మండెపల్లిలో కేటీఆర్‌కు తన సమస్యను విన్నవించుకుంటున్న ఓ మహిళ
సిరిసిల్ల: యువత భాగస్వామ్యంతో పల్లెల్లో మార్పు వస్తోందని ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో బుధవారం ఆయన 30 రోజుల పల్లె ప్రణాళిక అమలు తీరుపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ఎవరికివారు తమ ఇంటిని, వీధిని, ఊరును బాగు చేసుకోవాలన్న సంకల్పం ఉండాలన్నారు. ప్రజాసంకల్పంతోనే పల్లె ప్రణాళిక కొనసాగాలన్నారు. ఈ కార్యక్రమంతో పల్లె ముఖచిత్రం మారిందని తెలిపారు. యువకులు స్వచ్ఛందంగా పల్లెబాగుకు నడుం బిగిస్తే మంచి పనులు జరుగుతాయన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పథకాలు విజయవంతమవుతాయని చెప్పారు. పారిశుధ్యం మెరుగు, పచ్చదనం పెంచేందుకు ఈ ప్రణాళిక పనికొచ్చిందని, ఇదే స్ఫూర్తి కొనసా గించాలని, ప్రజల్లో చైతన్యం వచ్చే వరకు దీనిని ముందుకు తీసుకెళ్లాలన్నారు.
ఊరు ఎలా ఉంది..: మండెపల్లిలో మహిళలు, యువకులు, వృద్ధులతో కేటీఆర్ ముచ్చటించారు. ఊరు ఇప్పుడెలా ఉందని ప్రశ్నించగా.. మంచిగా అయిందని గ్రామస్తులు అన్నారు. ఊరును పాడుచేసే వారికి జరిమానా విధిద్దామా..! అని మంత్రి కోరగా.. చెడ గొట్టే వాళ్లకు జరిమానా వేయాలన్నారు. అంతకుముందు మంత్రి కేటీఆర్ సిరిసిల్ల క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో 30 రోజుల ప్రణాళిక ప్రగతిపై సమీక్షించారు. ఏడాది పొడవునా పల్లెల్లో చేపట్టే కార్యక్రమాల క్యాలెండర్‌ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
పంచాయతీ కార్మికులకు బీమా: పంచాయతీ కార్మికులకు ఆరోగ్య బీమా కల్పించేందుకు కేటీఆర్ తన సొంత డబ్బులు రూ.4 లక్షలను ప్రీమియంగా చెల్లించారు. జిల్లాలో పనిచేసే 1,200 మంది పంచాయతీ కార్మికులకు బీమా కల్పించేందుకు చొరవ చూపారు. ఈ చెక్కును కలెక్టర్ కృష్ణభాస్కర్‌కు కేటీఆర్ అందించారు.
Comments
Please login to add a commentAdd a comment