సాక్షి, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ ఆపద్దర్మ మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో లక్షా ఏడు వేల ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్ ఉద్యోగం ఉడగొట్టాలని ప్రజలకు ఆయన పిలుపున్చిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల కూటమి అభ్యర్థి మహేందర్ రెడ్డికి మద్దతుగా స్థానికంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. సిరిసిల్ల జిల్లా ఎవరి దయాదాక్షణ్యాల వల్ల రాలేదని, ఇక్కడి ప్రజలే పోరాడి సాధించుకున్నారని పేర్కొన్నారు. ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..
ఇక్కడి సమస్యలు కేటీఆర్ పరిష్కరించలేరు
‘తండ్రీ కొడుకులిద్దరూ కూతలొళ్లు, కూతల పోటీ పెట్టాలిద్దరికీ. ఎన్ని అవకాశాలిచ్చినా ఇక్కడి సమస్యలు కేటీఆర్ పరిష్కరించలేరు. స్థానికుడే ఇక్కడి నాయకుడు కావాలి. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకపోతే అమెరికా వెళ్లే కేటీఆర్‌కు ఓటు వేస్తారా? ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే గిట్టే మహేందర్ రెడ్డికి ఓటు వేస్తారా?. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్, కేటీఆర్‌లు వారికి కావాల్సింది వారు అయ్యారు. కానీ తెలంగాణ సమస్యలు పరిష్కారం కాలేదు. 250 కోట్లు ఖర్చు పెట్టి 150 కోట్లతో రెండు వందలకో చీర కొని బతుకమ్మ చీరలలో కమీషన్ నొక్కారు. వారానికోసారి చేనేత బట్టలు ధరించాలన్న కేటీఆర్ ధరిస్తున్నారా? చెప్రాసిగా కూడా కేటీఆర్ పనికిరారు. అమెరికాలో కేటీఆర్ బాత్‌రూమ్‌లు కడిగిన విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది.
టీఆర్‌ఎస్‌ను గుంజుకోవడానికి హరీశ్ చూస్తుండు
కేసీఆర్, కేటీఆర్ ఓడిపోతే టీఆర్‌ఎస్‌ను గుంజుకోవడానికి మంత్రి హరీశ్ చూస్తుండు. కుటుంబ గొడవలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటు ఎందుకు వేయాలో టీఆర్‌ఎస్ నేతలు చెప్పగలరా?. తెలంగాణ ప్రజల కష్టాలను చూసి సోనియా గాంధీ ఆవేదన చెందారు. 4500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పరామర్శించని అసమర్థ సర్కారు తీరుని చూసి సోనియా దుక్కించారు. ఈ ఎన్నికల్లో 70 సీట్లకు పైగా గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటే ఉచితంగా ఐదు లక్షలు ఇస్తాం. ప్రభుత్వం వచ్చాక ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు ఇస్తాం’ అంటూ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment