మీ హయాంలో ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేయించిన్రు
నేను 1,100 ఎకరాలు తీసుకుంటుంటే కాళ్లలో కట్టెలు పెడుతున్నరు
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫైర్
నాకు భూమి విలువ తెలుసు.. గ్రామాల్లో మనకున్న గౌరవం భూమి
అందుకే సేకరించే భూమికి మూడింతలు అధికంగా పరిహారమివ్వాలని చెప్పా
భూ సేకరణ లేకుండా పరిశ్రమలు ఎలా వస్తాయ్? బుద్ధి లేదా కేసీఆర్?
కేసీఆర్ రూ.1.80 లక్షల కోట్లతో ప్రాజెక్టులు చేపట్టి ఒక్కదాన్నీ పూర్తి చేయలేదన్న సీఎం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బావబామ్మర్దుల సంగతి చెప్తాం అంటూ సవాల్
వేములవాడ రాజన్న ఆలయంలో పూజలు..అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నాడు నేడు అదే కోడె
వేములవాడ: చిత్రంలోని కోడెను గత మార్చిలో వేములవాడకు వచ్చిన ప్రధాని మోదీ రాజన్నకు మొక్కు చెల్లించారు. అదే కోడెను బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి మొక్కు చెల్లించారు. ఇద్దరూ ఇలా ఒకే కోడెను మొక్కు చెల్లించడం యాదృఛ్చికమంటూ అంతా చర్చించుకున్నారు.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘నేను జెడ్పీ సభ్యుడి నుంచి సీఎం దాకా అన్ని పదవులూ చేపట్టా.. నాకు భూమి విలువ ఏంటో తెలుసు. గ్రామాల్లో మనకు ఉన్న గౌరవం భూమి...నాకు తెల్వదా..? అందుకే సేకరించే భూమికి మూడింతలు అధికంగా పరిహారమివ్వాలని అధికారులకు చెప్పా. ఈ మేరకు చట్ట సవరణ చేయాలని ఆదేశించా. మా వెనకబడిన కొడంగల్‌ను స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పట్టించుకున్న వారులేరు.
మా ప్రాంతంలో యువతకు ఉపాధి కోసమని పరిశ్రమలు పెడతానంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు ఎందుకంత కడుపు మంట? ఎందుకంతదుఃఖం? మీ హయాంలో ప్రాజెక్టుల కోసం ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేయించిన్రు. నేను కేవలం 1,100 ఎకరాలు తొండలు కూడా గుడ్లు పెట్టని భూమిని తీసుకుంటుంటే కాళ్లలో కట్టెలు పెడుతున్నరు. రౌడీ మూకలతో కలెక్టర్, ఆర్డీవోలపై దాడి చేయించారు.
భూ సేకరణ లేకుండా పరిశ్రమలు ఎలా వస్తాయ్? బుద్ధి లేదా కేసీఆర్?..’అంటూ సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘రుణమాఫీ మీద లెక్కలు కావాలంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి. రైతుల భూములు లాక్కున్న హరీశ్ సమాధానం చెప్పాలి. కేటీఆర్ ఉరుకులాట గమనిస్తున్నాం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బావబామ్మర్దుల సంగతి చెప్తాం. వారికి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పరాజయాల పాలై మెదడు పోయింది..’అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
ప్రజాపాలన– ప్రజా విజయోత్సవాల్లో భాగంగా బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్‌లో వేములవాడ చేరుకున్న ముఖ్యమంత్రి తొలుత పలువురు మంత్రులతో కలిసి రాజరాజేశ్వరుడి ఆలయంలో కోడె మొక్కులు చెల్లించి పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్దాల మండపంలో వేద పండితులు సీఎంను, మంత్రులను ఆశీర్వదించారు.
అనంతరం ఆలయ విస్తరణ, ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్ నిర్మాణం, మూలవాగు నుంచి ఆలయం వరకు రోడ్ల విస్తరణ, అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ (ఏటీసీ) తదితర మొత్తం రూ.679 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. రూ.28 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించారు. మిడ్‌మానేరు నిర్వాసితులకు రూ.236 కోట్లతో 4,696 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నిధులు కేటాయించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.
30వ తేదీలోపు మిగిలిన పనులన్నీ పూర్తి
‘గత ఎన్నికల సమయంలో సమ్మక్క సారక్క ప్రాంతం నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన రోజు కేసీఆర్ గడీలు కూలాలి, రాజన్నను మోసం చేసిన కేసీఆర్‌ను గద్దె దించాలి అనుకున్న. పరిహారం కోసం మిడ్ మానేర్ నిర్వాసితులు చేస్తున్న పోరాటంలో పాల్గొన్న. అధికారంలోకి వస్తే కళికోట ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పిన. కొండగట్టు హనుమంతుడి ఆశీర్వచనం తీసుకున్న. ఉమ్మడి జిల్లాలో అసంపూర్తిగా ఉన్నా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చా.
ఈ నెల 30 తేదీ లోపు ఉమ్మడి కరీంనగర్ ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లాకు వచ్చి మిగిలిపోయిన పనులన్నీ పూర్తయ్యేలా చూస్తారు. దేశానికి దిశ దశ చూపిన మహనీయుడు పీవీ నరసింహారావు సొంత జిల్లా కరీంనగర్ ప్రజల్లో చైతన్యం ఎక్కువ. సిరిసిల్ల జగిత్యాల రైతాంగ పోరాటాలు మర్చిపోలేం.
2004లో తెలంగాణ ఇస్తామని కరీంనగర్ గడ్డ మీద నుంచే సోనియాగాంధీ మాట ఇచ్చారు. జైపాల్‌రెడ్డి చాతుర్యంతో పొన్నం ప్రభాకర్ పెప్పర్ స్ప్రేలను ఎదుర్కొని కొట్లాడారు. ఆంధ్రలో, కేంద్రంలో ఓడిపోతామని తెలిసినా.. 4 కోట్ల తెలంగాణ వాసులకు ఇచ్చిన మాట కోసం సోనియా తెలంగాణ ఇచ్చారు..’అని రేవంత్ చెప్పారు.
కాంగ్రెస్ మాటిస్తే ఎంత దూరమైనా వెళ్తుంది
‘కాంగ్రెస్ మాటిస్తే ఎంత దూరమైనా వెళ్తుంది. పొన్నంను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు. అదే బండి సంజయ్ గెలిచి ఏం తెచ్చారు? వినోద్‌కుమార్, కేసీఆర్ నిధులు ఇచ్చి ఉంటే ప్రాజెక్టులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి? రూ.7 లక్షల కోట్లు అప్పు తెచ్చిన కేసీఆర్ రూ.100 కోట్లతో రాజన్న గుడిని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయాడు? మీ ఎమ్మెల్యే నిత్యం ప్రజల కోసమే పనిచేసే మనిషి. సిరిసిల్ల మెడికల్ కాలేజీకి హాస్టల్ ఇచ్చాం. గల్ఫ్ కార్మీకులకు, వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేసి రూ.5 లక్షల నష్ట పరిహారం ఇస్తున్నాం.
పదేళ్లలో కేసీఆర్ చేయలేని పనిని మేము చేస్తుంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌లు కాళ్లల్లో కట్టెలు పెట్టేందుకు వస్తున్నారు. నాడు ఆత్మహత్యల్లో తెలంగాణ రెండవ స్థానంలో నిలిచింది. గత పాలనలో కేవలం రూ.11 వేల కోట్ల రుణమాఫీ చేస్తే మేం కేవలం 11 నెలల్లో 23 లక్షల మందికి రూ.18 వేల కోట్లు మాఫీ చేశాం. సోషల్ మీడియాలో నాలుగు పోస్టులు పెట్టి హీరో అనుకుంటున్నారు..’అని సీఎం విమర్శించారు.
నిజాన్ని ఎదుర్కోవాలంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి
‘కేసీఅర్.. నువ్వు నిజాన్ని ఎదుర్కోవాలంటే అసెంబ్లీకి రావాలి. నేను 10 నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఇచ్చా. అందులో ఒక్కటి తక్కువుందని నిరూపిస్తే ఎల్బీ స్టేడియంలో క్షమాపణ చెప్తా. మేం కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క ఎత్తిపోయలేదు. అయినా మన రైతులు రికార్డు స్థాయిలో 1.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేశారు. కేసీఆర్ రూ.1.80 లక్షల కోట్లతో ప్రాజెక్టులు చేపట్టి ఒక్కదాన్ని కూడా పూర్తి చేయలేదు.
కేసీఆర్, హరీశ్‌లు.. రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్‌లను తమ ఫామ్‌హౌస్‌లకు నీరు పారించడానికి కట్టారు. రైతుల నుంచి సేకరించిన భూములను హరీశ్ లాక్కున్నారు. దీనిపై ఆయన సమాధానం చెప్పాలి. కేటీఆర్ కూడా ఉరుకులాడుతున్నరు. ఫామ్‌హౌస్‌ల డ్రగ్స్ తీసుకుంటే అరెస్టు వద్దంటున్నాడు. నీ బామ్మర్దిపై కేసు పెట్టద్దా సన్నాసీ? కుట్రలు చేస్తే ఊచలు లెక్కపెడతావ్..’అని ముఖ్యమంత్రి అన్నారు.
మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, పీసీసీఅధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి, బల్మూరి వెంకట్, ఎమ్యెల్యేలు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, మక్కాన్‌సింగ్, విజయరమణరావు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment