కేటీఆర్‌ ఖేల్‌ ఖతం: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Comments On KTR and KCR Family | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ ఖేల్‌ ఖతం: సీఎం రేవంత్‌

Published Wed, Oct 30 2024 4:31 AM | Last Updated on Wed, Oct 30 2024 4:31 AM

CM Revanth Reddy Comments On KTR and KCR Family

కేటీఆర్‌ను వాడి ఆయన్ను ఫినిష్‌ చేశా: సీఎం రేవంత్‌

ఇప్పుడు బావను ఉపయోగించి బావమరిదిని ఫినిష్‌ చేయిస్తా 

ఇక హరీశ్‌రావును ఎలా డీల్‌ చేయాలో నాకు బాగా తెలుసు 

కేసీఆర్‌ కుటుంబానికి రాజకీయ ఉనికి లేకుండా చేస్తా.. 

సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు 

దీపావళి అంటే మాకు చిచ్చుబుడ్లు.. వారికి సారాబుడ్లు 

సీఎం కావాలన్న కోరిక నెరవేరింది.. ఇక ప్రజలకు సేవ చేయడమే పని 

నాది రాజమౌళి వర్కింగ్‌ స్టైల్‌.. రాంగోపాల్‌వర్మ టైపు కాదు 

సియోల్‌లో పర్యటించిన మీడియా ప్రతినిధులతో సీఎం చిట్‌చాట్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాలం చెల్లిన మందు. ఆయన పని అయిపోయింది. కేసీఆర్‌ కోసం కేటీఆర్‌ను వాడా. పది నెలల్లో కొడుకు చేత తండ్రిని ఫినిష్‌ చేయించా. ఇప్పుడు బావను ఉపయోగించి బావమరిదిని ఫినిష్‌ చేయిస్తా. ఆ తర్వాత హరీశ్‌రావును ఎలా డీల్‌ చేయాలో నాకు బాగా తెలుసు. కేసీఆర్‌ కుటుంబానికి రాజకీయ ఉనికి లేకుండా చేస్తా...’ అంటూ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి అంటే తమకు చిచ్చుబుడ్లు గుర్తుకు వస్తాయని, కానీ వారికి మాత్రం సారాబుడ్లు గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు. 

కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాల ఏమీ తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. ఫోన్‌ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్‌ కొనుగోళ్లకు సంబంధించిన విచారణల్లో ఎలాంటి కక్ష సాధింపులు ఉండబోవని, దర్యాప్తు సంస్థలు ఇచ్చే నివేదికల ప్రకారమే చర్యలుంటాయని చెప్పారు. ఇటీవల దక్షిణ కొరియాలోని సియోల్‌లో పర్యటించిన మీడియా ప్రతినిధులతో మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో రేవంత్‌ ఇష్టాగోష్టిగా మాట్లాడారు.  

మాకు నష్టం జరిగినా ప్రజలకు మేలు చేస్తాం 
‘సీఎం కావాలన్నది నాకల. ఆ కల నెరవేరింది. కొత్తగా ఏదో కావాలనే కోరిక నాలో లేదు. ఇప్పుడు ప్రజలకు సేవ చేయడమే పని. నేను అనుకున్నది ఇచ్చిన ప్రజలకు మేలు చేయడమే నా ముందున్న లక్ష్యం. మాకు రాజకీయంగా నష్టం జరిగినా ప్రజలకు చేయాలనుకున్న మేలు చేసి తీరతాం. పనితీరులో నా స్టైల్‌ రాజమౌళిది.. రాంగోపాల్‌వర్మ లాంటిది కాదు. ఫోన్‌ ట్యాపింగ్, కాళేశ్వరం, విద్యుత్‌ కొనుగోళ్లపై విచారణ జరుగుతోంది. 

కాళేశ్వరంపై విజిలెన్స్‌ కమిషన్‌ నివేదిక ఇచ్చింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు పాస్‌పోర్టు రద్దయ్యింది. శ్రవణ్‌రావు వాస్తవాలు చెప్పడానికి ముందుకొచ్చాడు. దీపావళి దావత్‌ అలా చేస్తారని మాకు తెలియదు. ఏమీ చేయకపోతే రాజ్‌ పాకాల ఎందుకు పారిపోయారు? ముందస్తు బెయిల్‌ ఎందుకు అడి గారు? ఇంటి దావత్‌లో క్యాసినో కాయిన్స్, విదేశీ మద్యం ఎందుకు?..’ అని సీఎం ప్రశ్నించారు. 

హామీలు నెరవేరుస్తున్నాం.. 
‘గత ప్రభుత్వం ఎంత గుడ్డిగా వ్యవహరించిందంటే.. కనీసం అధికారుల సర్వీసు రికార్డులు కూడా లేవు. రెవెన్యూ అధికారుల బదిలీల వ్యవహారంతో ఇది తేటతెల్లమైంది. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ఏకంగా రూ.7 లక్షల కోట్ల భారం మోపారు. మేం పది నెలల్లో భూములు అమ్మలేదు, లీజుకు ఇవ్వలేదు. రాబడిలో లీకేజీలను అరికట్టాం. ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు సాగుతున్నాం. 

ఏకకాలంలో రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నెలలో తొలిరోజే వేతనాలు, పింఛన్లతో ప్రజలకిచ్చిన హామీలను నెర వేరుస్తున్నాం. రుణమాఫీ కోసం బడ్జెట్‌లో రూ.31 వేల కోట్లు పెట్టి ఇవ్వలేదని అంటున్నారు. అది కేవలం ప్రొవిజన్‌ కోసమే పెట్టాం తప్ప అదంతా ఇవ్వాలని కాదు. రైతులకు అవసరమైన మేరకు రూ.26 వేల కోట్లు ఖచ్చితంగా ఇస్తాం..’ ముఖ్యమంత్రి చెప్పారు.  

ఆర్థిక మాంద్యంతో రియల్టీ తగ్గుముఖం 
‘హైడ్రాతో రియల్‌ ఎస్టేట్‌ పడిపోయిందని ప్రచారం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా గత రెండేళ్లుగా ఆర్థిక మాంద్యం కారణంగా రియల్టీ తగ్గుముఖం పట్టిందనే విషయం బీఆర్‌ఎస్‌ నేతలకు తెలియదా? గండిపేటలో అక్రమంగా కట్టిన బలిసినవాళ్ల ఇళ్లే కూలగొట్టాం. పేదల జోలికి వెళ్లడం లేదు. కూకట్‌పల్లిలో చిన్నారిని పరామర్శించిన కేటీఆర్‌ ఇల్లు కట్టిస్తారని అనుకున్నా. పుస్తకాల బ్యాగ్‌ ఇచ్చి చేతులు దులుపుకున్నారు..’ అని సీఎం విమర్శించారు.  

పైసా ఖర్చు లేకుండా మూసీ పునరుజ్జీవం 
– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి 
– ప్రాజెక్టుపై ముందుకే..వెనక్కి తగ్గేదిలేదు 
– 18 నెలల్లో మూడు పద్ధతుల్లో డీపీఆర్‌ రెడీ 
– మేలైన మోడల్‌ను ఎంచుకుని పనులు ప్రారంభిస్తాం 
– తొలిదశలో జంట జలాశయాల నుంచి బాపుఘాట్‌ వరకు ప్రాజెక్టు 
– బాపూఘాట్‌ వద్ద అతిపెద్ద గాంధీ విగ్రహం, లండన్‌ ఐ, పెద్ద టవర్‌ 

మూసీ పునరుజ్జీవంపై ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తూ లేనిపోని ప్రచారాలతో ప్రజల మనసులను కలుషితం చేస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. పైసా ఖర్చు లేకుండా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. మంగళవారం మీడియాతో చిట్‌చాట్‌ సందర్భంగా ఈ ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘గత ప్రభుత్వం తరహాలో కాకుండా మేం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తాం. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా వేయిసార్లు ఆలోచిస్తా. అలా ఆలోచించే మూసీ పునరుజ్జీవంపై నిర్ణయం తీసుకున్నా. 

ఇక ముందడుగే. వెనుకడుగు వేసేది లేదు. పైసా ఖర్చు లేకుండా ప్రైవేటు భాగస్వామ్యంతో పనిచేస్తాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐదు సంస్థల కన్సారి్టయంకు మూసీ ప్రాజెక్టు డీపీఆర్‌ తయారీ బాధ్యతలు అప్పగించాం. రివర్‌ బెడ్‌ ఆర్థికంగా ఎలా ఉపయోగపడుతుందనే కోణంలో, అన్ని సాధ్యాసాధ్యాలకు సంబంధించిన అంశాలతో 18 నెలల్లో ఈ డీపీఆర్‌ వస్తుంది. ప్రభుత్వ, పీపీటీ, హైబ్రిడ్‌.. ఈ మూడు పద్ధతుల్లో వస్తుంది. దీని ఆధారంగా ప్రపంచంలోనే మేలైన మోడల్‌ను ఎంచుకుని మూసీ పునరుజ్జీవ పనులకు శ్రీకారం చుడతాం..’ అని సీఎం తెలిపారు.  

తొలిదశలో 21 కిలోమీటర్లు 
‘తొలిదశలో బాపుఘాట్‌ వరకు మూసీ పునరుజ్జీవం చేపడతాం. జంట జలాశయాల నుంచి బాపుఘాట్‌ త్రివేణి సంగమం వరకు ఈ పనులు మొదలు పెడతాం. మల్లన్నసాగర్‌ నుంచి గండిపేట, హిమాయత్‌సాగర్‌కు గోదావరి జలాలు తరలిస్తాం. ఆలోపు వంద శాతం నీటిని శుద్ధి చేస్తాం. అక్కడికి 21 కిలోమీటర్ల మేర పునరుజ్జీవం పూర్తవుతుంది. నవంబర్‌ తొలివారంలో మల్లన్నసాగర్‌ నుంచి జంట జలాశయాలకు నీటి తరలింపు ట్రంక్‌ లైన్‌ పనులకు టెండర్లను పిలుస్తాం. 

బాపూఘాట్‌ దగ్గర బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మిస్తాం. అతిపెద్ద బాపూ విగ్రహం ఏర్పాటు చేస్తాం. లండన్‌ ఐ (అతిపెద్ద జెయింట్‌ వీల్‌) ఏర్పాటు చేస్తాం. అక్కడి నుంచి నగరమంతా వీక్షించేలా సియోల్‌ టవర్‌ తరహాలో పెద్ద టవర్‌ నిర్మిస్తాం. మూసీ వెంట అంతర్జాతీయ వర్సిటీ, గాంధీ ఐడియాలజీ..రీ క్రియేషన్‌ సెంటర్, నేచర్‌ క్యూర్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తాం..’ అని రేవంత్‌ చెప్పారు. 

నైట్‌లైఫ్‌కు వేదికగా హైదరాబాద్‌ 
‘మూసీ సుందరీకరణతో ఆదాయ పరంగా మరో నగరం ఏర్పడుతుంది. రాత్రివేళల్లో మూసీ రివర్‌ ఫ్రంట్‌లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు జరుగుతాయి. ఇప్పటివరకు హైదరాబాద్‌ నగరం పగలు మాత్రమే మేలుకుంటోంది. మూసీ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్‌ నైట్‌ లైఫ్‌కు వేదిక కానుంది. మూసీ నిర్వాసితులకు మంచి పరిహారం ఇస్తాం. వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.  

ప్రజలనే అడుగుదాం రండి 
ఈ ప్రాజెక్టుపై అనుమానాలున్నా, ప్రతిపక్షాలకు ఏదైనా ఆలోచన ఉన్నా నాకందజేయాలి. ఒకవేళ కేటీఆర్, హరీశ్, ఈటల లాంటి నేతలకు నా దగ్గరకు రావడం మొహమాటం అనిపిస్తే సీఎస్‌ను లేదంటే మంత్రులను కలిసి ఇవ్వొచ్చు. మూసీని నగర జీవనాడిగా మార్చేందుకు కలిసి రండి. 

వాడపల్లి నుంచి వికారాబాద్‌ వరకు పాదయాత్ర చేస్తా. కేటీఆర్, ఈటల, హరీశ్‌ కూడా నాతో కలిసి రావాలి. మూసీని అభివృద్ధి చేయాలో లేదో ప్రజలను అడుగుదాం. రూ.లక్షన్నర కోట్ల ఖర్చు కేవలం మూసీకే కాదు.. విశ్వనగర అభివృద్ధి కోసం. ట్రిపుల్‌ ఆర్, మెట్రో, గోదావరి జలాల తరలింపు, ఎస్టీపీల నిర్మాణం, రేడియల్‌ రోడ్ల అభివృద్ధికి ఈ నిధులు వెచ్చిస్తాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement