మెడ్‌ట్రానిక్ ప్రారంభోత్సవంలో కేటీఆర్, మదన్ కృష్ణన్, శక్తి నాగప్పన్ తదితరులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మెడికల్ టెక్నాలజీ రంగంలో ఉన్న యూఎస్ దిగ్గజం మెడ్‌ట్రానిక్ ఇంజనీరింగ్, ఇన్నోవేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. నానక్‌రామ్‌గూడలో వంశీరామ్ బిల్డర్స్ నిర్మించిన బీఎస్‌ఆర్ టెక్ పార్క్‌లో 1,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది కొలువుదీరింది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు బుధవారం ఈ ఫెసిలిటీని ప్రారంభించారు. యూఎస్ వెలుపల సంస్థకు ఇది అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రం కావడం విశేషం. మెడ్‌ట్రానిక్ ఈ ఫెసిలిటీకి రూ.1,200 కోట్లు ఖర్చు చేస్తోందని కేటీఆర్ ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించారు. వచ్చే అయిదేళ్లలో 1,000 మందిని నియమించుకోనుందని చెప్పారు. 150కిపైగా పేటెంట్లు సంస్థ సొంతమని గుర్తు చేశారు.
ఏడాది చివరికల్లా 20 కంపెనీలు..
భాగ్యనగరి సమీపంలోని సుల్తాన్‌పూర్ వద్ద తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెడికల్ డివైసెస్ పార్క్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇక్కడ ఏడు కంపెనీలు నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయని తారక రామారావు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా మొత్తం 20 కంపెనీల ఫెసిలిటీలు సిద్ధం అవుతాయని వెల్లడించారు. ఇక్కడ ప్లాంట్ల ఏర్పాటుకు కంపెనీలకు ఆసక్తి పెరుగుతోందని గుర్తుచేశారు. పార్క్ విస్తీర్ణం 276 ఎకరాలు. ఇప్పటికే 40 కంపెనీలకు స్థలాన్ని కేటాయించామని తెలంగాణ లైఫ్ సైన్సెస్, ఫార్మా డైరెక్టర్ శక్తి నాగప్పన్ తెలిపారు. ఈ సంస్థలు మొత్తం రూ.1,200 కోట్లు పెట్టుబడి పెడుతున్నాయని చెప్పారు. వీటి ద్వారా 6,700 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని వివరించారు.
4 దశాబ్దాలుగా..: భారత్‌లో నాలుగు దశాబ్దాలుగా మెడ్‌ట్రానిక్ సేవలు అందిస్తోందని సంస్థ వైస్ ప్రెసిడెంట్, ఇండియా ఎండీ మదన్ కృష్ణన్ తెలిపారు. ‘160 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాం. వార్షికాదాయం రూ.9.6 లక్షల కోట్లు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు ఇద్దరు రోగులు మెడ్‌ట్రానిక్ సేవలు అందుకుంటున్నారు. మహమ్మారి ఉన్నప్పటికీ హైదరాబాద్ కేంద్రానికి 150 మందిని నియమించుకున్నాం. ప్రస్తుతం 450 మంది పనిచేస్తున్నారు. ఇక్కడ చేసిన పెట్టుబడులు ఫలితాలను ఇస్తున్నాయి. భారత్‌లో తయారీ కేంద్రం ఏర్పాటును పరిశీలిస్తాం’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment