rajanna siricilla
-
మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ
సాక్షి,రాజన్నసిరిసిల్లజిల్లా: మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. వేములవాడ రాజన్న కోడెల వివాదంలో మంత్రి పేరు వినిపిస్తోంది. కోడెల పంపిణీలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. కోడెలు పక్కదారి పడుతున్నాయంటూ విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నాయకుల ఆందోళన చేపట్టారు.మంత్రి సిఫారసుతో ఆగస్టు 12న 49 కోడెలను రాంబాబు అనే వ్యక్తికి ఆలయ అధికారులు అప్పగించారన్న ఆరోపణలున్నాయి. మంత్రి మెప్పుకోసం నిబంధనలకు విరుద్ధంగా కోడెలను అప్పగించారన్న ప్రచారం జరుగుతోంది. రైతులకు కేవలం రెండు, మూడు కోడెలు అప్పగించి, మంత్రి సిఫారసుతో రాంబాబు అనే వ్యక్తికి ఏకంగా 49 కోడెలు ఇవ్వడం వివాదాస్పదమైంది.తాను టెండర్ ద్వారా పొందిన 49 కోడెలను ఇప్పటికే రాంబాబు పోలీసులకు వెల్లడించారు. ఈ విషయమై మంత్రి అనుచరుడు రాంబాబుపై వరంగల్ జిల్లా గీసుకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.పశువుల వ్యాపారిగా ఉన్న మంత్రి అనుచరుడికి రాజన్న కోడెలు అప్పగించడంపై భక్తులు మండిపడుతున్నారు.నిబంధనలకు విరుద్ధంగా ఒకే వ్యక్తికి కోడెల కేటాయింపుపై విచారణ జరపాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి: అది నినాదం కాదు.. కేసీఆర్ ప్రభుత్వ విధానం -
రాజన్న సిరిసిల్లలో పవర్ లూమ్స్ పరిశ్రమ బంద్
-
తల్లి కొట్టిందని బాలుడి ఆత్మహత్య
కోనరావుపేట (వేములవాడ): ‘‘ఊర్లో బతుకబుద్ధి అవు తలే. వేరేవాళ్లు చెప్పే మాటలకు బాధనిపిస్తోంది. అమ్మా.. నన్ను కొట్టినందుకు బాధలేదు. చెల్లిని మంచిగా చూసుకో. ఈ పేదబతుకు నాకొద్దు. చెల్లెకు మంచిగా పెళ్లి చేయండి. అమ్మా.. అన్నా.. బావా.. డాడీ.. నేను వెళ్తున్నా..’’అని ఓ బాలుడు స్నేహితుడికి సెల్ఫీ వీడియో పంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండ లంలోని కమ్మరిపేటతండాలో ఈ ఘటన జరిగింది. కమ్మ రిపేటతండా (వట్టిమల్ల)కు చెందిన భూక్యా రాజు, జ్యోతి దంపతులకు దినేశ్, దీప్తి అనే పిల్లలు ఉన్నారు. దినేశ్ (17) గతేడాది వరకు కోనరావుపేట మండలంలోని ధర్మా రం హాస్టల్లో ఉంటూ ఎనిమిదో తరగతి వరకు చదువుకు న్నాడు. ఈ ఏడాది చదువు ఆపేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం ఓ దుకాణంలో సిగరెట్ ప్యాకెట్ దొంగిలించాడని దుకాణం యజమా ని దినేశ్ తల్లిదండ్రులకు చెప్పగా.. తల్లి కోపంతో దినేశ్‌ను కొట్టింది. దీంతో గురువారం ఉదయం 10 గంటలకు దినేశ్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. స్నేహితుల దగ్గరికి వెళ్లాడని భావించిన తల్లిదండ్రులు వరినాట్లు వేసేందుకు పొలానికి వెళ్లారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో.. గురువారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిన దినేశ్, తాను చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసి స్నేహితునికి పంపాడు. అయితే అతను పాఠశాలకు వెళ్లిపోగా.. సెల్‌ఫోన్‌ను అతని తండ్రి తీసుకెళ్లాడు. రాత్రి పది గంటలకు స్నేహితుడి తండ్రి ఇంటికొచ్చాక వీడియో చూసి వెంటనే దినేశ్ తల్లిదండ్రులకు చెప్పాడు. అందరూ కలసి దినేశ్ కోసం అటవీ ప్రాంతంలో గాలించారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు వట్టిమల్ల శివారు అటవీ ప్రాంతంలో దినేశ్ మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. కోనరావుపేట ఎస్సై రమాకాంత్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమారుని మృతికి దుకాణం యజమాని మాలోత్ కాంతి కారణమని మృతుని తండ్రి రాజు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
జగనన్నకు థ్యాంక్స్
-
దళితులతో కలిసి భోజనం చేసిన కేటీఆర్
-
అంతర్జాతీయ వేదికపై మెరిసిన అగ్గిపెట్టె చీర
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తయారైన అగ్గిపెట్టెలో ఇమిడే చీర అంతర్జాతీయ వేదికపై మెరిసింది. సిరిసిల్లకు చెందిన నేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్ అగ్గిపెట్టెలో ఇమిడి, కట్టుకోవడానికి వీలుగా ఉండే పట్టుచీరను నేశారు. ఆ చీరను ఆ్రస్టేలియాలో ఉండే ఎన్ఆర్ఐ రాధిక కొనుగోలు చేసి ఆ్రస్టేలియా–ఇండియా బిజినెస్ కౌన్సిల్లో ప్రదర్శించారు. పట్టుదారం పోగులతో 100 గ్రాముల బరువు, 5.500 మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పుతో అగ్గిపెట్టెలో ఇమిడేలా చీరను విజయ్‌కుమార్ మరమగ్గం (పవర్లూమ్)పై నేశాడు. ఆ చీరను రాధిక ప్రదర్శించి సిరిసిల్ల నేత కళాకారుల నైపుణ్యాన్ని అంతర్జాతీయ వేదికపై గుర్తింపు తీసుకొచ్చారు. చదవండి: మినరల్ వాటర్.. మిల్లెట్ భోజనం! -
రాజన్న దర్శనం కోసం వేములవాడకు పోటెత్తిన భక్తులు
వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ హరహర మహాదేవ నామస్మరణతో మారుమోగుతోంది. శివమాలధారులు, వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో ఆధ్యాత్మిక క్షేత్రం కిక్కిరిసిపోతోంది. వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాజాతరకు నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాలతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడే గుడారాలు వేసుకుంటున్నారు. ధర్మగుండంలోకి అనుమతి లేకపోవడంతో షవర్ల వద్ద స్నానాలు చేస్తున్నారు. గుడి ఆవరణలో జాగరణ కోసం భక్తులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్జిత సేవలను రద్దు చేసిన ఆలయ అధికారులు లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు. రూ.3.70 కోట్లతో జాతర ఏర్పాట్లు చేశారు. రాజన్న గుడి చెరువు ఖాళీ స్థలంలో రాష్ట్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో శివార్చనలో భాగంగా 1,600 మంది కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాస్‌ల జారీ విషయంలో ఉద్యోగులు, పురప్రముఖులు, స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహాశివరాత్రి జాతరకు 3 లక్షల వరకు భక్తులు వస్తారని అధికారుల అంచనా. స్వామి మహామంటపంలో ఉత్సవమూర్తులను సిద్ధం చేసి ఉంచారు. అన్నదానం ప్రారంభం జాతర మహోత్సవాలకు వచ్చే భక్తులు, పోలీసు, వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి స్థానిక వాసవీ సేవా సమితి, మన చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రమేశ్‌బాబు, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, ఈవో కృష్ణప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ అన్నదానం శని, ఆదివారాలు సైతం కొనసాగుతుందని నిర్వాహకులు మోటూరి మధు, కొమ్మ నటరాజ్ తెలిపారు. దాదాపు 30 వేల మందికి అన్నదానం చేయనున్నట్లు తెలిపారు. ఉచిత బస్సు సేవలు దేవస్థానం తరఫున 14 ఉచిత బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. ఈ సేవలను శుక్రవారం ప్రారంభించారు. తిప్పాపూర్ బస్టాండ్ నుంచి బైపాస్‌రోడ్డు గుండా జగిత్యాల బస్టాండు, గుడిప్రాంతం, బైపాస్‌రోడ్డు ద్వారా కోరుట్లబస్టాండు, ప్రాంతాలను కలుపుతూ తిరిగి తిప్పాపూర్ బస్టాండ్ వరకు చేరుకుంటాయి. భక్తుల రద్దీని బట్టి బస్సులను తింపనున్నట్లు డీఎం మురళీకృష్ణ తెలిపారు. ప్యూరిఫైడ్ వాటర్ మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఆలయ ఈవో కార్యాలయం వద్ద, గుడి పక్కన పార్కింగ్ ఏరియా, బద్దిపోచమ్మ గుడి వద్ద రాజన్న జలప్రసాదం మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాట్లు చేశారు. రాత్రి సమయంలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే రమేశ్ బాబు తదితరులు శివార్చన ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. చదవండి: శివ నామస్మరణతో మార్మోగుతున్న తెలుగు రాష్ట్రాలు -
Sircilla Rajeshwari: సిరిసిల్ల రాజేశ్వరి కన్నుమూత
సాక్షి, రాజన్న సిరిసిల్ల: ఆమె వైకల్యాన్ని ఎదురించింది. కాలి వేళ్లు కలం పట్టాయి.. కవితలు రాశాయి. ఆ కవితలే ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. ఆమె గాథ.. మరికొందరిలో స్పూర్తి నింపింది కూడా. కానీ, దురదృష్టవశాత్తూ.. కాళ్లతో కవితలు రాసే కవయిత్రిగా దక్కించుకున్న ఆమె ఇక లేరు. కవయిత్రి బూర రాజేశ్వరి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. సిరిసిల్ల పట్టణం సాయినగర్‌లో ఓ పేద నేతన్న కుటుంబంలో మూడో సంతానంగా జన్మించింది బూర రాజేశ్వరి. పదిహేనవ ఏట దాకా ఆమె నడవలేదు. అయితే.. వైకల్యాన్ని చూసి ఏనాడూ ఆమె బాధపడలేదు. కసిగా కవితలు రాయడం మొదలుపెట్టింది. తల్లిదండ్రులు సాంబయ్య, అనసూయల ప్రోత్సాహంతో చదువుకుంది. తన కవితలతో సిరిసిల్ల రాజేశ్వరిగా పేరుగాంచారామె. సుమారు 700ల దాకా కవితలు రాసి అందరినీ ఆకట్టుకున్నారామె.ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు రాజేశ్వరి ఏకలవ్య శిష్యురాలు. ఆయన పాటలు, మాటలు ఆమెను ఎంతో ప్రభావితం చేశాయట. రాజేశ్వరి గురించి తెలుసుకున్న సుద్దాల అశోక్ తేజ, తన భార్య నిర్మలతో కలిసి సిరిసిల్లకు వెళ్లి ఆమెను కలిశారు. తన తల్లితండ్రులు సుద్దాల హనుమంతు, జానకమ్మల పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారం కూడా ఆయన రాజేశ్వరికి బహుకరించారు. రాజేశ్వరి రాసిన 350 కవితలను పుస్తకంగా తీసుకువచ్చి, రవీంద్ర భారతిలో ఆవిష్కరించారు.ఈ విషయాన్ని కేవీ రమణాచారి.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దివ్యాంగురాలైనప్పటికీ సాహిత్యంలో ఆమె రాణించడం.. కేసీఆర్‌ను ఆకట్టుకుంది. వెంటనే ప్రభుత్వం తరపున ఆమె పేరిట రూ.10 లక్షలు ఫిక్స్డ్ చేయించారు. తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలోని కేసీఆర్ కాలనీలో ఆమెకు ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా కేటాయించారు. నెల నెల రూ.10 వేల పెన్షన్ ఇస్తూ వస్తున్నారు. దివ్యాంగురాలు కావడంతో.. తన భావాలను, మనుసులో ఉన్న బాధలను ఆమె కవిత రూపంలో రాశారు. అదే ఆమెకు గుర్తింపు తెచ్చింది. ఆ సమయంలో రాజేశ్వరి జీవిథ గాధను చాలా టీవీ ఛానెళ్లు, పత్రికలు కథనాలు వెలువరించాయి. అయితే 42 ఏళ్ల వయసులో ఆమె అనారోగ్యం బారిన పడింది. చికిత్స అందినా ప్రాణం నిలవలేకపోయింది. రాజేశ్వరి మృతి పట్ల స్థానికంగా సంతాపం వెల్లడిస్తున్నారు. ఆమె మృతి వార్తను మంత్రి కేటీఆర్ కు తెలియజేశారు స్థానిక బీఆర్ఎస్ నేతలు. పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన ఆమె సాహిత్య ప్రయాణాన్ని.. మహారాష్ట్ర విద్యాశాఖ ఇంటర్ సిలబస్‌లో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు పుస్తకంలో పాఠ్యాంశంగా ప్రచురించడం గమనార్హం. -
బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్
సాక్షి, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. డ్రగ్స్ టెస్ట్ కోసం తాను రెడీ అంటూనే.. బండి సంజయ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు ఆయన. డ్రగ్స్ టెస్ట్ కోసం నా రక్తం, కిడ్నీ, బొచ్చు.. ఏది కావాలంటే అది ఇస్తా. ఇక్కడే ఉంటా. డాక్టర్లను తీసుకుని రా? క్లీన్‌చిట్‌తో బయటకు వస్తా. చెప్పినట్లు బండి సంజయ్ తన చెప్పుతో తనను తాను కొట్టుకుంటాడా? అంటూ కేటీఆర్ మండిపడ్డారు. జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ మనిషా? పశువా? అంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారు కేటీఆర్. ఫాల్తూ మాటల రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. నాకు క్లీన్చిట్ వస్తే కరీంనగర్లో కమాన్ దగ్గర సంజయ్ చెప్పుతో తనను తాను కొట్టుకుంటాడా? అని మండిపడ్డారు కేటీఆర్. ఇంకా ఆయన ఏమన్నారంటే.. 👉రైతు బంధు రూ. 65 వేల కోట్ల ఇచ్చిన ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం. ఇంత కన్నా మేలు చేసిన ప్రభుత్వాలు ఏవైనా ఉన్నాయా?. 👉కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనం అన్నా.. కేసీఆర్ నాయకత్వం కొన్నది. ఎర్రటి ఎండలో నీటి ప్రవాహం వచ్చింది అంటే కేసీఆర్ ఘనత కాదా?. 👉ఇక్కడ నిలబడ్డ బిజెపి అభ్యర్థులను కోరుతున్నా.. నేతన్న కార్మికులకు, రైతులకు మీరు ఏమైనా చేశారా?. బండి సంజయ్‌ను అడుగుతున్నా.. భైంసా ను దత్తత తీసుకున్న అంటున్నావు తీసుకో కానీ నీవు గెలిచిన నీ నియోజక వర్గంలో ఎం చేసినావు? 👉వేములవాడ కు 100 కోట్ల తో అభివృద్ది చేపించావా?. 👉IIIT అడిగాము. కానీ అదికూడా తీసుకు రాలేవు. ఈ బడ్జెట్ కి ఎంపికి ఇదే చివరి అవకాశం. ఇప్పటికైనా కరీంనగర్ ప్రజలకు ఏమైనా తీసుకు రా. బడ్జెట్ సమావేశాలకు వెళ్లు.. హిందీ రాకపోతే ఇంగ్లీష్ మాట్లాడు. కానీ, కరీంనగర్ కు ఏమైనా తీసుకు రా. 👉ఇద్దరు గుజరాత్ వాళ్ళు దేశాన్ని నడుప్పొచ్చు. కానీ మన రాష్ట్రాన్ని నడిపే ముఖ్యమంత్రి దేశాన్ని నడుపరాదు అంట!. 👉బిజెపి సోదరులు లక్ష్మణ్ మాట్లాడుతూ బి అర్ ఎస్ అట్టర్ ప్లాప్ అంటున్నారు. మహారాష్ట్ర లోని కొన్ని మండలాల ప్రజలు తెలంగాణలో కలుపుకోవాలి అని అంటున్నారు. లచ్చన్నకు గెలుపు గర్వం వద్దు అని అంటున్న అని కేటీఆర్ ప్రసంగించారు. -
ఎంగేజ్మెంట్ అయిన మరునాడే యువతి కిడ్నాప్ కలకలం..
రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని చందుర్తి మండలం మూడపల్లిలో యువతి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో తండ్రి చంద్రయ్య తో కలిసి శాలిని(18) అనే యువతి హనుమాన్ దేవాలయంలో పూజ చేసి బయటకు వస్తుండగా నలుగురు యువకులు ఆమెను లాక్కెళ్లారు. గుడి ముందు కాపుకాసి యువతి తండ్రిని కొట్టి ఆమెను ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. శాలినికి సోమవారమే ఎంగేజ్మెంట్ అయినట్లు తెలుస్తోంది. మరునాడే ఆమెను యువకుడు కిడ్నాప్ చేయడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే యువతి మైనర్‌గా ఉన్నప్పుడు గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆమెను ప్రేమ పేరుతో వేధించాడు. దీంతో పోక్సో కేసులో అరెస్టయ్యి జైలుకు వెళ్లొచ్చాడు. అతడే తమ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఉంటాడని చంద్రయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు రెండు బృందాలుగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. కిడ్నాప్ చేసిన యువకుడ్ని జానేశ్వర్ అలియాస్ జానుగా గుర్తించారు. చదవండి: వివాహేతర సంబంధాలకు కారణాలివే.. సర్వేలో షాకింగ్ విషయాలు -
కిలోల కొద్ది బంగారం కొంటున్నా.. కానీ రాజయోగం లేదు
సాక్షి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సహకార విద్యుత్ సరాఫరా సంఘం(సెస్) ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. పార్టీల నుంచి ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తంగళ్లపల్లి మండలం నుంచి సెస్ ఎన్నికల బరిలో ఉంటున్నట్లు ప్రకటించిన ఓ పార్టీ నాయకుడు రాజయోగం కోసం అదృష్ట ఉంగరం కొనేందుకు వెళ్లిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 15 ఏళ్ల క్రితం సదరు నాయకుడు బంగారం, అదృష్ట ఉంగరాల వ్యాపారి వద్ద అరతులం, తులం కొనేవాడని.. అదృష్ట ఉంగరం తీసుకున్న తర్వాత కిలోల కొద్దీ బంగారం కొంటున్నాడని చెప్పుకొచ్చాడు. తాను అదృష్ట ఉంగరం కొన్నప్పటి నుంచి ఆర్థికంగా బలంగా పడ్డానని, కానీ రాజయోగం మాత్రం రావడం లేదని అనడం కొసమెరపు. ఇదంతా సదరు వ్యాపారికి చెందిన యూట్యూబ్ ఛానల్లో 8 నెలల కిత్రం పోస్టు చేయగా.. సెస్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు వైరల్ గామరింది. చదవండి: సీబీఐ విచారణ తర్వాత తొలిసారి స్పందించిన కవిత -
ఇప్ప నారాయణరెడ్డి.. స్మృతివనంలో త్యాగధనుడు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగువేల లోపు జనాభా కలిగిన ఒక చిన్న ఊరి పేరు దుమాల. 21 మంది రక్త తర్పణలతో అమరుల స్మృతి వనంగా ఈ ఊరు ప్రాధాన్యత సంతరించుకుంది. సరిగ్గా నేటికి 50 సంవత్సరాల క్రితం ‘శ్రీ వేంకటేశ్వర యువజన సంఘం’ స్థాపించి, దుమాలలో నూతన చైతన్యానికి అంకురార్పణ చేసిన ఇప్ప నారాయణరెడ్డి, ఆయన మిత్ర బృందం రైతుకూలీ సంఘం నిర్మాణం ద్వారా విప్లవోద్యమానికి కూడా నాంది పలికారు. మధ్యయుగాల నాటి భూస్వామ్య దోపిడీనీ, దానిపై ప్రజల పోరాటాన్నీ అర్థం చేసుకోవడానికి దుమాల గ్రామం అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. పంచాయితీ వ్యవస్థ అమల్లోకి వచ్చే ముందూ... వచ్చిన తర్వాత కూడా దుమాలలో దొర, మాలి పటేల్, పోలీస్ పటేల్, పట్వారి వ్యవస్థలు కొనసాగిన రోజుల్లో... లక్ష్మయ్య దొర.. దొరగా, కిష్టయ్య దొర మాలిపటేల్గా, నాంపల్లి దొర పోలీస్ పటేల్‌గా, నారాయణ పంతులు పట్వారీగా– దాదాపు 300 ఎకరాల భూములకు యజమానులుగా ఉండేవారు. వీరి దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడారు. 1978లో ప్రభుత్వం కల్లోలిత ప్రాంతంగా ఈ ఏరియాను ప్రకటించి భూస్వాములకు అండగా నిలిచింది. దీంతో ప్రజాపోరాటం ఎగసిపడింది. 1989 ఫిబ్రవరి 23న దుమాలకు చెందిన కానవరపు చంద్రయ్యను బెజ్జంకి దగ్గర బూటకపు ఎన్కౌంటర్ చేయడంతో హింసాకాండ రూపమే మారిపోయింది. 2001 వరకు 22 సంవత్సరాలు నిరాఘాటంగా సాగిన ఈ హత్యాకాండలో 21 మంది ఈ గ్రామానికి చెందినవారు మరణించారు. శ్రీ వెంకటేశ్వర యువజన సంఘం ప్రాథమిక పాఠశాలకు తరగతి గదులు కట్టించింది. హైస్కూల్‌కు విశాల స్థలం ఇచ్చింది. రూ. 5 లక్షలతో తరగతి గదులు పెంచడానికి జనశక్తి పార్టీ స్వయంగా పూనుకుంది. మేక పుల్లరి, వెట్టి గొర్లు, వెట్టి నాగళ్ళు, జీతాల వ్యవస్థ అంతమైపోవడానికి పార్టీ కారణమైంది. అన్నింటికీ మించి ఉత్పత్తి శక్తులకు దొరికిన స్వేచ్ఛ ప్రజల జీవితాల్లో కొత్త మార్పునకు నాంది పలికింది. – అమర్, జనశక్తి (జూలై 29న ఇప్ప నారాయణరెడ్డి ప్రథమ వర్ధంతి) -
రాజన్న సిరిసిల్ల: ట్రాక్టర్ హత్య.. పీఎస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని రుద్రంగి మండల కేంద్రంలో గురువారం తీవ్ర ఉద్రికత వాతావరణం నెలకొంది. భూవివాదంలో ఓ వ్యక్తిని ట్రాక్టర్‌తో ఢీకొట్టించి హత్య చేశారు. ఈ ఉదంతంలో నిందితుడిని తమకు అప్పగించాలంటూ మృతుడి బంధువులు స్టేషన్ ఎదుట గొడవకు దిగారు. దీంతో రుద్రంగి పోలీస్‌స్టేషన్ హైటెన్షన్ నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ట్రాక్టర్ ఢీకొని నేవూరి నరసయ్య (42 ) అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే బైక్‌పై వెళ్తున్న నరసయ్యను.. కిషన్ అనే వ్యక్తి ట్రాక్టర్‌తో కావాలనే ఢీకొట్టి హతమార్చాడని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇద్దరి మధ్య గత కొద్ది రోజులుగా భూ వివాదం ఉందని, అందుకే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని అంటున్నారు. ఇక హత్య అనంతరం నిందితుడు రుద్రంగి పోలీసులకు లొంగిపోయాడని సమాచారం. దీంతో పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగారు మృతుడి బంధువులు. తన భర్తను అన్యాయంగా చంపేశారంటూ పీఎస్ ముందు మృతుడి భార్య బైఠాయించింది. తన తాళి కూడా తీసుకొండంటూ సీఐకి చూపించిందామె. ఈ క్రమంలో బంధువులు పీఎస్‌లోపలికి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకుంటున్నారు. నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు నరసయ్య బంధవులు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో.. సమీపంలోని చందుర్తి పోలీసులను కూడా రుద్రంగికి పంపించారు ఉన్నతాధికారులు. -
Crime News: ఆమెకు పెళ్ళైంది కానీ..
జగదేవ్‌పూర్(గజ్వేల్): ఆమెకు పెళ్లైంది. కానీ, ఇన్నాళ్లలో భర్తతో ప్రేమగా ఏనాడూ మాట్లాడింది లేదు. దగ్గరకు రానిచ్చింది లేదు. కారణం.. ఆమె మనసులో మరో వ్యక్తి ఉన్నాడు. పెళ్లయ్యాక మరో వ్యక్తిని ఇష్టపడింది ఆమె. ఇద్దరూ గప్‌చుప్‌గా చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగారు. విషయం ఇంట్లో తెలిసింది. కోపడ్డారు. కలిసి బతకడం సాధ్యం కాదనుకుంది.. ఆత్మహత్యతో ప్రాణం తీసుకున్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లి అటవీ ప్రాంతంలోని మంగళవారం రాత్రి యువతి, యువకుడి మృతదేహాలు లభ్యమాయ్యాయి. సమాచారం తెలుసుకున్న జగదేవ్‌పూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. యువకుడి ఆధార్‌కార్డు, ద్విచక్రవాహనం ఆర్సీ లభించడంతో వాటి ఆధారంగా వివరాలను సేకరించారు. ఎస్ఐ కృష్ణమూర్తి వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్ల ప్రాంతానికి చెందిన పూజ(26), రాజీవ్‌నగర్‌కు చెందిన నామా వేణుగోపాల్(24) సిరిసిల్లలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. చాలాకాలంగా ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. విషయం ఇంట్లో తెలిసి పెద్దలు మందలించారు. ఈ నెల పదిహేనవ తేదీన డ్యూటీకి అని వెళ్లి.. పూజ తిరిగి రాలేదు. దీంతో తన భార్య కనిపించకుండా పోయిందని సిరిసిల్ల టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు పూజ భర్త. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి పీర్లపల్లి అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు వేలాడుతున్న శవాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆధార్‌కార్డు ఆధారంగా పూర్తి వివరాలను సేకరించారు. ముఖాలు గుర్తు పట్టలేనంతగా మారిపోవడంతో.. ఉరేసుకుని చాలారోజులై ఉంటుందని మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పంచనామా చేసి మృతదేహాలను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ అయ్యారు. ఎల్లారెడ్డిపేట వెళ్తుండగా రాజాసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గత రాత్రి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఇంటిపై బీజేపీ నేతల దాడి చేశారు. తోట ఆగయ్య ఇంటిని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్ సందర్శించి ఆగయ్యను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఒక మంత్రిగా ఆగయ్యను పరామర్శించేందుకు రాలేదు, ఒక కార్యకర్తగా, ఒక కుటుంబ సభ్యునిగా పరామర్శించేందుకు వచ్చానని తెలిపారు. బీజేపీలో అసమ్మతి, పార్టీలో లుకలుకల వల్లనే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని, అక్కసుతో దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. గోపి అనే వ్యక్తి తుపాకీ పట్టుకొని, కొంతమంది బీజేపీ కార్యకర్తలు కట్టెలు పట్టుకొని దాడికి వచ్చారని దుయ్యబట్టారు. బడుగు బలహీన వర్గాల మీద యూపీ, గుజరాత్, బీహార్ సంసృతిని నమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పిలుపునిస్తే బీజేపీ బలమెంత? అని ప్రశ్నించారు. మీరు(బీజేపీ) దాడులు చేసి మమ్మల్ని రెచ్చ గొడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తపైన దాడులకు దిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. బీజేపీ వాళ్లు పిడికెడు.. మేం పుట్టెడు మంది ఉన్నామని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. -
గొప్ప మనసు చాటుకున్న హీరో సంపూర్ణేశ్‌బాబు!
సాక్షి, రాజన్న సిరిసిల్ల: ఖరీదైన వైద్యం చేయించుకునేందుకు ఆర్థికస్థోమత లేక అల్లాడుతున్న ఓ నిరుపేద కుటుంబానికి హీరో సంపూర్ణేశ్‌బాబు ఆర్థికసాయం అందించి ఔదార్యం చాటుకున్నాడు. మండలంలోని రామన్నపేటకు చెందిన సంకోజి లావణ్య- రమేశ్‌బాబుకు రెండు నెలల క్రితం బాబు జన్మించాడు. నెల రోజులుగా చిన్నారి శివ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు పరీక్షించి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వైద్యానికి రూ.10 లక్షలు ఖర్చవుతాయని తెలిపారు. గ్రామస్తులు రూ.లక్ష విరాళం అందించగా, సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న హీరో సంపూర్ణేశ్‌బాబు శనివారం రామన్నపేటకు వచ్చి చిన్నారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రూ.25 వేల ఆర్థికసాయం అందించారు. రామన్నపేట, బండపల్లి గ్రామాల సర్పంచులు దుమ్ము అంజయ్య, న్యాత విజయజార్జ్, మానేరు స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్ ఉన్నారు. -
ఓ మై గాడ్ ఒమిక్రాన్.. అక్కడంతా భయం భయం
సాక్షి,ముస్తాబాద్(సిరిసిల్ల): ఒమిక్రాన్ వేరియంట్ మండలంలోని గూడెం గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తుంది. ఇటీవల దుబాయి నుంచి వచ్చిన వ్యక్తికి సోమవారం ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అతన్ని వెంటనే వై ద్యాధికారులు హైదరాబాద్‌కు తరలించగా, కు టుంబ సభ్యులను క్వారంటైన్ చేశారు. సెకండ్ వేవ్ కరోనాతో తీవ్రంగా నష్టపోయిన గ్రామస్తులు.. తొలి ఒమిక్రాన్ కేసు గూడెంలో నమోదుకావడం ఆందోళన చెందుతున్నారు. ఎవరెవరిని కలిశాడో ? గూడెంకు చెందిన వ్యక్తి ఈ నెల 16న దుబాయ్ నుంచి వచ్చాడు. ఎవరెవరిని కలిశాడోనని భ యాందోళన గ్రామస్తుల్లో మొదలైంది. ప్రైమరీ కాంటాక్ట్‌లపై వైద్య, పోలీస్‌శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి చిప్పలపల్లికి చెందిన వ్యక్తితో కారులో కలిసి వచ్చాడని తెలుసుకున్న వైద్యాధికారులు సదరు వ్యక్తి కుటుంబ సభ్యులను అప్రమత్తం చేశారు. నాలుగు రోజుల్లో సిరిసిల్లలోని బంధువులు, ఆస్పత్రికి, బైక్ షోరూంలను సందర్శించినట్లు తెలిసింది. అలాగే నారాయణపూర్‌లోని బంధువుల ఇంట్లో జరిగిన దావత్‌కు హాజరైనట్లు సమాచారం. గూడెంలో 14, చిప్పలపల్లిలో ఇద్దరిని హోమ్ క్వారంటైన్ చేశారు. స్కూళ్లకు హాజరుకాని విద్యార్థులు గూడెంలో జెడ్పీ ఉన్నత పాఠశాలతోపాటు ప్రాథమిక పాఠశాలలకు విద్యార్థులు మంగళవారం హా జరుకాలేదు. తల్లిదండ్రులు ముందస్తుగా తమ పిల్లలను పాఠశాలలకు పంపించలేదు. మూడు అంగన్వాడీ కేంద్రాలకు చిన్నారులు రాలేదు. గ్రా మంలో దుకాణాలు, హోటళ్లు తెరువలేదు. ప్రధా న రహదారిపైకి ఎవరూరావడం లేదు. వైద్య, పో లీస్ అధికారుల రాకపోకలతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. ముందస్తు చర్యలు గూడెంలో వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. వైద్యశాఖ ఏఎన్ఎం, ఆశకార్యకర్తలతో ఇంటింటా సర్వే చేపట్టారు. కరోనా లక్షణాలతో బాధపడితే తెలియజేయాలని కోరుతున్నారు. దుకాణాలను మూసివేయించారు. ప్రధాన వీధులతోపాటు ఒమి క్రాన్ పాజిటివ్ వ్యక్తి ఇంటి ఆవరణను కంచెతో మూసివేశారు. సోడియం హైపోక్లోరైడ్ ద్రావాణాన్ని ఊరంతా పిచికారీ చేశారు. గల్ఫ్ నుంచి వస్తున్న వారిపై ఆరా.. వారం రోజులుగా గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న వారిపై పోలీసులు, వైద్యశాఖ నిఘా పెట్టింది. సౌదీఅరేబియా, దుబాయ్, ఓమన్, బహ్రెయిన్, కువైట్ దేశాల నుంచి వచ్చిన వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ వైరస్‌ను సాధ్యమైనంతగా అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. అవగాహన కల్పిస్తున్నాం గూడెంలో ఒమిక్రాన్ కేసు నమోదైంది. గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా పెట్టాం. గూడెం, చిప్పలపల్లి గ్రామాల్లో పలువురిని క్వారంటైన్ చేశాం. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వ్యక్తిని హైదరాబాద్‌కు తరలించాం. ప్రజలందరు మాస్కులు ధరించి, సామాజిక దూరాన్ని పాటించాలి. ఎవరూ ఆందోళన చెందవద్దు. – సంజీవ్‌రెడ్డి, వైద్యాధికారి చదవండి: పొద్దంతా కూలి పని.. అందరూ నిద్రపోయాక అసలు పని మొదలుపెడతారు -
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒమిక్రాన్ కలకలం
సాక్షి,సిరిసిల్ల( కరీంనగర్): ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చేరింది. ముస్తాబాద్ మండలం గూడెంకు చెందిన వ్యక్తి ఇటీవల దుబాయ్ నుంచి ఇంటికి చేరగా.. ఆయనకు ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడం జిల్లాలో కలకలం సృష్టించింది. వెంటనే ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వ్యక్తిని వైద్యసేవల కోసం హైదరాబాద్ తరలించారు. సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు ఆరుగురిని, అతన్ని కలిసిన మరో ఏడుగురిని క్వారంటైన్ చేశారు. గూడెంలో ఒమిక్రాన్ కట్టడికి వీధుల్లో శానిటైజేషన్ చేశారు. ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వ్యక్తితోపాటు దుబాయ్ నుంచి వచ్చిన చిప్పలపల్లికి చెందిన మరో వ్యక్తి ఇంటిని కూడా క్వారంటైన్ చేసి కౌన్సెలింగ్ ఇచ్చారు. 16న గూడెం వచ్చాడు ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన సదరు వ్యక్తి ఈ నెల 16న గూడెం వచ్చాడు. ఆయన దుబాయ్ ఎయిర్‌పోర్టులో, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులోనూ ఒమిక్రాన్ పరీక్షలు చేయించుకున్నాడు. అప్పుడు నెగెటివ్ రిపోర్టు వచ్చింది. కానీ ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణకు జీనోమ్ సీక్వెన్సీ పరీక్షల కోసం సేకరించిన నమోనాల్లో ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయ్యింది. సదరు వ్యక్తి ఇప్పటి వరకు ఐదు రోజుల్లో ఎవరెవరిని కలిశారో వైద్యాధికారులు ఆరా తీసి క్వారంటైన్ చేశారు. ప్రస్తుతం 13 మందిని క్వారంటైన్ చేసినట్లు సమాచారం. వేగంగా వ్యాక్సినేషన్ జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ చేయాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలో మొదటి డోస్ డిసెంబరు నెలాఖరులోగా పూర్తికావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు జిల్లాలో చిక్కకుండా తప్పించుకుంటున్న వారిని గుర్తించేందుకు డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో గ్రామసర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఆశవర్కర్లు, ఆరోగ్య సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు సంయుక్తంగా వ్యాక్సినేషన్ వంద శాతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కలెక్టర్ అనురాగ్ జయంతి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వ్యాక్సినేషన్ శిబిరాలను పరిశీలిస్తున్నారు. తప్పించుకు తిరిగే వారిని ఒప్పించి టీకాలు ఇవ్వాలని కృషి చేస్తున్నారు. జిల్లాలో కొందరు టీకాకు అర్హత ఉన్న వారు వలస వెళ్లారు. వారిని మినహాయించి, ఆధార్‌కార్డు నంబరుతో సహా అర్హులకు టీకాలు ఇవ్వాలని భావిస్తున్నారు. 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు. ఒమిక్రాన్ కేసు నమోదు కావడంతో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. జిల్లాకు విదేశీ ముప్పు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారు. వారిలో చాలా మంది స్వస్థలాలకు వస్తూ.. పోతూ ఉంటారు. కోవిడ్ నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ క్వారంటైన్ ఉంటూనే గల్ఫ్ దేశాల నుంచి వస్తున్నారు. కానీ పూర్తి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఒమిక్రాన్ వైరస్ జిల్లాకు చేరేందుకు అవకాశం కలిగింది. నిజానికి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, మలేషియా, సింగాపూర్, ఫ్రాన్స్ వంటి దేశాల్లోనూ జిల్లా వాసులు ఉన్నారు. గల్ఫ్ దేశాల నుంచే రాకపోకలు ఎక్కువగా సాగుతుంటాయి. జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది. దీంతో జిల్లా వైద్యులు అప్రమత్తమయ్యారు. జాగ్రత్తలు తప్పనిసరి జిల్లాకు యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్ ఉన్నట్లు గుర్తించారు. ఎవరూ ఆందోళన చెందకుండా.. జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వైరస్ సోకిన వారికి గొంతునొప్పి, జలుబు, జ్వరం, దగ్గు విపరీతమైన అలసట ఉంటుంది. వాంతులు, గుండె వేగంగా కొట్టుకోవడం లక్షణాలు ఉంటాయి. ఒళ్లు నొప్పులు ఉంటాయి. అందరూ మాస్క్‌లు ధరించాలి. భౌతికదూరం పాటించాలి. నిర్లక్ష్యంగా ఉంటే ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తుంది. – డాక్టర్ సుమన్‌మోహన్‌రావు, జిల్లా వైద్యాధికారి చదవండి: భిక్షాటన చేస్తుంటే చేరదీసి స్కూల్‌కి పంపారు.. రెండు నెలల తర్వాత.. -
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజాపతినిధులకు మంత్రి కేటీఆర్ వార్నిగ్
-
రాజన్న సిరిసిల్లా జిల్లాలో కుండపోత వాన
-
సిరిసిల్ల: స్కూటీ డిక్కీలో నక్కిన నాగుపాము, వీడియో
సాక్షి, రాజన్న సిరిసిల్ల: స్కూటీ డిక్కీలో నాగుపాము దర్శనమివ్వడంతో ఓ రైతు బెంబేలెత్తిపోయాడు. వెంటనే ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ మెంబర్‌కు సమాచారమిచ్చాడు. అతడు వచ్చి నాగుపామును పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లడంతో ఊపిరిపీల్చుకున్నాడు. తంగళ్లపల్లి మండలం రామన్నపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా పోచయ్య అనే రైతు స్కూటీ డిక్కీ తెరవగానే అందులో దాగున్న నాగుపాము కనిపించింది. దీంతో.. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ మెంబర్ వీరేందర్‌కు ఫోన్ చేశాడు. ఈ క్రమంలో.. నాగుపామును పట్టుకున్న వీరేందర్ దానిని అడవిలో వదిలేసి వచ్చాడు. చదవండి: రాళ్ల భూముల్లోనూ ఇక పంట సిరులు! -
ఆ పుస్తకం నన్ను ఎంతగానో కదిలించింది: మంత్రి కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన రచయిత పెద్దింటి అశోక్‌కుమార్ రాసిన ‘గుండెలో వాన’ తనను కదిలించిందని మంత్రి కె.తారక రామారావు శనివారం ట్వీట్ చేశారు. ‘గుండెలో వాన’లోని కొన్ని కథలు చదివాను. నిజంగా కదిలిపోయాను. మనిషిని వెంటాడే కథలు ఇవి. తెలంగాణ పల్లె జీవితాలను కళ్లకు కట్టినట్లు రాశారు పెద్దింటి అశోక్‌కుమార్. రెం డు దశాబ్దాల సామాజిక చరిత్రను, మార్పులను రికార్డు చేసిన గొప్ప కథలు ఇవి. పెద్దింటికి అభినందనలు. కంగ్రాట్స్ అన్నా’ అని కేటీఆర్ పేర్కొన్నారు. కథకుడిగా, నవలాకారుడిగా ప్రసిద్ధి చెందిన పెద్దింటి అశోక్‌కుమార్ గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేటవాసి. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఆయన సినిమాలకు మాటలు రాస్తున్నారు. -
రాజన్నసిరిసిల్ల జిల్లాలో పొంగుతున్న వాగులు, వంకలు
-
రాజన్న సిరిసిల్ల: భారీ వర్షాలకు కోతకు గురైన రోడ్లు
-
ఆ నీళ్లు కేసీఆర్ నీళ్లు అని రైతులు చెబుతున్నరు
-
తహశీల్దార్ ఆఫీస్: నా తాళిబొట్టును లంచంగా తీసుకోండి.. కానీ
సాక్షి, రుద్రంగి (వేములవాడ): తన పేరిట భూమి పట్టా చేయాలంటూ రెండేళ్లుగా తిరుగుతున్నా పట్టించుకోక పోవడంతో ఆ మహిళ వినూత్న నిరసన చేపట్టింది. మెడలో ఉండాల్సిన తాళిబొట్టును తీసి తహసీల్దార్ ఆఫీసు గుమ్మానికి తగిలించి అక్కడే బైఠాయించింది. వివరాలిలా ఉన్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన పొలాస మంగ మామ పొలాస రాజలింగం పేరిట సర్వేనంబర్ 130/14లో రెండెకరాల వ్యవసాయ పొలం ఉండేది. మంగ భర్త పదేళ్ల క్రితం గల్ఫ్ వెళ్లి, తిరిగి రాలేదు. అప్పటి నుంచి ఒక్కగానొక్క కొడుకును పోషించుకుంటూ బతుకుతోంది. మామ నుంచి వారసత్వంగా రావాల్సిన భూమిని ఆమెకు తెలియకుండానే ఆమె పెద్దమామ తన మనుమని పేరిట పట్టా మార్పిడి చేయించుకున్నారు. ఆ భూమి పట్టా మార్చాలంటూ రెండేళ్లుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. బుధవారం మరోసారి తహసీల్దార్ ఆఫీసుకు వచ్చిన మంగ.. తన దగ్గర పైసలు లేవని, తాళిబొట్టును తీసుకొని పట్టా మార్చాలంటూ రోదిస్తూ కోరింది. తనకు న్యాయం చేసే వరకు వెళ్లేది లేదని బైఠాయించింది. పోలీ సులు వచ్చి సర్ది చెప్పారు. అక్రమంగా పట్టా చేసిన అధికారులపై, పట్టా చేసుకొ ని భూమిని చదును చేసుకుంటున్న వ్యక్తులపై ఆమె వద్ద ఫిర్యాదు తీసుకున్నారు. కావాలనే పట్టా మార్చిండ్రు మా మామ పొలాస రాజలింగం చనిపోయే వరకు ఆ భూమి అతని పేరు మీదనే ఉంది. మామ 2013లో చనిపోయిండు. 2014–15 వరకు మామ పేరు మీదనే ఉంది. అప్పుడున్న తహసీల్దార్, వీఆర్వో లంచం తీసుకొని మా పెద్దమామ మనుమని పేరు మీద పట్టా చేసిండ్రు. విచారణ కూడా చేయకుండానే పట్టా మార్చిండ్రు. నేను అన్ని పత్రాలు ఇచ్చినా పట్టా చేయడానికి ఇబ్బందులు పెడుతుండ్రు. – పొలాస మంగ, బాధితురాలు పట్టా మేం చేయలేదు మంగ భూమి పట్టాను మేము మార్చలేదు. మా కంటే ముందు ఉన్న తహసీల్దార్ పట్టా మార్పు చేశారని పొలాస మంగ ఆరోపిస్తోంది. విచారణ చేసి వాస్తవాలు తెలుసుకుంటాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – మల్లయ్య, డిప్యూటీ తహసీల్దార్, రుద్రంగి -
‘సాక్షి ఎఫెక్ట్’.. ట్రాఫిక్ సమస్యకు చెక్..
సాక్షి, వేములవాడ(రాజన్న సిరిసిల్ల): వేములవాడలో రోడ్ల విస్తరణతోనే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. నిత్యం వస్తున్న భక్తులు, అవసరాల కోసం బయటకు వచ్చే స్థానికులతో వేములవాడ పట్టణంలోని రోడ్లు జన సమ్మర్థంగా మారుతున్నాయి. సోమవారం, పండుగల రోజుల్లో ట్రాఫిక్ ఇబ్బందలు అన్నీ.. ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో ‘రోడ్ల విస్తరణ’ అంశంపై శుక్రవారం ‘జూమ్ డిబేట్’ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ చర్చలో మున్సిపల్ చైర్‌పర్సన్‌తోపాటు పుర ప్రముఖులు పాల్గొన్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చైర్పర్సన్ హామీ ఇవ్వడంతో పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి చొరవ సమస్య పరిష్కారానికి ముందడుగు అని అభిప్రాయపడుతున్నారు. సమస్య పరిష్కారానికి ‘సాక్షి’ తీసుకున్న చొరవపై స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు. ఆశలు చిగురించాయి వేములవాడలో ఇరుకైన రోడ్లతో బండిపై వెళ్లడం భయంగానే ఉంటుంది. ‘సాక్షి’ చేపట్టిన డిబేట్తోనైన పనులు చేపడతారని ఆశ చిగురించింది. ఎన్నో ఏళ్లుగా చెబుతున్నరు.. ఇప్పటికీ పనులు చేపట్టలేదు. – బి.నరేశ్, స్థానికుడు రోడ్లు వెడల్పు చేయాలి ఇరుకైన రోడ్లతో వేములవాడ ఎదుగుతలేదు. గుడితోని కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నా.. రోడ్ల విస్తరణను పట్టించుకోవడం లేదు. – వి.రవి, చిరువ్యాపారి అధికారులు స్పందించాలి పెద్ద బజార్‌కు పోవాలంటేనే భయంగా ఉంటుంది. ఎటునుంచి ఎవరు వస్తరో అర్థం కాదు. ‘సాక్షి’ పేపరోళ్లు మంచి కార్యక్రమం ముందేసుకున్నరు. అధికారులు పనులు చేయాలి. – జి.మాధవి, గృహిణి, వేములవాడ ఎటు చూసినా సందులే.. నేను చిన్నగున్నప్పటి నుంచి సూత్తున్న ఈ రోడ్లు మారుతనే లేవు. కూరగాయలకు పోదామన్నా తిప్పలుగా ఉంది. – సీహెచ్.మల్లవ్వ, గృహిణి పాలకుల్లో మార్పు రావాలి నేను ఇక్కడే పుట్టి, పెరిగిన. రోడ్లు వెడల్పు చేస్తారని చిన్నప్పటి నుంచి అంటున్నరు. చాలా సార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేసినం. ‘సాక్షి’ చేపట్టిన డిబేట్ హర్షనీయం. ఇకనైన పాలకుల్లో మార్పు వస్తుందేమో చూడాలి. – ఎండీ.ఖాజాపాషా, రిౖటైర్డ్ కండక్టర్, వేములవాడ కదలికలు మొదలయ్యాయి వేములవాడలో రోడ్ల విస్తరణపై ‘సాక్షి’లో కథనం చూసి ఆనందం వేసింది. అధికారుల్లో కదలికలు మొదలయ్యాయి. జూమ్ డిబేట్ ద్వారా ప్రజల అభిప్రాయాలను పాలకుల వద్దకు తీసుకొచ్చినందుకు ‘సాక్షి’కి కృతజ్ఞతలు. వేములవాడలో వెంటనే రోడ్లు వెడల్పు చేపట్టాలి. – బింగి శ్రీనివాస్, ఎలక్ట్రీషియన్, వేములవాడ పేపర్ చూస్తే సంతోషమైంది వేములవాడ ప్రజలు, రాజన్న భక్తులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రోడ్ల విస్తరణ. ఈ సమస్యపై ఈరోజు ‘సాక్షి’ లో ప్రచురితమైన కథనం చూస్తుంటే చాలా సంతోషమైంది. ఉమ్మడిరాష్ట్రంలో వేములవాడకు ఏమీ జరుగలేదు. కనీసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలోనైన రోడ్ల విస్తరణకు మోక్షం రాకపోవడం బాధాకరం. ఇప్పటికైన పాలకులు కాస్త స్పందించాలి. – చిలుక, రమేశ్, స్థానికుడు, వేములవాడ -
పొలం వద్ద గుడారంలో తల్లితోపాటు మూడురోజులు పాటు..
-
వామ్మో.. బంధువులని చేరదీస్తే ఎంత పనిచేశారు..
సాక్షి, కోనరావుపేట(రాజన్న సిరిసిల్ల): దగ్గరి బంధువని చేరదీస్తే ఉన్న ఆస్తి రాయించుకున్నాడు. ఇప్పుడు ఆ వృద్ధురాలినే ఇంట్లోంచి వెళ్లిపొమ్మంటున్నాడు. బాధితురాలి వివరాల ప్రకారం.. మండలంలోని నిమ్మపల్లికి చెందిన మానుక రాజయ్య–నర్సవ్వ దంపతులకు పిల్లలు లేరు. కొన్నేళ్ల క్రితం నుంచి దగ్గరి బంధువు మానుక శంకర్ వారింట్లోనే ఉంటున్నాడు. రాజయ్యకు ఫించన్ ఇప్పిస్తానని చెప్పి ఆస్తి కాగితాలపై సంతకాలు చేయించుకుని ఇల్లు, 30 గుంటల భూమిని తనపేరిట చేయించుకున్నాడు. రాజయ్య నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు. ఈక్రమంలో ఒంటరి అయిన నర్సవ్వకు తిండి పెట్టకపోవడంతో శంకర్‌ను నిలదీయగా ఇది తనదని, వెళ్లిపొమ్మంటూ కొడుతున్నాడని బాధితురాలు రోదిస్తూ చెప్పింది. శంకర్ వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించి గోడు వెల్లబోసుకుంది. గ్రామానికి వచ్చి విచారణ జరిపి న్యాయం చేస్తానని వృద్ధురాలికి ఎస్సై రాజశేఖర్ హామీ ఇచ్చారు. కన్న కొడుకులు కూడు పెడ్తలేరు వేములవాడ: కనీ పెంచి పెద్దచేసిన కొడుకులు మలిసంధ్యలో తమను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మండలంలోని నిజామాబాద్‌కు చెందిన వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. తమ బాధను చెప్పుకుని న్యాయం చేయాలని వేడుకున్నారు. నిజామాబాద్‌కు చెందిన శ్రీరాముల రామయ్య–సత్తవ్వ దంపతులకు ముగ్గురు కుమారులు దేవయ్య, లచ్చయ్య, చంద్రయ్య. వృద్ధులు కావడంతో ఒక్కో కొడుకు దగ్గర 3 నెలలు ఉండాలని నిర్ణయించారు. కానీ గత కొన్ని నెలలుగా దేవయ్య, లచ్చయ్య తల్లిదండ్రులను పోషించడంలేదు. ఇంట్లోకి రానివ్వకపోవడంతో చిన్న కుమారుడు చంద్రయ్య వద్దే ఆరునెలల నుంచి ఉంటున్నారు. సోమవారం ఎస్సై రాజశేఖర్‌ను కలిసి తన ఇద్దరు కుమారులు పోషించడంలేదని ఫిర్యాదు చేశారు. కుమారులను పిలిపించి మాట్లాడుతానని బాధితులకు ఎస్సై హామీ ఇచ్చారు. చదవండి: భార్యను తిట్టాడని ఆవేశంతో.. కన్న తండ్రినే -
దారుణం : గ్లూకోజ్ పెట్టి.. రూ.3లక్షలు వసూలు
సాక్షి, రాజన్నసిరిసిల్ల: జిల్లా కేంద్రానికి చెందిన అనంతుల రవీందర్ సుమారు 30ఏళ్లుగా స్థానిక పాత బస్టాండ్‌లో మెస్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య, ఇద్దరు కొడుకులు. ఇంజినీరింగ్ పూర్తయిన కొడుకులు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు. వాళ్లిద్దరూ సెటిల్ అయితే ప్రశాంతంగా ఉందామనుకున్నాడు. ఉన్నట్టుండి సెకండ్ వేవ్‌లో రవీందర్ కరోనా బారినపడ్డాడు. ఎందుకైనా మంచిదని గత ఏప్రిల్ 4న అతడు కరోనా టీకా వేయించుకున్నాడు. ఒకట్రెండు రోజులు జ్వరం వస్తుందని నర్స్‌లు తెలిపారు. తీవ్రజ్వరం.. కరోనా పాజిటివ్ టీకా వేసుకున్న మరుసటిరోజు రవీందర్ అస్వస్థతకు గురయ్యాడు. ఏప్రిల్ 8వ తేదీన జ్వరం వస్తే డోలో 650 టాబ్లెట్లు వేసుకున్నాడు. తగ్గకపోగా 9,10,11వ తేదీల్లో విపరీతంగా పెరిగింది. 12న ఉదయం జిల్లా ఆస్పత్రిలో పరీక్ష చేయించుకున్నాడు. మరుసటి రోజు పాజిటివ్‌గా ఫలితం వచ్చింది. ఆక్సిజన్ లెవెల్ 70కి పడిపోయింది. దీంతో మానసికంగా ఆందోళనకు గురయ్యాడు. రూ.2వేలు ఇస్తానన్న దొరకని కారు అప్పటికే మధ్యాహ్నం 12 గంటలు దాటింది. స్థానిక ఏరియా ఆస్పత్రిలో పడకలు ఖాళీ లేవని చెప్పడంతో స్నేహితుడి సలహాతో వేములవాడలోని ఆస్పత్రికి వెళ్లాలనుకున్నాడు రవీందర్. 12కి.మీ. దూరానికి రూ. 2వేలు కిరాయి చెల్లిస్తామన్నా కారు దొరకలేదు. ఎలాగోలా వేములవాడకు చేరుకున్నాడు. డాక్టర్లు స్పందించక పోవడంతో తిరిగి సిరిసిల్లకు వచ్చాడు. తెలిసిన డాక్టర్‌ను సంప్రదిస్తే.. కరీంనగర్లో తనకు తెలిసిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లండని, తాను నేను ఫోన్ చేసి చెప్పా అని సలహా ఇచ్చాడు. రూ.25వేలు చేతిలో పట్టుకుని కారు డ్రైవింగ్ చేసుకుంటూ కరీంనగర్ వెళ్తుండగా బావుపేటలో చెమటలు బాగా వచ్చాయి. ఓ ఐదు నిమిషాలు ఆగి.. మంచినీళ్లు తాగి సేద తీరాడు. నాలుగురోజులు రూ.3లక్షలు కరీంనగర్‌లోని బంధువు సాయంతో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు రవీందర్. భయానికి పల్స్ రేటు కూడా పడిపోయింది. రూ.25వేలు చెల్లించి ఆస్పత్రిలో చేరాడు. సిబ్బంది మాస్క్ వేసి గ్లూకోజ్ పెట్టారు. మరుసటిరోజు రెండు గ్లూకోజులు పెట్టారు. అయినా డాక్టర్ రాలేదు. పరీక్షించలేదు. ఈలోపు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. వెంటిలేటర్ ఉన్న మరో ఆస్పత్రికి వెళ్లాలని సిబ్బంది సూచించారు. అప్పటికే నాలుగు రోజులైంది. నామమాత్రపు చికిత్స చేసి మందులకని రూ.90వేలు, డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు రూ.1.30లక్షలు, ఇతర ఖర్చుల కింద ఇంకో రూ. 60 వేలు.. మొత్తం సుమారు రూ. 3 లక్షలు వసూలు చేశారు ఆస్పత్రి నిర్వాహకులు. మొత్తం రూ.13 లక్షలు వెంటిలేటర్ సౌకర్యం ఉన్న మరో ఆస్పత్రికి వెళ్లగా ఒక్కరోజులోనే రూ.70వేలు వసూలు చేశారు. అయినా, అక్కడ ఆ సౌకర్యం లేదంటూ ఇంకో ఆస్పత్రికి పంపించారు. రోజూ రూ.50వేలు అడ్వాన్స్‌గా చెల్లిస్తేనే వైద్యం అందుతుందని ఆస్పత్రి నిర్వాహకులు తేల్చి చెప్పారు. చేసేదిలేక దొరికిన చోటల్లా అప్పు చేసి బిల్లులు చెల్లించారు. ఐదు రోజులు చికిత్స చేసిన నిర్వాహకులు.. రూ.5లక్షలు బిల్లు వసూలు చేసి రవీందర్‌ను డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చాక కూడా ఆక్సిజన్ సౌకర్యం ఉండాలని సూచించారు. దీంతో ఇంట్లోనే ఆక్సిజన్‌తో చికిత్స కొనసాగింది. ప్రస్తుతం కోలుకున్నాడు. దాదాపు 12 రోజులు ఆస్పత్రిలో ఉండి తీరా ఇంటికి చేరే సరికి అన్ని ఖర్చులు కలుపుకుని రూ.13 లక్షల వరకు ఖర్చు అయ్యాయి. ఇందులో తండ్రి ప్రాణాలు కాపాడాలని కొడుకు తెలిసిన వాళ్లదగ్గర రూ.11లక్షలు అప్పుగా తెచ్చాడు. మంచి ఆహారం తీసుకుంటూ అతడు కోలుకున్నాడు. ప్రాణాపాయం తప్పింది కానీ చికిత్స కోసం చేసిన అప్పు ఎలా తీర్చేదని తల్చుకుంటూ ఆందోళనకు గురవుతున్నాడు. బిల్లులు ఇప్పించాలె కరోనా టీకా తీసుకున్నాక కూడా వైరస్ బారినపడడం దారుణంగా ఉంది. ఉన్నంతలో పనిచేసుకుని బతకడం అలవాటైన సమయంలో కరోనా కాటేస్తూ అప్పుల్లో ముంచింది. చికిత్సల పేరుతో ఆస్పత్రుల నిర్వాహకులు రూ.లక్షల్లో గుంజుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఆస్పత్రులను కట్టడి చేయాలె. నా బిల్లులు వాపసు ఇప్పించాలె. సామాన్యులను ఆదుకోవాలె. – అనంతుల రవీందర్, సిరిసిల్ల చదవండి: వన్.. టూ.. 'త్రీ'.. రెడీ! -
కొత్త జోన్లు: మన ఉద్యోగాలు ఇక మనకే!
కరీంనగర్ అర్బన్: రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థకు రాజముద్ర పడింది. ఇక నియామకాల్లో నూతన అధ్యాయం మొదలు కానుంది. ఏ స్థాయి పోస్టులైనా 95 శాతం స్థానికులకే అవకాశం దక్కనుంది. ఈ క్రమంలో శాఖల వారీగా ఖాళీ పోస్టుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. నూతన జోన్ల ప్రకారమే పోస్టుల భర్తీ ఉండనుందని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న విధానానికి మంగళం పాడుతూ నూతన విధానాన్ని ప్రవేశపెట్టగా గత లోపభూయిష్ట విధానాలకు చరమగీతం పాడుతూ అటెండర్ నుంచి గెజిటెడ్ అధికారి వరకు అన్ని శాఖల్లో ఒకే విధానముండేలా సవరణలు చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగుల్లో ఉన్న భయాందోళనలను తొలగిస్తూ పాత ఉద్యోగులు అలాగే ఉండనుండగా జారీ అయ్యే ఉద్యోగ ప్రకటనల దరిమిలా నూతన విధానం కొనసాగనుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో జరిగిన ఉద్యోగ నియామకాల్లో స్థానికేతర పోస్టుల్లో గల మూస ధోరణికి అడ్డుకట్ట వేయగా.. ఇక స్థానికులను ఉద్యోగాలు వరించనున్నాయి. మొత్తానికి ఏళ్లుగా ఊరిస్తున్న జోనల్ వ్యవస్థకు పచ్చజెండా ఊపడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఉద్యోగులు, అధికారులకు పదోన్నతులు, బదిలీలకు సముచిత స్థానమిస్తూ జిల్లాలను విభజించి జోన్లుగా ఖరారు చేయగా, కరీంనగర్‌ను రాజన్న జోన్‌గా ఖరారు చేశారు. మల్టీజోన్లుగా రాజన్న, కాళేశ్వరం, బాసర, భద్రాద్రిని ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా మూడు ముక్కలు జిల్లాల విభజనతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్ జిల్లాలుగా విభజింపబడిన విషయం విదితమే. ఇక హుస్నాబాద్ సిద్దిపేట జిల్లాలో కలవగా మంథని డివిజన్లోని పలు మండలాలు భూపాలపల్లి జిల్లాకు, కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలు వరంగల్ అర్బన్ జిల్లాలో కలిశాయి. ఈ క్రమంలో మళ్లీ జోనల్ వ్యవస్థ తెరపైకి రావడంతో వివిధ జోన్లలో కలిశాయి. జిల్లాలు విభజింపబడగా బదిలీలు, పదోన్నతులు పాతజిల్లా ప్రకారం ఉండనుండగా కొత్తగా నియామకమైన వారికి నూతన వి«ధానం అమలుకానుంది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలు రాజన్న జోన్లో చేర్చగా పెద్దపల్లి జిల్లాను కాళేశ్వరం జోన్లో, జగిత్యాల జిల్లాను బాసర జోన్లో చేర్చారు. నూతన విధానంతో ప్రయోజనాలు.. ఇప్పటివరకు కొనసాగుతున్న నియామక ప్రక్రియలో జిల్లాస్థాయి పోస్టులకు సంబంధించి 80 శాతం స్థానికత, 20 శాతం ఓపెన్ కేటగిరీ ఉండేది. జోనల్ స్థాయిలో 70 శాతం స్థానికత, 30 శాతం ఓపెన్ కేటగిరీ, రాష్ట్రస్థాయిలో 60 శాతం స్థానికత, 40 శాతం ఓపెన్ కేటగిరీలో పోస్టులను భర్తీ చేసేవారు. దీంతో స్థానికత విషయంలో బాగానే ఉన్నా ఓపెన్ కేటగిరీలో మాత్రం అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా, జోనల్, రాష్ట్రస్థాయి పోస్టులన్నీ 95 శాతం స్థానికత 5 శాతం స్థానికేతరులకు కేటాయించడంతో మన ఉద్యోగాలు మనకేనని స్పష్టమవుతోంది. ఏ స్థాయి పోస్టులైనా ఇదే విధానం అమలు కానుండటంతో వేల పోస్టులు తెలంగాణ యువతకు దక్కనున్నాయి. రాజన్న జోన్లో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల నూతన కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలు రాజన్న జోన్లో చేరనుండగా 43.09 లక్షల జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలు కలిపి రాజన్న జోన్‌గా ఉండనుండగా జోనల్ పోస్టులన్నింటినీ ఈ పరిధిలో బదిలీలు, పదోన్నతులు చేపట్టనున్నారు. ఇక అన్ని శాఖలకు ఒకే విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. అటెండర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు జిల్లాస్థాయిలో బదిలీలు, పదోన్నతులు నిర్వహించనుండగా సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్లను జోన్ పరిధిలో, గెజిటెడ్ అధికారులు, డీటీలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏటీవో, ఎస్టీవో ఇలా వివిధ రకాల హోదా గల అధికారులకు మల్టీజోన్ వారీగా బదిలీ, పదోన్నతులు ఉండనున్నాయి. ఆర్డీవోలు, జిల్లాస్థాయి అధికారులకు రాష్ట్రస్థాయిలో బదిలీలుండనున్నాయి. రాజన్న జోన్ మల్టిజోన్–1లో ఉండనుంది. చదవండి: సీఎం కేసీఆర్ సంచలనం: ఈటల బర్తరఫ్ -
కరోనా టెర్రర్.. ముట్టుకోకుండానే అంటుకుంటోంది..!
సాక్షి, సిరిసిల్లటౌన్: కరోనా రోగిని నేరుగా కలువడం, వారితో దగ్గరగా మాట్లాడటం, ఒకే గదిలో, దగ్గరదగ్గరగా మెదలడం, తుంపర్లు ఇతరుల లాలాజలంతో కలువడం, లేదా ముక్కునీరుతో కలువడంతో కరోనా వచ్చేది. ఇది మొదటి వేవ్‌లో అందరం చూశాం. లక్షణాలున్న వారికి దూరంగా మెదిలి తప్పించుకున్నాం. కానీ ప్రస్తుతం రెండో దశ కరోనా వైరస్ వ్యాప్తి గతానికి భిన్నంగా ఉంది. మొదటి వేవ్‌లో కనిపించని లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రోగిని ముట్టుకోకుండానే అంటుకుంటుంది. గాలి ద్వారా కూడా వైరస్ వ్యాపిస్తున్నట్లు వైద్యశాస్త్ర మేధావులు చెబుతున్నారు. ఫలితంగా వైరస్ ఉధృతి ఎక్కువై సామాజిక వ్యాప్తి జరుగుతుంది. జిల్లాలో ప్రజలు సామాజిక బాధ్యతను విస్మరిస్తూ...కరోనా వ్యాప్తికి కారకులైతున్న వైనంపై కథనం.. కరోనా సామాజిక వ్యాప్తి..? కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి జరుగుతుందన్న అంశం చర్చనీయాంశమైంది. రోజురోజుకు జిల్లాలో వందలాది సంఖ్యలో కేసులు నమోదవడం ఇందుకు బలం చేకూర్చుతుంది. అయితే కరోనా బారిన పడినవారు సరైన చికిత్స పొందుతూ బహిరంగ ప్రదేశాలకు రాకుండా ఉండటం లేదు. కొందరైతే సాధారణ వ్యక్తుల్లాగే వివిధ ఫంక్షన్లు, సమావేశాలు, ఇతర వేడుకల్లో పాల్గొంటున్నారు. పండుగల సందర్భాల్లో వేలాది జనం మార్కెట్లు, షాపింగ్‌ల కోసం భయం లేకుండా తిరగడమే ప్రస్తుత పరిస్థితికి కారణమైంది. రాజకీయ ఫంక్షన్లు, సంతలు, షాపింగ్‌లకు జనాలు వేలాది సంఖ్యలో పాల్గొనడం మరో కారణమైతున్నట్లు వైద్యశాఖ మేధావులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన పలు కార్యక్రమాల్లో లెక్కకు మించిన జనాలు హాజరవడంతో వైరస్ అంటుకున్నట్లు తెలుస్తోంది. మొదటి వేవ్‌లో రోగినుంచి సాధారణ వ్యక్తికి సోకడంలో లక్షణాలు బయట పడటానికి మూడు నుంచి వారం రోజులు పట్టేది. ఇప్పుడా పరిస్థితి లేదు. కేవలం నిమిషాల వ్యవధిలోనే అంటుకుని రెండు మూడు రోజుల్లోనే రోగి పరిస్థితి చేయిదాటే దాఖలాలు కనిపిస్తున్నాయి. కొందరిలో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించినా..వైరస్ జాడలు కనిపించడం లేదు. కొత్త వైరస్ ప్రభావానికి లోనైన వారికి విరేచనాలు, ఒళ్లునొప్పులు, తలనొప్పి వగైరా కనిపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. సాధారణ ప్రజలు ఇలా.. ►మాస్కులు లేకుండా ఎవరూ ఇళ్లలోంచి బయటకు రావొద్దు ► అన్ని దుకాణాలు, మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో భౌతికదూరం పాటించాలి ►బయటకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ శానిటైజర్ బాటిల్ తీసుకుపోవాలి ► అన్ని షాపుల్లోనూ యజమానులు శానిటైజర్లు అందుబాటులో ఉంచి, మాస్కులు ధరించాలి ► కరోనా రోగులపై వివక్ష చూపరాదు. ► నాకేం కాదని అశ్రద్ధ చేయొద్దు. కరోనా వచ్చిందని భయపడాల్సిన పనిలేదు ► పోలీసులు అమలు చేస్తున్న కర్ఫ్యూ నిబంధనలు, పలు గ్రామాల్లో అమలు చేస్తున్న లాక్డౌన్ నియమాలను ప్రజలు పాటించాలి కోవిడ్–19 పాజిటివ్ వారు.. ► కరోనా లక్షణాలు కనపడగానే ప్రాథమిక దశలోనే టెస్టులు చేయించుకోవాలి ► ఇంట్లోనే ఉంటూ..ఐసోలేషన్ నిబంధనలు పాటించాలి. బయట తిరుగొద్దు ► కరోనా సోకినవారు తప్పకుండా హోం ఐసోలేషన్ పాటించాలి. డాక్టర్ సూచలను పాటిస్తూ చికిత్స పొందవచ్చు. రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. ► మాననికంగా ధైర్యాన్ని కోల్పోకుండా, భయానికి లోను కాకుండా ఉండాలి ►లక్షణాలు పెచ్చుమీరితే ఆస్పత్రిలో వైద్యుల పరిరక్షనలో చికిత్స పొందాలి -
దారుణం: చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపి..
సిరిసిల్ల: మూడేళ్ల చిన్నారిపై లైంగికదాడి జరిగిన ఘటన సిరిసిల్ల మున్సిపల్ పరిధి భూపతినగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. భూపతినగర్‌కు చెందిన బూర్ల చంద్రశేఖర్ ఎదురింట్లో ఉంటున్న మూడేళ్ల చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపి ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. కాసేపటికి చిన్నారి కేకలు వేయగా, తల్లి వచ్చి చూసేసరికి తీవ్ర రక్తస్రావం జరిగింది. స్థానికులు ఆసుపత్రికి తరలించగా లైంగికదాడి జరిగిందని డాక్టర్లు తెలిపారు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం చిన్నారి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. నిందితుడు చంద్రశేఖర్ ప్రవర్తనతో పాటు, గతంలో నేరారోపణలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు సోమవారం ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. స్థానికులతో మాట్లాడి నివేదిక తయారు చేశారు. చదవండి: షాకింగ్: వివస్త్రలుగా మారి బాల్కనీలోకి వచ్చిన మహిళలు.. ఆపై -
గుడిసెలేని ఊరు.. మోహినికుంట
ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రతీ మనిషికి సొం తిల్లు ఓ కల.. జీవితాంతం కష్టపడి సంపాందించినా ఇల్లు కట్టుకోలేని పేదలు అనేకమంది ఉన్నారు. పెరుగుతున్న నిర్మాణ సామగ్రి ధరలు.. ఆకాశన్నంటే భూములు ధరలు పేద, మధ్యతరగతి ప్రజలకు సొంతిం టి కలను అందని ద్రాక్షగానే మిగుల్చుతోంది. అయితే సీఎం కేసీఆర్ పేదలకు ఇచ్చిన డబుల్బెడ్రూమ్ ఇళ్ల హామీ ప్రస్తుతం నిరుపేదల్లో ఆనందం నింపుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా మోహినికుంట గ్రామం ఇప్పుడు గుడిసెలు, రేకుల ఇళ్లు లేని ఊరుగా రాష్ట్రంలో చరిత్ర సృష్టిస్తోంది. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న డబుల్బెడ్రూమ్ ఇళ్ల పథకం కింద ఇక్కడి సామాన్యులు ఆత్మగౌరవంతో జీవించే హక్కును అందుకున్నారు. మోహినికుంటలో కేసీఆర్ నగర్ పేరిట నాలుగు ఎకరాల విస్తీర్ణంలో సకల సౌకర్యాలతో 65 డబుల్బెడ్రూమ్ ఇళ్లు నిర్మించారు. మంత్రి కేటీఆర్ శనివారం వాటిని అర్హులైన పేదలకు కేటాయించారు. లబ్దిదారులంతా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలతో గృహప్రవేశాలు చేసి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. సొంతింటికి రాకముందు, వచ్చాక లబ్ధిదారుల అనుభూతులు వారి మాటల్లోనే.. నెత్తిమీద సామాన్లు పెట్టుకుని ఊరంతా తిరిగినం ఏనిమిదేండ్లు కిరాయి ఇంట్ల ఉన్నం. నేను కోళ్లవ్యాన్ డ్రైవర్‌ను. నా భార్య బీడీలు చేత్తది. ఇద్దరు కొడుకులు. మోహినికుంటలనే నా పెండ్లి అయ్యింది. అప్పటి సంది కిరాయి ఇంట్లనే ఉంటున్నం. ఏడాదికొక ఇల్లు మారేటోళ్లం. గప్పుడు నెత్తిమీద సామాన్లు పెట్టు కుని ఊరంతా తిరిగేటోళ్లం. మస్తు బాధ అనిపిస్తుండేది. ఇల్లు కట్టుకునే స్థోమతలేదు. గింత జాగలేదు. మా బాధలు ఎట్ల తీరుతయి దేవుడా అనుకునేటోళ్లం. కారం మెతుకులు తిన్నాసరేగానీ సొంత ఇల్లు ఉండాలే అనుకున్నం. నాలాంటి డ్రైవర్ ఇల్లు ఎట్ల కడుతడు. జీవితమంతా గిదే బతుకనుకున్నం. కానీ, కేటీఆర్ సార్ మాకు ఈడ ఇల్లు ఇప్పించిండ్రు. ఇప్పుడు మస్తు ధైర్యం వచి్చంది. పిల్లలను మంచిగా చదివించుకోవాలే అని డిసైడ్ అయినం. కేసీఆర్ సారుకు రుణపడి ఉంటం. – మహ్మద్ రజాక్, కౌసర్‌బేగం పెండ్లి చేసుకునుడే.. కిరాయి ఇంట్ల ఉంటున్నమని పిల్లను ఇచ్చేతందుకు సంబంధాలు వస్తలేవు. నేను ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిజేస్తున్న. కిరాయి ఇంట్ల ఉంటే ఎవరూ విలువ గూడ ఇస్తలేరు. కనీసం మనిషిగా గుర్తిస్తలేరు. డ్రైవర్ పనిజేసేవాళ్లకు పిల్లను ఎవరు ఇస్తరు. మా ఇబ్బందులు గిట్లున్నయి. మా సర్పంచ్ డబుల్బెడ్రూమ్ ఇప్పించిండ్రు. అమ్మానాన్న నాకు పెళ్లి సంబంధాలు జూస్తున్నరు. సొంతింట్లకు అచ్చి నం. ఇగ పెండ్లి చేసుకునుడే. – శేఖర్ కిరాయి ఇంట్ల నుంచి డబుల్బెడ్రూమ్ ఇంట్లకు.. మా ఊరులో సొంతిల్లు లేదు. చాలా అవస్థలు పడ్డం. కూలి పనులు జేసుకునే మాకు సొంతిల్లు కట్టుకునే పరిస్థితి వస్తదోరాదో అనుకున్నం. కిరాయి ఇంట్లనే ఏండ్లకొద్దీ ఉన్నం. నెలకు రూ.500 కిరాయి. ఇప్పుడు డబుల్బెడ్రూమ్ ఇల్లు మంజూరైంది. కేటీఆర్ సార్ మా ఇంట్లకు వచ్చి గృహప్రవేశం జేసిండ్రు. గాయిన జేసిన సాయం మరిచిపోలేం. – గునుకంటి పావని (చదవండి: మెరిసి మురిసిన తెలంగాణ పల్లెలు ) -
ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ ఆత్మహత్య
సాక్షి, ముస్తాబాద్(సిరిసిల్ల): ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నారు. ముస్తాబాద్ ఎస్సై లక్ష్మారెడ్డి కథనం ప్రకారం.. కమలాపూర్ మండలంలోని మాదన్నపేటకు చెందిన మాచర్ల వెంకన్న(37) ముస్తాబాద్‌లోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా పోత్గల్ బ్రాంచిలో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడే ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. 15 రోజులు సెలవులో వెళ్లిన ఆయన శనివారం తిరిగి విధుల్లో చేరారు. సోమవారం ఉదయం బ్యాంకు సమయం దాటినా రాకపోవడంతో అధికారులు, సిబ్బంది వెంకన్న అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లగా అచేతనంగా పడివున్నారు. పురుగుల మందు తాగినట్లు గుర్తించి, స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో సిద్దిపేటకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. సంఘటన స్థలాన్ని ఎస్సై లక్ష్మారెడ్డి పరిశీలించారు. అయితే బ్యాంక్ అధికారుల వేధింపుల వల్లే తన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని వెంకన్న భార్య పద్మ ఆరోపించారు. దీనికి కారణమైన వారిని చట్టరీత్యా శిక్షించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుడికి కుమారుడు సాయితేజ, కూతురు దీక్షిత ఉన్నారు. వెంకన్న మృతితో బాధిత కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. చదవండి: ప్రాణం తీసిన పంచాయితీ తీర్పు -
పంట చేలకు కోతుల బెడదా? ఇలా చేయండి
సాక్షి, గంభీరావుపేట(సిరిసిల్ల): పొట్టదశకొచ్చిన వరి చేలను కోతులు పీల్చి పడేస్తున్నాయి. పొలం గట్లపై గుంపులు గుంపులుగా తిరుగుతూ వరి కంకులను చిన్నాభిన్నం చేస్తున్నాయి. వెళ్లగొట్టడానికి ఎంత ప్రయత్నించినా మళ్లీ మళ్లీ వచ్చి పంటను నాశనం చేస్తున్నాయి. ఈ క్రమంలో గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన రాజబోయిన ఆంజనేయులు అనే యువ రైతు తన పొలంలో కొండెంగ బొమ్మను కాపలా పెట్టాడు. కొండెంగగా భావిస్తున్న కోతులు భయంతో అటు వైపు రావడం మానేశాయి. ఆంజనేయులు ఆలోచనను పలువురు అభినందిస్తున్నారు. తమ పొలంలోనూ అలాగే ఏర్పాటు చేసుకుంటామంటున్నారు. చదవండి: ప్రకృతి సేద్యం: పల్లెబాట పట్టిన సాఫ్ట్వేర్ యువ జంట -
విద్యార్థినిపై లైంగిక దాడి.. ఆపై వీడియోలు తీసి..
సాక్షి, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఇంటర్ విద్యార్థిని(16)పై ఇదే గ్రామానికి చెందిన ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ప్రేమపేరుతో నమ్మించి అఘాయిత్యానికి పాల్పడడమే కాకుండా అర్ధనగ్నంగా ఉన్న ఆమె ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతానని భయభ్రాంతులకు గురి చేశాడు. పలుసార్లు ఆమెపై లైంగికదాడికి పాల్పడగా.. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో కుటుంబ సభ్యులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. ఎల్లారెడ్డిపేట సీఐ బన్సీలాల్, ఎస్సై వెంకటకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేటకు చెందిన యువకుడు ప్రేమిస్తున్నానంటూ మాయమాటలతో విద్యార్థినికి దగ్గరయ్యాడు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. వీడియో, ఫొటోలు తీసి తరచూ బెదిరిస్తూ పలుసార్లు లైంగికదాడి చేశాడు. ఈ విషయమై విద్యార్థిని తన తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ బుధవారం యువకుడితోపాటు అతడికి సహకరించిన మరో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. లైంగిక దాడికి పాల్పడిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆ పరిసరాల్లోని గ్రామస్తులను ఈ ఘటనపై డీఎస్పీ వివరాలు సేకరించారు. లైంగికదాడికి పాల్పడిన వ్యక్తితో పాటు అతడికి సహకరించిన మరో ఇద్దరిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ, ఎస్సై తెలిపారు. కాగా ఈ ఘటనలో మరికొందరి ప్రమేయం ఉందనే కొణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. గంజాయి మత్తులో నిందితుడితో పాటు మరో ముగ్గురు కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. -
ఎల‘మంద’కు కాసుల పంట
సాక్షి, కోరుట్ల: రసాయనిక ఎరువుల వినియోగంతో భూమి సారం కోల్పోతూ వస్తోంది. పంట దిగుబడిపైనా ప్రభావం చూపుతోంది. వ్యవసాయ భూముల్లో ఆవుల మందతో భూమికి సారం.. ఎలమందకు రాబడి.. రైతుకు ప్రయోజనం కలుగుతోంది. దీంతో భూసారం పెంపుపై రైతాంగం ఆవుల మందలపై దృష్టి సారిస్తోంది. ఈ మంద వారం పాటు సాగు భూముల్లో నిద్ర తీసిందంటే చాలు సదరు ఎలమందకు రూ.50 వేలకు మించి చేతికొస్తుంది. ఆవుల మంద విసర్జకాలకు ఉన్న డిమాండే ఇందుకు కారణమని చెబుతున్నారు. జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల సరిహద్దుల్లో ఉన్న రుద్రంగి మండలం మానాల, చందుర్తి, కోనరావుపేట మండలాల పరిసరాల్లోని తండాల్లో పశుపోషణ పెద్ద ఎత్తున సాగుతోంది. అటవీ ప్రాంతాల్లో పచ్చిక బయళ్లు పెద్ద ఎత్తున ఉండటంతో ఆవుల మందలను ఎక్కువగా పోషిస్తున్నారు. నెలల తరబడి సంచార పశుపోషణ చేస్తూ ఆదాయం కోసం మందలను సాగు భూముల్లో నిద్రకు ఉంచుతారు. పశ్చిమ డివిజన్ సరిహద్దుల్లోని తండాల్లో ఇలా ఆవుల మందలను పోషించేవారు దాదాపు 150 మంది దాకా ఉంటారు. వంద వరకు మందలు ఉండగా.. ఒక్కో మందలో వందకు పైగా ఆవులు ఉన్నాయి. వారానికి రూ.50 వేలు పంటల సాగుకు సిద్ధమయ్యే ముందు రైతులు భూసారం పెంపు కోసం ఆవుల మందల నిద్రపై ఆసక్తి చూపుతున్నారు. సహజసిద్ధంగా ఆవుల మల, మూత్ర విసర్జకాలతో సాగుభూములు సార వంతంగా మారుతాయి. రసాయన ఎరువులు వాడ కుండానే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. మం దలో ఉన్న ఆవుల సంఖ్యను బట్టి రైతులు మందల యజమానులకు డబ్బులు చెల్లిస్తున్నారు. వందకు పైబడి ఉన్న ఆవుల మంద వారం పాటు సాగు భూమిలోనే కట్టేస్తే రోజుకు రూ.6 వేల నుంచి రూ.8 వేలు చెల్లిస్తున్నారు. కనీసం వారంపాటు మంద సాగుభూమిలో ఉంటే పశు మల, మూత్ర విసర్జకాలతో భూసారం చక్కగా పెరుగుతుంది. ఇవీ లాభాలు ► సాగు భూమిలో కర్బన శాతం పెరుగుతుంది ► సూక్ష్మ, స్థూల పోషకాలు సమతూకం అవుతాయి ► భూమి సహజ లక్షణాలు కోల్పోకుండా ఉంటుంది ► నత్రజని, భాస్వరం, పొటాషియం సహజసిద్ధంగా అంది నేల సారవంతం అవుతుంది -
సిరిసిల్ల సర్కారు బడి.. మెరుగుబడి!
-
జీతాలివ్వండి మహాప్రభో..
సాక్షి, రాజన్న సిరిసిల్ల: ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పెంచుతాం.. అని ప్రభుత్వం బీరాలు పలికిందే తప్ప కనీసం సమయానికి జీతాలివ్వడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. మరికొద్ది రోజుల్లో సంక్రాంతి పండగ ఉన్న తరుణంలో తమకు వెంటనే జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకటో తారీఖు దాటిపోయి పది రోజులవుతున్నా జీతాలు చెల్లించకపోవడంతో సిరిసిల్లలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సోమవారం నిరసన చేపట్టారు. జీతాలు పెంచుతున్నట్లు జనాల్లో అపోహలు సృష్టిస్తున్నారే తప్ప చేసిందేమీ లేదని పెదవి విరుస్తున్నారు. ఇంకా ఒక్క రూపాయి కూడా చేతికి రాకపోవడంతో పండగ ఎట్లా జరుపుకునేదని తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే జీతాలు పడేట్లు చూడాలని కోరుతున్నారు. (చదవండి: మేం మారం.. మార్చం!) 5న జీతాలివ్వండి సమయానికి జీతాలు ఇవ్వకపోవడంతో లోన్ల విషయంలో చాలా ఇబ్బంది అవుతోంది. పెనాల్టీలు పడుతున్నాయి. కుటుంబాన్ని పోషించుకోలేని దుఃస్థితికి వెళుతున్నాం. కాబట్టి ప్రభుత్వం మా మీద దయ చూపి కనీసం ఐదో తారీఖున జీతాలు పడేలా చర్యలు తీసుకోవాలి. - పాపన్నగారి దేవయ్య, ఆర్టీసీ కండక్టర్, సిరిసిల్ల డిపో -
ఒక్కరోజు ఊరు ఖాళీ చేసిన గ్రామస్థులు!
గంభీరావుపేట (సిరిసిల్ల): ఆ ఊరంతా ఖాళీ అయ్యింది. ఇంటింటికీ తాళం పడింది. జనసమ్మర్ధంతో ఉండే ఊరు.. నిర్మానుష్యంగా మారింది. ఒక్కసారిగా ఊళ్లో నిశ్శబ్దం ఆవరించింది. కరోనా మహమ్మారి నుంచి ఊరును కాపాడాలని గ్రామదేవతలను వేడుకుంటూ జనం ఊరు వదిలి వనంబాట పట్టారు. ముందు ఊరంతా కలసి గ్రామదేవతలకు పూజలు చేశారు. అనంతరం గ్రామ శివారులోని పొలాలు, అడవుల్లోకి వెళ్లి భోజనాలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజలు వివరాలిలా ఉన్నాయి.. లింగన్నపేటలో సుమారు ఆరు వేల జనాభా ఉంటుంది. 1,400 నివాసాలు ఉంటాయి. కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని కోరుతూ గ్రామదేవతలకు పూజలు చేద్దామని, ఒకరోజంతా ఊరు వదిలి అడవుల్లోకి వెళ్లాలని అన్ని కుల సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. అందరి సమ్మతం మేరకు ఆదివారం దానిని అమలు చేశారు. దీనికి ముందు రెండురోజులుగా ఊళ్లోని ప్రతీవీధి, రహదారిని శుభ్రం చేశారు. అలాగే తమ ఇళ్లను శుభ్రం చేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఊర్లోని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన గ్రామదేవతల ప్రతిమలకు అంతా కలసి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, రోగాలు దరిచేరకుండా కాపాడాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలని దేవతలను వేడుకున్నారు. అనంతరం ఉదయం ప్రతీ ఇంటి నుంచి అందరూ ఆహార సామగ్రి, ఇతర వస్తువులు పట్టుకొని పొలాలు, అడవుల్లోకి పయనమయ్యారు. ఎవరికి వారుగా అక్కడ వంటలు చేసుకొని భోజనాలు చేశారు. సూర్యాస్తమయం తర్వాత మళ్లీ గ్రామంలోకి అడుగుపెట్టారు. లింగన్నపేట వాసులు చేసిన ఈ కార్యక్రమం చుట్టుపక్కల గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. -
అంతరాలను పెంచుతున్న ఆస్తులు
సాక్షి, హైదరాబాద్ : ఓ వ్యక్తికి ఇద్దరు కూతుర్లు, ముగ్గురు కొడుకులు. ఆయన ఆరేళ్లక్రితం చనిపోయారు. బతికి ఉండగా సంపాదించిన ఏడు గుంటల స్థలం ఇప్పుడు అన్నా చెల్లెళ్ల మధ్య శాశ్వత అగాధాన్ని పెంచింది. పాతికేళ్లక్రితం పెళ్లై, కట్నం కింద కొంతనగదు, ఇంటి స్థలాన్ని కూడా పొందిన ఆమె తల్లిదండ్రుల మరణానంతరం వాళ్ల ఆస్తిలో వాటాకావాలంటూ కోర్టు మెట్లెక్కింది. ఆస్తి పాస్తులు అయిన వాళ్ల మధ్య అంతరాలను పెంచుతున్నాయి. రక్త సంబంధాల అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కు ఉందని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు నేపథ్యంలో ఇపుడు కోర్టు మెట్లు ఎక్కుతున్నవాళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయినవాళ్ల మధ్య అగాధాలు ఆస్తి పంపకాల సమయంలో వాటాలు కావాలని వివాదాలకు దిగుతున్న ఆడపిల్లల విషయంలో.. బంధుత్వాలు భారంగా మారుతున్నాయి. కొద్దిపాటి ఆస్తిలో కూడా వాటా కావాలని భీష్మించుకున్న సందర్భాల్లో విధి లేక వాటా అంటూ ఇస్తే ఇకపై రాకపోకలు బంద్ అని, ఏ రకమైన శుభకార్యాలకు ఆహ్వానాలు ఉండవు పరస్పరం హెచ్చరించుకుంటున్నారు. ఒçకే రక్తం పంచుకుని పుట్టిన అన్నా చెల్లెళ్ల మధ్య శాశ్వతమైన అగాధానికి ఈ ఆస్తి వివాదాలు కారణమవుతున్నాయి. తండ్రి మరణించినా సరే... సవరణ తేదీ నాటికీ కూతురు తండ్రి జీవించి ఉన్నా లేకపోయినా ఆమెకు తండ్రి ఆస్తిలో హక్కు ఉంటుంది. తాజా తీర్పు ప్రకారం సవరణ తేదీ నాటికి కుమార్తె జీవించి లేకున్నా... ఆమె సంతానం ఆమెకు రావాల్సిన వాటాను కోరవచ్చు. దీంతో ఈ తీర్పు హిందూ అవిభాజ్య కుటుంబంలో ఆడపిల్లల ఆస్తి హక్కుపై ఉన్న సందేహాలన్నీ నివృత్తి అయ్యాయి. 1956 నాటి హిందూ వారసత్వ చట్టానికి 2005లో సవరణలు చేశారు. 2005 సెప్టెంబర్ 9న పార్లమెంట్ ఆమోదించింది. తండ్రి స్వార్జిత ఆస్తిలో ఆడ పిల్లలకు సమాన వాటా ఉంటుందని ఆ చట్టం చెబుతోంది. చట్టం కావాలంటోంది.. సంప్రదాయం వద్దంటోంది ఆడపిల్లలకు పెళ్లి చేసే సమయంలోనే తండ్రి తనకున్న దాంట్లో ఘనంగా వివాహం చేస్తూ కట్న కానుకలను సమర్పించుకుంటాడు. ఇంట్లో జరిగే ప్రతీ శుభకార్యాల సమయంలో కూడా కూతురుకు కట్నాల పేరుతో కొంత సమర్పిస్తారు. ఆస్తిలో వాటా అడగరు అనే అభిప్రాయంతోనే ఇవన్నీ చేస్తారు. ఆస్తుల విభజన సమయంలో ఆడపిల్లల కంటినీళ్లు శుభం కాదనే సెంటిమెంట్‌తో శక్తి మేరకు నగదునో, బంగారాన్నో కానుకగా ఇచ్చి అన్నదమ్ములు ఆస్తులు పంచుకుంటూ ఉండడం ఇప్పటివరకు వస్తున్న సామాజిక సంప్రదాయం. ఆస్తి హక్కులో ఆడపిల్లలకు వాటా అన్న నియమం వచ్చింతర్వాత కట్న కానుకలు తీసుకున్న వాళ్లు కూడా ఆస్తిలో వాటా సమయానికి వివాదాలకు తెరలేపడం, చట్టాన్ని కారణంగా చూపడం ప్రస్తుత వివాదాలకు కారణమవుతోంది. సుప్రీం ఏం చెప్పిందంటే.. కొడుకులతోపాటు కూతుర్లకు సమాన ఆస్తి హక్కు ఉంటుంది. హిందూ అవిభక్త కుటుంబానికి చెందిన ఆస్తిపై ఆడపిల్లలకు ఉన్న హక్కుపై సుప్రీంకోర్టు ఇటీవల చారిత్రక తీర్పునిచ్చింది. తండ్రి, కూతురు ఇద్దరూ జీవించి ఉంటేనే కుమార్తెకు సహ వారసత్వ హక్కు దాఖలు అవుతుందని 2005 సెప్టెంబర్ 9న ఇచ్చిన తీర్పును సవరించింది. 2005 కన్నా ముందే తండ్రి లేదా తల్లి మరణించినా వారసత్వంగా ఆస్తిని పొందే హక్కు ఉంటుందని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టంపై అవగాహన పెంచుకోవాలి ఆస్తి హక్కుపై న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నది నిజమే. అవగాహన లేని కారణంగానే దగ్గర వాళ్లు కూడా చూసుకోలేనంతగా దూరం అవుతున్నారు. సమాన హక్కు అనే చట్టంపై విస్తృతంగా అవగాహన పెంచుకుంటే అంతరాలు తగ్గుతాయి. ఆడపిల్లకు పెళ్లి సమయంలోనే ఇవ్వదల్చుకున్న ఆస్తిపై స్పష్టత, రాతపూర్వక ఒప్పందాలు చేసుకుంటే అనంతర కాలంలో ఇలాంటి వివాదాలకు తావు లేకుండా ఉంటుంది. – ఆవునూరి రమాకాంత్‌రావు, సీనియర్ న్యాయవాది, సిరిసిల్ల బాధ్యతల్లోనూ సమానమని గుర్తించాలి వారసత్వపు ఆస్తిలో మాత్రమే ఆడపిల్లలకు హక్కు ఉంటుంది. హక్కుల గురించి మాట్లాడే సమయంలో బాధ్యతలు నిర్వహించాలనే కనీస జ్ఞానం కూడా ఉంటే సమాజానికి క్షేమం. రక్త సంబంధీకులు ఆర్థికంగా చితికిపోతే ఆదుకున్న ఆడపిల్లల సంఖ్య అరుదు అనే చెప్పాలి. కొడుకులతోపాటు కూతుర్లు సమానమే..కాదనం.. అది పంపకాల్లో మాత్రమే కాదు బా«ధ్యతల్లో కూడా ఉంటే ఇలాంటి కేసుల ప్రస్తావనే ఉండదని నా అభిప్రాయం. – చెక్కిళ్ల మహేశ్‌గౌడ్, సీనియర్ న్యాయవాది, సిరిసిల్ల -
విషాదం: పంటను కాపాడుకునేందుకు వెళ్లి...
సాక్షి, నిర్మల్: వరుణుడి నుంచి పంటను కాపాడుకునేందుకు వెళ్లిన తండ్రీకొడుకులు మృత్యువాత పడిన ఘటన స్థానికంగా విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే తానూర్ మండలం భోసి గ్రామానికి చెందిన రాములు (55), మురళి... పొలంలోని సోయా పంట వర్షానికి తడవకుండా ఉండేందుకు ప్లాస్టిక్ కవర్ కప్పేందుకు వెళ్లారు. అయితే పంట చుట్టూ విద్యుత్ తీగలు అమర్చడంతో... ప్లాస్టిక్ కవర్ ఆ తీగలకు తగిలింది. దీంతో తండ్రీకొడుకులకు కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట (మం) సుద్దాల గ్రామంలో ఎయిర్ టెల్ టవర్‌లో పనిచేస్తున్న తిరుపతి అనే వ్యక్తి విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. మృతుడు నారాయణ పేట జిల్లా కుంసనపల్లి గ్రామవాసి. -
కరీంనగర్లో భారీ వర్షం..
సాక్షి, కరీంనగర్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జోరుగా వర్షం కురుస్తోంది. జిల్లాలోని చిగురుమామిడి మండలంలో అత్యధికంగా 12.5 సెంటీ మీటర్ల వర్షపాతంనమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలుజలకళను సంతరించుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై పంట పొలాలు నీట మునిగాయి. భారీ వర్షానికి చిగురుమామిడి మండలం ముదిమాణిక్యంలో పోచమ్మ చెరువు, సుందరగిరిలోని కోమటికుంట మత్తడి దూకుతున్నాయి. పంట పొలాలు నీట మునిగి రైతులు ఆందోళన చెందుతున్నారు. బోర్నపల్లిలో 11.2 సెంటీమీటర్లు, రేణికుంటలో 10.85 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట 10.3 సెంటి మీటర్లు, కొహెడ మండలంలో 9.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలుచోట్ల రోడ్లపై నుంచి వరద పొంగిపొర్లడంతో రోడ్లు దెబ్బతిన్నాయి. వర్షం, వరదలతో రైతన్నకు అపార నష్టం వాటిల్లింది. అధికారులు పంట నష్టాన్ని పరిశీలించి తగిన పరిహారం చెల్లించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. -
కొడుకు మృతి.. ఇంట్లోకి రావొద్దన్న ఇంటి యజమాని
తంగళ్లపల్లి(సిరిసిల్ల): సభ్యసమాజం తలదించుకునేలా మానవత్వం మంటకలిసింది. ఈ సంఘటన తంగళ్లపల్లి మండలకేంద్రంలో చోటుచేసుకుంది. తంగళ్లపల్లిలోని రెడ్డివాడలో అద్దె ఇంట్లో నివాసముంటున్న మ్యాన అమిత్ (27) గురువారం ఉదయం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో గుండెపోటుతో మృతిచెందాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకువస్తే ఇళ్లు శుద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇంటి యజమాని అనుమతించలేదు. గత్యంతరం లేక అమిత్ కుటుంబసభ్యులు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నేరుగా తంగళ్లపల్లి ఊరి చివరికి శ్మశానం వద్దకు మృతదేహాన్ని తరలించారు. బాధిత కుటుంబసభ్యుల వివరాల ప్రకారం మ్యాన అమిత్ తండ్రి సుదర్శన్ గతంలో మృతిచెందగా తల్లి సువర్ణతోపాటు తన సోదరులతో కలిసి మండలకేంద్రంలో ఓ ఇంట్లో పదినెలలుగా అద్దెకు ఉంటున్నారు. టెక్స్టైల్ పార్కులో మరమగ్గాల కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తల్లి మ్యాన సువర్ణ బీడీల పనిచేస్తోంది. గురువారం తెల్లవారుజామున అమిత్ ఉన్నట్టుండి అస్వస్థతకు గురికావడంతో ఆరోగ్యం అతడిని హుటాహుటిన సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగానే అమిత్ గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచాడు. కన్నీరుమున్నీరైన కుటుంబసభ్యులు దహనసంస్కారాలు నిర్వహించేందుకు తంగళ్లపల్లి అద్దె ఇంటికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తుండగా ఇంటి యజమాని ఇంట్లోకి తీసుకురావడానికి అనుమతించలేదు. ఎంత ప్రధేయపడినా ఒప్పుకోలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఆటోలో తంగళ్లపల్లి ఊరిచివర శ్మశానవాటిక వద్దకు తీసుకువచ్చారు. అక్కడి నుంచే అమిత్‌కు అంతిమయాత్ర నిర్వహించాల్సి వచ్చింది. గూడు లేని పక్షులవలే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మనసున్న చాలా మందిని కంటతడి పెట్టించింది. అమిత్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున చేయూత అందించాలని అంతేకాకుండా ఉండడానికి గూడు కల్పించాలని తంగళ్లపల్లివాసులు కోరుతున్నారు. చలించిపోయిన పోలీసులు అక్కడే మానేరు వాగు ఒడ్డున పికెటింగ్ నిర్వహిస్తున్న సీఐ సర్వర్, పోలీస్ సిబ్బంది అమిత్ కుటుంబసభ్యుల పరిస్థితి చూసి చలించిపోయారు. సీఐ సర్వర్ రూ.10 వేలు, పోలీస్ సిబ్బంది అందరూ కలిసి మరో రూ.5 వేలు ఆర్థికసాయం అందించారు. -
చెప్పిన పంటలే వేయాలని సీఎం అనలేదు: కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల : రాష్ట్రంలోని అన్ని చెరువులు, కుంటలు నింపాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో గురువారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. యాభై ఏళ్లలో ఎన్నడూ చూడని అద్భుత దృశ్యం ప్రస్తుతం చూస్తున్నామన్నారు. ఎర్రటి ఎండల్లో చెరువులు మత్తడి దుంకుతున్నాయన్నారు. ఒకప్పుడు సిరిసిల్ల ఎడారిలాగా ఉండేదని, ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్లు దూకి పొలాలు పచ్చగా కనిపిస్తున్నాయన్నారు. అన్నం తెలియదని వెక్కిరిచ్చిన వాళ్ల చెంపపై కొట్టేలా దేశానికే అన్నం పెట్టేలా తెలంగాణ రైతులు ఎదుగుతున్నారని ప్రశంసించారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం నుంచే అత్యధిక ధాన్యం కొనుగోళ్లు జరిగాయని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే చెప్పిందని మంత్రి గుర్తు చేశారు. (తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు) దేశంలో 70 ఏళ్లలో రైతుబంధు ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ అన్నారు. కరోనా కష్టకాలంలో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా రైతులకు ఇబ్బందులు లేకుండా రైతు బంధు విడుదల చేశారని తెలిపారు. మిడ్ మానేరు నిండటంతో సిరిసిల్ల జిల్లాలో 6 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయని, దేశంలో ఇదే రికార్డు అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముస్సోరీలోని సివిల్ సర్వీస్ ఐఎఎస్ అధికారులకు శిక్షణలో పాఠాలుగా బోధిస్తున్నారని, ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వ కారణమని కేటీఆర్ కొనియాడారు. కరెంటు మీద ఆధారపడకుండా 2 పంటలు పండించి చూపిస్తామని తెలిపారు. తెలంగాణ వచ్చాక ఇంత త్వరగా నీళ్లొస్తాయని ఎవరూ ఊహించలేదని, సముద్రానికి 82 మీటర్ల ఎత్తులో ఉన్న మేడిగడ్డ నుంచి గోదావరి జలాలను 618 మీటర్ల పైన కొండపోచమ్మకు గోదావరి జలాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చారని ప్రస్తావించారు. (తనకు వచ్చిన కష్టం మరొకరికి రాకూడదని) 1.25 కోట్ల ఎకరాల భూములకు సాగునీరిచ్చి రెండో హరిత విప్లవం తీసుకు వస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రామాల్లో రైతు బాగుంటే అన్ని కులవృత్తుల వారికి ఉపాధి దొరుకుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒక రైతు బిడ్డ అని, ఆయనకు రైతుల సమస్యలు తెలుసని అన్నారు. రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి కూడా కేసీఆర్ పట్ల అపారమైన నమ్మకం ఉందన్నారు. ఏ ఒక్క పథకాన్ని ఎగ్గొట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రతీ గ్రామపంచాయతీకి తిరిగి ప్రతీ రైతుకు రైతుబంధు అందేలా చూడాలని సూచించారు. (ముత్తిరెడ్డిని కలిసిన ఏపీ టీడీపీ ఎమ్మెల్యే) జులై 15 తేదీ లోపు జిల్లాలో ఏ భూమిలో ఏ పంట వేశారో అధికారులు, ప్రజాప్రతినిధులు సమగ్ర నివేదిక అందించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. రైతు బంధు విషయంలో కొంత మంది దుష్ప్రచారం చేస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని హితవు పలికారు. రైతుల కోసం ఎన్నో పనులు చేసిన కేసీఆర్ మించిన ముఖ్యమంత్రి లేరని, రైతులకు మద్ధతు ధరకు మించి డబ్బులు రావాలన్నదే సీఎం ఆలోచన అని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకే నియంత్రిత పంటల విధానం తెచ్చామని, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేయడం వల్ల రైతు ధనవంతుడు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. తాను చెప్పిందే వేయాలని సీఎం కేసీఆర్ చెప్పడం లేదని, డిమాండ్ ఉన్న పంటలు వేసుకోవాలని చెబుతున్నారని పునరుద్ఘాటించారు. రైతు వేదికల ద్వారా అన్నదాతలను సంఘటితం చేసి బంగారు పంటలు పండేలా సమాలోచనలు చేసుకోవచ్చని రైతులకు కేటీఆర్ సూచించారు. -
మూడు రోజుల పాటు ప్రత్యేక లాక్డౌన్
గంభీరావుపేట(సిరిసిల్ల): కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు మండలకేంద్రంలోని ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, ఇతర దుకాణాలు బంద్ చేసి లాక్డౌన్లో పాల్గొంటున్నారు. ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండడంతో జనసంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సోమవారం నుంచి బుధవారం వరకు లాన్‌డౌన్ అమలు చేయనున్నారు. మండలకేంద్రం కావడంతో చాలా మంది వివిధ పనుల నిమిత్తం నిత్యం గంభీరావుపేటకు వచ్చి వెళ్తుంటారు. కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రైమరీ కాంటాక్టుల ద్వారా వైరస్ ప్రబలే అవకాశం ఉందని పలువురు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల గంభీరావుపేటలో ముగ్గురికి కరోనా పాజిటివ్ రాగా.. అందులో ఒక మహిళ మృతి చెందింది. ఈ నేపథ్యంలో వైరస్ ప్రబలకుండా ఉండేందుకు ఏం చేయాలన్న విషయమై సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు గ్రామస్తులు, అధికారులతో చర్చించారు. మూడు రోజుల పాటు ప్రత్యేక లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు. ‘మనకు మనమే లాక్డౌన్ విధించుకుందాం’ అనే ఆలోచనను ఆచరణలో పెట్టారు. సోమవారం నుంచి లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చారు. వణికిస్తున్న మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకునేందుకు లాక్డౌన్ అమలు చేస్తున్నామని సర్పంచ్ కటకం శ్రీధర్‌పంతులు తెలిపారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. (అమ్మా.. అనే పిలుపుకు నోచుకోకుండానే..) స్వీయ రక్షణే శ్రీరామరక్ష స్వీయ రక్షణతోనే కరోనా వైరస్‌ను కట్టడి చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వానాకాలం ప్రారంభమైంది. అంతటా వర్షాలు కురుస్తున్నాయి. కరోనా వైరస్ విజృంభించేందుకు అనుకూల సమయమిది. ఆపై కోవిడ్–19 మరింత భయపెడుతోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, నిబంధనలు పాటించకపోయినా కరోనా వైరస్ మనల్ని చుట్టేయడం ఖాయం. (కరోనా 2.0 పంజా!) అసలే వానాకాలం.. సాధారణంగానే వానాకాలం అంటే వ్యాధుల సీజన్‌గా పేర్కొంటారు. ఈ కాలంలో జలుబు, దగ్గు, జ్వరం ఎక్కువగా వస్తుంటాయి. కరోనాకు సైతం ఇవే లక్షణాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది జలుబు, దగ్గు వస్తే భయపడుతున్నారు. నలుగురిలో ఉన్నప్పుడు ఏ ఒక్కరికి తుమ్ము, దగ్గు వచ్చినా మిగతా వారు వణికిపోతున్నారు. బేఖాతర్ చేస్తే.. లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో చాలామంది కరోనాను లైట్‌గా తీసుకుంటున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి అని హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. కొందరు కనీసం మాస్క్‌లు కూడా ధరించడం లేదు. భౌతిక దూరం కానరావడం లేదు. ఇటీవల నమోదవుతున్న కేసుల్లో ఇవే అధికంగా ఉన్నాయి. జిల్లాలో..కరోనా కేసులు 22 జిల్లాలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వేములవాడకు చెందిన ఒక్కరితో కరోనా మొదలైంది. ఆ తర్వాత ముంబయి, హైదరాబాద్, ఇతర రాష్ట్రాల నుంచి వలసజీవులు రావడంతో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 22 పాజిటివ్ కేసులు న మోదయ్యాయి. 1,798మంది స్వీయ నిర్బంధంలో ఉన్నారు. గంభీరావుపేటలో ఒక కరోనా మరణం నమోదైంది. -
రైతులు సంఘటితం కావాలి
సిరిసిల్ల: రాష్ట్రంలో రైతులను సంఘటితం చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా పనిచేస్తోందని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్‌లో బుధవారం గోదావరి జలాలతో నిండిన ఊర చెరువు వద్ద జలహారతి పట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో చేపట్టిన కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల పథకాలతో కోటీ 25 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుందని చెప్పారు. రాష్ట్రంలో జల విప్లవంతో హరిత విప్లవం, నీలి విప్లవం, శ్వేత విప్లవం, పింక్ విప్లవం వస్తుందన్నారు. ఐదు విప్లవాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ధాన్యాగారంగా మారిందని, సారవంతమైన భూములతో దేశానికి ఆదర్శంగా ఉంటామని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని 46 వేల చెరువులను నింపుతామని, దీంతో కరెంటు అవసరం లేకుండా రెండు పంటలు పండుతాయని తెలిపారు. ఇంటింటికీ పాడి గేదెలను అందించే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఆరు మీటర్ల భూగర్భ జలం పెరిగింది ఏ రాష్ట్రంలో లేని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏడాదిలోనే ఆరు మీటర్ల భూగర్భ జలం పెరిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోనే యువ ఐఏఎస్‌లకు శిక్షణ ఇచ్చే ముస్సోరిలో సిరిసిల్ల వాటర్ మేనేజ్మెంట్ పాఠ్యాంశమైందని, ఇది గర్వకారణమన్నారు. సిరిసిల్ల మానేరు వాగులో 365 రోజులు నీరు నిల్వ ఉంటుందన్నారు. మేడిగడ్డ నుంచి గోదావరి జలాలు మల్లన్నసాగర్ వరకు రావడం ఒక అద్భుతమని, అది కేసీఆర్ పట్టుదలతోనే సాధ్యమైందన్నారు. సముద్ర మట్టానికి 82 మీటర్ల ఎత్తులో ఉన్న గోదావరి నీటిని 618 మీటర్ల ఎత్తుకు తరలించి రైతుల సాగు నీటి కలను కేసీఆర్ సాకారం చేశారన్నారు. కాంగ్రెసోళ్లకు సిగ్గు లేదు కాంగ్రెసోళ్లకు సిగ్గు లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో మంచి పనులు చేస్తే ఓర్వలేరని, ఏది చేసినా వక్రభాష్యం చెబుతున్నారని ఆరోపించారు. ఏ ఒక్కరికీ రైతు బంధు ఎగ్గొట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. ఈ నెల 13న కాంగ్రెస్ పార్టీ జల దీక్ష చేస్తామని ప్రకటించిందని, కుందేళ్లను చంపి న నక్కలే సంతాప సభ పెట్టినట్లుగా ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. చెరువులు నిండుతుంటే, పంటలు పండుతుంటే కాం గ్రెసోళ్ల కళ్లు మండుతున్నాయని ఆరోపించారు. ఎగువ మానేరును దసరా నాటికి నింపుతామని, మధ్యమానేరుతో పాటు మల్లన్నసాగర్ నుంచి కూడెల్లి వాగు ద్వారా ఎగువ మానేరులోకి గోదావరి జలాలను తరలిస్తామన్నారు. -
రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారం
-
నియంత్రిత సాగుతో దేశానికి ఆదర్శం
సాక్షి, సిరిసిల్ల: రాష్ట్రంలో రైతాంగం నియంత్రిత సాగు విధానాలను అనుసరిస్తే దేశానికి ఆదర్శంగా ఉంటామని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం పలు వంతెనలు, ఇతర అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం సిరిసిల్ల క్యాంపు కార్యాలయంలో అ«ధికారులతో అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని, ఏ ఒక్క రైతుకూ ఎగ్గొట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. వ్యవసాయా«ధికారులు, రైతుబంధు సమితి సభ్యులు క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి నియంత్రిత సాగు విధానాన్ని అనుసరించే విధంగా చూడాలని సూచించారు. రైతుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా గతంలో రైతుబంధు కోసం రూ.12 వేల కోట్లు కేటాయించామని, ప్రస్తుతం రూ.14 వేల కోట్లు కేటాయించామని మంత్రి పేర్కొన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, సాగునీరు, పెట్టుబడి సాయం అందిస్తున్నామని వివరించారు. రైతువారీ వివరాలను అధికారులు సేకరించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో పంట కల్లాలు, సాగునీటి కాల్వల నిర్మాణం చేపట్టాలని కేటీఆర్ సూచించారు. రంగనాయక సాగర్ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలానికి సాగునీరు అందనుందని కేటీఆర్ పేర్కొన్నారు. రైతు సంక్షేమం విషయమై ఎలాంటి పరిస్థితుల్లో రాజీపడబోమని స్పష్టం చేశారు. డిసెంబరు నాటికి మధ్యమానేరు నుంచి ఎగువ మానేరులోకి 9వ ప్యాకేజీ ద్వారా సాగు నీరు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల మధ్య ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 210 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఉండే విధంగా స్థలాన్ని సేకరించాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. -
బ్రాండ్ సిరిసిల్ల కావాలి
సిరిసిల్ల/తంగళ్లపల్లి: దేశంలోనే సిరిసిల్ల వస్త్రాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చేలా నాణ్యత, నవ్యతతో వస్త్రాలను ఉత్పత్తి చేయాలని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్టైల్ పార్కులో రూ.14.50 కోట్ల వ్యయంతో చేపట్టిన సెంట్రల్ లైటింగ్, శిక్షణ కేంద్రం, పరిపాలనా భవనం, క్యాంటీన్ భవనాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సిరిసిల్లకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నడూలేని విధంగా సిరిసిల్ల నేతన్నలు ఉత్పత్తి చేసిన వస్త్రాలను రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ కానుకగా ఆడపడచులకు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్ ఉండేలా ఆధునికతను సంతరించుకునేలా వస్త్రాలు తయారు చేయాలని మంత్రి కోరారు. నేత కార్మికులు ఆత్మగౌరవంతో జీవించే విధంగా వేతనాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇస్తోందన్నారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కును వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. సిరిసిల్ల మహిళలకు ఉపాధి కల్పించేందుకు రెడీమేడ్ వస్త్రాల తయారీ కేంద్రాన్ని (అపెరల్ పార్కు) ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత నేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయని, ఈ విషయాన్ని ఏ నేత కార్మికుడిని అడిగినా చెబుతాడని కేటీఆర్ పేర్కొన్నారు. పవర్లూమ్ పరిశ్రమకు 50 శాతం విద్యుత్ సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు, జౌళి రంగానికి చేయూత అందించాలని కేంద్ర మంత్రికి లేఖ రాశామన్నారు. కార్యక్రమంలో జౌళి శాఖ డైరెక్టర్ శైలజారామయ్యర్, కలెక్టర్ డి.కృష్ణభాస్కర్ పాల్గొన్నారు. మంత్రి పర్యటనలో పలువురి నిరసన కేటీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో వెంకటేశ్ టెక్స్టైల్స్ యజమాని దొంతుల నరహరి వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపాడు. పరిశ్రమలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశాడు. తమ సమస్యలను విన్నవించేందుకు వచ్చిన ఉపాధి హామీ ఫీల్డు అసిస్టెంట్లను, పలువురు రైతులను పోలీసులు అరెస్టు చేశారు మంత్రి తంగళ్లపల్లిలో కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి మీడియాను అనుమతించక పోవడంతో పలువురు జర్నలిస్టులు నిరసన తెలిపారు. -
కరోనా రెడ్ జోన్ ఏరియాలో కేటీఆర్ పర్యటన
-
హ్యాట్రిక్ ‘కొండూరి’..!
సిరిసిల్ల: ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్‌గా జిల్లాకు చెందిన కొండూరి రవీందర్రావు ఎన్నికవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆయన కేడీసీసీ బ్యాంకు చైర్మన్ కావడం ఇది మూడోసారి. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ (టెస్కాబ్) చైర్మన్‌గా రవీందర్రావు ఐదేళ్లుగా కొనసాగుతున్నారు. మరోసారి టెస్కాబ్ చైర్మన్‌గా రవీందర్రావు పేరును సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈనేపథ్యంలో ఆయన రాష్ట్రస్థాయిలో టెస్కాబ్ చైర్మన్ పదవి కోసం ఇప్పుడు రాష్ట్రస్థాయిలో పోటీ పడుతున్నారు. ఈనెల 5న టెస్కాబ్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే అన్ని జిల్లాల్లోనూ కేడీసీసీ బ్యాంకు చైర్మన్లుగా ఎన్నిక కావడంతో రాష్ట్ర స్థాయిలో టెస్కాబ్ చైర్మన్‌గా రవీందర్రావు ఎన్నిక లాంఛనమే అయింది. 15 ఏళ్లుగా సహకార రంగంలో.. గంభీరావుపేట సహకార సంఘం చైర్మన్‌గా ఎన్నికైన రవీందర్రావు ఉమ్మడి జిల్లా స్థాయిలో మూడోసా రి చైర్మన్‌గా ఎన్నికై హ్యాట్రిక్ సాధించా రు. తొలిసారి 2005 లో గంభీరావుపేట మండలం గజసింగవరం నుంచి డైరెక్టర్‌గా, సింగిల్‌విండో చైర్మన్‌గా ఎన్నికై కేడీసీసీ బ్యాంక్ పదవి అలంకరించారు. ఎన్నికయ్యారు. రెండోసారి 2013లోనూ జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్‌గా ఎన్నికయ్యా రు. 2015లో తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ చైర్మన్‌గా నియమితులయ్యారు. 2019లో అంతర్జాతీయ సహకార బ్యాంక్‌ల సమాఖ్య ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా స హకార రంగంలో పనిచేసే ఉద్యోగుల హెచ్ఆర్ పాలసీ అమలు కమిటీకి రవీందర్రావు చైర్మన్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా ఎన్నిక అయ్యారు. 15 ఏళ్లుగా సహకార రంగంలో రవీందర్రావు సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సహకార బ్యాంకులను బలోపేతం చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో డీజిల్, పెట్రోల్ బంకుల ఏర్పాటు, ప్రతి సహకార సంఘాన్ని బ్యాంకులా మార్చేందుకు ఆయన శ్రమించారు. జిల్లాకు ఆరు డైరెక్టర్ పదవులు... జిల్లాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయిలో ఆరు డైరెక్టర్ పదవులు లభించాయి. కేడీసీసీబీలో డైరెక్టర్లుగా వుచ్చిడి మోహన్‌రెడ్డి (అల్మాస్పూర్), భూపతి సురేందర్ (కొత్తపల్లి), జల్గం కిషన్‌రావు (సనుగుల), వీరబత్తిని కమలాకర్ (సిరిసిల్ల), ముదిగంటి సురేందర్‌రెడ్డి (నర్సింగా పూర్), గాజుల నారాయణ (సిరిసిల్ల అర్బన్ బ్యాంక్)లకు సహకార డైరెక్టర్లుగా అవకాశం లభించింది. సహకార ఎన్నికల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సముచిత స్థానం దక్కింది. ఉమ్మడి జిల్లా స్థాయిలో చైర్మన్‌గా రవీందర్రావు ఉండగా... రాష్ట్ర స్థాయిలోనూ టెస్కాబ్ చైర్మన్ అవకాశం ఆయనకే లభించడంతో మరోసారి రాష్ట్ర స్థాయి పదవి రాజన్న సిరిసిల్ల జిల్లాకు లభించింది. పలువురు జిల్లా నాయకులు రవీందర్రావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
నిందితులెవరైనా ఉపేక్షించబోం
-
సిరిసిల్లలో కొలువు దీరిన కౌన్సిల్
సిరిసిల్ల, వేములవాడ కొత్త మున్సిపల్ పాలకవర్గాలు సోమవారం కొలువు దీరాయి. రెండు పురపాలికల్లోనూ చైర్పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ పీఠాలను టీఆర్ఎస్ దక్కించుకుంది. సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా జిందం కళ ఏకగ్రీవం కాగా, వైస్‌చైర్మన్‌గా మంచె శ్రీనివాస్ ఎన్నికయ్యారు. అదేవిధంగా వేములవాడ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా రామతీర్థపు మాధవి, వైస్‌చైర్మన్‌గా మధు రాజేంద్రశర్మ విజయం సాధించారు. సిరిసిల్లలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వేములవాడలో కమిషనర్ ప్రవీణ్‌కుమార్ కొత్తపాలకవర్గాలతో పదవీప్రమాణ స్వీకారం చేయించారు. సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా జిందం కళ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా మంచె శ్రీనివాస్ ఎన్నికయ్యారు. సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్లో 39 స్థానాలు ఉండగా.. 22 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించి పురపీఠంపై గులాబీ జెండా ఎగురవేసింది. రాష్ట్రంలో తొలిసారి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యం చాటుకుంది. కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం.. సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్లుగా ఎన్నికైన వారితో ఆర్డీవో, సహాయ ఎన్నికల అధికారి శ్రీనివాస్‌రావు ప్రమాణ స్వీకారం చేయించారు. సోమవారం ఉదయం 10 గంటలకే అధికార టీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు జరిగిన సమావేశానికి కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎన్నికల పరిశీలకుడు అ బ్దుల్ అజీమ్ హాజరయ్యారు. వారిసమక్షంలో ఆర్డీవో తెలుగు అక్షర మాల క్రమంలో మెజార్టీ సాధించిన జాతీయ పార్టీల అభ్యర్థులకు తొలిఅవకాశం కల్పించారు. గూడూరి భాస్కర్ తొలుత కౌన్సిలర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. సమావేశానికి ఆలస్యంగా వచ్చిన చొప్పదండి లలిత చి వరగా ప్రమాణ స్వీకారం చేశారు. సీమా బేగం, దూస వినయ్ ఇంగ్లిష్‌లో ప్రమాణ స్వీకారం చే యగా.. మిగతా 37 మంది కౌన్సిలర్లు తెలుగులోనే కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనేకమంది అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చే స్తూ.. ఉచ్ఛరణ దోషాలతో ఇబ్బందులు పడగా.. ఆర్డీవో శ్రీనివాస్‌రావు కవర్ చేస్తూ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్పర్సన్ ఏకగ్రీవం.. వైస్ చైర్మన్‌కు పోటీ.. కౌన్సిల్ 12.30 గంటలకు చైర్పర్సన్, వైస్ చై ర్మన్ ఎన్నికకు మళ్లీ సమావేశమైంది. టీఆర్ఎస్ విప్ జారీ చేసిందని, మిగతా పార్టీల నుంచి తమకు విప్ రాలేదని ఆర్డీవో ప్రకటించారు. చైర్పర్సన్ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. చైర్‌పర్సన్‌గా జిందం కళ పేరును దార్ల కీర్తన ప్రతిపాదించగా.. అన్నారం శ్రీనివాస్ బలపరిచారు. పోటీ లేక జిందం కళ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. వైస్‌చైర్మన్ స్థానానికి మంచె శ్రీనివాస్ పేరును గడ్డం లత ప్రతిపాదించగా.. భూక్యా రెడ్డినాయక్ బలపరిచారు. వైస్‌చైర్మన్ స్థానానికి బీజేపీ అభ్యర్థి బొల్గం నాగరాజు పేరును గూడూరి భాస్కర్ ప్రతిపాదించగా.. చెన్నమనేని కీర్తి బలపరిచారు. మూజువాణి(చేతులెత్తే) విధానంలో ఎన్నికలు జరుగుతాయని ఆర్డీవో ప్రకటించారు. ముందుగా టీఆర్ఎస్ అభ్యర్థి మంచె శ్రీనివాస్ కు మద్దతుగా 34 మంది కౌన్సిలర్లు చేతులు ఎత్తారు. బీజేపీ అభ్యర్థి బొల్గం నాగరాజుకు మద్దతుగా ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లు చేతులు ఎత్తారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఇద్దరు తటస్థంగా ఉన్నారు. మెజార్టీ కౌన్సిలర్ల మద్దతుతో మంచె శ్రీనివాస్ వైస్ చైర్మన్‌గా ఎన్నిక అయినట్లు ఆర్డీవో శ్రీనివాస్‌రావు ప్రకటించారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా జిందం కళ, వైస్ చైర్మన్‌గా మంచె శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. కౌన్సిల్‌కు శుభాకాంక్షలు.. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్‌చైర్మన్ మంచె శ్రీనివాస్‌కు కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎన్నికల పరిశీలకుడు అబ్దుల్ అజీమ్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య పూలమొక్కలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసినట్లు ప్రకటించారు. చైర్పర్సన్ జిందం కళకు, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్‌కు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, టీఆర్ఎస్ నాయకుల నుంచి శుభాకాంక్షలు లభించాయి. టీఆర్ఎస్ నాయకుల పర్యవేక్షణలో.. కౌన్సిల్ ప్రమాణ స్వీకారం టీఆర్ఎస్ నాయకుల పర్యవేక్షణలో సాగింది. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, తోట ఆగయ్య, గూడూరి ప్రవీణ్, జనగామ శరత్‌రావు, కుంబాల మల్లారెడ్డి, జిందం చక్రపాణి మున్సిపల్ కార్యాలయంలో ఉండి ప్రమాణ స్వీకారాన్ని పర్యవేక్షించారు. సిరిసిల్లలో రెండోసారి టీఆర్ఎస్ పురపీఠంపై గులాబీ జెండా ఎగురవేసింది. పటిష్టమైన పోలీస్ రక్షణ.. మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం సందర్భంగా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. డీఎస్పీ చంద్రశేఖర్, సీఐలు వెంకటనర్సయ్య, సర్వర్, ఐదుగురు ఎస్సైల పర్యవేక్షణలో 50 మంది పోలీసులు రక్షణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. సిరిసిల్ల–సిద్దిపేట రహదారిని దిగ్బంధించిన పోలీసులు.. తర్వాత ఒకవైపు వాహనాలు నియంత్రించారు. మొత్తంగా సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ ప్రమాణ స్వీకారం ప్రశాంతంగా ముగిసింది. వేములవాడ చైర్‌పర్సన్‌గా మాధవి వేములవాడ: వేములవాడ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా రామతీర్థపు మాధవి, వైస్‌చైర్మన్‌గా మధు రాజేంద్రశర్మ ఎన్నికయ్యారు. జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి వారి ఎన్నికతోపాటు కౌన్సిలర్ల పదవీ ప్రమాణ ప్రమాణస్వీకారం పూర్తిచేశారు. మొత్తం 28 వార్డులు ఉండగా, ఒకటి ఏకగ్రీవమైంది. 27 స్థానాలకు పోలింగ్ నిర్వహించి ఈనెల 25న ఓట్లు లెక్కించారు. రెండు రోజులపాటు హైదరాబాద్‌లో శిబిరంలో ఉన్న కౌన్సిలన్లు.. సోమవారం ఉదయం నేరుగా ఎమ్మెల్యే రమేశ్‌బాబు నివాసానికి చేరుకున్నారు. అక్కడ్నుంచి ప్రత్యేక బస్‌లో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. జెడ్పీ సీఈవో కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. 28వ వార్డు నుంచి గెలుపొందిన ప్రతాప హిమబిందు గైర్హాజరయ్యారు. టీఆర్ఎస్ విప్ జారీ చేసిందని, ధిక్కరించినవారి సభ్యత్వం రద్దవుతుందని ప్రకటించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చైర్పర్సన్, వైస్చైర్మన్ల ఎంపిక చేపట్టారు. ఈలోగా లభించిన కాస్త సమయంలో టీఆర్ఎస్ కౌన్సిలర్లతో ఎమ్మెల్యే రమేశ్‌బాబు మంతనాలు జరిపారు. చివరిక్షణం వరకు చైర్పర్సన్ ఎవరననేది తెలియలేదు. ఆఖరి క్షణంలో రామతీర్థపు మాధవిని చైర్పర్సన్, వైస్‌చైర్మన్‌గా మధు రాజేంద్రశర్మను ఎన్నుకోవాలని సూచించినట్లు తెలిసింది. చైర్‌పర్సన్‌గా రామతీర్థపు మాధవి పేరును గోలి మహేశ్ ప్రతిపాదించగా, నరాల శేఖర్ బలపరిచారు. వైస్‌చైర్మన్ మధు రాజేంద్రశర్మను ఇప్పపూల అజయ్ ప్రతిపాదించగా, నిమ్మశెట్టి విజయ్ బలపరిచారు. మాధవికి 22 ఓట్లు, రాజేంద్రశర్మకు 23 ఓట్లు వచ్చాయి. వీరు ఎన్నికైనట్లు జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి ప్రకటించారు. చైర్‌పర్సన్‌కు 16 మంది టీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఎక్స్అఫిషియో మెంబర్ ఎమ్మెల్యే రమేశ్‌బాబు, ఐదుగురు ఇండిపెండెంట్లు.. మొత్తం 22 ఓట్లు వచ్చాయి. వైస్‌చైర్మన్‌కు 16 మంది టీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఎక్స్అఫిషియో మెంబర్ ఎమ్మెల్యే రమేశ్‌బాబు, ఐదుగురు ఇండిపెండెంట్లతోపాటు కాంగ్రెస్ కౌన్సిలర్ హన్మవ్వ సైతం చేతులెత్తి ఓటేశారు. వైస్‌చైర్మన్‌కు 23 ఓట్లు వచ్చినట్లు సీఈవో ప్రకటించారు. రెండు సీట్లకు బీజేపీ పోటీ చేసింది. చైర్పర్సన్, వైస్చైర్మన్లకు ఐదుగురు మాత్రమే ఓటు వేశారు. ఎమ్మెల్యేకు పాదాభివందనం చేసిన చైర్పర్సన్ పదవీ ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్లు, చైర్పర్సన్, వైస్చైర్మన్లను ఎమ్మెల్యే రమేశ్‌బాబు, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణలు సన్మానించారు. రామతీర్థపు మాధవి ఎమ్మెల్యే రమేశ్‌బాబుకు పాదాభివందనం చేశారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలికారు. చైర్పర్సన్ రామతీర్థపు మాధవి వారితో కలసి నృత్యం చేశారు. -
కేటీఆర్‌కు షాకిచ్చిన స్వతంత్రులు
సాక్షి, రాజన్న సిరిసిల్ల : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం మున్సిపాలిటీ ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చేటుసుకున్నాయి. సిరిసిల్లలో పది వార్డుల్లో స్వతంత్రులు విజయం సాధించి.. కేటీఆర్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. మొత్తం 39 వార్డులకు ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. టీఆర్ఎస్ 24 వార్డుల్లో విజయం సాధించగా.. బీజేపీ 3, కాంగ్రెస్ 2, స్వతంత్రులు 10 స్థానాల్లో గెలుపొందారు. వీరంతా టీఆర్ఎస్కు చెందిన రెబల్స్‌గా తెలుస్తొంది. అయితే రెబెల్స్ గెలుపొందినా వారిని తిరిగి టీఆర్ఎస్లోకి తీసుకునేది లేదని కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. (మున్సిపల్ ఎన్నికలు : కౌంటింగ్ అప్డేట్స్) -
మమ్మల్ని ఓడిస్తామంటే ఊరుకుంటామా: కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులం, మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓట్ల కోసం బీజేపీ నేతలు వస్తే రాష్ట్రానికి ఏం చేశారో నిలదీయండని అన్నారు. రాజకీయంగా సిరిసిల్ల నాకు జన్మనిచ్చిందని, ఇక్కడి ప్రజలు పెట్టినభిక్ష వల్లే రాజకీయంగా ఎంతో ఎదిగానని కేటీఆర్ పేర్కొన్నారు. గాడిదలకు గడ్డి వేసి ఆవుల పాలు పితికితే పాలురావని, పనిచేసే టీఆర్ఎస్ పార్టీనే గెలిపించాలని ఓటర్లుకు విజ్ఞప్తి చేశారు. రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘70ఏళ్ల నుంచి కాంగ్రెస్, టీడీపీ బీజేపీ ప్రభుత్వాలు పాలించాయి. రాజన్న ఆలయంలో భక్తులు సౌకర్యాల పట్ల కనీస ఆలోచన చేయలేదు. చరిత్రలోనే మొదటి సారిగా రూ.220కోట్లతో వేములవాడ లోఅభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. వేములవాడకు సీఎం కేసీఆర్ ఇప్పటికే నాలుగు సార్లు వచ్చి అభివృద్ధిపై చర్చించారు. రాజకీయంగా సిరిసిల్ల నాకు జన్మనిచ్చింది. సిరిసిల్ల ప్రజలు పెట్టిన బిక్ష వల్లే రాజకీయంగా ఎదిగాను. ఐదేళ్ల క్రితం ఈ ప్రాంత ముఖచిత్రం మార్చి చూపిస్తానని చెప్పాను, మారిందా లేదా?. ఎప్పుడైనా సిరిసిల్ల ఇంత అభివృద్ధి చెందుతుందని మీరు ఊహించారా? చేసి చూపించాం. సిరిసిల్ల అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ఉరిశాలగా చూసేవారు. ఇప్పుడు సిరిసిల్ల సిరిశాలగా మార్చాను. ఇంత అభివృద్ధి చేసిన టీఆర్ఎస్ కాకుండా ఇంకెవరికైనా ఓటు అడిగే హక్కు ఉందా. మేం పెట్టిన అభ్యర్థులను ప్రత్యుర్థులు ఓడిస్తామంటే ఊరుకుంటామా. సిరిసిల్లను రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అగ్రశ్రేణి పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత నాది. ఒక్క పేదవాడు లేకుండా వారికి ఇళ్ళు ఇచ్చే బాధ్యత నాది. జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కళాశాల తీసుకువస్తున్నాం. తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలను దేశం గర్వించేలా అభివృద్ధి చేస్తాం. 75 గజాలలోపు స్థలం ఉంటే ఎలాంటి అనుమతులు లేకుండా ఇల్లు నిర్మించుకునేలా మున్సిపల్ చట్టం తెచ్చాం. 75 గజాల కంటే ఎక్కువ ఉంటే ఇంటి నిర్మాణానికి 21 రోజుల్లో అనుమతి ఇస్తాం. ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలిచాక తప్పు చేస్తే తొలగించేలా చట్టం తెచ్చాం. అధికారులు సైతం తప్పు చేస్తే ఉద్యోగం నుంచి తొలగించేలా చట్టం ఉంది. గెలిపించే బాధ్యత ప్రజలది, పని చేసే బాధ్యత మాది. గోదావరి నీళ్ళు సిరిసిల్లకు తెచ్చి ఇక్కడి ప్రజల కాళ్లు కడిగాం’ అని అన్నారు. -
అటెండర్‌తో చెప్పులు తుడిపించిన డీఎంహెచ్‌వో!
-
యువకులను కొట్టిన పోలీసుల పై వేటు
-
యువకులపై దాడి: పోలీసులపై వేటు
సాక్షి, సిరిసిల్ల : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సిరిసిల్లలో ముగ్గురు విద్యార్థులపై ప్రతాపం చూపించిన పోలీసులపై ఎస్పీ రాహుల్ హేగ్డే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకులపై దాడి చేసిన నలుగురు సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. క్రమ శిక్షణ చర్యల కింద ఇద్దరు ఎస్ఐలు, కానిస్టేబుల్, హోంగార్డును పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు ఎస్పీ అటాచ్ చేశారు. కాగా వేడుకల సందర్భంగా నలుగురు యువకులపై పోలీసులు కర్రలతో విచక్షణారహింతగా కొడుతూ.. బూటు కాళ్లతో తన్నుతూ అమానుషంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో.. ఎస్పీ రాహుల్ సిరియస్‌గా స్పందించారు. (‘ఖాకీ’ మార్కు ప్రతాపం!) -
సిరిసిల్ల.. రెడీమేడ్ వస్త్రాల కేంద్రం
సాక్షి, సిరిసిల్ల: విస్తరిస్తున్న వస్త్రోత్పత్తి రంగంతో సిరిసిల్ల మేడిన్ రెడీమేడ్ వస్త్రాల కేంద్రంగా మారుతోంది. యువతకు నమ్మకమైన ఉపాధి చూపుతోంది. సిరిసిల్లలో వస్త్రపరిశ్రమ కొత్తపుంతలు తొక్కుతోంది. రెడీమేడ్ డ్రెస్సుల తయారీతో యువతీయువకులకు మెరుగైన ఉపాధి లభిస్తోంది. గతంలో బీడీలు చేసిన మహిళలు, సాంచాలు నడిపిన యువకులు రెడీమేడ్ డ్రెస్సుల తయారీలో బతుకుదెరువు చూసుకుంటున్నారు. సిరిసిల్లలో జూకీ కుట్టు మిషన్లపై షర్ట్స్, ప్యాంట్లు, పెటీకోట్స్ కుడుతున్నారు. వస్రా్తలను హైదరాబాద్, ముంబాయి, బీవండి, సూరత్, కోల్కత్తా వంటి పట్టణాలతో పాటు కరీంనగర్, కామారెడ్డి, సిద్దిపేట, కొత్తపల్లి, జగిత్యాల ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. సిరిసిల్లలో డ్రెస్సుల తయారీకి బ్రాండెండ్ కంపెనీలు కూడా ఆర్డర్లు ఇస్తుండడం విశేషం. సిరిసిల్లలోని వివిధ ప్రాంతాల్లో రెడీమేడ్ వస్త్రాల తయారీ కేంద్రాలు 35 వరకు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో 30 నుంచి 75 మంది పని చేస్తున్నారు. ఇలా సిరిసిల్లలో రెండు వేల మంది ఉపాధి పొందుతున్నారు. వస్త్రోత్పత్తి కేంద్రంలో రెడీమేడ్ దుస్తులు సిరిసిల్ల వస్త్రోత్పత్తికి కేంద్రం. కానీ ఇప్పుడు రెడీమేడ్ వస్త్రాల తయారీకి నిలయంగా మారుతోంది. 40 ఏళ్లు దాటిన వారు సాంచాలు నడుపుతూ ఉపాధి పొందుతుండగా.. 20 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు వారు రెడీమేడ్ బట్టల తయారీలో శిక్షణ పొందుతూ జూకీ మిషన్లపై బట్టలు కుడుతున్నారు. నిత్యం 8 నుంచి 10 గంటలు పని చేసూ్త..నెలకు రూ.10 నుంచి రూ.15 వేల వరకు సంపాదిస్తున్నారు. కష్టమైన సాంచాల పని కంటే జూకీ కుట్టు మిషన్లపై డెస్సులు కుట్టడం ఒకింత యువకులకు వెసులుబాటు కలుగుతోంది. రెడీమేడ్ వస్త్రాలకు దేశవ్యాప్తంగా మంచి గిరాకీ ఉండడంతో సిరిసిల్ల యువకులు ఆసక్తిగా పని చేస్తున్నారు. డ్రెస్సుల తయారీకి అవసరమైన వస్త్రాన్ని, మెటీరియల్‌ను హైదరాబాద్, ముంబాయి నుంచి దిగుమతి చేసుకుంటూ తయారైన రెడీమేడ్ వస్త్రాలను ఎగుమతి చేస్తున్నారు. రెడీమేడ్ రంగం సిరిసిల్లలో విస్తరిస్తోంది. ఇప్పటికే సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్డర్లు రావడంతో మరమగ్గాల కార్మికులకు మెరుగైన వేతనాలు వస్తుండగా మరోవైపు గార్మెంట్ రంగంతో యువత ఉపాధి సాధిస్తుంది. కుటుంబానికి అండగా.. నేను ఏడోతరగతి చదువుకున్న. బీడీలు చేసేదాన్ని. ఆ పనితో నెలకు రూ.1500 వచ్చేవి. బీడీల పనితో లాభం లేదని, మిషన్‌పై షర్ట్్సకు అవసరమైన చార్టెక్ కుట్టడం నేర్చుకున్న. రోజుకు 300 అంగీలకు చార్టెక్ కుడుతా. ఇప్పుడు నెలకు రూ.4వేలు వస్తాయి. నా భర్త ప్రభాకర్ వైపని కార్మికుడు. మాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరం పని చేస్తేనే ఇల్లు గడుస్తుంది. – ఒగ్గు లత, సిరిసిల్ల నెలకు రూ.15 వేలు వస్తున్నయ్ మాది శివనగర్. నేను పదోతరగతి చదువుకున్న. టేలర్ పని నేర్చుకుని బట్టలు కుట్టేవాడిని. జూకీ మిషన్ నేర్చుకున్న. కాలర్ కుడుతా. ఒక్కో దానికి రూ.6 ఇస్తారు. ఇలా రోజుకు 70 నుంచి 80 వరకు కుడుతాను. నెలకు రూ.15 వేలు జీతం వస్తుంది. నా భార్య కూడా మిషన్ కుడుతుంది. నెలకోసారి జీతం తీసుకుంటా. నాకు పాప, బాబు. ఆరేళ్లుగా ఇదే పని చేస్తున్న. – కారంపురి సతీష్, సిరిసిల్ల సొంతంగా మార్కెటింగ్ నేను బట్టను ముంబాయి, బీవండి నుంచి తెచ్చి షర్ట్స్ కుట్టిస్తా. డ్రెస్సులను సొంతంగానే మార్కెట్ చేస్తున్న. హైదరాబాద్, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలతోపాటు ముంబాయి వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నా. నా వద్ద 70 మంది పని చేస్తున్నారు. నాకు సిరిసిల్లలో రెండుచోట్ల జూకీ కేంద్రాలు ఉన్నాయి. చేతినిండా పని ఉంటుంది. మంచి ఆదాయం వస్తుంది. నాతోపాటు పది మందికి పని కల్పించే స్థితికి రావడం సంతోషంగా ఉంది. – లగిశెట్టి రాకేశ్, జూకీ, కేంద్రం నిర్వాహకుడు జూకీ కుట్టు మిషన్‌పై డ్రెస్సులు కుడుతున్న ఇతడి పేరు ఆడెపు రమేశ్. సిరిసిల్ల ప్రగతినగర్‌కు చెందిన రమేశ్ పదోతరగతి వరకు చదువుకున్నాడు. చదువు ఆపేసి టేలర్ పని నేర్చుకున్నాడు. కొద్దిరోజులు పని చేసి ఆధునిక జూకీ మిషన్‌పై కుట్టు నేర్చుకుని ముంబాయి వెళ్లాడు. అక్కడ పదేళ్లు పనిచేశాడు. అదే పని సిరిసిల్లలో లభించడంతో ఇక్కడికి వచ్చి ఆరేళ్లుగా జూకీ మిషన్‌పై షర్ట్స్ కుడుతూ నెలకు రూ.15 వేలు సంపాదిస్తున్నాడు. ఇద్దరు పిల్లలు.. భార్యతో కలిసి అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. నిత్యం రెడీమేడ్ వస్త్రాల తయారీతో ఉపాధిపొందుతున్నాడు.జూకీ మిషన్‌పై షర్ట్స్‌కు బటన్స్ పెడుతున్న ఈమె పేరు నల్లగొండ లావణ్య. సిరిసిల్ల పట్టణానికి చెందిన లావణ్య ఇంటర్ చదివింది. గతంలో ఈమె బీడీలు చేసేది. నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తే నెలకు బీడీల ద్వారా రూ.1500 వచ్చేవి. రెండేళ్ల కిందట షర్ట్స్‌కు బటన్స్ పెట్టడం నేర్చుకుని జూకీ మిషన్‌పై పని చేస్తోంది. ఇప్పుడు పీస్ వర్క్ ఆధారంగా నెలకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు సంపాదిస్తుంది. లావణ్య భర్త రమేశ్ వీడియో గ్రాఫర్. వీరికి ఇద్దరు పిల్లలు. ఇద్దరూ శ్రమిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఇద్దరే కాదు.. సిరిసిల్ల జిల్లాకేంద్రంలో రెండు వేల మంది యువకులు రెడీమేడ్ వస్త్రాల తయారీలో ఉపాధి పొందుతున్నారు. -
‘పౌరసత్వం రద్దు నిర్ణయం అభినందనీయం’
సాక్షి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం అభినందనీయమని పిటిషనర్ కాంగ్రెస్‌నేత ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి.. ఎమ్మెల్యే రమేష్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. చట్టాలను తప్పుదోవ పటించే వ్యక్తులు.. చట్టాలను తయారు చేసే వ్యక్తులుగా ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. గతంలోనే హైకోర్టు, సుప్రీంకోర్టు, కేంద్ర హోంశాఖ అతన్ని భారత పౌరుడు కాదని తేల్చిచెప్పాయని గుర్తు చేశారు. మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తా అనటంతో హైకోర్తులో కెవియట్ పిటిషన్ దాఖలు చేశానని శ్రీనివాస్ వివరించారు. ఎమ్మెల్యే రమేష్ హైకోర్టును ఆశ్రయిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. తమ వాదనలను కూడా మరోసారి కోర్టుకు తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు. న్యాయస్థానాలపై విశ్వాసం ఉందని.. హైకోర్టులో తాను గెలుస్తాననే నమ్మకం ఉందని ఆది శ్రీనివాస్ తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన చెన్నమనేని రమేశ్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ 2009 నుంచి న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. తప్పుడు ధ్రువపత్రాలతో మన దేశ పౌరసత్వం పొందినందున రమేశ్ ఎన్నిక చెల్లదంటూ ఆది వాదిస్తూ వస్తున్నారు. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖ మరోసారి విచారణ జరిపి, తాజాగా తన నిర్ణయాన్ని వెలువరించింది. -
నకిలీ వీసాలతో మోసాలు
సిరిసిల్ల: గల్ఫ్ బాటలో ఘరానా మోసం జరిగింది. నకిలీ వీసాలు అంటగట్టి కోట్లు కొల్లగొట్టిన ఘటన తెలంగాణ జిల్లాల్లో వణుకు పుట్టిస్తోంది. బోగస్ వెబ్సైట్ సృష్టించి నకిలీ వీసాలను చూపించి రూ.5 కోట్లకు టోకరా ఇచ్చాడు ఓ రాజస్తానీ యువకుడు. రాష్ట్రంలోని 5 జిల్లాలకు చెందిన 300 మంది చెల్లించిన లక్షలతో ఉడాయించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటనలో పొరుగు జిల్లాల్లోనూ బాధితులున్నారు. షార్జా బల్దియా వీసాల పేరిట షార్జాలోని బల్దియా (మున్సిపాల్) క్లీనింగ్ వీసాల పేరిట మోసం జరిగింది. రాజస్తాన్‌కు చెందిన మక్సూద్ అలీ (పాస్‌పోర్టు నంబరు ఎల్ 3833483) దుబాయి వెళ్లి వస్తాడు. సొంతగా ఓ నకిలీ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి అందు లో నకిలీ వీసాలను తయారు చేసి అప్లోడ్ చేశాడు. దుబాయి, షార్జాల్లో పని చేసే వలస కార్మికులకు బల్దియా వీసాలు ఉన్నాయని నమ్మించాడు. మీకు బంధువులకు వీసాలు ఇవ్వండి అంటూ మక్సూద్ చెప్పాడు. దీంతో పలువురు వలస జీవులు సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల జిల్లాలోని సమీప బంధువులకు షార్జా బల్దియా వీసాలు ఉన్నాయని చెప్పారు. అవసరమైతే వెబ్సైట్లో చెక్ చేసుకుని వీసాలకు డబ్బులు చెల్లించాలని సూచించారు. షార్జాలో ఉన్న ఆత్మీయులే ఇలా చెప్పడంతో నమ్మిన పలువురు వెబ్సైట్ చెక్ చేయడంతో వీసాలు ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. దీంతో ఒక్కొక్కరు రూ.1.80 లక్షల నుంచి రూ.2.30 లక్షల వరకు వీసాలకు చెల్లించారు. ఇలా సుమారు 300 మంది యువకులు రూ.5 కోట్ల వరకు చెల్లించినట్లు సమాచారం. ఆ డబ్బులను తీసుకున్న మక్సూద్ నకిలీ వీసాలతో అందరినీ మోసం చేశాడు. బయట పడిందిలా.. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలానికి చెందిన ఓ ఎంపీటీసీ సభ్యులు గల్ఫ్ ఏజెంట్‌గా పనిచేస్తారు. ఆయన 36 మందికి సంబంధించి రూ.56 లక్షలను మక్సూద్‌కి చెల్లించాడు. ఏడుగురు అభ్యర్థులను ఇటీవల షార్జా పంపించగా.. షార్జా ఎయిర్‌పోర్టు అధికారులు అవి నకిలీ వీసాలని గుర్తించి వారిని ఎయిర్‌పోర్టు నుంచే వెనక్కి పంపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫాజుల్‌నగర్ శివారు తుర్కాసికాలనీకి చెందిన మరో పది మందిని స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు షార్జా పంపేందుకు హైదరాబాద్ పంపారు. శంషాబాద్‌విమానాశ్రయం అధికారులు నకిలీ వీసాలను గుర్తించి ఆ పది మందిని వెనక్కి పంపారు. మక్సూద్ ఇచ్చిన వెబ్‌సైట్‌ను చెక్ చేస్తే.. అది నకిలీదని తేలింది. దీంతో తాము మోసపోయామనే విషయం బాధితులకు అర్థమైంది. కాగా, 36 మంది మోసపోయినట్లు తెలియడంతో దర్పల్లికి చెందిన ప్రజాప్రతినిధి గుండెపోటుకు గురై∙ఆస్పత్రి పాలయ్యాడు. -
యువత భాగస్వామ్యంతో పల్లెల్లో మార్పు
సిరిసిల్ల: యువత భాగస్వామ్యంతో పల్లెల్లో మార్పు వస్తోందని ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో బుధవారం ఆయన 30 రోజుల పల్లె ప్రణాళిక అమలు తీరుపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ఎవరికివారు తమ ఇంటిని, వీధిని, ఊరును బాగు చేసుకోవాలన్న సంకల్పం ఉండాలన్నారు. ప్రజాసంకల్పంతోనే పల్లె ప్రణాళిక కొనసాగాలన్నారు. ఈ కార్యక్రమంతో పల్లె ముఖచిత్రం మారిందని తెలిపారు. యువకులు స్వచ్ఛందంగా పల్లెబాగుకు నడుం బిగిస్తే మంచి పనులు జరుగుతాయన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పథకాలు విజయవంతమవుతాయని చెప్పారు. పారిశుధ్యం మెరుగు, పచ్చదనం పెంచేందుకు ఈ ప్రణాళిక పనికొచ్చిందని, ఇదే స్ఫూర్తి కొనసా గించాలని, ప్రజల్లో చైతన్యం వచ్చే వరకు దీనిని ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఊరు ఎలా ఉంది..: మండెపల్లిలో మహిళలు, యువకులు, వృద్ధులతో కేటీఆర్ ముచ్చటించారు. ఊరు ఇప్పుడెలా ఉందని ప్రశ్నించగా.. మంచిగా అయిందని గ్రామస్తులు అన్నారు. ఊరును పాడుచేసే వారికి జరిమానా విధిద్దామా..! అని మంత్రి కోరగా.. చెడ గొట్టే వాళ్లకు జరిమానా వేయాలన్నారు. అంతకుముందు మంత్రి కేటీఆర్ సిరిసిల్ల క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో 30 రోజుల ప్రణాళిక ప్రగతిపై సమీక్షించారు. ఏడాది పొడవునా పల్లెల్లో చేపట్టే కార్యక్రమాల క్యాలెండర్‌ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీ కార్మికులకు బీమా: పంచాయతీ కార్మికులకు ఆరోగ్య బీమా కల్పించేందుకు కేటీఆర్ తన సొంత డబ్బులు రూ.4 లక్షలను ప్రీమియంగా చెల్లించారు. జిల్లాలో పనిచేసే 1,200 మంది పంచాయతీ కార్మికులకు బీమా కల్పించేందుకు చొరవ చూపారు. ఈ చెక్కును కలెక్టర్ కృష్ణభాస్కర్‌కు కేటీఆర్ అందించారు. -
ఎత్తైన కొండలు.. ముచ్చటైన పచ్చిక బయళ్లు
-
లేడీ కిలాడి.!
సాక్షి, గొల్లపల్లి (సిరిసిల్ల): ఉన్న ఊరిలో ఉపాధి లేక గల్ఫ్ వెళ్లాలనుకున్న ఆ యువకుల ఆశలు అడియాశలయ్యాయి. ‘నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు, దోహఖత్తర్ పంపిస్తా, మంచి కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తా’ అని నమ్మబలికింది ఓ మాయ లేడీ. తమ ఊరు అబ్బాయిని పెళ్లి చేసుకుంది కదా అని పది మందికిపైగా ఆ మాయలేడీని నమ్మి డబ్బు ముట్టజెప్పారు. ఈక్రమంలో ఆ లేడీ తన భర్తతో పాటు ఉడాయించింది. ఆరా తీసినా దొరక్కపోవడంతో లబోదిబోమంటున్నారు బాధితులు. నమ్మితే ఇంత మోసం చేసిందని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లొత్తునూర్ గ్రామానికి చెందిన అప్పని దస్తగిరి కొంత కాలం క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ పద్మ అనే యువతితో పరిచయమయింది. ఆమెది వైజాగ్ కాగా ప్రేమవివాహం చేసుకున్నారు. భార్యాభర్తలిద్దరు కొద్ది రోజులు లొత్తునూర్‌లో గడిపారు. ఇక్కడ స్థానిక యువకులతో పరిచయం ఏర్పడింది. గల్ఫ్ వెళ్లేందుకు తనకు నమ్మకమైన ఏజెంట్ ఉన్నాడని తాను దోహఖత్తర్‌లో మంచి కంపెనీలో మంచి వేతనం వచ్చేల చూస్తాడని గల్ఫ్ వెళ్లేందుకు ఆసక్తి ఉన్న పలువురు యువకులతో పద్మ నమ్మబలికింది. ఈనేపథ్యంలో గ్రామానికి చెందిన దావన్‌పెల్లి పవన్, ఎండీ ఫరూక్(బీర్సాని), ఉప్పుల రమేశ్, రాచకొండ గంగాధర్, మైదర్ తిరుపతి, జక్కుల శ్రావణ్‌కుమార్, సింగం నరేశ్, బోడకొండ చిలుకయ్య, పాశిగామ నరేశ్, మంథని దేవేందర్‌తో పాటు పలువురి నుంచి దాదాపు రూ.8లక్షల వరకు వసూలు చేసింది. కొందరు రూ.80వేలు, మరికొందరు రూ. 30, 20వేలు ఇలా పదిమందికి పైగా ముట్టజెప్పారు. కొందరి వద్ద రూ.80 వేలు తీసుకున్నట్లు బాండ్ పేపర్‌ను 2018 అక్టోబర్ 2వ తేదీన రాసి ఇచ్చింది. 2018 అక్టోబర్ 12 గల్ఫ్ పంపిస్తానని, పంపించకపోతే 15వ తేదీన ఎవరి డబ్బులు వారికి ఇస్తానని నమ్మించి బాండ్ పేపర్ రాసి ఇచ్చింది. వారు నమ్మేలా డూప్లీకేట్ వీసా సైతం చూపించింది. మరుసటి రోజునుంచి కనిపించకుండా పోయింది. బాధితులు వైజాగ్‌లోని ఆమె ఇంటికి వెళ్లినా ఫలితం లేకుండాపోయింది. తామే కాకుండా వెల్గటూర్ మండలంలో కూడా బాధితులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. మోసం చేసిన పద్మపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని దావన్‌పల్లి పవన్ తండ్రి అంజయ్య, ఫరూక్, ఉప్పుల రమేశ్ తదితరులు కోరుతున్నారు. ఆమె కోసం ఎంత తిరిగినా ప్రయోజనం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బాధితులు తెలిపారు. -
మానేరు.. జనహోరు
సాక్షి, సిరిసిల్ల: జిల్లాలోని మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర) జలాశయం వద్ద జనజాతర సాగింది. జలాశయం 23 గేట్లు ఎత్తి నీటిని ఎల్ఎండీకి వదలడంతో ఆ దృశ్యాన్ని తిలకించేందుకు జనం బారులు తీరారు. మధ్యమానేరు నిండా నీటితో కనువిందు చేస్తుండగా.. గేట్ల నుంచి నీళ్లు దిగువకు దూకుతున్న మనోహరమైన దృశ్యాన్ని చూసేందుకు జనం తరలివచ్చారు. ఆదివారం సెలవు కావడంతో సందర్శకులు భారీసంఖ్యలో తరలి వచ్చారు. జలాశయం నీరు మానేరులోకి ప్రవహిస్తుంటే.. జనం ఆనందంగా తిలకించారు. సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జనజాతర సాగుతూనే ఉంది. ఎవరికీ పట్టని వాహనదారుల గోడు.. కొదురుపాక నుంచి ప్రాజెక్టు కట్టపైకి దారి మూసి వేశారు. వెంకట్రావుపల్లె, మాన్వాడ నుంచి వెళ్లే రోడ్డు ఒక్కటే ఉండడంతో వాహనాల రద్దీ పెరిగింది. ప్రాజెక్టు దిగువ(కట్టకింద) ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు రోడ్డు దిగితే.. మట్టిలో కూరుకుపోయాయి. రద్దీని నియంత్రించే ఏర్పాట్లు చేయకపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. మరోవైపు.. వర్షాలకు మట్టి బాగా తడిసి ఉండడంతో జనం జారిపడ్డారు. అటు నీటిపారుదలశాఖ అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు, పోలీసులు ఎవరూ ట్రాఫిక్ ఇబ్బందులను పట్టించుకోలేదనే విమర్శలు వచ్చాయి. ప్రాజెక్టు సందర్శనకు వచ్చే వారు ఇబ్బందులు పడుతుంటే.. కనీస ఏర్పాట్లు చేయడంతో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వచ్చాయి. బోయినిపల్లి పోలీసులు జలాశయం వద్దకు వచ్చినా.. ట్రాఫిక్ నియంత్రణలో ఇబ్బందులను అధిగమించలేకపోయారు. సందర్శకులకు పార్కింగ్ సదుపాయంతో పాటు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు. నీటి అలలపై ఫొటోషాట్ సెల్ఫీ తీసుకుంటున్న యువతి -
బతుకమ్మ చీరలొచ్చాయ్..
సాక్షి, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడపడచులకు బతుకమ్మ కానుకగా అందించే చీరలు జిల్లాకు చేరుకున్నాయి. రెండేళ్లుగా రేషన్‌కార్డు కలిగిన కుటుంబంలోని 18 సంవత్సరాలు నిండిన ఆడపడుచులకు ప్రభుత్వం బతుకమ్మ చీరలు అందిస్తోంది. ఈ ఏడాది కూడా అందించడానికి జిల్లాకు చీరలు సరఫరా చేస్తోంది. జిల్లాలో 3.01 లక్షల రేషన్‌కార్డులు ఉండగా 8.20 లక్షల యూనిట్లు ఉన్నాయి. అంత్యోదయ కార్డులు 11 వేలు, అన్నపూర్ణకార్డులు 102 ఉండగా, రేషన్ దుకాణాలు 487 ఉన్నాయి. కార్డు దారుల్లో 18 సంవత్సరాలు పైబడిన మహిళలను గతంలోనే రెవెన్యూ సరఫరాల అధికారులు గుర్తించారు. పట్టణాల్లో మెప్మా, గ్రామాల్లో రేషన్ డీలర్ల ద్వారా చీరలు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మండలాల వారీగా ఆహార భద్రత కార్డులో మహిళల సంఖ్య.. మండలం పేరు రేషన్ దుకాణాలు 18 ఏళ్ల పైబడినవారు చిగురుమామిడి 27 14,823 చొప్పదండి 34 18,278 ఇల్లందకుంట 17 11,444 గంగాధర 38 18,355 గన్నేరువరం 14 8,099 హుజూరాబాద్ 37 23,879 జమ్మికుంట 33 24,077 కరీంనగర్ అర్బన్ 58 60,522 కరీంనగర్ 26 17,825 శంకరపట్నం 27 16,402 కొత్తపల్లి 23 18,597 మానకొండూరు 41 24,469 రామడుగు 30 17,867 సైదాపూర్ 25 14,665 తిమ్మాపూర్ 29 17,770 వీణవంక 28 17,355 మొత్తం 487 3,24,427 జిల్లాలో రేషన్ దుకాణాలవారీగా కార్డుల్లో ఉన్న వివరాల మేరకు మహిళలను గుర్తించనున్నారు. 3.01 లక్షల కార్డులు ఉండగా 3 లక్షలకుపైగా యువతి, మహిళలు ఉన్నారని సమాచారం. సదరు పర్యవేక్షణ బాధ్యతను రెవెన్యూ శాఖకు అప్పగించారు. మండల తహసీల్దార్లు, డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసి మహిళలను, యువతులను గుర్తించనున్నారు. జిల్లాలో మొత్తం 3 లక్షల 25 వేలకు పైగా చీరెలు అవసరం ఉండగా ఇప్పటి వరకు 2.50 లక్షలకుపైగా జిల్లాకు చేరుకున్నాయి. మిగతా చీరలు మరో వారం రోజుల్లో రానున్నాయి. అయితే ఈ చీరలను సెప్టెంబర్ మధ్య నెల నుంచి పంపిణీ చేయడానికి డీఆర్డీవో అధికారులు కసరత్తు చేస్తున్నారు. సెప్టెంబర్ చివరి వారంలో బతుకమ్మ ఉత్సవాలు జరగనున్నాయి. రకరకాల రంగులు, డిజైన్లలో వస్తున్న చీరలను అధికారులు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ మైదానంలోని ఇండోర్ స్టేడియం గోదాంలో స్టోర్ చేస్తున్నారు. -
స్కూల్ వ్యాన్ బోల్తా, ముగ్గురు మృతి
సాక్షి, రాజన్న సిరిసిల్ల: వేములవాడ మండలం తిప్పాపూర్ శివారులో వాగేశ్వరి స్కూల్ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన ఐదుగురు విద్యార్థులు సిరిసిల్లా ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వాగేశ్వరి స్కూల్ కు చెందిన విద్యార్థులు 27 మంది మధ్యాహ్నం భోజనానికి స్కూల్ నుంచి వ్యాన్‌లో చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఉన్న హాస్టల్ కు వెళ్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యంతో డివైడర్ ఎక్కి వ్యాన్ బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మానాల కు చెందిన 2వతరగతి విద్యార్థిని దీక్షిత, వట్టెంలకు చెందిన పదోతరగతి విద్యార్థిని మనస్విని అక్కడికక్కడే మృతి చెందగా, మానాల కు చెందిన రిషి సిరిసిల్ల ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. మరో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానికులు వేములవాడ, సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వ్యాన్ డ్రైవర్ ను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ రాహుల్ హెగ్డే సందర్శించి ప్రమాదంపై కేసు నమోదు చేస్తామని, డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. స్కూల్‌పై చర్యలు తీసుకొని మృతి చెందిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులతో పాటు స్థానికులు ఆందోళనకు దిగారు. వేములవాడ ఆర్టీసీ డిపో దగ్గర జరిగిన ప్రమాద స్థలాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పరిశీలించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ విద్యార్థులు చినపోవటం దురదృష్టకరమన్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వం ద్వారా వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
ఎమ్మెల్యేను అడ్డుకున్న మిడ్‌మానేరు నిర్వాసితులు
సాక్షి, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో హరితహారంలో పాల్గొనేందుకు వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు మిడ్‌మానేరు నిర్వాసితుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. తమ డిమాండ్లను పరిష్కరించిన తర్వాతే ముందుకు కదలాలంటూ కొదురుపాక, నీలోజిపల్లి నిర్వాసితులు సోమవారం ఆయన్ను అడ్డుకున్నారు. ఇళ్లకు రూ.5,40,000 అందించడంతోపాటు 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులకు కటాఫ్ డేట్ లేకుండా కుటుంబ పరిహారం ఇచ్చేవరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చుకున్నారు. నిర్వాసితులకు రావాల్సిన పరిహారం ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే రవిశంకర్ హామీ ఇచ్చినప్పటికీ వారు ఆందోళన విరమించలేదు. దీంతో పోలీసు బందోబస్తు మధ్య ఆయన అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. కాగా న్యాయమైన డిమాండ్లను సత్వరమే పరిష్కరించకపోతే ఈ నెల 30న కలెక్టరేట్ ముందు మహాధర్నా చేపడతామని నిర్వాసితులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
కొందరికే రైతుబంధు..
సాక్షి, సిరిసిల్ల: జిల్లాలోని చిన్న, సన్నకారు రైతులకు ఎకరానికి రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయం అందింది. ఐదెకరాల కన్నా గుంటభూమి ఎక్కువగా ఉన్నా పెట్టుబడిసాయం అందలేదు. తొలిసారిగా 2018 ఖరీఫ్ సీజన్లో రైతులకు నేరుగా చెక్కులు అందించిన ప్రభుత్వం రబీ సీజన్లో రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని వేసింది. ఈ సారి ఖరీఫ్ సీజన్లో రైతుల సమగ్ర సమాచారాన్ని సేకరించిన అధికారులు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేస్తున్నారు. ఐదెకరాల కన్నా ఎక్కువ ఉన్న పెద్దరైతులు ఖరీఫ్ సీజన్లో పెట్టుబడుల కోసం అందించే సాయం కోసం నిరీక్షిస్తున్నారు. జిల్లాకు అందిన పెట్టుబడి సాయం రూ.65.68 కోట్లు జిల్లావ్యాప్తంగా 64122 మంది రైతులకు రూ.65.68 కోట్ల పెట్టుబడి సాయం ఇప్పటి వరకు అందింది. వాస్తవానికి 95,129 మంది రైతుల బ్యాంకు ఖాతా, ఆధార్ నంబరు వివరాలను ట్రెజరీకి వ్యవసాయ అధికారులు అందించారు.ఇంకా 26,669 మంది రైతులకు పెట్టుబడి సాయం రాలేదు. ఆన్లైన్లో అప్లోడ్ చేసినా సాయం దక్కలేదు. ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం కోసం రైతులు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు.ఆన్లైన్లో పహాణీల వివరాలను చెక్ చేసుకుంటూ.. బ్యాంకుకు వెళ్లి డబ్బులు జమ అయ్యాయా అంటూ ఆరా తీస్తున్నారు. ఖరీఫ్ సీజన్ పెట్టుబడుల కాలం కావడంతో సర్కారు డబ్బుల కోసం ఆశగా చూస్తున్నారు. కొందరి ఖాతాల్లో డబ్బులు జమ కాగా.. మరి కొందరి ఖాతాల్లో జమ కాకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికీ కొందరు ఎన్ఆర్ఐలు తమ ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వకపోవడంతో 12,349 మంది రైతుల వివరాలు తెలియక వ్యవసాయ అధికారులు ఆన్లైన్లో నమోదు చేయలేదు. మా ఊరిలో చాలా మందికి రాలేదు.. మాది కోనరావుపేట మండలం మర్తనపేట. కొలనూర్ గ్రామ శివారుల్లో నాకు భూమి ఉంది. నాకు నిరుడు పెట్టుబడి సాయం వచ్చింది. ఒక్కసారి చెక్కు ఇచ్చిండ్రు.. ఇంకోసారి బ్యాంకులో వేసిండ్రు. ఈ సారి మాత్రం ఇంకా రాలేదు. నేను బ్యాంకు వెళ్లి చూసినా.. రాలేదని చెప్పిండ్రు. మా ఊరిలో చాలా మంది రైతులకు ఇంకా డబ్బులు పడలేదు. ఇప్పు డు వస్తే.. పెట్టుబడికి అక్కర కొస్తాయి. – బురవేణి కొండయ్య, రైతు, మర్తనపేట అందరి ఖాతాలు అప్లోడ్ చేశాం.. జిల్లాలోని రైతుల అందరి బ్యాంకు ఖాతా నంబర్లు, ఆధార్ నంబరు, ఆన్లైన్ పహాణీ ఆధారంగా అప్లోడ్ చేశాం. రైతుబంధు సాయం జిల్లాలోని రైతులందరికీ అందుతుంది. ఇప్పటికే 64వేల మంది రైతుల ఖాతాల్లో జమ అయింది. మిగితా వారికి పేమెంట్ ట్రెజరీల్లో పెండింగ్‌లో ఉంది. జిల్లాలో రైతుల డేటాను పూర్తి స్థాయిలో అన్లైన్లో నమోదు చేశాం. – కె.రణధీర్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి, సిరిసిల్ల -
తెరపైకి ముంపు గ్రామాల ఉద్యమం
సాక్షి, బోయినపల్లి: శ్రీరాజరాజేశ్వర(మిడ్‌మానేరు) ప్రాజెక్టు నిర్వాసితులు తమ సమస్యలు పరిష్కరించాలని పోరుబాట పట్టారు. ఇదే సమయంలో కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆదేశాలతో ముంపు గ్రామాల్లో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందనివారి నుంచి ప్రత్యేకాధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద 2006లో రాజరాజేశ్వర(మిడ్‌మానేరు)రిజర్వాయర్ పనులు ప్రారంభించారు. పదేళ్ల అనంతరం ప్రాజెక్టులోకి నీరు చేరింది. ప్రాజెక్టు నిర్మాణంలో బోయినపల్లి మండలం కొదురుపాక, నీలోజిపల్లి, వరదవెల్లి, వేములవాడ మండలం అనుపురం, రుద్రవరం, సంకెపెల్లి, ఆరెపెల్లి కొడుముంజ, తంగళ్లపల్లి మండలం చీర్లవంచ, చింతలఠాణా, ఇల్లంతకుంట మండలం గుర్రంవానిపల్లి గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అధికారులు ఆయా గ్రామాల్లో సర్వేచేసి 11,731 కుటుంబాలు ముంపునకు గురవుతున్నట్లు 2008–09లో గెజిట్ ప్రకటించారు. తెలంగాణ ఏర్పడ్డాక మెజార్టీ నిర్వాసితులకు పరిహారం, ప్యాకేజీలు అందాయని అధికారులు అంటుంటే.. చాలా మంది పరిహారం అందాల్సినవారున్నారని నిర్వాసితులు వాపోతున్నారు. స్థానిక నేతలకు సీఎం కేసీఆర్ ఫోన్ ప్రాజెక్టుకు వస్తున్న నీటి ప్రవాహం గురించి సీఎం కేసీఆర్ ఈ నెల 16న స్థానిక నేతలతో ఫోన్లో మాట్లాడారు.వారు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ రాని వారి సమస్యలపై సీఎంకు వివరించారు. సీఎం జిల్లా కలెక్టర్‌ను కలవాలని ఆదేశించారు.ఎంపీపీ పర్లపెల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తెరపాక ఉమ తదితరులు జిల్లా కలెక్టర్‌ను కలిశారు. సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు ప్యాకేజీలు రాని నిర్వాసితుల నుంచి ప్రత్యేకాధికారులు దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇళ్ల నిర్మాణాలకు రూ.5.04 లక్షలు ఆర్అండ్ఆర్ కాలనీలకు తరలిన నిర్వాసితులకు ప్రభుత్వం 242చదరపు గజాల ఇంటి స్థలం మంజూరుచేసింది. ఇళ్ల నిర్మాణాలకు రూ.5.04 లక్షలు ఇస్తామని సీఎం కేసీఆర్ వేములవాడలో ఇచ్చిన హామీని అమలు చేయాలని ఐక్యవేదిక,అఖిలపక్షం నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఫోన్లో మాట్లాడిన సందర్భంలో ఇళ్ల నిర్మాణాలకు రూ. 5.04 లక్షలు ఇవ్వాలనే విషయం దృష్టికి తీసుకువెళ్లినట్లు స్థానిక నేతలు తెలిపారు.ఆడిట్ ప్రాబ్లం అవుతుందని, మిగతా ప్రాజెక్టులకు ఇవ్వాల్సివస్తుందని సీఎం చెప్పారని అంటున్నారు.ఐక్యవేదిక నేతలు ఇళ్ల నిర్మాణాలకు రూ.5.04లక్షలు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌తో ఉద్యమానికి ఊపిర్లూదుతున్నారు. 30 భారీ బహిరంగసభ ముంపు గ్రామాల ఐక్యవేదిక,అఖిలపక్షం ఆధ్వర్యంలో గతనెల 31న చలో కలెక్టరేట్ పేరిట మహాపాదయాత్ర నిర్వాహించారు. అదే ఊపుతో రాష్ట్రస్థాయిలో వివిధ పార్టీల ముఖ్య నేతలతో కలిసి ఈ నెల 30న భారీ బహిరంగసభ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. సభ ద్వారా ఇండ్ల నిర్మాణానికి రూ.5.04లక్షల సీఎం కేసీఆర్ హామీ,18 ఏళ్లు నిండిన యువతీ, యువకులకు రూ. 2 లక్షల ప్యాకేజీ, పట్టా, ఇల్లు ఉండి గ్రామంలో లేరనే నెపంతో గెజిట్ జాబితా నుంచి తొలగించిన వారి పేర్లు మళ్లీ గెజిట్ జాబితాలో చేర్చి పరిహారం, అధికారులు ఎస్టిమేట్ చేసిన పరిహారం రాని ఇళ్లకు పరిహారం ఇవ్వాలని, కాలనీల్లో కుటీర పరిశ్రమలు నెలకొల్పాలనే డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాలని సన్నాహాలు చేస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ నిర్వాసితులు పోరుబాట పడుతుంటే ముంపు గ్రామాల్లో ఇప్పటికీ పరిహారం రానివారి నుంచి తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేకాధికారులు రెండు రోజులుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.ఈ నెల 24వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొంటున్నారు. -
‘అర్హులందరికి డబుల్ బెడ్ రూం ఇళ్లు’
రాజన్నసిరిసిల్ల: రాష్ట్రంలోని పేద వర్గాల ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రూ. 200 పింఛన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 1000 లకు పెంచారని రాజన్న సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీర్ పేర్కొన్నారు. శనివారం జిల్లాలోని ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. బీడీ కార్మికులకు పింఛన్ కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. ఎన్నికల సందర్భంగా రూ.2 వేలు ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేశారన్నారు. అదే విధంగా పింఛన్ వయస్సును 57 ఏళ్లకు తగ్గించడం జరిగిందని.. తద్వారా 7 నుంచి 8 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని వెల్లడించారు. కాగా ఇప్పటి నుంచి లక్షన్నర బీడీ కార్మికులకు నెలకు రూ. 2 వేలు రాబోతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రం 17 శాతం అభివృద్ధితో ముందుకెళ్తుందన్నారు. దీంతో పాటు పేదల ఇళ్లకు పట్టాలు ఇచ్చి.. లోన్ తీసుకునే సదుపాయం కల్పించామన్నారు. మండేపల్లిలో 1,360 ఇళ్లు పూర్తయ్యాయి అంటూ.. త్వరలోనే వాటిని లబ్దిదారులకు అందిస్తామన్నారు. అర్హులందరికి రెండు పడక గదుల గృహాలు ఇస్తామని హామీ ఇచ్చారు. తన మాట నమ్మకుంటే.... ‘నేనే మీకు ఓ బస్సు ఏర్పాటు చేస్తా. డబుల్ బెడ్ రూం ఇళ్లను చూడండి’ అని అన్నారు. ఇళ్ల కోసం ఏ ఒక్కరు రూ.1 కూడా ఎవరికి ఇవ్వవద్దని.. పారదర్శకంగా వేదిక ఏర్పాటు చేసి మీ కళ్ల ముందే లాటరీ తీసి అందిస్తామన్నారు. డబుల్ బెడ్ రూం గృహాల మంజూరుకు ఎలాంటి పైరవీలు ఉండవని అన్నారు. ఒక్క డబుల్ బెడ్రూం ఇళ్లు కాంగ్రెస్ హయంలోని ఎనిమిది ఇందిరమ్మ ఇళ్లకు సమానమని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పూర్తి సమగ్ర సమాచారం తమ వద్ద ఉందని.. పేదలను గుర్తించి మరీ ఇళ్లను కల్పిస్తామన్నారు. రాష్ట్ర బడ్జెట్లో సింహభాగం పేద విద్యార్థులకు ఖర్చు పెడుతున్నామని పేర్కొన్నారు. సుమారు 3 లక్షల మంది విద్యార్థులకు కేసీఆర్ ప్రభుత్వం చదువుకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. దీంతో పాటు వడ్డీ లేని రుణాలకు సంబంధించి రూ. 65 కోట్లను చెక్కుల రూపంలో త్వరలోనే అందిస్తామన్నారు. సిరిసిల్ల జిల్లాలో అభివృద్ధి మీ కళ్ల ముందు కనిపిస్తుందా.. లేదా.. మీరే చెప్పాలని కేటీఆర్ ఈ సందర్భంగా స్థానికులను ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇరు జిల్లాలు అసూయ పడేట్లు సిరిసిల్ల తయారైందని చెప్పారు. బతుకమ్మ చీరాల బకాయిలను తాను అందిస్తానని హామీ ఇచ్చారు. అపెరల్ పార్కుల్లో బీడీ కార్మికులకు ఉపాధి కల్పిస్తానని పేర్కొన్నారు. తనకు దేశంలో గుర్తింపు ఉందంటే అది సిరిసిల్లా ప్రజలు చూపిన ఆశీర్వాదంమే అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
సిరిసిల్లలో మరో మృగాడు
మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు..మచ్చుకైన లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అనేలా తయారవుతున్నారు మృగాళ్లు. మొన్నటికి మొన్న వేములవాడలో బాలికను వరుసకు బావే లోబర్చుకుని గర్భవతిని చేసిన ఘటన మరువక ముందే సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్నబోనాలలో నివాసం ఉండే ఓ పిచ్చితల్లిని గర్భవతిని చేశాడు మరో ప్రబుద్ధుడు. తనకేం జరుగుతుందో తెలుసుకోలేని ఆ పిచ్చితల్లి బాత్రూం వెళ్లిన సందర్భంలో తనకు తానే ప్రసవం చేసుకుంది. పుట్టిన ఆడశిశువు క్షణకాలంలో మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. సాక్షి, సిరిసిల్ల: మున్సిపల్ పరిధిలో నివాసం ఉండే ఇండ్ల దేవలక్ష్మి(22) మతిస్థిమితం లేదు. తల్లి వజ్రవ్వ, తండ్రి నర్సయ్య రోజువారి కూలీలు. వీరితోపాటు అప్పుడప్పుడు పనులకు వెళ్లేది. ఇదే క్రమంలో స్థానికంగా నివాసం ఉండే రాజు అనే మృగాడి కళ్లు దేవలక్ష్మిపై పడ్డాయి. మాయమాటలు చెప్పి పిచ్చితల్లిని గర్భవతిని చేశాడు. నెలల గడిచే కొద్ది దేవలక్ష్మి శరీరాకృతిలో మార్పులు రావడంతో సిరిసిల్ల వెంకంపేటలోని సత్యనారాయణ అనే ఆర్ఎంపీ వద్ద పరీక్షలు చేయించి మందులు తీసుకున్నట్లు దేవలక్ష్మి తల్లి వివరించింది. ఆర్ఎంపీ దేవలక్ష్మి గర్భవతి అని చెప్పలేదని బాధితురాలి తల్లి వాపోయింది. గోప్యంగా నెలల గడిచాక.. దేవలక్ష్మి ఆదివారం ఉదయం బాత్రూంకు వెళ్లి అందులో తనకు తెలియకుండా స్వతహాగా ప్రసవం చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పుట్టిన ఆడశిశువు పరిమాణాన్ని బట్టి గర్భం దాల్చి ఏడునెలలు దాటి ఉంటుందని వైద్యులు, ఐసీడీఎస్ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే తల్లిదండ్రులిద్దరికి సరైన అవగాహన లేకపోవడంతో ఘోరం జరిగిందని స్థానికులు ముచ్చటించుకున్నారు. ప్రబుద్ధుడి పేరు చెప్పలేని స్థితిలో... యువతి ప్రసవించిందని తెలిసిన స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని పలురకాల ప్రశ్నలు అడిగారు. బాధితురాలి తల్లి ఎలాంటి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నట్లు తెలిసింది. స్థానికంగా ఉన్న రాజుపై పది మందిలో పంచాయతీ పెట్టాలని చెప్పామని కానీ ఆ పని చేసే స్థితి తల్లిదండ్రులిద్దరికి లేకపోవడం ప్రబుద్ధుడు ఆడింది ఆటగా మారిందనే మాటలు వినిపించాయి. ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.. పోలీసుల చొరవతో ప్రైవేటుకు.. బాత్రూంలో యువతి ప్రసవించి ప్రాణాపాయ స్థితిలో ఉందని స్థానికులు, ఐసీడీఎస్, ఎన్జీవో, పోలీసు అధికారులు హుటాహుటీనా ఆసుపత్రికి వస్తే అక్కడ విధుల్లో ఉన్న వైద్యులు ఎలాంటి పరీక్షలు చేయకుండా గైనకాలజిస్ట్ లేరని కరీంనగర్ వెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు. మృతశిశువును మార్చురీలో భద్రపరచాలని సీఐ శ్రీనివాస్ చెప్పినా దానిపై స్పందన లేకుండాపోయింది. పిచ్చితల్లికి సరైన వైద్యం అందించాలని చెబుతుంటే మృతశిశువు రక్తపరీక్షలు చేయాలని, ఆసుపత్రి నుంచి ఎక్కడికి తీసుకెళ్తారని డ్యూటీ డాక్టర్ తన కుర్చీలోంచి లేవకుండా ఇచ్చిన సలహాలు అందరిలో కోపాన్ని కలిగించాయి. అన్ని గమనించిన సిరిసిల్ల సీఐ శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకుని ఐసీడీఎస్ సీడీపీవో అలేఖ్యపటేల్, అంగన్వాడీ టీచర్స్ వింధ్యారాణి, వెంకటలక్ష్మి మరో స్థానికురాలి సహకారంతో సిరిసిల్లలో అమ్మ ఆసుపత్రి వైద్యురాలు వాణి వద్దకు దేవలక్ష్మిని పంపించి వైద్య సేవలందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన నిర్లక్ష్యాన్ని అందరూ తప్పుబట్టారు. చట్టప్రకారం చర్యలు ప్రస్తుతం యువతిని రక్షించే చర్యలు తీసుకున్నాం. దీనికి కారణమైన వ్యక్తికి సంబంధించి సమాచారం ఉంది. దానిని చట్టపరిధిలో పరిశీలించి యువతికి న్యాయం చేసేలా ముందుకెళ్తాం. – శ్రీనివాస్, సీఐ, సిరిసిల్ల టౌన్ -
మనవాళ్లే మోసం చేస్తున్నరు..
సాక్షి, సిరిసిల్ల: ఉపాధి కోసం నిరీక్షిస్తున్న యువకులకు నకిలీ గల్ఫ్ ఏజెంట్లు గాలం వేస్తున్నారు. నకిలీ వీసాలను అంటగడుతూ నిలువునా మోసం చేస్తున్నారు. లైసెన్స్ పొందిన గల్ఫ్ ఏజెంట్లు కొద్ది మందే ఉంటే.. లైసెన్స్‌లేని వాళ్లు ఊరుకొక్క రు ఉన్నారు. కొందరు లైసెన్స్ ఏజెంట్లు సైతం సబ్ ఏజెంట్లను నియమించుకుని అక్కరకు రాని వీసాలు అంటగడుతున్నారు. గల్ఫ్ దేశాలకు చెందిన వివిధ కంపెనీలు సైతం సులభతరంగా వీ సాలు ఇస్తూ కార్మికులను దిగుమతి చేసుకుంటున్నాయి. ఇది నకిలీ ఏజెంట్లకు కాసులు కురిపిస్తోంది. వేతనం అధికమని, పనితక్కువగానే ఉం టుందని నకిలీ ఏజెంట్లు అబద్ధపు ప్రచారంతో నిరుద్యోగ యువతను రొంపిలోకి దింపుతున్నారు. ఖతర్‌లో వీసాల మోసాలు.. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం బోయపల్లికి చెందిన ముత్తన్న కోట ఖతర్‌లో కాంట్రాక్టర్. పనులు చేయించుకునే అతడు.. వలస జీవులకు సరిగ్గా వేతనాలు ఇవ్వడనే అపవాదు ఉంది. తాజాగా మూడు నెలలుగా పని చేయించుకుంటూ చిల్లిగవ్వకూడా ఇవ్వడంలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. జీతం ఇవ్వకున్నా.. కనీసం బయటపని చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరినా వేధింపులు తప్ప మరో మార్గం కనిపించడంలేదు. ఇళ్లకు చేరిన వలస జీవులు ఏజెంట్ల మాటలతో మోసపోయిన వేములవాడకు చెందిన గొర్ల మురళి(42), కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన ఎల్లయ్య, కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన మొకెనపల్లి రాజయ్య ఎంబసీ అధికారులు, ఖతర్‌లోని తెలంగాణ ప్రతినిధుల సాయంతో శుక్రవారం స్వగ్రామాలకు చేరారు. అంతకుముందు పది మంది యువకులు సైతం ఇండియా చేరారు. ఇంకాచాలా మంది ఏం చేయాలో తెలియక అక్కడే మగ్గిపోతున్నారు. అప్పటి ఎస్పీ విశ్వజిత్ కంపాటి జిల్లాలో గల్ఫ్ ఏజెంట్లపై ఉక్కుపాదం మోపారు. నకిలీ ఏజెంట్లను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దీంతో గల్ఫ్ ఏజెంట్లు వీసాల దందా మానేసిన నకిలీలు.. ఇతర పనుల్లో స్థిరపడ్డారు. ఇప్పుడు పోలీసుల నిఘా తగ్గింది. నకిలీ ఏజెంట్లు వీసాల దందా ప్రారంభించారు. అమాయకులను తమ ఉచ్చులోకి లాగుతున్నారు. ఏజెంట్‌కు ఎనభై వేలు ఇచ్చిన బావుసాయిపేటకు చెందిన ఏజంట్ అంజయ్యకు ఎనభైవేల రూపాయలు ఇచ్చి ఖతర్ పోయిన. జూలై 7వ తేదీకి నాలుగు నెలలు. అక్కడికి పోయిన కాడినుంచి పని చేయించుకున్న ఏజెంట్ జీతం ఇవ్వలేదు. నాకు భార్య సావిత్రి, ఇద్దరు కొడుకులు ఉన్నరు. అప్పు చేసి ఖతర్ పోతే.. జీతం రాక అప్పులో కూరుకపోయిన. రజని మేడమ్, సంతోష్ సార్లు సాయం చేసి ఎంబసీ అధికారుల సాయంతో మా ఇంటికి పంపించిండ్రు. – మొకెనపల్లి రాజయ్య, పల్లిమక్త జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నరు మనవాళ్లను మనవాళ్లే మోసం చేస్తున్నారు. ఖతర్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. కానీ మనవాళ్లే పనిచేయించుకుంటూ జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఇండియన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫోరం(ఐసీడీఎఫ్)గా ఏర్పడి ఇబ్బందుల్లో ఉన్న భారతీయులకు సాయం చేయిస్తుంటాం. ఇప్పటికే చాలామందికి సాయం చేసి ఇండియా పంపించాం. ఎవరూ ఏజెంట్ల మాటలు నమ్మి మోస పోవద్దు. కంపెనీ వీసాలు, లైసెన్స్ ఉన్న ఏజెంట్ల ద్వారానే గల్ఫ్ దేశాలకు వెళ్లాలి. – రజని, ఐసీడీఎఫ్, ప్రతినిధి -
వేములవాడ రూరల్‌లో ఎన్నికలకు బ్రేక్
హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల పరిధిలోని ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. వేములవాడ రూరల్‌లో రిజర్వేషన్ల ప్రక్రియ పున:పరిశీలించిన తర్వాతనే ఎన్నికలు జరపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలో ఎంపీటీసీ ఎన్నికలను రద్దు చేయాలని తీగల రాంప్రసాద్ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఎంపీటీసీ రిజర్వేషన్ల ప్రక్రియ 2011 జనాభా ప్రాతిపదికన జరగటం లేదని వేములవాడ ఎంపీపీ రంగు వెంకటేశ్ తాను వేసిన పిటిషన్లో పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతనే వేములవాడ రూరల్ మండలానికి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్ ద్వారా కోరారు. దీనిపై విచారించిన హైకోర్టు, వేములవాడ రూరల్ మండల ఎంపీటీసీ ఎన్నికలపై స్టే విధించింది. -
గెలిచినా, ఓడినా ప్రజల్లోనే ఉన్నా..
సాక్షి, సిరిసిల్లటౌన్: ‘ఎంపీగా గెల్చినప్పుడు ప్రజల్లో ఉ న్న.. ఓడినా వారివెంటే ఉన్న.. వాళ్ల సమస్యల పరిష్కారం కోసం విరామం లేకుండా పోరాడిన’ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. జిల్లాకేంద్రంలో సోమవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీపై ప్రజలు కృతజ్ఞతతో ఉన్నారన్నారు. రాబోయే పా ర్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపిస్తుందని చెప్పారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన సాగుతున్నా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో జాతీయ రహదారుల ఊసేలేదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్‌గాంధీ ప్రధానమంత్రిగా రూ.12వేల లోపు ఆదాయం ఉన్న కు టుంబాలకు ఏడాదికి రూ.72 వేల ఆర్థిక భరోసా కల్పిస్తారని పేర్కొన్నారు. సిరిసిల్ల వస్త్రపరిశ్రమ ఆటుపోట్లకు గురైనప్పుడు అప్పటి కాంగ్రెస్ స ర్కారు చేయూత నిచ్చిందని గుర్తు చేశారు. దివంగత సీఎం వైఎస్సార్ చొరవతోనే రూ.32 కోట్లతో దిగువ మానేరుకు నీరు అందిస్తున్నారని తెలిపా రు. కాంగ్రెస్ పార్టీకి టీడీపీ, సీపీఐ మద్దతు ప్రకటించాయి. డీసీసీ అధ్యక్షుడు నాగుల సత్యనారా యణగౌడ్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, నాయకులు సంగీతం శ్రీనివాస్, గుడ్ల మంజుల, వెల్ముల స్వరూప, సూర దేవరాజు, గుంటి వేణు, సామల మల్లేశం, బూర శ్రీనివాస్, రిక్కుమల్ల మనోజ్, మొహినొద్దీన్ పాల్గొన్నారు. గెలుపు దీక్ష తీసుకోండి.. తంగళ్లపల్లి(సిరిసిల్ల): కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ‘కాంగ్రెస్ గెలుపు దీక్ష’ తీసుకో వాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్ర భాకర్ కోరారు. సిరిసిల్ల, తంగళ్లపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. దేశంకోసం ప్రాణా లు అర్పించిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీతో పోలిస్తే ప్రధాని మోదీ చేసిందేమీలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నాయకులు కేకే మహేందర్‌రెడ్డి, నాగుల సత్యనారాయణ, మడుపు శ్రీధేవి, సంగీతం శ్రీనివాస్, జాల్గం ప్రవీణ్‌కుమార్, ఆకునూరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ గెలుపుతో దేశానికి లాభం ముస్తాబాద్(సిరిసిల్ల): స్థానికులకు స్థానికేతరులకు జరుగుతున్న ఎన్నికలు ఇవని.. కాంగ్రెస్ గెలుపుతో దేశానికి లాభం జరుగుతుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. మండల కేంద్రంలో జరిగిన ప్రచార ర్యాలీతోపాటు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు. నాయకులు నాగుల సత్యనారాయణ, కేకే మహేందర్‌రెడ్డి, బుర్ర రాములు, గజ్జెల రాజు, మిర్యాల్‌కార్ శ్రీనివాస్, యెల్ల బాల్‌రెడ్డి, ఎల్లాగౌడ్, రాజేశం, జహంగీర్, దీటి నర్సింలు, రమేశ్, సావిత్రి, మహేశ్‌రెడ్డి, ఉపేంద్ర, మంత్రిరాజం, కొండం రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 16 మంది ఎంపీలతో ప్రధాని అవుతారా? ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): 16 మంది ఎంపీలతో సీఎం కేసీఆర్ ప్రధాని ఎలా అవుతారనిని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌గౌడ్ ప్రశ్నించారు. మండల కేంద్రంలో ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈఎన్నికల్లో స్థానికేతరుడైన వినోద్‌కుమార్‌ను ఇంటికి పంపడం ఖాయమ పేర్కొన్నారు. వినోద్‌కుమార్ వీర్నపల్లిని దత్తత తీసుకొని ఒరగబెట్టిందేమీలేదని విమర్శించారు. నాయకులు కేకే మహేందర్‌రెడ్డి, నాగుల సత్యనారాయణగౌడ్, ఎస్కే గౌస్, బుగ్గ కృష్ణమూర్తి, సద్ది లక్ష్మారెడ్డి, బూత శ్రీనివాస్, బుచ్చయ్యగౌడ్, దండు శ్రీనివాస్, మర్రి శ్రీనివాస్‌రెడ్డి, కరికె శ్రీనివాస్, సాహేబ్, గుర్రపు రాములు, రాములుగౌడ్, దేవచంద్రం, కార్యకర్తలు పాల్గొన్నారు. -
జిల్లాలో సగం కన్నా ఎక్కువ యూతే..
సాక్షి, సిరిసిల్ల: జిల్లా నిండా యువోత్సాహం కనిపిస్తోంది. మొత్తం ఓటర్లలో 51.54 శాతం 39 ఏళ్లలోపు వయసు వారే ఉన్నారు. రాష్ట్రఎన్నికల సంఘం ప్రకటించిన తుది ఓటరు జాబితాను పరిశీలిస్తే.. పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉండగా.. జిల్లా జనాభాలో 73.20 శాతం ఓటర్లుగా నమోదైనట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల నాటి వివరాలను పరిశీలిస్తే.. పార్లమెంట్ ఎన్నికల నాటికి చాలామార్పులు చోటు చేసుకున్నాయి. కొత్తగా 27,896 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ‘యువ’ ఓటర్లే అధికం జిల్లా ఓటర్ల సంఖ్య 4,33,902 కాగా ఇందులో 18 – 39 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఓటర్ల సంఖ్య 2,23,638 ఉంది. అంటే జిల్లా ఓటర్లలో 51.54 శాతంగా నమోదైంది. సగానికి కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉండడం విశేషం. ఎన్నికల సంఘం ఇటీవల కల్పించిన ఓటర్ల నమోదులో కొత్తగా 27,896 నమోదు ఓటర్లుగా తమ పేర్తు చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో ఫాం–6 ద్వారా అనేకమంది కొత్త ఓటర్లు నమోదు చేసుకోవడం విశేషం. మహిళా ఓటర్లు అధికం జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో పురుషుల ఓటర్ల సంఖ్య 2,11,324 కాగా.. మహిళలు ఓటర్లు 2,22,572 మంది ఉన్నారు. పురుషుల కంటే 1,1248 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో గెలుపోటముల్లో మహిళల పాత్ర కీలకంగా మారనుంది. మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా ఉండటానికి గల్ఫ్ వలసలు కారణాలుగా భావిస్తున్నారు. జిల్లా ఓటర్ల వివరాలు నియోజకవర్గాల వారీగా.. నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం సిరిసిల్ల 1,11,926 1,15,994 3 2,27,923 వేములవాడ 99,398 1,06,578 3 2,05,979 -
రోగులకూ ఆధార్ లింకేజీ
సాక్షి, వేములవాడ: ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలంటే తప్పకుండా వెంట ఆధార్‌కార్డు తీసుకెళ్లాల్సిందే... ఎందుకంటే ప్రతీ రోగి వివరాలను ఆన్లైన్లో పొందుపరచేందుకు ప్రభుత్వం కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రోగి సర్కారు వైద్యం కోసం దవాఖానాకు వెళ్లగా, బీపీ, షుగర్, జ్వరం పరీక్షలు నిర్విహించి వాటిని నమోదు చేస్తారు. దీంతో ప్రతీ రోగి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం 200లకు పైగా రోగులు వైద్య పరీక్షలకు వస్తున్నట్లు డాక్టర్ మానస తెలిపారు. వీరి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరుస్తున్నట్లు చెప్పారు. ఆధార్‌కార్డు నంబర్ నమోదు చేయకుంటే ఆన్లైన్లో పేర్లు నమోదు కావడం లేదని, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చేవారు తప్పకుండా తమ ఆధార్‌కార్డును తీసుకుని రావాలని సూచిస్తున్నామని చెబుతున్నారు. రోగుల వివరాలు నమోదు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల వివరాలను నమోదు చేస్తారు. రోగి పూర్తి పేరు, ఊరు, వీధి, వ్యాధి లక్షణాలు నమోదు చేస్తారు. అనంతరం బీపీ, షుగర్, ల్యాబ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఫార్మాసీకి తీసుకెళితే సదరు రోగి పేరు నమోదు చేసుకోని, ఈ–ఔషదీలో మందుల పేర్లను నమోదు చేస్తారు. దీంతో రోగి వాడిన మందుల సమాచారం ఆన్లైన్లో ఉండిపోతుంది. ఇలా ప్రతీ రోగి పూర్తి వివరాలు రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినా ఆధార్‌కార్డుతో కూడిన ఐటీ నంబర్‌పై లభ్యం కానుంది. ఇంటింటికి నమోదు ఆశావర్కర్లు ఇంటింటికి తిరుగుతూ రోగుల వివరాలను పొందుపరుస్తారు. దీంతో ఎవరికి ఎలాంటి వ్యాధి ఉంది, ఎంత కాలంగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు, ఎలాంటి మందులు వాడుతున్నారు అనే వివరాలు అందుబాటులో ఉండనున్నాయి. దీర్ఘకాలిక, వంశపారంపర్య వ్యాధులు, ఇతర రోగాలతో బాధపేడే వారి వివరాలను సేకరించి ఆన్లైన్లో పొందుపరుస్తారు. దీంతో ఏ ఇంటిలో ఎంత మంది ఎలాంటి రోగాలతో బాధపడుతున్నారు? ఏ పరీక్షలు చేయాలనే అంశాలపై నిపుణులు పునరాలోచించుకుంటారు. ప్రతీరోగికి సంబంధించిన వివరాలు నమోదు చేస్తున్నాం వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతీ రోగి పూర్తి వివరాలు తమ సిబ్బంది నమోదు చేస్తున్నారు. ఇంతేకాకుండా అన్ని అంశాలు ఆన్లైన్లో పొందుపరుస్తున్నాం. దీంతో ఈ రోగి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా తన ఆధార్‌కార్డు నంబర్ చెప్పడంతో రోగి పూర్తి వివరాలు, అనారోగ్య లక్షణాలు, వాడుతున్న మందులు మొత్తం అంశాలు ఆన్లైన్లో లభిస్తాయి. దీంతో ప్రజలకు ఇది ఎంతో ఉపయోగపడే అంశంగా భావిస్తున్నాం. రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యం పంచేందుకు ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటుంది. - డాక్టర్ మహేశ్‌రావు, వైద్యాధికారి -
బ్రిడ్జి ప్రారంభించేదెప్పుడో..?
సాక్షి, మానకొండూర్: మండలంలోని వేగురుపల్లి సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామాల వద్ద మానేరు వాగుపై నిర్మించిన బ్రిడ్జి నిర్మాణం పూర్తయి ఏడాది గడుస్తున్న ప్రారంభానికి మాత్రం నోచుకోవడం లేదు. ఈ వంతెనకు ఇరువైపుల భూ సేకరణ చేపట్టి రహదారి నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకూ అ«ధికారులు భూ సేకరణ చేపట్టలేదు. వంతెనకు ఒక వైపే భూ సేకరణ పనులు నామమాత్రంగా చేపట్టినట్లు స్థానిక రైతులు వాపోతున్నారు. వంతెనకు మరోవైపు భూ సేకరణ చేపట్టాల్సి ఉండగా, అ«ధికారులు మాత్రం అటువైపుగా దృష్టి సారించక పోవడంతో బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన ప్రారంభానికి నోచుకోలేక పోతోందని వాహనదారులు ఇరు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏడాది క్రితమే బ్రిడ్జి పనులు పూర్తి వేగురుపల్లి–నీరుకుల మధ్య మానేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం లేక అనేక గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాగులో మట్టి పోసి వాగును దాటే వారు. వర్షాకాలంలో మట్టి కొట్టుకుపోవడం వలన మళ్లీ అక్కడక్కడ మట్టి పోసి అనేక ఇబ్బందుల మధ్య రాకపోకలు సాగించేవారు. తొలిసారి ఎమ్మెల్యే ఎలక్షన్లలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మానేరు వాగుపై వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చి మాట నిలుపుకున్నారు. వంతెన నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరు చేయించారు. 2016 జనవరి 2న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఈ పనులకు శంకుస్థాపన చేశారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు పనులు వేగవంతంగా చేశారు. 15 ఫిల్లర్లు, 2 అపార్టుమెంట్లు ప్రధాన పనులను త్వరితగతిన పూర్తి చేశారు. ఫిల్లర్లపై గడ్డర్స్, డక్ స్లాబ్ పనులు కూడా చేశారు. 640 మీటర్ల మేర చేపట్టే ఈ పనులు చేపట్టిన కొద్ది నెలల్లోనే పూర్తి చేశారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయి ఉపయోగంలోకి రాకపోవడంతో అలంకారప్రాయంగా మారింది. భూ సేకరణలో జాప్యం వంతెనకు ఇరువైపుల రైతుల నుంచి భూ సేకరణ చేపట్టి రెండు కిలోమీటర్లకు పైగా కాంట్రాక్టర్ తారు రోడ్డు వేయాల్సి ఉంది. మానకొండూర్ మండలం వేగురుపల్లి వైపు అధికారులు భూ సేకరణ చేపట్టిన పూర్తిస్థాయిలో జరుపలేదని తెలుస్తోంది. కొద్దిదూరం మాత్రమే భూ సేకరణ చేపట్టి మట్టి పనులు చేశారు. పంట పొలాల్లో మట్టి పోసి రహదారి ఏర్పాటు చేసి తారు వేయాల్సి ఉంది. ప్రస్తుతం పంట పొలాలే దర్శనమిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఇరుకుల్ల వైపు భూ సేకరణ పనులు ఇంత వరకూ చేపట్టనేలేదు. వేగురుపల్లి వైపు కిలోమీటరు మేర పనులు చేపట్టాల్సి ఉండగా, ఇరుకుల్ల వైపు కిలోమీటరుపైగా పనులు చేపట్టాల్సి ఉంది. భూ సేకరణ త్వరగా చేపట్టితేనే ఇరువైపుల తారు రోడ్డు పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. వంతెనకు ఇరువైపుల తారు రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేసి వంతెనపై రాకపోకలను ప్రారంభించాలని ప్రయాణికులు, వాహనదారులు గ్రామస్తులు కోరుతున్నారు.