సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల్లో ఓడిపోతామని భయంతో కేసీఆర్.. ప్రాంతాలు, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చ గొడుతున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాయమాటలతో కేసీఆర్ ఓట్లు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.‘కేసీఆర్ ఓడిపోతే ఫాంహౌజ్‌లో పడుకుంటా అంటున్నారు..కేటీఆర్ అమెరికా పారిపోతా అంటున్నారు..అధికారంలో లేకపోతే ప్రజలకు సేవ చేయరా’ అని రేవంత్ ప్రశ్నించారు. కేటీఆర్‌ను ఎక్కడికి పారిపోనివ్వమని, అధికారంలోకి రాగానే దోచుకున్న డబ్బు కక్కిస్తామన్నారు.
తెలంగాణ టీడీపీతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. రమణ, కోదండరామ్, చాడ వెంకట్ రెడ్డిలు పక్కా తెలంగాణ బిడ్డలేనన్నారు. ఆంధ్ర కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చి కమీషన్లు తీసుకున్నప్పుడు ఆంధ్రోళ్లు అని గుర్తురాని కేసీఆర్‌కు.. ఎన్నికలు అనగానే ఆంధ్రోళ్లు అని గుర్తుకొచ్చిందా అని ప్రశ్నించారు . యాగాలకు చంద్రబాబు, వెంకయ్య నాయుడులను పిలిపించుకున్నది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. ప్రాజెక్టులను కట్టడం చేతకాక చంద్రబాబును బూచిగా చూపుతున్నారని ఆరోపించారు.
నిజాలు మాట్లాడకూడదని కేసీఆర్ కుటుంబానికి శాపం ఉన్నట్లుంది.. అందుకే అబద్దాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 100 స్థానాలు రాకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న కేటీఆర్.. ఎందుకు సన్యాసం తీసుకోలేదో చెప్పాలన్నారు. ఈ నెల 23న మేడ్చల్ బహిరంగ సభలో సోనియా గాంధీ కేసీఆర్ వైఫల్యాలను ఎండగడుతారని చెప్పారు. సోనియా టూర్‌తో కేసీఆర్, కేటీఆర్ భయపడుతున్నారని రేవంత్ అన్నారు. మేడ్చల్ సభకు భారీగా తరలివచ్చి సోనియాకు కృతజ్ఞత తెలపాలని కోరారు. ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment