లాస్య నందిత కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్
నాగర్‌కర్నూల్/ అచ్చంపేట: కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి ధారాదత్తం చేసిన దగుల్బాజీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్, అచ్చంపేటలలో నిర్వహించిన పార్టమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేఆర్‌ఎంబీకి అప్పగించడం వల్ల జూరాల, శ్రీశైలంలో కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి ఉండదని..చుక్కనీరు కావాలన్నా వారి అనుమతి తీసుకోవాల్సి వస్తుందన్నారు.
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో కేఆర్‌ఎంబీకి అప్పగించాలని కేసీఆర్‌పై ఎంత ఒత్తిడి తెచ్చినా ఒప్పుకోలేదని చెప్పారు. గుంపుమేస్త్రీకి తెలంగాణ తల్లి వడ్డాణం పెట్టుకోవడం నచ్చలేదని, తన ఇంట్లో పెళ్లి జరిగితే మాత్రం ఒంటినిండా బంగారం దిగేసుకోవచ్చా అని ప్రశ్నించారు. రాష్ట్ర చిహ్నంలో గోల్కొండ, చార్మినార్ ఉండొద్దంటున్న రేవంత్‌రెడ్డికి జయజయహే తెలంగాణ గీతాన్ని ఒక్కసారి వింటే వాటి ప్రాముఖ్యత ఏంటో తెలుస్తుందన్నారు. వందరోజుల పరిపాలన పూర్తయ్యేనాటికి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే బీఆర్‌ఎస్ కార్యకర్తలే మీ గొయ్యి తవ్వేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
దాడులకు భయపడం..
కాంగ్రెస్ దాడులకు భయపడేది లేదని, వారు ఎన్నికల సమయంలో ఇటుకలు విసిరారు.. మనం కొన్ని రోజులు చూస్తాం.. మనం రాళ్లు విసరలేమా.. మనకు 60 లక్షల మంది బలం ఉందని కేటీఆర్ అన్నారు. అడ్డి మారి గుడ్డి దెబ్బ అన్నట్టుగా అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, రేవంత్‌రెడ్డి సీఎం అవుతాడని ఆయన సొంతూరు కొండారెడ్డిపల్లిలోనే ఎవరూ నమ్మలేదని ఎద్దేవా చేశారు.
రేవంత్‌రెడ్డి సీఎం అని ముందే చెప్పి ఉంటే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా వచ్చి ఉండేవి కాదని, అనుకో కుండా గాలి నాలా తంతే గారెల బుట్టలో పడినట్టు పడ్డారన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వస్తామని కలలో కూడా ఊహించలేదన్నారు. అసెంబ్లీ సాక్షిగా అమ్మతోడు చెబుతున్నాం.. మహబూబ్‌నగర్ జిల్లాలో మేం ఐదారు గెలుస్తాం అనుకున్నాం కానీ.. 12 గెలుస్తామని కలలో కూడా అనుకోలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారని విమర్శించారు. ఆయా సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
లాస్య మరణం తీరని లోటు
కంటోన్మెంట్: దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబానికి బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం కాకాగూడలోని లాస్య నందిత కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. లాస్య తల్లి గీత, చెల్లెళ్లు నమ్రత, నివేదితలను ఓదార్చారు. ప్రమాద వివరాలను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. లాస్య మరణం బీఆర్‌ఎస్ పారీ్టకి, కంటోన్మెంట్ ప్రజలకు తీరని లోటు అన్నారు. పరామర్శించిన వారిలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు రాజశేఖరరెడ్డి, మాధవరం కృష్ణారావు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment