీఆర్ ఖండించారు. టీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభిస్తుందని ఆయన విశ్వాసం ప్రకటించారు. నిశ్శబ్దంగా, చాపకింద నీరులా టీఆర్ఎస్ కు ఓటుతో ప్రజలు బలంగా మద్దతు తెలిపారని ఆయన అన్నారు. టీఆర్ఎస్ కు అత్యధిక స్థానాలు వస్తాయని మీడియా, ఇంటలిజెన్స్ ద్వారా సమాచారం తమకు ఉందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకునే అవకాశమే రాదని కేటీఆర్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం చేయకూడదనే నిర్ణయం కారణంగా తమకు అనూహ్యమైన మద్దతు తెలంగాణ ప్రజల నుంచి లభించిందని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు.