Telangana Elections 2018
-
పెన్షన్‌దారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పెన్షన్‌దారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పింఛన్లు రెట్టింపు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించగా..ఆ హామీని అమలు చేయనున్నారు. ప్రతి నెల ఇచ్చే సంక్షేమ పింఛన్లను రెట్టింపు చేస్తున్నట్టు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ నెల నుంచి పింఛన్ల పెంపుదల వర్తిస్తుందని.. జూలైలో లబ్దిదారులకు ఆ మొత్తాన్ని అధికారులు అందజేస్తారని వెల్లడించింది. ఆసరా పేరుతో ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1000 పింఛన్ ఇస్తుండగా.. ఇప్పుడు వాటిని రెట్టింపు చేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించింది. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, హెచ్.ఐ.వీ-ఎయిడ్స్ బాధితులు, ఒంటరి మహిళలు, బోదకాల బాధితులకు ఇకపై పెరిగిన పింఛన్ల ప్రకారం నెలకు రూ. 2,016 అందనున్నాయి. అదేవిధంగా దివ్యాంగులకు నెలకు రూ.3,016 ఇవ్వనున్నారు. -
కేసీఆర్ ఎన్నికను రద్దు చేయండి
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్ (ఈపీ)ను హైకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. ప్రతివాదులుగా ఉన్న కేసీఆర్‌తో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, ఇతర అభ్యర్థులకు, గజ్వేల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ ఉత్తర్వు లు జారీ చేశారు. గజ్వేల్ నుంచి పోటీ చేసిన కేసీఆర్ తన ఎన్నికల అఫిడవిట్లో అనేక వాస్తవాలను దాచారని, కేసుల వివరాలన్నీ పొందుపర్చలేదని, అందువల్ల ఆయన ఎన్నిక రద్దు చేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా మామిడ్యాలకు చెందిన టి.శ్రీనివాస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ విచారణ జరిపా రు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రజా ప్రాతి నిథ్య చట్టంలోని నిబంధనలకు లోబడి కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయలేదని పేర్కొన్నారు. కేసీఆర్‌పై మొత్తం 64 కేసులుంటే, 2 కేసుల గురించే అఫిడవిట్ లో ప్రస్తావించారని తెలిపారు. ఆ తర్వాత కేసుల సం ఖ్యను సవరించి, ఆ వివరాలను ఎన్నికల వెబ్సైట్లో ఉంచారన్నారు. కేసుల వివరాల గురించి పేర్కొనలేదన్నారు. ఆదాయ వివరాలను సక్రమంగా చెప్పలేదన్నారు. హిందూ అవిభాజ్య కుటుంబం ఆదాయాన్ని రూ.5.4 లక్షలుగా పేర్కొన్నారని, అలాగే వ్యవసాయ ఆదాయం రూ.91.52 లక్షల గురించి చెప్పనే లేదన్నారు. ఆదాయపు పన్ను వివరాలను కూడా బహిర్గతం చేయలేదన్నారు. ఇవన్నీ కూడా ఓటర్లను తప్పుదారి పట్టించడమే అవుతుందని, అందువల్ల కేసీఆర్ ఎన్నికను రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కేసీఆర్‌తో పాటు ఇతరులకు నోటీసులు జారీ చేశారు. -
ఓడినవారికి వచ్చేనా?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన నాయకులకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందా? ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పార్లమెంటు ఎన్నికల్లో గెలిచే అవకాశమున్నవారి పేర్లను పరిగణనలోకి తీసుకుంటుందా.. లేదా? – రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న ఆసక్తికర చర్చ ఇది. లోక్‌సభకు పోటీచేసే ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ జరుగుతున్న సందర్భంలో ఈ చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన చాలామంది సీనియర్లు ఈసారి లోక్‌సభకు పోటీచేయాలనే ఆలోచనలో ఉండటం, తమకు అవకాశమివ్వాలని ఇప్పటికే దరఖాస్తు చేసుకోవడంతో పార్టీ హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. బహిరంగంగా కొందరు.. అంతర్గతంగా మరికొందరు.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చాలా మంది సీనియర్లు జీర్ణించు కోలేకపోతున్నారు. ఎవరూ ఊహించని విధంగా మహామహులనుకున్న కాంగ్రెస్ నేతలు సైతం ఓటమి పాలుకావడం ఆ పార్టీ కేడర్‌ను కుంగదీసింది. ఈ నేపథ్యంలో తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడంతో పాటు కేడర్‌లో మనోస్థైర్యం నింపాలంటే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి గెలవడం ఒక్కటే మార్గమని పలువురు సీనియర్లు భావిస్తున్నారు. వీరిలో కొందరు తాము లోక్‌సభకు పోటీచేస్తామని బహిరంగంగానే చెబుతూ దరఖాస్తు చేసుకోగా, మరికొందరు అంతర్గతంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నల్లగొండ పార్లమెంటు స్థానానికి తాను పోటీ చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల ముందే ఈ విషయం చెప్పిన ఆయన.. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కూడా అదే మాట చెప్పారు. చెప్పడమే కాదు.. తనకు నల్లగొండ లోక్‌సభ నుంచి పోటీ చేసే అవకాశమివ్వాలంటూ పార్టీకి దరఖాస్తు కూడా చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే నల్లగొండ లోక్‌సభ నుంచి పోటీ చేసి విజయం సాధించాలని, తద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పోయిన ఛరిష్మాను తిరిగి సంపాదించుకోవాలని యోచిస్తున్నారు. నల్లగొండ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ఉంటారనే ప్రచారం కూడా జరుగుతున్న సందర్భంలో అక్కడి నుంచి కోమటిరెడ్డి పోటీ చేస్తే ఎన్నికల రాజకీయం రసకందాయంలో పడనుంది. ఇదే స్థానం నుంచి మాజీ మంత్రి కె.జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతిల పేర్లు కూడా వినిపిస్తున్నారు. ఇక, కాంగ్రెస్ సీనియర్లు టికెట్ రేసులో ఉన్నారని ప్రచారం జరుగుతున్న మహబూబ్‌నగర్ అభ్యర్థి ఎంపిక సంచలనాత్మకమవుతుందని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక్కడ కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డితోపాటు ఇటీవలి ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయిన డి.కె.అరుణ, రేవంత్‌రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. రేవంత్‌రెడ్డి, అరుణలలో ఎవరైనా టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇవ్వడం ఖాయమనే చర్చ జరుగుతోంది. ఇక, నాగర్‌కర్నూలు, మహబూబాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, ఖమ్మం, కరీంనగర్, జహీరాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్ నియోజకవర్గాల్లో కూడా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన నేతలే రేసులో ఉన్నారు. వీరి విషయంలో హైకమాండ్ సానుకూలంగా వ్యవహరిస్తుందా..? కనీసం ఒకరిద్దరికైనా అదృష్టాన్ని మళ్లీ పరీక్షించుకునే అవకాశం ఇస్తుందా..? లేదా మూకుమ్మడిగా ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తుందా అన్నది వేచిచూడాల్సిందే...! నెలాఖరుకు ఎంపిక లోక్‌సభకు పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఈ నెలాఖరుకు పూర్తవుతుందని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులను త్వరగా ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్న నేపథ్యంలో ఈనెల 17న జరిగే ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సమావేశం కీలకం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి పంపనున్నారు. ప్రతి నియోజకవర్గానికి రెండు పేర్లు మాత్రమే హైకమాండ్‌కు పంపుతారని, అనివార్యమైతేనే మూడోపేరు ప్రతిపాదిస్తారని తెలుస్తోంది. పీఈసీ సమావేశం అనంతరం 20వ తేదీ లోపు అభ్యర్థుల జాబితా అధిష్టానానికి వెళుతుందని, నెలాఖరుకల్లా అభ్యర్థుల అధికారిక ప్రకటన ఉంటుందని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. -
ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కసరత్తు చేస్తున్నారు. ‘ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి’నినాదంతో తమ ప్రభుత్వం పని చేస్తోందంటూ తరచూ చెప్పే సీఎం కేసీఆర్ త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో దీన్ని ప్రతిబింబించాలని భావిస్తున్నారు. ఈసారి ప్రవేశపెట్టేది తాత్కాలిక బడ్జెటే అయినా ఎన్నికల హామీల అమలుకు అవసరమైన నిధుల కేటాయింపు, విధాన ప్రకటనలను ఇందులో పొందుపరచడం ద్వారా త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లకుగాను 16 సీట్లను గెలుచుకోవాలనుకుంటున్నారు. ఎన్నికల హామీల అమలుకు అవసరమైన నిధుల లెక్కలను ఆర్థికశాఖ ఇప్పటికే సిద్ధం చేసింది. ఫిబ్రవరి 20 తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే పరిస్థితుల నేపథ్యంలో ఐదారు రోజుల్లోనే బడ్జెట్ సమావేశాలను ముగించాలని సీఎం భావిస్తున్నారు. టీఆర్ఎస్ ఎన్నికల హామీలివే.. ఆసరా పెన్షన్ల మొత్తాన్ని రెట్టింపు చేస్తామని ఎన్నికల్లో టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. వికలాంగుల పెన్షన్లను రూ. 1,500 నుంచి రూ.3,016 వరకు పెంచుతామని పేర్కొంది. మిగిలిన అన్ని రకాల ఆసరా పెన్షన్లను రూ. 1,000 నుంచి రూ. 2,016 వరకు పెంచుతామని మేనిఫెస్టోలో తెలిపింది. అలాగే బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్ తేదీని 2018 వరకు పొడిగింపుతోపాటు వృద్ధాప్య పెన్షన్ అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గింపు అంశాలు టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో ఉన్నాయి. రైతుబంధు కింద ఏటా ఎకరాకు అందిస్తున్న సాయాన్ని రూ. 8 వేల నుంచి రూ. 10 వేలకు పెంపు. రూ. లక్ష వరకు పంట రుణాల మాఫీ, రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవ భృతి. ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు రూపొందించేందుకు నియమించిన కమిటీ ఇచ్చే నివేదికను అమలు చేయడం. రెడ్డి, వైశ్య కార్పొరేషన్‌తో పాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల కోసం కార్పొరేషన్ల ఏర్పాటు. వివిధ కులాల కేటగిరీ మార్పు విజ్ఞాపనల పరిశీలన. అగ్రవర్ణ కులాల్లోని పేదల అభ్యున్నతికి ప్రత్యేక పథకాల అమలు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పథకాన్ని ప్రస్తుత పద్ధతిలో కొనసాగిస్తూనే సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం నిర్మాణం కోసం రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు అందజేయడం. అటవీ ప్రాంతాల్లోని గిరిజన, గిరిజనేతర రైతుల భూ వివాదాల పరిష్కారం, యాజమాన్య హక్కుల కల్పన. పోడు భూముల విషయంలో నెలకొన్న వివాదాలకు సత్వర పరిష్కారం. వారికి ఇతర రైతులకు అందిస్తున్న ప్రయోజనాలు వర్తింపు. కంటి వెలుగు పథకం తరహాలోనే ప్రజలందరికీ ఇతర ఆరోగ్య పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా వైద్య శిబిరాల ఏర్పాటు. ప్రతి వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ రికార్డు చేసి తెలంగాణ రాష్ట్ర హెల్త్ ప్రొఫైల్ తయారీ. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు చర్య లు. సింగరేణి భూముల్లో ఇళ్లు కట్టుకున్న వారికి పట్టాలు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చి దిద్దే ప్రయత్నాలు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు. ఐకేపీ ఉద్యోగులను పర్మనెంట్ చేసి, యూనిట్ల నిర్వ హణ బాధ్యత మహిళా సంఘాలతో కలిపి ఐకేపీ ఉద్యోగులకు అప్పగింత. ఒక్కొక్కటిగా అన్నీ... ఎన్నికల హామీల అమలు విషయంలో సీఎం కేసీఆర్ అన్ని పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకొని వెంటనే అమలు చేసే హామీలు ఏమిటనే జాబితా రూపొందిస్తున్నారు. హామీల అమలు విషయంలో టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతామని పేర్కొంది. ఈ హామీ వల్ల నిరుద్యోగుల్లో అసంతృప్తి తలెత్తకుండా నియామక వయోపరిమితిని మూడేళ్లు పెంచనున్నట్లు హామీ ఇచ్చింది. పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు సముచిత రీతిలో వేతన సవరణపై నిర్ణయం తీసుకుంటామని, నిరుద్యోగలకు రూ. 3,016 భృతి చెల్లిస్తామని ప్రకటించింది. ఉద్యోగుల విషయంలో బడ్జెట్లోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. -
హఠాత్తుగా మీడియా ముందుకు లగడపాటి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అనుమానం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వీవీప్యాట్లను లెక్కిస్తే అనుమానాలు తీరతాయని అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పోలింగ్ శాతం ప్రకటించడానికి ఎన్నిక సంఘం ఒకటిన్నర రోజు ఎందుకు తీసుకుందని ప్రశ్నించారు. ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏకపక్షంగా విజయం సాధించిన తర్వాత వెంటనే జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్షం గణనీయంగా పుంజుకుందని తెలిపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనుమానాలు బలపడుతున్నాయన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తన సర్వే అంచనాలు ఎందుకు తప్పాయనే దానిపై సమీక్ష చేసుకుంటున్నానని వెల్లడించారు. తాను ఎవరి ప్రలోభాలకు లొంగే వ్యక్తిని కాదని, రాజకీయ సన్యాసానికి కట్టుబడ్డానని చెప్పుకొచ్చారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సర్వే ఫలితాలను ముందుగా ప్రకటించనని తెలిపారు. తెలంగాణలో పోటీ చేస్తా అవకాశం వస్తే తెలంగాణలో పోటీ చేస్తానని గతంలో తాను చెప్పిన మాటకు కట్టుబడానని లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. టీడీపీలో ఎప్పుడు చేరుతున్నారని విలేకరుల ప్రశ్నించగా... చాటుమాటు రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని, రాజకీయాల్లో మళ్లీ చేరాలనుకుంటే చెప్పే చేస్తానని సమాధానమిచ్చారు. ఆంధ్రజ్యోతి పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణతో పాటు ఏపీ సీఎం చంద్రబాబును రహస్యంగా కలిసి ఏం మాట్లాడారని అడగ్గా... చంద్రబాబుకు, తనకు మధ్య జరిగిన విషయాలను బయటకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అయితే చంద్రబాబును కలిసిన తర్వాత లగడపాటి హఠాత్తుగా ఢిల్లీలో మీడియాకు ముందుకు రావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. (లగడపాటితో చంద్రబాబు అర్ధరాత్రి సమావేశం) -
కాంగ్రెస్ నేతల పిటీషన్లు.. హైకోర్టు కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అక్రమాలకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్స్‌పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. తమపై గెలుపొందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ 12 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, ఒక టీడీపీ అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ అభ్యర్థులు వేసిన పిటిషన్లన్నిటిని ఒకే కేసు కింద పరిగణించి విచారిస్తామని హై కోర్టు స్పష్టం చేసింది. కొడంగల్ అధికార పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ఎన్నికల నియమావాలిని ఉల్లంఘించారని, ఎన్నికల్లో రూ. 6.5 కోట్లు ఖర్చు చేసినట్లు డైరీ దొరికిందని కాంగ్రెస్‌నేత రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా.. ధర్మపురి టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికను రద్దు చేయాలని అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ పిటిషన్ వేసారు. కొంత మంది అధికారులు కొప్పుల ఈశ్వర్‌తో కుమ్మక్కై ఈవీఎంల టాంపరింగ్ చేశారని, ఈవీఎంలు భద్రపరిచిన గదులకు కనీసం సీల్ కూడా వేయలదని, భద్రతను గాలి కొదిలేశారని పిటిషన్లో పేర్కొన్నారు. ఎన్నికల జరిగిన 45 రోజులు లోపు మాత్రమే కోర్ట్‌ను ఆశ్రయించే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ నేతలు డీకే అరుణ, దాసోసు శ్రవణ్ కుమార్, నాగం జనార్దన్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, అద్దంకి దయాకర్, ఫిరోజ్ ఖాన్ ,టీడీపీ అభ్యర్థి చంద్ర శేఖర్లు పిటిషన్లు వేసారు. -
తెలంగాణ అసెంబ్లీలో 27 కొత్త ముఖాలు
సాక్షి, హైదరాబాద్ : 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీకి డిసెంబర్ 7న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 88 స్థానాల్లో ఘన విజయం సాధించి తిరిగి అధికారంలోకి వచ్చింది. మహాకూటమి పేరుతో బరిలోకి దిగిన కాంగ్రెస్ 19 స్థానాలు, టీడీపీకి రెండు స్థానాల్లో విజయం సాధించగా.. ఎంఐఎంకి 7 స్థానాలు, బీజేపీ ఒక చోట, ఇతరులు రెండు చోట్ల విజయం సాధించారు. కాగా, ఈ ఎన్నికల్లో 27 మంది తొలిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆ వివరాలు.. తొలిసారి ఎమ్మెల్యేలు.. 1. హరిప్రియ నాయక్ - కాంగ్రెస్ (ఇల్లందు) 2. నాగేశ్వరరావు - టీడీపీ (అశ్వరావు పేట) 3. సురేందర్, కాంగ్రెస్ - (ఎల్లారెడ్డి) 4. సుంకె రవిశంకర్, టిఆర్ఎస్ - (చొప్పదండి) 5. మెతుకు ఆనంద్, టిఆర్ఎస్ - (వికారాబాద్) 6 .రోహిత్ రెడ్డి, కాంగ్రెస్ - (తాండూరు) 7. హర్షవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ - (కొల్లాపూర్) 8. కాలేరు వెంకటేష్, టిఆర్ఎస్ - (అంబర్పేట్) 9. ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ - (పాలేరు) 10. మల్లారెడ్డి, టిఆర్ఎస్ - (మేడ్చల్) 11. బాల్క సుమన్, టిఆర్ఎస్ -(చెన్నూరు) 12. వైరా రాములు నాయక్, ఇండిపెండెంట్ 13. కొరికంటి శంకర్, ఇండిపెండెంట్ (రామగుండం) 14. నరేందర్, టిఆర్ఎస్ - వరంగల్ వెస్ట్ 15. పెద్ది సుదర్శన్ రెడ్డి, టిఆర్ఎస్ - (నర్సంపేట) 16. భేతి సుభాష్ రెడ్డి, టిఆర్ఎస్ - (ఉప్పల్) 17. ముఠా గోపాల్, టిఆర్ఎస్ - (ముషీరాబాద్) 18. కృష్ణమోహన్ రెడ్డి, టిఆర్ఎస్ - (గద్వాల్) 19. నరేందర్ రెడ్డి, టిఆర్ఎస్ -(కొడంగల్) 20. బొల్లం మల్లయ్య యాదవ్, టిఆర్ఎస్ - కోదాడ) 21.కంచర్ల భూపాల్ రెడ్డి, టిఆర్ఎస్ - (నల్గొండ) 22.డాక్టర్ సంజయ్, టిఆర్ఎస్- (జగిత్యాల) 23. క్రాంతి, టిఆర్ఎస్ -(అందోల్) 24. నిరంజన్ రెడ్డి, టిఆర్ఎస్ - (వనపర్తి) 25. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ - (మునుగోడు) 26.మానిక్ రావు జహీరాబాద్, టిఆర్ఎస్ 27.కొప్పుల మహేష్ రెడ్డి, పరిగి - (టీఆర్ఎస్) -
తెలంగాణ అసెంబ్లీ తొలిరోజు షెడ్యూల్..
సాక్షి హైదరాబాద్ : తెలంగాణ రెండో శాసనసభ తొలి సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు శాసనసభ్యుల చేత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. మిగతా శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం మండలి సభ్యులు, ఎమ్మెలేయలు జూబ్లీహాలు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ శాసనసభ షెడ్యూల్.. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభాపతి ఎంపిక కోసం నామినేషన్ దాఖలు ప్రక్రియ. ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలతో కలిసి గన్‌పార్క్‌లో తెలంగాణ అమరులకు నివాళులు. 11.20కి ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభకు చేరుకుంటారు. 11.30కి ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ అధ్యక్షతన శాసనసభా సమావేశం ప్రారంభం. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. ముందుగా సీఎం కేసీఆర్ చేత ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత మహిళా సభ్యుల ప్రమాణం స్వీకారం చేశారు. అక్షర క్రమంలో మొదటగా ఉన్నా ఖానాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్, తర్వాత కాంగ్రెస్ ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ప్రమాణం చేశారు. ఆ తరువాత ఆరుగురు మహిళా సభ్యుల ప్రమాణం చేశారు. అటు తర్వాత మొదటగా ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం ప్రమాణ స్వీకారం చేశారు. చివరగా వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో తాత్కాలిక సభాపతి అహ్మద్‌ఖాన్ ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. రెండు గంటల పాటు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం కార్యక్రమం కొనసాగనుంది అనంతరం మండలి ప్రాంగణంలో జరిగే విందుకు అంతా హాజరవుతారు. తాత్కాలిక సభాపతి స్థానంలో శాశ్వత సభాపతిని ఎంపిక చేసేందుకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ల దాఖలు కార్యక్రమం ఉంటుంది. 18న శాసనసభాపతి ఎన్నిక ఉంటుంది. 19న శాసనసభ, మండలి ఉభయసభల సమావేశంలో గవర్నర్ ప్రసంగిస్తారు. 20న శాసనసభ, మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించి ఆమోదిస్తారు. -
సీఎల్పీ లీడర్‌ను రాహుల్ నిర్ణయిస్తారా..?!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత (సీఎల్పీ) ఎన్నిక సమావేశం గాంధీభవన్‌లో హాట్‌హాట్ మొదలైంది. అసెంబ్లీ కమిటీ హాల్లో కాంగ్రెస్ శాసన సభాపక్షం సమావేశమయ్యింది. శాసనసభ పక్ష నేతగా ఎవరిని నియమించాలనే నిర్ణయాధికారాన్ని పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కట్టబెడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ ప్రక్రియకు అధిష్టానం తరఫున పరిశీలకుడిగా నియమితుడైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్‌కు చేరుకుని.. సీఎల్పీ నేత ఎంపిక ప్రక్రియపై కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకుని ఏఐసీసీకి అందించారు. వాటి ఆధారంగా సీఎల్పీ నేతను అధిష్ఠానం నిర్ణయిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం ఇవాళే పూర్తవుతుందని, సాయంత్రానికల్లా సీఎల్పీ నేతను ప్రకటిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేలతో పాటు టీకాంగ్రెస్ ఇంచార్జి ఆర్సీ కుంతియా సీఎల్పీ సమావేశంలో పాల్గొన్నారు. కాగా, సీఎల్పీ నేతగా భట్టివిక్రమార్క పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు కూడా రేసులో ఉన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పేరును పార్టీలోని కొందరు ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా.. సీఎల్పీ లీడర్ పదవి తనకే కావాలంటూ పలువురు పట్టుబట్టడంతో గురువారం ఉదయం ప్రారంభమైన సీఎల్పీ సమావేశంలో గందరగోళం నెలకొంది. పాత నాయకత్వాన్ని పూర్తిగా బాధ్యతల నుంచి తప్పించి కొత్తవారికి అవకాశమివ్వాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. సీఎల్పీ నేతగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నియమించాలని అన్నారు. అయితే, సీనియర్ నాయకుడిని అయినందున సీఎల్పీ లీడర్‌గా తనకే అవకాశమివ్వాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్నానని అన్నారు. గత డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 సీట్లలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
కాంగ్రెస్‌లో విలీనమా.. ముచ్చటే లేదు
సాక్షి, హైదరాబాద్: రాజకీయ నాయకులు బట్టలు మార్చినంత సులువుగా పార్టీలు మారస్తున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఎద్దేవచేశారు. గతంలో నమ్మిన సిద్దాంత కోసం పార్టీలలో ఉండే వారని కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితుల లేవన్నారు. లోక్‌సభ ఎన్నికలు, పొత్తులు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై శనివారం నిర్వహించిన మీడియా చిట్‌చాట్‌లో కోదండరాం చర్చించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కూటమి ఓటమిపై చర్చజరగలేదని తెలిపారు. కూటమిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే విషయంపై కూడా చర్చ జరగలేదన్నారు. రానున్న ఎన్నికలపై తమ పార్టీకంటూ అంతర్గతంగా ఓ ఆలోచన ఉందన్నారు. తెలంగాణ జనసమితి ఎట్టి పరిస్థితిల్లోనూ కాంగ్రెస్‌లో విలీనం కాదని స్పష్టం చేశారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమితో తాము నిరాశచెందలేదని.. రానున్న ఎన్నికలకు సిద్దంగా ఉన్నామన్నారు. పార్టీ పెట్టిన కొద్ది నెలల్లోనే ఎన్నికలు రావడం ఓటమి చెందినట్లు భావిస్తున్నామన్నారు. సీబీసీఐడీ విచారణ జరగాలి రాష్ట్రంలో ఎన్నికల అధికారిపై కోదండరాం అనుమానం వ్యక్తం చేశారు. ఓట్ల తొలగింపుపై ఎవరు బాధ్యత వహించాలని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల అధికారిపై రాష్ట్రపతికి, కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేస్తామన్నారు. సీబీసీఐడీతో ఎన్నికల అధికారిపై విచారణకు ఆదేశించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేశారు. ఇక ఏపీ ఎన్నికలకు వెళ్లే తీరికలేదన్నారు. ఆంధ్ర ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. -
జానారెడ్డి, షబ్బీర్ అలీకి ఇంటెలిజెన్స్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలైన జానారెడ్డి, షబ్బీర్ అలీకి ఇంటెలిజెన్స్ పోలీసులు నోటీసులిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనాల వినియోగంపై రోజువారీ అద్దె, డ్రైవర్ భత్యం కింద రూ.9 లక్షలు చెల్లించాలని జానారెడ్డితో పాటు షబ్బీర్ అలీకి రాష్ట్ర ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్(ఐఎస్‌డబ్ల్యూ)విభాగం శనివారం నోటీసులందించింది. 2007లో సీఈసీ ఆదేశాల ప్రకారం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో భద్రత నిమిత్తం బుల్లెట్ ప్రూఫ్వాహనాలు సమకూర్చుకున్న నేతలు తప్పనిసరిగా సంబంధిత వాహనాల అద్దెతో పాటు డ్రైవర్లకు భత్యం చెల్లించాల్సి ఉంటుందని ఆదేశాల్లో ఉందని, ఈమేరకు బుల్లెట్ వాహనాలు వినియోగించినవారందరికీ నోటీసులు పంపించినట్టు ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన సెప్టెంబర్ 6 నుంచి డిసెంబర్ 7వరకు జానారెడ్డి, షబ్బీర్ అలీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు టీఎస్ 09పీఏ1653, టీఎస్ 09పీఏ1654 వాహనాలు ఉపయోగించారని నోటీసుల్లో పేర్కొన్నారు. షబ్బీర్ అలీ ఈ కోడ్ కాలంలో 12,728 కి.మీ వాహనంలో ప్రయాణించారని, ఇందుకు గాను ప్రతీ కిలోమీటర్‌కు రూ.37లతో పాటు డ్రైవర్ భత్యం రోజు వారీరూ.100లతో కలిపి మొత్తంగా రూ.4,79,936 చెల్లించాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ మంత్రి జానారెడ్డి కోడ్ అమల్లో ఉండగా 11,152 కి.మీలు ప్రయాణించారని, ఇందుకు గాను రూ.4,20,924 చెల్లించాలని పేర్కొన్నారు. ఇద్దరు నేతలు కలిపి మొత్తంగా రూ.9,00,860 చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. అధికార పార్టీకి సైతం రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్లో ఉన్న మంత్రులు, ఇతర వీఐపీలు వాడిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకు సైతం ఇదే రీతిలో చెల్లించాలని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు నోటీసులిచ్చినట్టు తెలిసింది. ఎవరెవరికి ఇచ్చారు? ఎంత చెల్లించాల్సి ఉంటుందన్న అంశాలపై సాక్షి ఆరాతీసేందుకు ప్రయత్నించగా సంబంధిత అధికారులెవరు అందుబాటులోకి రాలేదు. -
అసలెందుకు ఓడిపోయాం..?
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా సమీక్షించుకుంది. ఘోర పరాజయానికి గల కారణాలను నియోజకవర్గాల వర్గాల వారీగా విశ్లేషించుకుంది. ఏఐసీసీ నేతలు ఆర్సీ కుంతియా, శ్రీనివాస్ కృష్ణన్, టీపీసీసీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డిలు శుక్రవారం హైదరాబాద్‌లో జిల్లాకు చెందిన అభ్యర్థులతో సమావేశమయ్యారు. పార్టీ జిల్లా ముఖ్య నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఓటమికి గల కారణాలను ఏఐసీసీ నేతలు ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను, జిల్లా పార్టీ ముఖ్యనేతలను అడిగి తెలుసుకున్నారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని చేసిన అభ్యర్థిత్వాల ఎంపిక ఎందుకు గెలుపు తీరాలకు చేర్చలేదు.? కనీసం అభ్యర్థుల సంబంధిత సామాజికవర్గాల ఓట్‌లైనాయి ఎందుకు రాలేదు.? ఎవరైనా నేతలు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారా.? వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఉమ్మడి జిల్లా పరిధిలో తొమ్మిది నియోజకవర్గాల్లో ఒక్క ఎల్లారెడ్డి మినహా మిగిలిన ఎనిమిది చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలైన విషయం విధితమే. అభ్యర్థిత్వాల ప్రకటన ఆలస్యం కావడం, టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల వంటి అంశాలే తమ ఓటమికి కారణమైనట్లు జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు ఏఐసీసీ ముఖ్యనేతల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అతితక్కువ ఓట్లతో ఓటమి పాలైన చోట్ల వీవీపీఏటీ స్లిప్పులను లెక్కించేలా న్యాయస్థానాలను ఆశ్రయించాలనే అంశం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్, ఆ పార్టీ అభ్యర్థులు తాహెర్‌బిన్ హందాన్, డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, ఈరవత్రి అనీల్, సౌదాగర్ గంగారాం, కాసుల బాల్‌రాజ్, డీసీసీ అధ్యక్షులు కేశవేణు, బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్, గడుగు గంగాధర్, ప్రేమలత అగర్వాల్‌లు హాజరయ్యారు. స్థానికంగా లేకపోవడంతో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఈ సమావేశానికి రాలేకపోయారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. -
తలసానికి మెజారిటీ తగ్గడం బాధగా ఉంది: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : 2009లో చావునోట్లో తలపెట్టి మరీ.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. టీఆర్ఎస్ సనత్‌నగర్ నియోజకవర్గ కార్యకర్తల స్థాయి సమావేశం జలవిహార్‌లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ధన్యజీవి అని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందించిన విషయాన్ని గుర్తుచేశారు. ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ప్రధానమంత్రి, రాహుల్ గాంధీ ఇలా ఎంతోమంది నేతలు వచ్చి తెలంగాణలో ప్రచారం చేసినా.. ప్రజలు కేసీఆర్‌కే పట్టం కట్టారని పేర్కొన్నారు. ప్రజల కోసం నిర్విరామంగా కృషి చేసే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఈసారి మెజారిటీ తగ్గడం తనకు బాధ కలిగించిందన్నారు. ‘నిత్యం ప్రజల్లోనే ఉండే తలసానికి భారీ మెజారిటీ వచ్చి ఉండేది. కానీ, రాష్ట్రంలో, హైదరాబాద్ నగరంలో లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతు అయ్యాయి. మొత్తం 22 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. ఎన్నికల సంఘం ఆ తప్పును తిరిగి సవరించుకుంటోంది. ఈవీఎంలను తప్పుబట్టే ప్రతిపక్షాలకు, బుర్ర తుప్పుపట్టిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రతి గెలుపు నుంచి ఓటమి నుంచి పాఠాలు, గుణపాఠాలు నేర్చుకోవాలని, అంతేకానీ, ఓటు వేయని ప్రజలను ప్రశ్నించే హక్కు ఎవరికీ ఉండదని ఆయన హితవు పలికారు. -
‘మోదీకి మద్దతుగానే కేసీఆర్ వెళ్లారు’
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, జాతీయ ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ ఆర్సీ కుంతియా తెలిపారు. అన్ని రాష్ట్రాల పార్టీల నాయకులను కూడా కలుస్తామన్నారు. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ఓట్లతో ఓటమి చెందిన అభ్యర్థులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని అన్నారు. 38 ఈవీఎంలు పనిచేయలేదని, పోలింగ్ ఓట్లకు కౌంటింగ్ ఓట్లకు చాలా తేడా వచ్చిందన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ తప్పులతో 22 లక్షల ఓట్లు కోల్పోయామని వాపోయారు. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట ఓట్లు తొలగించారని ఆరోపించారు. మోదీకి మద్దతుగానే సీఎం కేసీఆర్.. ఒడిశా, బెంగాల్ వెళ్లారని ఆరోపించారు. మోదీకి బీ టీమ్‌గా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు కుంతియా తెలిపారు. ధర్మపురి, తుంగతుర్తి, కోదాడ, ఇబ్రహీంపట్నం తక్కువ ఓట్ల తో ఓడిపోయామని.. దీనిపై న్యాయం పోరాటం చేస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. స్లిప్పులను లెక్కించాలని సుప్రీంకోర్టు చెప్పిన ఇప్పటి వరకు ఈసీ ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు. గెలిచిన ఎమ్మెల్యేలు రానున్న పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేస్తారని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లు తగ్గించడంపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సలీమ్ అహ్మద్, జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, షబ్బీర్ అలీ, సంపత్‌కుమార్, పద్మావతి రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, పొన్నం ప్రభాకర్, అద్దంకి దయాకర్, దామోదర్ రెడ్డి, ప్రేమ్‌సాగర్ రావు, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
పొంగి పొర్లింది!
మహబూబ్‌నగర్ క్రైం : ఈ ఏడాది జిల్లాలో మద్యం ఏరులై పారింది. ఈ ఏడాది కాలానికి మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులకు కాసుల పండింది. రెండేళ్ల కాలానికి వైన్స్ అనుమతులు ఇవ్వగా.. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో గతంలో ఎన్నడూ లేని విధం గా మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. దీంతో అటు ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూర గా.. వైన్స్ యాజమానులకు కూడా కాసుల పంట పండింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అమ్మకాలు జరగడం విశేషం. ఈ మేరకు ప్రస్తుత ఏడాదిలో మద్యం అమ్మ కాలు, ఎక్సైజ్ శాఖ పనితీరుపై ప్రత్యేక కథనం. గత ఏడాది అక్టోబర్ నుంచి.. వైన్స్‌ల అనుమతులు గత ఏడాది అక్టోబరు 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ అనుమతులు 2019 సెప్టెంబర్ 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో గత సెప్టెంబర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల వాతావరణం మొదలు కావడంతో ‘ఆనవాయితీ’ ప్రకారం మద్యం పంపిణీ కోసం నేతలు కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన నాయకులు ముందుగానే మద్యం డంప్‌లు దించేశారు. అటు వైన్స్ యాజమాన్యాలు కూడా ముందస్తుగా భారీగా మద్యం నిల్వలు దిగుమతి చేసుకున్నారు. ఇక ఎన్నికల వేళ అమ్మకాలు జోరుగా సాగాయి. ఈ మేరకు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో రూ.1,100.10 కోట్ల విలువైన మద్యం విక్రయించారు. ఇక త్వరలోనే పంచాయతీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు రానుండడంతో కొత్త ఏడాదిలో కూడా మద్యం అమ్మకాలు భారీగా సాగే అవకాశముంది. 2019లో కూడా మద్యం అమ్మకాలు ఇదే స్థాయిలో కొనసాగితే అమ్మకాలు ఉంటే దీని విలువ ఉమ్మడి జిల్లా నుంచి 2018, 2019 ఏళ్లకు గాను రూ.2,300 కోట్లకు చేరే అవకాశముంది. దుకాణాదారులకు కాసుల పంట ఈ దఫా లైసెన్స్ పొందిన వైన్స్ యజమానులకు అదృష్టం కలిసొచ్చినట్లే చెప్పాలి. ఏడాదికి రూ.45లక్షల లైసెన్స్ ఫీజుగా నిర్దేశించగా రెండేళ్ల కాలపరిమితికి రూ.90లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ చెల్లించేందుకు కావాల్సిన నగదును యజమానులు కేవలం ఈ ఒక్క నవంబర్ నెలలో సంపాదించినట్లు చెబుతున్నారు. ఇక వచ్చే అక్టోబర్ 1వ వరకు ప్రస్తుత లైసెన్సుల కాలపరిమితి ఉంది. ఈ మేరకు త్వరలోనే పంచాయతీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, ప్రాథమిక సహకార సంఘాలు(పీఏసీఎస్) ఎన్నికలే కాకుండా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీల ఎన్నికలు ఉండడంతో మద్యం అమ్మకాలు జోరుగా సాగడం.. వైన్స్ యాజమాన్యాలకు కాసుల వర్షం కురవడం ఖాయమని తెలుస్తోంది. ఈ ఏడాది రికార్డులో ఆదాయం గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది మద్యం అమ్మకాల ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రికార్డు స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. గతంలో జిల్లాలో రూ.800కోట్ల నుంచి రూ.900కోట్ల వరకు అమ్మకాలు సాగేవి. కానీ ఈ ఏడాది ఏకంగా రూ.1,100.10 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి. 2015 అక్టోబర్ నుంచి 2016 సెప్టెంబర్ వరకు ఉమ్మడి జిల్లాలో రూ.872.93 కోట్ల విలువైన అమ్మకాలు సాగగా, 2016 అక్టోబర్ నుంచి 2017 అక్టోబర్ వరకు రూ.959.16 కోట్ల అమ్మకాలు జరిగాయి. జిల్లాలో 2016 కంటే 2017 ఏడాదిలో అమ్మకాలు పెరగగా.. ఈ ఏడాది ఇది మరింత పెరగడం గమనార్హం. ఉన్నతాధికారుల మన్ననలు 2018లో జిల్లాలో ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ ఉద్యోగుల పనితీరు ఉన్నతాధికారుల మన్ననలు అందుకుంది. ఈ ఏడాది ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన 100రోజుల యాక్షన్ ప్లాన్‌ను జిల్లా అధికారు విజయవంతంగా అమలు చేశారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆబ్కారీ శాఖకు అవసరమైన సిబ్బంది లేకపోయినా.. ఎక్కడ కూడా సమస్య తలెత్తకుండా విధులు నిర్వర్తించారు. పక్కా ప్రణాళికతో విధులు నిర్వర్తించడం ద్వారా అక్రమ మద్యం సరఫరాను అడ్డుకోవడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యంతో ఎక్సైజ్ పోలీసులు (ఫైల్) ఏడాది మొత్తం కష్టపడ్డాం ఈ ఏడాది కాలంలో మొత్తం ఎన్నడూ లేని విధంగా కష్టపడ్డాం. ఇదే ఏడాదిలో వంద రోజుల ప్రణాళిక, అసెంబ్లీ ఎన్నికలు రావడం వల్ల ప్రణాళికాయుతంగా విధులు నిర్వర్తించాం. దీంతో మంచి ఫలితాలు వచ్చాయి. మా పనితీరును కమిషనర్ అభినందించారు. ఎన్నికల సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా అడ్డుకున్నాం. 24గంటల పాటు మా శాఖ ఉద్యోగులు ప్రతి ఒక్కరు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. – జయసేనారెడ్డి, డీసీ, ఉమ్మడి మహబూబ్‌నగర్ -
రాజకీయ రణరంగం
ముందస్తు ఎన్నికలతో 2018 చివరి ఐదు నెలలు రాష్ట్ర రాజకీయాలను ఆసక్తికరంగా మార్చాయి. ఈ ఎన్నికల నామ సంవత్సరం అధికార టీఆర్ఎస్ను మరింత ఉత్తేజితం చేసి అధికారాన్ని అప్పగించింది. 2018లో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ అనుకూల రాజకీయ పరిణామాలే చోటుచేసుకున్నాయి. కేసీఆర్ వ్యూహాలతో.. డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ తెలంగాణ ఛాంపియన్‌గా నిలిచింది. జమిలి ఎన్నికల నినాదం దేశమంతటా వినిపిస్తున్న వేళ ఈ ఏడాది రాష్ట్రంలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఘనవిజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను మరోమారు సీఎంగా ఎంచుకున్నారు. దీనికితోడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని, హైదరాబాద్‌లో ఉండి ఢిల్లీలో భూకంపం సృష్టిస్తానంటూ కేసీఆర్ ఈఏడాదిలోనే ‘ఫెడరల్ ఫ్రంట్’జాతీయనేతగా తన ప్రయాణాన్ని మొద లుపెట్టారు. అటు, టీఆర్ఎస్ దెబ్బకు రాష్ట్రంలో ప్రతిపక్షాలు చిత్తయిపోయాయి. కాంగ్రెస్ మరోమారు పరాభవం పొందగా, కేంద్రంలో అధికారంలో ఉన్నా కమలనాథులు రాష్ట్రంలో కనీస ప్రతిభ చూపలేకపోయారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో సీఎం కేసీఆర్ దేశ వ్యాప్త పర్యటనలు, అసెంబ్లీ నుంచి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వం రద్దు, తెలంగాణ జనసమితి పేరిట ప్రొఫెసర్ కోదండరాం కొత్త పార్టీ, సీపీఎం జాతీయ మహాసభలు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌కు పట్టాభిషేకం, ముగ్గురు రాజ్యసభ సభ్యుల ఎన్నిక, ఎన్నికల వేళ రాజకీయ హడావుడి, జంపింగ్‌లు జపాంగ్‌లతో పార్టీలు మారిన నేతలు వంటి ఘటనలతో 2018 ఎన్నికలనామ వత్సరంగా మిగిలిపోయింది. టీఆర్ఎస్ అడ్డాగా తెలంగాణ 2018 సంవత్సరం టీఆర్ఎస్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా నిలిచిపోయింది. ఉద్యమంతో రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా 2014 ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఆశీర్వాదం పొందిన టీఆర్ఎస్కు.. 2018 మరో అతిపెద్ద విజయాన్ని అందించింది. కుటుంబ పాలన, అవినీతి అక్రమాలంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా తెలంగాణ ప్రజానీకం కేసీఆరే తమ ఛాంపియన్‌గా నిర్ణయించారు. 8 నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ కేసీఆర్ తీసుకున్న సాహసో పేత నిర్ణయానికి జైకొట్టారు. 2014 ఎన్నికల్లో 63 స్థానాల్లో గెలిపించిన టీఆర్ఎస్కు ఇప్పుడు ఏకంగా 88 స్థానాలను కట్టబెట్టి తెలంగాణ గడ్డ.. టీఆర్ఎస్ అడ్డా అనే రీతిలో తీర్పునిచ్చారు. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడంతో టీఆర్ఎస్ పరిస్థితిలో కూడా పూర్తి మార్పు వచ్చి బలీయశక్తిగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనిచేసిన నలుగురు మంత్రులు మాత్రమే ఓటమి పాలుకాగా, చాలా మంది కొత్త నేతలు శాసనసభకు ఎన్నికయ్యారు. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలపై పట్టును నిరూపించుకున్న టీఆర్ఎస్.. హైదరాబాద్‌లోనూ తమకు తిరుగులేదని చాటిచెప్పింది. ఎలాగూ ఉత్తర తెలంగాణలో సంస్థాగతంగా పూర్తిస్థాయిలో బలంగా ఉన్న గులాబీ పార్టీ దక్షిణ తెలంగాణలో లభించిన అనూహ్య విజయంతో పూర్తిస్థాయిలో కుదురుకుంటుందనేది రాజకీయ నిపుణుల అంచనా. ఇక పార్టీ పరంగా కూడా కీలక మార్పులకు 2018 వేదిక అయ్యింది. ఎన్నికల ఫలితాల అనంతరం.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌కు పట్టాభిషేకం జరిగింది. రెండు, మూడేళ్ల నుంచి ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న కార్యక్రమం పూర్తికావడంతో టీఆర్ఎస్కు రెండోబాస్గా కేటీఆర్ మరింత క్రియాశీలమవుతున్నారు. దీంతో పాటు పార్టీ అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించి పావులు కదుపుతుండటం గమనార్హం. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు పేరుతో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమి ఏర్పాటు కోసం కేసీఆర్ దేశ వ్యాప్త పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్‌కు రెండో‘సారీ’ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు మాత్రం ఈ ఏడాది చేదు అనుభవాలనే మిగిల్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా వరుసగా రెండోసారి ఆ పార్టీని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. అధికారం దక్కుతుందనే కోటి ఆశలతో టీడీపీ సహా పలు పార్టీలతో పొత్తులు పెట్టుకుని పోరాడినా పెద్దగా కలసిరాలేదు. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ బాధ్యతలు చేపట్టిన సంవత్సరంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుబాటలో పయనిస్తే ఇక్కడ మాత్రం బోల్తాకొట్టింది. ఎన్నికల్లో ఓటమితో కేడర్ పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోగా, కనీసం ప్రక్షాళన చేసేందుకు అధిష్టానం ముందుకు రాకపోవడం, సమీక్షించుకుని మళ్లీ రణరంగంలో దిగేందుకు టీపీసీసీ ముఖ్యులు కూడా ఆసక్తి చూపకపోవడం ఆ పార్టీని గందరగోళంలో పడేసింది. పార్టీ పరంగా కూడా కాంగ్రెస్‌కు ఈ ఏడాది పెద్దగా కలిసివచ్చిందేమీ లేదు. ఎన్నికలు జరిగినప్పటికీ పార్టీ నుంచి ఎంత మంది వచ్చారో.. అంతే మంది పార్టీని వీడి వెళ్లిపోయారు. ఎన్నికలకు ముందు పార్టీ కొత్త సైన్యాన్ని ఏర్పాటు చేయడం, రేవంత్‌రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం లాంటి పరిణామాలు తప్ప పెద్దగా జరిగిందేమీ లేకపోవడం గమనార్హం. మీ సోపతి.. మాకొద్దు ‘బాబో’య్ రాష్ట్ర రాజకీయాల్లో 2018లో జరిగిన కీలక పరిణామం.. తెలంగాణ ప్రజలు చంద్రబాబుతో సావాసాన్ని అంగీకరించకపోవడమే. తెలంగాణ వ్యవహారాల్లో తలదూర్చాలన్న ఆలోచనతో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబును తెలంగాణ ప్రజలు పూర్తిస్థాయిలో తిరస్కరించారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకు కాంగ్రెస్‌ను కలిపి కుమ్మేశారు. చంద్రబాబు ప్రచార పటాటోపాలకు ఏమాత్రం తలొగ్గని తెలంగాణ ప్రజలు ఆయనతో సోపతి మాకు వద్దంటే వద్దని తేల్చేశారు. దీంతో 2014 ఎన్నికల్లో 15 అసెంబ్లీ స్థానాలను గెల్చుకున్న టీడీపీ ఈసారి రెండు స్థానాలకే పరిమితమైంది. నేతలు పార్టీ మారినా కేడర్పోలేదని, తమ ఓట్లు తమకున్నాయని గొప్పలు చెప్పుకున్న తమ్ముళ్ల గూబగుయ్‌మనేలా ప్రజలు తీర్పునిచ్చారు. పైన ఉన్నా.. ఇక్కడ సున్నా 2018 కమలనాథులను కోలుకోలేని దెబ్బ కొట్టింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మోదీ చరిష్మాతోనయినా కొంతమేర గట్టెక్కుదామని ఆశించిన రాష్ట్ర బీజేపీ నేతలకు అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి. దక్షిణ భారతదేశంలో కాషాయదళం పాగా వేసేందుకు ప్రయోగాత్మకంగా తెలంగాణను బీజేపీ ఎంచుకుందన్న ప్రచారం జరిగినా.. బీజేపీ మాత్రం ఉన్నస్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో పాటు కేంద్రమంత్రులు ప్రచారం చేసినా తెలంగాణ ప్రజలు బీజేపీని స్వీకరించలేదు. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి సహా ముఖ్య నాయకులు కూడా ఓడిపోయారు. రాష్ట్రంలో మళ్లీ సున్నా నుంచి ప్రారంభించుకోవాల్సిన పరిస్థితి బీజేపీకి తప్పలేదు. ఇక, పార్టీ పరంగా కూడా ఈ ఏడాది చెప్పుకోదగిన పరిణామాలేవీ సంభవించలేదు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లలో టికెట్లు రాని నేతలు ఎన్నికల వేళ పార్టీలో చేరడం మినహా బీజేపీకి 2018లో కలిసివచ్చిందేమీ కనిపించలేదు. కమ్యూనిస్టులు ఖతమే! ఈ ఏడాది రాజకీయంగా తీవ్రంగా నష్టపోయింది కమ్యూనిస్టులే. కాంగ్రెస్‌తో గుడ్డిగా పొత్తు కుదుర్చుకుని సీపీఐ, సామాజిక న్యాయం ఎజెండా అంటూ బీఎల్ఎఫ్ పేరుతో కూటమి కట్టిన సీపీఎంలు బొక్కబోర్లా పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రెండో అసెంబ్లీలోనే వారి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ప్రతిపక్ష ఓట్లు చీలుస్తామని, ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోలేమని తెలిసినా కులాల వారీ టికెట్లు కేటాయించి సీపీఎం తన ఉనికిని కోల్పోయే పరిస్థితికి చేరుకోగా, సీపీఐ మాత్రం కాంగ్రెస్‌తో జట్టుకట్టినా ఫలితం లేకుండా పోయింది. ఎంఐఎంకు మాత్రం 2018 మంచి మిత్రుడిని తెచ్చిపెట్టింది. టీఆర్ఎస్ రూపంలో లభించిన దోస్తానాతో మంచి ఉత్సాహంతో ఎన్నికలకు వెళ్లిన ఎంఐఎం పాతబస్తీలో మరోమారు తన పట్టు నిరూపించుకుంది. 2018లో జరిగిన ముఖ్య రాజకీయ ఘటనలు మార్చి 4: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని ప్రకటించిన సీఎం కేసీఆర్. అందుకే కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి. మార్చి 12: శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగ సమయంలో కాంగ్రెస్ సభ్యుల ఆందోళన. కాంగ్రెస్ సభ్యులు విసిరిన హెడ్‌ఫోన్ తగిలి మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయం. మార్చి 13: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్. సంపత్‌కుమార్‌ల శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీ నిర్ణయం. సీఎల్పీ నేత జానారెడ్డితో పాటు 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెన్షన్. ఆరుగురు ఎమ్మెల్సీలపై కూడా చర్యలు. మార్చి 23: జె.సంతోశ్, బడుగుల లింగయ్య, బండా ప్రకాశ్‌లు రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక. ఏప్రిల్ 2: తెలంగాణ జనసమితి పార్టీ పేరును ప్రకటించిన కోదండరాం. అదే నెల4వ తేదీన పార్టీ జెండావిష్కరణ. ఏప్రిల్ 18: హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో సీపీఎం జాతీయ మహాసభలు ప్రారంభం. ఐదు రోజుల పాటు సభలు. ఏప్రిల్ 27: కొంపల్లిలో టీఆర్ఎస్ ప్లీనరీ. హైదరాబాద్‌లోనే ఉండి ఢిల్లీలో భూకంపం పుట్టిస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్. మే 2: ఫెడరల్‌ఫ్రంట్ రూపకల్పనలో భాగంగా హైదరాబాద్‌లో కేసీఆర్‌ను కలిసిన యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్. మే 23: కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమం. తొలిసారి బహిరంగంగా ఒకేచోట కనిపించిన రాహుల్, చంద్రబాబు. జూన్ 28: విజయవాడ వెళ్లి కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించిన సీఎం కేసీఆర్. వజ్రఖచిత ముక్కుపుడక సమర్పణ. జూలై 27: గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు గజం రూ.100 చొప్పున జిల్లా కేంద్రాల్లో ఎకరానికి మించకుండా ప్రభుత్వ భూమి కేటాయించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం. ఆగస్టు 4: ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసిన సీఎం కేసీఆర్. జమిలి ఎన్నికలపై చర్చ. ఆగస్టు 13, 14: హైదరాబాద్‌కు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. స్వయం సహాయక సంఘాల మహిళలు, సెటిలర్లతో భేటీలు. సరూర్‌నగర్ స్టేడియంలో నిరుద్యోగ గర్జన. ఆగస్టు 22: ప్రగతి భవన్లో మంత్రివర్గ సహచరులతో ఏడుగంటలపాటు సీఎం కేసీఆర్ సుదీర్ఘ భేటీ. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే అధికారాన్ని కేసీఆర్‌కు అప్పగించిన మంత్రివర్గ సహచరులు. ఆగస్టు 24: టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర నాయకత్వంతో సమావేశమయిన కేసీఆర్. ఆగస్టు 25: ఢిల్లీ వెళ్లి ప్రధానితో కేసీఆర్ ముందస్తుపై భేటీ. సెప్టెంబర్ 2: కొంగరకలాన్‌లో టీఆర్ఎస్ ప్రగతినివేదన సభ. సెప్టెంబర్ 5: ముందస్తు ఎన్నికలు వస్తాయనే అంచనాతో సన్నబియ్యం, సొంతిల్లు లాంటి ప్రజాకర్షక హామీలు ప్రకటించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. సెప్టెంబర్ 6: శాసనసభను రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం. 8 నెలల 26 రోజుల ముందే సభను రద్దు చేస్తూ కేబినెట్ చేసిన తీర్మాన కాపీని గవర్నర్‌కు అందజేసిన సీఎం కేసీఆర్. వెంటనే 105 మంది టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన. సెప్టెంబర్ 7: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సెప్టెంబర్ 19: ఎన్నికల సైన్యాన్ని ప్రకటించిన కాంగ్రెస్. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా భట్టి, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డి, పొన్నం నియామకం. అక్టోబర్ 4: ఎన్నికల నగారా ఆలంపూర్ నుంచి ప్రారంభించిన కాంగ్రెస్. అక్టోబర్ 10: రాష్ట్రంలో ఎన్నికలకుషెడ్యూల్ విడుదల. నవంబర్ 5: ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ. నవంబర్ 12: 65 మందితో కాంగ్రెస్, 9 మందితో టీడీపీ అభ్యర్థుల తొలిజాబితా విడుదల. నవంబర్ 20: టీఆర్ఎస్కు ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజీనామా. నవంబర్ 23: మేడ్చల్ కాంగ్రెస్ బహిరంగసభ. హాజరయిన సోనియా, రాహుల్. నవంబర్ 27: నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో ప్రధాని మోదీ బహిరంగసభలు. ప్రజాకూటమి మేనిఫెస్టో విడుదల. డిసెంబర్ 7: ప్రశాంతంగా శాసనసభకు ఎన్నికలు. డిసెంబర్ 11: ఎన్నికల ఫలితాలు విడుదల. 88 స్థానాలతో ఘనవిజయం సాధించిన టీఆర్ఎస్. కాంగ్రెస్‌కు 19, ఎంఐఎంకు 7, టీడీపీ 2, బీజేపీ 1, ఇతరులు రెండు స్థానాల్లో గెలుపు. డిసెంబర్ 13: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్. మంత్రిగా ప్రమాణం చేసిన మహమూద్ అలీ. డిసెంబర్ 14: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ ఎన్నిక. -
అసెంబ్లీ ఎన్నికలు: కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలు అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో టీ బీజేపీ నేతలు గురువారం కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు లక్షలమంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్ తొలగించిందని, అధికార పార్టీకి అనుకూలంగా ఉండేవిధంగానే ఈ ప్రక్రియ జరిగిందని బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మజ్లిస్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఉన్న ఓటర్ల సంఖ్య పెరిగిందని, అదే బీజేపీ ప్రాబల్యమున్న చోట్ల ఓట్లసంఖ్య తగ్గడం పలు అనుమానాలకు తావిస్తోందని వారు ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. ఓటర్ల తొలగింపు విషయంలో పొరపాట్లు దొర్లాయని, అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయారని అంగీకరిస్తూ.. రాష్ట్ర ఎన్నికల అధికారి క్షమాపణలు కూడా కోరారని, ఓటర్ల జాబితా విషయమై జరిగిన అక్రమాలకు ఇదే నిదర్శనమని బీజేపీ నేతలు పేర్కొన్నారు. తాము లేవనెత్తిన అంశాలను పరిశీలించి.. తగిన నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల కమిషనర్ తమకు హామీ ఇచ్చినట్టు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. ఎన్నికల ఓటర్ల నమోదు, తొలగింపు అంశంలో జరుగుతున్న అవకతవకలను బీజేపీ ఎప్పటికప్పుడు లేవనెత్తుతూనే వచ్చిందని, సాంకేతికత విషయంలో ఎదురయ్యే లోపాలను సరి చేయాలన్నదే బీజేపీ ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ తరహాలో ఈవీఎంలపై తమకు అనుకూలమైన సందర్భంలో ఒకలాగా, వ్యతిరేకంగా ఫలితాలు వచ్చిన సందర్భంలో మరోలాగా తాము మాట్లాడబోమని ఆయన చెప్పారు. -
మభ్యపెట్టి విజయం సాధించారు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను తాత్కాలికంగా మభ్యపెట్టి, ప్రలోభాలకు గురిచేసి టీఆర్ఎస్ అనుకున్న విజయాలు సాధించిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ధ్వజమెత్తారు. అయితే ఈ ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు టీఆర్ఎస్కు శాశ్వతంగా అధికారాన్ని కట్టబెట్టలేదన్న విషయాన్ని గ్రహించాలన్నారు. సంక్షే మ పథకాలను ఒక భిక్ష రూపంలో కాకుండా సొంత కాళ్లపై నిలబడేలా చేయగలిగినప్పుడే ప్రయోజనం ఉంటుందని చెప్పారు. అది సోషలిజం వ్యవస్థలోనే సాధ్యమని, దానికోసం కృషి సాగించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడబోయే విశాల ఐక్యవేదిక విచ్ఛిన్నం చేసే పనిని సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యమైతే గత నాలుగున్నరేళ్లుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎందుకు బలపరచారో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం మఖ్దూంభవన్‌లో సీపీఐ 93వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ పతాకాన్ని సురవరం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కమ్యూనిస్టు ఉద్యమం ఆటుపోట్లను, సవాళ్లను ఎదుర్కుంటున్నదని, ప్రతి అపజయం నుంచి కొత్త గుణపాఠం నేర్చుకుని ముందుకు సాగాలన్నారు. కమ్యూనిస్టు ఉద్యమం సవాళ్లను ఎదుర్కొంటున్నా జాతీయ స్థాయిలో బీజేపీ ఫాసిస్ట్ విధానాలు, ప్రజా వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. మిలిటెంట్ ఉద్యమాలకు సిద్ధం కావాలి: చాడ బీజేపీ మతోన్మాద విధానాలు ఎండగట్టేందుకు మిలి టెంట్ తరహా ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కోరారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణతో పాటు ప్రజలందరికీ మౌలిక అవసరాలు తీర్చేందుకు పోరాటాలు చేపట్టాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పల్లా వెంకటరెడ్డి, పశ్యపద్మ, టి. శ్రీనివాసరావు, కందిమళ్ల ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్లో.. కొత్త ముచ్చట!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : శాసనసభకు తాజాగా జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలకు తొమ్మిది స్థానాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్లో ఇప్పుడో కొత్త ముచ్చట నడుస్తోంది. ఎన్నికల్లో అభ్యర్థులకు సహకరించిన వారెవరు, కోవర్టు రాజకీయాలకు పాల్పడిన వారెవరన్న చర్చ జోరుగా సాగుతోంది. ఎన్నికల్లో ఆ పార్టీ మంచి విజయాలను సొంతం చేసుకున్నా.. గెలిచిన చోట కూడా అభ్యర్థులకు సహకరించని వారు, ఇబ్బందుల పాలు చేసిన సంఘటనలు తదితర అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. ఓటమి పాలైన నకిరేకల్ నియోజకవర్గంలో కొందరు నాయకులు పార్టీ అభ్యర్థి విజయం కోసం ఏమాత్రం చిత్తశుద్ధితో పనిచేయలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే.. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలపై పార్టీ వర్గాలు హాట్ హాట్‌గా చర్చించుకుంటున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి ఈ సారి ఎనిమిదో విజయం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించారు. టీఆర్ఎస్కే చెందిన ఓ నాయకుడు కాంగ్రెస్ శిబిరానికి లోపాయికారీగా సహకారం అందించారని, గులాబీ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సిం హయ్య గత ఎన్నికల్లో ఓడిపోయినా.. ఈసారి గెలిచి తీరాలన్న పట్టుదలతో ముందునుంచీ ప్రణాళికాబద్ధంగా పనిచేసుకుంటూ వెళ్లారు. అయితే, స్థానికేతరుడన్న కారణంతో మొదట ఇక్కడి నాయకత్వం ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించింది. కానీ, అప్పటికి ఆపద్ధర్మ మంత్రిగా ఉండిన జి.జగదీశ్‌రెడ్డి చొరవతో ఈ గొడవ సద్దుమణిగింది. నోముల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన నాయకులందరితో మాట్లాడిన జగదీశ్‌రెడ్డి వారి చేతులు కలిపించారు. ఫలితంగా నాయకులంతా ఏకతాటిపై నిలబడి అభ్యర్థి విజయం కోసం పనిచేశారు. అయితే.. ఇక్కడే అనుకోని ఓ పరి ణామం చోటు చేసుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏం జరిగింది..? అభ్యర్థులకు చేదోడు వాదోడుగా ఉంటారని కొందరు సీనియర్ నాయకులకు ఎన్నికల బాధ్యతలు అప్పజెప్పారు. ఇలా కొద్ది రోజులపాటు ఎన్నికల వ్యవహారాలు చూసిన ఓ నాయకుడి వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన అభ్యర్థి, ఇతర నేతలు.. పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారని సమాచారం. దీంతో ఆయనను ఆ బాధ్యతలనుంచి తప్పించి, శాసనమండలి సభ్యుడు కర్నె ప్రభాకర్‌కు సాగర్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్ బాధ్యతలు అప్పజెప్పారు. ఈ విషయాలన్నీ బయటకు కనిపించినవే, కార్యకర్తలు అందరికీ తెలిసినవే. అయితే.. ఆ నాయకుడు ఏకంగా ఎదుటి పక్షానికి తమ సొంతింటి సమాచారం, ఎప్పటికప్పుడు.. ఏం జరుగుతుందో చేరవేశాడన్నది ప్రధాన అభియోగం. దీంతోపాటు అభ్యర్థి ఎన్నికల ఖర్చుల కోసం అప్పజెప్పిన బడ్జెట్లో కొంత చేతివాటం కూడా ప్రదర్శించారని చెబుతున్నారు. ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పజెప్పిన సమయంలోనే, ఎన్నికల ఖర్చుల డబ్బులు కూడా అప్పజెప్పాలని చూసినా, డబ్బుల వ్యవహారం చూసే బాధ్యత తనకు వద్దని, అభ్యర్థికే ఆ డబ్బులు ఇవ్వాలనడంతో పార్టీ అభ్యర్థి నోములకే ఇచ్చారని తెలుస్తోంది. అయితే, ఎంత ఖర్చయ్యింది..? మిగిలింది ఎంత..? ఎంత అప్పజెబుతున్నారో లెక్కలు తీస్తే కనీసం రూ.50లక్షల తేడా కొట్టిందని, ఈ మొత్తం సదరు నాయకుడి చేతివాటం ఫలితమే అన్న నిర్ధారణకు వచ్చారని తెలుస్తోంది. ఈ విషయం మొత్తాన్ని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇక, హుజూర్నగర్ నియోజకవర్గంలోనూ ఓ నాయకుడు అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి దగ్గర ఖర్చుల పేర ప్రతి రోజూ కొంత లెక్క తేడా చూపించారని పార్టీ శ్రేణుల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. నకిరేకల్‌లోనూ తెరవెనుక మంత్రాంగం ఈ ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. పార్టీ గుర్తు కారును పోలిన ట్రక్ చేసిన నష్టం వల్లే ఓడిపోయినట్లు ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినా, దానికంటే కొందరు టీఆర్ఎస్ నాయకులే లోపాయికారీగా, తెరవెనుక చేసిన మంత్రాంగం వల్లనే ఎక్కువ నష్టం జరిగిందన్న అభిప్రాయం బలం గా ఉంది. నాగార్జునసాగర్ లో టీఆర్ఎస్ విజయం సాధించినా, అక్కడా ట్రక్ గుర్తు 9,818 ఓట్లు చీల్చింది. దీంతో టీఆర్ఎస్ మెజారిటీ తగ్గింది. తుంగతుర్తి నియోజకవర్గంలో ట్రక్ 3,729 ఓట్లు చీల్చినా అక్కడా అభ్యర్థి విజయం సాధించారు. కానీ, నకిరేకల్ నియోజకవర్గంలో ట్రక్ 10,383 ఓట్లు చీల్చడంతోపాటు కొందరు నాయకుల సహాయ నిరాకరణ, తమ అనుచరులను కాంగ్రెస్‌కు పనిచేయాలని పురమాయించడం వంటి చర్యలు దెబ్బకొట్టాయన్న నిర్ధారణకు వచ్చారని చెబుతున్నారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో గెలిచిన, ఓడిన తమ పార్టీ అభ్యర్థులకు జరిగిన కోవర్ట్ రాజకీయంపై, సదరు నాయకులపై పార్టీ అధినాయకత్వం తీవ్రంగానే ఆలోచిస్తోందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. -
కులాల వారీ టికెట్లు సరికాదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కులాల ప్రాతిపదికన అభ్యర్థులను పోటీకి నిలబెట్టి రాష్ట్ర నాయకత్వం తీరును సీపీఎం కేంద్ర కమిటీ తీవ్రస్థాయిలో తప్పుబట్టింది. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ప్రయోగం పేరిట కులం, సామాజిక అంశాలకు తప్ప మరే అంశానికి రాష్ట్ర నాయకత్వం ప్రాధాన్యతనివ్వకపోవడం పార్టీ మౌలిక విధానాలకు పూర్తి భిన్నంగా ఉందని ధ్వజమెత్తింది. ఇది పార్టీ వర్గ సమస్యకు ఇచ్చే ప్రాధాన్యాన్ని మరుగునపరిచినట్టు అయ్యిందని తన నివేదికలో పేర్కొంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సీపీఎం–బీఎల్ఎఫ్ కూటమి 107 స్థానాల్లో పోటీచేసి, ఒక్క సీటునూ గెలుచుకోలేకపోగా, అత్యధిక స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆ పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లోనే రాష్ట్ర పార్టీ తీరును తప్పు బట్టగా.. తాజాగా సీపీఎం అత్యున్నత నిర్ణాయక మండలి కేంద్ర కమిటీ నివేదికలో కూడా రాష్ట్ర నాయకత్వ తీరును ఎండగట్టింది. ఈ ఎన్నికల్లో సీపీఎం 26, బీఎల్ఎఫ్ 81 సీట్లలో కూటమిగా పోటీచేసి కేవలం 0.43 శాతం ఓట్లే సాధించడాన్ని కూడా ప్రస్తావించింది. కులాలు, సామాజికవర్గాల ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయడంతో కులాల ఆధారంగానే ఈ కూటమి ఏర్పడిందనే భావన కలిగేందుకు ఆస్కారం ఏర్పడిందని పేర్కొంది. వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తిని సీఎం అభ్యర్థిని చేస్తామని కూటమి ప్రకటించడాన్ని తప్పుబట్టింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లోని కమిటీలు ఫలితాలను సమీక్షించి నివేదికను జాతీయ నాయకత్వానికి పంపించాక, పార్టీ చూపిన ప్రదర్శనపై సమగ్ర సమీక్షను నిర్వహించనున్నట్టు సీపీఎం కేంద్ర కమిటీ స్పష్టంచేసింది. బీజేపీ ఓటమే ప్రధాన లక్ష్యం.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమిని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని రాష్ట్రశాఖలకు కేంద్రకమిటీ సూచించింది. మొత్తం 15 పేజీల సీసీ రిపోర్ట్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చోటుచేసుకున్న పరిణామాలు, రాష్ట్రాల వారీగా రాజకీయ పరిస్థితులు తదితర అంశాలను ప్రస్తావించింది. -
కేసీఆర్‌ను పొగుడుతున్నారు.. తెలంగాణలో బీజేపీ అక్కర్లేదా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరపరాజయానికి రాష్ట్ర నాయకత్వానిదే బాధ్యతంటూ పార్టీ నేతలు ముక్తకంఠంతో విమర్శించారు. టికెట్లు ఇవ్వడంలో హడావుడి చేసి ఆ తర్వాత పట్టించుకోలేదంటూ పార్టీ సమీక్షాసమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి జగత్ ప్రకాశ్ నడ్డా ముందు బీజేపీ ముఖ్యనేతలు, అభ్యర్థులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన పార్టీ కోర్‌కమిటీ సమావేశం, పదాధికారుల భేటీ, పోటీచేసిన అభ్యర్థుల సమావేశాలు వాడివేడిగా జరిగాయి. మూడు భేటీల్లోనూ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ‘ఎన్నికల సమయంలో టికెట్లు ఇచ్చేందుకే హడావుడి చేశారు. తీరా టికెట్లు ఇచ్చాక పట్టించుకోలేదు. ఎలా ముందుకు వెళ్లాలో చెప్పలేదు. జాతీయ పార్టీ నేతలు, కేంద్ర మంత్రుల పర్యటనల విషయంలోనూ సరైన సమాచారం లేదు. సమన్వయం లేదు. కొన్ని నియోజకవర్గాలకు రాష్ట్ర స్థాయి నేతలెవరూ రాలేదు. అంతా గందరగోళమే. చివరకు బూత్ కమిటీలను కూడా బలోపేతం చేయలేదు. గ్రామీణ ప్రాంతాల నేతలను అధిష్టానం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా కొత్తవారికి రాష్ట్రాల బాధ్యతలు అప్పజెప్పండి’అంటూ నడ్డా ముందు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రుల తీరుపై మండిపాటు సోమవారం జరిగిన మూడు వేర్వేరు భేటీల్లోనూ రాష్ట్ర, జాతీయ నాయకత్వాలపై జిల్లాల నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘కేంద్ర మంత్రులు వస్తారు. కేసీఆర్‌ను పొగిడి పోతారు. ఇటీవల వచ్చిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కూడా అదే చేసి వెళ్లారు. తెలంగాణలో బీజేపీ అక్కర్లేదా? జాతీయ స్థాయిలో తెలంగాణ వారికి ప్రా«ధాన్యమే లేదు. ఎంపీ దత్తాత్రేయకు ఉన్న పదవిని కూడా తొలగించా రు. తెలంగాణలో పార్టీ బతకాలనుకుంటే.. ముందు పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టండి. కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వండి’అని నేతలు, అభ్యర్థులు నిక్కచ్చిగా పేర్కొన్నట్లు సమాచారం. పదాధికారులు, అనంతరం అభ్యర్థుల సమావేశంలోనూ రాష్ట్ర నాయకత్వంతో పాటు కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణలో బీజేపీ ఓటమికి కారణమైందని విమర్శించుకున్నట్లు తెలిసింది. జాతీయ నాయకత్వం తెలంగాణపై చిన్న చూపు చూస్తోందని, రాజ్యసభలో చోటు కల్పించక పోవడంతో పాటు ఉన్న ఏకైక కేంద్ర మంత్రిని తొలగించడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని పేర్కొన్నట్లు తెలిసింది. రాష్ట్ర నేతలపై నడ్డా సీరియస్ మరోవైపు.. కోర్ కమిటీ సమావేశంలోనూ ముఖ్యనేతలపై నడ్డా సీరియస్ అయినట్లు తెలిసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్రమోదీతో పాటు 10 మందికి పైగా కేంద్ర మంత్రులు, నలుగురు వివిధ రాష్ట్రాల సీఎంలు వచ్చి ప్రచారం చేసినా ఫలితం లేకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. సీట్లను పెంచుకోవడం పక్కన పెడితే కనీసం ఉన్న స్థానాలను కాపాడుకోలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల పరిస్థితే ఇలా ఉంటే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏంటని కోర్ కమిటీ నేతలను నడ్డా ప్రశ్నించినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని పార్లమెంట్ ఎన్నికలకు వెళ్దామని జేపీ నడ్డా సూచించినట్లు తెలిసింది. పార్టీ ఓటమికి సమష్టి బాధ్యత వహించాలని సర్ది చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీతో కూటమి కట్టిన చంద్రబాబు తెలంగాణలో ప్రచారం చేయడమే.. కేసీఆర్‌కు కలిసొచ్చిందనే అభిప్రాయం కూడా వ్యక్తమైనట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం పథకాల లబ్ధిదారులను బీజేపీ నేతలు, కార్యకర్తలు చేరుకోలేకపోవడంపైనా భేటీ చర్చ జరిగింది. మరోవైపు 27 నుంచి జనవరి 2వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా రాష్ట్ర పార్టీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది. బలంగా ఉన్నచోట పనిచేసుంటే..! 119 నియోజకవర్గాల్లో పోటీతోపాటు పార్టీ బలంగా ఉన్న 30–40 స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించి పని చేస్తే బాగుండేదని నడ్డా పేర్కొన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మంచి వాతావరణంలో సమావేశం జరిగిందన్నారు. కోర్ కమిటీ, ఆఫీస్ బేరర్లు, అభ్యర్థులు అంతా ఫలి తాలను సమీక్షించుకొని సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించామన్నారు. తెలంగాణలో పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని, సమష్టిగా పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తామని ఆయన తెలిపారు. టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న ప్రజల భావనను మార్చడంలో విఫలమయ్యామని నడ్డా పేర్కొన్నారు. సమన్వయ లోపంతోనే ఓటమి: దత్తాత్రేయ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం కూడా ఒక కారణమేనని మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థులతో సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన లోపాలను సమీక్షించుకున్నామని, పార్లమెంటు ఎన్నికల్లో వాటిని సరిదిద్దుకుంటామన్నారు. పార్టీకి సంప్రదాయ ఓట్లు ఉన్నా చంద్రబాబుపై వ్యతిరేకత కారణంగానే టీఆర్ఎస్కు ఓట్లుపడ్డాయన్నారు. ఈ ప్రభావం పార్లమెంటు ఎన్నికలపై ఉండదని ఆయన పేర్కొన్నారు. -
రాష్ట్రంలో అవినీతి ప్రజ్వరిల్లుతోంది : జయప్రకాష్ నారాయణ
సాక్షి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా అవినీతి ప్రజ్వరిల్లుతుందని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఎలాంటి సిఫార్సు లేకుండా నేరుగా పనులు చేయించుకునే వ్యవస్థ ఎప్పుడు వస్తుందోనని ఆశాబావం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎ౦తో నమ్మకంతో ప్రభుత్వాలను ఎన్నుకుంటుంటే ఎన్నో పన్నులు కడుతున్నా ఎ౦దుకు మళ్లీ ఎదైనా పనులు చేపించుకోవాలనుకున్నప్పుడు లంచాలు ఇవ్వాల్సి వస్తుందని మండిపడ్డారు. భారత పార్లమెంట్లో అన్ని పార్టీలు కలసి దారుణమైన చట్టాలు తీసుకు వచ్చాయని, లంచం ఇస్తే ఏడు ఏళ్ళ శిక్ష కనీసం మూడేళ్ళు... అదే లంచం తీసుకున్న వాడికి ఎలాంటి కేసు ఉండదు అనే చట్టం తీసుకు వచ్చారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సిన పనులు గడువులోపల ఆ పని జరిగేలా చట్ట బద్ద౦ చెయ్యాలని చెప్పారు. వీటన్నిటిని అధికమించాలంటే నిజమైన ప్రతిపత్తికల లోకాయుక్త రావాలి అన్నారు. స్వతంత్ర ప్రతిపత్తికల ఎవ్వరినైనా నిలదీసి శిక్షించగల లోకాయుక్త కావాలని ఆయన తెలిపారు. తెలగాణ ప్రజల్ని ఒక్కటే కోరుతున్న లంచం వేధింపులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ఎర్పడితే ఎమి లాభం లేదని అన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లక్షల ఓట్లు గల్లంతవ్వడం పై ఈసీ రజత్ కుమార్ క్షమాపణ చెప్పడం సరియైంది కాదని అన్నారు. ఓట్లు గల్లంతుపై ఎన్ని ఉద్యమాలు చేసినా ఫలితం లేకపోతోందని, దీనిపై పోస్టాఫీసులను నోడల్ ఎజన్సీలుగా ఏర్పాటు చేసి ఓటర్లు ఎప్పుడైనా నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని సూచించారు. తెలంగాణ ఎన్నికల్లో ఈసీది ఘోరమైన తప్పిదమేని జయప్రకాశ్ ఆరోపించారు. -
పార్టీ ఇమేజీ.. పొత్తుతో డ్యామేజీ!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోవడంపై సీపీఐలో అంతర్మథనం సాగుతోంది. కాంగ్రెస్ ప్రజాఫ్రంట్ కూటమిలో చేరాక సీట్ల సర్దుబాటు, కేటాయించే సీట్ల ఖరారులో పార్టీ నాయకత్వం సమర్థంగా వ్యవహరించలేకపోయిందనే విమర్శలు సీపీఐలో వ్యక్తమవుతోన్నాయి. కూటమిలో చేరగానే కాంగ్రెస్‌కు దాసోహమన్నట్టుగా సీపీఐ వ్యవహరించిన తీరును అంతర్గత చర్చల్లో ఆ పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. పార్టీకి గట్టి పట్టున్న సీట్లు, గెలిచే అవకాశం ఎక్కువ స్థానాల కోసం పట్టుబట్టకుండా కేటాయించిన 3 సీట్లకే సంతృప్తి చెందడం వల్ల పార్టీ ఇమేజీకి భంగం వాటిల్లిందని పలువురు వాదిస్తున్నారు. సొంతంగా ఎన్నికల బరిలో నిలిచినా, పరిమిత స్థానాల్లోనే పోటీచేసినా ఆ గౌరవమైనా పార్టీకి దక్కేదనే వాదనను వినిపిస్తున్నారు. 5 సీట్లలో పోటీ చేయాల్సింది! కూటమి పొత్తుల్లో భాగంగా కనీసం 5 స్థానాల కోసమైనా పట్టుబట్టాల్సి ఉండాల్సిందని.. సీపీఐ బలంగా ఉన్న కొత్తగూడెం, మునుగోడు సీట్లను కచ్చితంగా సాధిస్తే మంచి ఫలితాలుండేవని పార్టీ నేతలు అంటున్నారు. పార్టీ కోరుకున్న మేరకు కాంగ్రెస్ సీట్లు కేటాయించని పక్షంలో సొంతంగా 25 స్థానాల్లో పోటీ చేసే లా ప్లాన్–బీని అమలుచేసేందుకు సిద్ధమైతే పరిస్థితి మరోలా ఉండేదని వాదిస్తున్నారు. ఒక్క సీటైనా గెలవకపోయినా పార్టీ ఓటింగ్ పెరిగి, భవిష్యత్‌లో ఆయాస్థానాల్లో మళ్లీ పోటీకి, పార్టీ విస్తరణకు అవకాశం ఉండేదని చెబుతున్నారు. ఈ విషయంలో కనీసం కాంగ్రెస్‌కు హెచ్చరికలు చేసి ఒంటరిగా పోటీ చేసేం దుకు సైతం సిద్ధమనే సంకేతాలు ఇవ్వకపోవడంలో పార్టీ నాయకత్వం విఫలమైందని అంటున్నారు. కాంగ్రెస్‌కు అలుసై పోవడంతోనే.. సీపీఐ ఎక్కడికిపోదనే పరిస్థితిని కాంగ్రెస్ అలుసుగా తీసుకుందని సీపీఐ నేతలు వాదిస్తున్నారు. వైరాలో సీపీఐ గెలిచే అవకాశమున్న చోట రెబెల్ అభ్యర్థిని బరిలో కొనసాగించడంతో చివరికి ఆ తిరుగుబాటు అభ్యర్థే విజయం సాధించడం రుజువు చేస్తోందని వెల్లడిస్తున్నారు. పార్టీ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పోటీచేసిన హుస్నాబాద్‌లోనూ కాంగ్రెస్ పూర్తి స్థాయి లో సహకారం అందించకపోవడంతో పార్టీ ఓడిపోయిందని అంగీకరిస్తున్నారు. పార్టీ కార్యదర్శిగా ఉన్న వ్యక్తి తనకు కేటాయించే సీటు కోసం గట్టిగా కోరుకోవడం వల్ల ఇతర స్థానాల కోసం పట్టుబట్టే పరిస్థితి లేకుండా పోయిందని విమర్శిస్తున్నారు. ఇక బెల్లంపల్లిలో ఆరోగ్యం అంతగా సహకరించని సీనియర్ నేత గుండా మల్లేశ్‌ను పోటీ చేయించడం పార్టీ నాయకత్వం చేసిన తప్పుగా ఎత్తిచూపుతున్నారు. భవిష్యత్‌లోనైనా కాంగ్రెస్‌తో పొత్తులు కుదుర్చునే పక్షంలో పార్టీ గౌరవానికి భంగం కలగనీయకుండా, కోరుకునే సీట్లను గట్టిగా పట్టుబట్టాలని లేని పక్షంలో ఒంటరి పోరుకు సిద్ధం కావాలని సూచిస్తున్నారు. -
చంద్రబాబు వైఫల్యం తెలంగాణ ఎన్నికలు
-
టీఆర్ఎస్లోకి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు
-
హస్తానికి గులాబీ దెబ్బ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ శాసనమండలి సభ్యులు ఆకుల లలిత, టి.సంతోష్ కుమార్ గురువారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆకుల లలిత ఆర్మూర్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆకుల లలిత ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. 2015లో ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలికి ఆమె ఎన్నికయ్యారు. గతంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. 2008 ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా డిచ్పల్లి నుంచి ఎన్నికయ్యారు. ఆకుల లలిత టీఆర్ఎస్లో చేరడం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హస్తం పార్టీకి బలమైనదెబ్బని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు టి. సంతోష్ కుమార్ 2013లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. సుదీర్ఘకాలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 40 మంది సభ్యులుగల శాసన మండలిలో ప్రస్తుతం షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాత్రమే మిగిలారు. వారిద్దరి పదవీకాలం మార్చి ఆఖరుతో ముగియనుంది. వారి పదవీకాలం ముగిశాక మండలిలో కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం లేకుండాపోయే పరిస్థితి నెలకొంది. అదేబాటలో ఎమ్మెల్యేలు..! ఆకుల లలిత, టి. సంతోష్ కుమార్ బాటలోనే మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరతారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ తొలి సమావేశానికి ముందే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వస్తారని పేర్కొంటున్నాయి. -
మండలిపై టీఆర్ఎస్ నజర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజ యం సాధించిన టీఆర్ఎస్ తాజాగా శాసనమండలి ఎన్నికలపై దృష్టి సారించింది. సాధారణ ఖాళీలతోపాటు రాజీనామాలు, ఇతర కారణాలతో రాష్ట్రంలో 16 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో వాటన్నింటినీ కచ్చితంగా గెలుచుకునేందుకు వ్యూహాలు మొదలు పెట్టింది. శాశ్వత సభ అయిన శాసనమండలిలో గవర్నర్, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థలు, ఉపాధ్యాయులు, పట్టభద్రుల కోటా ఉంటుంది. తెలంగాణ శాసనమండలిలో 40 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ప్రతి రెండేళ్లకోసారి మూడో వంతు స్థానాలు ఖాళీ అవుతాయి. వాటికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది. ఇలా 2019 మార్చి 31 నాటికి తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. రాజీనామాలు, ఇతర కారణాలతో మరో ఆరు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మైనంపల్లి హనుమంతరావు, పట్నం నరేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు శుక్రవారం రాజీ నామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇలా నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ 13 ఎమ్మెల్సీ స్థానాలకు కచ్చి తంగా ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు అసెంబ్లీ ఎన్ని కలకు ముందు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రాములు నాయక్, ఆర్.భూపతిరెడ్డి, కె. యాదవరెడ్డిల సభ్యత్వాలను రద్దు చేయాలని టీఆర్ఎస్ ఇటీవల శాసన మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. శాసన మండలి చైర్మన్ త్వరలోనే ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఫిరాయింపుల నిబంధనల ప్రకారం ఆ ముగ్గురిపై వేటు వేస్తే మరో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వాటిని సైతం కలిపితే మొత్తం 16 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చిలోగా ఎన్నికలు జరగనున్నాయి. ఖాళీ అయ్యే అన్ని ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవడం లక్ష్యంగా టీఆర్ ఎస్ వ్యూహాలు రచిస్తోంది. గవర్నర్ కోటా కచ్చి తంగా అధికార పార్టీ ప్రతిపాదనల ఆధారం గానే భర్తీ అవుతుంది. ఎమ్మెల్యేలు, స్థానిక సం స్థలు, ఉపాధ్యాయులు, పట్టభద్రుల కోటా స్థానాల్లోనూ విజయం సాధించాలని టీఆర్ఎస్ గట్టిగా నిర్ణయించుకుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త వారికి పదవీకాలం మొదలు కానుంది. ఈలో గా ఎన్నికలు పూర్తి చేసేలా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. భారీగా పోటీపడుతున్న ఆశావహులు ఎమ్మెల్సీ సీట్ల కోసం అధికార పార్టీలో తీవ్ర పోటీ ఉంది. ప్రతి ఉమ్మడి జిల్లా నుంచి సగటున ఐదుగురు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యేల కోటాలో ఐదు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అన్ని స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న మహమూద్‌అలీ (హోంమంత్రి), మహమ్మద్ సలీంకు కచ్చితంగా కొనసాగింపు ఉండనుంది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎం. ఎస్. ప్రభాకర్లకు సైతం ఇదే కోటాలో ఇచ్చే అవకాశం ఉంది. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనమండలిలో టీఆర్ఎస్ చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి పదవీకాలం పూర్తవుతోంది. వారి కొనసాగింపు విషయంలో టీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. స్వామిగౌడ్ ప్రస్తుతం కరీంనగర్–మెదక్– నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రు ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తు న్నారు. ఈసారి ఆయన ఇతర కోటాలో అవకా శం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ పేరును టీఆర్ ఎస్ అధిష్టానం పరిశీలిస్తోంది. సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ సమీకరణ నేపథ్యంలో రవీందర్‌సింగ్‌కు అవకాశం ఇస్తారని తెలు స్తోంది. కేసీఆర్ ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే సందర్భాల్లో సిక్కు వర్గానికి చెందిన రవీం దర్‌సింగ్‌ను వెంట తీసుకెళ్లే అవకాశం ఉందని, దీనికి అనుగుణంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉంది. అయితే పట్టభద్రుల నియో జకవర్గం కావడంతో గ్రూప్–1 అధికారుల సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, సరోజినీదేవి మాజీ సూపరింటెండెంట్ ఎస్. రవీందర్‌గౌడ్ పేర్లను టీఆర్ఎస్ అధి ష్టానం పరిశీలిస్తోంది. పాతూరి సుధాకర్‌రెడ్డికి రెండోసారి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయుల స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి టీఆర్ఎస్లో చేరిన పూల రవీందర్‌కు మళ్లీ పోటీ చేసే అవకాశం ఇవ్వనున్నటు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యే కోటా మూడు స్థానాలతోపాటు మిగిలిన వాటిలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. తొలి నుంచీ ఉన్న వారికి ప్రాధాన్యత... టీఆర్ఎస్లో మొదటి నుంచీ ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేకపోయిన వారికి ఎమ్మెల్సీ పదవులను ఖరారు చేయనున్నారు. కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు ఎం. సుధీర్‌రెడ్డి తక్కళ్లపల్లి రవీందర్రావు, సత్యవతి రాథోడ్, గ్యాదరి బాలమల్లు, సోమ భరత్‌కుమార్, కార్యదర్శులు మాలోత్ కవిత, కోలేటి దామోదర్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేర్లను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలిస్తున్నారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల విషయంలో ఆయా ఉమ్మడి జిల్లాల సమీకరణల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. -
తప్పుడు సర్వేలను పాతరేశారు: ఈటల
హుజూరాబాద్: తప్పుడు సర్వేలతో తెలంగాణ ప్రజలను మోసం చేయాలని ప్రయత్నం చేసిన లగడపాటి రాజగోపాల్ కుట్రలను ప్రజలు పాతరేసి ఓటుతో తగిన బుద్ధి చెప్పారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఎమ్మెల్యేగా ఆరోసారి గెలిచిన ఆయన.. మొదటిసారిగా హుజూరాబాద్‌కు వచ్చారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఈటల మాట్లాడారు. మహాకూటమి పేరుతో చంద్రబాబునాయుడు తెలంగాణకు వచ్చి రాజకీయం చేద్దామని చూశారని, కానీ ఇక్కడ బాబు కుట్రలు చెల్లలేదన్నారు. చంద్రబాబు తెలంగాణలో కాదు కదా ఆంధ్రాలో కూడా గెలువలేడని చెప్పారు. రేవంత్‌రెడ్డి వంటి కొందరు పిట్టల దొరలు తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూసినా, ప్రజలు మాత్రం ఓటుతో బుద్ధి చెప్పారన్నారు. సోషల్ మీడియా, ఆంధ్ర పత్రికల్లోనే కూటమి ఉందని, టీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ ప్రజల గుండెల్లో ఉందన్నారు. ఆనాటి ఉద్యమ నేతగా, సీఎం కేసీఆర్ 100 సీట్లు వస్తాయని చెప్పారని, 90 సీట్లు గెలిచి టీఆర్ఎస్ పార్టీ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని అన్నారు. పార్టీలో ఉంటూ పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై చర్యలు తప్పవని ఈటల స్పష్టం చేశారు. -
సీఎల్పీ రేసులో శ్రీధర్‌బాబు?
సాక్షి, మంథని: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ప్రభుత్వ విప్.. శాసన సభ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కాంగ్రెస్ శానససభాపక్ష నేతగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చ జోరుగా జరుగుతుంది. 2014 ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల నుంచి జీవన్‌రెడ్డి మాత్రమే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయనను సీఎల్పీ ఉపనేత పదవి వరించింది. ఆ ఆనవాయితీ ప్రకారం ఈసారి మంథనికి సీఎల్పీ కేటాయిస్తారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మంథని నియోజకవర్గంలోనే నిర్మాణంలో ఉండడంతో శాసన సభలో కాంగ్రెస్ తరఫున మాట్లాడే అవకాశం ఉండేలా అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేకు సీఎల్పీ ఇస్తే బాగుంటుందనే ఆలోచన టీపీసీసీ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న స్వర్గీయ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావును నాడు నక్సల్స్ కాల్చి చంపగా ఆయన వారసత్వంగా శ్రీధర్‌బాబు రాజకీయ అరగ్రేటం చేశారు. మంథని నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రభుత్వ విప్‌గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ఉన్నతవిద్య, పౌర సరఫరాల శాఖలతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేవ్ శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఏఐసీసీ మెంబర్‌గా, 2014లో మానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ప్రస్తుతం టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఇలా పార్టీలో పదవులు చేపట్టి సీనియర్‌గా, అజాత శత్రువుగా పేరున్న శ్రీధర్‌బాబు అర్హతను పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ గాలి వీచి కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఓడిపోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండగా, 10 స్థానాల్లో టీఆర్ఎస్, రామగుండంలో స్వతంత్ర ఎమ్మెల్యే గెలుపొందగా, మంథని నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా శ్రీధర్‌బాబు విజయం సాధించారు. -
మంత్రివర్గ విస్తరణ: ముహూర్తం కుదిరేనా?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై అంతకంతకూ ఉత్కంఠ పెరుగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు దాటుతున్నా ఈ వ్యవహారంపై ఇంకా సందిగ్ధత నెలకొనడంతో ఆశావహుల్లో టెన్షన్ అధికమవుతోంది. మంత్రిపదవులు ఆశిస్తున్నవారంతా ముహూర్తపు లెక్కలు చూసుకుంటున్నారు. సంక్రాంతిలోపు మంచి రోజులున్నాయా? ఉంటే ఎప్పుడు? ఒకవేళ సంక్రాంతిలోపు ముహూర్తాలు లేకుంటే తర్వాత ఎప్పుడున్నాయి వంటి వివరాలను ఆరా తీస్తున్నారు. రాజకీయ నేతలతోపాటు అధికార వర్గాల్లో ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ సాగుతోంది. సాధారణంగా సంక్రాంతికి ముందు నెల రోజులు మంచి రోజులు ఉండవనే చర్చ నడుస్తోంది. అయితే, ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈసారి సంక్రాంతికి పది రోజుల ముందు వరకు మంచి రోజులు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది మార్గశిర అధిక మాసం వచ్చిందని, అందువల్ల జనవరి 4 వరకు మంచి రోజులు ఉన్నాయని వివరిస్తున్నారు. ఆ తర్వాత పుష్యమాసం మొదలై ఫిబ్రవరి 7 వరకు ఉంటుంది. ఆ రోజులలో ముహూర్తాలు ఉండవు. ఈ నేపథ్యంలో జనవరి 4వ తేదీలోపే మంత్రివర్గ విస్తరణ జరపాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలోపు జరగకపోతే ఫిబ్రవరి 7 వరకు ఈ కార్యక్రమం నిర్వహించడానికి వీలుపడదు. కాంగ్రెస్ నుంచి చేరికలున్నాయా? ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లను గెలుచుకుని భారీ మెజార్టీతో టీఆర్ఎస్ అధికారం చేపట్టింది. ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, వైరాలో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన లావుడ్య రాములునాయక్ టీఆర్ఎస్లో చేరడంతో పార్టీ బలం 90కి చేరింది. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీలో చేరే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ దిశగా ఇప్పటికే సంప్రదింపులు మొదలైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి చేరికల తర్వాత ఉండే జిల్లాల సమీకరణాల ఆధారంగా కేబినెట్ కూర్పు ఉంటుందని సమాచారం. మరోవైపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంప్రదాయం ప్రకారం ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని మర్యాదపూర్వకంగా కలవాల్సి ఉంటుంది. ఇందుకోసం సీఎం కేసీఆర్ త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నారు. ఈనెల 21న శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ హైదరాబాద్‌కు రానున్నారు. మూడు రోజుల బస అనంతరం 24న తిరిగి ఢిల్లీ వెళ్తారు. రాష్ట్రపతి పాల్గొనే కొన్ని కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరు కావాల్సి ఉంటుంది. ఇలా పలు కార్యక్రమాలతో సీఎం కేసీఆర్ బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో డిసెంబర్ నెలాఖరులో నాలుగు రోజులు, జనవరి మొదటి వారంలో నాలుగు రోజులు మాత్రమే మంత్రివర్గ విస్తరణ చేయడానికి అనువుగా కనిపిస్తున్నాయి. 4న పంచాయతీ నోటిఫికేషన్? హైకోర్టు తీర్పు నేపథ్యంలో జనవరి 10వ తేదీలోపు గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం జనవరి 4న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. అదే జరిగితే అప్పటి నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుంది. ఇక అది ముగిసే వరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టడానికి వీలుండదు. అంటే ఎలా చూసినా, జనవరి 4లోపు మాత్రమే కేబినెట్ విస్తరణకు అవకాశం కనిపిస్తోంది. కాగా, ఫిబ్రవరిలో ఎలాగూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉంటాయని, వాటి కోసం అనివార్యంగా కేబినెట్ విస్తరణ చేయాల్సి ఉంటుందని అంటున్నారు. మొత్తమ్మీద మరో రెండుసార్లు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని టీఆర్ఎస్ అధిష్టానం వర్గాలు చెబుతున్నాయి. తొలి విడతలో ఆరుగురు లేదా ఎనిమిది మందిని కేబినెట్లోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత మిగిలిన ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. -
టీడీపీతో పొత్తు వల్లే ఘోరంగా ఓడాం..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు మంచిది కాదన్న వాదన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. ఓటమి నుంచి తేరుకుంటున్న కాంగ్రెస్ నేతలు... టీడీపీతో పొత్తు కొనసాగితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందన్న అభిప్రాయంతో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో టీడీపీతో పొత్తు అంశం కాంగ్రెస్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. లోక్‌సభ ఎన్నికల్లోనూ టీడీపీతో మైత్రి అంటే... తెలంగాణలో మనుగడ సాగించలేమని, పోటీ చేసేందుకు కూడా నాయకులు ముందుకు రాని పరిస్థితులు ఏర్పడతాయని సీనియర్లు అంటు న్నారు. శాసనసభ ఎన్నికల్లో ఫలితాలు కాంగ్రెస్ అధినాయకత్వానికి తెలుసునని, తరువాత ఎన్నికలకు వ్యూహం ఎలా ఉండాలన్నది కూడా వారికి తెలియదని అనుకోవడం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకరు అభిప్రాయపడ్డారు. ఆ పొత్తే మమ్మల్ని ముంచింది... అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని సమీక్షించుకుం టున్న టీపీసీసీ ముఖ్యులు టీడీపీతో పొత్తు తమ పుట్టి ముంచిందనే నిర్ధారణకు వస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకంటే టీడీపీ అధినేత హోదాలో చంద్రబాబు ఈ ఎన్నికలను హైజాక్ చేయడం వల్లే ప్రజల్లో తమ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు తమపై ఉన్న సానుభూతి కూడా బాబుతో పొత్తు తర్వాత ఆగ్రహంగా మారిందనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు. కేవలం సీపీఐ, తెలంగాణ జనసమితితోనే పొత్తుకు పరిమితమై ఎన్నికలకు వెళ్లుంటే సీట్ల సర్దుబాటులో కూడా సమస్యలుండేవి కావనీ, కనీసం మరో 20 సీట్లలో మెరుగైన ప్రతిభ సాధించగలిగేవారమని వారంటున్నారు. హైదరాబాద్‌ను తానే కట్టానని ఓసారి, తాను చేసిన దాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగించిందని మరోసారి చెప్పుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు... తన రాకను వ్యతిరేకిస్తున్న తెలంగాణ సమాజానికి సమాధానం ఇవ్వడం మాత్రం మర్చిపోయారని అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడంతోపాటు కూటమిలో అందరికంటే ఎక్కువ ప్రాధాన్యత ఆయనకు ఇచ్చినట్లు బహిర్గతం కావడమే తమ కొంప ముంచిందని వాపోతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ చంద్రబాబు ప్రమేయాన్ని అంగీకరించే పరిస్థితి తెలంగాణ ప్రజల్లో లేదని ఈ ఎన్నికల ఫలితాలతో అర్థమైందని, అధిష్టానం ఈ విషయాన్ని గ్రహించి తెలంగాణ వరకైనా టీడీపీతో పొత్తు నుంచి మినహాయింపునివ్వాలని వారు కోరుతున్నారు. ‘మంచో చెడో ఓసారి పొత్తు పెట్టుకున్నాం. దాని పర్యవసానాలు అనుభవించాం. ఇకనైనా తెలంగాణ ప్రజల మనసెరిగి వ్యవహరిస్తే బాగుంటుంది’అని టీపీసీసీ సీనియర్ నేత, మాజీ మంత్రి రవీంద్ర నాయక్ అన్నారు. పట్టణ ఓట్లూ గల్లంతు... టీఆర్ఎస్ పాలనలో అమలైన సంక్షేమ పథకాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీకి సానుకూలత మొదటి నుంచి కనిపించినా, పట్టణ ప్రాంత ఓటర్లు తమ వైపు మొగ్గు చూపుతారని కాంగ్రెస్ నేతలు అంచనా వేశారు. ముఖ్యంగా నిరుద్యోగులు, యువత, ఉద్యోగ వర్గాలు తమవైపే ఉన్నారని ఎన్నికల ముందు వరకు ధీమాగా ఉన్నారు. ఈ ఓట్లు తమ విజయాన్ని సులభతరం చేస్తాయని ఆశించారు. కానీ చంద్రబాబు ప్రవేశంతోనే వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విద్యార్థి, యువత, ఉద్యోగ వర్గాలకు ఆ సమయంలో చంద్రబాబు నిర్వహించిన పాత్ర గుర్తుకు వచ్చిందని... దీంతో ఉన్నట్లుండి తమవైపు నుంచి ప్రత్యామ్నాయం వైపు వారి ఆలోచన మళ్లిందని టీపీసీసీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో తమ ఓటు బ్యాంకుగా భావించిన వర్గాలన్నీ అనివార్య పరిస్థితుల్లో టీఆర్ఎస్ను ఎంచుకోవాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు. ఇక పల్లె ప్రాంతాల్లో అక్కడో, ఇక్కడో ఓట్లు లభిస్తాయని ఆశించినా చంద్రబాబు మళ్లీ వస్తున్నాడన్న టీఆర్ఎస్ ప్రచారం ఆ ఓట్లను కూడా గల్లంతు చేసిందని విశ్లేషిస్తున్నారు. బాబు రాక పట్టణ ప్రాంతాల్లో పూర్తిగా, గ్రామీణ ప్రాంతాల్లో పాక్షికంగా తమ ఓటు బ్యాంకుకు నష్టం చేసిందనే అంచనాకు కాంగ్రెస్ వర్గాలు వచ్చాయి. ‘టీడీపీతో పొత్తు కారణంగా అర్బన్‌లో మేము బాగా దెబ్బతిన్నాం. దీని ప్రభావం గ్రామీణ ప్రాంతాలపైనా పడింది. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు వద్దని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం’అని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తెలిపారు. పొత్తు కొనసాగితే పోటీ చేయలేం... ఎన్నికల ఫలితాలు కొట్టిన దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కాంగ్రెస్ ముఖ్య నేతలు పార్టీ భవిష్యత్తుపై అంచనాకు వస్తున్నారు. అందులో భాగంగానే అవసరమైతే లోక్‌సభ బరిలో దిగి పార్టీతోపాటు తమ సత్తా చాటాలనే నిర్ణయానికి వస్తున్నారు. అయితే అది కూడా టీడీపీతో పొత్తు వదిలితేనే తాము పోటీకి సిద్ధమవుతామనే మెలిక పెడుతున్నారు. ఈ విషయంలో అధిష్టానం నిర్ణయం మారకపోతే తాము ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాల్సి ఉంటుందని, టీడీపీతో కలసి ఎన్నికలకు వెళ్లడం ద్వారా పార్టీపరంగా, వ్యక్తిగతంగా ఉన్న ప్రతిష్టను నష్టపోవడంకన్నా పోటీలో ఉండకుండా ఉండటమే మేలని, అనివార్యంగా పోటీలో ఉండాల్సిన పరిస్థితులు వస్తే ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవడమే మంచిదని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కొందరు నేతలు బహిరంగంగా మాట్లాడుతున్నా మరికొందరు అంతర్గత సమీక్షల్లో ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. ‘శాసనసభ ఎన్నికల ఫలితాలు సమీక్షించుకొని తదుపరి కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఉంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుంటే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది’అని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో ‘పచ్చ’పార్టీని వదిలించుకోవడమే మంచిదనే అభిప్రాయంపైనే చర్చ జరుగుతోంది. ‘టీడీపీతో పొత్తు కొనసాగితే భవిష్యత్తు అంధకారం అవుతుంది. అనేక మంది పార్టీని వీడే ప్రమాదం ఉంది. ఈ విషయంలో అధిష్షానం సముచితమైన రీతిలో ఒక ప్రకటన చేస్తే బాగుంటుంది’అని మెదక్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు పేర్కొన్నారు. -
గొంతు కోసుకోవడంపై స్పందించిన బండ్ల గణేష్
సాక్షి, తిరుపతి : కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిది బండ్ల గణేశ్ ఎట్టకేలకు మౌనం వీడారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హడావుడి చేసిన ఈ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ పొలిటీషియన్.. ఫలితాలనంతరం మీడియా ముందుకు రాకుండా ఉండిపోయారు. జనసేన అధినేత, పవన్ కల్యాణ్ వీరాభిమానిగా చెప్పుకునే బండ్ల గణేశ్ సరిగ్గా ఎన్నికల ముందు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని అందరిని ఆశ్చర్యపరిచారు. పార్టీలో చేరేదే ఆలస్యం టీవీ చానళ్ల చుట్టూ తిరుగుతూ హల్చల్ చేశారు. పలు టీవీ చానెళ్ల ఇంటర్వ్యూల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి అధికారంలోకి రాకుంటే గొంతు కోసుకుంటానని సవాల్ కూడా విసిరారు. అయితే ఎన్నికల ఫలితాలు భిన్నంగా రావడంతో సదరు టీవీచానెళ్లు బండ్ల గణేశ్‌ను సంప్రదించే ప్రయత్నం చేశాయి. కానీ అతను మీడియా కంటపడకుండా జాగ్రత్తపడ్డారు. సోమవారం ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు వచ్చిన ఆయన దర్శనానంతరం మీడియాతో మాట్లాడారు. ‘అందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నేను అజ్ఞాతంలో లేను. మా పార్టీ గెలుస్తుందని ఎన్నో ఊహించుకున్నాం. కానీ ప్రజలు మా పార్టీని తిరస్కరించారు. టీఆర్ఎస్కు పట్టం కట్టారు. మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదని మౌనంగా ఉండాల్సి వచ్చింది. అరే కోపంలో వంద అంటాం సార్.! అవన్నీ నిజం అవుతాయా! మీరు కోసుకోమంటే కోసుకుంటా. చాలా అంటాం ఇవన్నీ మాములే. ఉరికే మావాళ్ల ఉత్సాహం కోసం అలా మాట్లాడాను. ఇప్పుడేం చేయమంటారు. కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యింది దానికి ఏం చెబుతాం.’ అని గొంతు కోసుకోవడంపై తనదైన శైలిలో స్పందించారు. అంతేకాకుండా ఓటమి రేపు విజయానికి పునాదని చెప్పుకొచ్చారు. -
శాంతిభద్రతల కోసమే రేవంత్ అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకోవడంలో ఎక్కడా కూడా చట్ట నిబంధనల ఉల్లంఘన జరగలేదని ఎన్నికల సమయంలో వికారాబాద్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించిన అన్నపూర్ణ హైకోర్టుకు నివేదించారు. ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలను పరిరక్షించే చర్యల్లో భాగంగానే రేవంత్‌ని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. కోస్గిలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు హాజరవుతున్న సభ లో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతోనే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రేవంత్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. క్యాంపు కార్యాలయం నుంచి ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని, అందువల్ల అధికారిక సీలు అందుబాటులో లేకపోయిందని వివరించారు. అదుపులోకి తీసుకునే ముందు బయటకు రావాలని రేవంత్‌ను పలుమార్లు పిలిచామని, ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో గేట్లు పగులగొట్టి లోనికి వెళ్లాల్సి వచ్చిందన్నారు. గదిలో రేవంత్‌తోపాటు ఆయన భార్య, కుమార్తె ఉన్నారని, వారికి రేవంత్ అరెస్ట్‌కు దారి తీసిన కారణాలు వివరించి వాటికి సంబంధించిన కాగితాలపై సంతకాలు కోరగా నిరాకరించారని ఆమె తెలిపారు. పోలీసులు చట్ట విరుద్ధంగా రేవంత్‌ను నిర్బంధించారని, ఆయన ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కౌంటర్‌కు సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్ తరఫు న్యాయవాదికి అవకాశం ఇచ్చి తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. -
నల్లగొండ నుంచి కోమటిరెడ్డి.. మహబూబ్‌నగర్ నుంచి రేవంత్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ సీని యర్లు లోక్‌సభ బరిలో తమ సత్తా చూపాలనే యోచనలో ఉన్నారు. ఫిబ్రవరి లేదా మార్చిలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వస్తుందనే వార్తల నేపథ్యంలో తాము పోటీ చేయాలనుకుంటున్న లోక్‌సభ స్థానంలోని పరిస్థితులపై ఓ అంచనాకు వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓటమి పాలైన మాజీ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డితో పాటు రేణుకా చౌదరి, గూడూరు నారాయణరెడ్డి, అజారుద్దీన్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్లు ఎంపీ అభ్యర్థుల జాబితాలో వినిపిస్తున్నాయి. వీరంతా ఇప్పటికే తమ తమ స్థానాల్లోని ఫలితాల తీరు, గెలుపొందిన ఎమ్మెల్యేల శక్తియుక్తులు వంటి అంశాలపై కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. నేనే పోటీ చేస్తా... అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా... లోక్‌సభ విషయానికి వచ్చేసరికి సమీకరణలు మారుతాయని, ఈసారి లోక్‌సభకు వేరుగా ఎన్నికలు జరుగుతున్నందున రాష్ట్రంలోని రాజకీయ సమీకరణలు కొంత తక్కువగానే ప్రభావం చూపుతాయనే అంచనాలో కాంగ్రెస్ సీనియర్లున్నారు. దీనికి తోడు జాతీయ పార్టీగా కాంగ్రెస్‌కు ఉండే సానుకూలత, మోదీ పట్ల వ్యతిరేకత ఉన్న ఓటర్లు తమ వైపు మొగ్గుచూపుతారనే ఆశావహ దృక్పథంతో లోక్‌సభ బరిలో దిగేందుకు వీరంతా సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. నల్లగొండ అసెంబ్లీ నుంచి ఓటమిపాలైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఓ అడుగు ముందుకేసి తాను నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. గత ఆదివారం నల్లగొండలో విలేకరులతో మాట్లాడిన ఆయన తాను ఎంపీగా పోటీచేసే అంశం రాహుల్ దృష్టిలో ఉందని, ముందస్తుగా అసెంబ్లీకి ఎన్నికలు వచ్చినందునే పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. ఈసారి నల్లగొండ జిల్లాలోని ఉత్తమ్, జానా, దామోదర్‌రెడ్డి సహకారంతో నల్లగొండ ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారు. ఈసారి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా నల్లగొండ ఎంపీ స్థానం నుంచి బరిలో ఉండే అవకాశాలున్నాయనే చర్చ నేపథ్యంలో కూడా కోమటిరెడ్డి పోటీవైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఇక, భువనగిరి ఎంపీ స్థానాన్ని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ఎప్పటి నుంచో ఆశిస్తున్నారు. తనకు ఈసారి అధిష్టానం అవకాశం ఇస్తుందనే అంచనాలో ఆయన ఉన్నారు. అక్కడి నుంచి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేరు కూడా వినిపిస్తోంది. పాలమూరుకు పోటాపోటీ.. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి రేవంత్‌రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. అక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్న కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి స్థానంలో రేవంత్‌కు అవకాశం ఇస్తారని, అవసరమైతే జైపాల్‌ను మల్కాజ్గిరి నుంచి పోటీ చేయిస్తారని అంటున్నారు. ఇక్కడి నుంచి డి.కె.అరుణ లేదంటే ఆమె కుమార్తె స్నిగ్ధారెడ్డి కూడా సీటు అడిగే అవకాశముంది. ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి రేణుకాచౌదరి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ నుంచి మధుయాష్కీగౌడ్, మెదక్ నుంచి సినీనటి విజయశాంతి, చేవెళ్ల నుంచి ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, పెద్దపల్లి నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ, జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కార్ బరిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మల్కాజ్గిరి నుంచి జైపాల్‌రెడ్డి పోటీచేయని పక్షంలో రేణుకాచౌదరి పేరు కూడా పరిశీలించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అధికారులు కూడా...! కాంగ్రెస్ నేతలతో పాటు పోలీసు, రవాణా శాఖల్లోని అధికారుల పేర్లు కూడా లోక్‌సభ ప్రాబబుల్స్ జాబితాలో వినిపిస్తున్నాయి. వరంగల్ లోక్‌సభ సీటును ఇద్దరు పోలీసు అధికారులు ఆశిస్తున్నట్లు సమాచారం. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ఎంపీ రమేశ్‌రాథోడ్, గత ఎన్నికల్లో పోటీచేసిన నరేశ్ జాదవ్, సోయం బాపూరావుతోపాటు రవాణా శాఖలో రాష్ట్రస్థాయి అధికారి పేరు వినిపిస్తోంది. కరీంనగర్ పార్లమెంట్‌కు మాజీ మంత్రి జీవన్‌రెడ్డికే అవకాశముంటుందనే చర్చ సాగుతోంది. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాన్ని మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్ అడుగుతున్నా, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పోటీలో ఉన్నారు. తాను సికింద్రాబాద్ ఎంపీగా పోటీచేస్తానని ఆయన గతంలో ప్రకటించారు. అదే జరిగితే హైదరాబాద్ బరిలో ప్రముఖ ఎడిటర్ జాహెద్అలీఖాన్ను బరి లో నిలిపే అవకాశాలున్నాయి. నాగర్‌కర్నూలుకు నంది ఎల్లయ్య పోటీచేస్తారా? లేదా? అన్నది అనుమానంగానే కనిపిస్తోంది. ఆయన పోటీ చేయకుంటే మల్లు రవిని బరిలో దింపే అవకాశాలున్నాయి. -
వైకల్యాన్ని జయించిన ఓటు
వారు దివ్యాంగులే కానీ అందరికీ ఆదర్శవంతులు.. నడవ రాకున్నా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు.. కళ్లు కనబడకున్నా కదిలొచ్చారు.. మేము సైతం అంటూ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.. ఓటేసేందుకు బద్ధకించిన వారి కళ్లు తెరిపించారు. పోలింగ్ శాతంలో సాధారణ ఓటర్ల కంటే దివ్యాంగ ఓటర్లే ముందుండడం విశేషం. ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ఇటీవలి ఎన్నికల్లో సాధారణ ఓటర్ల కంటే దివ్యాంగ ఓటర్లే అధిక సంఖ్యలో ఓటు వేసి తమ ఉనికి చాటుకున్నారు. జిల్లాలో 84 శాతం ఓటింగ్ నమోదు చేసి తాము ఎందులో తీసిపోలేమని మరోసారి నిరూపించుకున్నారు. అధికారులు సేకరించిన లెక్కల ప్రకారం జిల్లాలో 17,886 మంది దివ్యాంగ ఓటర్లుంటే, 1,369 పోలింగ్ కేంద్రాల్లో కలిపి 15,060 మంది (84శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో విశేషమేమిటంటే కళ్లు లేకున్నా 1,876 మంది ఇంటి నుంచి కదిలి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేశారు. అవయవాలన్నీ సక్రమంగా ఉండి ఓటు వేయని వారికి వీరు ఆదర్శంగా నిలిచారు. అలాగే మూగ, చెటివి వారి విషయానికి వస్తే 1,396 మంది, అత్యధికంగా శారీరక వికలాంగులు 9,585 మంది, ఇతరులు 2,203 మంది ఓటు వేశారు. నియోజకవర్గాల వారీగా చూస్తే, అత్యధికంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 3,361 మంది దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెండో స్థానంలో బాల్కొండ నియోజకవర్గం ఉండగా, మూడవ స్థానంలో ఆర్మూర్ నియోజకవర్గం ఉంది. అత్యల్పంగా నిజామాబాద్ అర్బన్‌లో 896 మంది మాత్రమే ఓటేశారు. అయితే, జిల్లా పోలింగ్ శాతం 76.23 ఉండగా, ఇందులో దివ్యాంగులది 84 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. ప్రత్యేక దృష్టి సారించడంతోనే.. రాష్ట్ర ఎన్నికల సంఘం దివ్యాంగ ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఓటు హక్కు ఉన్న దివ్యాంగులందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా వారికి పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఇందుకు ఎన్నికలకు కొన్ని రోజుల ముందుగానే పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపులు నిర్మించారు. ఇంటి నుంచి కదల్లేని, నడవలేని వారిని ఇంటి నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలించేలా రవాణా ఏర్పాట్లు చేశారు. వారి కోసం ప్రత్యేకంగా 400 లకు పైగా వీల్ చైర్లను తెప్పించిన అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద ఉంచారు. వలంటీర్లను కూడా నియమించారు. ఆటోల ద్వారా ఇంటి నుంచి దివ్యాంగ ఓటర్లను తీసుకుని వచ్చి వీల్చైర్ల ద్వారా పోలింగ్ బూత్ వద్దకు తీసుకెళ్లారు. మళ్లీ పోలింగ్ కేంద్రం నుంచి ఇంటికి అదే ఆటోలలో తరలించారు. వారికి కల్పించిన సౌకర్యాలను తెలుసుకుని దివ్యాంగ ఓటర్లు ధీమాగా ఓటేయడానికి ముందుకు కదిలారు. ఇటు అంధులు సులభంగా ఓటే వేసేలా అన్ని పోలింగ్ కేంద్రాల్లో బ్యాలెట్ యూనిట్లపై బ్రెయిలీ లిపిని ఏర్పాటు చేశారు. తద్వారా దివ్యాంగ ఓటర్ల పోలింగ్ శాతం పెరగడానికి కారణమైంది. వివరాలు సేకరించిన అధికారులు.. అసెంబ్లీ ఎన్నికల్లో దివ్యాంగ ఓటర్లపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించిన నేపధ్యంలో జిల్లాలో ఎంత మంది దివ్యాంగ ఓటర్లున్నారో తెలుసుకోవడానికి జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ, డీఆర్డీఏ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో వివరాలను సేకరించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో 3,084 మంది, బోధన్‌లో 3,164, బాన్సువాడలో 2,729, నిజామాబాద్ అర్బన్‌లో 1,313, నిజామాబాద్ రూరల్‌లో 4,053, బాల్కొండ నియోజకవర్గంలో 3,543 మంది ఓటర్లున్నట్లు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తంగా దివ్యాంగ ఓటర్లు 17,886 మంది ఓటర్లున్నట్లు అధికారుల సర్వేలో తేలింది. ప్రస్తుతం 15,060 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుని వారి ఉనికిని చాటుకున్నారు. -
‘ఆమె’ స్థానం అంతంతే !
సాక్షి, కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మహిళా శాసనసభ్యుల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. గతంలో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటివరకు ముగ్గురు మహిళలకు మాత్రమే అసెంబ్లీలో తమ వాణి వినిపించే అవకాశం దక్కింది. తాజాగా నాలుగో మహిళగా ఇల్లెందు నుంచి ఎన్నికైన బాణోత్ హరిప్రియ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుత శాసనసభలో ఉమ్మడి జిల్లా నుంచి ఆమె ఒక్కరే మహిళా ఎమ్మెల్యే కావడం గమనార్హం. 1972లో మధిర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున దుగ్గినేని వెంకట్రావమ్మ ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. అనంతరం కాలంలో వివిధ పార్టీల నుంచి చాలా స్వల్ప సంఖ్యలో మహిళా అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ ఎన్నిక కాలేదు. సుదీర్ఘ కాలం తర్వాత 2009లో ఒకేసారి ఇద్దరు మహిళలు శాసనసభకు ఎన్నికయ్యారు. వైరా నియోజకవర్గంగా ఆవిర్భవించిన తొలిసారే సీపీఐ తరఫున బాణోత్ చంద్రావతి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే ఎన్నికల్లో భద్రాచలం నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన సత్యవతి గెలుపొందారు. సీపీఎంకు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చరిష్మాతో కుంజా సత్యవతి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మహిళలెవరూ ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాలేదు. ఇక ప్రస్తుత ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి బరిలో నిలిచిన మహిళా అభ్యర్థుల సంఖ్య కొంత పెరిగినప్పటికీ.. ఇల్లెందు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున బాణోత్ హరిప్రియ ఒక్కరే విజయం సాధించారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు నలుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా, అందులో ముగ్గురు గిరిజనులే కావడం విశేషం. వీరిలో సత్యవతి ఆదివాసీ వర్గానికి చెందిన మహిళ కాగా, చంద్రావతి, హరిప్రియ బంజారా తెగకు చెందిన వారు. ఎనిమిది మందిలో ఒకరికే చాన్స్.. ప్రస్తుత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా నుంచి ప్రధాన పార్టీల తరఫున ఎనిమిదిమంది మహిళలు బరి లో నిలిచారు. వీరిలో ఇల్లెందు నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన ఒక్క హరి ప్రియ మాత్రమే గెలుపొందారు. పాలేరు నియోజకవర్గంలో సీపీఎం నుంచి బత్తుల హైమావతి, వైరా నియోజకవర్గం నుంచి ప్రజాకూటమి(సీపీఐ) అభ్యర్థిగా బాణోత్ విజయాబాయి, బీజేపీ అభ్యర్థిగా రేష్మారాథోడ్, ఇల్లెందు నుంచి బీజేపీ అభ్యర్థిగా మోకాళ్ల నాగస్రవంతి, భద్రాచలం బీజేపీ అభ్యర్థిగా కుంజా సత్యవతి, ఖమ్మం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఉప్పల శారద, సత్తుపల్లి నుంచి బీఎల్ఎఫ్ అభ్యర్థిగా మాచర్ల భారతి పోటీ పడినప్పటికీ.. వారు విజయం సాధించలేకపోయారు. ఈ ఎనిమిది మందిలో నలుగురు బీజేపీకి చెందిన వారే కావడం గమనార్హం. టీఆర్ఎస్ నుంచి మహిళలే లేరు.. అధికార టీఆర్ఎస్ నాలుగు నియోజకవర్గాల నుంచి సిట్టింగ్‌లకు టికెట్లు కేటాయించడంతో పాటు భద్రాచలం స్థానాన్ని సైతం తెల్లం వెంకట్రావుకు కేటాయించింది. దీంతో ఆ పార్టీ నుంచి మహిళా అభ్యర్థులకు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. పినపాక నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పాయం వెంకటేశ్వర్లు సతీమణి పాయం ప్రమీల పేరు వినిపించినప్పటికీ, చివరకు వెంకటేశ్వర్లునే టికెట్ వరించింది. గతంలో ఇలా.. గతంలో జరిగిన వివిధ ఎన్నికల్లో పాలేరు నుంచి మద్దినేని బేబీ స్వర్ణకుమారి, కొత్తగూడెం నుంచి అయాచితం నాగవాణి, భద్రాచలం నుంచి కొమురం ఫణీశ్వరమ్మ టీడీపీ తరఫున పోటీచేసినప్పటికీ ఓటమి చెందారు. అలాగే ఇల్లెందు నుంచి టీడీపీ తరఫున కల్పనాబాయి ఓటమి పాలయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన బాణోత్ హరిప్రియ సైతం గెలుపు ముంగిట వరకు వచ్చి ఓటమి చెందారు. ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె విజయం సాధించారు. భద్రాచలం నుంచి 2009లో సత్యవతి గెలుపొందగా, ఆ ఎన్నికల్లో ఇల్లెందు, కొత్తగూడెం, భద్రాచలం నుంచి పోటీ చేసిన మరో నలుగురు మహిళా అభ్యర్థులు ఓటమి చెందారు. -
బ్యాలెట్ ద్వారానే ఎంపీ ఎన్నికలు జరపాలి
నల్లగొండ: వచ్చే పార్లమెంటు ఎన్నికలను బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొం డలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలలో పెద్దఎత్తున ట్యాంపరింగ్ జరిగిందని సోషల్ మీడియాతో పాటు బహిరంగం గా చర్చించుకుంటున్న విషయం తెలిసిందేనని చెప్పారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా జిల్లాలో 84 శాతం పోలింగ్ జరగడం అనుమానాలకు తావిస్తోందని తెలిపారు. నల్లగొండ, తుంగతుర్తి తదితర ప్రాంతాల్లో పోలైన ఓట్లకు, ఈవీఎంలలో నమోదైన ఓట్లకు వేలల్లో తేడా ఉందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ సర్వేలు నిర్వహించినా గట్టి పోటీ ఉంటుందని తేలిందని, కానీ టీఆర్ఎస్ వాళ్లంతా 50 నుంచి 70 వేల మెజార్టీతో గెలిచారంటే.. ట్యాంపరింగ్ జరి గినట్లు అనుమానం కలుగుతోందన్నారు. వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డిపై గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్‌రెడ్డికి ప్రజలతో సంబంధాలు లేవని, అలాంటిది ఆయన 50 వేల మెజార్టీతో ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శ్రీనివాస్‌గౌడ్‌కు ప్రజ ల్లో వ్యతిరేకత ఉన్నట్లు సర్వేల్లో తేలిందని, ఆయన కూడా 50 వేల మెజార్టీతో గెలిచారంటే అనుమానం మరింత పెరుగుతోందన్నారు. కొండా సురేఖ, డీకే అరుణ తప్పక గెలుస్తారని సర్వేల్లో తేలితే ఫలితాల్లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారని వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు పెట్టకపోవడానికి కారణమేంటని నిలదీశారు. వీటిపై ఇప్పటికే పబ్లిక్ లిటిగేషన్ పిటిషన్ వేశామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో గోల్మాల్ చేసి గెలిచారనే అనుమానం తమకు కలుగుతోందని, అందుకే న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి సహకారంతో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తాను నల్లగొండ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో కనగల్ జెడ్పీటీసీ శ్రీనివాస్‌గౌడ్, బండమీది అంజయ్య, భిక్షంయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ పథకాలు కాంగ్రెస్‌వే: జానారెడ్డి
గుర్రంపోడు: టీఆర్ఎస్ అమలు చేస్తున్నవి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకాలేనని సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో నిర్వహిం చిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద ప్రజల సంక్షేమం కోసం రూపాయి కిలో బియ్యం, ఆరోగ్యశ్రీ, ఉపాధి హామీ లాంటి పథకాలు అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినవేనని, ఇప్పుడు కేసీఆర్ కొత్తగా చేసిందేమి లేదన్నారు. ఈ పథకాలు తీసేసే ధైర్యం ఎవరకీ లేదన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిందని ఎవరూ అధైర్యపడొద్దని తాను అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. తమ ఎన్నికల హామీలను టీఆర్ఎస్ కాపీ కొట్టిందని ఆరోపించారు. -
ఎన్నికల కేసులపై పోలీస్‌శాఖ నజర్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన కేసులపై రాష్ట్ర పోలీసు శాఖ దృష్టి సారించింది. ఈసారి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద రాష్ట్ర వ్యాప్తంగా 1,527 నమోదయినట్లు పోలీసు శాఖ స్పష్టం చేసింది. కోడ్ ఉల్లంఘన కేసులతో పాటుగా ఎమ్మెల్యే, ఎంపీలపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తూ ఇటీవల అన్ని రాష్ట్రాలు ఉత్తర్వులు జారీ చేసిన దృష్ట్యా ఈ కేసుల విచారణ ఇకనుంచి వేగవంతం కానుంది. ఇందులో భాగంగా ఎక్కడెక్కడ ఏయే నేతపై ఎన్ని క్రిమినల్ కేసులు నమోదయ్యాయన్న అంశంపై త్వరలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించే యోచనలో పోలీస్ శాఖ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న 2014నాటి 99 క్రిమినల్ కేసులతో పాటుగా ఈసారి నమోదైన కేసులపై వెంటనే చార్జిషీట్ దాఖలు చేయాలని పోలీసు శాఖ సిద్ధమవుతోంది. స్థానిక కోర్టుల్లోనే విచారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటినుంచి ఫలితాలు వచ్చే వరకు కోడ్ కండక్ట్ ఉల్లంఘన కింద పలు పార్టీల అభ్యర్థులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులపై ఆధారాలు సేకరించడంతోపాటు దర్యాప్తు వేగవంతం చేస్తున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ కేసుల విచారణ స్థానిక కోర్టు పరిధిలోనే జరుగుతుందని, వీటిపై చార్జిషీట్లు సైతం 90 రోజుల్లోపే వేసి ట్రయల్స్ ప్రక్రియపై పూర్తి దృష్టి పెడతామని అధికారులు స్పష్టం చేశారు. ఎక్కువ తీవ్రత ఉన్న వాటిలో క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉందని, ఆధారాలను బట్టి ఆయా కేసుల పురోగతి ఉంటుందని చెబుతున్నారు. ఈ ఎన్నికల కోడ్ ఉల్లంఘన సమయంలో కొన్ని చోట్ల సాధారణ ఘర్షణలు జరిగాయని, ఇలాంటి కేసులు రాష్ట్రమొత్తంగా 100 కేసులుంటాయని ఎన్నికల కమిషన్‌కు పోలీస్ శాఖ నోడల్ అధికారులు నివేదికిచ్చారు. వీటిపై దర్యాప్తు లోతుగా ఉంటుందని, కుట్రపూరితంగా వ్యవహరించినట్టు తేలితే వారిపై కఠిన చర్యలుంటాయని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. -
రేణుక ప్రాబల్యం తగ్గుతోందా?
సాక్షి, మధిర: దశాబ్దకాలానికిపైగా ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి కీలకంగా పనిచేశారు. ఒక రకంగా శాసించారు. ఏకచత్రాధిపత్యంగా పట్టుసాధించిన ఆమె ప్రాబల్యం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నానాటికీ తగ్గిపోతోందనే ప్రచారం జరుగుతోంది. ఖమ్మం పార్లమెంట్ సభ్యురాలిగా 1999, 2004 ఎన్నికల్లో గెలుపొంది కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా, కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేంద్రమంత్రి హోదాలో సుడిగాలి పర్యటనలు చేసి కాంగ్రెస్‌లో తన వర్గాన్ని బలోపేతం చేసుకున్నారు. ఆమె చెప్పిందే వేదంగా నడిచింది. కోట్లాదిరూపాయల నిధులు జిల్లా అభివృద్ధికి మంజూరు చేయించారు. అయితే 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు చేతిలో ఆమె ఓటమి చెందారు. 2014 ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగ్గా.. ప్రస్తుత ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఆమెకు ఉన్న పలుకుబడితో రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈ పదవీకాలం కూడా ముగిసింది. ఈ క్రమంలో జిల్లా కాంగ్రెస్‌లో మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ప్రాబల్యం పెరుగుతూ వచ్చింది. భట్టి సహకారంతోనే ఐతం సత్యం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడయ్యారు. భట్టి అనుచరుడిగా ఉన్న సత్యంను పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకుండా అడ్డుకునేందుకు ఆమె అప్పట్లో ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఐతం సత్యం మృతి చెందిన తర్వాత ఆ పదవిని నేటికీ భర్తీ చేయలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆమె వర్గీయులకు టికెట్లు దక్కలేదు. కొత్తగూడెం నియోజకవర్గంలో రేణుకా అనుచరుడిగా ఉన్న ఎడవల్లి కృష్ణకు కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో బీఎల్ఎఫ్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఖమ్మం సీటుకోసం ఆమె అనుచరులు పోట్ల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిషోర్, పాలేరు సీటుకోసం రాయల నాగేశ్వరరావు ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రజాకూటమి పొత్తుల్లో భాగంగా ఖమ్మం సీటు టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు.. పాలేరు సీటు కందాల ఉపేందర్‌రెడ్డికి ఇచ్చారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆమె పట్టుకోల్పోతున్నారని రాజకీయపార్టీలు చర్చించుకుంటున్నాయి. అంతేకాంకుండా రేణుకా వర్గీయులుగా మధిర మండలంలో గెలుపొందిన ఇద్దరు సర్పంచ్‌లు, ఒక ఎంపీటీసీ సభ్యుడితోపాటు కొంతమంది అనుచరులు టీఆర్ఎస్లో చేరారు. వైరా నియోజకవర్గంలో రేణుకాచౌదరి వర్గీయులు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సూరంపల్లి రామారావు, కారేపల్లి మాజీ ఎంపీపీ పగడాల మంజుల తదితరులు పార్టీకి రాజీనామా చేసి.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచిన లావుడ్యా రాములు నాయక్‌కు మద్దతు ఇచ్చారు. దీనికితోడు మల్లు భట్టి విక్రమార్క మధిర అసెంబ్లీ స్థానంనుంచి మూడుసార్లు గెలుపొందడం.. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టం.. రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజా కూటమి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో ఆయనకు అధిష్టానం దగ్గర పరపతి పెరిగినట్లు క్షేత్రస్థాయి కేడర్‌లో చర్చజరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌గాంధీ వచ్చినప్పుడు నిర్వహించిన బహిరంగ సభల్లో కూడా రేణుకా చౌదరికి మాట్లాడే అవకాశం కూడా రాకపోవడంపై ఆమె వర్గీయులు ఆవేదనకు గురయ్యారు. అదేవిధంగా ఈ సారి కాంగ్రెస్ తరఫున భట్టికి సీఎల్పీ లీడర్ కానీ, మరేదైనా ప్రాధాన్యత కలిగిన పార్టీ పదవి కట్టబెట్టే అవకాశం ఉందని సమాచారం. దీంతో జిల్లా కాంగ్రెస్‌లో భట్టి పట్టు సాధిస్తుండగా.. రేణుకాచౌదరి ప్రాధాన్యత తగ్గిపోతుందని వివిధ పార్టీల నాయకులు చర్చించుకుంటున్నారు. -
‘ట్రక్’ గుర్తు చేటుపై ..తర్జన భర్జన!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపోటములను తారుమారు చేయడమే కాదు, కొన్ని నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థుల మెజారిటీలను గణనీయంగా తగ్గించిన ‘ట్రక్’ గుర్తు చేసిన నష్టంపై అధికార పార్టీలో తర్జన భర్జన నడుస్తోంది. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నాలుగు చోట్ల విజయం సాధించగా, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో ఓటమి పాలైంది. సమాజ్‌వాదీ ఫార్వర్డ్ బ్లాక్ (ఎస్ఎఫ్బీ) పార్టీకి ఈ ఎన్నికల్లో ట్రక్ గుర్తును కేటాయించారు. ఇది టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు ‘కారు’ను పోలి ఉండడంతో గ్రామీణులు, ముఖ్యంగా నిరక్షరాస్యులు ట్రక్ గుర్తును చూసి కారనుకున్నారన్న వాదన టీఆర్ఎస్ వర్గాలనుంచి వినిపిస్తోంది. ఎస్ఎఫ్బీ పార్టీనుంచి అభ్యర్థులు పోటీలో లేని నియోజకవర్గాల్లో ట్రక్ గుర్తును కోరుకున్న స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించారు. ప్రధానంగా వయో వృద్ధులు ఈ గుర్తు విషయంలో చాలా గందరగోళానికి గురయ్యారని, తమ పార్టీ అభ్యర్థులకు పడాల్సిన ఓట్లు ట్రక్ గుర్తుకు పడ్డాయని టీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు. ఎస్ఎఫ్బీ పార్టీ నుంచి పోటీలో నిలబడిన వారు ఎవరూ నియోజకవర్గాల్లో ఎలాంటి ప్రచారం చేయలేదని, విస్తృతంగా ప్రచారం చేసిన బీజేపీ, సీపీఎం వంటి పార్టీలకన్నా ఎక్కువ ఓట్లు ట్రక్ గుర్తున్న అభ్యర్థులకు పోలయ్యాయని చెబుతున్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో అత్యధిక పర్యాయాలు సీపీఎం ప్రాతినిధ్యం వహించింది. తొలి ఎన్నికల నుంచి 2014 ఎన్నికల దాకా కాంగ్రెస్ రెండు సార్లు, టీఆర్ఎస్ ఒకరి మాత్రమే గెలిచాయి. కానీ, ఈ ఎన్నికల్లో సీపీఎం పోటీలో ఉన్నా, ఆ పార్టీ అభ్యర్థికి కేవలం 4543 ఓట్లు రావడాన్ని ప్రస్తావిస్తున్నారు. అదే ఎస్ఎఫ్బీ అభ్యర్థి ట్రక్ గుర్తుపై ఏకంగా 10,383 ఓట్లు పోల్ కావడాన్ని వీరు ఉదహరిస్తున్నారు. జిల్లాలో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 9818 ఓట్లు, మునుగోడులో 2279 ఓట్లు ఎస్ఎఫ్బీ అభ్యర్థులకు పోల్ కాగా, ట్రక్ గుర్తుపొందిన ఇండిపెండెంట్ అభ్యర్ధులు ఉన్న మిర్యాలగూడలో 4,758, నల్లగొండ నియోజకవర్గంలో 2,932 ఓట్లు పోలయ్యాయి. ఈ అంశాలను విశ్లేషించుకున్న నేతలు కారు గుర్తును పోలిన ట్రక్ గుర్తు తమ అభ్యర్థుల మెజారిటీలు తగ్గించిందని, నకిరేకల్ నియోజకవర్గంలో ఏకంగా ఓటమికి కారణమైందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. రీ ఎలక్షన్‌కు డిమాండ్ నకిరేకల్ నియోజకవర్గంలో ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశం తన ఓటమికి దారితీసిన ట్రక్ గుర్తు వ్యవహారంపై కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన తన న్యాయవాదులు, పార్టీ అధినాయకత్వంతో చర్చించినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య 8,259 ఓట్ల మెజారిటీతో వేముల వీరేశంపై విజయం సాధించారు. అయితే, ట్రక్ రూపంలో తమ అభ్యర్ధికి 10,383 ఓట్లకు గండిపడిందన్నది టీఆర్ఎస్ నేతల అభిప్రాయం. ట్రక్ గుర్తు లేని పక్షంలో తమ అభ్యర్థి కనీసం 1500 నుంచి 2వేల ఓట్ల మెజారిటీతో గెలిచేవారని పేర్కొంటున్నారు. జాతీయ స్థాయిలో రిజిస్టర్డ్ పార్టీ అయిన సమాజ్‌వాదీ ఫార్వర్డ్ బ్లాక్ తమ అభ్యర్థులకు కామన్ గుర్తుగా ‘ట్రక్’ను కోరడంలో ఒక వ్యూహం దాగి ఉందన్నది వీరి అభిప్రాయం. ఈ గుర్తు చేసే నష్టాన్ని అంచనా వేసిన కొన్ని నియోజకవర్గాల్లో ఆ అభ్యర్థులను పోటీలో లేకుండా కొందరు మేనేజ్ చేసుకున్నారని, అయినా, ఇండిపెండెంట్లకూ ఇదే గుర్తు కేటాయింపు జరగడంతో తమ మెజారిటీలు తగ్గాయని అంటున్నారు. ప్రత్యేకించి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, ఈ ఎన్నికల్లో ఓడిపోయిన వేముల వీరేశం తమ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణ, పోలింగ్ సరళిపై పూర్తి వివరాలు కావాలని జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరించిన కలెక్టర్‌ను కోరారని తెలిసింది. అంతే కాకుండా గుర్తు చేసిన చేటు, గుర్తు కేటాయింపు తదితర అంశాలపై కోర్టును ఆశ్రయించనున్నట్లు చెబుతున్నారు. తమ నియోజకవర్గానికి రీ ఎలక్షన్ జరిపించాలని ఈసీని కూడా డిమాండ్ చేస్తూ కేసు వేయనున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. -
ఆద్యంతం ధన ప్రవాహమే
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ఆద్యంతం డబ్బు, మద్యం పంపిణీ చుట్టూనే తిరిగిందని తెలంగాణ ఎన్నికల నిఘా వేదిక పేర్కొంది. పార్టీలతో సంబంధం లేకుండా అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారని తెలిపింది. అధికారుల తనిఖీల్లోనూ రికార్డు స్థాయిలో నగదు దొరికిందని, ఇంత పెద్దమొత్తంలో ధన ప్రవాహం ఇప్పటివరకూ జరగలేదని వ్యాఖ్యానించింది. ఈ అక్రమాలను అరికట్టడంలో ఎన్నికల సంఘం సైతం పూర్తిగా విఫలమైందని నిఘా వేదిక అభిప్రాయపడింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన తెలంగాణ ఎన్నికల నిఘా వేదిక సమావేశంలో రాష్ట్ర కోఆర్డినేటర్లు ఎం.పద్మనాభ రెడ్డి, డాక్టర్ రావు చెలికాని, బండారు రామ్మోహన్రావు, బి.శ్రీనివాస్‌రెడ్డి, వై.రాజేంద్రప్రసాద్ పాల్గొని తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పరిశీలించిన అంశాలను జిల్లాల వారీగా నివేదించారు. ఓటరు జాబితాలో భారీగా అక్రమాలు ఓటరు జాబితాలో భారీగా అవకతవకలు జరిగాయని, కొత్తగా ఓటర్లు నమోదై స్లిప్పులు పొందినప్పటికీ చివరి నిమిషంలో వారి ఓట్లు గల్లంతయ్యాయని నిఘా వేదిక సభ్యులు తెలిపారు. ఈ అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తే సీఈఓ రజత్‌కుమార్ క్షమాపణ చెప్పి చేతులెత్తేశారన్నారు. చాలాచోట్ల కొత్త ఓటర్లు నమోదు కాగా...పాత ఓటర్లు భారీగా తొలగించబడ్డారని, కొన్నిచోట్ల ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లు కనిపించిందన్నారు. నగదు, మద్యం పంపిణీ, ఓటరు జాబితాలో అవకతవకలపై కనీసం వచ్చే ఎన్నికల్లోనైనా సమూల మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఓటరు జాబితాను ఆన్లైన్లో ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో పెడితే డ్యూయల్ ఓట్లు తగ్గిపోతాయని, ఓటరు కార్డును ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేయాలని సూచించారు. రాజకీయ పార్టీల ఖర్చుపై సీలింగ్ విధించాలని, నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లను పూర్తిస్థాయిలో పరిశీలించాలన్నారు. త్వరలో గ్రామ పంచాయతీ, పార్లమెంటు, సహకార, మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం పక్కాగా పనిచేయాలని కోరారు. త్వరలో జరిగే ఎన్నికలకు తెలంగాణ ఎన్నికల నిఘా వేదిక ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందని, ఓటర్లలో అవగాహన పెంచడంతో పాటు ఓటు వేసేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఈ నివేదిక ప్రతులను త్వరలో జిల్లా కలెక్టర్లకు అందజేయనున్నట్లు తెలిపారు. -
అన్ని ‘పంచాయతీ’లను గెలవాలి
ప్రత్యేక చాంబర్... టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కె.తారక రామారావు సోమవారం ఉదయం 11.56 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. కేటీఆర్ కోసం తెలంగాణభవన్‌లో ప్రత్యేకంగా చాంబర్‌ను ఏర్పాటు చేశారు. వచ్చే ఆరేడు నెలల్లో గ్రామపంచాయతీ, సహకార, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికలు వరుసగా ఉన్న నేపథ్యంలో తెలంగాణభవన్ కేంద్రంగా కేటీఆర్ పూర్తిస్థాయిలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండువారాల్లో అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. టీఆర్ఎస్ కమిటీలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర సమితి గురి పెట్టింది. అన్ని గ్రామపంచాయతీలను గెలిచేలా వ్యూహం రచిస్తోంది. గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు, బాధ్యులకు స్పష్టం చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ప్రతి గ్రామపంచాయతీకి రూ.పది లక్షల గ్రాంట్ వస్తుందని, వీలైనన్ని పంచాయతీలకు ఏకగ్రీవ ఎన్నికలు జరిగేలా ప్రయత్నించాలని సూచించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన తొలిసారి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం తెలంగాణ భవన్లో జరిగింది. టీఆర్ఎస్ను సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రక్రియపై కేటీఆర్ ఈ సమావేశంలో ప్రసంగిం చారు. 2006 నుంచి ఇప్పటిదాకా టీఆర్ఎస్లో తన రాజకీయ అనుభవాలను వివరించారు. డిసెంబర్ 26 నుండి జనవరి 6వ తేదీ వరకు ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రస్థాయి నేతలందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు. ఈ ప్రక్రియకు పదిరోజుల గడువున్న నేపథ్యంలో అందరూ గట్టిగా పనిచేయాలన్నారు. పంచాయతీ ఎన్నికల తర్వాత ఫిబ్రవరిలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, బీమా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. మార్చి నుంచి లోక్‌సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి లోక్సభస్థానానికి ఒక ప్రధాన కార్యదర్శిని, ముగ్గురు కార్యదర్శులను ఇన్‌చార్జీలుగా నియమిస్తామని, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు ఇన్చార్జీలు గా ఉంటారని తెలిపారు. జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. తెలంగాణభవన్‌లో ప్రజల ఫిర్యాదు విభాగం(పబ్లిక్ గ్రీవెన్స్ సెల్)ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఈ విభాగం పనిచేస్తుందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సమావేశం వివరాలను మీడియాకు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ముఠా గోపాల్, సుంకే రవిశంకర్, మైనంపల్లి హనుమంతరావు, పట్నం నరేందర్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిలను టీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి పదవుల నుంచి ఉపసం హరిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్లో వైరా ఎమ్మెల్యే చేరిక వైరాలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన లావుడ్య రాములునాయక్ శనివారం టీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. అనంతరం రాములునాయక్ తన అనుచరులతో కలసి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తెలంగాణభవన్‌లో టీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ గులాబీ కండువా కప్పి రాములునాయక్‌ను టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం వైరా నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడారు. ‘ఎన్నికల తర్వాత టీఆర్ఎస్లో మొదటి చేరిక వైరా నుంచి కావడం ఆనందంగా ఉంది. వైరా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తా. తెలంగాణ అంతటా అనుకూల పవనాలు వీచినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫలితాలు నిరాశ కలిగించాయి. రాబోయే రోజుల్లో కష్టపడి పనిచేసి జిల్లావ్యాప్తంగా గులాబీ జెండా ఎగురవేస్తాం. జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేసి బీడు భూములను సస్యశ్యామలం చేస్తాం. మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు, ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాలు పూర్తయితే టీఆర్ఎస్ అజేయశక్తిగా మారుతుంది. లోక్‌సభ ఎన్నికల్లో పదహారు సీట్లు గెలిచి టీఆర్ఎస్ సత్తా చాటుదాం. ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకునేలా కార్యకర్తలు శ్రమించాలి. బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే. వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడాలనేది టీఆర్ఎస్ శాసించాలి. మనం చెబితే ఏర్పడే ప్రభుత్వం ఢిల్లీలో కావాలంటే టీఆర్ఎస్ 16 సీట్లు గెలవాలి. యాచించే స్థితి నుంచి ఢిల్లీలో శాసించే స్థితికి తెలంగాణ ఎదగాలి. బీజేపీకి సంఖ్యాబలం ఉండబట్టే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను పెడచెవిన బెట్టింది. కేంద్రంలో మనకు అనుకూల ప్రభుత్వం ఏర్పడితే బయ్యారం లాంటి వాటికి పరిష్కారం దొరుకుతుంది. ఖమ్మంలో అన్ని నియోజక వర్గాలను అభివృద్ధి చేస్తాం. బంగారు తెలంగాణ దిశగా చిత్తశుద్ధితో పని చేస్తాం’అన్నారు. రాములు నాయక్‌ను కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్న కేటీఆర్. చిత్రంలో పొంగులేటి -
‘హస్త’వాసి మారేనా?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం మూటగట్టుకున్నా భవిష్యత్తు మీద గంపెడాశలు పెట్టుకుంది. ముఖ్యంగా త్వరలోనే జరగనున్న గ్రామ పంచాయతీ, మున్సిపల్, సహకార, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీని పరుగులు పెట్టించాలని యోచిస్తోంది. ఈ అన్ని ఎన్నికల్లో ఎంతోకొంత మెరుగైన ఫలితాలు సాధిస్తేనే లోక్‌సభ పోరులో టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇవ్వగలమన్న భావనతో ఉన్న పార్టీ అందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేసుకునే పనిలో పడింది. టీడీపీతోనా.. ఒంటరిగానా.. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి కోలుకునే ప్రయత్నాల్లో కాంగ్రెస్ మునిగింది. టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లినా ఓటమే ఎదురైన నేపథ్యంలో పొత్తులపై పునరాలోచన చేయాలని భావిస్తోంది. ఇప్పటికే టీడీపీతో పొత్తు పార్టీకి చేటు కల్గించిందని పార్టీ అంతర్గత సమావేశాల్లో నేతలు తమ అభిప్రాయాలు చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రచారంలోకి అడుగుపెట్టగానే ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ సెంటిమెంట్‌ను రాజేశారని, పరాయి రాష్ట్రనేతల పాలన అవసరమా? అంటూ భావోద్వేగాలను రెచ్చగొట్టడంతో ఆ ప్రభావం పార్టీపై పడిందని ఇటీవల జరిగిన పార్టీ పోస్టుమార్టమ్ సమావేశాల్లో నేతలు స్పష్టం చేశారు. ఇక, పంచాయతీ ఎన్నికల్లో ఒంటరిగానే ముందుకెళ్తామని ఇటీవల టీజేఎస్ సంకేతాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాము సైతం ఒంటరిగా వెళ్లాలన్న భావన ఎక్కువమంది కాంగ్రెస్ నేతల్లో ఉన్నా, హైకమాండ్ సూచనలకు అనుగుణంగా నడుచుకుంటామని కాంగ్రెస్‌పెద్దలు వ్యాఖ్యానిస్తున్నా రు. పంచాయతీ ఎన్నికలపై భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకునేందుకుగానూ త్వరలోనే కీలకనేతలతో పీసీసీ పెద్దలు సమావేశం కానున్నారు. -
ఒక్క సీటూ రాలేదు.. ఉన్న ఓట్లూ దక్కలేదు!
సాక్షి, హైదరాబాద్ : తాజా అసెంబ్లీ ఎన్నికలు సీపీఎంను అంతర్మథనంలోకి నెట్టేసింది. తమ పార్టీకి సంప్రదాయకంగా పడే ఓట్లూ రాకపోగా, ఉన్న కాస్త ఓట్లు కూడా చెదిరిపోవడంతో ఇప్పుడా పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీగా గత ఎన్నికల్లో ఓటర్లు వ్యతిరేకించినప్పటి స్థితి కంటే ఈ ఎన్నికల్లో తాము దిగజారిపోవడంతో ఆ పార్టీ నేతలు కలవర పడుతున్నారు. రాష్ట్ర రాజకీయ వాతావరణంలో వచ్చిన మార్పు,చేర్పుల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందా ? లేక కిందిస్థాయిలో సంస్థాగతంగా పార్టీ బలహీనపడిందా అన్న సందేహాలు వారిలో వ్యక్తమవున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీకి గట్టి పట్టున్న నియోజకవర్గాల్లోనూ ఓటింగ్ చెదిరిపోవడం, ఆశించిన మేర సీట్లు రాకపోయినా ఓటింగ్ పెంచుకుంటామన్న అంచనా కుదేలవ్వడంతో పార్టీ నాయకుల్లో నిరాశా, నిస్పృహలు అలుముకున్నాయి. ఒక్క సీటయినా గెలవకపోగా, అధికశాతం నియోజకవర్గాల్లో సీపీఎం–బీఎల్ఎఫ్ అభ్యర్థులకు నామమాత్రం ఓట్లు పోలు కావడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. కిందివాళ్లు రాలేదు..పై వాళ్లు దూరమయ్యారు...! రాష్ట్రంలో 90 శాతానికి పైగా ఉన్న బహుజనులకు (ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీలు, మహిళలు) ప్రాధాన్యం పెంచేందుకు, సామాజిక న్యాయం చేకూర్చేందుకు ఎజెండాను ముందుకు తీసుకెళ్లినా ఈ వర్గాల నుంచే తగిన సహకారం అందలేదని సీపీఎం– బీఎల్ఎఫ్ నేతలు వాపోతున్నారు. రాష్ట్రంలో తాము చేసిన కొత్త ప్రయోగానికి కిందిస్థాయిలోని ఆయా వర్గాలు కలిసి రాకపోగా, ఈ ఎజెండా కారణంగా ఇప్పటివరకు మద్దతుగా ఉన్న పై కులాలు, వర్గాలు కూడా పార్టీకి దూరమయ్యాయని అంచనా వేస్తున్నారు. అధికార టీఆర్ఎస్– విపక్ష కాంగ్రెస్ కూటమి మధ్యలోనే ప్రధాన పోటీ ఉండడంతో ఓటర్లు తమను పట్టించుకోలేదని సీపీఎం నాయకులు విశ్లేషిస్తున్నారు. అసలు ఈ ఎజెండాను ఎవరి కోసం చేపట్టామో దానిని కిందిస్థాయి వరకు తీసుకెళ్లి ప్రజలకు బలంగా వివరించడంలో తమ వైఫల్యం ఉందని వారు అంగీకరిస్తున్నారు. కలసి రాని తమ్మినేని పాదయాత్ర వాస్తవానికి 2019 ఎన్నికలపై ఎలాంటి ముందస్తు అంచనాలు లేకుండా 2016–2017 మధ్యలో దాదాపు ఆరునెలల పాటు పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రవ్యాప్త పాదయాత్ర కూడా ఇప్పుడు సీపీఎంకు ఆశించిన ఫలితాలు చేకూర్చక పోవడం వారిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ పాదయాత్ర అనంతరం ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు–సామాజికన్యాయం సాధనకు ‘లాల్–నీల్’ (కమ్యూనిస్టులు, బహుజనులు) పేరిట చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలివ్వడంతో ఎన్నికలకు ముందు ‘ సీపీఎం– బహుజన లెఫ్ట్ ఫ్రంట్’ (బీఎల్ఎఫ్) ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా వివిధ వామపక్షాలు, కుల, సామాజిక సంఘాలు, సంస్థలను బీఎల్‌ఎఫ్‌లోకి తెచ్చే ప్రయత్నాలు విఫలమయ్యాయి.దీంతో పార్టీ లక్ష్యాలకు అనుగుణంగా విస్తృత వేదిక ఏర్పాటు సాధ్యం కాలేదు. మరో వైపు బీఎల్‌ఎఫ్‌పై సీపీఎం ముద్ర బలంగా ఉన్న కారణంగానే సీపీఐ, ఇతర కమ్యూనిస్టుపార్టీలు, సామాజికసంస్థలు కలసి రాలేదనే అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తంచేస్తున్నారు.ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 26 సీట్లలో పోటీచేసిన సీపీఎంకు మొత్తం 88,733 ఓట్లు (0.4 శాతం), 81 స్థానాల్లో బరిలో నిలచిన బీఎల్‌ఎఫ్‌కు 1,41,119 ఓట్లు (0.7శాతం) మాత్రమే వచ్చాయి. -
ఇవేం ఫలితాలు..!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహాలు, పోల్ మేనేజ్మెంట్ను అంచనా వేయడంలో విఫలం కావడం వల్లే రాష్ట్రంలో పార్టీకి ప్రస్తుత పరిస్థితి ఎదురైందనే చర్చ కమలనాథుల్లో సాగుతోంది. పార్టీ విస్తరణకు తగ్గట్టుగానే గెలిచే సీట్లు, మద్దతుదారుల ప్రభావం ఎక్కడెక్కడ అధికంగా ఉంది.. ప్రభావం చూపే అంశాలేమిటీ.. పార్టీపరంగా అనుసరించాల్సిన ప్రత్యేక వ్యూహాలేమిటీ.. అనే అంశాలను లోతుగా పరిశీలించి సరైన కార్యాచరణను సిద్ధం చేసుకోకపోవడం వల్లే నిరాశాజనకమైన ఫలితాలు వచ్చాయని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జాతీయ కమిటీ నుంచి సహాయ, సహకారాలు, మద్దతు అందినా వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోయామనే భావన వ్యక్తమవుతోంది. దాదాపు పది సీట్ల వరకు గెలుచుకోలేకపోయినా, గతంలో గెలిచిన ఐదు స్థానాల్లోనైనా నిలబెట్టుకోలేక, చివరకు ఒక్క సీటుకే పరిమితం కావడాన్ని ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీకి మద్దతుగా ఉన్న వర్గాలు కూడా ఫలితాల పట్ల తీవ్రస్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా బీజేపీ గెలిచే స్థానాలు గణనీయంగా తగ్గిపోగా, ప్రత్యర్థి పార్టీగా పరిగణించే ఎంఐఎం గతంలోని ఏడుసీట్లను మళ్లీ నిలబెట్టుకోవడం బీజేపీ మద్దతుదారులకు కొరుకుడు పడడంలేదు. క్షేత్రస్థాయిల్లోని రాజకీయ పరిస్థితులను సరిగ్గా అంచనా వేసి తదనుగుణంగా పావులు కదపడంలో పార్టీ నాయకులు విఫలమయ్యారనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రధానమైన ఎన్నికల అంశాలన్నీ పక్కకు పోవడం, చంద్రబాబు ప్రచారంతో తెలంగాణ సెంటిమెంట్‌ను కేసీఆర్ చర్చనీయాంశం చేయడం, అది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపడం వంటి వాటిని ముందే ఊహించలేకపోయినట్టు ఆ పార్టీ నాయకులు అంగీకరిస్తున్నారు. 1983లోనూ ఇలాంటి స్థితే... ఈ ఎన్నికల్లో 118 స్థానాల్లో (భువనగిరి సీట్లో మినహా) పోటీ చేసి 103 చోట్ల అభ్యర్థులు డిపాజిట్లు కూడా కోల్పోయే పరిస్థితులు ఏర్పడటాన్ని బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. సీట్లు గెలవకపోయినా ఓట్ల శాతం అయినా పెరుగుతుందనే ఆశలు సైతం నెరవేరకపోవడం వారిని మరింతగా బాధిస్తోంది. రాజకీయపార్టీగా బీజేపీ ఏర్పడి ఉమ్మడి ఏపీలో సొంతంగా ఎదుగుతున్న క్రమంలో 1983లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎదురైన పరిస్థితులను ఇప్పుడు కొందరు నేతలు ప్రస్తావిస్తున్నారు. ఆ ఎన్నికల్లో పార్టీ మంచి ప్రదర్శన చూపుతుందని, మంచి సంఖ్యలోనే సీట్లు గెలుస్తుందని నాయకులతోపాటు అభిమానులు ఆశించారు. అయితే, ఫలితాలు భిన్నంగా వచ్చి మూడు సీట్లకే బీజేపీ పరిమితమైంది. బీజేపీకి తక్కువ సీట్లు రాగా ఆ ఎన్నికల్లోనే ఏఐఎంఐఎం ఏకంగా ఐదుసీట్లను గెలుచుకోవడం మద్దతుదారులకు మింగుడుపడటంలేదు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పార్టీ గెలిచే సీట్లు పెరగడానికి అప్పుడున్న రాజకీయ పరిస్థితులతోపాటు అభిమానుల మద్దతు కూడా కారణమని చెబుతున్నారు. మళ్లీ అలాంటి పరిణామాలు పునరావృతమయ్యేలా పరిస్థితుల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు. -
గుట్టు తేల్చబోతున్నారు!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు తాపత్రయపడ్డ అభ్యర్థులకు ఫలితాల తర్వాత షాకులు తగులబోతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు, ఐటీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా రూ.125 కోట్లు స్వాధీనం చేసుకోగా, ప్రధానంగా వరంగల్ జిల్లా పెంబర్తిలో పట్టుబడ్డ రూ.5.8 కోట్ల వ్యవహారం సంచలనంగా మారనుంది. కారు సీట్ల వెనుక సీక్రెట్ బాక్స్‌లో తరలిస్తున్న డబ్బును పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు ప్రముఖ రాజకీయ నేతల పేర్లు విన్పిస్తున్నాయి. వరంగల్ ఈస్ట్ కాంగ్రెస్ అభ్యర్థి రవిచంద్ర, పరకాల అభ్యర్థి కొండా సురేఖ, ఖమ్మం అసెంబ్లీ బరిలో నిలిచిన మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు మెడకు ఈ కేసు చుట్టుకోబోతున్నట్లు సమాచారం. ఎక్కడి నుంచి.. హైదరాబాద్ గోషామహల్‌కు చెందిన హవాలా వ్యాపారి కీర్తికుమార్ జైన్ రూ.5.8 కోట్లను వరంగల్ తీసుకెళ్తూ పట్టుబడ్డాడు. ఈ డబ్బును నామా నాగేశ్వర్రావు, కొండా మురళి, రవిచంద్రలకు చేర్చేందుకు వెళ్తున్నట్లు కీర్తికుమార్ జైన్ పోలీసుల ఎదుట ఒప్పుకొన్నాడు. ఈ డబ్బు హవాలా మార్గంలో ఎక్కడి నుంచి వచ్చింది.. పంపించిన వ్యక్తి ఎవరు.. అతడి వివరాలపై వరంగల్ పోలీసులు ఆరా తీస్తున్నారు. సింగపూర్‌లోని ఓ వ్యక్తి హవాలా ద్వారా ఈ డబ్బును చెన్నైకి పంపించినట్లు అనుమానిస్తున్నారు. చెన్నై నుంచి కీర్తికుమార్‌కు ఈ డబ్బు చేరినట్లు తెలిసింది. సింగపూర్‌లో ఉన్న వ్యక్తి ఎవరు.. మహాకూటిమి అభ్యర్థులకు డబ్బు పంపాలని ఆ సింగపూర్ వ్యక్తిని ఆదేశించిందెవరన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. నేతలకు తాఖీదులు..: పలానా వ్యక్తి నుంచి డబ్బు వస్తుందని నామానాగేశ్వర్రావుతో పాటు కొండా మురళి, రవిచంద్రలకు సమాచారం ఉన్నట్లు వరంగల్ పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురిని త్వరలోనే విచారించేందుకు రంగం సిద్ధం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంలో కేసులు నమోదు చేసిన పోలీసు శాఖ వీరికి త్వరలో నోటిసులు జారీచేసి విచారణకు రావాలని ఆదేశించనుంది. విచారణలో పలు అంశాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. గతంలో కూడా హవాలా ద్వారా డబ్బు రవాణా జరిగిందా.. డబ్బు పంపింన అసలు వ్యక్తి ఎవరన్న దాన్ని తేల్చాలని వరంగల్ పోలీసులు భావిస్తున్నారు. బాబు కోటరీయేనా? మహాకూటమికి అన్నీ తానై నడిపించిన ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులే ఈ హవాలా డబ్బు వెనుక ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నామా నాగేశ్వర్రావు.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. రవిచంద్రకు వరంగల్ ఈస్ట్ టికెట్‌ను కాంగ్రెస్ నుంచి ఇప్పించేందుకు చంద్రబాబు మంత్రాంగం నడిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరితో పాటు కొండా సురేఖ ఎన్నికల ఖర్చు కోసం కూడా చంద్రబాబు కోటరీయే హవాలా ద్వారా డబ్బును వరంగల్ చేర్చేందుకు ప్రయత్నించినట్లు రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రిమాండ్‌లో ఉన్న కీర్తికుమార్‌ను కస్టడీలోకి తీసుకునేందుకు వరంగల్ పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఆయన కస్టడీలో అసలు కథ ఏంటన్న అంశాలు వెలుగులోకి వస్తాయని రాష్ట్ర నిఘా వర్గాలు భావిస్తున్నాయి. -
కేటీఆర్ చేతిలో స్టీరింగ్
ఇందిరాగాంధీ, ఎన్‌టి రామారావు, అటల్ బిహారీ వాజపేయి, చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళి నిండా మునిగారు. కల్వకుంట్ల చంద్ర శేఖరరావు (కేసీఆర్) మాత్రం విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఎన్ని కలలో గెలుపోటములు సర్వసాధారణం. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అసెంబ్లీ ఎన్నికలలో పోరాడి గెలుపొందిన విధం విశేషమైనది. టీఆర్ఎస్ విజయంపై అధిక సంఖ్యాకులకు అనుమానం లేదు. కొందరు రాజకీయ పరిశీలకులూ, మీడియా ప్రవీణులూ వ్యక్తిగతంగా కేసీఆర్ పట్ల ఆగ్రహం కారణంగా టీఆర్ఎస్ ఓడిపోవాలని కోరుకున్నారు. ఓడిపోతుందని తీర్మానించుకున్నారు. ఆకాంక్షకూ, అంచనాకూ మధ్య సరిహద్దురేఖ చెదిరిపోయి గందరగోళానికి గురైనారు. కేసీఆర్ పట్ల కినుక వహించడానికి తగిన కారణాలు ఉండవచ్చు. ప్రజల ఆలోచనా ధోరణి çపసికట్టడంలో అది అవరోధం కాకూడదు. టీఆర్ఎస్కు అసాధారణ మెజారిటీ లభించడానికి కారణాలు స్పష్టంగా కని పిస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ తప్పిదాలు చేయకుండా ఉంటే ఆ పార్టీకి ఇంత ఘోర పరాజయం ఉండేది కాదు. కేసీఆర్ ఉద్యమ సమయంలో మాట్లాడినట్టు కటువుగా మాట్లాడితేనే ప్రజలు మెచ్చుకుంటారనే భావనతో కాంగ్రెస్ నాయ కులు స్థాయి మరచి టీఆర్ఎస్పైనా, కేసీఆర్‌పైనా పరుషపదజాలం ప్రయోగిం చారు. కేసీఆర్ మాత్రం ఉద్యమభాషకు భిన్నంగా, ఆవేశరహితంగా ప్రజలకు తేలికగా అర్థమయ్యే విధంగా మాట్లాడారు. తనకు కాంగ్రెస్ అందించిన ఆయు ధాలతో సమర్థంగా పోరాడారు. ‘కేసీఆర్ కావాలా, చంద్రబాబు కావాలా?’ అన్న ప్రశ్న ప్రజల హృదయాలను సూటిగా తాకింది. త్యాగాలు చేసిన సాధించుకున్న తెలంగాణపైన అమరావతి ఆధిపత్యం అవాంఛనీయమని భావించిన ఓటర్లు క్యూలు కట్టి మూకుమ్మడిగా కారు బటన్ నొక్కారు. టీఆర్ఎస్ ఖాతాలో 88 స్థానాలు నమోదైనాయి. ఇద్దరు ఇండిపెండెంట్లు టీఆర్ఎస్లో చేరడానికి సంసి ద్ధత వెలిబుచ్చారు. చేర్చుకుంటే కాంగ్రెస్ నుంచి రావడానికి పది మంది సిద్ధంగా ఉన్నారని భోగట్టా. ఫలించిన కేసీఆర్ వ్యూహం ఏ ఫలితం ఆశించి కేసీఆర్ గడువు కంటే ఏడు మాసాల మందుగానే శాసన సభను రద్దు చేయించారో అది దక్కింది. అసెంబ్లీలో తిరుగులేని మెజారిటీ లభించింది. 1983లో, 1994లో ఎన్టిఆర్ కూడా పెద్ద మెజారిటీలు సాధిం చారు. ఈ సారి టీఆర్ఎస్ విజయంలోని విశేషం ప్రతిపక్షానికి చెందిన అతిరథమహారథులు మట్టికరవడం. పీసీసీకి కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉన్నవారు ఎన్నికల బరిలో రాణించలేకపోయారు. పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి ఓడిపోవడమే కాకుండా పాత కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలలో టీఆర్ఎస్ ప్రభంజనాన్ని ఇసుమంతైనా నిలువరించలేకపోయారు. ముఖ్య మంత్రి అభ్యర్థులుగా భావించిన జానారెడ్డి, డికె అరుణ, దామోదర రాజ నరసింహ వంటివారూ పరాజయం పాలైనారు. ఈ స్థాయికి చెందినవారిలో భట్టి విక్రమార్క ఒక్కరే తాను గెలుపొందడమే కాకుండా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, కూటమి అభ్యర్థుల విజయానికి కారకుడైనారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రి మండలిలో పని చేసిన మహిళలు గీతారెడ్డి, సునీతా లక్షా్మరెడ్డి, అరుణ, సురేఖ ఓడిపోయారు. ఒక్క సబిత మాత్రం గెలిచారు. కూటమికి ప్రచారం చేయడం పేరు మీద చంద్రబాబు మొదటి పాదం ఖమ్మం జిల్లాలోనే మోపినా భయ పడినంత నష్టం కాంగ్రెస్ అభ్యర్థులకు జరగలేదు. చంద్రబాబు ప్రభావం ఇతర జిల్లాలపైన విపరీతంగా పడింది. ప్రజల మనోభావాలతో నిమిత్తం లేకుండా, వారి ఆకాంక్షలనూ, అనుభవాలనూ పట్టించుకోకుండా, చంద్రబాబు పట్ల తెలంగాణలో ఎంతటి వ్యతిరేకత ఉన్నదో అర్థం చేసుకోకుండా కాంగ్రెస్ నాయకత్వం టీడీపీతో, ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జన సమితి (టీజెఎస్)తో, సీపీఐతో కలసి కూటమి కట్టి భంగపడింది. చంద్రబాబు పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకత ఒక్కటే కాదు, టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంలోని అనైతికతను కూడా ఢిల్లీ పెద్దలు పట్టించుకోలేదు. టీడీపీ ప్రతినిధిగా కంభంపాటి రామమోహనరావు ఢిల్లీలో రాహుల్‌గాంధీ కార్యాలయానికి వెళ్ళడం, కాంగ్రెస్ అధిష్ఠానం దూతగా అశోక్ గహ్లోత్ అమరావతికి రావడం, ఆ తర్వాత కాంగ్రెస్ జాబితా ఖరారు కావడం వంటివి అనేక అనుమానాలు రేకెత్తించాయి. ప్రజల ఆలోచనలను ప్రభావితం చేశాయి. టీఆర్ఎస్తో పొత్తుకోసం చంద్రబాబు ప్రయత్నించి విఫలమైన తర్వాతనే కాంగ్రెస్‌తో చేతులు కలపాలని నిర్ణయించుకున్నారనే సంగతి విస్మరించకూడదు. చంద్రబాబుకు టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా ఎటు వంటి అభ్యంతరం లేదు. సిద్ధాంతాలూ, సూత్రాలూ, విధానాలతో నిమిత్తం లేకుండా అవకాశవాద కూటములు కట్టే చంద్రబాబు వంటి నాయకుడితో స్నేహం చేస్తే బీజేపీకి ఎటువంటి పరాభవం జరిగిందో కాంగ్రెస్‌కూ అదే అను భవం ఎదురవుతుంది. లోక్‌సభ ఎన్నికలు కొద్ది నెలలోనే జరగబోతున్నాయి. పొత్తుల గురించీ, ఎత్తుల గురించీ, జిత్తుల గురించీ పునరాలోచించుకోవలసిన సమయం, సందర్భం ఇదే. కేటీఆర్‌కి ఉన్నత పదవి ఇదే మంచి సమయం అనుకొన్న కేసీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు (వర్కింగ్ ప్రెసిడెంట్)గా కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ను నియమించారు. ఇది కూడా అనూహ్య పరిణామం కాదు. ఇది కేసీఆర్ సమయజ్ఞతకు నిదర్శనం. అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ తర్వాత ఎక్కువ సభలలో మాట్లాడిన నాయకుడు కేటీఆర్. గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థులను ఎక్కువ స్థాయిలో గెలిపించిన ఘనత కేటీఆర్‌దే. మరో యువ నాయకుడు హరీష్‌రావు అవిభక్త మెదక్ జిల్లాపైన దృష్టి కేంద్రీకరించి మొత్తం పది స్థానాలలో తొమ్మి దింటిని టీఆర్ఎస్ ఖాతాలో వేయడంతోపాటు మహ బూబ్‌నగర్‌లో రేవంత్‌రెడ్డి, డికె అరుణ వంటి ఉద్దండులను ఓడించే బాధ్యత కూడా జయప్రదంగా నెరవేర్చారు. కేటీఆర్ విద్యాధికుడు, మూడు భాషలలో ప్రతిభావంతమైన వక్త. ఆయనను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడాన్ని ఎవ్వరూ ఆక్షేపించజాలరు. కేసీఆర్ చెప్పినట్టు కేటీఆర్ సమర్థుడూ, నమ్మ కస్తుడూ. ఇంతవరకూ నగర ప్రజల మనసులు గెలుచుకున్న కేటీఆర్‌కు పార్టీ నిర్మాణ క్రమంలో పంచాయతీ ఎన్నికలలో, పార్లమెంటు ఎన్నికలలో గ్రామీణ ప్రాంతాలలోని నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. నాయకుడిగా ఎది గేందుకు దోహదం చేస్తాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో కేసీఆర్ పోషించవలసిన పాత్ర ఏమైనా నిర్దిష్టంగా ఉంటే హైదరాబాద్‌లో కేటీఆర్‌ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడతార ని జనాభిప్రాయం. హరీష్‌ని అనుమానించకుండా, అవమానించకుండా సముచితమైన ఆదరణ, గౌరవం ఇచ్చినంతవరకూ కేటీఆర్‌కు ఇబ్బంది ఉండదు. పార్టీ అంతా అండగా ఆయన వెంటే నిలబడుతుంది. ఈ సంగతి కేటీఆర్కీ తెలుసు. వివేకంతో వ్యవహరిస్తారు. టీఆర్ఎస్తోనే తన గతం, వర్తమానం, భవిష్యత్తు ముడివడి ఉన్నాయనే స్పృహ హరీష్‌కూ ఉన్నది. ఫెడరల్ ఫ్రంట్ అవకాశాలు ఫలితాలు వెల్లడైన రోజునే మీడియా సమావేశంలో కేసీఆర్ చెప్పినట్టు ఫెడరల్ ఫ్రంట్ అనేది కాంగ్రెస్, బీజేపీల ప్రమేయంలేని మూడో కూటమి. రెండు జాతీయ పార్టీల వల్లా దేశానికి నష్టం జరుగుతున్న మాట వాస్తవమే. కానీ సమాఖ్యస్ఫూర్తి కోసం పోరాడాలని పథక రచన చేస్తున్న ప్రాంతీయ పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ఎంతవరకు పాటిస్తున్నాయనేది ప్రశ్న. స్థానిక సంస్థలకూ, పంచాయతీరాజ్ సంస్థలకూ నిధులనూ, విధులనూ ఏ మేరకు వికేంద్రీకరిస్తున్నాయనేదీ ప్రశ్నే. పైగా కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికలలో ఎంత లేదన్నా వందకు పైగా సీట్లు వస్తాయి. బీజేపీకి రెండువందల కంటే తగ్గక పోవచ్చు. మిగిలిన 245 స్థానాలలో కొత్తగా ఏర్పడబోయే ఫెడరల్ ఫ్రంట్ ఎన్ని గెలుచుకోగలదు? రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాలలోని లోక్‌సభ స్థానాల సంగతి ఏమిటి? ఒక రాష్ట్రం నుంచి ఏదో ఒక ప్రాంతీయ పార్టీ మాత్రమే కొత్త ఫ్రంట్‌లో ఉండగలదు. ఉదాహరణకు టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఒకే ఫ్రంట్‌లో ఉండవు. తమిళనాడులోనూ అంతే. కాంగ్రెస్, బీజేపీ కూటములను నిలువ రించడానికి ఫెడరల్ ఫ్రంట్ ఉపకరించవచ్చు. ఏదో ఒక జాతీయ పార్టీ మద్దతు లేకుండా స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి ఫ్రంట్‌కు ఉండదు. వీపీ సింగ్ ప్రభుత్వంలాగా బీజేపీ మద్దతునూ, దేవెగౌడ, గుజ్రాల్ లాగా కాంగ్రెస్ బాసటనూ తీసుకొని బలహీన ప్రభుత్వాలను ఏర్పాటు చేయవలసిందే కానీ ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసి నిలదొక్కుకోవడం కష్టం. అయినా సరే, అటువంటి ప్రయత్నం జరగడం మంచిదే. కాంగ్రెస్‌కు కొత్త కళ ఇటువంటి సమయంలో మూడు హిందీ రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం విశేషం. బీజేపీకి 2014లో అత్యధిక స్థానాలు సమకూర్చిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ పుంజుకున్నది. బలమైన ప్రాంతీయ పార్టీలు లేని రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యనే ఉంటుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ గెలుపొందింది. మాయావతి, అఖిలేశ్ సహకారంతో మధ్యప్రదేశ్‌లో అందలం ఎక్కబోతోంది. పదిహేనేళ్ళు అధికారంలో ఉన్న బీజేపీని చిత్తుగా ఓడించవలసిన కాంగ్రెస్ బొటా బొటి మార్కులతో పాస్ కావడాన్ని ఘనవిజయంగా భావించనక్కరలేదు. ఛత్తీస్‌గఢ్‌లో అనూహ్యంగా కాంగ్రెస్‌కు పెద్ద మెజారిటీ లభించింది. ఛత్తీస్‌గఢ్ తొలి ముఖ్యమంత్రి అజిత్‌జోగీ, మాయావతి కలసి ఏర్పాటు చేసిన కూటమి వల్ల కాంగ్రెస్‌కు చేటు కలుగుతుందని అత్యధికులు ఊహించారు. జోగీ బీజేపీకి నష్టం కలిగించి కాంగ్రెస్‌కు అసంకల్పితంగా ఉపకారం చేశారు. మూడు విడతలు వరుసగా ముఖ్యమంత్రులుగా పని చేసిన శివరాజ్‌సింహ్ చౌహాన్, రమణ్సింగ్ల ఓటమిని అర్థం చేసుకోవచ్చు. పదవీ విరమణ చేసిన తర్వాత చౌహాన్ నవ్వుతూ హాయిగా మాట్లాడటం అభినందించవలసిన విషయం. రాజస్థాన్‌లో చిత్తు చిత్తుగా ఓడిపోతుందని అనుకున్న బీజేపీ గట్టిగా ప్రతిఘటించడం బీజేపీ కార్య కర్తల బలాన్నీ, కాంగ్రెస్ పరిమితులనూ వెల్లడిస్తున్నది. మూడు హిందీ రాష్ట్రా లలో కాంగ్రెస్ విజయం వెనుక టీడీపీ కృషి ఉన్నదంటూ చంద్రబాబు చెప్పు కుంటున్నారు. అది ఆర్థిక ప్రమేయం కావచ్చునంటూ ప్రతిపక్ష నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. మూడు రాష్ట్రాలనూ చంద్రబాబు సందర్శించ కుండా కాంగ్రెస్ నెత్తిన పాలు పోశారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక విషయంలో రాహుల్‌గాంధీ వ్యవహరించిన తీరు ప్రశంసార్హం. ఇంతవరకూ కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో గెలిచినా ఢిల్లీ నుంచి అధిష్ఠానవర్గం దూతలు వెళ్ళడం, ఎంఎల్ఏలతో మాట్లాడటం, అక్కడి నుంచి పార్టీ అ«ధినేతతో ఫోన్లో మాట్లాడి ఆదేశం తీసుకోవడం లేదా ఢిల్లీ వెళ్ళి అంతా నివేదించి ఒక కవరుతో వచ్చి పార్టీ అధినేత నిర్ణయం ప్రకటించడం రివాజు. ఈ సారి ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న అభ్యర్థులను ఢిల్లీకి పిలిపించుకొని సోనియా, రాహుల్, ప్రియాంక (కుటుంబ వ్యవహారమని నిందించవచ్చు) సుదీర్ఘ సమాలోచనలు జరిపి, ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్‌ను నిర్ణయించి, పదవి లభించని జ్యోతిరాదిత్య సింధియాను సముదాయించి, సంతృప్తిపరిచి భోపాల్‌కు పంపించారు. కమల్‌నాథ్ సోమవారం ప్రమాణం చేస్తారు. జ్యోతిరాదిత్య ఢిల్లీలోనే రాహుల్‌కు సహాయకుడుగా ఉంటారు. రాజ స్థాన్లో కూడా ఇదే విధమైన రాజీ కుదిరింది. గహ్లోత్ ముఖ్యమంత్రిగా, సచిన్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. పదేళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన దిగ్విజయ్‌సింగ్ బీజేపీకి అధికారం అప్పగించి పదిహేను సంవత్సరాలు గడచిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ నాయకుడు కమల్‌నా«ద్ ముఖ్యమంత్రి పీఠంపైన కూర్చోబోతున్నారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిని ఈ రోజు నిర్ణయిస్తారు. ముఖ్య మంత్రి పదవికి నాయకులను నిర్ణయించే క్రమంలో కార్యకర్తల అభిప్రాయాలు కనుక్కునేందుకు కూడా రాహుల్ సర్వే పద్ధతి ప్రవేశపెట్టారు. ఈ ప్రక్రియవల్ల ఎంపికలో జాప్యం జరగవచ్చు. కానీ అందరినీ సంప్రదించారనే సంతృప్తి ఉంటుంది. మూడు రాష్ట్రాలలో విజయం కాంగ్రెస్‌కు ఆక్సిజెన్ అందించింది. రాహుల్ ప్రతిష్ఠ ఎంతో కొంత పెరిగింది. అయినప్పటికీ మోదీకి సమ ఉజ్జీ కాగలరా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం 2019 మే వరకూ వేచి ఉండాలి. అప్పుడే తెలంగాణలోనూ నాటకీయమైన పరిణామాలు సంభవించే అవకాశం ఉన్నది. వ్యాసకర్త: కె. రామచంద్రమూర్తి -
నిజంగానే ‘పీపుల్స్ పల్స్’ పట్టేసింది..!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి.. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఇకపోతే ఎన్నికలు పూర్తికాగానే.. జాతీయ మీడియా నుంచి.. స్థానిక మీడియా దాకా ప్రతి ఒక్కరు ఫలితాలను అంచనా వేసే ప్రయత్నం చేశారు. జాతీయ సర్వేలతో పాటు ఇక్కడి సర్వే సంస్థలు కూడా తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెప్పగా.. కేవలం లగడపాటి మాత్రం కూటమి గెలుపు ఖాయమని బల్లగుద్ది మరీ చెప్పారు. ఆయన జోస్యం తప్పింది. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన రాజకీయ పరిశోధన సంస్థ ‘పీపుల్స్ పల్స్’ నిజంగానే ప్రజల నాడిని పట్టే ప్రయత్నం చేసి 90 శాతం వరకూ కచ్చితమైన ఫలితాలను అందించినట్లు రీసర్చ్ అసోసియేట్ ఎస్ బాల నరసింహారెడ్డి తెలిపారు. పీపుల్స్ పల్స్ మాత్రమే దేశవ్యాప్తంగా గుణాత్మక, పరిమాణాత్మక సర్వే నిర్వహించిందన్నారు. గత తొమ్మిదేళ్లుగా దేశ వ్యాప్తంగా క్షేత్ర స్థాయి నుంచి స్టడీ చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల సందర్భంగా పీపుల్స్ పల్స్ జమ్ము-కశ్మీర్‌తో సహా ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర, దక్షిణ భారతదేశమంతటా మూడ్ సర్వేతో పాటు ప్రీ పోల్ సర్వేను కూడా నిర్వహించినట్లు తెలిపారు. ఈ క్రమంలో తాము అత్యంత కచ్చితమైన సమాచారాన్ని అందించినట్లు నరసింహారెడ్డి పేర్కొన్నారు. పీపుల్స్ పల్స్ కేవలం గెలుపు, ఓటముల్నే కాకుండా వాటి వెనక ఉన్న కారణాల గురించి కూడా విశ్లేషిస్తుందని తెలిపారు. ఈ ఏడాది జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పీపుల్స్ పల్స్ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల్లో మూడ్ సర్వేతో పాటు ప్రీ పోల్ సర్వేని కూడా నిర్వహించినట్లు నరసింహా రెడ్డి తెలిపారు. అయితే రవాణా సౌకర్యాల కొరత దృష్ట్యా రాజస్తాన్‌లో మాత్రం ఎటువంటి సర్వే నిర్వహించలేకపోయామన్నారు. మూడ్ సర్వే నిర్వహించిన వారు వారాల తరబడి ఈ రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లో సంచరించారన్నారు. పీపుల్స్ సర్వే వెల్లడించిన వివరాలు.. మధ్యప్రదేశ్‌లో హస్తం హవా... మధ్యప్రదేశ్‌లో మూడ్ సర్వే నిర్వహిస్తోన్నప్పుడు ప్రజలు ఈ సారి మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టంగా తెలిసిందన్నారు. ఇక ప్రీ పోల్ సర్వే ఫలితాలు కూడా అందుకు తగ్గట్లుగానే వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ దాదాపు 41. 6 శాతం ఓట్లతో దాదాపు 116 - 120 గెలుస్తుందని అంచాన పీపుల్స్ పల్స్ అంచనా వేసిందని తెలిపారు. దాని ప్రకారమే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ దాదాపు 40.9 శాతం ఓట్లతో 114 స్థానాల్లో గెలపొందింది. అయితే రైతుల్లో ఉన్న అసంతృప్తే బీజేపీ ఓటమికి ప్రధాన కారణంగా నరసింహా రెడ్డి పేర్కొన్నారు. అలానే బీఎస్పీ కేవలం 0 - 2 స్థానాల్లో గెలుపొందుతుందని చెప్పగా నిజంగానే ఈ ఎన్నికల్లో బీఎస్పీ కేవలం 2 స్థానాలకే పరిమితమయ్యింది. ఛత్తీస్‌గఢ్‌లోనూ లెక్క తప్పలేదు... ఛత్తీస్‌గఢ్‌లో 41శాతం ఓట్లు గెల్చుకుని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్ నివేదించింది. అలానే జేసీసీ, బీఎస్పీ రెండు కలిసి 11 శాతం ఓట్లను సాధిస్తాయని.. ఈ రెండు కూడా బీజేపీకి కీడు చేస్తాయని ప్రకటించింది. వాస్తవంగా కూడా అదే జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ 43 శాతం ఓట్లు గెల్చుకుని అధికారంలోకి రాగా.. జేసీసీ, బీఎస్పీ కూటమి 10. 9 శాతం ఓట్లు సాధించింది. అయితే పీపుల్స్ పల్స్ చెప్పినట్లు జేసీసీ, బీఎస్పీ కూటమి బీజేపీకి బాగానే హాని చేశాయి. ఇక మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు వచ్చాయి. తెలంగాణలో కారుకు నో బ్రేక్... ఇక తెలంగాణ విషయానికొస్తే.. ఇక్కడ 2018, అక్టోబర్ నాటికే మూడ్ సర్వేతో పాటు ప్రీ పోల్ సర్వే కూడా నిర్వహించినట్లు నరసింహా రెడ్డి తెలిపారు. ఈ రెండు సర్వేల్లో కూడా టీఆర్ఎస్సే మరోసారి అధికారంలోకి వస్తుందని వెల్లడించాయన్నారు. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. కానీ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించేంత వ్యతిరేకత మాత్రం లేదని సర్వేలో తెలిసిందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాగు, తాగు నీటి పథకాలు ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూల అభిప్రాయాన్ని కలిగించాయన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏం చేయలేదని.. టీజేఎస్, వామపక్షాలు టీఆర్ఎస్ ముందు నిలవలేవని పీపుల్స్ పల్స్ పేర్కొంది. ఈ సర్వేకు అనుగుణంగానే ఫలితాలు కూడా అలానే వచ్చాయి. టీజేఎస్, లెఫ్ట్ పార్టీలు ఖాతా తెరవకపోగా.. బీజేపీ ఒక్క స్థానానికే పరిమితమయ్యింది. ఈ సర్వేలో తెలిసిన మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. రాష్ట్రంలో ఉన్న ముస్లింలు, బీసీలు కేసీఆర్‌కు పెద్ద ఓటు బ్యాంక్‌గా నిలవనున్నట్లు తెలిసింది. ముస్లింలకు నరేంద్ర మోదీ పట్ల ఆగ్రహం ఉన్నప్పటికి.. కేసీఆర్ మీద మాత్రం సానుకూల అభిప్రాయమున్నట్లు తెలిసిందన్నారు. మిజోరాంలో తప్పిన అంచనా... ఇక మిజోరాం విషయానికొస్తే కాంగ్రెస్, ఎమ్ఎన్ఎఫ్లు సమానంగా సీట్లు సాధించడంతో హంగ్ ఏర్పడే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ మాత్రం పీపుల్స్ సర్వే అంచనాలు తప్పాయి. ఎమ్ఎన్ఎఫ్ మెజారిటీ స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మిజోరాంలో కేవలం 100 ఓట్లు నాయకుల భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి ఇక్కడ మాత్రం పీపుల్స్ సర్వే సరైన ఫలితాలు ఇవ్వలేకపోయిందని నరసింహా రెడ్డి అభిప్రాయ పడ్డారు. లోక్‌సభ ఎన్నికల సర్వే షూరూ.. చాలా కచ్చితమైన సమాచారాన్ని ఇస్తోన్న ‘పీపుల్స్ పల్స్’ ప్రస్తుతం రాబోయే 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను అంచనా వేసే పనిలో పడింది. ఇప్పటికే సంస్థ సభ్యులు ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తూ పని మొదలు పెట్టినట్లు నరసింహ రెడ్డి తెలిపారు. 2019, ఫిబ్రవరి రెండో వారం నుంచి మూడ్స్ సర్వేని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
హరీశ్‌రావుపై వెల్లువెత్తిన అభిమానం!
సాక్షి, హైదరాబాద్ : రాజకీయాల్లో రికార్డుల మీద రికార్డులు సృష్టించిన టీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావుపై అభిమానం వెల్లువెత్తింది. తెలంగాణ ఎన్నికల్లో 1,18,699 ఓట్ల మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించిన ఈ టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్‌కు అభినందనలు తెలిపేందుకు ఆయన అభిమానగణం తరలింది. వందలాది వాహనాల్లో వేలాదిగా అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు ఆయన నివాసానికి తరలిరావడంతో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్లు కిక్కిరిసాయి. మినిస్టర్స్ క్వార్టర్స్ జామ్ అయ్యాయి. అయితే టీఆర్ఎస్ తొలి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా (వర్కింగ్ ప్రెసిడెంట్) కేటీఆర్ నియమితులైన నేపథ్యంలో హరీష్ అభిమానులు వేలాదిగా తరలిరావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ ఎన్నికల్లో వ్యూహకర్తగా హరీష్ రావు తన పావులు కదిపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఓడించడంలో.. సీఎం కేసీఆర్ గజ్వేల్‌లో భారీ మెజార్టీతో గెలవడంలో కీలక పాత్రపోషించారు. టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్‌గా వ్యూహాలు రచించడంలో తాను దిట్టా అని మరోసారి నిరూపించుకున్నారు. చదవండి: కేసీఆర్ పంతం.. హరీశ్ వ్యూహం..రేవంత్ ఓటమి! హరీశ్ అదుర్స్... -
బదిలీ కాని ఓటు.. అంచనాలు తలకిందులు.!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : మహా కూటమి మంత్రం పారలేదు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలు కలిస్తే గణనీయమైన ఓట్లు వస్తాయని, తేలిగ్గా విజయం సాధిస్తామని భావించిన కాంగ్రెస్ నాయకత్వం అంచనాలు తలకిందులయ్యాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ ఒక జట్టుగా.., టీడీపీ, బీజేపీ మరో జట్టుగా.. టీఆర్ఎస్ ఒంటరిగా పోటీచేశాయి. ఈసారి ఎన్నికల్లో మహా కూటమి పేర కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ చేతులు కలిపాయి. గత ఎన్నికల్లో ఈ పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్లన్నీ కలిపితే.. ఈసారి మహాకూటమి అభ్యర్థులకు తేలికైన విజయాలు దక్కాలి. కానీ, వాస్తవంలో అలా జరగకపోవడం, నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పరాజయం పాలుకావడంతో కూటమి పార్టీల మధ్య ఓటు బదిలీ కాలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వాస్తవానికి గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్లును కలిపితే, గెలుపోటములతో సంబంధం లేకుండా దాదాపు అన్ని స్థానాల్లో మహా కూటమికి ఖాతాలోనే ఎక్కువ ఓట్లు కనిపిస్తున్నా యి. అయితే.. ఈ ఎన్నికల్లో ఆ ఓట్లన్నీ కూటమి అభ్యర్థులకు (కూటమి పక్షనా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే పోటీ చేశారు) గంప గుత్తగా పడతాయని ఆశించిన కాంగ్రెస్ నాయకత్వానికి ఆశాభంగం జరగగా, టీఆర్ఎస్ అభ్యర్థులకు గణనీయమైన ఓట్లు పోలయ్యాయి. బలపడిన టీఆర్ఎస్ గత ఎన్నికల్లో దేవరకొండ, నల్లగొండ నియోజకవర్గాల్లో మూడు స్థానంలో, నాగార్జునసాగర్, మిర్యాలగూడలో రెండో స్థానంలో నిలవగా, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. కానీ, ఈసారి నకిరేకల్, మునుగోడు స్థానాలను కోల్పోయి, గత ఎన్నికల్లో ఓటమి పాలైన నాలుగు నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఐదేళ్లుగా జరిగిన మార్పులు, చేర్పులు, చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో టీఆర్ఎస్ చాలా చోట్ల బలపడింది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దేవరకొండ నియోజకవర్గంలో రెండో స్థానంలో నల్లగొండలో టీడీపీ రెబల్ రెండో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వీరికి వచ్చిన ఓట్లు ఈ సారి కూటమికి బదిలీ కాలేదన్న అంశం తాజా ఓట్ల గణాంకాలు స్ప ష్టం చేస్తున్నాయి. నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కూటమి భా గస్వామ్య పక్షాలైన టీడీపీ, సీపీఐల ఓట్లు బదిలీ కాకపోగా, ఆ తేడా భారీగా కనిపిస్తోంది. పక్కాగా ఓటు బదిలీ జరిగి ఉం టే నాగార్జునసాగర్, నల్లగొండ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు అవకాశం దక్కేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ నియోజకవర్గాల్లో ఇలా.. నాగార్జున సాగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై 7,771 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ, ఇక్కడ కూటమి ఓట్లన్నీ కలిస్తే (2014 గణాంకాలు)నే బదిలీ కాకుండా పోయిన ఓట్లు 21,658. గతం కన్నా ఈ సారి ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది. అంటే కూటమి బదిలీ అయి ఉంటే జానారెడ్డి ఓటమి కోరల నుంచి తప్పించుకునే అవకాశం ఉండేదంటున్నారు. నల్లగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి 23,698 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ, ఈ నియోజకవర్గంలో 35,907ఓట్లు కూటమి బదిలీ కాలేదు. దీంతో ఆయనకూ ఓటమి తప్పలేదు. గత ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన (బీజేపీ, టీడీపీ ఉమ్మడిగా కలిసి పోటీ చేశాయి)4523 ఓట్లును ఈ సారి మినహాయించినా కూటమికి బదిలీకాకుండా పోయిన ఓట్లు 31,384. ఈ లెక్కన చూసినా, కాంగ్రెస్‌కు అవకాశం ఉందేం టున్నారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో కాం గ్రెస్‌తో జతకట్టిన టీడీపీ, సీపీఐ తదితర పార్టీల కూటమి పక్షాల ఓట్లు కాంగ్రెస్‌కు బదిలీకాకపోవడం ఆ పార్టీ అభ్యర్థుల ఓటమిలో ప్రధాన పాత్ర పోషించిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
ఎవరూ నచ్చలేదు..
మంచిర్యాలటౌన్: ఎన్నికల్లో తమకు నచ్చిన అభ్యర్థులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునేందుకు ఓటు ఆయుధమైతే.. అభ్యర్థుల్లో ఎవరూ నచ్చలేదని తమ అభిప్రాయాన్ని వ్యక్తపర్చేందుకు ‘నోటా’తో అవకాశం కలిగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకంగా 20,255 మంది ‘నోటా’ నొక్కి పోటీలో ఉన్న అభ్యర్థుల్లో తమకు ఎవరూ నచ్చలేదని స్పష్టం చేయడం విశేషం. గతంలో ఎన్నికల్లో గెలిచిన వారిలో ఎవరు మనకు సేవ చేస్తారో, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తారో వారికి మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం ఉండేది. అప్పుడు ఎన్నికల్లో పోటీచేసే వారు ప్రజల మధ్య నుంచి వచ్చినవారే ఉండడంతో దానిపై ప్రజలు అంతగా పట్టించుకోలేదు. ఇక రోజులు మారుతున్న కొద్దీ చాలా మంది రాజకీయాల్లోకి రావడం, ఎన్నికల్లో పోటీ చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలన్న రాజ్యాంగం కల్పించిన హక్కు ఓ వైపు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నచ్చక ఎవరికి ఓటు వేయాలో తెలియని పరిస్థితిలో ఎవరో ఒకరికి ఓటు వేసే సంస్కృతికి ఎన్నికల సంఘం స్వస్తి పలికింది. దీంతో 2014లో జరిగిన ఎన్నికల్లో నోటా (నన్ ఆప్ ది ఎబోవ్)ను ప్రవేశపెట్టింది. ‘పైన తెలిపిన అభ్యర్థులు ఎవరూ నాకు నచ్చలేదు’ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే అవకాశాన్ని ఓటర్లకు కల్పించింది. దీంతో ప్రజల్లోనూ తమ కు నచ్చని అభ్యర్థికి ఇక తాము ఓటు వేయాల్సిన అవసరం లేదని, ఎవరూ నచ్చలేదని ‘నోటా’కు వేసే అవకాశం కలగడంతో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు ముందుకు వస్తున్నారు. స్వతంత్రులు, పలు పార్టీల నేతలకు నోటాకు వచ్చిన ఓట్లు కూడా ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల అభ్యర్థులకు రాకపోవడం గమనార్హం. గతం కంటే పెరిగిన నోటా ఓట్లు మన దేశంలో నోటాను తొలిసారిగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రవేశపెట్టారు. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు ఎవరూ తమకు నచ్చలేదని తెలిపేందుకు ప్రవేశపెట్టిన నోటాను ప్రజలు ఆదరించారు. 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో నోటాకు ప్రజలు పట్టం కట్టారు. ప్రధాన పార్టీలు, స్వతంత్రులు, చిన్న పార్టీల నాయకులకు కనీసం రాని ఓట్లు నోటాకు వచ్చాయంటే, నోటా ప్రభావం ఏమేర చూపిందో అర్థమవుతోంది. నోటా వల్ల ఓటింగ్ శాతం పెరిగినట్లుగా కనబడుతున్నా, అభ్యర్థులకు వచ్చే ఓట్లు మాత్రం తగ్గిపోతున్నాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో నోటాకు 2,715 ఓట్లు మొన్నటి ఎన్నికల్లో వచ్చాయి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోవ లక్ష్మి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆత్రం సక్కు చేతిలో కేవలం 171 ఓట్లతో ఓడిపోయారు. నోటాకు వచ్చిన ఓట్లలో కొన్నింటిని కోవ లక్ష్మి సాధించినా విజయం వరించేదేమో! 2014లో ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాలకు 17,905 నోటాకు రాగా, 2018లో 20,255 ఓట్లు నోటాకు వచ్చాయి. గత ఎన్నికల కంటే 3,160 ఓట్లు నోటాకు పెరిగాయి. ఉద్యోగస్తులు సైతం పోస్టల్ బ్యాలెట్లో వారికి ఏ అభ్యర్థి నచ్చలేదంటూ 2014 ఎన్నికల్లో నోటాకు 67 మంది ఓటు వేయగా, ఈసారి ఎన్నికల్లో 187 మంది నోటాను వినియోగించుకున్నారు. -
వికసించని కమలం
అసెంబ్లీ ఎన్నికల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోవడంలో విఫలమైంది. ప్రత్యర్థి పార్టీల నుంచి వలసలపైనే పూర్తిగా ఆధార పడడంతో అభ్యర్థుల ఎంపికలో తడబాటుకు గురైంది. చివరి నిమిషంలో అవకాశం దక్కించుకున్న అభ్యర్థుల అనుభవరాహిత్యం ఓట్ల వేటలో అడ్డంకిగా మారింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సహా స్టార్ క్యాంపెయినర్లు తరలివచ్చినా ఓటర్లను ప్రభావితం చేయలేకపోయారు. నారాయణఖేడ్‌లో సంజీవరెడ్డి, దుబ్బాకలో రఘునందన్‌రావు మినహా మిగతా అభ్యర్థులెవరూ ఓటర్లపై తమదైన ముద్ర వేయలేకపోయారు. –సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని పదకొండు అసెంబ్లీ స్థానాల్లోనూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. సెప్టెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ రద్దయినా, బీజేపీ మాత్రం అభ్యర్థుల ఎంపికలో తీవ్ర జాప్యం చేసింది. నాలుగు విడతల్లో అభ్యర్థుల జాబితా విడుదల చేయగా తొలి జాబితాలో టీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ అందోలు, దుబ్బాక అభ్యర్థి రఘునందన్‌రావును మాత్రమే ఖరారు చేసింది. రెండో జాబితాలో నాయిని నరోత్తమ్ రెడ్డికి సిద్దిపేట స్థానాన్ని ఖరారు చేశారు. మూడు, నాలుగో జాబితాను విడుదల చేయడంలో బీజేపీ నాయకత్వం తీవ్ర జాప్యం చేసింది. పార్టీ జిల్లాలో సంస్థాగతంగా బలహీనంగా ఉండడం, చాలా చోట్ల బలమైన అభ్యర్థులు లేకపోవడంతో.. ప్రత్యర్థి పార్టీల్లోని అసంతృప్త నేతల కోసం వేట సాగించింది. ప్రత్యర్థి పార్టీల నుంచి అలాంటి సంకేతాలు లేకపోవడంతో చివరికి పార్టీలో కొత్తగా చేరిన నేతలకు అవకాశం ఇచ్చింది. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో జిల్లాతో ఏ మాత్రం సంబంధం లేని మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయను బరిలోకి దించింది. మెదక్ అభ్యర్థి ఆకుల రాజయ్య, నర్సాపూర్ అభ్యర్థి సింగాయిపల్లి గోపి మినహా, మిగతా నియోజకవర్గాల అభ్యర్థులందరూ ఎన్నికల సమయంలో పార్టీలోకి వచ్చిన వారే కావడం గమనార్హం. పటాన్చెరు నుంచి కరుణాకర్‌రెడ్డి, సంగారెడ్డి నుంచి రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే, జహీరాబాద్‌లో జంగం గోపి చివరి నిమిషంలో పార్టీ అభ్యర్థులుగా తెరమీదకు వచ్చారు. నారాయణఖేడ్ అభ్యర్థిగా ఎంపిక చేసిన రవికుమార్ గౌడ్‌ను తప్పించి చివరి క్షణంలో నాటకీయ పరిణామాల నడుమ కాంగ్రెస్ అసంతృప్త నేత సంజీవరెడ్డికి అవకాశం కల్పించారు. ఫలితమివ్వని ‘స్టార్’ క్యాంపెయినింగ్ పార్టీకి మెరుగైన అవకాశాలు ఉన్నాయని భావించిన నియోజకవర్గాల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నారాయణఖేడ్, దుబ్బాక సభల్లో పాల్గొనగా, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంగారెడ్డి బహిరంగ సభలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, స్మృతి ఇరానీతో పాటు పరిపూర్ణానంద తదితరులు కూడా బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. అమిత్‌షా పర్యటించిన నియోజకవర్గాలు నారాయణఖేడ్, దుబ్బాకలో మాత్రమే పార్టీ అభ్యర్థులు గణనీయంగా ఓట్లు సాధించారు. గజ్వేల్, అందోలు, నర్సాపూర్ బీజేపీ అభ్యర్థులు మూడు వేల లోపు ఓట్లు మాత్రమే సాధించారు. జహీరాబాద్ నుంచి తొలిసారిగా పోటీ చేసిన జంగం గోపి ఏకంగా 19వేల పైచిలుకు ఓట్లు సాధించడం బీజేపీకి కొంత ఊరటనిచ్చేదిగా ఉంది. సిద్దిపేట, సంగారెడ్డి, పటాన్చెరు, మెదక్ అభ్యర్థులు ఎనిమిది వేల లోపు ఓట్లతో సరిపెట్టుకున్నారు. పార్టీని వీడిన ముఖ్య నేతలు ఓ వైపు ఇతర పార్టీల నుంచి అసంతృప్త నేతల రాకకోసం ఎదురుచూసిన బీజేపీకి సొంత పార్టీ నేతలే షాక్ ఇచ్చారు. కొంతకాలంగా పార్టీ నాయకత్వం తీరుపై అసంతృప్తితో ఉన్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కె.సత్యనారాయణ టీఆర్ఎస్లో చేరడం పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేసింది. అదే బాటలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరారు. ఇదిలా ఉంటే మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ భార్య పద్మినీరెడ్డి సంగారెడ్డి టికెట్‌ను ఆశిస్తూ బీజేపీలో చేరడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, 24 గంటల లోపే తన మనసు మార్చుకుని తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. -
సన్నద్ధం
సాక్షి, మెదక్: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వారం, పది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్నట్లు తెలుస్తోంది. దీంతో అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టింది. శనివారం బీసీ ఓటర్ల తుది జాబితాను ప్రచురించనున్నారు. బీసీ ఓటర్ల జాబితా ప్రచురణతో రిజర్వేషన్ల ప్రక్రియకు మార్గం సుగమం కానుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. అలాగే ఎన్నికల నిర్వహణపైనా అధికారులు కసరత్తు ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 469 పంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల పరిధిలో మొత్తం 4086 వార్డులు ఉన్నాయి. జిల్లాలోని 20 మండలాల్లోని 469 పంచాయతీల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని గతంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజాగా రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు లేదా మూడు విడతల ఎన్నికల నిర్వహణపై సోమవారం కలెక్టర్ ధర్మారెడ్డి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోవడం, శిక్షణపైనా అధికారులు దృష్టి సారించారు. ఎన్నికల నిర్వహణ కోసం రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు, పోలింగ్ సిబ్బంది మొత్తం 600మందికి పైగా అవసరం కానున్నారు. రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణపై శనివారం (నేడు) శిక్షణ ఇవ్వనున్నారు. మిగతా పోలింగ్ సిబ్బందికి మండల స్థాయిలో ఈ నెల 23 నుంచి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పంచాయతీ, వార్డుల వారిగా ఓటర్ల జాబితాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు. సవరించిన ఓటర్ల జాబితాను పంచాయతీ అధికారులు ఆన్లైన్లో ఉంచుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికల నిర్వహణకు వీలుగా అధికారులు బ్యాలెట్ బాక్సులను, బ్యాలెట్ పేపర్లను సిద్ధంగా ఉంచారు. పోరుకు పార్టీలు సై.. పంచాయతీ పోరుకు పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. సమరోత్సాహంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైంది. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీంతో ఆ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికలకు సిద్ధమవుతోంది. మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిలు పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టారు. పంచాయతీల్లో గెలుపు గుర్రాలను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు. అసెంబ్లీ ఫలితాలతో కాంగ్రెస్ ఢీలా పడింది. అయితే పంచాయతీ ఎన్నికల్లోనైనా తమ సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు త్వరలో జిల్లా కాంగ్రెస్ నాయకులు సమావేశం కానున్నారు. బీజేపీ, సీపీఎం, సీపీఐ తదితర పార్టీలు సైతం పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం.రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే వాటి నిర్వహణకు ఏర్పాట్లు చేస్తాం. శనివారం బీ సీ ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నాం. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టేందుకు రెడీ అయ్యాం. ఎన్నికల ని ర్వహణకు వీలుగా పోలింగ్ సిబ్బందికి త్వరలో శిక్ష ణ తరగతులు నిర్వహించనున్నాం. – హనోక్, డీపీఓ -
లెఫ్ట్ డీలా
సాక్షి, కొత్తగూడెం: మొదటి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువ. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కమ్యూనిస్టుల ఖిల్లాగా ఉండేది. రాష్ట్ర శాసనసభలో ప్రతిసారి ఉమ్మడి జిల్లా నుంచి వామపక్ష పార్టీల ప్రాతినిధ్యం ఉండేది. అయితే ప్రస్తుత శాసనసభలో మాత్రం వాపపక్ష పార్టీలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ప్రజాసమస్యలు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల ప్రజల సమస్యలు అసెంబ్లీలో లేవనెత్తే అవకాశం కమ్యూనిస్టులకు దక్కలేదు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో ప్రాతినిధ్యం ఉన్నా, లేకున్నా ఉమ్మడి జిల్లాలో మాత్రం ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఉండేది. సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీలు ప్రజాగొంతుక వినిపించేవి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అసలు వామపక్ష పార్టీలకు ప్రాతినిధ్యమే దక్కలేదు. తెలంగాణ శాసనసభలో మాత్రం గత ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గం నుంచి సీపీఎం ప్రాతినిధ్యం వహించింది. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పొత్తుతో సీపీఎం ఒక్క భద్రాచలం శాసనసభ స్థానంలో మాత్రమే గెలుపొందింది. సీపీఐ నల్లగొండ జిల్లాలోని దేవరకొండ స్థానాన్ని గెలిచినప్పటికీ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ టీఆర్ఎస్లోకి ఫిరాయించారు. ఈ నెల 11న వెల్లడయిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వామపక్షాలకు ఒక్క స్థానం కూడా దక్కలేదు. సీపీఎం బీఎల్ఎఫ్ బ్యానర్‌తో, సీపీఐ కాంగ్రెస్ కూటమితో వెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం, అశ్వారావుపేట, పినపాకల్లో సీపీఎం నేరుగా బరిలోకి దిగగా, కొత్తగూడెంలో బీఎల్ఎఫ్ అభ్యర్థిని బరిలోకి దింపింది. ఇల్లెందులో న్యూడెమోక్రసీ(రాయల) అభ్యర్థికి సీపీఎం మద్దతు తెలిపింది. సీపీఐ మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కూటమి పొత్తుతో ఒక్క వైరా స్థానంలో మాత్రమే పోటీ చేసింది. కానీ వామపక్షాలు ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. అన్ని చోట్లా సీపీఎం, బీఎల్ఎఫ్, సీపీఐ, ఎన్డీ(రాయల), ఎన్డీ(చంద్రన్న) పార్టీలకు ఓట్లు అనుకున్న స్థాయిలో కూడా రాలేదు. దీంతో ఆయా పార్టీలకు ప్రాతినిధ్యం అవకాశం లేకపోవడంతో పాటు ప్రాబల్యం కూడా తగ్గిపోయిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ∙గతంలో ఉమ్మడి జిల్లాలో గట్టి ప్రాబల్యం కలిగి ఉన్న సీపీఐ పట్టు ఈసారి మరింత తగ్గిపోయింది. కాంగ్రెస్ కూటమితో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరా స్థానంలో పోటీ చేయగా ఓటమి పాలైంది. 2014 ఎన్నికల్లో సైతం ఖమ్మం లోక్‌సభకు సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ, కాంగ్రెస్ పొత్తుతో పోటీ చేసినప్పటికీ మూడోస్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. శాసనసభ స్థానాలు సైతం ఎక్కడా గెలుచుకోలేకపోయింది. సీపీఐ 1989, 1996, 1998 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు భద్రాచలం లోక్‌సభ స్థానాన్ని గెలుచుకుంది. 1962లో అప్పటి పాల్వంచ నియోజకవర్గంలో గెలిచింది. తరువాత బూర్గంపాడు శాసనసభ నియోజకవర్గంలో 5 సార్లు విజయం సాధించింది. అదేవిధంగా సుజాతనగర్ నియోజకవర్గంలో 5 సార్లు విజయం సాధించింది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా సుజాతనగర్ స్థానంలో కొత్తగా ఏర్పాటైన వైరా నియోజకవర్గంలో సైతం సీపీఐ 2009లో విజయం సాధించింది. 2009లో కొత్తగూడెంలోనూ గెలుపొందింది. ఇక 1952, 1962, 1994ల్లో ఇల్లెందులోనూ సీపీఐ విజయం సాధించింది. ఇంతటి ప్రాబల్యం కలిగి ఉన్న సీపీఐ ఈసారి మరింత దెబ్బతిన్నది. ∙గతంలో ఖమ్మం లోక్‌సభ స్థానంతో పాటు వివిధ శాసనసభ స్థానాల్లో ప్రాతినిధ్యం వహించిన సీపీఎం 2014లో ఒక్క భద్రాచలం శాసనసభ స్థానంలో మాత్రమే వైఎస్సార్సీపీ మద్దతుతో గెలిచింది. 2004లో భద్రాచలం లోక్‌సభ స్థానాన్ని సైతం సీపీఎం గెలుచుకుంది. 1978 నుంచి 2014 వరకు (2009 మినహా) సీపీఎం భద్రాచలంలో వరుసగా 8 సార్లు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తోంది. ఈసారి జరిగిన ఎన్నికల్లో ఇల్లెందు(ఎన్డీకి మద్దతు), కొత్తగూడెంలో బీఎల్ఎఫ్, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేటల్లో సీపీఎం నేరుగా పోటీ చేసింది. అయితే సీపీఎంకు గట్టి పట్టున్న చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, ఎటపాక మండలాలు ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లిపోవడంతో సిట్టింగ్ స్థానం భద్రాచలం నియోజకవర్గంలోనూ మూడో స్థానానికి పడిపోయింది. ఇల్లెందులో ఎన్డీ రాయల, చంద్రన్న వర్గాలు విడివిడిగా.. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ విషయానికి వస్తే 1978 నుంచి 2004 వరకు (1994 మినహా) 6 సార్లు విజయం సాధించింది. నియోజకవర్గాల పునర్విభజనతో ఎన్డీ 2009, 2014లో ఓటమిపాలైంది. ఎన్డీకి గట్టి పట్టున్న గుండాల మండలం పినపాకలోకి, కారేపల్లి మండలం వైరా నియోజకవర్గంలోకి వెళ్లాయి. దీంతో ఎన్డీకి గెలుపు దూరమైంది. కాగా 2013లో ఎన్డీ రాయల, చంద్రన్న వర్గాలుగా విడిపోయాయి. దీంతో 2014 ఎన్నికల్లో రాయల వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, చంద్రన్న వర్గం నుంచి యదళ్లపల్లి సత్యం పోటీ చేశారు. ఈసారి ఎన్నికల్లో కూడా రెండు వర్గాలు అన్ని స్థానాల్లో విడివిడిగా పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయాయి. -
అంతర్మథనం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: చేదు ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ పోస్టుమార్టం చేపట్టింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయానికి దారితీసిన కారణాలపై ఆరా తీస్తోంది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో కేవలం మూడు సీట్లకే పరిమితం కావడంతో నైరాశ్యంలో కూరుకుపోయిన ఆ పార్టీ.. ఓటమిపై విశ్లేషణ ప్రారంభించింది. మహేశ్వరం, ఎల్బీనగర్, తాం డూరు స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్.. సిట్టింగ్ స్థానాలతో సహా ఏడు సీట్లను కోల్పోవడంతో పార్టీ నాయకత్వం బిత్తరపోయింది. టీడీపీతో జతకట్టడంతో మెజార్టీ సీట్లు దక్కించుకుంటామని గంపెడాశతో ఉన్న తమకు ఆ పొత్తే కొంపముంచినట్లు తాజాగా వెలువడ్డ ఫలితాలు స్పష్టం చేస్తుండడంతో కాంగ్రెస్ నేతలు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. తాండూరులో మంత్రి మహేందర్‌రెడ్డి ఓడించడం ఊరట కలిగించే అంశమే అయినా సులువుగా గెలుస్తామని భావించిన సీట్లలో కూడా భారీ మెజార్టీతో ఓటమి పాలవడంతో సీట్ల సర్దుబాటు వ్యవహారం కూడా పార్టీకి నష్టం చేకూర్చుందనే వాదన వినిపిస్తోంది. సంస్థాగతంగా బలంగా ఉన్న సెగ్మెంట్లను టీడీపీకి కేటాయించడం.. ఆ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కూడా అంచనా వేయకపోవడం దారుణ ఓటమి కారణాలుగా కాంగ్రెస్ నాయకత్వం విశ్లేషించింది. చంద్రబాబునాయుడు ప్రచారాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో టీఆర్ఎస్ సఫలమైందని, అలాగే ఏపీ ఓటర్లలోనూ ఇది చీలికకు దారితీసిందని అభిప్రాయపడింది. అంతేగాకుండా చంద్రబాబు రావడం వల్ల మరోసారి ప్రాంతీయభావం పెరిగి అది ప్రజాకూటమికి వ్యతిరేక ఓటుగా మారిందని తేల్చింది. దీనికితోడు టీఆర్ఎస్కు సంక్షేమ పథకాలు కలిసివచ్చాయని అంచనా వేసింది. వికారాబాద్‌లో పార్టీ అభ్యర్థి ప్రసాద్‌కుమార్ బలంగా ఉన్నా.. బలమైన సామాజికవర్గం ఆయనకు మద్దతు ఇవ్వలేదని గుర్తించింది. అలాగే స్వతంత్ర అభ్యర్థి చంద్రశేఖర్ బరిలో నిలవడంతో పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా తేల్చింది. ఇబ్రహీంపట్నం స్థానాన్ని మహాకూటమికి కేటాయించకపోతే ఈజీగా గెలిచేవాళ్లమని అభిప్రాయపడింది. కేవలం స్వల్ప ఓట్ల తేడాతో ఆ స్థానాన్ని కోల్పోయామని, టీడీ పీ బరిలో లేకపోతే అక్కడ ఆ పార్టీకి పడ్డ 17వేల ఓట్లు కూడా అదనంగా వచ్చేవనే అభిప్రాయానికొచ్చింది. శాసనసభ ఎన్నికల ఫలితాల ప్రభావం త్వరలో జరిగే స్థానిక సంస్థలు, సహకార ఎన్నికలపై ఉంటాయని, వీటిని అధిగమించడం ఎలా అనేదానిపై లోతుగా ఆలోచించాలని అధినాయకత్వం భావిస్తోంది. -
రిటర్నింగ్ అధికారులు,పోలీసులు కుమ్మక్కయ్యారు
-
పోలింగ్ మర్నాడు...
ఓటమిలో చాలా రకాలుంటాయ్. ఇది మాత్రం కూటమికి భయంకరమైన ఓటమి. తెలంగాణలో చంద్రబాబు కింగ్‌మేకర్‌గా వెలిగిపోదామని ఉత్సాహపడ్డారు. అనేక రోడ్‌షోల్లో అదే అరిగిపోయిన రికార్డుని వేసుకుంటూ పరమబోరు కొట్టించారు. రాహుల్ సరసన కూర్చుని మహాసభల్ని అడ్రస్ చేయడానికి చంద్రబాబు సంకోచించలేదు. ఇదంతా బీజేపీని గద్దె దింపడానికేనని పదే పదే చెప్పారు. జనం విని, ఆవలించారు. కోదండరాం కూటమిలో చేరడం, అయ్యో పాపం అనిపించుకోవడం ఘోరం. గద్దర్ సరేసరి. వీళ్లంతా వ్రతాలు పాడు చేసుకుని, కళావిహీనంగా మిగిలారు. వీళ్లంతా ఒకే తాటిమీద నడవడం, ఒకే వేదిక మీద నుంచే ఒకే మైకులో మాట్లాడటం ఒక ‘చారిత్రక ఛండాలం’ అన్నాడొక పెద్దాయన. ఈ కూటమి కెమిస్ట్రీలోంచి పనికిమాలిన ఫలితాలొచ్చాయ్. చేతికందిన పార్టీలన్నింటినీ తెచ్చి ఒక బీకర్లో వేశారు. దాని ఫలితం ఇది. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇప్పటికీ ఈ దేశ ప్రజమీద అతి చొరవ తీసుకుంటోంది. ఆ నైజానికి స్వస్తి పలకాలని ఒకాయన వాపోయాడు. మొన్న చిత్తుగా ఓడిన కూటమి పార్టీలు కొత్త పాఠాలు నేర్చుకోవాలి. పోలింగ్ అయ్యాక కూడా ఓటర్ల నాడిని కనీసం గురికి బెత్తెడుగా అయినా పట్టుకోలేకపోయారు. పైగా ఓటింగ్ మెషీన్లు దగా చేశాయని అర్థంలేని ప్రకటనలు. ఇవన్నీ హాస్యాస్పదంగా ఉంటాయ్. పోలింగ్ అయిన మర్నాడు తీరిగ్గా బస్సెక్కి నగరం దాటి వెళ్లాను. ఒక బంజారా తండా దగ్గర దిగాను. తండా మొదట్లో ఒక రావి చెట్టుని ఆనుకుని ఓ పెద్దాయన జోగుతున్నాడు. మధ్య మధ్య మెడమీద పాకుతున్న చీమల్ని దులుపుకుంటున్నాడు. నేను అటూ ఇటూ దిక్కులు చూసి, ఆ పక్కనే ఉన్న బండరాయిమీద చతికిలబడ్డాను. ఆయన లేచి కూర్చుని ఎవరు ఏమిటన్నట్టు నా వంక చూశాడు. కుశల ప్రశ్నలతో మాటలు మొదలుపెట్టాను. నాలుగు ప్రశ్నలయ్యాక, ‘అసలు సంగతికి రాకూడదూ’ అన్నాడు సూటిగా. వయసు, దానికి తగ్గ అనుభవం నిలువెల్లా తొణికిసలాడుతోంది. నేను ఎంపిక చేసుకుందామనుకుంది సరిగ్గా ఇలాంటి ఓటర్నే. ఆడబోయిన తీర్థం ఎదురైంది. ‘... ఎవరు గెలుస్తారు?’ అని సూటిగా అడిగాను. ‘మా వాళ్లంతా కారుకే వేశారు. మరి మా వాళ్లంటే మంద.. ఒకే తీరు. తేడాలుండవ్. మీ పట్నం వాళ్లకి సొంత ఆలోచనలుంటాయ్. అందుకని మీ ఆలోచనలు మేక పెంటికల్లా విడివిడిగా ఉంటాయ్’. ఆ పోలిక నన్ను కొంచెం ఇబ్బంది పెట్టింది. ‘... అంతో ఇంతో చేశాడు. ఇంకా చేస్తన్నాడు. ఎవడైనా అంతే. ఇంకా తింటం అంటారా. వీళ్లే నయం. ఈ నాలుగేళ్లలో గుంటలు పూడ్చుకున్నారు. ఇహ మెరకలేసుకోవడమే కాబట్టి కూత్తి తక్కువే తింటారు’. ఆ పెద్దాయన అంచనాకి నాకు నవ్వొచ్చింది. ‘పాపం ఇంటిల్లిపాదీ రాష్ట్రానికే చాకిరీ చేస్తున్నారు గదా’ అనగానే ‘అదేకదా వచ్చిన విమర్శ’ అన్నాను. ‘అదేంది? నాకిప్పుడు నలుగురు బిడ్డలున్నారు. నాకు ఐదెకరాల భూమి ఉంది. అందరూ పొలంలో తలోపనీ చేసుకుంటారు. ఓ కూతురుంది. అది గోచీ బిగించి తాడిచెట్టుకి పాకిందంటే ఉడత లెఖ్ఖ. కల్లుగీతలు గీసేవాళ్లు దాన్ని నివ్వెరపాటుగా చూస్తారు. పనికొచ్చేవాడు పనిచేస్తే తప్పా? కేసీఆర్ రాగానే నీళ్లమీద పడ్డాడు. కరెంటుని ముందే చక్కపెట్టాడు. పొలాలకి డబ్బు పంచాడు. కాస్త గుక్క తిప్పుకోనియ్యాలి కదా. ఒక్కమాట చెబుతా విను. దేశానికి సొరాజ్జం తెచ్చామని చెప్పి కాంగ్రెసోళ్లు గాంధీ, నెహ్రూల పేర్లు చెప్పుకుని యాభై ఏళ్లు హాయిగా ఏలారు. ఈయన ఉద్యమం నడిపాడు. రాష్ట్రం తెచ్చాడు. ఇంకోసారి సీటిస్తే ఏమవుతుందనిపించింది. నేను కుర్రతనం నించి ఎర్రజెండా పట్టుకు పెరిగినవాణ్ణి. నాకన్నీ తెలుసు. నా బీడు భూమికి చెమ్మ తగుల్తుందని నేననుకోలేదు. తగిలింది. అంతమంది కలిసి పాలిస్తే అది కుక్కలు చింపిన విస్తరవుతుంది. శానామంది నాలాగే అనుకున్నారు. ఫలితాలు దానికి తగ్గట్టే ఉంటాయ్’. నేను సంతృప్తిగా లేచి కదిలాను. నా సర్వే పూర్తయింది. ‘ఇలాంటి ఫలితాలు నాలో ఉన్న కమ్యూనిస్టుకి అక్కసుగానే ఉంటది. అందుకే వాడు గొర్రె కసాయి వాణ్ణే నమ్ముద్ది’ అని అరుస్తున్నాడు. దూరానికి ఆ మాటలు వినిపించాయి. వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
‘బ్రింగ్ బ్యాక్ పేపర్ బ్యాలెట్ ఉద్యమం ప్రారంభిస్తాం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి దారి తీసిన పరిస్థితులు, ఎన్నికల్లో వ్యవహరించిన తీరుపై గాంధీభవన్‌లో సుమారు మూడు గంటల పాటు సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన అనంతరం టీపీసీసీ నేత దాసోజు శ్రవణ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో 22 లక్షలు ఓట్లు నిర్ధాక్షణంగా తొలగించిన విషయాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నికలకు సంబంధించిన కేసు కోర్టులో ఉండగా ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎన్నికల ప్రధాన అధికారి(ఈసీ) రజత్ కుమార్, ఇతర అధికారులు టీఆర్ఎస్ పార్టీకి పేరోల్ క్రింద ఉన్నట్లు గుర్తించామని అన్నారు. వచ్చే పార్టమెంట్ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని అని వెల్లడించారు. జాయింట్ పార్లమెంట్ కమిటీ ద్వారా విచారణ జరిపి దోషులను శిక్షించాలని కోరుతామని తెలిపారు. మొన్న జరిగిన ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్లు, పోలీసులు కుమ్మకైయి పోలింగ్ ఏజెంట్లను కూడా సెంటర్లోకి రానివ్వకుండా అధికార పార్టీకి సహకరించారని ఆయన ఆరోపించారు. నర్సాపూర్‌లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 8.8 శాతం ఉన్న పోలింగ్ సాయంత్రం 5 గంటలకు 70 శాతం దాటిందని, ఆపై తెల్లారా 90 శాతంగా ఈసీ ప్రకటించని ఈ సందర్భంగా ప్రస్తావించారు. చిప్‌లు, ట్యాంపరింగ్ సమాచారం సేకరించి సరియైన సమయంలో వాటి గురించి బయట పెడుతామన్నారు. బ్రింగ్ బ్యాక్ పేపర్ బ్యాలెట్ ఉద్యమాన్ని హైదరాబాద్ నుంచే ప్రారంభిస్తామని, ఈ విషయం పై హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా పోరాడుతామని దాసోజ్ చెప్పారు. ఇది మిషన్ మాండేటరీ తప్ప పీపుల్స్ మాండేటరీ కాదన్నారు. రాష్ట్రంలో 40 నుంచి 50 నియోజకవర్గాల్లో ప్రజలు, టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రచారానకి రాకుండా అడ్డుకున్నా వాళ్లే వేలాది ఓట్ల మోజారిటీతో గెలిస్తే ఇక ఏం చెప్పాలో మాకు అర్థం కావడం లేదని దాసోజ్ చెప్పారు. -
‘పార్టీ బలోపేతం కేటీఆర్‌తోనే సాధ్యం’
వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించబడ్డ కేటీఆర్‌కు మాజీ మంత్రి కడియం శ్రీహరి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేకు కేటీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించిన తెలంగాణ సీఎంకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. హన్మకొండలోని తన నివాసంలో ప్రెస్మీట్లో శ్రీహరి మాట్లాడుతూ.. ‘కేటీఆర్‌కు శుభాకాంక్షలు. 2009 నుంచి నేటి వరకూ కేటీఆర్ తన సమర్ధతో పార్టీలో క్రియాశీల పాత్రను పోషించారు. సిరిసిల్ల ప్రజల మనుసు గెలిచిన వ్యక్తి కేటీఆర్. రాష్టంలో పరిశ్రమల, ఐటీ శాఖలలో సమూల మార్పులతో నూతన శకానికి నాంది పలికారు. వారసత్వ రాజకీలయాలకు భిన్నంగా స్వశక్తితో ఎదిగిన నేత కేటీఆర్. కేటీఆర్ నియామకంతో పాటు, పార్టీ ఎదుగుదలకు కావాల్సిన ప్రణాళికను కేసీఆర్ అప్పజెప్పారు. టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కేటీఆర్‌తోనే సాధ్యమవుతుంది. ఉమ్మడి వరంగల్‌లో 12లో 10 స్థానాలను ప్రజలు టీఆర్ఎస్కు అందించారు. జిల్లాలో నీటి ప్రాజెక్టులు, కాకతీయ టెక్స్ట్టైల్ పార్క్, గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణం చేపడతాం. భూకబ్జాల బాధితులు వస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తాం’ అని పేర్కొన్నారు. -
ఉత్తమ్‌పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సంచలన ఆరోపణలు
సాక్షి, కరీంనగర్ : కాంగ్రెస్ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తుంటే ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాత్రం తెలంగాణలో పార్టీని సర్వ నాశనం చేశారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా ఓడినా నైతిక బాధ్యత తీసుకుంటానని చెప్పిన ఆయన పార్టీ అధ్యక్ష పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 21 సీట్లు గెలుచుకుందనీ, కానీ ఇప్పుడు 19 సీట్లకే పరిమితమైందని అన్నారు. బీసీలు పీసీసీ ప్రెసిడెంట్‌గా పనికిరారని చెప్పి నాడు పొన్నాలను రాజీనామా చేయించారు. మరిప్పుడు అదే సూత్రం ఉత్తమ్‌కు కూడా వర్తిస్తుంది కదా అని ప్రశ్నించారు. ఉత్తమ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ 2 సీట్లే గెలుచుకుందని గుర్తు చేశారు. (‘అందుకే కాంగ్రెస్‌లో 20 మంది డమ్మీ అభ్యర్థులు’) ‘రాహుల్ గాంధీని తెలంగాణ ప్రజలు నమ్మారు. కానీ, నిన్ను నమ్మడం లేదు. అందుకే ఈ ఘోర పరాజయం. ఎస్సీ, ఎస్టీ, బీసీలు నీ నాయకత్వాన్ని ఒప్పుకోవడం లేదు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుతో నీకు బుద్ధి చెప్పారు. నువ్ హౌజింగ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు పాల్పడిన అక్రమాలను బయటపెట్టకుండా ఉండడానికి టీఆర్ఎస్ పార్టీతో లాలూచీ పడ్డావ్. కేసీఆర్ చెప్పినట్టు విన్నావ్. కుంభకోణాలు బయటపెట్టొద్దని సరెండర్ అయ్యావ్. గతంలో చెప్పినట్టుగా అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందుగా కాంగ్రెస్ అభ్యర్థుల్ని ప్రకటించలేదు. మైహోమ్ రామేశ్వరరావుతో ఉత్తమ్ ఒప్పందం చేసుకోవడం వల్లనే కాంగ్రెస్ సీట్లను ఆలస్యంగా ప్రకటించింది’ అని ఉత్తమ్‌కుమార్‌పై కాంతం ఆరోపణలు గుప్పించారు. అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు ‘కోదండరామ్ కేసీఆర్ సూచించిన మనిషి. ఉద్యకారుడు, మేధావి. ఆయన మేధావితనం వాడుకోవాలి. కానీ, కోదండరామ్ టీజేఎస్ పార్టీని ఎందుకు కూటమిలో కలిపావ్’ అని కాంతం ఉత్తమ్‌కుమార్‌పై విమర్శలు గుప్పించారు. కూటమి ఏర్పాటు విషయంలో ఉత్తమ్ జాతీయ నాయకులను తప్పుదోవ పట్టించారని కాంతం విమర్శించారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఉద్యకారుడు కానందునే ప్రజలు ఆయన నాయకత్వాన్ని తిరస్కరించారని అన్నారు. ‘పార్టీ అంత ఘోరంగా ఓడిపోతే వెంటనే రాజీనామా చేయాల్సిందిపోయి సిగ్గు లేకుండా మీటింగ్ ఎలా పెడుతావ్. ఉద్యమకారులను, దళిత నాయకులను కించపరిచావ్. టీపీసీసీ ప్రెసిడెంట్, సీఎల్పీ పోస్టులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వాలి’ అని కాంతం డిమాండ్ చేశారు. -
హస్తం.. నైరాశ్యం
రాష్ట్ర శాసనసభ ముందస్తు ఎన్నికల ఫలితాలు వెలువడి మూడు రోజులు కావస్తున్నా, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఓటమిపై అంతర్మథనం కొనసాగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో భారీ ఫలితాన్ని ఆశించిన కాంగ్రెస్.. కేవలం సంగారెడ్డి నియోజకవర్గంలో గెలుపుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పార్టీకి చెందిన దిగ్గజ నేతలు ఓటమి పాలు కాగా, చాలా చోట్ల నామమాత్ర పోటీకే కాంగ్రెస్ పరిమితమైంది. కూటమి భాగస్వామ్య పక్షాలతో పొత్తులు, బలహీన, బహుళ నాయకత్వం ఉన్న చోట అభ్యర్థుల ఎంపికలో తడబాటు కాంగ్రెస్ ఘోర పరాజయానికి దారితీశాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంపై అనుకూలతతో పాటు, జిల్లాలో నాయకత్వ సంక్షోభం కూడా ఓటమికి దారితీసినట్లు ఫలితాల సరళి వెల్లడిస్తోంది. –సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి ఇటీవల ముగిసిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమి ఉమ్మడి మెదక్ జిల్లాలోని పదకొండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో, కూటమి భాగస్వామ్య పక్షం సీపీఐ హుస్నాబాద్‌లో, టీజేఎస్ సిద్దిపేట, దుబ్బాకలో పోటీ చేసింది. దుబ్బాకలో కూటమి భాగస్వామ్య పార్టీలు కాంగ్రెస్, టీజేఎస్ రెండూ స్నేహపూర్వక పోటీ పేరిట బరిలో నిలిచాయి. సంగారెడ్డి మినహా మిగతా పది అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఓటమి పాలైన వారిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రులు గీతారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి ఉన్నారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కూడా ఓటమి పాలైన అభ్యర్థుల జాబితాలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి మూడు రోజులు కావస్తున్నా, కాంగ్రెస్ అభ్యర్థులు ఇంకా షాక్ నుంచి తేరుకున్న పరిస్థితి కనిపించలేదు. సంగారెడ్డిలో గెలుపొందిన మాజీ విప్ జగ్గారెడ్డి మినహా పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులెవరూ ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు. తమ ఓటమికి దారితీసిన పరిస్థితులపై ఇప్పటి వరకు ఒక్క కాంగ్రెస్ అభ్యర్థి కూడా పెదవి విప్పడం లేదు. పార్టీ, అభ్యర్థుల కోసం కష్టపడిన నేతలు, శ్రేణులు మాత్రం అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి తమ సానుభూతి తెలిపి వస్తున్నట్లు సమాచారం. ఎవరికి వారుగా.. ఎన్నికల బరిలోకి గతంలో జిల్లాలో బలమైన రాజకీయ పక్షంగా ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ నేతలు, శ్రేణులు ఎన్నికల సందర్భంగా ఏకతాటిపై నడిచిన సందర్భం కనిపించలేదు. గజ్వేల్, జహీరాబాద్, సంగారెడ్డి, అందోలు, నర్సాపూర్ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులపై స్పష్టత ఉన్నా, నామినేషన్ల పర్వం మొదలైన తర్వాతే కాంగ్రెస్ జాబితాను విడుదల చేసింది. మరోవైపు సెప్టెంబర్ మొదటి వారంలో అసెంబ్లీని రద్దు చేసినా, ఈ ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు పెద్దగా దృష్టి సారించిన దాఖలాలు లేవు. సంగారెడ్డి, అందోలు, నర్సాపూర్‌లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు కొంత మేర పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసుకుని, శ్రేణులను సమీకరించే ప్రయత్నం చేశారు. 1952లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న జహీరాబాద్‌లో గీతారెడ్డి నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాతే తన ప్రచారాన్ని ప్రారంభించారు. పూర్తిగా పార్టీ స్థానిక నాయకత్వంపైనే భారం మోపడం, వయోభారం తదితరాలు ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైనా పార్టీ యంత్రాంగానికి అందుబాటులో లేకపోవడం ఓటమికి బాటలు వేసింది. అందోలులో ప్రచార ఆర్భాటం లేకుండా పార్టీ యంత్రాంగాన్ని ముందు వరుసలో నిలిపిన దామోదర రాజనర్సింహ వ్యూహం పూర్తి స్థాయి ఫలితాన్ని ఇవ్వలేదు. నర్సాపూర్‌లో సునీత లక్ష్మారెడ్డి సర్వశక్తులూ ఒడ్డినా, కొన్ని మండలాల్లో బలహీన నాయకత్వం ప్రతిబంధకంగా నిలిచింది. గజ్వేల్‌లో కేసీఆర్‌కు గట్టి పోటీ ఇస్తాడని భావించిన ఒంటేరు ప్రతాప్‌రెడ్డి.. టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహాన్ని ఎదుర్కోలేక పోలింగ్‌కు ముందే చేతులెత్తేసిన పరిస్థితి కనిపించింది. బహుళ బలహీన నాయకత్వంతో నష్టం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా పార్టీకి కొంత బలంగా ఉన్న నారాయణఖేడ్, పటాన్చెరు, మెదక్, దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిర్ణయించడంలో కాంగ్రెస్ తడబాటుకు గురైంది. పటాన్చెరులో ఓ వైపు పార్టీలోనే అంతర్గతంగా టికెట్ కోసం అరడజను మంది నేతలు పోటీ పడుతున్న నేపథ్యంలో.. టీఆర్ఎస్ నుంచి కొత్తగా మరో నలుగురు వచ్చి చేరడం గందరగోళానికి దారితీసింది. అభ్యర్థిని నిర్ణయించడంలో చివరి వరకు మీనమేషాలు లెక్క పెట్టడం పార్టీకి పూడ్చుకోలేని నష్టాన్ని మిగిల్చింది. నారాయణఖేడ్‌లో పార్టీ టికెట్‌ను ఆశించిన మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎంపీపీ సంజీవరెడ్డి నడుమ రాజీ కుదర్చడంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం విఫలమైంది. సంజీవరెడ్డి చివరి నిమిషంలో పార్టీని వీడడంతో కాంగ్రెస్ కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. పొత్తులపై చివరి వరకు ఉత్కంఠ మెదక్, సిద్దిపేట, దుబ్బాక స్థానాలను టీజేఎస్‌కు కేటాయించిన కాంగ్రెస్ చివరి నిమిషంలో దుబ్బాక, మెదక్‌లో బీ ఫారాలు జారీ చేసింది. టికెట్ల కేటాయింపు గందరగోళంలో దుబ్బాక నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన సీనియర్ నేత ముత్యంరెడ్డి టీఆర్ఎస్లో చేరారు. నామినేషన్ల పర్వానికి కొద్ది రోజుల ముందు పార్టీలో చేరిన నాగేశ్వర్‌రెడ్డికి చివరి క్షణంలో టికెట్ ఇవ్వడం, టీజేఎస్ అభ్యర్థి కూడా స్నేహపూర్వక పోటీ పేరిట బరిలో ఉండడం నష్టాన్ని మిగిల్చింది. మెదక్‌లోనూ అరడజను మంది నేతలు టికెట్ ఆశించినా, అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి సోదరుడు ఉపేందర్‌రెడ్డి తెరమీదకు వచ్చారు. టికెట్ ఆశించిన నేతలందరూ రాజీపడి ఏకతాటిపైకి వచ్చే లోపే పోలింగ్ తేదీ సమీపించడంతో పూర్తి స్థాయిలో ప్రచారం కూడా జరగలేదు. హుస్నాబాద్‌లోనూ సీపీఐ ఒత్తిడికి తలొగ్గి బలమైన అభ్యర్థి ప్రవీణ్‌రెడ్డికి టికెట్ నిరాకరించడం పార్టీ శ్రేణులకు మింగుడు పడలేదు. సిద్దిపేటను టీజేఎస్‌కు కేటాయించడంతో కాంగ్రెస్ నేతల నుంచి మద్దతు లేక కూటమి భాగస్వామ్య పక్షం కనీస ఓట్లను కూడా సాధించలేక పోయింది. -
కొంప ముంచిన ‘కోటరీ’
సుదీర్ఘ రాజకీయ అనుభవం... పోల్ మేనేజ్మెంట్లో దిట్ట... ఎన్నికలకు ముందు అందివచ్చిన అధికారం... నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి... కేసీఆర్ చరిష్మా.. కారు జోరు... ఇవేవీ తాండూరులో మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి ఓటమిని నిలువరించలేకపోయాయి. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి పోటీ చేసిన నాయకుడి ముందు ఈయన రెండు దశాబ్దాల రాజకీయ అనుభవం ఏమాత్రం పనిచేయకుండాపోయింది. మహేందర్‌రెడ్డి చుట్టూ ఉన్న కోటరీయే దీనికి ప్రధాన కారణమని అటు నియోజకవర్గంతో పాటు ఇటు జిల్లా రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా ప్రజలు, క్షేత్రస్థాయి నాయకులు కొంతకాలంగా మహేందర్‌రెడ్డిని నేరుగా కలిసే అవకాశం లేకుండా పోయింది. తన చుట్టూ ఎప్పుడూ ఉండే నలుగురైదుగురు నాయకులు వ్యవహరించిన తీరు కారణంగానే ఆయన ప్రజలకు దూరమయ్యారనే వాదన వినిపిస్తోంది. మంత్రిగా చేసిన అభివృద్ధి విషయంలో ప్రజలు తప్పుపట్టకపోయినా, కనీసం ఆయన్ను కలవాలంటే కూడా కష్టమైందనే భావనతోనే ఓట్లు వేయలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోటరీతో పాటు మరికొన్ని చిన్నా చితకా కారణాలు కూడా మాజీ మంత్రి ఓటమికి కారణాలయినప్పటికీ ప్రజలకు దూరంగా చుట్టూ ఉన్న నలుగురితోనే కార్యకలాపాలు నడపడమే ప్రధాన కారణమైందని తెలుస్తోంది. బ్రహ్మాస్త్రం ఎందుకో..? మహేందర్‌రెడ్డి ఓటమికి మరికొన్ని అంశాలు కూడా కారణమయ్యాయి. అక్కడ సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీ తరఫున పి.మహేందర్‌రెడ్డి అనే మరో నాయకుడు బరిలో ఉన్నారు. ఇద్దరి పేర్లు మహేందర్‌రెడ్డి కావడం, ఇద్దరి గుర్తులు (కారు, ట్రక్కు) పోల్చుకోలేని విధంగా ఉండడంతో ట్రక్కు గుర్తుకు 2,600 ఓట్లకు పైగా పోలయ్యాయి. మహేందర్‌రెడ్డి ఓడిపోయింది కూడా కేవలం 2,875 ఓట్లతోనే. రాజకీయ వ్యూహంలో భాగంగా తన పేరున్న వ్యక్తితో నామినేషన్ వేయించి తన ఎన్నికల గుర్తుతో సామీప్యత ఉన్న గుర్తు వచ్చేలా ప్రత్యర్థి పోటీలో పెట్టినప్పటికీ దాన్ని సరిగ్గా గ్రహించడంలో, ఈ విషయాన్ని తన కేడర్‌లోకి బలంగా తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. ఇదే ఆయన పుట్టి ముంచింది. దీనికి తోడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన పైలెట్ రోహిత్‌రెడ్డిపై వ్యవహరించిన తీరు ఆయనపై సానుభూతి పెరిగే విధంగా చేసిందనే విమర్శలు కూడా ఉన్నాయి. కొత్తగా ప్రజల్లోకి వస్తున్న నాయకుడిపై కేసులు పెట్టించడం, వేధింపుల కారణంగా రోహిత్‌కు నియోజకవర్గ ప్రజల్లో సానుభూతి పెరిగిందనే చర్చ జరుగుతోంది. మరోవైపు, నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక మాఫియాపై కూడా ప్రజల్లో సదాభిప్రాయం లేదు. పెద్ద ఎత్తున ఇసుకను అడ్డగోలుగా గులాబీ నేతలు అక్రమరవాణా చేస్తున్నా మంత్రి హోదాలో ఉండి కూడా చూసీచూడనట్టు వ్యవహరించడం విమర్శలకు దారితీసింది. ఇందుకు కూడా తన చుట్టూ ఉన్న కోటరీననే చర్చ కూడా స్థానికంగా జరుగుతోంది. మొత్తంమీద కర్ణుడి చావుకి లక్ష కారణాలన్నట్టు... ఎన్నికల నిర్వహణలో ఘనాపాటీగా పేరుతెచ్చుకున్న మహేందర్‌రెడ్డి ఈసారి ఓట్ల బాక్సాఫీసు ముందు బోల్తా కొట్టారు. ఓటమిని మూటగట్టుకుని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాలను శాంతించిన మహేందర్‌రెడ్డి ఓటమికి అనేక కారణాలున్నాయి. తన రాజకీయ జీవితానికి పునాది వేసిన టీడీపీని వీడి.. 2014 ఎన్నికల వేళ టీఆర్ఎస్లో చేరారు. అప్పటినుంచి ఈయనకు తిరుగులేకుండా పోయింది. ఈ నేపథ్యంలో 20 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని భావించారు. కానీ ద్వితీయశ్రేణి నాయకత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గుర్తించలేకపోయారు. తాండూరు నుంచి కాంగ్రెస్ టికెట్‌ను ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు కుటుంబీకులను, బీజేపీ టికెట్ ఆశించి పార్టీ వీడిన రమేష్‌కుమార్‌ను టీఆర్ఎస్లో చేర్చుకున్నప్పటికీ.. ఎన్నికల్లో వీరి ప్రభావం ఏమీ లేకపోవడంతో ఓటమి నుంచి తప్పించుకోలేకపోయారు. ప్రజల సమస్యలను నేరుగా వినే సమయం ఇవ్వకపోవడం, ఏ పని కోసం వెళ్లినా.. కిందిస్థాయి నాయకులకు చెప్పాలని సూచించడం వంటివి మహేందర్‌రెడ్డి ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి మహేందర్‌రెడ్డి 6 సార్లు పోటీ చేసి.. 4 సార్లు విజయం సాధించి, 2 సార్లు ఓటమి పాలయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో భాగంగా గత మూడు నెలలుగా మంత్రి హోదాలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించారు. రూ.2 వేల కోట్లతో తాండూరును అభివృద్ధి చేశానంటూ ఆత్మస్తుతి చేసుకోవడానికే అధిక ప్రాధాన్యమిచ్చారు. చుట్టూ ఉన్న ఆ నలుగురు చెప్పిందే విని గెలుస్తామనే ధీమాకు వచ్చేశారు కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితిని పసిగట్టలేకపోయారు. ఫలితంగా ఓటమిని మూటగట్టుకుని కుంగిపోతున్నారు. ఇటీవల తాండూరులో జరిగిన ప్రజాశీర్వాద సభలో.. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మహేందర్‌రెడ్డిని గెలిపిస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చినా.. ఓటర్లు మాత్రం ప్రతికూల తీర్పు ఇచ్చారు. -
పరీక్షల వేళ.. ఎన్నికల గోల
అడుగడుగునా అవాంతరాలు.. ఆరంభంలోనే ఉపాధ్యాయుల బదిలీలు.. అసెంబ్లీ ఎన్నికలు.. తిరిగి పంచాయతీ ఎన్నికల కోసం ప్రారంభమైన సన్నాహాలు.. ఆపై ముంచుకొస్తున్న పదో తరగతి పరీక్షలు వెAరసి .. విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. మరోవైపు అడ్డంకులను అధిగమించి వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యాశాఖ సమాయత్తం అవుతోంది. అయితే ఇది ఏ మేరకు ఆశించిన ఫలితాలు ఇస్తుందో చూడాల్సిందే. మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న తరుణంలో ప్రత్యేక కథనం. పాపన్నపేట(మెదక్): జిల్లాలో 145 ఉన్నత పాఠశాలలు, 55 వరకు ప్రైవేట్ ఉన్నత పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో మొత్తం సుమారు 11 వేల మంది విద్యార్థులు ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలు రాయబోతున్నారు. అయితే గత సంవత్సరం కన్నా మెరుగైన రీతిలో ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో విద్యాశాఖ సన్నాహాలు ప్రారంభించింది. పెద్ద ఎత్తున బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. కానీ పాఠశాల ప్రారంభం సమయానికి చాలా పాఠశాలల్లో కేవలం 65 శాతం మాత్రమే పాఠ్యపుస్తకాలు చేరాయి. అదే సమయంలో ఉపాధ్యాయుల బదిలీల పర్వం ప్రారంభమైంది. జూన్ చివరి నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ జూలై మూడో వారం వరకు కొనసాగింది. ఆపై బదిలీలలో పొరపాట్లు జరిగాయంటూ, జూలై చివరి వారం వరకు కొన్ని బదిలీ ఉత్తర్వులు విడుదల అవుతూనే వచ్చాయి. ఆపై అసెంబ్లీ రద్దు, ఆపై దసరా సెలవులు, అసెంబ్లీ ఎన్నికల శిక్షణ, నిర్వహణ. ఫలితాల విడుదల తదితర పరిణామాలతో డిసెంబర్ నెల రానే వచ్చింది. కనీసం ఇప్పుడైనా చదువులు పట్టా లెక్కుతాయనుకుంటే పంచాయతీ ఎన్నికల సన్నాహాలు జిల్లాలో మొదలయ్యాయి. మరో వైపు మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు, ఫిబ్రవరిలో ప్రీ ఫైనల్ పరీక్షల నిర్వాహణ కోసం విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. మళ్లీ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఉపాధ్యాయులు పని చేయాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థుల చదువులు ఎలా గాడిన పెట్టాలో అర్థం కావడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. మా పిల్లల భవిష్యత్తు ఎంటని తల్లిదండ్రులు కూడా ఆవేదనకు లోనవుతున్నారు. ఇప్పటివరకు ఏ ఆటంకం లేకుండా పాఠశాల జరిగిన దాఖలాలు లేవు. పదోతరగతిలో ఫలితాలు రాకపోతే అధికారుల చర్యలుంటాయని ఉపాధ్యాయులు భయపడుతున్నారు. ఇంత ఎన్నికల నడుమ ఈ సంవత్సరం పది విద్యార్థుల ఉత్తీర్ణత శాతం ఏ విధంగా ఉంటుందోనని ఆసక్తిగా గమనిస్తున్నారు. యాక్షన్ ప్లాన్ అమలు పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కలెక్టర్ ధర్మారెడ్డి, విద్యాశాఖ అధికారి రవికాంత్ ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించారు. నవంబర్ 1 నుంచి అన్ని పాఠశాలల్లో పదో తరగతికి ఉదయం, సాయంత్రం వేళలల్లో ఈ యాక్షన్ ప్లాన్ ప్రకారం స్పెషల్ క్లాస్‌లు నడుపుతున్నారు. ప్రతీ రోజు ఒక పాఠ్యాంశాన్ని చదువుకొని, దానిపై విద్యార్థులను గ్రూపులుగా విభజించి, చర్చ కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు. అనంతరం ఆ ఆంశంపై టెస్ట్ నిర్వహిస్తూ శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కాగా బోధనేతర విధులు, ఈ ప్రక్రియకు అవరోధంగా మారుతున్నాయని తల్లిదండ్రులు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తాం.. పదో తరగతి విద్యార్థుల కో సం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నాం. ఈ విద్యాసంవత్సరం కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ప్రతి రోజును విలువైనదిగా భావిస్తున్నాం. దాదాపు అన్ని పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. మార్చి మొదటి వారంలో ప్రాక్టీస్ టెస్టులు కూడా నిర్వహిస్తాం. తప్పకుండా ఉత్తమ ఫలితాలు సాధిస్తాం. –మధుమోహన్, నోడల్ అధికారి, మెదక్ అడుగడుగునా ఆటంకాలే: ఈ విద్యా సంవత్సరంలో మా విద్యాబోధనకు అడుగడుగునా ఆటంకాలు ఏర్పడుతున్నాయి.బదిలీపై వెళ్ళిన ఉపాధ్యాయుల స్థానంలో కొత్తవారు రాక పోవడంతో విద్యా వలంటీర్లతోనే బోధన కొనసాగిస్తున్నారు. ఎన్నికల నిర్వాహణ విధుల్లోకి టీచర్లు వెళ్తుండటంతో తరగతులు జరగక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. –వినయ్, పదో తరగతి విద్యార్థి, పాపన్నపేట -
ఉమ్మడి ఆదిలాబాద్‌లో నోటాకు పెరిగిన ఓట్లు
మంచిర్యాలటౌన్: ఎన్నికల్లో తమకు నచ్చిన అభ్యర్థులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునేందుకు ఓటు ఆయుధమైతే.. అభ్యర్థుల్లో ఎవరూ నచ్చలేదని తమ అభిప్రాయాన్ని వ్యక్తపర్చేందుకు ‘నోటా’తో అవకాశం కలిగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకంగా 20,255 మంది ‘నోటా’ నొక్కి పోటీలో ఉన్న అభ్యర్థుల్లో తమకు ఎవరూ నచ్చలేదని స్పష్టం చేయడం విశేషం. గతంలో ఎన్నికల్లో గెలిచిన వారిలో ఎవరు మనకు సేవ చేస్తారో, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తారో వారికి మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం ఉండేది. అప్పుడు ఎన్నికల్లో పోటీచేసే వారు ప్రజల మధ్య నుంచి వచ్చినవారే ఉండడంతో దానిపై ప్రజలు అంతగా పట్టించుకోలేదు. ఇక రోజులు మారుతున్న కొద్దీ చాలా మంది రాజకీయాల్లోకి రావడం, ఎన్నికల్లో పోటీ చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలన్న రాజ్యాంగం కల్పించిన హక్కు ఓ వైపు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నచ్చక ఎవరికి ఓటు వేయాలో తెలియని పరిస్థితిలో ఎవరో ఒకరికి ఓటు వేసే సంస్కృతికి ఎన్నికల సంఘం స్వస్తి పలికింది. దీంతో 2014లో జరిగిన ఎన్నికల్లో నోటా (నన్ ఆప్ ది ఎబోవ్)ను ప్రవేశపెట్టింది. ‘పైన తెలిపిన అభ్యర్థులు ఎవరూ నాకు నచ్చలేదు’ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే అవకాశాన్ని ఓటర్లకు కల్పించింది. దీంతో ప్రజల్లోనూ తమకు నచ్చని అభ్యర్థికి ఇక తాము ఓటు వేయాల్సిన అవసరం లేదని, ఎవరూ నచ్చలేదని ‘నోటా’కు వేసే అవకాశం కలగడంతో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు ముందుకు వస్తున్నారు. స్వతంత్రులు, పలు పార్టీల నేతలకు నోటాకు వచ్చిన ఓట్లు కూడా ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల అభ్యర్థులకు రాకపోవడం గమనార్హం. గతం కంటే పెరిగిన నోటా ఓట్లు మన దేశంలో నోటాను తొలిసారిగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రవేశపెట్టారు. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు ఎవరూ తమకు నచ్చలేదని తెలిపేందుకు ప్రవేశపెట్టిన నోటాను ప్రజలు ఆదరించారు. 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో నోటాకు ప్రజలు పట్టం కట్టారు. ప్రధాన పార్టీలు, స్వతంత్రులు, చిన్న పార్టీల నాయకులకు కనీసం రాని ఓట్లు నోటాకు వచ్చాయంటే, నోటా ప్రభావం ఏమేర చూపిందో అర్థమవుతోంది. నోటా వల్ల ఓటింగ్ శాతం పెరిగినట్లుగా కనబడుతున్నా, అభ్యర్థులకు వచ్చే ఓట్లు మాత్రం తగ్గిపోతున్నాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో నోటాకు 2,715 ఓట్లు మొన్నటి ఎన్నికల్లో వచ్చాయి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోవ లక్ష్మి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆత్రం సక్కు చేతిలో కేవలం 171 ఓట్లతో ఓడిపోయారు. నోటాకు వచ్చిన ఓట్లలో కొన్నింటిని కోవ లక్ష్మి సాధించినా విజయం వరించేదేమో! 2014లో ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాలకు 17,905 నోటాకు రాగా, 2018లో 20,255 ఓట్లు నోటాకు వచ్చాయి. గత ఎన్నికల కంటే 3,160 ఓట్లు నోటాకు పెరిగాయి. ఉద్యోగస్తులు సైతం పోస్టల్ బ్యాలెట్లో వారికి ఏ అభ్యర్థి నచ్చలేదంటూ 2014 ఎన్నికల్లో నోటాకు 67 మంది ఓటు వేయగా, ఈసారి ఎన్నికల్లో 187 మంది నోటాను వినియోగించుకున్నారు. ఉమ్మడి జిల్లాలో వచ్చిన నోటా ఓట్లు నియోజకవర్గం 2014లో 2018లో సిర్పూర్ 1,752 1,579 చెన్నూరు 1,609 2,135 బెల్లంపల్లి 769 2,598 మంచిర్యాల 1,472 1,394 ఆసిఫాబాద్ 2,829 2,715 ఖానాపూర్ 2,421 2,776 ఆదిలాబాద్ 850 1,149 బోథ్ 2,242 2,275 నిర్మల్ 1,360 1,367 ముథోల్ 1,791 2,267 మొత్తం 17,095 20,255 -
ఖమ్మంలో.. నోటాకు మూడో స్థానం
ఖమ్మం, మయూరిసెంటర్: ఖమ్మం నియోజకవర్గంలో ఓటర్లు ఈ ఎన్నికల్లో భిన్నంగా ఆలోచించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులను సైతం కాదని నోటా వైపు మొగ్గు చూపారు. ఖమ్మం నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులుగా టీఆర్ఎస్ నుంచి పువ్వాడ అజయ్‌కుమార్, టీడీపీ నుంచి నామ నాగేశ్వరరావు, బీజేపీ నుంచి ఉప్పల శారద, బీఎల్పీ నుంచి పాల్వంచ రామారావు పోటీ చేయగా పోటీ అంతా టీఆర్ఎస్, టీడీపీల మధ్యనే జరిగింది. నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలలో పోలైన ఓట్లు 2,06,428. మొదటి నుంచి గట్టి పోటీదారులుగా ఉన్న పువ్వాడ అజయ్‌కుమార్ 1,02,760 ఓట్లు సాధించగా, నామ నాగేశ్వరరావు 91,769 ఓట్లు సాధించారు. వీరిద్దరు మినహా ఇతర పార్టీల అభ్యర్థులు కనీస ఓట్లను కూడా సాధించలేకపోయారు. మిగిలిన ప్రధాన పార్టీల అభ్యర్థులను వెనక్కి నెట్టి నోటా నియోజకవర్గంలో మూడవ స్థానంలో నిలిచింది. నోటా దెబ్బకి బీజేపీ, బీఎల్పీ అభ్యర్థులు 4, 6 స్థానాలల్లో నిలిచారు. ఇక బీఎస్పీ, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీల అభ్యర్థులు సైతం కనీస ఓట్లను పొందలేకపోయారు. అయితే నోటాకు ఖమ్మం నియోజకవర్గంలో గతం కంటే ఈ దపా ఓట్లు పెరిగాయి. 2014 ఎన్నికల్లో 1,408 మంది పోటీలో ఉన్న అభ్యర్థులు సరైనవారు కాదని నోటాకు ఓటు వేయగా, ఈసారి 3,513 మంది నోటాను నొక్కి పోటీలో ఉన్న అభ్యర్థులు సరైన వారు కాదని భావించారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు పలువురు నోటాను ఎంచుకున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో 19 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నోటాకు పోలయ్యాయి. దీంతో ఎన్నిక ఎన్నికకు నోటాకు ఆదరణ పెరుగుతుంది. నోటాకు ఉన్న ఆదరణ ప్రధాన పార్టీల అభ్యర్థులకు కూడా దక్కడం లేదని నియోజకవర్గ ప్రజలు, రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. -
ఇంకెవరు?
సాక్షి,సిటీబ్యూరో: సీఎం కేసీఆర్ నూతన కేబినెట్లో నగరం నుంచి నలుగురికి చోటు కల్పించనున్నట్టు సమాచారం. అయితే, ప్రస్తుతం వారెవరు అన్నది సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. గురువారం సీనియర్ నేత మహమూద్ అలీతో మంత్రిగా ప్రమాణం చేయించి పూర్తి స్థాయి మంత్రిమండలి ఏర్పాటుకు మరో నాలుగు రోజులుందని కేసీఆర్ సంకేతాలిచ్చారు. దీంతో కేబినెట్లో చోటు కోసం నేతలు ఎవరికి వారుగా తీవ్రస్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. రద్దయిన కేబినెట్లో నగరం నుంచి మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం మహేందర్‌రెడ్డికి స్థానం కల్పించారు. తాజా కేబినెట్లో రంగారెడ్డితో కలుపుకుని ఇంకా నాలుగు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. దీంతో రంగారెడ్డిఉమ్మడి జిల్లా కోటాలో మేడ్చల్ నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన చామకూర మల్లారెడ్డికి అవకాశం కల్పించే అంశంపై చర్చ సాగుతోంది. ఎంపీగా ఉన్న ఆయనతో ఎమ్మెల్యేగా పోటీ చేయించడం కూడా సీఎం కేసీఆర్ ముందస్తు నిర్ణయమేనని ప్రచారం జరగుతోంది. మల్లారెడ్డికి సీఎం కేసీఆర్‌తో పాటు యువనాయుడు కేటీఆర్‌తోనూ సన్నిహిత సంబంధాలు ఉండడం కలిసివచ్చే అంశం. ఇక సిటీకి చెందిన నాయిని నర్సింహారెడ్డిని మళ్లీ క్యాబినెట్లో కొనసాగించే అంశం సస్పెన్స్‌గా ఉంది. నాయినికి ఎమ్మెల్సీ కాలపరిమితి ఇంకా రెండేళ్లు ఉంది. కొత్త క్యాబినెట్లోనూ స్థానం దక్కుతుందన్న నమ్మకంతో ఆయన ఉన్నారు. ఒకవేళ నాయినిని తప్పిస్తే పార్టీ బాధ్యతలు లేదా శాసనమండలిలో ఏదైనా కీలక పదవి ఆయనకు అప్పగించే అవకాశం లేకపోలేదని సన్నిహితులు భావిస్తున్నారు. మరోపక్క సికింద్రాబాద్, సనత్నగర్ల నుంచి విజయం సాధించిన పద్మారావు, తలసాని సైతం తమకు క్యాబినెట్లో చోటు ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు. వీరిలో ఒకరిని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేయించే ఆలోచన అధినేతకు ఉంటే క్యాబినెట్లో చోటు దక్కకపోవచ్చు. ఒకవేళ సీనియర్లు అందరినీ తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించాలన్న ప్రతిపాదన వస్తే సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. ఆమేరకు ఖైరతాబాద్, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ప్రకాష్‌గౌడ్, వివేకానంద్‌గౌడ్, అరికెపూడి గాంధీ పేర్లను కూడా పరిశీలించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. -
దూరం..దూరం
సాక్షి, సిటీబ్యూరో: విద్యావంతులు.. సామాజిక చైతన్యం మెండుగా ఉన్న రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ జిల్లాలో లక్షల మంది పోలింగ్‌పై విముఖత చూపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయనివారు జిల్లాలో లక్షల్లో ఉన్నారు. ఓటింగ్‌పై అధికారులు ఎంత ప్రచారం చేసినా, ఎన్నికల చైతన్య కార్యక్రమాలు నిర్వహించినా మొత్తం ఓటర్లలో సగం మంది కూడా పోలింగ్ బూత్‌ల వైపు చూడలేదంటే అతిశయోక్తి కాదు. జిల్లా మొత్తం ఓటర్లు 40,57,450 మంది కాగా, వీరిలో ఓట్లు వేసింది 20,17,759 మంది మాత్రమే. మిగతా 20,39,691 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. 2014లో 39,65,284 మంది ఓటర్లున్నప్పుడు ఓటు వేసిన వారికంటే.. ఇప్పుడు ఓటు వేసిన వారు మరీ తక్కువగా ఉండడం ప్రజాస్వామ్యానికే మచ్చగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఇప్పుడు ఓటర్లు పెరిగారు. అందుకు తగ్గట్టుగా ఓటు వేసేవారు కూడా పెరగాలి. కానీ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాల్లో అప్పటి కంటే తక్కువ మంది మాత్రమే పోలింగ్ బూత్‌లకు వెళ్లారు. మలక్‌పేట, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో మాత్రం అప్పటి కంటే ఇప్పుడు ఎక్కువ మంది తమ ఓటు హక్కును వినియోగించుకుని విజ్ఞత చాటుకున్నారు. కార్వాన్ నియోజకవర్గంలో మాత్రం పురుషులు అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ మంది ఓటు వేశారు. ఖైరతాబాద్, సనత్‌నగర్ నియోజకవర్గాల్లో మహిళలు ఎక్కువమంది ఓట్లు వేశారు. మిగతా నియోజకవర్గాల్లో అప్పటికంటే ఓటర్లు పెరిగినప్పటికీ.. ఓట్లు వేసిన వారు మాత్రం బాగా తగ్గిపోయారు. నియోజకవర్గాల వారీగా ఓటు వేసినవారిని పరిశిలిస్తే.. ♦ ముషీరాబాద్ నియోజకవర్గంలో 2014లో 81,493 మంది పురుషులు ఓటు వేస్తే తాజా ఎన్నికల్లో 74,225 మంది మాత్రమే ఓటు వేశారు. మహిళలు అప్పట్లో 68,504 మంది ఓటు హక్కు వినియోగించుకోగా ఇప్పుడు 66,493 మంది మాత్రమే ఉన్నారు. అంబర్‌పేటలో గతంలో 78,565 మంది పురుషులు ఓటు వేయగా, ఇప్పుడు 70,664 మందికి తగ్గిపోయారు. మహిళలు సైతం గత ఎన్నికల్లో 68,117 మంది ఓటు వేయగా, ఇప్పుడు 64,226 మంది మాత్రమే ఉన్నారు. ఖైరతాబాద్‌లో పురుషులు అప్పుడు 78,314 మంది, ఇప్పుడు 74,461 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. మహిళలు అప్పుడు 65,177 మంది కాగా ఇప్పుడు అంతకంటే ఎక్కువగా 66,815 మంది ఓటు వేశారు. జూబ్లీహిల్స్‌లో పురుషులు గత ఎన్నికల్లో 92,415 కాగా, ఇప్పుడు 83,585 మందికి తగ్గిపోయారు. సనత్‌నగర్‌లో పురుషులు గతంలో 68,641 మంది, ఇప్పుడు 62,613 మంది, మహిళలు 56,097 మంది నుంచి 57,054 మందికి పెరిగారు. సికింద్రాబాద్‌లో గత ఎన్నికల్లో 72,222 పురుషులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లగా ఇప్పడు 67,607 మందికి తగ్గిపోయారు. మహిళలు గతంలో 64,327 మంది, ఇప్పుడు 63,967 మంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో 67,228 మంది పురుషులు ఓట్లు వేస్తే, ఇప్పుడు 59,804 మందికి పడిపోయారు. మహిళలు అప్పుడు 58,338 మంది, ఇప్పుడు 57,785 మంది మాత్రమే ఓట్లు వేశారు. పాతబస్తీ పరిధిలో ఇలా.. ఈ ప్రాంతంలో పోలింగ్ సరళిని పరిశీలిస్తే మలక్‌పేట, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో అప్పటి కంటే ఇప్పుడు ఎక్కువమంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మలక్‌పేటలో 2014లో 64,804 మంది పురుషులు మాత్రమే ఓటు వేయగా, ఇప్పుడు 66,123 మందికి పెరిగారు. మహిళలు అప్పట్లో 56,833 మంది మాత్రమే ఓటు వేయగా.. ఈ ఎన్నికల్లో 59,320 మందికి పెరిగారు. ఇక చాంద్రాయణగుట్టలో గతంలో 71,533 మంది పురుషులు ఓటు వేస్తే.. తాజాగా ఆ సంఖ్య 74,767 మందికి పెరిగింది. మహిళా ఓటర్ల సంఖ్య కూడా 64,601 మంది నుంచి 65,072 మందికి పెరింగింది. కార్వాన్లో పురుషులు అప్పుడు 72,472 మంది ఓటు వేయగా>.. ఇప్పుడు 88,992 మంది ఓటు వేసి వివేకవంతులనిపించుకున్నారు. మహిళా ఓటర్ల సంఖ్య మాత్రం 86,696 మంది నుంచి 76,299 మందికి తగ్గిపోయింది. గోషామహల్ నియోజకవర్గంలో పురుషులు అప్పుడు 87,386 మంది, ఇప్పుడు 77,822 మంది ఓట్లు వేశారు. మహిళలు అప్పుడు 71,164 మంది, ఇప్పుడు కేవలం 58,820 మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. చార్మినార్‌లో పురుషులు గత ఎన్నికల్లో 61,312 మంది ఓటు వేయగా, ప్రస్తుత ఎన్నికల్లో 56,218 మంది, మహిళలు 48,139 మంది నుంచి 44,578 మందికి తగ్గిపోయారు. యాకుత్‌పురాలో పురుషులు గతంలో 77,193 మంది, ఇప్పుడు 76,087 మంది, మహిళలు 67,493 మంది నుంచి 65,082 మందికి తగ్గిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బహదూర్‌పురాలో 74,246 మంది పురుషులు ఓటు వేయగా, ఇప్పుడు 72,243 మందికి తగ్గింది. మహిళల సంఖ్య కూడా 62,120 మంది నుంచి, 57,951 మందికి పడిపోయింది. ♦ 2014లో హైదరాబాద్ జిల్లాలో 11,23,826 మంది పురుషులు ఓట్లు వేస్తే 2018 ఎన్నికల్లో 10,80,236 మంది మాత్రమే ఓటుహక్కును వినియోగించుకున్నారు. అలాగే మహిళలు గత ఎన్ని కల్లో 9,74,742 మంది ఓటు వేయగా, ఈసారి ఆ సంఖ్య 9,37,491 మందికి తగ్గిపోయింది. -
బాబు జోక్యంతోనే ప్రతికూల ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్వహించిన ప్రచారం ప్రజా కూటమిపై ప్రతికూల ప్రభావం చూపిందని సీపీఎం విశ్లేషించింది. తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు మళ్లీ జోక్యం చేసుకోవడం ఇక్కడి ప్రజలకు రుచించలేదని, టీఆర్ఎస్ అనుకూల సెంటిమెంట్ ఏర్పడేందుకు కేసీఆర్ నిర్వహించిన ప్రచారం ఉపయోగపడిందని అభిప్రాయపడింది. గురువారం ఎంబీ భవన్లో జరిగిన సమావేశంలో ఎన్నికల ఫలితాలు, ప్రభావం, సీపీఎం–బీఎల్ఎఫ్ పోటీ చేసిన స్థానాల్లో ఫలితాలు, తదితర అంశాలను సీపీఎం రాష్ట్ర సెక్రటేరియట్ సమీక్షించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు చేసిన ప్రసంగాలు, కూటమికి తానే సంధానకర్తగా వ్యవహరించిన తీరు ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడడానికి కారణమైందని విశ్లేషించింది. టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో లోపాలున్నా అవి అధికార పార్టీకి సానుకూల ఓటింగ్‌కు పనికొచ్చాయని అభిప్రాయపడింది. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇక ముందూ కొనసాగాలంటే మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. ఓట్ల సాధనలో బీఎల్ఎఫ్ విఫలం... ప్రత్యామ్నాయ విధానాలు, సామాజిక న్యాయం నినాదంతో ఎన్నికల్లో పోటీ చేసిన సీపీఎం–బీఎల్ఎఫ్ ఆశించిన మేర ఓట్ల సాధనలో విఫలం కావడాన్ని సీపీఎం అంగీకరించింది. బీఎల్ఎఫ్ ప్రయోగం, ఎజెండా తెలంగాణకు అవసరమని, రాబోయే రోజుల్లోనూ ఇదే వైఖరితో ముందుకు సాగాలనే అభిప్రాయం వ్యక్తమైంది. బీఎల్ఎఫ్ ప్రత్యామ్నాయ విధానాలకు మద్దతు తెలిపిన సీపీఐ, టీజేఎస్, ప్రజాగాయకుడు గద్దర్, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఆ తర్వాత కాంగ్రెస్‌తో కలవడంతో నష్టం జరిగిందని అభిప్రాయపడింది. -
కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అనే నేను..
‘కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాస నాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’. సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేశారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గురువారం మధ్యాహ్నం 1.25గంటలకు కేసీఆర్‌తో ప్రమాణం చేయించారు. కేసీఆర్‌తోపాటు మహమూద్ అలీ మంత్రిగా ప్రమా ణం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం కేసీఆర్ ముందుకు ఒంగి వినయపూర్వకంగా అందరికీ నమస్కారం చేశారు. అనంతరం కేసీఆర్‌కు గవర్నర్ నరసింహన్ పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. రాజ్‌భవన్‌లో సాదాసీదాగా ఈ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎంగా కేసీఆర్, మంత్రిగా మహమూద్ అలీల నియామకాన్ని నోటిఫై చేస్తూ ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, నిజామాబాద్ ఎంపీ కవిత దంపతులు, సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ ఎమ్మె ల్యే రాజాసింగ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధా కర్‌రెడ్డి హాజరయ్యారు. కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, వివిధ కార్పొరేషన్ చైర్మ న్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారాని కి ముందు గవర్నర్ కార్యాలయంలో ఒవైసీ తో కలిసి కేసీఆర్ కాసేపు కూర్చున్నారు. ముహూర్త సమయానికి సీఎంతో కలిసే ఒవైసీ బయటికొచ్చారు. వీరు మినహా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకాలేదు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, టీజేఎస్ అధ్య క్షుడు కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఎం కార్యదర్శి తమ్మినేనితోపాటు ఆయా పార్టీల నేతలకు ఆహ్వానం రాలేదని సమాచారం. రాజన్న ఆశీర్వాదం సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం గవర్నర్‌తోపాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్‌ను రాజ్‌భవన్‌లోనే ఆశీర్వదించారు. వేములవాడ ఎమ్మెల్యే సీహెచ్ రమేశ్‌బాబు, ఆలయ ఈవో దూస రాజేశ్వర్ కేసీఆర్‌ను సత్కరించారు. అనంతరం ప్రగతిభవన్ చేరుకున్న సీఎంను భద్రాద్రి ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. పలువురు ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, డీజీపీ మహేందర్ రెడ్డి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తదిత రులు కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్ గారికి శుభాకాంక్షలు. ఆయన మరింత ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అని ట్వీట్ చేశారు. ఇదీ ప్రస్థానం పేరు: కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) పుట్టిన తేదీ: 17.2.1954 తల్లిదండ్రులు: వెంకటమ్మ, రాఘవరావు స్వగ్రామం: సిద్ధిపేట జిల్లా చింతమడక విద్యార్హత: ఎంఏ కుటుంబం: భార్య శోభ, కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత. రాజకీయ జీవితం: యువజన కాంగ్రెస్‌లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. రాఘవాపూర్ సింగిల్ విండో చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1983లో తెదేపాలో చేరి సిద్దిపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో సిద్దిపేట నుంచి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994 ఎన్టీఆర్ కేబినేట్లో కరు వు మంత్రిగా పని చేశారు. 1996–1999 వరకు చంద్రబాబు మంత్రివర్గంలో రవాణా మంత్రిగా పనిచేశారు. 1999–2001 వరకు శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. 2001లో ఎమ్మెల్యే పదవి, డిప్యూటీ స్పీకర్ పదవికి, టీడీపీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు. 2001 ఉప ఎన్నికల్లో సిద్దిపేట నుంచి గెలిచారు. 2004లో సిద్దిపేట శాసనసభ, కరీంనగర్ లోక్‌సభ స్థానాలకు పోటీ చేసి విజయం సాధిం చారు.యూపీఏ ప్రభుత్వంలో కార్మికమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2006లో కేంద్రమంత్రి పదవికి, కరీంనగర్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. కరీంనగర్ లోక్‌సభ ఉప ఎన్నికలలో విజయం సాధించారు. 2008 ఉప ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా మరోసారి గెలిచారు. 2009లో మహబూబ్‌నగర్ ఎంపీగా గెలిచారు. 2009 నవంబర్ 29న సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్షకు ప్రయత్నించి అరెస్టయ్యారు. 2009 నుంచి తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రతరం చేశా రు. 2014 ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ, గజ్వేల్ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజైన 2014 జూన్ 2న తొలి సీఎంగా ప్రమాణం చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గురువారం ఆయన రెండోసారి సీఎంగా ప్రమాణం చేశారు. -
కారుకు ట్రక్కు బ్రేకులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 సీట్లలో ఘన విజయం సాధించినప్పటికీ 26 నియోజకవర్గాల్లో మాత్రం ‘కారు’జోరుకు ‘ట్రక్కు’బ్రేకులు వేసింది. ప్రజలు ఎప్పుడూ పేరు కూడా వినని సమాజ్‌వాదీ ఫార్వర్డ్ బ్లాక్ (ఎస్ఎంఎఫ్బీ) అనే పార్టీతోపాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ కేటాయించిన ట్రక్కు గుర్తు టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపింది. ఈవీఎంలలో పొందుపరిచిన ట్రక్కు చిహ్నం, కారు గుర్తును పోలి ఉండటం నిరక్షరాస్యులు, వృద్ధులు గందరగోళపరిచింది. దీంతో ఎస్ఎంఎఫ్బీ పోటీ చేసిన 26 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఓట్లకు భారీగా గండిపడింది. ఫలితంగా ఆయా చోట్ల టీఆర్ఎస్ మెజారిటీ 5 వేల నుంచి 10 వేల ఓట్ల వరకు తగ్గడమే కాకుండా కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఓటమికి కారణమైంది. ఆరు చోట్ల ప్రత్యక్ష ప్రభావం... రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎంఎఫ్బీ పార్టీకి వచ్చిన ఓట్ల వివరాలను పరిశీలిస్తే ఆ పార్టీ పోటీ చేసిన ప్రతిచోటా గణనీయంగా ఓట్లు వచ్చాయి. ఖైరతాబాద్ నియోజకవర్గంలో అత్యల్పంగా 1,152 ఓట్లు రాగా, అత్యధికంగా ధర్మపురిలో 13,114 ఓట్లు వచ్చాయి. మొత్తం 26 స్థానాల్లో పోటీ చేస్తే బీజేపీ, టీజేఎస్, సీపీఐ లాంటి పార్టీలు, బలమైన ఇండిపెండెంట్లు పోటీలో లేని అన్ని స్థానాల్లోనూ ఆ పార్టీనే మూడో స్థానంలో నిలిచింది. కొన్ని చోట్ల ఈ పార్టీలకన్నా ఎక్కువ ఓట్లు కూడా సాధించింది. నియోజకవర్గాలవారీ వివరాలను పరిశీలిస్తే నకిరేకల్‌లో ఏకంగా టీఆర్ఎస్ అభ్యర్థిని ట్రక్కు గుర్తు ఓడించింది. తాండూరులో ఓటమిపాలైన పట్నం మహేందర్‌రెడ్డి ఓటమి మార్జిన్ 2,925 ఓట్లకు చేరడానికి కూడా ట్రక్కు గుర్తే కారణమైంది. ధర్మపురిలో 10 వేల పైచిలుకు మెజారిటీతో గెలవాల్సిన కొప్పుల ఈశ్వర్ బతుకు జీవుడా అంటూ 400 ఓట్లతో గెలివాల్సి వచ్చింది. అలాగే పరిగి, పెద్దపల్లి, కామారెడ్డి నియోజకవర్గాల్లో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీకన్నా ట్రక్కు గుర్తుకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. వాటితోపాటు మరో 20 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ ట్రక్కు గుర్తు కారణంగా తగ్గిపోయింది. సీపీఎం కూటమికన్నా ఎక్కువ ఓట్లు... సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌బ్లాక్ 26 స్థానాల్లో పోటీ చేసి ఏకంగా 1,66,367 ఓట్లు సాధించగా కమ్యూనిస్టు పార్టీగా రాష్ట్ర ప్రజలకు సుపరిచితమైన సీపీఎంతో కలసి 107 స్థానాల్లో పోటీ చేసిన బహుజన లె‹ఫ్ట్ ఫ్రంట్ పార్టీ (బీఎల్ఎఫ్) కేవలం 1,41,432 ఓట్లే సాధించగలిగింది. రాష్ట్రవ్యాప్తంగా పోలయిన ఓట్లలో బీఎల్ఎఫ్పీ అభ్యర్థులకు 0.7 శాతం ఓట్లు రాగా ఎస్ఎంఎఫ్బీకి మాత్రం 0.8 శాతం ఓట్లు వచ్చాయి. దీన్నిబట్టి రాష్ట్ర ఓటర్లు కారు, ట్రక్కు గుర్తులను పోల్చుకోవడంలో గందరగోళానికి గురయ్యారని, అందుకే ఆ పార్టీకి అన్ని ఓట్లు వచ్చాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆటో తీసేశారు కానీ... 2014 సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగ్గా అప్పుడు కారుతోపాటు ఆటో గుర్తుకు కూడా ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. ఆటో గుర్తు కారణంగా అప్పట్లో టీఆర్ఎస్ చాలా చోట్ల నష్టపోగా కొన్ని చోట్ల లాభపడింది. అయితే ఈ గందరగోళం మంచిది కాదనే ఆలోచనతో ఈసారి ఎన్నికల్లో ఆటో గుర్తును ఎవరికీ ఇవ్వొద్దని ఎన్నికల సంఘాన్ని టీఆర్ఎస్ కోరింది. దీంతో ఈసారి ఎన్నికల్లో ఆటో గుర్తును ఎన్నికల సంఘం మినహాయించింది. కానీ కారు గుర్తును పోలి ఉన్న ట్రక్కు గుర్తును వదిలేయడంతో వీలున్నంతమేర ఆ గుర్తు టీఆర్ఎస్కు నష్టం చేయడం గమనార్హం. వివిధ నియోజకవర్గాల్లో ట్రక్కు గుర్తుకు వచ్చిన ఓట్లు... అలంపూర్ (8,803), భువనగిరి (3,613), భూపాలపల్లి (2,171), దుబ్బాక (12,215), గద్వాల (7,189), జడ్చర్ల (2,886), జనగామ (10,031), కామారెడ్డి (10,537), ఖైరతాబాద్ (1,152), ఎల్బీ నగర్ (3,739), మహేశ్వరం (3,457), మల్కాజిగిరి (4,651), మానకొండూరు (13,610), మంథని (5,457), మెదక్ (6,947), మునుగోడు (2,279), నాగార్జున సాగర్ (9,819), నాగర్ కర్నూల్ (5,545), నకిరేకల్ (10,383), పాలకుర్తి (3,199), పరిగి (8,694), పెద్దపల్లి (8,499), కుత్బుల్లాపూర్ (3,045), రామగుండం (3,531), కంటోన్మెంట్ (1,745), తాండూరు (2,608), తుంగతుర్తి (3,729), వికారాబాద్ (3,214), వరంగల్ వెస్ట్ (3,619). 2,124ఓట్లు.. నకిరేకల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశం కారు గుర్తుకు 85,440 ఓట్లు పోలవగా ఈ స్థానంలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య హస్తం గుర్తుకు 93,699 ఓట్లు వచ్చాయి. 8,259 ఓట్ల తేడాతో వీరేశంపై లింగయ్య గెలిచారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అక్కడ సమాజ్‌వాదీ ఫార్వర్డ్ బ్లాక్ (ఎస్ఎంఎఫ్బీ) పార్టీ తరఫున పోటీ చేసిన దుబ్బ రవికుమార్ ట్రక్కు గుర్తుకు ఏకంగా 10,383 ఓట్లు పడ్డాయి. వీరేశం, లింగయ్యల మధ్య ఉన్న తేడా కంటే 2,124 ఎక్కువ ఓట్లు ట్రక్కు గుర్తుకు పడ్డాయన్నమాట. 267ఓట్లు.. తాండూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డికి 67,553 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్‌రెడ్డికి 70,428 ఓట్లు లభించాయి. ఇద్దరి మధ్య తేడా 2,875 ఓట్లు. కానీ ఇక్కడ అదే ఎస్ఎంఎఫ్బీ పార్టీ నుంచి పోటీ చేసిన పి. మహేందర్‌రెడ్డి అనే అభ్యర్థికి 2,608 ఓట్లు వచ్చాయి. అంటే ప్రధాన అభ్యర్థులు మహేందర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిల మధ్య తేడాకన్నా కేవలం 267 ఓట్లే తక్కువ వచ్చాయి. -
వీరివీరి గుమ్మడిపండు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా, మహమూద్ అలీ మంత్రిగా గురువారం ప్రమాణం చేశారు. వారం రోజుల్లోపే పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరనుంది. అయితే.. ఈసారి ఎవరికి కేబినెట్ బెర్తులు దక్కుతాయనేదానేదే ఆసక్తికరంగా మారింది. గత ప్రభుత్వంలోని నలుగురు మంత్రులు ఈసారి ఓడిపోయారు. వీరి స్థానాల్లో కొత్త వారిని తీసుకోవడం ఖాయం. అయితే.. గతంలో ఉన్నవారిలో ఎందరికి మంత్రి పదవులు ఇస్తారనేదే మాజీల్లో ఉత్కంఠ రేపుతోంది. దీనికితోడు కొత్త వారిలో ఎందరికి, ఎవరెవరికి అవకాశం ఇస్తారనేదానిపై చర్చ జరుగుతోంది. మంత్రులుగా తమ పేరును పరిశీలించాలని పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎంకు విజ్ఞప్తి చేసుకుంటున్నారు. నేరుగా చెప్పకుండా మనసులోని మాటను అధినేతకు తెలిసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ కసరత్తు కొత్త జట్టు కూర్పుపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఈ కూర్పు పూర్తయిన తర్వాత.. ఈ నెల 17 లేదా 18 తేదీల్లో మిగిలిన మంత్రుల ప్రమాణస్వీకారం జరగొచ్చని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ముందస్తు ఎన్నికలో టీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించింది. వీరిలో సీనియర్ ఎమ్మెల్యేలు అందరూ మంత్రి పదవులు ఆశిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు సైతం మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రాజ్యాంగ నియమావళి ప్రకారం తెలంగాణలో సీఎం, మరో 17 మంది మంత్రులు ఉంటారు. కేసీఆర్, మహమూద్ అలీ గురువారం ప్రమాణం స్వీకారం చేశారు. మరో 16 మందికే కేబినెట్ బెర్త్ దక్కుతుంది. జిల్లాలు, సామాజిక లెక్కల ప్రకారం వీటిని భర్తీ చేయాల్సి ఉంది. కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు (కమ్మ), జూపల్లి కృష్ణారావు (వెలమ), అజ్మీరా చందూలాల్ (ఎస్టీ–లంబాడ), పట్నం మహేందర్ రెడ్డి ఓడిపోయారు. అసెంబ్లీలో కేసీఆర్ తర్వాత ఆరుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన డీఎస్ రెడ్యానాయక్ (ఎస్టీ–లంబాడ), ఎర్రబెల్లి దయాకర్‌రావు (వెలమ)లకు కొత్త ప్రభుత్వంలో బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ భారీ విజయాలను నమోదు చేసుకున్నా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఒక్క స్థానానికే పరిమితమైంది. ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్లో పువ్వాడ అజయ్ కుమార్ (కమ్మ) గెలిచారు. 2014 ఎన్నికల్లోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్కు ఒకటే స్థానం వచ్చింది. ఆరు నెలల వరకు ఆ జిల్లా నుంచి ఎవరికీ మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. ఖమ్మం ఉమ్మడి జిల్లాకు మంత్రివర్గంలో స్థానం కల్పించే విషయంలో సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిథ్యం వహిస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరు ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి పదవికి పరిశీలిస్తున్నట్లు తెలిసింది. సామాజిక వర్గాల వారిగా.. అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రిగా ఉన్న పట్నం మహేందర్‌రెడ్డి ఎన్నికలలో ఓడిపోయారు. ఈ జిల్లా కోటాలో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి పేర్లను సీఎం పరిశీలిస్తున్నారు. కేసీఆర్ పాత జట్టులో సభ్యులుగా ఉన్న వారిలో మార్పులు చేస్తే గ్రేటర్ హైదరాబాద్ నుంచి కేపీ వివేకానంద (కుత్బుల్లాపూర్), దానం నాగేందర్ (ఖైరతాబాద్)ల పేర్లను పరిశీలించే అవకాశం ఉంది. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి (ఎస్సీ)ని కొనసాగించే విషయంలో మార్పులు జరిగితే రాష్ట్రంలో హరీశ్ రావు తర్వాత రెండో అతిపెద్ద విజయం సాధించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ (మాదిగ)తోపాటు రసమయి బాలకిషన్ (మాదిగ)లలో ఒకరికి మంత్రి పదవి ఖాయమయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఇదే కోటాలో మాల సామాజికవర్గానికి చెందిన కొప్పుల ఈశ్వర్ (మాల), చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్టీ కోటాలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ను ఖరారు చేస్తే మహిళా కోటా సైతం భర్తీ కానుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మహిళా మంత్రి కోటాలో పద్మా దేవేందర్ రెడ్డి (మెదక్), గొంగడి సునీత (ఆలేరు) పేర్లను టీఆర్ఎస్ అధినేత పరీశీలిస్తున్నారు. కీలకమైన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల భర్తీ పూర్తయ్యాకే మంత్రి పదవుల విషయంలో సీఎం కేసీఆర్ తుది నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రి పదవులకు ప్రాబబుల్స్: ఆదిలాబాద్: అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, బాల్క సుమన్, అజ్మీర రేఖానాయక్ నిజామాబాద్: పోచారం శ్రీనివాస్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి కరీంనగర్: కేటీఆర్, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ మెదక్: హరీశ్‌రావు, సోలిపేట రామలింగారెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, హైదరాబాద్: తలసాని శ్రీనివాస్‌యాదవ్, టి.పద్మారావుగౌడ్, దానం నాగేందర్. రంగారెడ్డి: సీహెచ్ మల్లారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కేపీ వివేకానంద్. మహబూబ్‌నగర్: సి.లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్. నల్లగొండ: జి.జగదీశ్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, గొంగడి సునీత. వరంగల్: కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, డీఎస్ రెడ్యానాయక్, అరూరి రమేశ్, దాస్యం వినయభాస్కర్. ఖమ్మం: పువ్వాడ అజయ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి -
హోం మంత్రిగా మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హోం మంత్రిగా మహమూద్ అలీని నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గురువారం మధ్యాహ్నం కేసీఆర్‌తోపాటు మంత్రిగా మహమూద్ అలీ ఒక్కరే ప్రమాణం చేశారు. మహమూద్ అలీ నియామకాన్ని నోటిఫై చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జీవోలో ఉప ముఖ్యమంత్రి అని పేర్కొనలేదు. దీంతో ప్రస్తుత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులు ఉండకపోవచ్చని తెలిసింది. మహమూద్ అలీ గత ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ బాధ్యతలు నిర్వహించారు. తాజా బాధ్యతలతో.. తెలంగాణ రాష్ట్రంలో హోం శాఖ బాధ్యతలను చేపట్టిన తొలి ముస్లిం నేతగా గుర్తింపు పొందారు. అలీ శాఖ మారిన నేపథ్యంలో గత ప్రభుత్వంలోని మంత్రుల శాఖల్లోనూ మార్పులు ఉంటాయని తెలుస్తోంది. పాల వ్యాపారం నుంచి.. హైదరాబాద్‌లోని మలక్‌పేటకు చెందిన మహమూద్ అలీ 1953 మార్చి 2న జన్మించారు. ఆయన తండ్రిపేరు పీర్ మహ్మద్ బాబూమియా, తల్లి సయీదున్నీసా బేగం. భార్యపేరు నస్రీన్ ఫాతిమా. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కూతుళ్లు (ఫిర్దోస్ ఫాతిమా, అఫ్రోజ్ ఫాతిమా), కుమారుడు మహ్మద్ ఆజం అలీ. బీకాం వరకు చదివిన ఆయన పాల వ్యాపారం చేశారు. మలక్‌పేట ప్రాంతం నుంచి చురుకైన మైనారిటీ నేతగా ఆయనకు మంచి పేరుంది. ఇంటర్మీడియట్ చదివే రోజుల నుంచే మహమూద్ అలీ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. టీఆర్ఎస్ అవిర్భావం నుంచి కేసీఆర్ వెంటే ఉన్నారు. 2001లో టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడిగా, ఆ తర్వాత హైదరాబాద్ నగర టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడిగా.. 2005, 2007లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 2009లో టీఆర్ఎస్ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. 2013లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2014లో తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన మహమూద్ అలీ గురువారం మరోసారి మంత్రిగా ప్రమాణం చేశారు. కీలకమైన హోం శాఖ బాధ్యతలను అప్పగించారు. -
మౌన జ్ఞాని మన ఓటరు
తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయాన్ని వెతకటం లేదని విపక్షం గ్రహించలేదు. ఒకవేళ వెతుకుతున్నారనుకున్నా... తాము మెరుగైన ప్రత్యామ్నాయం ఇవ్వగలమని విపక్షం భరోసా కల్పించలేకపోయింది. ఈ రాష్ట్రంలో, దేశంలో వేదికలెక్కి, సామాజిక మాధ్యమాల్లో జొరబడి, టీవీ చర్చల్లో పూనకం వచ్చినట్టు మాట్లాడేవారి చేతుల్లో ఓట్లు లేవు. ఓట్లున్న సగటు పౌరులు మాట్లాడరు. అందుకే, పైపై పరిశీలకులకు, మీడియాకు ప్రజానాడి దొరకదు. నిన్న వెలువడిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్∙రాష్ట్రాల ఎన్నికల ఫలితాల విశ్లేషణలోనూ శాస్త్రీయత కొరవడింది. స్థానిక పరిస్థితుల్ని, దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాల్ని పరిగణనలోకి తీసుకోకుండానే నిర్ణయానికి వస్తున్నారు. రాజకీయ క్షేత్రంలో దృశ్యం ఎలా ఉన్నా ప్రజాక్షేత్రంలో అయోమయం, అస్పష్టత ఉండదు. ఎక్కువ సందర్భాల్లో సాధారణ ప్రభావాలకు, ప్రలోభాలకూ లొంగని ఏకరీతి జనాభిప్రాయాన్నే ప్రతి బింబిస్తుంది. సాధారణ చూపులకు ఆననిదేదో అంతర్లీనంగా ఉండటం వల్లే కడవరకు దృశ్యం ఆవిష్కృతం కాదు. పలు ఊహలకు, అంచనాలకు తావిస్తుంది. ఎక్కువ సందర్భాల్లో వాటి ఆధారంగానే ప్రసారమాధ్యమాల విశ్లేషణలు, మేధావి వర్గం వాదనలు రూపుదిద్దుకుంటాయి. కొన్ని సంకేతాలను శాస్త్రీయంగా పరిశీలించి, విశ్లేషించే వారికి ప్రజానాడి దొరి కినా వేర్వేరు కారణాల వల్ల వాటిని ప్రజలు నమ్మరు. ఎన్నికల సమయంలో తీవ్ర ఉత్కంఠ తర్వాత ఏకపక్ష ఫలితాలు చాలా మందికి విస్మయం కల్గించడానికి ఈ మర్మమే కారణం! తెలంగాణలో నిన్నటి ఎన్నికల ఫలితాలు అధికులకు ఆశ్చర్యం కలిగించాయి. ఘనవిజయం సాధించిన పాలక తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస)లోనూ, తమ అంచనాల్ని మించి ఎక్కువ స్థానాలు రావడంతో కొందరు విస్మయం చెందారు. గెలుపోటముల కారణాలను ఇప్పడు ఎవరికి వారు తమకు అనువైన, అవగాహన మేర విశ్లేషిస్తున్నారు. తెరాసకు లభించిన స్థానాలు, ఆధిక్యతలు, ఒకటీ అర జిల్లాలు మినహా రాష్ట్రమంతటా వెలసిన విజయ విస్తృతిని చూస్తే ఒక అంశం స్పష్టమౌతోంది. ప్రచారం జరిగిన ప్రభుత్వ వ్యతిరేకత ప్రజాక్షేత్రంలో లేదు. పైగా, సానుకూలత క్రమంగా బలపడింది. దానికి తోడు పలు పరిణామాలు పాలకపక్షానికి కలిసి వచ్చాయి. అన్నిటికన్నా ముఖ్యంగా నాయకత్వంపై ప్రజల్లో ఏర్పడ్డ ప్రగాఢ విశ్వాసం కడవరకూ చెదరక నిలవడం తుది ఫలితాల్ని శాసిం చింది. సదరు నాయకత్వంపై విశ్వాసాన్ని సడలింప జేసేందుకు జరిగిన యత్నాలను తిప్పికొట్టే క్రమంలో నాయకుడు, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు (కేసీఆర్) తీసుకున్న జాగ్రత్తలు, ఎత్తుగడలు వారి గెలుపును మరింత దృఢపరిచాయి. కేసీఆర్ తనను తాను ‘ఎజెండా’ చేసుకున్నారు. పార్టీ శ్రేణులన్నీ క్రమశిక్షణ కలిగిన సైన్యంలాగే తమ ‘జనరల్’ వెనుక కవాతులా నడిచాయి. ప్రజాభిప్రాయాన్ని మలచడమొక కళ! ఎన్నికల్లో రాజకీయ పక్షాలు తమ విధానాల ప్రచారం ద్వారా ప్రజాభిప్రాయాన్ని సానుకూలంగా మలచ జూస్తాయి. ఈ క్రమంలో... పాలక–విపక్షాలు కొన్ని మౌలిక విషయాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వాలపై ప్రజాభిప్రాయానికి వివిధ స్థాయిలుంటాయి. సామూహిక ప్రజా వ్యతిరేకత, తీవ్ర ప్రజా వ్యతిరేకత, వ్యతిరేక–సానుకూల భావనలు లేని తటస్థ స్థితి, సానుకూలత, బలమైన సానుకూలత.... ఇలా వైవిధ్యంగా ఉండే పరిస్థితుల్ని బట్టి ఎవరైనా నిర్దిష్ట కార్యాచరణతో ఎన్నికల పోరు జరపాలి. ఇక్కడ అంచనాలు ఏ మాత్రం తప్పినా వ్యూహం ఫలించదు. పుష్కర కాలం ఉద్యమించి తెలంగాణ సాధించిన పార్టీగా అధికారం చేపట్టిన తెరాస, నాలుగున్నరేళ్ల పాలన తర్వాత నాలుగయిదు మాసాలు ముందే ఎన్నికలు తెచ్చింది. అదొక వ్యూహం! విపక్షం అంచనా వేసినట్టు వ్యతిరేకత మొదలవుతోంది, అది బలపడక ముందే ప్రజాతీర్పుకు వెల్లడం మేలు చేస్తుందన్న భావనా పాలకపక్షానికి ఉండిందేమో! ప్రజావ్యతిరేకత స్థాయిని విపక్షం గ్రహించి ఉండాల్సింది. సామూహిక ప్రజా వ్యతిరేకత తెలంగాణ రాష్ట్రంలో లేదు. సంఖ్యాపరంగా అత్యధికులైన సామాన్యులు, మధ్యతరగతికి ప్రత్యక్ష లబ్ది చేకూరుస్తున్న పింఛన్లు, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్, రైతుబంధు, కేసీఆర్ కిట్, వృత్తులపరమైన మేళ్లు వంటి సంక్షేమ పథకాల అమలు సవ్యంగా ఉంది. లబ్దిదారులు సర్కారుపై కొంత కృతజ్ఞతతో ఉన్నారు. ముఖ్యంగా కొడుకులు సరిగా చూడని తలిదండ్రులు, భర్తల ఆర్థిక వెసలుబాటు కరువై కాన్పు ఖర్చులకు జడుస్తున్న భార్యలు, ఒంటరి మహిళలు, పెట్టుబడి ఖర్చులతో కృంగిన రైతులు... సర్కారు చేయూతకు సంతసించారు. ప్రభుత్వంపైన, నాయకుడు కేసీఆర్ పైన ప్రజా విశ్వాసం బలంగా ఉంది. పౌరుల ఇతరేతర వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేరనందున స్థానిక నాయకత్వం, ముఖ్యంగా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత బలంగా ఉంది. అది పలు సందర్భాల్లో కొట్టొచ్చినట్టు కనిపించింది. అందుకే, స్థూలంగా ప్రభుత్వంపైనో, నాయకుడిపైనో ప్రచారాన్ని కేంద్రీకృతం చేయకుండా విపక్షాలు స్థానిక నాయకత్వాన్నే లక్ష్యం చేసి పోరాడాల్సింది. ప్రజల్లోకి వెళ్లి, వారితో సంబంధాల్ని నెరపి, ప్రజాభిప్రాయాన్ని మలచడానికి ఈ దారి ఎంచుకొని ఉండాల్సింది. వారెదుర్కొంటున్న ప్రధాన సమస్యల్ని తీసుకొని క్రమంగా ఉద్యమాలు నిర్మించాల్సింది. అలా కాకుండా కేవలం పత్రికా ప్రకటనలు, టీవీ చర్చల్లో విసుర్లు, నిత్యం మీడియా వేదికగా విమర్శలతోనే ప్రజాభిప్రాయాన్ని నిర్మిస్తామనుకోవడం పొరపాటు అని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. సంక్షేమ పథకాల పట్ల సానుకూలతతో లబ్దిపొందాలనుకున్న పాలకపక్షం నియోజకవర్గాల వారిగా వివరాలు సేకరించింది. ప్రతి నియోజకవర్గంలోనూ, బహుళ పథకాల లబ్దిని కలగలిపి లెక్కించినా, నికరంగా సగటున 30 నుంచి 60 వేల మంది ఓటర్లు ప్రత్యక్ష లబ్దిదారులుగా తేలారు. ఆ జాబితాలు చేబూని నిర్దిష్ట ప్రచారమూ చేశారు. ఇవి కొనసాగడమా, నిలిచిపోవడమా? మీకేం కావాలి? అన్న తరహాలోనూ కొన్నిచోట్ల ప్రచారం వారికి లాభించింది. పెద్ద సంఖ్యలో ఓట్ల వ్యత్యాసాలతో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో లక్షకు పైగా ఓట్లు పొందిన విజేతలు 26 మంది ఉండగా అందులో 24 మంది తెరాస వాళ్లే! బాబుతో ‘చేయి’ కలపడం నిలువునా ముంచింది సున్నిత మనోభావాలు, స్వీయ అస్తిత్వ ప్రభావం నుంచి క్రమంగా బయటపడుతూ పాలన–రాజకీయ అంశాల ఆధారంగానే ఇక తెలంగాణ రాష్ట్రం రెండో ఎన్నికలని అత్యధికులు భావించారు. తెలంగాణ మనుగడతోనే నిమిత్తం లేని తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రంగప్రవేశంతో పూర్తి ఎన్నికల అస్తిత్వ చిత్రమే మారిపోయింది. కాంగ్రెస్ నిర్హేతుకంగా టీడీపీతో జట్టు కట్టి, బాబును ముందు పెట్టి తెరాసను ఢీకొనడం రాజకీయ పరిశీలకుల్నీ విస్మయపరిచింది. అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చి ఆలోచనల్ని రగిలించే నిప్పందించినట్టయింది. విశ్వసనీయత, పాలనాదక్షత కొరవడిన పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి, తెరవెనుక వ్యవహారాలతో ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారన్న ఊహనే తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోయింది. దాన్నొక ప్రమాదంగానూ శంకించింది. పాలకుల ఒంటెద్దు పోకడ, నియంతృత్వ ధోరణిని నిరసించిన వారూ మనసు మార్చుకొని, తమ ‘ఓటింగ్’ నిర్ణయ దిశనే మార్చారు. సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చినట్టుగానే, ఏ ప్రచార పటాటోపాలకూ లొంగకుండా, ‘సర్వే’ జిమ్మిక్కులకూ బోల్తాపడకుండా, అయోమయానికీ గురి కాకుండా ఇచ్చిన ‘తీర్పు’నకు ఏపీలోనే కాక ఇతర రాష్ట్రాల్లోనూ అభినందనలు వ్యక్తమౌతున్నాయి. ఆర్థిక వనరులతో ఆదుకున్నాడన్న లాలూచీతో కాంగ్రెస్ ఇచ్చిన చనువు, చంద్రబాబు వ్యూహ తప్పిదం విపక్షాలకు తీవ్ర నష్టం కలిగించింది. సానుకూల అంశాలతో, స్థానిక నాయకత్వ వైఫల్యాల్ని ఎత్తిచూపడంతో సాగాల్సిన విపక్ష ప్రచారం భిన్నంగా సాగింది. ప్రచార హోరు... టీఆరెస్ వర్సెస్ కూట మిగా కాకుండా కేసీఆర్ వర్సెస్ చంద్రబాబుగా దిశ మార్చుకుంది. దాంతో కేసీఆర్ నాయకత్వ ఖ్యాతి ముందు చంద్రబాబు విశ్వసనీయత వెలవెలబోయింది. ఉద్యోగులు ఉద్యమించినా అణచివేసి ఏపీలో బలవంతంగా అమలు చేస్తున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను తెలంగాణలో అధికారంలోకి రాగానే ఎత్తివేస్తామనడాన్ని తెలంగాణ ఉద్యోగులెవరూ నమ్మలేదు. ఏపీలో ప్రత్యర్థి పక్షమైన వైఎస్సార్సీపీ ఎమ్మేల్యేల్ని పెద్ద సంఖ్యలో తన పార్టీలోకి కొని తెచ్చుకొని, నలుగురిని మంత్రుల్ని చేసిన బాబే, ఇక్కడ పార్టీ మారిన వారిని చిత్తుచిత్తుగా ఓడించండని పిలుపునిస్తే... జనం నవ్వుకున్నారు. నాయకత్వ పరంగానే ప్రత్యామ్నాయం చూస్తారు ఇదివరకు ప్రజలు ఓటర్లు మాత్రమే! ఇప్పుడు ఓటర్లు తాము పౌరులమని ఆలోచిస్తున్నారు. తమకు గురి కుదిరిన, విశ్వాసం కలిగిన నాయకుడి ఆలోచనల్ని స్వాగతిస్తున్నారు. తమ అవసరాలు ఈ నాయకత్వంతో తీరుతాయా? ఇచ్చిన మాటయినా వీరు నిలబెట్టుకోగలరా? అనీ ఆలోచిస్తున్నారు. రాజకీయ పక్షాలు ఈ లోతుల్ని గ్రహించడం లేదు. తెలం గాణ ప్రజలు ప్రత్యామ్నాయాన్ని వెతకటం లేదని విపక్షం గ్రహించలేదు. ఒక వేళ వెతుకుతున్నారనుకున్నా... తాము మెరుగైన ప్రత్యామ్నాయం ఇవ్వగలమని విపక్షం ఏ దశలోనూ భరోసా కల్పించలేకపోయింది. ఈ రాష్ట్రంలో, దేశంలో వేదికలెక్కి, సామాజిక మాధ్యమాల్లో జొరబడి, టీవీ చర్చల్లో పూనకం వహించి... ఎక్కువగా మాట్లాడేవారి చేతుల్లో ఓట్లు లేవు. ఓట్లున్న సగటు పౌరులు మాట్లాడరు. అందుకే, పైపై పరిశీలకులకు, మీడియాకు ప్రజానాడి దొరకదు. నిన్న వెలువడిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్∙రాష్ట్రాల ఎన్నికల ఫలితాల విశ్లేషణలోనూ శాస్త్రీ యత కొరవడింది. స్థానిక పరిస్థితుల్ని, దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాల్ని పరిగణనలోకి తీసుకోకుండానే నిర్ణయానికి వస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో పదిహేనేళ్లుగా పాలకపక్షమై ఉండి బీజేపీ ఓడిపోయింది. రాజస్తాన్‌లో ప్రతిసారీ ప్రత్యామ్నాయ ప్రభుత్వాల్ని ఎన్నుకునే సంప్రదాయాన్ని కొనసాగించారు. అప్పటికీ మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో బీజేపీ గౌరవప్రదమైన సంఖ్యతో గట్టి పోటీ ఇచ్చింది. సదరు తీర్పు ప్రధాని మోదీకి వ్యతిరేకమనో, కాంగ్రెస్ అధినేత రాహుల్‌కు అనుకూలమనో అంకెలతో తేల్చేస్తున్నారు. దీంతో ఇక తమ రొట్టె నేతిలో పడిందని కొందరు అవకాశవాద రాజకీయులు చంకలు గుద్దుకుంటున్నారు. ఎన్నికల ముందు ఎన్డీటీవి జరిపిన సర్వేలో ఆయా రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు చౌహాన్, విజయ రాజె, రమణ్సింగ్లకన్నా ప్రజానుకూలత అదే పార్టీకి చెందిన ప్రధాని నరేంద్ర మోదీకి ఎంతో ఎక్కువగా ఉంది. రేపు ఏపీ ఎన్నికల్లో అయినా, పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో అయినా నాయకత్వ పటిమ, ఇచ్చిన మాట నిలబెట్టుకునే విశ్వసనీయత, ప్రజావసరాలు తీర్చే నిబద్దతే జనం దృష్టిలో ప్రామాణికమౌతాయి. రాజకీయ పక్షాలు ఇది గ్రహించాలి. ప్రచారాల మాయలో పడకుండా, నిండైన తమ విశ్వాసంతో, ఆశలతో, ఆకాంక్షలతో ప్రజలిచ్చిన తీర్పును ఏ పక్షాలూ వంచించ కూడదు. ముఖ్యమంత్రి కేసీఆరే అన్నట్టు, ‘‘గెలుపు ఎంత ఘనమో! బాధ్యత అంత బరువు’’. వ్యాసకర్త: దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
మళ్లీ దర్యాప్తుబాట
సాక్షి, హైదరాబాద్: పోలీసులు మళ్లీ దర్యాప్తుబాట పట్టారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వీరికి కొంచెం వెసులు బాటు లభించిందో, లేదో.. అప్పుడే గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం కావడానికి రాష్ట్ర పోలీసు శాఖ సమాయత్తమ వుతోంది. అసెంబ్లీ ఎన్నికల ముందస్తు, బందోబస్తు ఏర్పాట్లలో రెండు నెలలపాటు బిజీబిజీగా గడిపిన పోలీసు శాఖ ఇక పెండింగ్ కేసులపై దృష్టి పెట్టింది. షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి పోలీస్‌శాఖ మొత్తం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ రెండు నెలల్లో రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో సాధారణ నేరాలు, దొంగతనాలు, ఇతర మామూలు కేసులు భారీసంఖ్యలోనే నమోదయ్యా యి. ఎన్నికల హడావుడిలో ఉన్న పోలీస్ యం త్రాంగం వీటిపై పెద్దగా దృష్టి సారించలేకపోయింది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తికావడంతో పెండింగ్ కేసులపై దృష్టి పెట్టాలని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పాత కేసులు కొలిక్కి... రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 14 వేల నాన్‌బెయిలబుల్ వారెంట్లపై ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీస్‌శాఖ రెండు నెలలపాటు చర్యలు చేపట్టింది. పదిహేను రోజుల్లోనే 11,862 నాన్ బెయిలబుల్ వారెంట్లను జారీ చేసింది. దీంతో కొన్ని నేరాల్లో పెండింగ్ కేసులు పూర్తి అయినట్టేనని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. తప్పించుకొని తిరుగుతున్న పాతనేరస్తులను బైండోవర్ చేయడంతో పెండింగ్‌లో కేసుల్లో వారిని కస్టడీలోకి తీసుకొని చార్జిషీట్ సైతం వేసేందుకు అవకాశం కలిసి వచ్చినట్టు పోలీస్ అధికారులు చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 అక్రమ ఆయుధాల కేసులు నమోదవడం, లైసెన్స్డ్ ఆయుధాల డిపాజిట్‌తో ఈ వ్యవహారం వెలుగులోకి రావడం పోలీస్‌శాఖను పెద్ద ముప్పు నుంచి ఊపిరి పీల్చుకునేలా చేసింది. నెల రోజుల్లో పూర్తి చేయాలి... అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయని ఊపిరిపీల్చుకున్న పోలీస్‌శాఖ మరో నెలరోజుల్లో రెండు సవాళ్లను ఎదుర్కోబోతోంది. సర్పంచ్ ఎన్నికలు, ఆ తరువాత పార్లమెంట్ ఎన్నికలుండటంతో మళ్లీ భద్రత, ముందస్తు చర్యలకు రంగం సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమైంది. దీంతో ఈ రెండు నెలల్లో నమోదై, పెండింగ్‌లో ఉన్న కేసులను సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ నాటికి పూర్తి చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు కార్యాచరణ నిర్దేశించారు. దీంతో మళ్లీ అధికారులంతా దర్యాప్తుబాట పట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి పెండింగ్ కేసులు ఓ కొలిక్కి వస్తే పనిభారం లేకుండా ఉంటుందని, దానికి తగ్గట్టు ఎస్పీలు, కమిషనర్లు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. -
బిగ్ బ్రేకింగ్: మహమూద్ అలీకి కీలకమైన మంత్రిత్వశాఖ
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ సీనియర్ నేత, మైనారిటీ నాయకుడు మహమూద్ అలీకి ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక బాధ్యతలు అప్పగించారు. మంత్రివర్గంలో అత్యంత కీలకమైన హోం మంత్రిత్వ శాఖను ఆయనకు కట్టబెట్టారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్‌తోపాటు మంత్రిగా మహమూద్ అలీ ఒక్కరే ప్రమాణం చేశారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు కీలకమైన రెవెన్యూశాఖ బాధ్యతలను మహమూద్ అలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడైన అలీకి రెండో పర్యాయంలోనూ కీలక మంత్రిత్వశాఖ దక్కింది. దీంతో గత పర్యాయంలో హోంమంత్రిగా వ్యవహరించిన నాయిని నరసింహారెడ్డికి మరోసారి మంత్రివర్గంలో చోటు దక్కుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా ఈసారి మంత్రివర్గంలో గణనీయమైన మార్పులు ఉంటాయని, పలువురు కొత్తవారికి అవకాశముంటుందని వినిపిస్తోంది. -
చంద్రబాబు తగిన గుణపాఠం చెప్పారు: భూమన
సాక్షి, చిత్తూరు: చంద్రబాబు నాయుడు ఏపీలో అక్రమంగా సంపాదించిన కొట్ల రూపాయలు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు పెట్టారని, వైఎస్సార్సీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. గురువారం తిరుపతిలో గాలి వీధిలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు తెలంగాణలో అడ్డదారిలో అధికారంలోకి రావాలని చూసారు. కానీ తెలంగాణా ప్రజలు చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పారన్నారు. వచ్చే 2019లో ఎన్నికల్లో ఏపీ ప్రజలు కూడా బాబుకు తగిన బుద్ధి చెపుతారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఈ సందర్భంగా భూమన అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. -
సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ఎల్పీ నేతగా ఎన్నికైన కేసీఆర్ గురువారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు శుభాకాంకలు తెలిపిన మోదీ.. ఆయన పరిపాలన చక్కగా సాగాలని ఆకాంక్షించారు. -
అధికారం కోసం అర్రులు చాచే పార్టీ కాదు మాది!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పు గౌరవిస్తానని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అయితే, ఫలితాల తర్వాత అధికార పార్టీ నేతల మాటలు, వారి అహంకారపూరిత తీరు ఖండిస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి (ఎల్బీనగర్), పోడెం వీరయ్య (భద్రాచలం)లతో కలిసి ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. రాజకీయాల్లో గెలుపోటములు సాధారణమైనవని, గెలుపు శాశ్వతం అనుకుంటే.. అది అధికార పార్టీ నేతల మూర్ఖత్వమే అవుతుందని విమర్శించారు. కాంగ్రెస్ కేవలం అధికారం కోసం అర్రులు చాచే పార్టీ కాదన్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల పక్షాన శాసనసభలో, బయట నిలబడతాం పోరాడుతామని చెప్పారు. కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ‘పలు సందర్భాల్లో కాంగ్రెస్ ఓటమి పాలైందని, అప్పుడు కాంగ్రెస్ పనైపోయింది.. ఇక మళ్లీ అధికారంలోకి రాదన్నారు. దివిసీమ ఉప్పెనప్పుడు 1977లో ఇందిరాగాంధీని ఇక్కడకి వస్తే అల్లర్లు అవుతాయని అప్పటి సీఎం ఆపారు. కానీ సంవత్సరంలోపే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఫలితాలతో కార్యకర్తలు నిరుత్సాహం చెందొద్దు. రానున్న సర్పంచ్, లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చూపిద్దాం’ అని హితబోధ చేశారు. అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని, మాట నిలబెట్టుకోవాలని సూచించారు. పార్టీ విధానాల ప్రకారం సీఎల్పీ నేత ఎన్నిక జరుగుతుందన్నారు. ప్రజాకూటమి కొనసాగింపుపై త్వరలో పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఎందుకు అంత ఎక్కువ మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచింది విశ్లేషించుకుంటామన్నారు. . -
అధికారం కోసం అర్రులు చాచే పార్టీ కాదు మాది!
-
‘ఈవీఎంలపై డౌట్స్.. కేటీఆర్‌కు లై డిటెక్టర్ టెస్ట్ చేయాలి’
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్పై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో జరిగిన తాజా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేతలు సంపత్ కుమార్, దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్‌లు గురువారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురైనట్టు ఆరోపించారు. కేటీఆర్‌కు లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈవీఎం ట్యాంపరింగ్‌పై సీబీఐ విచారణ జరపాలని కోరారు. పొంతన లేని ఫలితాలు వచ్చాయి ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ.. పోలింగ్ సరళిని దగ్గరుండి గమనించినట్టు తెలిపారు. ప్రచారం అప్పటికీ.. పోలింగ్ డే రోజుకి ఏ మాత్రం పొంతన లేని ఫలితాలు వచ్చాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితలు కలిసి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసినట్టు అనుమానం ఉందన్నారు. 2009 ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉన్నట్టు కేసీఆర్ అప్పట్లో చెప్పినట్టు తెలిపారు. కేసీఆర్, కేటీఆర్, కవిత వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్లతో పాటు ఫోన్ నంబర్లపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ జరిపితే అందుకు కావాల్సిన ఆధారాలు తానే ఇస్తానని అన్నారు. కేటీఆర్ లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్దమైతే వాస్తవాలను నిరూపిస్తానని తెలిపారు. 2014లో తాము ఓడిపోయినప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయలేదని గుర్తుచేశారు. ఎగ్ న్యాక్ కంపెనీకి తెలంగాణ ప్రజల ఓట్లను పంపించి ట్యాప్ చేశారని ఆరోపించారు. రజత్ కుమార్‌కు లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు పునాది లాంటివని అన్నారు. రాజ్యంగ బద్దమైన ఎన్నికలకు టీఆర్ఎస్ తూట్లు పొడించదని విమర్శించారు. ఎన్నికల కమిషన్ పాలక వర్గానికి పాలేరులా మారిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓటర్ల జాబితాలో ఎటువంటి తప్పు జరగలేదని సుప్రీం కోర్టు, హైకోర్టులలో చెప్పిన తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్.. 22 లక్షల ఓట్లను తీసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రజత్ కుమార్‌కు లై డిటెక్టర్ టెస్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వారికి కావాల్సిన వారిని గెలిపించుకుని మిగతా వారిని ఓడించారని ఆరోపించారు. ఈవీఎంలు మోరాయించిన అధికారులు పట్టించుకోలేదని అన్నారు. కౌటింగ్ ఫామ్‌లో ఓ లెక్క.. చివరగా తమకిచ్చిన పేపర్లలో వేరే లెక్కలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన చోట జామర్లు పెట్టమంటే ఎన్నికల అధికారులు నిరాకరించారని తెలిపారు. తెలంగాణను అసెంబ్లీగా చేసుకుని పోరాడుతాం అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. ప్రజా క్షేత్రంలో ఫెయిల్ అయ్యామని కాంగ్రెస్ కాళ్లు పట్టుకుంటే తామే టీఆర్ఎస్కు అధికారం ఇచ్చే వాళ్లమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోల్ అయిన ఓట్ల కంటే 1056 ఓట్లు ఎక్కువ ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ చిన్న తమ్ముడని.. ఆయన పేరు కేడీఆర్ అని విమర్శించారు. 19 ఈవీఎంలను రీ కౌంటింగ్ పెట్టాలని కోరిన ఎన్నికల అధికారులు వినలేదని తెలిపారు. ప్రజలు మా వైపు ఉన్నారని.. ఈవీఎంలు టీఆర్ఎస్ వైపు ఉన్నాయని వ్యాఖ్యానించారు. భారతదేశంలోనే అతి ఖరీదయిన ట్యాంపరింగ్ తెలంగాణ ఎన్నికల్లో జరిగిందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం అని పేర్కొన్నారు. తెలంగాణను అసెంబ్లీలాగా చేసుకుని తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. -
ఏం చేద్దాం: ఓటమిపై బీజేపీ అంతర్మథనం
సాక్షి, న్యూఢిల్లీ: తాజాగా ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగలడంతో.. ఆ పార్టీ అధినాయకత్వంలో అంతర్మథనం మొదలైంది. తాజా పరాభవాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్రాల పధాధికారుల సమావేశం ఢిల్లీలో గురువారం ప్రారంభమైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, లక్ష్మణ్‌తోపాటు మురళీధర్‌రావు, ఇతర రాష్ట్రాల సీనియర్ నాయకులు పాల్గొన్నారు. తాజాగా నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణాలు విశ్లేషించడం, పార్టీ నాయకత్వంలో, శ్రేణుల్లో మళ్లీ నైతిక ఉత్తేజాన్ని నింపి రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం సిద్ధం చేయడం లక్ష్యంగా అమిత్ షా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి: స్పందించిన యోగి!
పట్నా: తాజాగా వెలువడిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. అత్యంత కీలకమైన హిందీ మాట్లాడే రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీని ఓడించి.. కాంగ్రెస్ పార్టీ అధికార పీఠాన్ని సొంతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ విజయాలపై తాజాగా బీజేపీ స్టార్ క్యాంపెయినర్, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో గెలించిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ అబద్ధాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని, దీంతో బీజేపీ భవిష్యత్తు ఎన్నికల్లో లాభపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ సహా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో యోగి విస్తృతంగా పర్యటించి.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయినా, ఆయన ప్రచారం పార్టీకి పెద్దగా లాభించలేదు. ఈ నేపథ్యంలో బుధవారం నేపాల్‌కు వెళ్లి.. జానకీ ఆలయంలో ‘వివాహ పంచమి’ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. తిరుగుప్రమాణంలో పట్నాలో ఆగారు. ఈ సందర్భంగా బిహార్ సీఎం నితీశ్‌కుమార్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్ సమరంగా భావిస్తున్న 4 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆయన తేలిక చేసి మాట్లాడారు. -
ఏపీ రాజకీయాల్లోకి కచ్చితంగా వెళ్తా..
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి కచ్చితంగా వెళ్తానని తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అధినేత కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. అక్కడికి రావాలని చాలా మంది ఆహ్వానిస్తున్నారని ఆయన వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేసీఆర్ బుధవారం టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. అనంతరం ఆయన తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించారు. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురించి ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై చంద్రబాబు రెండునాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై చంద్రబాబు వైఖరి భిన్నంగా ఉంది. హోదాతో వచ్చేది లేదు సచ్చేది లేదని చంద్రబాబు గతంలో అన్నారు. ఇప్పుడు ఆయనే హోదా కోసం ఉద్యమాలు చేస్తున్నారు. ఈ విషయంలో ఆయనకే స్పష్టత లేదు. ఇక నేనేం చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి కచ్చితంగా వెళ్తా. అక్కడికి రావాలని చాలా మంది ఆహ్వానిస్తున్నారు’’ అని పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసు విచారణ కొనసాగుతోందని ఆయనీ సందర్భంగా చెప్పారు. మేనిఫెస్టో 100% అమలు చేశాం.. ‘నాలుగున్నరేళ్లలో మేనిఫెస్టోను 100% అమలు చేసిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని కేసీఆర్ తెలిపారు. తమ పనితీరు, సంక్షేమ కార్యక్రమాలను చూసే ప్రజలు తమకు 88 స్థానాల్లో విజయం కట్టబెట్టారన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీనీ అమలు చేస్తామన్నారు. హామీ ఇచ్చినట్లుగా మరో రెండు జిల్లాల్ని ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆదాయం బాగానే ఉందని.. అందువల్ల వీలైనంత త్వరగా రూ.2.3 లక్షల కోట్ల అప్పు తీర్చేస్తామని ధీమా వెలిబుచ్చారు. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన సంక్షేమపథకాలు, అభివృద్ధి ద్వారా దేశవ్యాప్తంగా తెలంగాణ పతార(పరపతి) పెరిగిందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 10 లక్షలమందికి నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారు. ప్రధాని మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం మంచిదేనని.. అయితే ఈ కార్యక్రమం అమలును మధ్యలోనే ఆపేయడం వల్ల అసలు లక్ష్యం నెరవేరలేదన్నారు. ‘‘అధికారంలో ఉన్నప్పుడు ఎవరేం చేశారో అందరికీ తెలుసు. కుంభకోణాలు చేసినోళ్లను, దొంగలను ఎప్పుడైనా బయటకి తీసుకురావచ్చు అని ఊరుకున్నా. వాటిని బయటికి తీస్తే.. సంక్షేమాన్ని పక్కన పెట్టి ఇదేం పద్ధతి అంటరని ఊరుకున్నా. ఈ నాలుగున్నరేళ్లలో ఎవరినీ ముట్టుకోలేదు. ఈసారి మాత్రం వదలిపెట్టే ప్రసక్తే లేదు. కుక్కలు మొరిగినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం. కచ్చితంగా చికిత్స చేస్తాం. ఓటుకు నోటు కేసు విచారణ కొనసాగుతోంది’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. -
గవర్నర్‌కు ఎమ్మెల్యేల జాబితా
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నిక ల్లో విజయం సాధించిన అభ్యర్థుల జాబితాను బుధవారం ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు సమర్పించారు. అనంతరం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను ముగిస్తున్నామని, రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు సైతం ముగిసిందన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు 30 రోజుల్లోగా ఎన్నికల వ్యయాన్ని సమర్పించాల్సి ఉంటుందన్నారు. లక్షల ఓట్ల గల్లంతు అవాస్తవం.. ఓటర్ల జాబితాలో 24 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారం లో అవాస్తవమని సీఈఓ అన్నారు. అంత మొత్తంలో ఓట్లు గల్లంతు జరిగితే ఓట్లు కోల్పోయిన వ్యక్తులు, రాజకీయ పార్టీలు ఒప్పుకునేవారు కాదని, ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్య తలత్తేదన్నారు. ప్రతిసారి ఎన్నికల్లో కొన్ని ఓట్లు గల్లంతు కావడం సహజమేనన్నారు. కొత్త ఓటర్ల నమోదుతో పాటు చనిపోయిన, చిరునామా మారిన ఓటర్ల తొలగింపు కోసం ప్రతి ఏటా ఓటర్ల జాబితా సవరణ నిర్వహిస్తామన్నారు. ఈ నేపథ్యంలో ఏటా ప్రతి ఒక్కరూ తమ పేరు జాబితాలో ఉందో లేదో చూసుకోవాలన్నారు. 2015 లో ప్రచురించిన ఓటర్ల జాబితాలో 2.81 కోట్ల ఓటర్లు ఉండగా, ఆ తర్వాత నిర్వహించిన జాతీయ ఓటర్ల జాబితా ప్యూరిఫికేషన్ కార్యక్రమంలో భాగంగా చనిపోయిన, చిరునామా మారిన 24 లక్షల ఓట్లను తొలగించామన్నారు. 2018లో మూడుసార్లు ఓటర్ల జాబితా సవరణ నిర్వహించగా, 20 లక్షలకు పైగా కొత్త ఓటర్లను నమోదు చేశామన్నారు. ఓటర్ల తొలగింపునకు ముందు 7 రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని కోరుతూ ప్రతి ఓటరుకు స్థానిక బీఎల్ఓలు నోటీసులు జారీ చేశారన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2019లో భాగంగా ఓటర్ల నమోదు కోసం డిసెంబర్ 24 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, 2018, డిసెంబర్ 31 నాటి కి 18 ఏళ్లు నిండే వ్యక్తులతో పాటు ఓటర్ల జాబితాలో పేరు లేని వ్యక్తులూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. మానవ తప్పిదాలతోనే ఈవీఎం సమస్యలు ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే ఓటమిపాలయ్యామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ చేసిన ఆరోపణలను సీఈవో తోసిపుచ్చారు. ఈవీఎంలను ట్యాంపర్ చేసేందుకు ఆస్కారం లేదన్నారు. పటిష్ట పోలీసు బందోబస్తు, సీసీటీవీ కెమెరాల నిఘా మధ్య ఈవీంలను భద్రపరిచామన్నారు. 100 శాతం వీవీప్యాట్ ఓట్లను లెక్కిం చాలన్న కాంగ్రెస్ విజ్ఞప్తి ఆచరణలో సాధ్యం కాదన్నా రు. మానవ తప్పిదాలతో కౌంటింగ్ సమయంలో ఈవీఎంలతో రెండు రకాల సమస్యలు తలెత్తాయన్నారు. రాష్ట్రంలోని 92 పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్‌లో వేసిన ఓట్లను తొలగించకుండానే పోలిం గ్ను ప్రారంభించడంతో మాక్ పోలింగ్, అసలు పోలింగ్ ఓట్లు కలిసిపోయాయన్నారు. మాక్ పోలింగ్ తర్వాత సీఆర్సీ (క్లియర్ రిపోర్ట్ క్లోజ్) మీటను ప్రిసైడింగ్ అధికారులు నొక్కడం మరిచిపోవడంతో ఈ సమస్య తలెత్తిందన్నారు. వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడం ద్వారా ఈ పోలింగ్ కేంద్రాల ఓట్లను పరి గణనలోకి తీసుకున్నామన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత ‘పోల్ ఎండ్’ మీట నొక్కకపోవడంతో రెండు పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను కౌంటింగ్ రోజు తెరుచుకోలేదన్నారు. స్థానిక అభ్యర్థులు, ఎన్నికల పరిశీలకుల సమక్షంలో ‘పోల్ ఎండ్’ మీటను నొక్కిన తర్వాత ఈ ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కిం చామని, ఆ తర్వాత ఆ ఓట్ల సంఖ్యను వీవీ ప్యాట్ ఓట్ల సంఖ్యతో సరి చూసుకున్నామన్నారు. ఈ రెండు సందర్భాలోనూ వాస్తవంగా పోలైన ఓట్లతో వీవీ ప్యాట్ ఓట్ల సంఖ్యతో సరిపోయాయన్నారు. ఫలితాలపై గెజిట్ నోటిఫికేషన్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 88 టీఆర్ఎస్, 19 కాం గ్రెస్, 7 ఎంఐఎం, 2 టీడీపీ, చెరొక బీజేపీ, ఫార్వర్డ్ బ్లాక్ సభ్యులతో పాటు ఓ స్వతంత్ర అభ్యర్థి పేర్లతో జాబితాను ఇందులో పొందుపరిచింది. -
రాష్ట్ర నాయకత్వానిదే బాధ్యత: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌పార్టీ ఓటమికి ఏఐసీసీని తప్పుపట్టాల్సిన పనిలేదని, ఈ ఓటమికి రాష్ట్ర నాయకత్వమే నైతిక బాధ్యత వహించాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీకి గుండెకాయలాంటి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. సంస్థాగతంగా బలంగా ఉన్న తెలంగాణలో ఓటమి పాలవ్వడం దురదృష్టకరమన్నా రు. బుధవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ ఇచ్చినప్పటికీ 2014లో ప్రచారం చేసుకోలేక ఓడిపోయామని, ఇప్పుడు ఏం మాయ జరిగిందో కానీ ప్రజాకూటమి ఓటమి పాలైందని పేర్కొన్నారు. తప్పు ఎక్కడ జరిగిందో రాష్ట్ర నాయకత్వం గుర్తించాలని, సెంటిమెంట్ మీద ఏర్పడ్డ రాష్ట్రం లోని రాజకీయ పరిస్థితిని అంచనా వేయడంలో మరింత జాగరూకతతో వ్యవహరించాలన్నారు. రెండోసారి సీఎంగా బాధ్యతలు తీసుకుంటున్న కేసీఆర్‌కు ఆయన అభినందనలు తెలిపారు. -
ఏం గిఫ్టిస్తారో..!
సాక్షి, అమరావతి: ‘నాకేదో గిఫ్ట్ ఇస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎక్కడికైనా వచ్చి ప్రచారం చేసుకోవచ్చు. టీడీపీ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ. తెలుగువారు ఎక్కడున్నా వెళ్లి పనిచేశా. ప్రజల కోసం పనిచేస్తున్న నాపై విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ఏం గిఫ్ట్ ఇస్తారో చూస్తా...!’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేసీఆర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తెలంగాణకు వచ్చి చంద్రబాబు ఇచ్చిన గిఫ్ట్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. గురువారం ఒంగోలులో నిర్వహించిన జ్ఞానభేరి సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ కేసీఆర్ వ్యాఖ్యలపై ప్రతిస్పందించారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమి ఘోర పరాజయంపై చంద్రబాబు బయటకు వచ్చి చేసిన ప్రకటన ఇదొక్కటే కావడం గమనార్హం. కూటమి దారుణంగా ఓడిపోయినా చంద్రబాబు మౌనముద్ర దాల్చారు. అనుకూలమైతే హడావుడి... లేదంటే పచ్చమీడియాకు లీకులిచ్చి గప్‌చుప్ తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమి ఓటమి పాలు కావడంపై తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మౌనం దాల్చడం రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను ప్రచారం చేయకపోయినా, కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపు ఇవ్వకపోయినా వారి విజయాన్ని తనకు ఆపాదించుకొని చంద్రబాబు ప్రచారం చేసుకోవడంపై అంతా విస్తుపోవడం తెలిసిందే. వారి విజయానికి చంద్రబాబే కారణమంటూ మంత్రులు, టీడీపీ నేతలు ప్రకటనలు గుప్పించిన విషయాన్ని కూడా ఎవరూ మర్చిపోలేదు. కానీ... తెలంగాణలో కాంగ్రెస్ అధినేతతో కలిసి బహిరంగ సభల్లో పాల్గొన్నా... హైదరాబాద్‌లో వ్యక్తిగతంగా రోడ్డు షోలు నిర్వహించినా... కూటమి అభ్యర్థులకు పెద్ద ఎత్తున ‘నగదు’ సమకూర్చినా... ఘోరంగా ఓటమి చెందడంపై చంద్రబాబు నోరు విప్పకపోవడం పట్ల టీడీపీ శ్రేణుల్లో అంతర్మధనం మొదలైంది. రాజకీయాల్లో అత్యంత సీనియర్ అని చెప్పుకొనే చంద్రబాబు హుందాగా ఓటమిని ఒప్పుకొని ఓటర్ల మనోగతాన్ని ఆహ్వానించకపోవడంపై నాయకుల్లో చర్చ జరుగుతోంది. బాబును తిరస్కరించిన తెలంగాణ ప్రజలు చంద్రబాబు తాను స్వయంగా ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ ఎన్నికల విషయాన్ని విస్మరించి ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపుపై ప్రకటనలు చేయడంపైనా విశ్లేషకుల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల్లో తాను మునిగి అధఃపాతాళానికి పడిపోవడమే కాకుండా ‘మహాకూటమి పార్టీలనూ చంద్రబాబు నిండా ముంచేశారు. కూటమికి రూ.వందల కోట్ల ఆర్థిక వనరులను సమకూర్చడంతోపాటు ఈ ఎన్నికల్లో వారం రోజులకు పైగా తెలంగాణాలోనే ఉండి, కూటమికి స్టార్ క్యాంపయినర్‌గా వ్యవహరించి చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. దాదాపు రూ.1,200 కోట్ల వరకు ఏపీ నుంచి తెచ్చిన మొత్తాన్ని తెలంగాణ ఎన్నికల్లో బాబు వెదజల్లారన్న ఆరోపణలున్నాయి. ప్రజాకూటమి గెలిస్తే అది చంద్రబాబు గెలుపే అన్నట్లుగా పచ్చమీడియా ప్రచారం చేసింది. లగడపాటిని రంగంలోకి దించి కూటమికి 75 స్థానాలు వస్తాయని, అదంతా కాంగ్రెస్ చంద్రబాబుతో కలవడం వల్లేనని దొంగ సర్వేలను తెరపైకి తెచ్చారు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టడమే కాకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న చంద్రబాబును, ఆయనతో జతకట్టిన కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు ఛీత్కరించారు. ఈ పరిణామాలన్నిటికీ కారణం తానే అయినా అదేదీ తనకు సంబంధం లేనట్లుగా చంద్రబాబు ఇపుడు వ్యూహాత్మకంగా మౌనం దాల్చారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ తాను ఎక్కడా ప్రచారం చేయని రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును తన ఖాతాలో వేసుకొనే ప్రయత్నం చేశారు. తెలంగాణలో ఓటమిపై ప్రజాతీర్పును తెలుగుదేశం పార్టీ గౌరవిస్తుందని ముక్తసరిగా పేర్కొన్నారు. కర్నాటకఎన్నికల్లో ఎంతో హడావుడి కర్నాటకలో ఇంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు కాంగ్రెస్ తరఫున కానీ ఇతర పార్టీల తరఫున కానీ ప్రచారం నిర్వహించలేదు. అక్కడి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌లు హోరాహోరీ పోరాటం చేశాయి. ఏ పార్టీకీ మెజార్టీ రాని పరిస్థితుల్లో బీజేపీ, జేడీఎస్‌లు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా పరిణామాలు ఉత్పన్నమయ్యాయి. చివరిలో కాంగ్రెస్ సీఎం పదవిని ఆఫర్ చేయడంతో జేడీఎస్ అటువైపు మొగ్గి ఆ పార్టీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే చంద్రబాబునాయుడు కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు తన వల్లనే అయిందని, తన పిలుపు వల్లనే బీజేపీని అక్కడి ప్రజలు ఓడించారని ప్రెస్మీట్లు పెట్టి చెప్పడమే కాకుండా పచ్చమీడియా ద్వారా ఊదరగొట్టించారు. తనకు సంబంధం లేని కర్నాటక ఎన్నికలపై తెగ హడావుడి చేసిన చంద్రబాబు తాను స్వయంగా ప్రచారంలో పాల్గొన్న తెలంగాణలో ఓటమిపై పార్టీలో విశ్లేషణ చేయించడం కానీ, ఎందుకు ఇలా అయిందనే అంశంపై కనీసం చర్చించడం కూడా చేయకపోవడంపై పార్టీ నేతలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు బేలచూపులు చూడడంపై పార్టీ నేతలు, కార్యకర్తల్లోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ శ్రేణుల్లో చర్చోపచర్చలు తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీలో ఏప్రిల్‌లో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపైనా తప్పకుండా ఉంటుందనే చర్చ టీడీపీ నేతలు, కార్యకర్తల్లో సాగుతోంది. ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా దెబ్బతింటుందనే అంతర్మథనం పార్టీ నేతల్లో కొనసాగుతోంది. చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభు త్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, తెలంగాణ ఎన్నికల్లో అదే అంశం ప్రతిబింబించిందని అంతర్గతంగా వారు అంగీకరి స్తున్నారు. తెలంగాణలో ప్రజాకూటమి ఓటమి చెందడంపై ఏపీలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలు పండగ చేసుకున్నంత పని చేశారని, పలుచోట్ల బహిరంగంగానే బాణసంచా పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారని గుర్తు చేస్తున్నారు. ఇది తెలుగుదేశంపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని, ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణ ఫలితమే పునరావృతం అవుతుందన్న అభిప్రాయాన్ని విశ్లేషకులతో పాటు టీడీపీలోని సీనియర్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. -
‘సైలెంట్ సపోర్ట్’ను గుర్తించలేకపోయాయి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్కు ప్రజల్లో ఉన్న ‘సైలెంట్ సపోర్ట్’ను విపక్షాలు సరిగ్గా గుర్తించలేకపోయాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అనేక అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలున్నా సంక్షేమ కార్యక్రమాలు టీఆర్ఎస్కు ఎన్నికల్లో విజయం సాధించడానికి దోహదపడ్డాయన్నారు. ఎన్నడూ లేనివిధంగా డబ్బు ఖర్చు చేయడం, మద్యం పంపిణీ తదితర అంశాలన్నీ కలిసి కేసీఆర్ గెలుపునకు కారణమయ్యాయని బుధవారం ఆయన ‘సాక్షి’కి చెప్పారు. పింఛన్లు, రైతుబంధు, గొర్రె ల పంపిణీ తదితర పథకాలు కాంగ్రెస్ అనుకూల ఓటింగ్‌కు గండికొట్టాయని అభిప్రాయపడ్డారు. కూటమి సీట్ల సర్దుబాటు ఆలస్యం కావడం, కూటమి విధానాలు, తదితర అంశాలపై ప్రచారానికి 10– 15 రోజుల సమయం లేకపోవడం కూటమి ఓటమి కారణాలుగా చెప్పారు. ఐదురాష్ట్రాల ఎన్నికల్లో ప్రధాని మోదీ హవా తగ్గిపోవడం స్పష్టంగా కనిపించిందన్నారు. ‘ఫలితాలను అంచనా వేయలేకపోయాం’ సాక్షి, న్యూఢిల్లీ: తెలం గాణ ఎన్నికల ఫలితాలను తాము అంచనా వేయలేకపోయామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయ ణ అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్కి తెలంగాణ సెంటిమెంట్, పలు సంక్షేమ పథకాలు లాభించడంతో కేసీఆర్ ఈ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించగలిగారన్నారు. అందుకే గతంకంటే టీఆర్ఎస్కు ఓట్లు, సీట్లు అధికంగా వచ్చాయన్నారు. కూటమి ఏర్పాటులో ఆలస్యం కావడం, కూటమి కుదిరినా పై స్థాయిలో నాయకులు కలసినట్టు కింది స్థాయిలో ప్రజలు కలవలేకపోయారన్నారు. కూటమిలో ఎక్కడ తప్పులు జరిగాయో పరిశీలించుకొని ముందుకెళ్తామన్నారు. -
ఎందుకీ పరిస్థితి... మారదా ఈ స్థితి
సాక్షి, హైదరాబాద్: ఎంతో ప్రయత్నం చేసినా అంత దారుణంగా దెబ్బతినడానికి గల కారణాలపై బీజేపీ ఆలోచనల్లో పడింది. హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లోనూ ఈసారి మరిన్ని స్థానాలను గెలుచుకోవాలని భావించినా ఫలితం అందుకు విరుద్ధంగా రావడంతో పార్టీ మొత్తం గందరగోళంలో పడింది. హైదరాబాద్‌లోని ఒక్క గోషామహల్ మినహా ఖైరతాబాద్, అంబర్పేట్, ముషీరాబాద్, ఉప్పల్ స్థానాలను కూడా దక్కించుకోలేని పరిస్థితికి గల కారణాలను పార్టీ వర్గాలు అన్వేషిస్తున్నాయి. స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు అనేక మంది ప్రచారం చేసినా కేవలం ఒకే ఒక్క స్థానానికి ఎందుకు పరిమితం కావాల్సి వచ్చిందో విశ్లేషిస్తున్నాయి. పార్టీ సంస్థాగతంగా బలోపేతం అయ్యేందుకు అనేక అవకాశాలు ఉన్నా.. వాటిని సద్వినియోగం చేసుకోకపోవడం, క్షేత్రస్థాయిలోకి వెళ్లకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారు అధ్యక్షుడిగా ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారన్న అపవాదు పార్టీ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. మరోవైపు పార్టీ అభ్యర్థుల ఖరారు ఆలస్యం కావడం, చివరి క్షణంలో టికెట్లు ఇచ్చినా ప్రచారానికి సమయం సరిపోలేదన్న వాదన వ్యక్తమవుతోంది. అయితే పార్టీ ముఖ్య నేతలు మాత్రం ఈ అంశాలను కొట్టిపారేస్తున్నారు. ఈ ఎన్నికలు కేవలం తెలంగాణ సెంటిమెంట్‌పైనే జరిగాయని, ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేయడం, కూటమిలో ఆయన పార్టీ ఉన్న కారణంగా ప్రజల్లో మళ్లీ చంద్రబాబు పెత్తనం ఏంటన్న అభిప్రాయం వచ్చిందని పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌సహా ముఖ్యనేతలంతా విశ్లేషిస్తున్నారు. ఎన్నికల్లో దారుణంగా ఓటమిపాలు కావడంతో బుధవారం పార్టీ ముఖ్యనేతలు పార్టీ కార్యాలయానికి వెళ్లకపోవడంతో కార్యాలయం బోసిపోయినట్లు అయింది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలకు నైతిక బాధ్యత వహించి పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ రాజీనామా చేస్తారన్న వదంతులు వచ్చాయి. అయితే వాటిని పార్టీ ముఖ్య నేత ఒకరు కొట్టిపారేశారు. అలాంటిదేమీ ఉండదన్నారు. స్థానాలను పెంచుకోకపోగా, ఉన్న స్థానాలను కాపాడుకోలేని పరిస్థితి వల్ల ఐసీయూలోకి వెళ్లినట్లు అయిందని, దానినుంచి బయటకు రావాలంటే కొంత సమయం పడుతుం దని ఓ నేత వ్యాఖ్యానించడం కొసమెరుపు. బీజేపీలో సంజయ్‌కి అత్యధిక ఓట్లు సాక్షి, హైదరాబాద్: బీజేపీ తరఫున ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు 14,50,456 (7 శాతం) మంది ప్రజలు ఓట్లు వేశారు. పార్టీ తరఫును 118 స్థానాల్లో పోటీ చేస్తే అందులో ఒక్క గోషామహల్లో 61,854 ఓట్లతో రాజాసింగ్ గెలుపొందారు. పార్టీ తరఫున పోటీ చేసిన వారిలో ఆయనకంటే ఎక్కువ ఓట్లు వచ్చినా, రెండో స్థానానికే పరిమితమయిన అభ్యర్థులు ఉన్నారు. ద్వితీయ స్థానంలో ఉండి అత్యధిక ఓట్లు లభించిన అభ్యర్థుల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసిన బండి సంజయ్ మొదటి వరుసలో ఉన్నారు. ఆయనకు 66,009 ఓట్లు రాగా, అంబర్పేట్ నుంచి పోటీ చేసిన కిషన్‌రెడ్డికి 60,542 ఓట్లు వచ్చాయి. కల్వకుర్తిలో తల్లోజు ఆచారికి 59,445 ఓట్లు, ఆదిలాబాద్‌లో పాయ ల్ శంకర్‌కు 47,444 ఓట్లు, ముథోల్‌లో రమాదేవికి 40,602 ఓట్లు, కార్వాన్లో అమర్‌సిం గ్‌కు 35,709 ఓట్లు, ఖైరతాబాద్‌లో చింతల రామచంద్రారెడ్డికి 34,666 ఓట్లు, మల్కాజిగి రిలో రాంచందర్‌రావుకు 22,932 ఓట్లు వచ్చా యి. ముషీరాబాద్‌లో పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కు 30,813 ఓట్లు వచ్చాయి. ఆదరించిన వారందరికీ ధన్యవాదాలు: కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: విపత్కర పరిస్థితుల్లో కూడా బీజేపీకి ఓటు వేసి ఆదరించిన రాష్ట్ర ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కొరకు నిరంతరం కృషి చేస్తూ.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో రెండుసార్లు ముషీరాబాద్ నుంచి గెలిపించి ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజాతీర్పును శిరసావహిస్తూ, ముషీరాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కృషి చేస్తానన్నారు. -
మొత్తం ఓటేసింది 2,05,80,470 మంది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మొత్తం 2,80,64,684 మంది ఓటర్లకు 2,05,80,470(73.2 %) మంది ఓటేశారు. అందులో 1,41,56,182 మంది మొత్తం పురుష ఓటర్లలో 1,03,17,064 (72.54%) మంది..1,39,05,811 మంది మొత్తం మహిళా ఓటర్లలో 1,02,63,214 (73.88%) మంది ఓటు హక్కును వినియోగిం చుకున్నారు. 2,691 మంది ఇతర ఓటర్లలో కేవలం 192(8.99%) మంది మాత్రమే ఓటేశారు. ఈమేరకు ఎన్నికల్లో పోలైన ఓట్ల గణాంకాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం బుధవారం విడుదల చేసింది. -
అవకాశం కోల్పోయాం...‘అధ్యక్షా’!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ చవిచూడని పరిస్థితి ఈ మారు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు చవిచూశాయి. గత 66 ఏళ్ల చరిత్రలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక్క సభ్యుడినైనా చట్టసభకు పంపుకోలేని దుస్థితిలో అవి పడ్డాయి.దీంతో తొలిసారిగా వామపక్షపార్టీల గళం వినిపించని కొత్త శాసనసభ ఏర్పడబోతోంది. 2014లో జరిగిన ఏపీ ఎన్నికల్లోనూ కమ్యూనిస్టుపార్టీలు ఖాతా తెరవకపోవడంతో ఇప్పుడు రెండు తెలుగురాష్ట్రాల శాసనసభల్లో ఈ పార్టీలకు ఉనికి లేకుండా పోయింది. పొత్తుల ఎత్తుల్లో ఏదోలా లబ్ధి... వామ పక్షాలు మారిన రాజకీయ ఎత్తుగడలకు అనుగుణంగా వివిధ పార్టీలతో పొత్తులు కుదుర్చుకొని ఎన్నికలకు దిగినప్పుడు కాస్తా లాభపడ్డాయి. ఒకసారి టీడీపీతో మరోసారి కాంగ్రెస్‌తో, ఇంకోమారు టీడీపీ, టీఆర్ఎస్లతో ఇలా రాష్ట్రంలో ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీతో ఉభయ కమ్యూనిస్టుపార్టీలు గతంలో పొత్తులు కుదుర్చుకున్నాయి. అందుకు భిన్నంగా ఈ సారి తెలంగాణలో సీపీఐ ఏకంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్‌లతో సీట్ల సర్దుబాటు చేసుకుంది. సీపీఎం మాత్రం విడిగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్‌తో కలిసి పోటీచేయడం ద్వారా రాష్ట్రంలో కొత్త ప్రయోగానికి తెరతీయాలని ప్రయత్నించింది. 1983 నుంచి మారిన పరిస్థితి... 1983 ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టుపార్టీలతో టీడీపీ సీట్ల సర్దుబాటు ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో 28చోట్ల పోటీచేసిన సీపీఎం ఐదుచోట్ల, 48 స్థానాల్లో పోటీచేసిన సీపీఐ నాలుగుస్థానాల్లో గెలిచాయి. 1985 మధ్యంతర ఎన్నికల్లో సీపీఐ,సీపీఎం, మరోవైపు జనతాపార్టీ, బీజేపీలతో టీడీపీ పొత్తు కుదుర్చుకుంది. ఈ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు చెరో 11 స్థానాలు దక్కించుకున్నాయి. 1989లో టీడీపీ పొత్తుతో సీపీఎం ఆరు, సీపీఐ ఐదు సీట్లలో గెలుపొందాయి. 1994లో టీడీపీతో పొత్తులో సీపీఐ 19, సీపీఎం 15 సీట్లు గెలిచాయి. 1999లో ఏ పార్టీతో పొత్తు లేకుండా పోటీచేసినపుడు సీపీఎంకు రెండుసీట్లు దక్కగా సీపీఐకి ఒక్కసీటుకూడా రాలేదు. మళ్లీ 2004లో కాంగ్రెస్‌తో పొత్తులో సీపీఎం 9, సీపీఐ 6 స్థానాల్లో గెలిచాయి. మళ్లీ 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు కుదుర్చుకున్నపుడు సీపీఐ 4 స్థానాలు, సీపీఎం ఒక సీటు గెలిచాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన ఎన్నికల్లో వామపక్షాలు చెరోస్థానానికే పరిమితమయ్యాయి. -
90కి చేరిన టీఆర్ఎస్ బలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకుంటి చందర్, వైరా ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్ బుధవారం కేటీఆర్‌ను కలిసి టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో కోరుకంటి చందర్ రామగుండంలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణపై గెలిచారు. 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సోమారపు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కోరుకుంటి చందర్‌పై గెలుపొందారు. అనంతరం సత్యనారాయణ టీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు కోరుకంటి చందర్ విషయంలోనూ ఇదే జరిగింది. వైరా నుంచి కాంగ్రెస్ టికెట్ దక్కపోవడంతో రాములు నాయక్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అసెంబ్లీ రద్దుకు ముందు టీఆర్ఎస్ పార్టీకి 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకోవడంతో ఎమ్మెల్యేల సంఖ్య 90కి చేరింది. కేసీఆర్ మా నాయకుడు: చందర్ ‘ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పీడీ యాక్టులతో ఇబ్బంది పెట్టిన వెనకడుగు వేయలేదు. నాటి నుంచి నేటి వరకు మా నాయకుడు కేసీఆరే.. నాకు రాజకీయ జన్మనిచ్చింది కేసీఆరే. నిరుద్యోగ వ్యవస్థను నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేస్తున్న కేటీఆర్‌ను కలిసి నా మద్దతు తెలిపా. టీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా’అని చందర్ అన్నారు. -
అసెంబ్లీకి 67 మంది నేరచరితులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీకి నూతనంగా ఎన్నికైన 119 మంది శాసనసభ్యుల్లో వివిధ పార్టీలకు చెందిన 67 మందిపై సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ తెలిపింది. ఈ మేరకు సంస్థ కన్వీనర్ పద్మనాభరెడ్డి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మొత్తంగా శాసనసభలో 56.3 శాతం మంది ఎమ్మెల్యేలపై వివిధ రకాల కేసులున్నాయని తెలిపారు. ఇందులో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన 88 మంది శాసనసభ్యుల్లో 44 మందిపై కేసులున్నట్లు చెప్పారు. ఇక బీజేపీ నుంచి ఎన్నికైన ఒకే ఒక్క ఎమ్మెల్యేపైనా పలు కేసులున్నట్లు తెలిపారు. కాంగ్రెస్, టీడీపీల నుంచి గెలిచిన 21 మంది శాసనసభ్యుల్లో 16 మందిపై కేసులున్నట్లు పేర్కొన్నారు. ఎంఐఎం పార్టీ తరఫున గెలిచిన 7 మంది సభ్యుల్లో ఆరుగురిపై కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, సంబంధిత పార్టీలు ప్రధాన పత్రికలు, టీవీ చానళ్లలో నామినేషన్ వేసినప్పటి నుంచి 3 సార్లు కేసుల గురించి ప్రచురించాలని, ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని తెలిపారు. అయితే కొద్దిమంది అభ్యర్థులు మినహా ఎవరూ ఈ తీర్పును అమలు చేయలేదన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి దృష్టికి తమ సంస్థ తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. -
టీజేఎస్‌లో ‘పంచాయతీ’
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఆలోచనల్లో పడింది. కొత్తగా ఏర్పాటు చేసుకున్న పార్టీని సొంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లకుండా ప్రజాకూటమి పేరుతో వెళ్లడం, పార్టీకి ఒక్కసీటు రాకపోగా, పోటీ చేసిన 8 స్థానాల్లోనూ డిపాజిట్ దక్కని పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలో రానున్న పంచాయతీ ఎన్నికల విషయంలో పార్టీ ఎలా ముందుకు సాగాలన్న ఆలోచనల్లో పడింది. పంచాయతీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయాలా? వద్దా? అన్న గందరగోళం నెలకొంది. సొంతంగా పోటీ చేస్తే ఎంతమేరకు నెగ్గుకురాగలుగుతాం, సంస్థాగతంగా పూర్తిస్థాయిలో బలోపేతం లేని పార్టీని ఎలా ప్రజల వద్దకు చేర్చాలన్న దానిపైనే ప్రధాన దృష్టి సారించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో పార్టీని నడపడం కంటే కాంగ్రెస్‌లో విలీనం చేస్తే సరిపోతుందన్న వాదనలను కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. రేపు పంచాయతీ ఎన్నికల్లోనూ బోర్లా పడితే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని పేర్కొంటున్నారు. అయితే పార్టీ ముఖ్య నేతలు కొందరు మాత్రం పంచాయతీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయడం ద్వారానే పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లవచ్చన్న భావనను వ్యక్తం చేస్తున్నారు. ప్రజాకూటమి పేరుతో కాంగ్రెస్‌తో కలిసినా సరిపోయేదని, అందులోకి టీడీపీ రావడం, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పరిస్థితుల కారణంగా ఎన్నికల్లో దారుణమైన దెబ్బ తినాల్సి వచ్చిందన్న భావనను పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు లేకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి మరోలా ఉండేదని పేర్కొంటున్నారు. పార్టీ పోటీ చేసిన 8 స్థానాల్లో కనీసం ఒక్క స్థానంలో అయినా తమకు ప్రజలు అనుకూలంగా తీర్పునిచ్చే అవకాశం ఉండేదన్న భావనను వ్యక్తం చేస్తున్నారు. కనీసం అసెంబ్లీలో ఒక్క సీటు అయినా ఉంటే అది టీజేఎస్‌కు ఎంతో బలంగా ఉండేదని, దాంతో పంచాయతీ ఎన్నికలకు వెళితే పార్టీ బలోపేతం అయ్యేదన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా టీజేఎస్ ఎలా ముందుకు సాగాలన్న భవిష్యత్తు కార్యాచరణపై మరో వారంలో స్పష్టత వస్తుందని ఆ వర్గాలు అంటున్నాయి. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే పార్టీ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాలని కోదండరాం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. -
‘లోక్‌సభా’ టీఆర్ఎస్దే!
సాక్షి, హైదరాబాద్: తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని బట్టి చూస్తే లోక్‌సభ ఎన్నికలలోనూ కారు జోరు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గానూ.. 14 స్థానాల పరిధిలో టీఆర్ఎస్కు స్పష్టమైన ఆధిక్యం లభించగా, ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ (కూటమి) స్వల్ప ముందంజలో ఉంది. ఇక, యథావిధిగా హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో 4.5 లక్షల పైచిలుకు ఓట్లతో మజ్లిస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అయితే, జాతీయ పార్టీగా బీజేపీ పరిస్థితిని ఈ ఎన్నికలు పాతాళంలోకి నెట్టాయి. ఈ ఫలితాలను బట్టి చూస్తే ఏ ఒక్క పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఆ పార్టీ కనీసం పోటీ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిం చడం లేదు. అయితే, జాతీయ అంశాల ఆధారంగా జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉంటుందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అద్భుతం జరిగితే తప్ప 14 చోట్ల టీఆర్ఎస్, 1–2 చోట్ల కాంగ్రెస్, 1 స్థానంలో మజ్లిస్ గెలుపు దిశగా పయనిస్తాయని అసెంబ్లీ ఫలితాలు చెబుతున్నాయి. రెండంటే రెండే! అసెంబ్లీ ఎన్నికలలో పేలవ ప్రదర్శన చూపిన కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి పోలయిన ఓట్లను పార్లమెంటు స్థానాల వారీగా పరిశీలిస్తే ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల్లో మాత్రమే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అది కూడా గుడ్డిలో మెల్ల అనే రీతిలో ఖమ్మంలో 38వేలు, మహబూబాబాద్‌లో 9వేల ఓట్లు మాత్రమే టీఆర్ఎస్ కన్నా ఎక్కువ పోలయ్యాయి. ఇక, కొంత మెరుగ్గా భువనగిరిలో 58 వేలు, పెద్దపల్లిలో 88వేలు, నల్లగొండ లోక్‌సభ పరిధిలో లక్ష ఓట్లు టీఆర్ఎస్ కన్నా వెనుకంజలో ఉంది. ఏ లెక్కన చూసినా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఐదు స్థానాల్లో తప్ప మిగిలిన చోట్ల ఎక్కడా కనీసం టీఆర్ఎస్కు పోటీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో కూడా టీఆర్ఎస్ మరింత మెరుగైన ప్రదర్శన కనపర్చింది. ఈ రెండు చోట్లా.. కాంగ్రెస్ కన్నా టీఆర్ఎస్కే ఎక్కువ ఓట్లే పోలయ్యాయి. పాపం.. బీజేపీ బీజేపీ విషయానికి వస్తే రాష్ట్రంలోని ఏ ఒక్క లోక్‌సభ స్థానం పరిధిలో ఆ పార్టీ కనీస పోటీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల కన్నా తక్కువగా కేవలం 1.72లక్షల ఓట్లు మాత్రమే ఆ పార్టీకి పోలయ్యాయి. మిగిలిన స్థానాల్లో పరిశీలిస్తే ఆదిలాబాద్, చేవెళ్ల, హైదరాబాద్, కరీంనగర్, మల్కాజ్గిరి స్థానాల్లో మాత్రమే లక్ష ఓట్ల కన్నా ఎక్కువ బీజేపీకి పోలయ్యాయి. ఇక, అత్యల్పంగా ఖమ్మం లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కలిపి బీజేపీకి 9,764 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. -
నేడు కేసీఆర్ ప్రమాణం...
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా గురువారం బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యాహ్నం 1.25 గంటలకు రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతానికి కేసీఆర్ ఒక్కరే ప్రమాణం చేయనుండగా.. జిల్లాలు, సామాజిక వర్గాల కూర్పు అనంతరం వారంలోపు పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరనుంది. రాజ్యాంగం ప్రకారం తెలంగాణలో సీఎంతోపాటు 17 మంది మంత్రులు ఉండాలి.. ఈ లెక్కల ప్రకారం.. సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం బుధవారం తెలంగాణభవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ శాసనసభపక్ష నేతగా కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ఎల్పీ నేతగా కేసీఆర్‌ను ఎన్నుకునే తీర్మానాన్ని ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత ప్రవేశపెట్టారు. ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ బలపరిచారు. అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరు చప్పట్లతో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. గవర్నర్‌కు అందజేత టీఆర్ఎస్ శానససభాపక్ష నేతగా కేసీఆర్ ఎన్నిక అనంతరం 11 మంది ఎమ్మెల్యేల బృందం రాజ్‌భవన్‌కు వెళ్లింది. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిసి ఎన్నికకు సంబందించిన పత్రాలను అందజేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా టీఆర్ఎస్ఎల్పీ నేతను ఆహ్వానించాలని కోరింది. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సి.లక్ష్మారెడ్డి, కొప్పుల ఈశ్వర్, పద్మా దేవేందర్‌రెడ్డి, గొంగడి సునీత, అజ్మీరా రేఖానాయక్, దాస్యం వినయభాస్కర్, వి.శ్రీనివాస్‌గౌడ్, రవీంద్రకుమార్, కాలె యాదయ్యలు గవర్నర్‌ను కలిశారు. అంతకుముందు కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ నర్సింహన్‌కు అందజేసింది. అన్నింటినీ పరిశీలించిన అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ నర్సింహన్ టీఆర్ఎల్పీనేత కేసీఆర్‌ను ఆహ్వానించారు. రాజీనామాలు ఆమోదం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాజీనామా చేస్తూ గవర్నర్ నరసింహన్‌కు లేఖ పంపారు. గవర్నర్ దీన్ని ఆమోదించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి.. రాష్ట్ర మంత్రివర్గ రాజీనామా ఆమోదాన్ని ధ్రువీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మంత్రులంతా మాజీలయ్యారు. అసంతృప్తులు లేకుండా! మంత్రివర్గంలో ఎక్కువ మంది కొత్తవారికి చోటు కల్పించాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గురువారం తనతోపాటు ఒక్కరినే మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. అదేరోజు పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ఉన్న వారిలో అవకాశం దక్కని వారు అసంతృప్తితో ఉంటారు. కొన్ని రోజుల తర్వాత అయితే ఇప్పటి వరకు మంత్రులుగా ఉన్న వారిలో ఎక్కువ మందిని పక్కనపెట్టే అవకాశం ఉంటుంది. మంత్రులుగా ఉంటూ ఎమ్మెల్యేగా పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు, అజ్మీరా చందులాల్, జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. వీరి స్థానంలో కొత్తగా నలుగురికి అవకాశం కల్పించాల్సి ఉంది. జిల్లాలు, సామాజికవర్గాల కూర్పుతో కొత్త జట్టును ఎంపిక చేసుకోనున్నారు. పరిశీలనలో దానం, వివేకా సామాజికవర్గాల వారీగా ఎర్రబెల్లి దయాకర్‌రావు, డీఎస్ రెడ్యానాయక్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌లకు చోటు కల్పించే అవకాశం ఉంది. వచ్చే మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రులు ఉంటారా లేదా అనేదానిపై స్పష్టతలేదు. అయితే.. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి స్థానంలో మాదిగ సామాజికవర్గానికి చెందిన అరూరి రమేశ్, మహమూద్ అలీ స్థానంలో మహ్మమ్మద్ ఫరీదుద్దీన్‌లు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. టి పద్మారావుగౌడ్ స్థానంలో కేపీ వివేకానంద్ గౌడ్, జోగు రామన్న స్థానంలో దానం నాగేందర్ లేదా దాస్యం వినయభాస్కర్ పేర్లను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలిస్తున్నారు. స్పీకర్ పదవిని ఎవరికి అప్పగించాలనే విషయంపై స్పష్టత వచ్చిన తర్వాతే మంత్రివర్గ కూర్పు తుదిదశకు రానుంది. -
దేశమంతా రైతుబంధు
సాక్షి, హైదరాబాద్: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చే దిశగా సాహసోపేతంగా ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. కొత్త ఫ్రంట్ అధికారంలోకి రాగానే.. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలుచేసి.. రైతుల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చేలా వ్యూహాలు రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన అనంతరం.. బుధవారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలోని రైతులు, పేదలు, మైనారిటీలు అన్ని వర్గాల వారి స్థితిగతులను మార్చే లక్ష్యంతోనే జాతీయ రాజకీయాల్లో కొత్త శక్తిని ప్రారంభించనున్నామని.. ఈ ప్రయత్నం కచ్చితంగా విజయవంతం అవుతుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం ఆదాయం బాగానే ఉందని.. అందువల్ల వీలైనంత త్వరగా రూ.2.3 లక్షల కోట్ల అప్పు తీర్చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పనులు కొనసాగుతున్న దుమ్ముగూడెం. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులతోపాటు.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కూడా త్వరలోనే పూర్తిచేసి సాగునీటిని అందుబాటులోకి తెస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమపథకాలు, అభివృద్ధి ద్వారా దేశవ్యాప్తంగా తెలంగాణ పతార (పరపతి) పెరిగిందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం చంద్రబాబు రెండునాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం మంచిదేనని.. అయితే ఈ కార్యక్రమం అమలును మధ్యలోనే ఆపేయడం వల్ల అసలు లక్ష్యం నెరవేరలేదన్నారు. ఈ సమావేశంలో కేసీఆర్ వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే.. గెలిస్తే.. దేశవ్యాప్తంగా రైతుబంధు ‘రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తోంది. రాష్ట్రాల పరిస్థితి దిగజారుతోంది. చిన్న చిన్న అంశాల్లోనూ కేంద్రానికిదే అధికారం. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖలు కేంద్రం వద్ద ఉండాల్సిన అవసరం లేదు. ఐఐటీ వంటి పరిశోధన సంస్థలు కేంద్రం పరిధిలో ఉంటే పర్వాలేదు. కేంద్రం వద్ద పరిధికి మంచిన అధికారాలు ఉన్నాయి. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ ఒకేతీరుగా వ్యవహరిస్తున్నాయి. ప్రధాని మోదీ సహకార సమాఖ్య అంటున్నారు. కానీ చేతల్లో మాత్రం వికేంద్రీకరణను మరింత కేంద్రీకృతం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాల ఫ్యూడల్ పద్ధతి నశించాలి. అప్పుడే దేశంలో గుణాత్మక మార్పు వస్తుంది. నాకు ధైర్యం ఉంది. నేను అలాంటి మార్పును తీసుకొస్తా. ఫెడరల్ ఫ్రంట్ కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రైతు బంధు పథకాన్ని అమలు చేస్తాం. దీని కోసం ఏటా మూడున్నర లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. నా దగ్గర అజెండా ఉంది. లెక్కలున్నాయి. రైతుల పరిస్థితి మారుస్తాం’ చెవ్స్ పండించలేకపోయా! ‘దేశంలో కొత్త ఆర్థిక, వ్యవసాయ విధానాలు రావాలి. పంటలను అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి లేదు. పురుగు మందులు అని, ఇంకోటని మెలికపెట్టి తిరస్కరిస్తారు. కట్ ఫ్లవర్ పంటలో ప్రపంచవ్యాప్తంగా 90% ఇజ్రాయిల్‌లోనే సాగు చేస్తున్నారు. చెవ్స్ పంట పండిద్దామనుకున్నా. అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకోలేమని తెలిసింది. దేశంలో అన్ని ఉన్నా రైతుల ఆత్మహత్యలు ఆగడంలేదు. రాహుల్‌గాంధీ ఏదో రాష్ట్రానికి వెళ్లి క్వింటాల్ ధాన్యానికి రూ.2500 అన్నారు. కనీస మద్దతు ధర దేశమంతా ఒకేలా ఉండాలి. లేకుంటే తక్కువ ధర రాష్ట్రంలోనే వ్యాపారులు ఎక్కువ కొంటారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అంటారు. రాష్ట్రానికో విధానం చెబుతారు. ఓట్లు ఉంటే ఒక రకంగా లేకుంటే మరో రకంగా మాట్లాడుతారు. సీపీఎస్‌పై ద్వంద్వ విధానం జాతీయ పార్టీలు పచ్చి రాజకీయ అవకాశవాదంతో వ్యవహరిస్తున్నాయి. ఉద్యోగుల సీపీఎస్ విధానం తెచ్చింది యూపీఏ ప్రభుత్వం. ఇక్కడ అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు వాళ్లే తీసేయాలి అని డిమాండ్ చేస్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సీపీఎస్‌ను రద్దు చేయదు. ఇక్కడ బీజేపీ వాళ్లు రద్దు చేయాలని అంటారు. జాతీయ పార్టీల వైఫల్యాలకు వ్యతిరేకంగా ఎవరో ఒకరు నడుంబిగించాలి. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తా. నేను ప్రాణానికి తెగించి ముందుకు సాగుతున్నా. కేంద్ర ప్రభుత్వాలవి చెత్త విధానాలు. యూపీఏ ప్రభుత్వం మోడల్ స్కూళ్లను తీసుకొచ్చింది. ఎన్డీయే ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసింది. అలా మధ్యలో వదిలేస్తే ఎలా? అందుకే వీటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సి వచ్చింది’ మేనిఫెస్టో 100% అమలుచేస్తాం ‘నాలుగున్నరేళ్లలో మేనిఫెస్టోను 100% అమలు చేసిన ఏకైక పార్టీ టీఆర్ఎస్. రైతుబంధు, రైతుబీమా పథకాలను మేం మేనిఫెస్టోలో పెట్టలేదు. రైతు బీమాతో ఎలాంటి పైరవీలు లేకుండానే పేద రైతులకు సాయం వస్తోంది. ప్రజల అవసరాన్ని బట్టి ఇలాంటి 76 అంశాలను అమలు చేస్తున్నాం. కంటి వెలుగు కార్యక్రమంలో కోటి మంది పరీక్షలు చేయించుకున్నారు. అమ్మ ఒడికి మంచి పేరు వచ్చింది. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు పెరుగుతున్నాయి. కాన్పుకు అయ్యే రూ.30 వేల ఖర్చు తప్పుతోంది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటున్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో బాల్య వివాహాలు లేకుండాపోయాయి. ఆర్థిక వ్యవస్థ పెరిగింది. సంక్షేమ పథకాలను అమలు చేశాం. ఎరువులకు రైతులు ఇబ్బందిపడే రోజులు పోయాయి. గోదాములు లేక ఈ సమస్య అని గుర్తించాం. నాలుగు లక్షల టన్నుల సామర్థ్యం నుంచి 25 లక్షల టన్నుల సామర్థ్యం పెంచాం. అన్ని రంగాలలో నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నాం. మా పనితీరు, సంక్షేమ కార్యక్రమాలను చూసే ప్రజలు మాకు 88 స్థానాల్లో విజయం కట్టబెట్టారు. ఉద్యమ పార్టీగా గత ఎన్నికలలో ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సరిగా చేసి చూపినం. ప్రజలు అన్ని చూసి తీర్పు ఇచ్చారు’ టీఎస్పీఎస్సీతో మైనస్ ‘మాకన్నా ముందు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాయి? విపక్షాలు పచ్చి అబద్దాలు చెప్పి యువతను పక్కదోవ పట్టిస్తున్నాయి. అనవసరంగా నిరుద్యోగులను రెచ్చగొట్టొద్దు. ఇంటికో ఉద్యోగం అని ఎప్పుడూ చెప్పలేదు. నిరుద్యోగులను రెచ్చగొంటేందుకు కొందరు డ్రామాలు చేశారు. ఏటా లక్ష ఉద్యోగాల భర్తీ అంటే ఎలా? టీడీపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న 60 ఏళ్లు ఇలాగే చేసుంటే.. 60 లక్షల ఉద్యోగాలు అయ్యేవి. ఇదో ఎన్నికల నినాదంగా మారింది. ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అధికారం చేపట్టిన పార్టీలే అధికారం పోయాక ధర్నాలు చేస్తాయి. మేం అలా కాదు. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులను 100% భర్తీ చేస్తాం. ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు విస్తృతమయ్యేలా కృషి చేస్తాం. టీఎస్పీఎస్సీ మాకు మైనస్ అయ్యింది. పనికిమాలిన పనులు ముందు పెట్టుకుని ఉద్యోగాల భర్తీలో జాప్యం చేసింది. అందుకే చివరికి కొన్ని పోస్టులను తీసి ఆయా శాఖలే భర్తీ చేసుకునేలా నిర్ణయాలు తీసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రభుత్వ ఉద్యోగాల కల్పన ఒక శాతం కంటే తక్కువే ఉంటుంది. ప్రైవేటులోనూ ఎక్కువ ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం’ 33 జిల్లాలు చేస్తాం ‘టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని అమలు చేస్తాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్వీయ పన్నుల ఆదాయం వృద్ధిరేటు 29.90%గా ఉంది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ దీంట్లో సగం కూడా లేదు. అప్పులు ఎలా చెల్లించాలో మాకు తెలుసు. సాధారణంగా పెరిగేవి తప్ప ప్రత్యేకంగా పన్నులు పెంచం. వచ్చే నాలుగేళ్లలో రూ.10 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. రుణాల కింద రూ.2.30 లక్షల కోట్లు చెల్లిస్తాం. దీని వల్ల అదనంగా రూ.1.30 లక్షల కోట్ల రుణం పొందే అర్హత వస్తుంది. అన్నింటిపైనా అవగాహన ఉంది. సాగునీటి ప్రాజెక్టులకు రూ.70 వేల కోట్లు అవసరమవుతాయి. ఖమ్మం జిల్లాలో మాకు సీట్లు రాకపోయినా.. అక్కడ దుమ్ముగూడెం ప్రాజెక్టుతో వచ్చే జులైలో నీళ్ళు అందిస్తాం. 18 నెలల్లో కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. అప్పటికి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు 90%పూర్తవుతుంది. ప్రాజెక్టుల వద్దకు నేనే స్వయంగా వెళ్లి పరిశీలిస్తా. తెలంగాణ అన్ని రాంగాల్లో సాధిస్తున్న అభివృద్ధి, సుస్థిర ప్రభుత్వంతో రాష్ట్ర పతార (పరపతి)పెరిగింది. రూ.15 వేల కోట్లను అప్పుగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్ఈసీ చైర్మన్ ఫోన్ చేశారు. తాజా తీర్పుతో ప్రజలు ఈ పతారను మరింత పెంచారు. ఎన్నికలలో హామీ ఇచ్చినట్లుగా మరో రెండు జిల్లాలను ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33కు పెరుగుతుంది’ క్రమంగా అధికారాల బదిలీ ‘స్థానిక సంస్థలను బలోపేతం చేసి క్రమంగా అధికారాలను వికేంద్రీకరిస్తాం. గత ప్రభుత్వాలు ఈ సంస్థల అధికారాలను ఒకొక్కటిగా వెనక్కి తీసుకున్నాయి. పంచాయతీ సమితి పరిధిలోనే అన్ని జరిగేవి. ప్రాథమిక పాఠశాలలో టీచర్లను, ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బందిని నియమించే అధికారాలు బీడీవోలకు ఉండేవి. బీడీవోలను తొలగించారు. అన్ని ఆధికారాలను తీసుకున్నారు. ఇప్పుడు ఆర్థిక సంఘం నిధులు వస్తేనే జిల్లా పరిషత్‌లకు పనులు. వాటి పరిస్థితి దయనీయంగా ఉంది. నిర్మాణాత్మక మార్పులు రావాలి’ 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నిరుద్యోగభృతిని చెల్లిస్తాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి దశలో ఉంది. ఈలోపు వరుసగా పంచాయతీ, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి. మధ్యలో అమలు చేయడం వీలు కాదు. నిరుద్యోగుల భృతి అర్హతలపై నియమావళి రూపకల్పన కోసం కమిటీని నియమిస్తాం. కమిటీ ప్రతిపాదనల ప్రకారం పథకాన్ని అమలు చేస్తాం. మా అంచనా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి నిరుద్యోగభృతి చెల్లింపు జరుగుతుంది’ వదిలిపెట్టే ప్రసక్తే లేదు ‘అధికారంలో ఉన్నప్పుడు ఎవరేం చేశారో అందరికీ తెలుసు. కుంభకోణాలు చేసినోళ్లను, దొంగలను ఎప్పుడైనా బయటకి తీసుకురావచ్చు అని ఊరుకున్నా. వాటిని బయటికి తీస్తే.. సంక్షేమాన్ని పక్కన పెట్టి ఇదేం పద్ధతి అంటరని ఊరుకున్నా. ఈ నాలుగున్నరేళ్లలో ఎవరినీ ముట్టుకోలేదు. ఈసారి మాత్రం వదలిపెట్టే ప్రసక్తే లేదు. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదు. కుక్కలు మొరిగినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం. కచ్చితంగా చికిత్స చేస్తాం. ఓటుకు నోటు కేసు విచారణ కొనసాగుతోంది’ కోఠి చౌరాస్తాలో అమ్ముతరు ‘ప్రభుత్వాధినేత గట్టిగా ఉండాలి. మన ప్రజాస్వామిక వ్యవస్థ అలాగే ఉంది. అక్కడ ప్రధానమంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి ప్రత్యేకమే. నేను కొంచెం ఎక్కువ కట్టిక ఉంటా. అట్ల లేకపోతే.. సర్కారు కాదు సర్కస్ అయితది. గట్టిగా ఉండకపోతే నన్ను కోఠి చౌరస్తాలో రూపాయి పావలకు అమ్ముతరు. నేను గట్టిగ ఉండడం వల్లనే.. మా పాలనలో అవినీతికి తావులేదు. నేనెవర్నీ కలవడం లేదనేది సరికాదు. రాజ్‌దీప్ సర్దేశాయ్, ప్రణయ్‌రాయ్ వంటి మీడియా ఎడిటర్లు ఫోన్లు చేసి కలుస్తామని అడుగుతారు. వారిని పిలిచి ఊరికే ముచ్చట చెప్పి పంపేంత సమయం నాకు లేదని చెప్పా. ప్రజల కోసం ఏం చేయాలనే దానికే ప్రాధాన్యత ఇస్తా. కంటివెలుగు వంటి పథకాలు అమలు చేస్తుంటే ప్రతికూల మీడియాకు అవేవి కనిపించవు. సమాచార శాఖ నా దగ్గరే ఉంటది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు తప్పకుండా ఇస్తాం. రిటైర్డ్ జర్నలిస్టులకు పింఛను విధానంపై అధ్యయనం చేయిస్తాం. కమిటీ ప్రతిపాదనల ప్రకారం నిర్ణయం తీసుకుంటాం’ 106 సీట్లు వస్తాయనుకున్నా! అసెంబ్లీ ఎన్నికలలో తాను ఆశించిన ఫలితాలు రాలేదని కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం ఎమ్మెల్యేలతో భోజనం చేస్తూ ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘అసెంబ్లీ ఎన్నికలలో 96 నుంచి 106 సీట్లు వస్తాయని అనుకున్నా. ఆశించిన ఫలితాలు రాలేదు. కాంగ్రెస్ నుంచి గెలిచిన వారు టీఆర్ఎస్లోకి వస్తామని ఫోన్లు చేస్తున్నారు. ఓడిపోయిన మంత్రులను కేబినెట్లోకి తీసుకుంటే విమర్శలొస్తాయి. మంత్రివర్గంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉంటుంది.’అని ఆయన వెల్లడించారు. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీని కుటుంబంతో వెళ్లి కలిశా. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనంపై చర్చించాం. దిగ్విజయ్‌సింగ్‌తో ఆ విషయం మాట్లాడాలని సోనియా అన్నారు. ఆ తర్వాత దిగ్విజయ్‌సింగ్‌ను కలిశా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం మీకిస్తే ఎలా అని ఆయన అన్నారు. ఆ తర్వాత ఈ విషయంపై కనీసం మాట్లాడలేదు. వెంటనే హైదరాబాద్‌కు వచ్చి పార్టీ నేతలతో చర్చించాం. ఏదైనా సరే ఒంటరిగా పోటీ చేద్దామని అందరు అన్నారు. అదే నిర్ణయించుకున్నాం. మొండిగా ఎన్నికల్లో పోరాడాం. ప్రజలకు మాకు అధికారం ఇచ్చారు. వారు ఇచ్చిన బాధ్యతను నిర్వహిస్తున్న తీరుపై సంతృప్తితో మళ్లీ గెలిపించారు’కేసీఆర్ అన్నారు. -
నెక్ట్స్ ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఘోర పరాభవం తర్వాత ఏం చేద్దామన్న దానిపై రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు తర్జనభర్జనలు పడుతున్నారు. ఈ ఎన్నికల్లో 19 స్థానాలకే పరిమితం కావడం, హేమాహేమీలంతా ఓటమిపాలు కావడంతో రానున్న ఐదేళ్ల పాటు పార్టీని కాపాడుకోవడం క్లిష్టతరంగా భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి అడుగులు వేయాలన్న దానిపై పార్టీలో చర్చోపచర్చలు జరుపుతున్నారు. ఎన్నికల్లో పరాజయం అనంతరం టీపీసీసీ ముఖ్యనేతలు ఎవరూ మీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడట్లేదు. ఇప్పటి పరిస్థితుల్లో కొన్నాళ్లు మౌనంగా ఉండటమే మేలని, ఆ తర్వాతే ప్రజాసంక్షేమం, ప్రభుత్వ పనితీరుపై దృష్టి పెట్టాలని యోచిస్తున్నారు. రాజకీయంగా ఒంటరిగానే ఉండాలని, ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం కన్నా కాంగ్రెస్ పార్టీగానే ప్రజల్లోకి వెళ్లాలని, ముఖ్యంగా టీడీపీతో ఈ ఎన్నికలతోనే సెలవు తీసుకోవాలనే వాదన కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. త్వరలోనే పంచాయతీ ఎన్నికలున్న నేపథ్యంలో రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి.. పంచాయతీ ఎన్నికల్లో బలమైన అధికార పక్షాన్ని ఎలా ఢీకొట్టాలన్న దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. బాబు దోస్తీనే పుట్టి ముంచింది అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పెట్టుకున్న పొత్తు వికటించిందని, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రవేశంతో తమకు అనుకూలంగా ఉన్న వాతావరణం టీఆర్ఎస్ పార్టీ వైపు మళ్లిందనే అభిప్రాయం మెజారిటీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై విశ్లేషణ జరుపుతున్న ప్రతి నాయకుడూ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ రీతిలో జరగాల్సిన ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు అనే స్థితికి వెళ్లాయని, ఇదే తీవ్ర నష్టాన్ని కలగజేసిందని అంటున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నా చంద్రబాబు విపరీత జోక్యాన్ని నివారించి ఉండాల్సిందని, టీజేఎస్ అధినేత కోదండరాంను ముందుపెట్టి ఎన్నికలకు వెళ్లి ఉంటే మరో రకమైన ఫలితాలొచ్చేవని, అసలు టీడీపీనే పక్కనపెట్టి టీజేఎస్, సీపీఐలతో ముందుకు వెళితే మెరుగైన ఫలితాలు వచ్చేవనే చర్చ జరుగుతోంది. ఇంకా నష్టం జరగకుండా ఉండాలంటే టీడీపీతో సెలవు తీసుకోవడమే మేలని మెజారిటీ నేతలు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే జరగనున్న రాష్ట్ర పంచాయతీ ఎన్నికల నుంచే ఇది ప్రారంభం కావాలని, ఈ విషయంలో అధిష్టానం అడిగినా ఒప్పుకోకూడదని, టీడీపీ మైత్రిలేని కాంగ్రెస్‌కే తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని అధిష్టానం వద్ద గట్టిగా చెప్పాలని భావిస్తున్నారు. ఎన్నికలు అయిన వెంటనే మిత్రపక్షాలను దూరం చేసుకోవడం మంచిది కాదని, అవసరం, సమయాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించడం కొసమెరుపు. -
మొక్కులు తీర్చుకున్న సీఎం సతీమణి
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ దేవుడి మొక్కులు తీర్చుకున్నారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని శ్రీనగర్‌కాలనీ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వారివురు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతేడాది వైకుంఠ ఏకాదశికి ఇక్కడకి వచ్చిన సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచి తన భర్త సీఎం అయితే పూజలు నిర్వహిస్తానని ఆమె మొక్కుకున్నారు. దీంతో మొక్కులు తీర్చుకునేందుకు ఆమె కోడలితో కలసి ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపినాథ్, ఈవో శర్మలు వారికి స్వాగతం పలికారు. రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కేసీఆర్‌కు ఆయురారోగ్యాలు సమకూరాలని, విజయవంతమైన పాలన కొనసాగించాల ని అర్చకులు ఆశీర్వచనం చేశారు. అలాగే అమీర్‌పేటలోని కనకదుర్గ అమ్మవారి దేవాలయానికి వెళ్లిన వారివురు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. బల్కంపేట ఆలయంలో సీఎం సోదరీమణులు సీఎం కేసీఆర్ సోదరీమణులు బుధవారం సాయంత్రం బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో పూజలు చేశారు. సీఎం ఇద్దరు అక్కలతోపాటు రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ తల్లి అమ్మవారికి మొక్కులు సమర్పించారు. పూజల అనంతరం ఆలయ సిబ్బంది వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
కారుకు ఓటెందుకేశానంటే..
నేను సమైక్యతావాదిని. 70ఏళ్ల తెలంగాణ వెనుకబాటుతనానికి, రాజకీయ పార్టీల దుష్పరిపాలనే ప్రధానమైన కారణమని, రాష్ట్ర విభజన దీనికి సరైన పరిష్కారం కాదని నమ్మాను. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న, నాయకత్వం వహించిన వారందరూ నాకు సన్నిహితులే. వారి అనుభవాలు, వీరగాధలువింటూనే పెరిగాను. అయినా, నా శాయశక్తులా విభజనను వ్యతిరేకించాను. సమైక్యత కోసం ఒక రాజకీయ జేఏసీ నిర్మించడానికి అన్ని పార్టీల నాయకత్వంతో, అప్పటి సీఎంతో సహా అందరినీ కలిసి ఒక విఫలయత్నం చేశాను. రాష్ట్ర విభజన తరువాత అన్నిరకాల రాజకీయాలకు దూరంగా ఉండిపోయాను. ఈ దూరం రాజకీయ చిత్రపటాన్ని కొంత స్పష్టతతో చూసే అవకాశమిచ్చింది. తరువాత జరిగిన ఎన్నికలలో ఓటు వేయలేదు. క్రమేపీ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన అనేక పథకాలను, వాటి ప్రచారాలను చూశాను. అంతకుముందు చూసిన అనేక పబ్లిసిటీ ఫ్లెక్సీల్లాగే ఉన్నాయి. ఇంత డబ్బు ఫ్లెక్సీల మీద పెట్టే బదులు, ఏదైనా ఉపయోగపడే కార్యక్రమాలకు వాడొచ్చుకదా అనుకున్నాను. క్రమేపీ కొన్ని కార్యక్రమాలు–మొట్టమొదట గ్రామాలలో పాత చెరువుల పూడిక తీయడం, కొత్త చెరువులు తవ్వడం–చూసి, ఈ ప్రభుత్వానికి ఏం చేయాలో స్పష్టత ఉందని అర్థమయ్యింది. ఆ తరువాత ఒక్కొక్కటే కార్యరూపం దాల్చడంతో.. నిజాయితీతో కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయనే అభిప్రాయం కలిగింది. అన్ని సమస్యలు ఒక్కసారే పరిష్కారం అయిపోవు. తప్పులు, ఒడిదుడుకులు లేకుండా కూడా జరగవు. అసలు జరుగుతున్నాయా? లేదా? ఈ ప్రభుత్వం సరైన మార్గంలో వెళుతోందా లేదా అనేది ప్రశ్న. ఈ మాత్రం పనులు జరిగిన దాఖలాలు దేశంలో చాలా కొద్దిగానే ఉన్నాయి. రాజకీయం న్యాయమైనదైనప్పుడు ఒప్పులను అభినందించాలి. తప్పులను ఎలా సరిచేసుకోవాలో చెప్పి, సరైన సలహాలు, సూచనలు ఇవ్వాలి. ఎన్నికలలో గెలి పించడమో, ఓడించడమో ఒక్కటే గమ్యం కాదు. ఇంకా గ్రామీణాభివృద్ధి, నిరుద్యోగం వంటి సమస్యలున్నాయి. వీటిని పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీలు ఇచ్చింది. 70 ఏళ్ల పాటు పేరుకుపోయిన సమస్యల మురుగునీటిని ఒక్కసారిగా తొలగించడం సాధ్యం కాదు. అలా అనుకోవడం అత్యాశే అవుతుంది. ఈ ప్రభుత్వం గత నాలుగేళ్లలో గ్రామ సీమలకు ఇచ్చిన నీరు, బీడువారిన నేలలో పైరులు చూసిన చిన్న రైతుల ఆనందం, తాగు నీరు, ఆరోగ్య కార్యక్రమాలు, ఆర్థిక సహాయాలు, విద్యావిధానంలో మార్పుల కోసం ప్రయత్నాలు, ఐటీ రంగం, కరెంట్.. ఇలా ఇచ్చిన హామీల వైపు చిన్నచిన్న అడుగులు వేయడం నా అనుభవంలో మొదటిసారి చూశా. రెండడుగులు వెనక్కు వెళ్లి, రాజకీయ పార్టీ కోణం నుండి కాకుండా.. అభివృద్ధిని ఆశించే సాధారణ వ్యక్తిగా చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. సాధారణ ప్రజలు ఊహా లోకాల్లో, దీర్ఘకాలిక ప్రణాళికలలో, ఉన్నతమైన రాబోవు యుగాలను చూడరు. అవన్నీ ఉపన్యాసాలకే పరిమితం. ఈరోజు తమ వాస్తవ పరిస్థితులు ఎలా మెరుగవుతున్నాయి, ఆ మెరుగుదలకు దారితీసే పథకాలను ఎవరు అమలు చేస్తారనే ఉత్కంఠతో, ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. Politics are about hope. Elections are about hope. ఈ నమ్మకాన్ని ఎవరు కలిగిస్తారో, వారిని ప్రజలు ఆదరిస్తారు, గెలిపిస్తారు. ప్రాణాలుపెట్టి రక్షించుకుంటారు. దీనికి సిద్ధాంతపరమైన రాజకీయ వాదనలు అవసరం లేదు. నమ్మకం ఒక్కటే చాలు. సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ, అధికార పార్టీ జాతీయస్థాయి అధ్యక్షుడు అమిత్ షా, మరో జాతీయ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీలకు తోడు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కట్టకట్టుకుని తెలంగాణ ఎన్నికల ప్రచార బరిలోకి దిగగానే.. తాము ఇష్టపడిన ప్రభుత్వానికి ముప్పు కలుగుతోందనే భయం, ఆందోళన తెలంగాణ ప్రజల్లో కలిగింది. తమ ప్రభుత్వాన్ని రక్షించుకోవడం కోసమే ఇక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇలా పెరిగిన పోలింగ్ శాతానికి కొందరు రాజకీయ పండితులు భిన్నమైన విశ్లేషణలు, వ్యాఖ్యానాలు చేశారు. ఈ ప్రభుత్వానికి రైతులు, కార్మికులు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, అన్ని కులాలవారు, మతాల వాళ్లు వ్యతిరేకులని భాష్యం చెప్పారు. నాకు ఈ ప్రభుత్వంతో వ్యక్తిగత అవసరాలేమీ లేవు. మా నియోజకవర్గం అభ్యర్థులెవరో తెలీదు. వారెవరితో పరిచయం లేదు. నన్నెవరూ తమకే ఓటు వేయమని అడగలేదు. ఎస్సెమ్మెస్‌లు కూడా రాలేదు. అయినా, పొద్దున్నే పోలింగ్ బూత్‌కు వెళ్లా. ఈవీఎంను చూస్తే అన్నీ తెలియని పేర్లే ఉన్నాయి. ఓ నిరక్షరాస్యుడిలా పేర్లతో సంబంధం లేకుండా కారు గుర్తు దగ్గర ఉన్న బటన్ నొక్కా... పేపర్ స్లిప్ మీద కారు బొమ్మ వచ్చింది. ఎన్నికల ఫలితాలు ఎలా వున్నా, ఒక మంచి పని చేశానన్న తృప్తితో పోలింగ్ బూత్ బైటికి వచ్చా. తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు ఇతర రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలకు ఒక ముఖ్యమైన సందేశాన్నిచ్చాయి. అదేమిటంటే.. ఉపన్యాసాలు, ప్రలోభాలు, నినాదాలు కాదు; ప్రజాహిత కార్యాచరణే గెలిపిస్తుందని. Anti-incumbency అనే మాటకు అర్థమేమీ లేదు. బాగా పనిచేసే చేతిని ఎవరూ విరగ్గొట్టుకోరు. వ్యాసకర్త : డా‘‘ పుచ్చలపల్లి మిత్ర ,రాజకీయ విశ్లేషకుడు mitrapuchalapalli@gmail.com -
ఇక రైతు కేంద్రంగా రాజకీయం
బలమైన, వ్యూహాత్మకంగా అడుగేసే ప్రతిపక్ష కూటమి బీజేపీని ప్రకంపింప చేస్తుందని, చివరకు ఓడించగలుగుతుందని కూడా ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు నిరూపించాయి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం నేర్చుకోవలసిన పాఠం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రైతును నిర్లక్ష్యం చేస్తే, మీ పతనం తప్పదు. దేశవ్యాప్తంగా వ్యవసాయ సంక్షోభంలో చిక్కుకున్న రైతులు తమ సమస్యలను ఏదోమేరకు గుర్తించి, పరిష్కరించిన చోట ప్రభుత్వాలను అందలమెక్కిస్తున్నారు. దీనికి అసలు సిసలు ఉదాహరణ తెలంగాణ. రైతులకు నగదు నేరుగా బదలాయించి ఈ ఎన్నికల్లో వారి మద్దతును కేసీఆర్ ప్రభుత్వం గణనీయంగా సాధించింది. మూడు హిందీ ప్రాబల్య రాష్ట్రాల్లో హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయం తర్వాత వచ్చే కొద్ది నెలల్లో రాజకీయ పరిదృశ్యానికి సంబంధించిన రూపురేఖలు పదునెక్కనున్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు ఆరునెలల్లోపే జరుగనుండటంతో ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఓటింగ్ సరళి నుంచి పాలక బీజేపీ, ప్రతిపక్ష పార్టీలు కూడా కొన్ని గుణపాఠాలు నేర్చుకోవలసి ఉంది. రానున్న కొద్దిరోజుల్లో ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సమగ్ర వివరాలతో చర్చలు జరుగుతాయి. విశ్లేషణలు జరుగుతాయి. కానీ ఈ ఎన్నికలు ప్రధానంగా మూడు ముఖ్యమైన విషయాలను రంగంమీదికి తీసుకొచ్చినట్లు స్పష్టమైపోయింది. అవేమిటంటే, గ్రామీణభారతంలో అశాంతి అనేది వాస్తవం. ఓటింగుపై దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. రెండోది, మతపరమైన విభజన లేదా సమీకరణ అనేది విశ్వాసాలను పటిష్టం చేస్తుందేమో కానీ అది భారీ ఎత్తున ఓట్లను సంపాదించలేదు. ఇక మూడో అంశం.. బలమైన, వ్యూహాత్మకమైన ప్రతి పక్ష కూటమి బీజేíపీని కదిలించివేస్తుంది, ఓడిస్తుంది కూడా. రైతు సంక్షేమమే తొలి ప్రాధాన్యత దేశవ్యాప్తంగా రైతులు తీవ్రంగా బాధపడుతున్నారు. తమ సమస్యలను ఏదోమేరకు గుర్తించి, పరిష్కరించిన చోట వారు ప్రభుత్వాలను అందలమెక్కిస్తున్నారు. దీనికి అసలు సిసలు ఉదాహరణ తెలంగాణ. పాలకపార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి రైతులకు నగదు నేరుగా బదలాయించి ఈ ఎన్నికల్లో వారి మద్దతును గణనీయంగా కొల్లగొట్టింది. తెలంగాణ భావనపట్ల గతంలో ప్రజల్లో ఉన్న తీవ్రమైన అత్యుత్సాహం ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. అలాగే 2014 ఎన్నికల్లోలాగా ఉప జాతీ యవాదం కూడా ఇప్పుడు అంత బలంగా లేదు. సమస్యల ప్రాతిపదికన స్పందించే చైతన్యం తెలంగాణ ఓటర్లలో పెరిగిందనడానికి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు స్పష్టంగా రుజువు చేశాయి. మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తీవ్రంగానే ప్రయత్నించారు. కానీ 2017 జూన్‌లో ఆ రాష్ట్రంలో మండసార్‌లో రైతులపై కాల్పులు జరగడం ఆయన పాలనకు మచ్చగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో కూడా ఆయన వ్యక్తిగత ప్రజాదరణ కొనసాగింది. కానీ గ్రామీణ ఓటర్లలో కొన్ని విభాగాల మద్దతును ఆయన తప్పకుండా పొంది ఉండాల్సింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం నేర్చుకోవలసిన పాఠం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రైతును నిర్లక్ష్యం చేస్తే, మీ పతనం తప్పదు. ఈ గుణపాఠంతో రానున్న నెలల్లో రైతులను మరిన్ని ప్రలోభాలకు గురిచేస్తారని ఊహించవచ్చు కానీ ఇది వాస్తవ పరిస్థితిలో మార్పును తీసుకొస్తుందా అనేది చూడాల్సి ఉంది. విద్వేష రాజకీయాలకు భంగపాటు చిత్రవధ చేసి చంపడం కరడు గట్టిన హిందుత్వ వాదులను సంతోషపెట్టవచ్చునేమో కానీ, ప్రభుత్వాలపై ఓటరు తీవ్ర ఆగ్రహాన్ని అది ఏమాత్రం మార్చలేదు. రాజస్తాన్‌లో ఇది స్పష్టంగా కనబడింది. ఈ రాష్ట్రం లోని నియోజకవర్గాల్లోని పలు విభాగాల ప్రజలను వసుంధర రాజే పరాయీకరణ పాలు చేశారు. అందుకే ఓటర్లు ఆమెకు తగిన గుణపాఠం నేర్పారు. ఇక యోగి ఆదిత్యనాథ్ బ్రాండ్ విద్వేష ప్రచారం వ్యతిరేక ఫలితాలనే తీసుకువస్తోంది. హైదరాబాద్ పేరు మార్చేస్తానని, నిజాంని పారదోలినట్లే మజ్లిస్ పార్టీ నేతలను రాష్ట్రం నుంచి తరిమేస్తామని యోగి చేసిన వాగ్దానాలను తెలంగాణ ఓటర్లు అసలు పట్టించుకోలేదంటే సందేహపడాల్సిన పనిలేదు. పైగా నిజాం తెలంగాణ నుంచి పారిపోయాడని చెప్పడమే ఒక చారిత్రక అసత్యం. ఇలాంటి విద్వేష ప్రచారాలను తిప్పికొట్టడంలో భాగంగానే కావచ్చు. బీజేపీకి తెలంగాణ ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే దక్కి మహామహులు ఓడిపోయారు. ఈ నేపథ్యంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్‌ను ప్రచారానికి ఎక్కడికి పంపాలి అనే విషయంపై బీజేపీ మళ్లీ ఆలోచించుకోవాల్సి ఉంది. పరాజయం నేర్పుతున్న గుణపాఠాలు ఈ పరిణామాలను ప్రతిపక్షాలు తప్పక పరిగణనలోకి తీసుకుని 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ తమ వ్యూహాలను, ఎత్తుగడలను తప్పకుండా మార్చుకోవలసి ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావడానికి రెండు రోజుల ముందు ఢిల్లీలో ప్రతిపక్షాలు తమ ఐక్యతను ప్రదర్శించాయి. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్‌తో సహా దాదాపు ప్రతిపక్ష నేతలంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు కానీ అఖిలేష్ యాదవ్, మాయావతి గైర్హాజర్ కావడం ద్వారా తమ భవిష్యత్ పయనాన్ని సూచించారు. ఉదాహరణకు మాయావతి ఎక్కడికి వెళతారు? ఆమె మధ్యప్రదేశ్‌లో కీలక పాత్ర పోషించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో కలిసి వెళ్లకూడదని ఆమె తీసుకున్న నిర్ణయం పేలవంగా కనబడుతోంది. పైగా వారు ఐక్యంగా ఉంటే మరిన్ని సీట్లను గెలిచి ఉండేవారు. కానీ తన సొంత బలాన్ని పరీక్షించుకోవాలని భావించి ఉండవచ్చు లేదా ఏవైనా ఒత్తిళ్లకు గురయి ఉండవచ్చు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆమె సమాజ్‌వాదీ పార్టీతో చేతులు కలపవచ్చు, లేదా కాంగ్రెస్‌తోనూ చేతులు కలపవచ్చు. ఇప్పటికే సంకీర్ణంలో ఉన్న రాష్ట్రీయ లోక్ దళ్‌తో ఇలాంటి ఐక్యత సాధ్యపడితే ఉత్తర భారతదేశంలో అత్యంత కీలకమైన రాష్ట్రంలో బీజేపీ మరింత నిస్సహాయ స్థితిలో కూరుకుపోక తప్పదు. బుజ్జగింపులు, ప్రలోభాలు తప్పవా? ఇక మమతా బెనర్జీ కూడా ప్రతిపక్ష మహాకూటమితో పొత్తు కుదుర్చుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు వెలువరిస్తున్నారు. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఫ్రంట్‌లో ప్రముఖపాత్ర పోషిస్తున్న నేపథ్యంలో మమత తన స్థానాన్ని వదిలేసుకుంటారా? ఇక శరద్ పవార్ ఇప్పటికే మహారాష్ట్రలో కాంగ్రెస్‌తో లాంఛనప్రాయమైన ఒడంబడికను కూడా చేసుకుంది. జాతీయ కూట మికి ఇది మరింత దన్ను కలిగిస్తుంది. మహారాష్ట్రలో దూకుడుమీదున్న శివసేనతో బీజేపీ తీవ్రంగా తలపడనుంది. ఈ రాష్ట్రంలో వీలైనన్ని స్థానాలు గెల్చుకోవాలంటే శివసేనకు తలొగ్గి దాని డిమాండ్లను కాషాయదళం అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. భాగస్వాములతో సర్దుబాట్లు జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)లో భాగమైన చిన్న పార్టీలు నరేంద్రమోదీ–అమిత్‌షా తరహా పనివిధానంతో, వ్యవహార శైలితో ఉక్కిరిబిక్కిరవుతూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయి. వీటిలో రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ లేక రామ్‌దాస్ అతవాలే నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ మరెక్కడికైనా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాయా? తమ ప్రయోజనాలు ఉత్తమంగా ఎక్కడ నెరవేరుతాయో అక్కడే పనిచేయాలని ఈ పార్టీలు స్పష్టంగా కోరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తన భాగస్వామ్య పార్టీలను చేజారకుండా చూసుకోవడానికి ఎన్నో సర్దుబాట్లు, మరెన్నో రాజీలు చేసుకోవలసి ఉంటుంది. 2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల సమరం ఉన్నట్లుండి మరింత ఆసక్తికరంగా మారింది. రాజకీయ బేరసారాలు కూడా దీనికి తగినట్లుగానే పరాకాష్టకు చేరుకోనున్నాయి. ఇతర రాజకీయ పార్టీలను బుజ్జగించడం, ప్రభావితం చేయడం, ప్రలోభపెట్టడం వంటి చర్యలకు బీజేపీ తలొగ్గుతుందా లేదా అని ఇప్పుడిప్పుడే ఊహించడం కష్టం. అయితే పొత్తు పార్టీలన్నింటినీ కూడదీసుకుని ఎన్నికల యుద్ధంలోకి దిగాలంటే అది తన ఆకర్షణా శక్తిని, ఎత్తుగడల రాజకీయాలను ప్రయోగంచడమే కాకుండా డబ్బు, భుజబలాన్ని కూడా పెద్ద ఎత్తున ఉపయోగించవలసి రావచ్చు. సంక్షేమ మంత్రంతోటే ఓట్ల సునామీ రైతు సంక్షేమానికి, విస్తృత ప్రజానీకం ప్రయోజనాలకు కాస్త పట్టం కడితే కోట్లాది జన హృదయాలు ఎలా స్పందిస్తాయో తెలంగాణ రాష్ట్ర పాలకులు యావద్దేశం ముందు ప్రదర్శించి చూపారు. కేసీఆర్ జపించిన సంక్షేమమంత్రానికి పులకరించిన తెలంగాణ పల్లెలు పోలింగ్ బూత్‌లకు వరుకకట్టాయంటే అతిశయోక్తి కాదు. దానికి తోడు ఆయన మరోసారి సంధించిన ఆత్మగౌరవ నినాదం తెలంగాణ పట్టణాల్లో కూడా పెను ప్రభంజనం సృష్టించింది. ప్రజా సంక్షేమం పట్ల ప్రత్యేకించి గ్రామీణ ప్రజల అభివృద్ధి పట్ల కేసీఆర్ తొలినుంచి ప్రదర్శిస్తూ వచ్చిన నిబద్ధత అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సునామీని సృష్టించింది. ప్రజాకూటమిలో భాగమైన పెద్ద చిన్న పార్టీలను సానుకూల ఓట్ల సునామీ తుడిచి పెట్టేసింది. జిల్లాలకు జిల్లాల్లో గులాబీ రథానికి ఎదురు లేకుండా పోయింది. పాజిటివ్ ఓటు ఎంత ప్రభావం వేస్తుందో చెప్పడానికి, చూపడానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పథకాలకు, దార్శనికతకు లభించిన ఘనవిజయం ఒక లిట్మస్ టెస్టుగా దేశం ముందు నిలుస్తోంది. రైతాంగాన్ని నిర్వీర్యం చేస్తున్న పథకాలు దేశంపై దండెత్తుతున్న మనకాలంలో ఇకనైనా రైతు సంక్షేమం తప్పనిసరిగా పట్టించుకోవలిసిన ఎజెండాగా రాజకీయ యవనికపై నిలుస్తుందేమో చూడాలి. వ్యాసకర్త : సిద్ధార్థ్ బాటియా, సీనియర్ పాత్రికేయుడు (ది వైర్ సౌజన్యంతో) -
‘చంద్ర’గ్రహణం
-
అందుకే గవర్నర్‌ను కలిశాం: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్ : తాజా ఎన్నికల్లో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజ్‌భవన్‌లో గురువారం మధ్యాహ్నం 1.25 గంటలకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం స్వీకరించనున్నారని సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురు రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి.. పార్టీ శాసనసభాపక్షం తీర్మానం ప్రతులను అందజేశారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయాన్ని ఆయనకు తెలియజేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో తలసాని శ్రీనివాస్ యాదవ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, వినయ్ భాస్కర్, పద్మాదేవేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, కాలె యాదయ్య, రవీంద్ర నాయక్ తదితరులు ఉన్నారు. టీఆర్ఎస్ శాసనసభాపక్షం తీర్మానం ప్రతులను గవర్నర్‌కు అందజేశామని తెలిపిన ఎమ్మెల్యేలు.. పరిచయం కోసం మాత్రమే గవర్నర్‌ను కలిశామంటూ.. తాము గవర్నర్‌ను కలువడంలో ఎలాంటి ప్రాధాన్యం లేదని చెప్పారు. మరోవైపు కొత్తగా కొలువుదీరనున్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరు మంత్రులుగా బాధ్యతలు చేపడతారన్నది ఆసక్తిగా మారింది. కొత్త మంత్రులుగా పలువురు ఎమ్మెల్యేల పేర్లు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో.. వీరు గవర్నర్‌ను కలువడం కూడా ఊహాగానాలకు తావిస్తోంది. -
‘లోక్‌సభకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి’
సాక్షి, నార్కట్‌పల్లి (నకిరేకల్) : ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి విఫలం విషయమై త్వరలో కాంగ్రెస్ అధిష్టానంతో చర్చంచి భవిష్యత్ ప్రణాళిక నిర్ణయించి పార్లమెంట్ ఎన్నికలకు పక్కా వ్యూహంతో వెళ్తామని మునుగోడు ఎమ్మెల్యేగా గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఎన్నికల ఫలితాల అనంతరం హైదరాబాద్‌కు వెళ్తున్న ఆయన మార్గమధ్యలో నార్కట్‌పల్లిలో గల వివేరా హాటల్లో నకిరేకల్ ఎమ్మెల్యేగా గెలిచిన చిరుమర్తి లింగయ్యతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నల్లగొడలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓడిపోవడంతో నాయకులు సంబరాలు జరుపుకునేందుకు ఇష్టపడడం లేదన్నారు. నాలుగు నెలల్లో పార్లమెంటు ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పోటీ చేసి అధిక మెజార్టీ సాధిస్తారని జోస్యం చెప్పారు. నల్లగొండ నియోజకవర్గంతోపాటు జిల్లా అభివృద్ధికి కృషి చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓడిపోవడం జీర్ణించుకోలేక పోతున్నట్లు వివరించారు. ఒక గ్రామం నుంచి ముగ్గురు ఒకేసారి అసెంబ్లీకి పోవాలనే ఉద్దేశంతో పోటీచేసినట్లు తెలిపారు. ప్రజాతీర్పును స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. మా గెలుపునకు కృషిచేసిన మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు, ప్రజాకుటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ప్రసన్నరాజు, మేకల రాజిరెడ్డి, దూదిమెట్ల సత్తయ్య, కోమటిరెడ్డి చిన్న వెంకట్‌రెడ్డి, సాగర్ల గోవర్ధన్, చిలువేరు గిరి, యాణాల రాంరెడ్డి, చిన్న మల్లయ్య, కన్నెబోయిన సైదులు, భూపాల్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, సమద్, వెంకన్న తదితరులు ఉన్నారు, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను చౌటుప్పల్ (మునుగోడు) : నియోజకవర్గ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని మునుగోడు ఎమ్మెల్యేగా గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన మంగళవారం చౌటుప్పల్‌కు వచ్చారు. స్థానిక తంగడపల్లి చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలంతా తన గెలుపుకోసం అవిశ్రాంతంగా కృషి చేశారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్లసింగారం మాజీ సర్పంచ్ సుర్వి నర్సింహ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చింతల వెంకట్‌రెడ్డి, నాయకులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, తిరుపతి రవీందర్, తీగుళ్ల కృష్ణ, ఎస్కె.జానిబాబు, తొర్పునూరి నర్సింహ, ముమ్మడి నవీన్, బాతరాజు మల్లేశ్, పల్చం సత్యం, పెద్దగోని రమేష్, మునుకుంట్ల శేఖర్, వెంకటేశం, చెరుకు యాదయ్య, మల్లేశ్, రమేష్, కృష్ణ, నరేష్, ఎస్.వెంకటేశం తదితరులు ఉన్నారు. -
బాబు ప్రచారం.. టీఆర్ఎస్కు భారీ మెజారిటీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు వచ్చి ప్రచారం చేస్తే తమపై ఓట్ల వర్షం కురుస్తుందని, బంపర్ మెజారిటీలు వచ్చేస్తాయని మురిసిపోయిన తెలంగాణ ప్రజా కూటమి అభ్యర్థులకు గట్టి షాక్ తగిలింది. బాబు ప్రచారం చేసిన చోట కూటమి గల్లంతైంది. ఆయన 15 నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, సభలు నిర్వహించగా, 12 చోట్ల కూటమి అభ్యర్థులు భారీ ఓట్ల తేడాతో పరాజయం రుచిచూశారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు వారం రోజులపాటు హైదరాబాద్‌లో మకాం వేసి వ్యూహరచన చేశారు. ఖమ్మం, కోదాడ, హైదరాబాద్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో కలిసి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌తోపాటు శివార్ల పరిధిలోని ముషీరాబాద్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, మలక్‌పేట, ఎల్బీనగర్, ఉప్పల్, రాజేంద్రనగర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, సనత్‌నగర్, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, సభలు నిర్వహించారు. తెలంగాణను అభివృద్ధి చేసింది తానేనని, కేసీఆర్ చేసిందేమీ లేదని చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేశారు. కూటమి గెలిచేస్తుందంటూ హడావుడి చేశారు. అయితే ఎక్కడా ఆయన పాచికలు పారలేదు. బాబు ప్రచారం చేసిన చోట టీఆర్ఎస్కు భారీ మెజారిటీ హైదరాబాద్ నగరం, శివార్లలో చంద్రబాబు ప్రచారం చేసిన 12 నియోజకవర్గాల్లో 11 చోట్ల టీడీపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయారు. టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్న కూకట్పల్లి, శేరిలింగంపల్లిలో అవమానకర ఓటమిని సొంతం చేసుకోవాల్సి వచ్చింది. కూకట్‌పల్లిలో 41 వేల ఓట్ల తేడాతో, శేరిలింగంపల్లిలో 44 వేల ఓట్లతో టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారు. చంద్రబాబు ప్రచారం చేసిన రాజేంద్రనగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థికి 58 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. బాబు ప్రచారం నిర్వహించిన సికింద్రాబాద్, ముషీరాబాద్, ఉప్పల్, సనత్‌నగర్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఊహించని మెజారిటీతో గెలుపొందారు. జూబ్లీహిల్స్, మలక్‌పేటలో కూటమి అభ్యర్థులను చంద్రబాబు గెలిపించలేకపోయారు. ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఒక్క ఎల్బీ నగర్లోనే కూటమి అభ్యర్థి గెలిచారు. నల్గొండ జిల్లా కోదాడలో రాహుల్‌గాంధీతో కలిసి ప్రచారం చేసినా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతిని గెలుపు తీరం చేర్చలేకపోయారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో రాహుల్‌గాంధీతో కలిసి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రచారం చేసినా టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావును గెలిపించలేక చంద్రబాబు చతికిలబడ్డారు. అదే జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచినా అది టీఆర్ఎస్లోని అంతర్గత విభేదాల వల్లే సాధ్యమైందని చెబుతున్నారు. -
అయ్యయ్యో..!
తెలంగాణ ఎన్నికల్లో జిల్లా టీడీపీ నేతలుచేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఎన్నికలసమయంలో కులాల వారీగా ముఖ్య నేతలుహైదరాబాద్లో మకాం వేశారు. భారీఎత్తున డబ్బు మూటలు తరలించారు. ప్రచారం నుంచి ధనంపంపిణీ వరకు అన్ని చూసుకున్నారు. ఇంకేం గెలుపు మనదే అనుకున్నారు. సెమీఫైనల్స్‌గా భావించిన ఎన్నికల రణరంగంలో టీడీపీ అభ్యర్థులు కేవలం ఇద్దరే గెలవడంతో నేతలకు ఊహించని రీతిలో భారీ షాక్ తగిలింది. ఒక్కసారిగా పార్టీ నేతలు, క్యాడర్ నైరాశ్యంలో పడ్డాయి. ముఖ్యంగా తెలంగాణరాజకీయాలపై మాట్లాడే రాష్ట్ర మంత్రులు ఫలితాల సరళి చూశాక ముఖం చాటేశారు. అధికార పార్టీ నేతలు తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ సమయం నుంచి నిన్నటి వరకు భారీగా ప్రచారం చేసి మనమే వెళ్లి గెలిపించబోతున్నామంటూ హడావుడి చేశారు.చివరకు డిపాజిట్లు కూడా రాకపోవడం, రానున్నరాష్ట్ర ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలే వస్తాయనే ఆందోళన అధికార పార్టీ శ్రేణుల వెన్నుల్లోవణుకు పుట్టిస్తోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు : నవంబర్ నుంచి జిల్లా రాజకీయాల్లో తెలంగాణ ఎన్నికలపైనే విస్తృత చర్చ సాగింది. ముఖ్యంగా అక్కడ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడాన్ని స్థానికంగా ఇటు అధికార పార్టీ క్యాడర్, అటు కాంగ్రెస్ క్యాడర్ కూడా మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అయితే బహిరంగంగా మాట్లాడకపోయినా భారీగా నష్టపోతామనే భావన మాత్రం ఇరుపార్టీ శ్రేణుల్లో బలంగా ఉంది. ఈ ప్రచారాన్ని అధిగమించడానికి అధికార పార్టీ డబ్బు మొదలుకుని కులం కార్డు వరకు అన్ని రకాల జిమ్ముక్కులు చేసి చివరికి భారీగా బోల్తా పడ్డారు. గత నెల చివర్లో జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, గూడురు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ హైదరాబాద్ నగరంలోనే మకాం వేసి ఎన్నికల ప్రచారం నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకు క్రియాశీలకంగా వ్యవహరించారు. వీరిలో ఒక నేత అయితే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాలతో భారీగా నగదు కూడా తెలంగాణా ఎన్నికల్లో పంచారన్న ప్రచారం జోరుగా సాగింది. ఇంత చేసినా ప్రజాతీర్పు ఉహించని రీతిలో ఉండటంతో నేతలు తలలు పట్టుకున్నారు. ముఖం చాటేశారు ఇక నిత్యం జిల్లాలో హడావుడి చేసి రాష్ట్ర రాజకీయాలు మొదలుకుని దేశ రాజకీయాల వరకు మాట్లాడే మంత్రులు కూడా ఎన్నికల ఫలితాల ముందు వరకు మçహాæ కూటమిదే ఘనవిజయం అంటూ స్థానికంగాబలంగా ప్రచారం చేసి పరోక్షంగా బెట్టింగ్‌ల జోరుకు మరింత ఊపు తెచ్చారు. తీరా ఫలితాలు వచ్చాక నేతలు పూర్తిగా ముఖం చాటేశారు. ముఖ్యంగా మంత్రి నారాయణ అయితే ముందస్తు షెడ్యూల్‌ను కూడా రద్దు చేసుకుని క్యాంప్ కార్యాలయానికే పరిమతమయ్యారు. ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో తన సామాజికవర్గ ఓటర్లను, సెటిలర్స్ ఆకట్టుకోవడానికి ప్రచారంలో హడావుడి చేశారు. నగర మేయర్ మలక్‌పేటలో మైనార్టీలను ఆకట్టుకోవటానికి అక్కడే మకాం వేసి వచ్చారు. అలాగే బీద రవిచంద్ర కూడా చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతోపాటు గట్టిగా షాక్ ఇవ్వటంతో నేతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. బాబు తప్పిదాల వల్లే.. మరోవైపు తెలంగాణలో కూకట్‌పల్లిపై ఎక్కువమంది జిల్లా శ్రేణులు దృష్టి నిలిపారు. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని విజయం కోసం జిల్లాకు చెందిన అనేకమంది అక్కడికి వెళ్లి నగదు పంపిణీ నుంచి అన్ని విషయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. అక్కడ కూడా భారీ పరాజయం పాలుకావటంతో నందమూరి కుటుంబాన్ని బాబు బలిపశువును చేశారనే అభిప్రాయాం ఎన్టీఆర్ అభిమానుల్లో బలంగా ఉంది. చంద్రబాబు రాజకీయ మనుగడ కోసమే సుహాసినీ రాజకీయాల్లో తెచ్చి అభాసుపాలు చేశారని మండిపడుతున్నారు. కేవలం చంద్రబాబునాయుడు వల్లే కూటమి ఓడిపోయిందని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. బాబు తప్పిదాల వల్ల భారీ మూల్యం చెల్లించుకున్నామని చెబుతున్నారు. మొత్తంగా సెమీఫైనల్స్‌గా భావిస్తున్న తెలంగాణ ఎన్నికలు టీడీపీకి గట్టి షాక్ ఇవ్వడంతో పార్టీ శ్రేణుల్లో సర్వత్రా ఆందోళన నెలకొంది. -
తమ్ముడు ఇన్...అన్న అవుట్..!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ముందస్తు శాసనసభ ఎన్నికల ఫలితాలు ఆసక్తి గొల్పుతున్నాయి. అనూహ్య విజయాలు, పరాజయాలు చర్చనీయాంశం అయ్యాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో తమదైన ముద్రవేసుకున్న కోమటిరెడ్డి సోదరులు ఒకేసారి అసెంబ్లీకి వెళ్లలేకపోతున్నారు. నల్లగొండనుంచి అయిదో విజయం కోసం పోటీపడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓటమి పాలుకాగా, ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తొలి విజయాన్ని అందుకున్నారు. దీంతో తమ్ముడు ఇన్.. అన్న అవుట్ అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక, నకిరేకల్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన చిరుమర్తి లింగయ్య తన రాజకీయ గురువు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అని చెబుతుంటారు. 2009 ఎన్నికల్లో గురుశిష్యులు ఒకే సారి అసెంబ్లీకి వెళ్లారు. కానీ, ఈ ఎన్నికల్లో శిష్యుడు లింగయ్య విజయం సాధించగా, వెంకట్‌రెడ్డి మాత్రం ఓటమి పాలయ్యారు. నార్కట్‌పల్లి మండలం బ్రహ్మణ వెల్లెంల గ్రామానికి చెందిన ఈ ముగ్గురు నేతల్లో ఈసారి ఇద్దరు మాత్రమే గెలుపొందారు. మరో వైపు నల్లగొండ జిల్లాలో పలువురు నేతలు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీలుగా పనిచేసిన రికార్డును రాజగోపాల్‌రెడ్డి బ్రేక్ చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పనిచేసిన నాయకుల్లో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డిని రాజ్యసభ సభ్యుడి పదవి రించింది. రామన్నపేట మాజీ ఎమ్మె ల్యే ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రాగ్యానాయక్ సతీమణి భారతీ రాగ్యానాయక్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పని చేశారు. కాగా, ఎమ్మెల్సీ పదవిలో ఉండి ఎమ్మెల్యేగా గెలిచింది మాత్రం రాజగోపాల్ రెడ్డి ఒక్కరే కావడం విశేషం. అదేమాదిరిగా, గురు శిష్యుల సంబంధం ఉన్న కె.జానారెడ్డి ఓడిపోగా, ఆయన శిష్యుడిగా పేరున్న ఎన్.భాస్కర్‌రావు మిర్యాలగూడ నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా> గెలిచారు. పతి గెలుపు... సతి ఓటమి రాష్ట్ర రాజకీయాల్లో ఒకేసారి శాసన సభకు ఎన్నికైన దంపతుల జాబితాలో చేరిన మూడో జంట ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి. 2014 ఎన్నికల్లో పద్మావతి కోదాడ నుంచి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి హుజూర్నగర్ నుంచి గెలిచారు. గతంలో ఇలా.. ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలా దేవి, ఆ తర్వాత మహబూబ్‌నగర్ జిల్లా నుంచి టీడీపీ పార్టీ తరఫున దయాకర్‌రెడ్డి, ఆయన భార్య సీతాదయాకర్‌రెడ్డి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే, రెండో సారి కూడా గెలిచి అరుదైన రికార్డు సృష్టించాలనుకున్న ఉత్తమ్ దంపతులకు ఈ ఎన్నికల్లో చుక్కెదురైంది. ఈ ఎన్నికల్లో పద్మావతి కోదాడ నుంచి పోటీ చేసినా, టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోగా, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజయం సాధించారు. -
గులాబీ గుభాళింపు
సాక్షి ప్రతినిధి, వరంగల్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల మీద కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఓటర్లు కేసీఆర్ మీద నమ్మకంతోనే ‘కారు’ గుర్తుకు ఓటేసి భారీ విజయాన్ని అందించారు. ఓటమి పాలవుతారని భావించిన టీఆర్ఎస్ అభ్యర్థులు కూడా భారీ మెజార్టీతో విజయం సాధించారు. అభివృద్ధి, రైతు ఎజెండా, జనాకర్షక పథకాలకు తోడు చంద్రబాబు నాయుడు.. కూటమితో జట్టు కట్టటం టీఆర్ఎస్కు కలిసొచ్చింది. పేదలు, పల్లెలు ‘కారుకు’ అండగా నిలబడ్డాయి. తొలి ఓటు వేసిన నవ యువత, మలి ఓటు వేసిన వృద్ధులు, రైతులు పూర్తిగా కేసీఆర్‌పై విశ్వాసం ప్రకటించారు. దాదాపు అన్ని రౌండ్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్‌రావు (టీఆర్ఎస్), వరంగల్ తూర్పులో నన్నపునేని నరేందర్ (టీఆర్ఎస్), వరంగల్ పశ్చిమలో వినయ్‌భాస్కర్ (టీఆర్ఎ??స్), వర్ధన్నపేటలో అరూరి రమేష్ (టీఆర్ఎస్), నర్సంపేటలో పెద్ది సుదర్శన్‌రెడ్డి (టీఆర్ఎస్) పరకాలలో చల్లా ధర్మారెడ్డి (టీఆర్ఎస్), జనగామలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (టీఆర్ఎస్), స్టేషన్ ఘన్‌పూర్‌లో తాటికొండ రాజయ్య (టీఆర్ఎస్), డోర్నకల్‌లో రెడ్యానాయక్ (టీఆర్ఎస్), మహబూబాబాద్‌లో శంకర్‌నాయక్ (టీఆర్ఎస్ ) విజయం సాధించారు. భూపాపల్లిలో స్వతంత్య్ర అభ్యర్థి గండ్ర సత్యనారాయణపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి, ములుగులో మంత్రి చందూలాల్‌పై కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క ఘన విజయం సాధించారు. మంథనిలో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు,(కాంగ్రెస్).. భద్రాచలంలో పొదెం వీరయ్య (కాంగ్రెస్) విజయం సాధించారు. రెడ్యానాయక్ ఆరోసారి.. డోర్నకల్ టీఆర్ఎస్ అభ్యర్థి డీఎస్.రెడ్యానాయక్ ఆరో సారి విజయం సాధించారు. మరిపెడ మండలం ఉగ్గంపల్లికి చెందిన రెడ్యానాయక్ 1989లో కాంగ్రెస్ నుంచి తొలిసారి గెలిచారు. 1994, 1999, 2004 వరకు వరుసగా గెలుస్తూ వచ్చారు. 2004లో జరిగిన ఎన్నికల్లో రెడ్యా.. టీడీపీ అభ్యర్థి జయంత్నాథ్నాయక్పై 19140 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో గిరిజన శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 2009లో సత్యవతి రాథోడ్ చేతిలో ఓడిపోయారు. తిరిగి 2014 కాంగ్రెస్ నుంచే గెలుపొందిన తర్వాత టీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో తొలిసారి కారు గుర్తుతో పోటీ చేసిన రెడ్యా.. కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రామచంద్రునాయక్పై 17,381 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పరకాలలో ఫైర్ బ్రాండ్ ఓటమి కేటీఆర్‌తో విభేదించి సొంత గూడు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఫైర్ బ్రాండ్ కొండా సురేఖ పరాజయం పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి.. ఆమెను అత్యంత సునాయాసంగా ఓడించారు. కూటమి పొత్తుల్లో భాగంగా పరకాల నుంచి పోటీ చేసిన కొండాసురేఖ ఆది నుంచి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. గట్టి పోటీదారుగా ఉన్న సురేఖ ఏ రౌండ్లోనూప్రభావం చూపలేకపోయారు. కొండా సురేఖపై చల్లా ధర్మారెడ్డి 46,519 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. రాజయ్య, వినయ్ నాలుగోసారి.. స్టేషన్ ఘన్పూర్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్య రాజకీయ పరిశీలకుల అంచనాలకు తలకిందులు చేస్తూ భారీ మెజార్టీతో గెలుపొందారు. 2008 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాజయ్య, టీఆర్ఎస్ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి తొలిసారి గెలుపొందారు. 2012 ఉప ఎన్నికల్లో, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. తాజా ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి సింగపురం ఇందిరపై 35,790 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. వరంగల్ పశ్చిమ నుంచి దాస్యం వినయ్ భాస్కర్ వరుసగా నాలుగోసారి విజయం సాధించారు. 2004లో తొలిసారి పోటీ చేసి ఓడిపోయన ఆయన ఆ తర్వాత 2009, 2010 ఉప ఎన్నికల్లో, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. తాజాగా తన సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రేవూరి ప్రకాష్‌రెడ్డిపై 39,059 ఓట్ల మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు. ఆ ఇద్దరికి ‘సన్’స్ట్రోకే.. భూపాలపల్లి అభ్యర్థి, స్పీకర్ మధుసూదనాచారికి , ములుగు అభ్యర్థి, ఆపద్ధర్మ మంత్రి అజ్మీరా చందూలాల్‌కు సన్‌స్ట్రోక్ తాకినట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. మధుసూదనాచారి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. సన్స్ట్రోక్ను ముందుగానే పసిగట్టిన ఆయన ఆరు నెలలుగా కుమారులను నియోజకవర్గానికి దూరంపెట్టి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసిన గండ్ర సత్యనారాయణపై కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి 15,635 ఓట్ల తేడాతో గెలుపొందారు. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన స్పీకర్ మధుసూదనాచారి మూడో స్థానంలో నిలిచారు. ఇక ములుగు నుంచి చందూలాల్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. కూమారుడి అనుమతి లేకుండా సాధారణ ప్రజలు నేరుగా చందూలాల్‌ను కలిసే అవకాశం లేకపోవడంతో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి చందూలాల్‌పై 22,671 ఓట్ల తేడాతో విజయకేతనం ఎగురవేశారు. అరూరి రమేష్ రికార్డు మెజార్టీ వర్ధన్నపేట టీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేష్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. రాష్ట్రంలో హరీశ్‌రావు తర్వాత అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్మేగా అరూరి రికార్డు సృష్టించారు. ఆయన టీజేఏస్ అభ్యర్థి పగిడిపాటి దేవయ్యపై 99,240 ఓట్ల భారీ ఆధిక్యతతో గెలుపొందారు. దేవయ్యకు 32,012 ఓట్లు మాత్రమే వచ్చాయి. గత ఎన్నికల్లోనూ రమేష్‌కు 86 వేల మెజార్టీ వచ్చింది. ఈఎన్నికల్లో ఆయన రికార్డును ఆయనే బద్దలుకొట్టడం విశేషం. ఎర్రబెల్లి డబుల్ హ్యాట్రిక్ ఎర్రబెల్లి దయాకర్‌రావు వరుసగా ఆరు విజయాలను నమోదు చేసుకుని డబుల్ హ్యాట్రిక్ సాధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1952 నుంచి 2018 వరకు కొనసాగిన శాసనసభ సభ్యుల ఎన్నికల్లో వరుసగా ఓటమి లేకుండా గెలిచిన నేతగా ఎర్రబెల్లి దయాకర్‌రావు రికార్డు సాధించారు. 1994లో వర్ధన్నపేట నుంచి టీడీపీ తరఫున తొలిసారి బరిలోకి దిగిన ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన వరదరాజేశ్వర్‌రావు మీద 22,175 ఓట్ల మెజార్టీతో గెలుపొంది శాసన సభలోకి ప్రవేశించారు. ఆ తర్వాత వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2009లో వర్ధన్నపేట నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ కావడంతో పాలకుర్తి నుంచి పోటీ చేసి అప్పటి పాత చెన్నూరు నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావును వరుసగా రెండు సార్లు ఓడించారు. 2008 ఉప ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 4386 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి పి.రామేశ్వర్‌రెడ్డిని ఓడించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి జంగా రాఘవరెడ్డిపై 53,053 ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది డబుల్ హ్యాట్రిక్ రికార్డును సొంతం చేసుకున్నారు. -
‘ఏపీలో దోచి.. కూకట్‌పల్లిలో..’
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌లో అక్రమాలకు పాల్పడి దోచిన సొమ్ముతో చంద్రబాబు కూకట్పల్లి నియోజకవర్గంలో గెలవడానికి విశ్వప్రయంత్నం చేశారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. బాబు మీద ఉన్న వ్యతిరేకతతోనే సుహాసిని ఓడిపోయిందని అన్నారు. ‘చక్రాలు తిప్పే మన వీరుడి వల్లే తెలంగాణలో కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతింది. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే గట్టి పోటీ ఉండేది’ అని పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లో రోడ్లు, అంగన్వాడీలు, స్మశానాలకు కేంద్రకే నిధులిస్తోందని తెలిపారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ తన బాబు సొమ్ములాగా రోడ్లకు తన పేరు పెట్టుకుంటున్నారని నిప్పులు చెరిగారు. బీజేపీపై తెలుగుదేశం నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కరపత్రాల రూపంలో ఇంటింటికీ ప్రచారం చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో జరిగే ప్రతిపనికి నిధులు కేంద్రమే ఇస్తోందని చెప్పారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులు టీడీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. కూటమి పేరుతో ఎన్ని పార్టీలు జట్టుకట్టినా మోదీ ఇమేజ్ను తగ్గించలేరని ధీమా వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లో మూడు దఫాలుగా అధికారంలో ఉండడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడడం సహజమేనన్నారు. -
‘టీడీపీ గోవిందా.. గోవిందా..’
సాక్షి, కాకినాడ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించింది. టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా బద్ధ శత్రువులైన కాంగ్రెస్, టీడీపీలు కూటమి రాజకీయాలకు తెరలేపిన సంగతి తెలిసిందే. కూటమి పేరుతో చంద్రబాబు తెలంగాణలో రాజకీయాలు చేయడం ప్రజలెవరూ ఆమోదించలేదు. టీఆర్ఎస్ పార్టీ దరిదాపుల్లోకి కూడా ‘కూటమి’ చేరలేకపోయింది. ఆంధ్రప్రదేశ్ పాలన గాలికొదిలేసి బాబు పక్క రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టడమేంటని పలువురు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పారని కాపు ఉద్యమనేత మద్రగడ పద్మనాభం అన్నారు. తెలంగాణలో టీడీపీ ఓటమిపై ఆయన స్పందిస్తూ.. టీడీపీ పని గోవిందా గోవిందా అంటూ కాపు నేతలతో కలిసి నినాదాలు చేశారు. కిర్లంపూడిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేసీఆర్‌కు నా అభినందనలు. ఓ గజ దొంగను అధికారంలో పాలుపంచుకోనివ్వకుండా కొలుకోలేని దెబ్బ కొట్టిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. ఎందరో త్యాగాల ఫలంతో రాష్ట్రం సాధించుకున్నారు. అటువంటి తెలంగాణలో వేలు పెట్టడం ఎంతవరకు సమాంజసమో చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏపీలో ఉన్న వనరులు సరిపోక తెలంగాణలో ఉన్న వనరులపై కన్నేసిన చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులకు తెలంగాణ ప్రజలు తగిన బుద్ది చెప్పారు’అని వ్యాఖ్యానించారు. -
భువనగిరి జిల్లాపై గులాబీజెండా మరోమారు..
సాక్షి, యాదాద్రి : యాదాద్రిభువనగిరి జిల్లాపై గులాబీజెండా మరోమారు ఎగిరింది. ఉద్యమ కాలం నుంచి గులాబీ జెండాకు వందనం చేస్తున్న భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు మరోసారి జెండాను రెపరెపలాడించారు. ప్రజాకూటమికి ప్రజల అంగీకారం లభించలేదు. నిశ్శబ్ద విప్లవంలా అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ ప్రభుత్వ పథకాలకు ఆమోదం తెలుపుతూ కారు గుర్తుకు ఓట్లు వేశారు. దీంతో భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో ఆపార్టీ అభ్యర్థులు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి విజయం సాధించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆమోదముద్ర వేస్తూ ప్రజలు తీర్పు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. సాగు, తాగునీటితోపాటు రైతుబంధు, ఆసరా పింఛన్లు, 24గంటల విద్యుత్, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, గొర్రెల, చేపల పంపిణీ వంటి పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఒక దిశలో తీవ్ర పోటీ ఇస్తుందనుకున్న ప్రజాకూటమి భారీ ఓటమి మూటగట్టుకుంది. తొలిరౌండ్ నుంచే ఆధిక్యత భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో తొలిరౌండ్ నుంచే టీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకుపోయారు. భువనగిరిలో 18రౌండ్లు, ఆలేరులో 22రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. భువనగిరి లో టీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి సమీప ప్రత్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిపై 24,063ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అయితే లెక్కింపులో భువనగిరి, భువనగిరిపట్టణం, బీబీ నగర్, పోచంపల్లి మండలాల్లో టీఆర్ఎస్కు సం పూర్ణ ఆధిక్యత లభించింది. పోచంపల్లి మండలం లో 16రౌండ్లలో ఆధిక్యత నిలుపుకోగా 17, 18 రౌండ్లలో వలిగొండ మండలంలో కాంగ్రెస్‌కు ఆధిక్యత లభించింది. ప్రజాకూటమి అభ్యర్థిగా పో టీ చేసిన కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి 61413 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పోతంశెట్టి వెంకటేశ్వర్లుకు 33,560 ఓట్లు వచ్చాయి. ఈసారి కాంగ్రెస్‌కు టీడీపీ, సీపీ ఐ, టీజేఎస్ పొత్తుతో పోటీలో నిలిచింది. అయితే ఆపార్టీకి గణనీయంగా 27, 853 ఓట్లు పెరిగాయి. బీజేపీ మద్దతుతో పోటీ చేసిన యువతెలంగాణ అభ్యర్థి జిట్టా బాలకృష్ణారెడ్డికి 13,427ఓట్లు లభిం చాయి.గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 39,179ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలి చిన ఆయన ఈఎన్నికల్లో మూడోస్థానంతో సరిపె ట్టుకున్నారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన పోచంపల్లి రమణరావుకు 3,613 ఓట్లు రాగా, సీపీఎం తరపున పోటీ చేసిన కల్లూరి మల్లేశంకు 1856 ఓట్లు వచ్చాయి. ఆతర్వాత స్థానాల్లో ఆలకుంట్ల ఎల్లయ్య 1758, దేవరకొండ హన్మంతు 1305 ఓట్లు లభించాయి. నోటాకు 1347 వచ్చాయి. ఇం డిపెండెంట్ అభ్యర్థులు 1000లోపు ఓట్లు సాధించారు. ‘గొంగిడి’ రెండోసారి ఆలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గొం గిడి సునీతామహేందర్‌రెడ్డి రెండోసారి విజయాన్ని సాధించారు. ఆమెకు 94, 870ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్‌కు 61,784 ఓట్లు రావడంతో గొంగిడి సునీత కాంగ్రెస్ అభ్యర్థిపై 33, 086 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2014 ఎన్నికల్లో 31,389ఓట్లతో గొంగిడి సునీత కాంగ్రెస్ అభ్యర్థి భిక్షమయ్యగౌడ్‌పై విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో భిక్షమయ్యగౌడ్‌కు 60,150ఓట్లు వచ్చాయి. గొంగిడి సునీతకు 91,539ఓట్లు వచ్చాయి. 31389మెజార్టీతో గెలి చారు. అయితే ఈఎన్నికల్లో బీఎల్ఎఫ్ తరఫున పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు 10,473ఓట్లతో తృతీయ స్థానంలో నిలి చారు. బీఎస్పీ తరఫున పోటీ చేసిన కల్లూరి రామచంద్రారెడ్డి 11,921ఓట్లను, బీజేపీ అభ్యర్థి దొంతిరి శ్రీధర్‌రెడ్డి 4,967ఓట్లను సాధించారు. పోటీలో ఉన్న మరో 9మంది ఇండిపెండెంట్లకు 5999 ఓట్లు లభించాయి. కాగా నోటాకు 1465మంది ఓటు వేసి పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరినీ అంగీకరించలేదు. ఫలించని కూటమి ప్రయత్నాలు భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో కూటమి ప్రయత్నాలు ఫలించలేదు. కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ, టీజేఎస్‌ల కూటమిలో కాంగ్రెస్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయింది. అయితే కూటమి ఓటు బదిలీ జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా చీలిపోవడంతో అధికార పార్టీకి లబ్ధి చేకూరగా, కూటమికి ఓటమి తప్పలేదు. ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్‌కు 2014 ఎన్నికల్లో 60,150 ఓట్లు రాగా ఇప్పుడు కూటమి అభ్యర్థిగా 61,784 ఓట్లు వచ్చాయి. అంటే కేవలం 1634 ఓట్లు మాత్రమే అదనంగా వచ్చాయి. కచ్చితమైన ఓటు బ్యాంకు కలిగిన కూట మిలోని పక్షాలైన టీడీపీ, సీపీఐల ఓట్లు ఏమైయ్యాయన్నది చర్చనీయాంశంగా మారింది. టీడీపీకీ చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీఎల్ఎఫ్ తరఫున ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగడంతో టీడీపీకి చెందిన ఓట్లు ఆయనకు బదిలీ అయ్యాయని ఆ పార్టీ నేతలు అంతర్మథనంలో ఉన్నారు. మోత్కుపల్లితో పాటు బీఎస్పీ అభ్యర్థి కల్లూరి రామచంద్రారెడ్డి, బీజేపీ అభ్యర్థి దొంతిరి శ్రీధర్‌రెడ్డి 27,361 ఓట్లను, ఇండిపెండెంట్లు 5999 ఓట్లు పొందారు. దీంతో వీరందరికీ 33,360 ఓట్లు వచ్చాయి. కూటమి అభ్యర్థి, ఇతర పార్టీల అభ్యర్థుల ఓట్లన్ని కలిపితే టీఆర్ఎస్ మెజార్టీ కంటే ఎక్కువగా ఉన్నాయి. నియోజకవర్గం : ఆలేరు 2018లో విజేత : గొంగిడి సునీత (టీఆర్ఎస్) వచ్చిన ఓట్లు: 94870 ప్రత్యర్థి: బూడిద భిక్షమయ్యగౌడ్ (కాంగ్రెస్) వచ్చిన ఓట్లు: 61784 మెజార్టీ: 33086 2014 ఎన్నికల్లో : విజేత గొంగిడి సునీతకు వచ్చిన ఓట్లు : 91,539 ప్రత్యర్థి: బూడిద భిక్షమయ్యగౌడ్‌కు వచ్చిన ఓట్లు : 60150 మెజార్టీ : 31389 నియోజకవర్గం: భువనగిరి 2018లో విజేత: పైళ్ల శేఖర్‌రెడ్డి(టీఆర్ఎస్) వచ్చిన ఓట్లు: 85,476 ప్రత్యర్థి: కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి వచ్చిన ఓట్లు:61413 మెజార్టీ: 24,063 2014 ఎన్నికల్లో విజేత :పైళ్ల శేఖర్‌రెడ్డికి వచ్చిన ఓట్లు: 54,347 ప్రత్యర్థి :జిట్టా బాలకృష్ణారెడ్డి(స్వతంత్ర) వచ్చిన ఓట్లు: 39,179 మెజార్టీ: 15,168 -
అయిదు రాష్ట్రాల్లో తుది ఫలితాలు ఇలా..
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్కంఠ రేకెత్తించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలు వెల్లడయ్యాయి. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా పరిగణించిన ఈ ఫలితాలు కాంగ్రెస్‌లో నూతనోత్సహం నింపగా, బీజేపీని నిరాశపరిచాయి. రాజస్ధాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో పాలక బీజేపీని కాంగ్రెస్ మట్టికరిపించింది. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ భారీ మెజారిటీతో మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఈశాన్య రాష్ట్రం మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ విస్పష్ట మెజారిటీ సాధించింది. మధ్యప్రదేశ్, రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ చెప్పుకోదగిన ఫలితాలు సాధించింది. మధ్యప్రదేశ్‌లో బీఎస్పీతో పాటు స్వతంత్ర అభ్యర్ధులు కీలకంగా మారారు. ఆయా రాష్ట్రాల్లో వివిధ పార్టీలు సాధించిన స్ధానాల వివరాలు.. తెలంగాణ.. తెలంగాణలో 119 స్ధానాల్లో టీఆర్ఎస్ 88 స్ధానాల్లో గెలుపొంది తిరుగులేని మెజారిటీ సాధించింది. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితిలతో కూడిన మహాకూటమిని మట్టికరిపించి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. కారు జోరుకు కుదేలైన కాంగ్రెస్ కూటమి 21 స్ధానాలకు పరిమితమైంది. ఎంఐఎం 7 స్థానాల్లో గెలిచింది. బీజేపీ ఒక స్ధానంలో, ఇతరులు 2 స్ధానాల్లో విజయం సాధించారు. టీఆర్ఎస్కు 97,00,749 ఓట్లు (46.9 శాతం), కాంగ్రెస్‌కు 58,83,111 ఓట్లు (28.4 శాతం), బీజేపీ 14,50,456 ఓట్లు (7.0 శాతం), టీడీపీ 7,25,845(3.5 శాతం), స్వతంత్రులు 6,73,694 ఓట్లు (3.3 శాతం), ఎంఐఎం 5,61,089 ఓట్లు (2.7 శాతం), బీఎస్పీ 4,28,430 ఓట్లు (2.7 శాతం), ఎస్ఎంఎఫ్బీ 1,72,304 ఓట్లు (0.8 శాతం), ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 1,72,304 ఓట్లు (0.8 శాతం), బహుజన లెఫ్ట్ ఫ్రంట్ 1,14,432 ఓట్లు(0.7 శాతం) వచ్చాయి. మధ్యప్రదేశ్.. మధ్యప్రదేశ్‌లో హోరాహోరీ పోరుసాగినా చివరకు కాంగ్రెస్ పైచేయి సాధించింది. మొత్తం 230 స్ధానాలకు గాను కాంగ్రెస్ 114 స్ధానాల్లో విజయం సాధించగా, బీజేపీ 109 స్ధానాల్లో గెలుపొందింది. బీఎస్పీ రెండు స్ధానాలు గెలుచుకోగా, ఇతరులు అయిదు స్ధానాల్లో గెలుపొందారు. మధ్యప్రదేశ్‌లో స్వతంత్రులు, బీఎస్పీ ఎమ్మెల్యేలు కీలకంగా మారారు. బీజేపీకి 1,56,42,980 ఓట్లు(41శాతం), కాంగ్రెస్‌కు 1,55,95,153 ఓట్లు (40.9 శాతం), ఇండిపెండెంట్లకు 22,18,230 ఓట్లు (5.8 శాతం), బీఎస్పీకి 19,11,642 ఓట్లు (5 శాతం), సీజీపీకి 6,75,648 ఓట్లు (1.8 శాతం), ఎస్పీకి 4,96,025 ఓట్లు (1.3 శాతం), ఏఏఏపీకి 2,53,101 ఓట్లు (0.4 శాతం), ఎస్పీఏకేపీకి 1,56,486 ఓట్లు (0.4 శాతం), బీఏఎస్డీకి 78,692 ఓట్లు (0.2 శాతం), బీఎస్సీపీకి 71,278 ఓట్లు (0.2 శాతం) ఓట్లు లభించాయి. రాజస్ధాన్ ఎడారి రాష్ట్రం రాజస్ధాన్‌లో మొత్తం 200 స్ధానాలకు గాను 199 స్ధానాల్లో పోలింగ్ జరిగింది. కాంగ్రెస్ 99 స్ధానాలను హస్తగతం చేసుకోగా, బీజేపీ 73 స్ధానాల్లో గెలుపొందింది. బీఎస్పీ ఆరు స్ధానాల్లో, ఇతరులు అత్యధికంగా 21 స్ధానాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్‌కు 1,39,35,201 ఓట్లు (39.3 శాతం), బీజేపీకి 1,37,57,502 ఓట్లు (38.3 శాతం), ఇండిపెండెంట్లకు 33,72,206 ఓట్లు (9.5 శాతం), బీఎస్పీకి 14,10,995 ఓట్లు (4 శాతం), ఆర్‌ఎల్‌టీపీకి 8,56,038 ఓట్లు (2.4 శాతం), సీపీఎంకు 4,34,210 ఓట్లు (1.2 శాతం), బీజేపీకి 2,55,100 ఓట్లు (0.7 శాతం), ఏఏఏపీకి 1,35,826 ఓట్లు (0.4 శాతం), ఆర్సీడీకి 1,16,320 ఓట్లు (0.3 శాతం), బీవీహెచ్పీ 1,11,357 (0.3 శాతం) ఓట్లు లభించాయి. చత్తీస్‌గఢ్.. చత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 స్ధానాల్లో కాంగ్రెస్ మూడింట రెండొంతులు పైగా 68 స్ధానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ప్రభంజనంతో బీజేపీ బేజారైంది. పదిహేనేళ్ల పాటు చత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఎన్నికల్లో కేవలం 15 స్ధానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక అజిత్ జోగి నేతృత్వంలోని జేసీసీ 7 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌కు 61,44,192 ఓట్లు (43 శాతం), బీజేపీకి 47,07,141 ఓట్లు (33 శాతం), జేసీసీజేకు 10,86,531 ఓట్లు (7.6 శాతం), ఇండిపెండెంట్లకు 8,39,053 ఓట్లు (5.9 శాతం), బీఎస్పీకి 5,52,313 ఓట్లు (3.9 శాతం), జీజీపీకి 2,47,459 ఓట్లు (1.7 శాతం), ఏఏఏపీకి 1,23,526 ఓట్లు (0.9 శాతం), సీపీఐకి 48,255 ఓట్లు (0.3 శాతం), ఎస్హెచ్ఎస్కు 34,678 ఓట్లు(0.2 శాతం) దక్కాయి మిజోరం.. ఈశాన్య రాష్ట్రం మిజోరంలో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. మొత్తం 40 స్ధానాలకు గాను మిజో నేషనల్ ఫ్రంట్ 26 స్ధానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 5 స్ధానాలు, బీజేపీ ఒక స్ధానం దక్కించుకోగా, ఇతరులు 8 స్ధానాల్లో గెలుపొందారు. మిజో నేషనల్ ఫ్రంట్‌కు 2,37,305 ఓట్లు (37.6 శాతం), కాంగ్రెస్‌కు 1,90,412 ఓట్లు (30.2 శాతం),ఇండిపెండెంట్లకు 1,44,925 ఓట్లు (22.9 శాతం), బీజేపీకి 50,749 ఓట్లు (8 శాతం), ఎన్పీఈపీకి 3626 ఓట్లు (0.6 శాతం), పీఆర్ఐఎస్ఎంపీకి 1262 ఓట్లు (0.2 శాతం), నోటాకు 2917 ఓట్లు (0.5 శాతం) లభించాయి. -
జానా ఇలాకాలో టీఆర్ఎస్ తొలిసారిగా..
సాక్షిప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిం చింది. ముందస్తు ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు నాలుగు నియోజకవర్గాల్లో విజయం సాధించారు. మరో రెండు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. జిల్లాలో టీఆర్ఎస్ తొలిసారిగా నాలుగు నియోజకవర్గాల్లో ఖాతా తెరిచింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐనుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన మిర్యాలగూడ అభ్యర్థి ఎ¯.భాస్కర్‌రావు, దేవరకొండ అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్, నాగార్జునసాగర్‌లో నోముల నర్సింహయ్య, నల్లగొండలో కంచర్ల భూపాల్‌రెడ్డి గెలుపొందారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థిగా కంచర్ల రికార్డుకెక్కారు. గత ఎన్నికల్లో కంచర్ల ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఇక ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించిన కాంగ్రెస్ సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి పరాజయం పాలు కాగా, ఆయన ఇలాకాలో తొలిసారిగా టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. గత ఎన్నికల్లో జానా మీద పోటీచేసి ఓడిన నోముల నర్సింహయ్య ఈ ఎన్నికల్లో గెలుపొంది ఆయన జమానాకు తెరదించారు. జానా కోటలో గెలిచిన రెండో నేత నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డి తొలిసారిగా 1978 ఎన్నికల్లో జనతా పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రెండోసారి 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గుండెబోయిన రామ్మూర్తి యాదవ్‌పైన ఓడిపోయారు. 1994 ఓటమి తర్వాత జరిగిన వరుస ఎన్నికల్లో నాలుగు సార్లు జానా గెలుపొందారు. తిరిగి ఇరవై ఏళ్ల విరామం తర్వాతా అదే యాదవ సామాజిక వర్గానికి చెందిన నోమల నర్సింహయ్య చేతిలో జానా ఓడిపోవడం గమనార్హం. రెండు స్థానాలు కోల్పోయిన టీఆర్ఎస్ 2014 ఎన్నికల్లో తొలిసారి టీఆర్ఎస్ గెలిచిన రెం డు స్థానాలను ఈ ఎన్నికల్లో కోల్పోయింది. కమ్యూనిస్టులకు అడ్డగా అప్పటి దాకా నిలబడిన నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవగా, ఈసారి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. గతంలో ఇవే నియోజకవర్గాల నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేలుగా అరంగ్రేటం చేసిన వేములవీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి రెండోసారి ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో నకిరేకల్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చిరుమర్తి లింగయ్య ఈ ఎన్నికల్లో రెండో సారి గెలుపొందారు. అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా తొలిసారిగా విజయం సాధించా రు. కాగా, ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌పార్టీ 1967, 1972, 1978, 1983, 1999 ఎన్నికల్లో నాలుగు సార్లు విజయం సాధించింది. 2009లో మహాకూటమి పొత్తులో భాగంగా మునుగోడులో సీపీఐ గెలుపొందగా, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఓడిపోయారు. మళ్లీ మూడు ఎన్నికల విరామం తర్వాత రాజగోపాల్‌రెడ్డి రూపంలో కాంగ్రెస్‌ను విజయం వరించింది. జానా, కోమటిరెడ్డి పరాజయం... మహాకూటమి అధికారంలోకి వస్తే సీఎం రేసులో ఉన్నామని చెప్పుకున్న సీఎల్పీ మాజీ నేత కుం దూరు జానారెడ్డి, ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ కంచుకోటలుగా ఉన్న నల్లగొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో తొలిసారి టీఆర్ఎస్ఖా తా లో పడ్డాయి. 1983 నుంచి ఒక్క టర్మ్ మినహా సుధీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఉన్న ఘనత జానారెడ్డిదే. 1994 నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు గెలుస్తూ వస్తోన్న మాజీ మంత్రి, సీఎల్పీ మాజీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తొలిసారి ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన కంచర్ల భూపాల్‌రెడ్డి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొం దారు. దివగంత సీఎం వైఎస్ఆర్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేసిన ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో తన పదవికి రాజీనామా చేశారు. అయిదో సారి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డినా ఓటమి పాలయ్యారు. మిర్యాలగూడలో కారు హవా ! కాంగ్రెస్ కంచుకోటల్లో ఒకటైన మిర్యాలగూడ ని యోజకవర్గంలో సైతం కారు జోరు సాగింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలి చిన ఎన్.భాస్కర్‌రావు ఈసారి టీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచారు. ఈయన పైన బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ నియోజకవర్గంలో 13సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, ఏడు సార్లు గెలుపొందింది. సీపీఎం ఐ దు సార్లు విజ యం సాధిం చిం ది. అయితే ఈ ఎన్నికల్లో బీఎల్ఎఫ్పేరుతో సీపీఎం అభ్యర్థిగా బరిలో నిలిచిన జూలకంటిరంగారెడ్డి పదివేల ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దేవరకొండలో మూడోసారి రవీంద్ర గెలుపు దేవరకొండ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన రవీంద్రకుమార్ మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా గెలిచిన ఆయన టీఆర్ఎస్లో చేరారు. పార్టీ మారాక, ఈ సారి టీఆర్ఎస్ అభ్యర్థిగా రవీంద్రకుమార్ దేవరకొండలో గులాబీ ఖాతా తెరిచారు. 2004, 2014 ఎన్నికల్లో రవీంద్రకుమార్ కాంగ్రెస్, సీపీఐ పొత్తులో భాగంగా సీపీఐ నుంచి గెలిచారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో మహాకూటమి పొత్తులో భాగంగా సీపీఐ నుంచి పోటీ చేసిన రవీంద్ర కుమార్ ఓడిపోగా, కాంగ్రెస్ అభ్యర్థిగా బాలునాయక్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తిరిగి ఈ ఎన్నికల్లో వారిద్దరే ప్రత్యర్థులుగా బరిలో నిలిచారు.కాంగ్రెస్ నుంచి జెడ్పీ చైర్మ¯గా ఎన్నికైన బాలునాయక్ టీఆర్ఎస్లో చేరినప్పటికీ పార్టీ టికెట్ ఇవ్వకపోడంతో ఆయన సొంతగూటికి వెళ్లి టికెట్ తెచ్చుకుని పోటీ పడినా పరాజయం పాలయ్యారు. నల్లగొండ : కౌంటింగ్ కేంద్రంలో ఓట్లను లెక్కిస్తున్న అధికారులు -
ఓడితే కుంగిపోవాలా.. బ్రదర్?
సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్‌నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనూహ్య పరాజయంతో ఆయన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. నల్గొండ నియోజకవర్గం నుంచి గతంలో వరుసగా నాలుగు సార్లు విజయం సాధించిన కోమటిరెడ్డి ఈ సారి ఓటమి చవిచూశారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన వెంకట్ రెడ్డి.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తానే సీఎం అవుతానని కూడా ధీమా వ్యక్తం చేశారు. అయితే నల్గొండ ప్రజలు మాత్రం ఈ సారి వెంకట్ రెడ్డికి అవకాశం ఇవ్వకుండా మార్పును కోరుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాలరెడ్డిని 23,698 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ఓడితే కుంగిపోవాలా.. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం.. విజయం ఒక్కోసారి ఒక్కొక్కరిని వరిస్తుంది... గత 20 ఏళ్లుగా తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజలు ఈసారి మార్పు కోరుకున్నారని భావించిన వెంకట్ రెడ్డి.. ఏ మాత్రం కుంగిపోకుండా రోజువారిలాగే తన దినచర్యను కొనసాగిస్తున్నారు. బుధవారం ఉదయం హైదారాబాద్‌లోని జిమ్‌కి వెళ్లి ఉల్లాసంగా అందరితో కలిసి వ్యాయామం చేశారు. ఇక ఫలితాలపై ఈ రోజు నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. మరోవైపు అధిష్టానం ముందు పట్టుబట్టి సాధించుకున్న మునుగోడు, నకిరేకల్ సీట్లలో ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి, ప్రధాన అనచరుడు చిరుమర్తి లింగయ్యలు గెలుపొందారు. -
ఓట్ల పంట
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్కు తెలంగాణ రైతాంగం పూర్తి అండగా నిలిచింది. రైతుబంధు పథకం లబ్దిదారులు ఆ గులాబీ పార్టీకే మళ్లీ పట్టం గట్టారు. ఖరీఫ్, రబీలలో ఎకరాకు రూ.8 వేల చొప్పున ఇవ్వడంతో తమకు అన్నదాతల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుందని ఆశించిన టీఆర్ఎస్ వర్గాలకు ఓటు రూపంలో ఆశీర్వాదం లభించింది. సీజన్ ప్రారంభానికి ముందే సాగు ఖర్చు సహా విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి పెట్టుబడి సాయం ఎంతో అక్కరకు వచ్చిందన్న భావన రైతు వర్గాల్లో నెలకొంది. పైగా చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతీ రైతుకు వారికున్న భూమిని బట్టి ఎకరాకు రూ. 4వేల చొప్పున ఇవ్వడంతో అది ఓటు రూపంలోకి మారింది. రైతు బీమాతోనూ లబ్ది పొందుతున్నారు. రైతు చనిపోతే వారి కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం ఇస్తున్న తీరు కూడా ఓటుగా మారిందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రూ.10 వేల కోట్లు.. కోటి ఓట్లు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచి ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రారంభించిన సంగతి విదితమే. 58.33 లక్షల మంది రైతులకు రూ.5,730 కోట్లు పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయించింది. అందుకోసం ఏకంగా 58.98 లక్షల చెక్కులను ముద్రించింది. చివరకు ఖరీఫ్‌లో 50.91 లక్షల మంది రైతులకు చెక్కులు ఇచ్చారు. వారికి రూ. 5,256 కోట్లు అందజేశారు. అంటే ఒక్కో రైతుకు సరాసరి రూ.10,322 అందాయి. 50.91 లక్షల మంది రైతులకు ఇచ్చారంటే, ఆ కుటుంబంలో భార్య, 18 ఏళ్లకు పైబడిన వయసున్న కొడుకును కలిపినా దాదాపు 1.25 కోట్ల మంది రైతులు, వారి కుటుంబ సభ్యులు రైతుబంధుతో ప్రయోజనం పొందారు. ఒకవేళ కుమారులు విడిగా రైతుబంధు పథకం కింద లబ్ధిపొందారని అనుకున్నా రైతు, ఆయన భార్యతో కలిపినా కోటి మందికిపైగా నేరుగా లబ్దిపొందినట్లే. అంటే రాష్ట్రంలో 2.70 కోట్లకు పైగా ఓటర్లుంటే, అందులో హైదరాబాద్ ఓటర్లను మినహాయిస్తే 30 జిల్లాల ఓటర్ల సంఖ్య 2.33 కోట్ల మంది. అందులో రైతుబంధు ద్వారా లబ్దిపొందిన వారు కోటి మంది. అంటే ఏకంగా 42% మంది గ్రామీణ ఓటర్లు రైతుబంధు లబ్ధిదారులని తేలింది. ఇక ప్రస్తుత రబీ సీజన్లో ఇప్పటివరకు 44 లక్షల మంది రైతులకు రూ.4,725 కోట్లు రైతుబంధు సొమ్మును సర్కారు పంపిణీ చేసింది. అంటే సరాసరి ప్రతీ రైతుకు రూ.10,738 ఇచ్చారు. ఇలా రెండు సీజన్లకు కలిపి ఒక్కో రైతుకు దాదాపు రూ.21 వేలు ఇచ్చినట్లయింది. మొత్తంగా రెండు సీజన్ల కు కలిపి ఇప్పటివరకు దాదాపు రూ.10 వేల కోట్ల రైతు జేబుల్లోకి వెళ్లాయి. పైగా వచ్చే ఏడాది నుంచి ఎకరాకు రూ.10 వేలు ఇస్తా మని టీఆర్ఎస్ హామీ ఇవ్వడంతో రైతులు వారి వైపు మొగ్గుచూపారు. ఇటు రైతుబంధు లబ్ధిదారుల్లో ఐదెకరాల్లోపు రైతులే 68% మంది ఉన్నారు. అంటే వారంతా కూడా సన్న, చిన్నకారు రైతులేనని స్పష్టమవుతోంది. అందులో ఎకరాలోపున్న రైతులు 7.39%, 1–2 ఎకరాల మధ్య రైతులు 15.62%, 2–3 ఎకరాల మధ్య ఉన్న రైతులు 16.67%, 3–4 ఎకరాల మధ్య ఉన్న రైతులు 14.78%, 4–5 ఎకరాల మధ్య ఉన్నవారు 13.59% మంది ఉ న్నారు. ఐదెకరాల్లోపున్న రైతుల్లో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులే కావడంతో వారంతా టీఆర్ఎస్కే గంపగుత్తగా ఓట్లేశారు. -
టీడీపీ 'ఔట్'..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి టీడీపీ నిష్క్ర మించినట్టేనా? పార్టీ నేతలు వెళ్లిపోయినా కేడర్ మిగిలి ఉందంటూ ప్రగల్భాలకు పోయిన చంద్రబాబు అండ్ కో ఖేల్ ఖతం అయినట్లేనా? అంటే తాజా ఎన్నికల ఫలితాలు దాన్ని చెప్పకనే చెబుతున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో పోటీ చేసి 15 స్థానాలు గెలుచుకున్న ఆ పార్టీ.. ఈసారి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని కేవలం 2 స్థానాలకే పరిమి తమైంది. బాబు సహా ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు 40 మంది ఆర్థిక, అంగబలంతో రంగంలోకి దిగినా కేవలం ఖమ్మంలో 2 స్థానాలను గెలుచుకోవడం గమనార్హం. ఇకపై మిత్రులూ కష్టమే... ప్రతి ఎన్నికల్లోనూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసే అలవాటున్న టీడీపీకి తెలంగాణలో రానున్న కాలంలో రాజకీయ మిత్రుడు కూడా దొరికే అవకాశం లేదనే చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో కలసి పోటీ చేసిన బీజేపీతో పూర్తిస్థాయిలో తెగతెంపులైన నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునే అవకాశం లేదనేది రాజకీయ విశ్లేషకుల అంచ నా. దేశవ్యాప్తంగా సమీకరణలు ఎలా ఉన్నా.. ఈ ఫలితాలనుబట్టి తెలంగాణ వరకు కాంగ్రెస్–టీడీపీల మైత్రి కష్టమేననే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. టీడీపీ, చంద్రబాబు కారణంగానే కాంగ్రెస్ ఓటమి పాలయిందనే బలమైన వాదన కారణంగా కాంగ్రెస్, టీడీపీల మిత్రుత్వం ఈ ఎన్నికలతోనే ముగిసినట్లేనని, భవిష్యత్తులో ఈ పొత్తును కొనసాగించే సాహసం కాంగ్రెస్ చేయబోదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కమ్యూనిస్టులు, టీజేఎస్ లాంటి పార్టీలు కూడా టీడీపీతో కలసి వెళ్లేందుకు ముందుకు రావని, 2 అసెంబ్లీ స్థానాల బలంతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుండటం గమనార్హం. తెలుగు తమ్ముళ్ల నైరాశ్యం.. ఎన్నికల ఫలితాలు తెలుగు తమ్ముళ్లను పూర్తి నైరాశ్యంలో పడేశాయి. 13 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ 2 స్థానాల్లోనే గెలవడం, ఎక్కడా చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు రాకపోవడం ఆ పార్టీ కేడర్‌ను కకావికలం చేసింది. కాంగ్రెస్ జెండాలు మెడలో ఉన్నాయని, గౌరవప్రదమైన స్థానాలు, ఓట్లు దక్కుతాయనే ఆశతో ఉన్న వారంతా ఫలితాలను చూసి డీలాపడిపోయారు. కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్‌ల మద్దతుతో పోటీ చేస్తేనే గెలవలేకపోయిన తమ పార్టీ ఇక ఒంటరిగా మనుగడ సాధించలేదని తెలుగు తమ్ముళ్లే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
ఓడిన కాంగ్రెస్ హేమాహేమీలు..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ హేమాహేమీలంతా ఓటమిపాలయ్యారు. మంగళవారం వెల్లడైన ఫలితాల్లో కారు హవా ముందు కాంగ్రెస్ సీనియర్లు నిల వలేకపోయారు. కుందూరు జానారెడ్డితోపాటు ఆ పార్టీకి చెందిన సీనియర్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డి.కె.అరుణ, టి.జీవన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, కొండా సురేఖ, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, సర్వే సత్యనారాయణ, చిన్నారెడ్డి, బలరాంనాయక్, సుదర్శన్‌రెడ్డిలకు ప్రత్యర్థుల చేతిలో భంగపాటు ఎదురైంది. జానారెడ్డిపై రెండోసారి పోటీ పడిన నోముల నర్సింహయ్య (టీఆర్ఎస్) విజయం సాధిం చగలిగారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై కూడా తన ప్రత్యర్థి భూపాల్‌రెడ్డి రెండోసారి పోటీలోనే గెలుపొందారు. దీంతో ఈసారి శాసనసభలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, వనమా వెంకటేశ్వర రావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సబితా ఇంద్రారెడ్డిలతో పాటు సీతక్క, వీరయ్య, జగ్గారెడ్డి లాంటి మాజీ ఎమ్మెల్యేలతోనే ఆ పార్టీ సరిపెట్టు కోవాల్సి వచ్చింది. వీరితోపాటు కాంగ్రెస్ పక్షాన ఆరుగురు తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. జాజుల సురేందర్ (ఎల్లారెడ్డి), కందాల ఉపేందర్‌రెడ్డి (పాలేరు), హర్షవర్దన్‌రెడ్డి (కొల్లాపూర్), హరి ప్రియానాయక్ (ఇల్లెందు), పైలట్ రోహిత్‌రెడ్డి (తాండూరు) తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (మునుగోడు) కూడా తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభలోకి ప్రవేశించనున్నారు. పదవులున్న వాళ్లంతా...! టీపీసీసీ అధ్యక్షుడు, ఆ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ మినహా కాంగ్రెస్‌లో కీలక పదవుల్లో నేతలంతా ఓటమి పాలయ్యారు. ఏఐసీసీ కార్యదర్శులుగా ఉన్న వంశీచంద్‌రెడ్డి, చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, కో చైర్మన్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్ నేత డి.కె.అరుణ తదితరులు ఓటమి పాలైన జాబితాలో ఉన్నారు. కేంద్రమంత్రులుగా పనిచేసి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్‌లకు కూడా ఓటమి తప్పలేదు. -
ఖాతా తెరవని టీజేఎస్!
సాక్షి, హైదరాబాద్: ఉద్యమ ఆకాంక్షల సాధన లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఈ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలువలేకపోయింది. ఉద్యమ ఆకాంక్షల నినాదం పెద్దగా పని చేయలేదు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణపై ఒక కుటుంబం పెత్తనం చేస్తూ, ఇష్టానుసారం వనరులను దోచుకుంటూ, హక్కులను హరిస్తూ, నిరంకుశంగా పాలిస్తూ, ప్రజలధనాన్ని దుర్వినియోగం చేస్తుంటే మౌనంగా ఉండకూడదన్న సంకల్పంతోనే పార్టీ పెడుతున్నాం అంటూ ప్రజల ముందుకు వచ్చిన టీజేఎస్ ఈ ఎన్నికల్లో తన ఉనికిని కూడా చాటుకోలేకపోయింది. 2018 మార్చి 31న ఏర్పడిన టీజేఎస్.. ఏప్రిల్ 29న భారీ బహిరంగ సభతో ప్రజల ముందుకు వచ్చింది. ఈ ఎన్నికల్లో 4 స్థానాల్లో సొంతంగా, మరో 4 స్థానాల్లో ప్రజా కూటమిలో స్నేహపూర్వక పోటీ చేసినా ఒక్కచోట కూడా గెలువలేకపోయింది. కూటమిలో టీడీపీ భాగస్వామి కావడం, సభల్లో ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం చేయడంతో ప్రజలు కూటమిని కూడా తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్‌తో పాటు టీజేఎస్ కూడా తన ఉనికిని కో ల్పోయింది. టీజేఎస్ తరఫున మల్కాజిగిరి నుంచి పోటీ చేసిన కపిలవాయి దిలీప్‌కుమార్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. అంబర్‌పేటలో నిజ్జన రమేశ్‌ది అదే పరిస్థితి. వర్ధన్నపేటలో పి.దేవయ్య, సిద్దిపేటలో ఎం.భవాని రెండో స్థానంలో నిలిచారు. స్నేహపూర్వక పోటీ కింద వరంగల్ ఈస్ట్‌లో గాదె ఇన్నయ్య, దుబ్బాకలో రాజ్‌కుమార్, ఆసిఫాబాద్‌లో విజయ్‌కుమార్, ఖానాపూర్‌లో భీంరావును పోటీలో దింపినా పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. భవిష్యత్తు ఏంటి? టీజేఎస్‌కు ఒక్క సీటు కూడా రాకపోవడంతో పార్టీ భవిష్యత్తుపై చర్చ మొదలైంది. కూటమి అధికారం లోకి వస్తే కొన్ని ఎమ్మెల్సీ స్థానాలను తీసుకొని పార్టీ ని బలోపేతం చేసుకోవాలన్న ఆలోచనల్లో ఉన్న టీజేఎస్‌కు ఆ అవకాశమూ లేకుండాపోయింది. ఈ నేప థ్యంలో పార్టీ భవిష్యత్తుపై గందరగోళం నెలకొంది. -
కాంగ్రెస్ ఖల్లాస్!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ముందు, ఆ తర్వాత ప్రచారంలోనూ బలంగానే కనిపించిన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఫలితాల్లో మాత్రం దారుణంగా చతికిలపడింది. మంగళవారం వెల్లడయిన ఎన్నికల ఫలితాల్లో ఒక్క ఖమ్మం జిల్లా మినహా ఎక్కడా ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో, జీహెచ్ఎంసీ పరిధిలో (ఖమ్మం తప్ప) ఎక్కడా పట్టుమని నాలుగు సీట్లు సాధించలేని దుస్థితికి చేరుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 5, నల్ల గొండలో 4, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో 2 చొప్పున, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్, జీహెచ్ఎంసీ పరిధిలో రెండు స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది. కొత్త జిల్లాల వారిగా చూస్తే.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లో మెరుగైన ఫలితాలను సాధించగలిగింది. దక్షిణ తెలంగాణలో.. ఎన్నికల ప్రచారంలో వచ్చిన ఊపును చూసి.. దక్షిణ తెలంగాణలో మంచి ఫలితాలు సాధిస్తామని కాంగ్రెస్ ఆశించింది. దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలపై భారీ ఆశలు పెట్టుకుంది. కానీ, గత ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీ ఈ మూడు జిల్లాల్లో చావు దెబ్బ తింది. నల్లగొండలో గత ఎన్నికలలో ఐదు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలవగా, మరో స్థానంలో మిత్రపక్షమయిన సీపీఐ గెలుపొందింది. కానీ, ఈ ఎన్నికల్లో హుజూర్నగర్, మునుగోడు, నకిరేకల్ స్థానాల్లో మాత్రమే గెలిచింది. మహబూబ్‌నగర్‌లో 2014లో ఏడు చోట్ల విజయం సాధించిన కాంగ్రెస్ ఈసారి కేవలం ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జీహెచ్ఎంసీలో హుష్‌కాకి.. కీలకంగా భావించిన జీహెచ్ఎంసీ పరిధిలోనూ కాంగ్రెస్ ఘోరపరాభవాన్ని మూటగట్టుకుంది. మొత్తం 23 స్థానాల్లో కేవలం మహేశ్వరం, ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించింది. ఆంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీతో పొత్తు కలసివస్తుందని, తాము ఈసారి అనూహ్య ఫలితాలు సాధిస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పినప్పటికీ ఫలితం వేరోలా కనిపించింది. ఇక, పాతబస్తీలో ఎంఐఎంకు గట్టిపోటీ ఇస్తామని గొప్పలు చెప్పుకున్నా.. కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. ఒక్క నాంపల్లి నియోజకవర్గంలోనే కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు సాధించగలిగారు. ఒక్కమాటలో చెప్పాలంటే 2016లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలే మళ్లీ పునరావృతమయ్యాయి. ఈ దెబ్బతో.. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ కోలుకోవడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ 3 జిల్లాలోనే! కాంగ్రెస్ గెలిచిన స్థానాలను పరిశీలిస్తే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాలో మంచి ఫలితాలు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో 2014 ఎన్నికలలో గెలిచిన పాలేరు, మధిర స్థానాలను మళ్లీ నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఇప్పుడు కూడా ఆ స్థానాలను నిలబెట్టుకుంది. గత ఎన్నికల్లో గెలిచిన ఖమ్మం స్థానాన్ని ఈసారి పొత్తులో టీడీపీకి ఇచ్చి చతికిలపడింది. మహూబూబాబాద్ జిల్లా ఇల్లెందు స్థానాన్ని గత ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా నిలబెట్టుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయినప్పటికీ ఈసారి కొత్తగూడెం, భద్రాచలం, పినపాక స్థానాలను ఈసారి గెల్చుకుంది. ఇదే జిల్లాలోని అశ్వారావుపేటను టీడీపీకి ఇచ్చింది. అక్కడ టీడీపీ గెలిచింది. భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి, ములుగు, మంథని స్థానాల్లో గత ఎన్నికల్లో ఓడిపోయినా ఈసారి అనూహ్య గెలుపు సాధించింది. ములుగులో మంత్రి చందూలాల్‌ను కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క ఓడించారు. పాలేరులో కూడా మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి ఓడించగలిగారు. మంథనిలో మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.. టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుపై విజయం సాధించారు. -
రాహుల్.. ప్చ్!
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారం ఈసారి కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు కలసిరాలేదు. మొత్తం 17 చోట్ల జరిగిన సభల్లో 27 నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ముథోల్, కామారెడ్డి, చార్మినార్, కొడంగల్, ఖమ్మం, పాలేరు, మధిర, సనత్‌నగర్, నాంపల్లి, భూపాలపల్లి, పరకాల, మంథని, ములుగు, హుజూరాబాద్, ఆర్మూరు, బాల్కొండ, జుక్కల్, నిజామాబాద్ రూరల్, పరిగి, గద్వాల, ఆలంపూర్, తాండూరు, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కూకట్పల్లి, కోదాడల్లో రాహుల్ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ స్థానాల్లో కేవలం పాలేరు, భూపాలపల్లి, మంథని, తాండూరు, ములుగు నియోజకవర్గాల అభ్యర్థులు మాత్రమే గెలుపొందారు. మేడ్చల్‌లో నిర్వహించిన భారీ బహిరంగసభకు రాహుల్‌తోపాటు సోనియాగాంధీ కూడా హాజరయ్యారు. అయినా ఇక్కడా కాంగ్రెస్ అభ్యర్థికి ఓటమి తప్పలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం చేసిన 8 నియోజకవర్గాల్లో ఒక్క చోట కూడా కూటమి అభ్యర్థులు గెలుపొందలేదు. ఖమ్మం, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, సనత్‌నగర్, నాంపల్లి, కోదాడల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. మెరుగైన ఫలితం ఆశించా! తెలంగాణలో కాంగ్రెస్ మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తుందని ఆశించాను. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించింది. తెలంగాణ, మిజోరంలోనూ ఇలాగే సత్ఫలితాలుంటాయని భావించాను.ఒక్కో రాష్ట్రంలో పరిస్థితి ఒక్కో రకంగా ఉంటుంది. డిమాండ్లు కూడా వేర్వేరుగా ఉంటాయి. వాటికి అనుగుణంగా మేం నడుచుకుంటాం. ఈ విషయంపై ఆయా రాష్ట్రాల నేతలతో మాట్లాడి వారి స్పందనను బట్టి ముందుకెళ్తాం – రాహుల్ గాంధీ (ఢిల్లీలో మీడియా సమావేశంలో ) -
అసెంబ్లీలో రెడ్లదే రాజ్యం
కొత్త అసెంబ్లీకి ఎన్నికైన వారిలో అగ్రకులంలోని రెడ్ల హవా కొనసాగింది.ప్రధాన పార్టీలు కూడా వారికే ప్రాధాన్యం ఇవ్వడంతో అత్యధికంగా ఆ సామాజిక వర్గానికి చెందిన వారు 39 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరి తర్వాత అధికంగా 10 మంది వెలమలు గెలిచారు. బ్రాహ్మణ, వైశ్య వంటి వారిని కలిపి మొత్తం అగ్రకులాలకు చెందిన ఎమ్మెల్యేలు 52 మంది ఉన్నారు. బీసీలు అందరూ కలిపి 23 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో ఎక్కువగా మున్నూరు కాపులు తొమ్మిది మంది ఉండగా, యాదవులు ఐదుగురు, గౌడలు నలుగురు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19 ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో మాల, మాదిగలు చెరో తొమ్మిది స్థానాలు గెలువగా, నేతకాని వర్గం నుంచి ఒకరు గెలుపొందారు. ముస్లింలు ఎనిమిది స్థానాల్లో గెలవగా, ఇందులో ఏడుగురు ఎంఐఎం తరఫున గెలిచిన వారే ఉండగా, బోధన్ నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన షకీల్ విజయం సాధించారు. – సాక్షి, హైదరాబాద్ -
వికటించిన రాజకీయ కుట్ర!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పెద్ద కుట్ర పూర్తిగా వికటించింది. నలభయ్యేళ్ల ఇండస్ట్రీ అనికాలర్ ఎగరేసే ఓ నేత, ఏ ఎండకా గొడుగు పట్టే ఒక మీడియా సంస్థ అధినేత రాజకీయం–ఇండస్ట్రీల అవకాశవాద కలబోత ముసుగులో ఆడిన నాటకం రక్తికట్టకపోగా అసలుకే ఎసరు తెచ్చింది. ఆశించిన ఫలితమేదీ నెరవేర్చకపోగా మిణుకుమిణుకుమంటున్న వారి విశ్వసనీయతకూ పెద్ద గండికొట్టింది. తామొకటి తలిస్తే జనమొకటి తలచె అన్నట్లు ప్రజాతీర్పు వారి కుయుక్తులను చిత్తు చేసింది. బెట్టింగ్ ప్రపంచంలో ఎందరినో బోల్తా కొట్టించిన వారి ‘ఎత్తుగడ పార్ట్–2’ చివరకు చీకట్లో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారడం వరకే పరిమితమైంది. సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: ‘ఫలానా సర్వే ఏమైంది?, ఫలితం ఎందుకిలా భిన్నంగా వచ్చింది?, విపక్షాలు మరీ ఇంత ఘోరమా?’ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సామాన్యుల్లో ఎన్నో ప్రశ్నలు, ఎడతెగని సందేహాలు! దీనికి సమాధానం తెలియాలంటే వెనక్కి తిరిగి కాస్త లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలే వెలుగుచూస్తాయి. ఎగ్జిట్ పోల్ భ్రమ కల్పిస్తూ, సర్వే అని బుకాయిస్తూ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించిన ఎన్నికల ఫలితాలపై అంచనాలొక పెద్ద రాజకీయ వ్యూహం! నాన్చి నాన్చి నాడు ఈ అంచనాలను వెల్లడించడం వెనుక రాజకీయ ‘ఒత్తిళ్లు’ పనిచేసినట్లు ప్రచారం జరిగింది. ఆ గణాంకాలకు, ఇప్పు డు వెల్లడైన ఫలితాలకు పొంతన లేకపోవడాన్ని అన్వయించినప్పుడు నాటి ప్రచారం నిజమేనేమో అనిపిస్తుంది! ఇక రాబోయే ఎన్నికల్లో జనం ఇటువంటి ఎత్తుగడల్ని ముందే ‘ఛీ’కొట్టనున్నారు. అది రేపు జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికలైనా, లోక్‌సభకు జరిగే సాధారణ ఎన్నికలైనా వారిది ఇదే పరిస్థితి! ‘ఇక ఆక్టోపస్ పని ఔట్!’ అన్నది ప్రస్తుత జనవాణి. గెలుపును చిన్నబుచ్చే యత్నం... రెండోసారి అంచనాలు వెల్లడించినప్పుడు ప్రజాకూటమికి 65 స్థానాలు వస్తాయని, పాలక టీఆర్ఎస్కు 35 స్థానాలు వస్తాయని ‘సర్వే’క్షకుడు వెల్లడించారు. దానికితోడు ఓ అశాస్త్రీయమైన ఎర్రర్ మార్జిన్ ప్రకటించారు. పనిలో పనిగా ముందే ఓ రాయి వేసి ప్రత్యర్థి గెలిస్తే ఆ గెలుపును చిన్నది చేసి చూపే ప్రయ త్నం ప్రారంభించారు. తాము ఆశిస్తున్నట్టు పాలకపక్షం ఓడిపోయి, కూటమి గెలిస్తే సరేసరి! ‘ఆక్టోపస్ మళ్లీ సక్సెస్!’ అని బాకా ఊదుకోవచ్చు! కూటమే ఓడి, పాలకపక్షం తిరిగి గెలిస్తే.. ఏదో ఒక సాకు ముం దే సిద్ధం చేసుకున్నట్టు, ‘ఈసారి పోలింగ్‌ను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉన్నాయి, డబ్బు–మద్యం–ఇంకా ఇంకా... ఏవేవో ప్రభావలుండటం వల్ల పరిస్థితి ఎప్పటికప్పుడు మారుతోంది, అంచనా వేయడం మాకు కష్టమవుతోంది’ అని చెప్పడం వెను క ఉద్దేశం ఇదే! ఏ సర్వే అయినా, ఏ ఎగ్జిట్ పోల్ అయినా, ఎవరు ఎటు వేస్తున్నారు/వేయనున్నారు/వేశారు అన్నదే చూస్తారు తప్ప కారణాలు వెతికి, అంచనా తమకు చాలా కష్టంగా ఉందని ‘దీనాలాప న’ చేయరు! కానీ ఇక్కడ అదే చేశారు. ‘వీరు గెలిచే మరికొందరు స్వతంత్రుల’ని కొన్ని పేర్లు చెప్పి, ‘ఇంకొన్నిటి సమాచారం కూడా ఉంది కానీ అక్కడ నా మిత్రులు పోటీ చేస్తున్నారు కనుక అవి చాలా సున్నితమైనవి, నేను పేర్లు వెల్లడించను’ అని తన పక్షపాత ధోరణిని ఆయనే బయటపెట్టారు. ఇవి కల్లబొల్లి కబుర్లని తెలిసీ పతాక శీర్షికలు చేసి/బ్రేకింగ్ న్యూస్ ఇచ్చి సాను‘కుల’ మీడియా తరించిం దని ప్రత్యర్థి రాజకీయపక్షాల వారు విమర్శించింది కూడా ఇందుకే! ఇదంతా ఓ విశాల కుట్రలో భాగమ ని సాధారణ పరిశీలకులకు కూడా స్పష్టమైంది. ఎందుకీ తెగింపు? ఏది చేసినా నిర్దిష్ట ప్రయోజనాలు ఆశించే చేస్తారని ఎప్పట్నుంచో ఈ సర్వేల పెద్దమనిషికి పేరు. కాకతా ళీయంగానో, యాదృచ్ఛికంగానో 4 సార్లు నంబర్లు కలవగానే.... ఓ గొప్ప సెఫాలజిస్టని, రాజకీయ/ఎన్నికల ఫలితాల విశ్లేషకుడనే పేరు ప్రచారంలోకి వచ్చింది. తుది ఫలితాలకు దగ్గరగా ఉన్నపుడు ‘అబ్బో! అచ్చుగుద్దినట్టొచ్చింద’ని విస్తృత ప్రచారం చేసే సాను‘కుల’ మీడియా, నంబర్లు తేడా వచ్చినప్పుడు మాత్రం కిమ్మనదు. తప్పుడు విశ్వసనీయతను ముసుగు కప్పి మరీ కాపాడుతుంది. ఎప్పుడో మళ్లీ అవసరానికి పనికొస్తారు కదా అన్నది ఉమ్మడి ప్రయోజనం కావొ చ్చు! ఈ ఎన్నికల్లో కుట్రదారులు రెండంచెల నాటకమాడారు. ప్రజాక్షేత్రంలో అయోమయం సృష్టించి కూటమికి జవసత్వాలివ్వడం ఒకటైతే... బెట్టింగ్‌లకు ఆస్కారం పెంచడం రెండోది. సోదిలో కూడా లేని కూటమి దూసుకొస్తోందని, గెలుపు దిశగా పరుగెడుతోందని తప్పుడు రాతలు రాసిన అదే సాను‘కుల’ మీడియా ఈ చిలక జోస్యాలకు విస్తృత ప్రచారం కల్పించి వేదిక సిద్ధం చేస్తుంది. ఇప్పుడూ అదే జరిగింది. ‘ఈ ఎన్నికల్లో 10 మంది వరకు స్వ తంత్రులు గెలుస్తారు, ఇదుగో ఈ ఇద్దరివి పేర్లు...’ అని తిరుపతిలో ఆ పెద్దమనిషి వెల్లడించినది టీజర్! ఆ ఇద్దరూ అడ్రస్ లేకుండా పోయారు. నారాయణపేటలో కె.శివకుమార్‌రెడ్డి 15 వేల ఓట్ల తేడాతో ఓడిపోగా బోథ్‌లో అనిల్‌జాదవ్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇక మిగతా ఇండిపెండెంట్ల పరిస్థితి అంతే సంగతి! అంచనాల పేరిట కూటమికి సత్తువ తెచ్చే ఈ కుట్రకు తెరలేచింది మాత్రం మీడియా పెద్ద మనిషి, రాజకీయ నేతతో సదరు ‘సర్వే’క్షకుడి భోజన భేటీలో అన్నది ప్రచారం. ఇక తమ అంచనాల పార్ట్–2 నాటకం, తెలంగాణలో పోలింగ్ ముగిసిన రోజు సాయంత్రం 7 గంటలకు జరిగింది. ఆ సమయంలో విలేకరుల సమావేశమనగానే ఎవరైనా ‘ఎగ్జిట్ పోల్’ వివరాలు వెల్లడిస్తారేమో అనుకుంటారు. ఎగ్జిట్ పోల్ కాదని స్పష్టం చేసిన ఆయన... తాము సర్వే కూడా ఏమీ నిర్వహించలేదనీ ప్రకటించారు. ఎందుకిలా అంకెలు తరచూ మారుతున్నాయి? అని అడిగితే ‘మా వాళ్లు ఫీల్డులో ఉన్నారు, ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఇస్తున్నారు...’ అని చెప్పుకొచ్చారు. -
ఖాతా తెరవని లెఫ్ట్..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం–బీఎల్ఎఫ్ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయాయి. ఈ పక్షాలు విడివిడిగా పోటీచేసినా ఒక్క సీటు అయినా గెలవలేకపోయాయి. గత ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం చెరో సీటు సాధించగా, ఈసారి ఈ రెండు పార్టీలతో పాటు బీఎల్‌ఎఫ్‌కు కూడా శాసనసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 1999లో సీపీఐకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. మళ్లీ 15 ఏళ్ల తర్వాత ఆ పార్టీ మరోసారి అదే స్థితికి లోనైంది. సీపీఎం తొలిసారిగా శాసనసభలో ప్రాతినిధ్యం లేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. మూడుచోట్లా సీపీఐ ఓటమి... కాంగ్రెస్ ప్రజాఫ్రంట్ కూటమిలో భాగంగా కేటాయించిన 3 సీట్లలో సీపీఐ ఓటమి పాలైంది. ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కారణంగా ఆశించిన ప్రయోజనం నెరవేరకపోగా కనీసం ఒక్కస్థానంలో కూడా గెలవకపోవడం ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపనుంది. సీపీఐ, సీపీఎం, ఇతర వామపక్షాలు కలసి పోటీచేసి ఉంటే కనీసం వామపక్ష ఐక్యతకు ప్రాధాన్యం ఇచ్చినట్టుగా ఉండేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. హుస్నాబాద్ నుంచి పోటీచేసిన ఆ పార్టీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి 46,553 ఓట్లు సాధించి, టీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్‌కుమార్ చేతిలో 70,530 ఓట్లతేడాతో పరాజయం చవిచూశారు. ఆ పార్టీ రెండో సీటు వైరా (ఎస్టీ)లో సీపీఐ అభ్యర్థి బానోతు విజయ 32,757 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. బెల్లంపల్లి (ఎస్సీ) స్థానం నుంచి పోటీ చేసిన సీనియర్ నేత గుండా మల్లేశ్ కేవలం 3,600 ఓట్లతో నాలుగోస్థానానికి పరిమితమయ్యారు. బీఎల్ఎఫ్ విఫలం.. ఈ ఎన్నికల్లో సీపీఎం–బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) కలసి మొత్తం 107 సీట్లలో పోటీచేశాయి. సీపీఎం 26 స్థానాల్లో పోటీచేయగా, పార్టీ బలంగా ఉందని భావిస్తున్న భద్రాచలంలో మూడోస్థానానికి, మిర్యాలగూడలో నాలుగోస్థానానికి పరిమితమైంది. భద్రాచలం మినహా మిగతా చోట్ల డిపాజిట్లు గల్లంత య్యే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యామ్నాయ విధానాలు–సామాజికన్యాయం పేరిట ప్రస్తుత ఎన్నికల్లో సీట్లు కాకపోయినా గణనీయంగా ఓట్లు అయినా సాధించవచ్చుననే కోరిక కూడా సీపీఎం–బీఎల్‌ఎఫ్‌లకు నెరవేరలేదు. బీఎల్ఎఫ్ అభ్యర్థి కె.శివకుమార్‌రెడ్డి 53,580 ఓట్లు సాధించి రెండోస్థానంలో నిలిచా రు. మధిరలో కోటా రాంబాబు 23,030 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. ఈచోట్ల మినహా మిగతా నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి నెలకొంది. గోషామహల్ నుంచి తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి చంద్రముఖిని బీఎల్ఎఫ్ బరిలో నిలిపినా కేవలం 120 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. -
కూటమికి చంద్ర'గ్రహణమే'!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల షాక్ నుంచి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి తేరుకోలేకపోతోంది. ‘అంతా బాగుందన్న పరి స్థితుల్లో.. ఎక్కడ దెబ్బతిన్నాం?’ అన్న ప్రశ్నే వారికి తొలిచివేస్తోంది. ‘ఎవరైనా ఓడించారా? ఒక తప్పుడు నిర్ణయంతో మనల్ని మనమే ఓడించుకున్నామా?’ అనే అంతర్మథనం సాగుతోంది. గట్టి పోటీ ఇవ్వడం నుంచి.. ఒక దశలో గెలుస్తామని భావించిన నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతినడమే వారి షాక్‌కి ప్రధాన కారణం. అయిదో వంతు కూడా రాని సీట్లతో.. సంఖ్యా పరంగానే కాకుండా ఎలా చూసినా ఇది మింగుడు పడని ఓటమే! ప్రాంతాలుగా గమ నించినా, జిల్లాలుగా విశ్లేషించుకున్నా, సామాజిక వర్గాలుగా లెక్కేసుకున్నా... ప్రజా కూటమిది మహాఓటమి. పాలకపక్షం టీఆర్ఎస్ జోరుకు విపక్ష కూటమి కకావికలైంది. ఇంతటి ఘోర పరాజయానికి కారణాల అన్వేషణ మొదలైంది. కూటమిని బలోపేతం చేస్తుందనుకున్న తెలుగుదేశంతో పొత్తు, ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు పాత్ర తమను నిలువునా ముంచిందనే భావన పార్టీ నేతల్లో వ్యక్తమౌతోంది. ఫలితాల సరళి కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తోంది. టీడీపీకి తెలంగాణలో ఇంకా బలముందని, ఆంధ్ర ఓటర్లు ఆదరిస్తారను కున్నా.. వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ కూటమికి పెద్ద దెబ్బే తగిలింది. శివారు రంగారెడ్డి నియోజకవర్గాల్ని కలుపుకొని ఉండే హైదరాబాద్ మహానగర్ ఫలితాలే ఇందుకు నిదర్శనం. ఖమ్మం టు శేరిలింగంపల్లి ఆయన కట్టానని చెప్పుకున్న ‘సైబరాబాద్’ లోని సైబర్టవర్స్ ఉన్న శేరిలింగంపల్లితో సహా.. బాబు రోడ్‌షోలు, సభలు పెట్టిన చోటల్లా కూటమికి ఓటమి తప్పలేదు. ఖమ్మం పట్టణం నుంచి కుత్బుల్లాపూర్ వరకు ఆయన సాగించిన ప్రచార ప్రస్థానంలో అంతటా ఓటమే. ఇలాం టిదేదో జరుగుతుందనే అభిప్రాయం కాంగ్రెస్‌లోనూ కొందరికి ముందు నుంచే ఉంది. కానీ, బహిరంగంగా చెప్పలేక పోయారు. ఆర్థికవనరులు సమకూర్చే కారణం చూపి, రాహుల్‌గాంధీనే చంద్రబాబు బుట్టలో పడేయ డంతో.. కింది స్థాయిలో వ్యతిరే కత ఉన్నా బయ టకు చెప్పలేకపోయారు. టీడీపీతో మనం జట్టు కట్టడం వల్ల లాభపడకపోగా నష్టపోతా మనే బల మైన అభిప్రాయముండి కూడా తామేమీ చేయలేక పోయామని ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితం అనుభవిస్తున్నామనే బాధ ఎక్కువ మంది కాంగ్రెస్ వాదుల్లో వ్యక్తమౌతోంది. ముఖ్య నేతలు ఓడిపోవడం పార్టీ శ్రేణులనూ నిరాశలోకి నెట్టింది. బాబొక చెల్లని రూపాయి సమకాలీన రాజకీయాల్లో విశ్వసనీయత కోల్పోయిన నాయకుడిగా చంద్రబాబుకున్న పేరు.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు వచ్చిన సానుకూలతను, కూటమి విజయావకాశాల్ని దెబ్బతీసింది. ‘ఇంకా బాబు పెత్తనమా? ఇక రాష్ట్రం ముందుకెళ్లనట్లే’ అనే నిర్లిప్తత తెలంగాణ సగటు పౌరుల్లో ఈ పొత్తుతోనే మొదలైంది. బలమైన కారణాలు లేకుండా అసెంబ్లీని రద్దుచేసి కేసీఆర్ ముందస్తుకు వెళ్లడం, ఒకే విడతలో 105 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఖరారు చేయడం తమకు అనుకూలిస్తోందని కాంగ్రెస్ ఉత్సా హంతో ఉన్న సమయంలో.. టీడీపీ వారితో జట్టు కట్టింది. ఈ అంశాన్ని తెలంగాణ సమాజం జీర్ణించు కోలేకపోయింది. ప్రసార మాధ్యమాల్లో ప్రచారం, బద్ధ వ్యతిరేకులతో కలవడం ద్వారా కూటమికి ప్రచారం వచ్చినా.. ప్రతి కూలించిన అంశాలే ఎక్కువ. నిర్దిష్టంగా కాంగ్రెస్‌ను తిట్ట డానికి ఏమీ లేని స్థితిలో కేసీఆర్‌కు చంద్రబాబు ఒక గొప్ప అవకాశంలా దొరి కారు. తన ప్రసంగాల్లోనూ సంక్షేమ, అభివృద్ది అంశాలతోపాటు.. చంద్రబాబుపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ‘బాబు ఎక్కడ కాలు పెట్టినా అంతే సంగతులు’, ‘కాళేశ్వరం కావాలా? శనేశ్వరం కావాలా? మీరే తేల్చుకొండ’ంటూ కేసిఆర్ వేసిన ప్రశ్న జనంలో ఆలోచనల్ని రేకెత్తించింది. పరాకాష్టకు చేరింది.. దేశంలోనే అతిపెద్ద అవినీతి పరుడుగా విమర్శల నెదుర్కొంటున్న బాబుతో చేతులు కలపడం వల్లే కాంగ్రెస్ అవకాశాలు మరింత సన్నగిల్లాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇక, హైదరాబాద్‌ను తానే ప్రపంచ పటంలోకి తెచ్చానని, సైబర్‌సిటీ కట్టానని, చివరకు దివంగత సీఎం వైఎస్సార్ ఆలోచన అయిన ఔటర్ రింగు రోడ్డు అంతర్జాతీయ విమానాశ్రయం, పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌హైవే వంటివీ తానే తెచ్చానని చంద్రబాబు రాహుల్ గాంధీ సమక్షంలోనే చెప్పుకోవడం పరాకాష్ట. ఏపీలో పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేల్ని పార్టీ మార్పించి, అందులో కొందరికి మంత్రిపదవులిచ్చి ఎన్ని విమర్శలొచ్చినా కిమ్మనని బాబు, ఇక్కడ అలా పార్టీ మారినవారందరినీ ఓడించమని పిలుపునివ్వడం చూసి ప్రజలు కేసీఆర్ ఆరోపణల్ని గట్టిగా నమ్మి కూటమిని తిరస్కరించారు. ఒకటొకటిగా బయటపడ్డ కుట్రలు.. ‘ఏపీలో వ్యవస్థల్ని కుప్పకూల్చి, ప్రజల్ని వంచించి దోచుకొచ్చిన రూ. వందల కోట్ల ధనాన్ని ఇక్కడ కుమ్మరిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త’ అంటూ ఇక్కడి అధికార పార్టీ చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. అది నిజమే అనిపించేలా, ప్రచారంతో సహా ఎన్నికల ఖర్చంతా తామే భరిస్తున్నట్టు, ప్రచారానికి హెలికాప్టర్లనూ తమ నేతే సమకూరుస్తున్నట్టు, కాంగ్రెస్‌లో కొందరు అభ్యర్థుల్నీ.. బాబే ఖరారు చేస్తు న్నట్టు ఆయన వర్గీయులు, అనుకూల మీడియా సంకేతాలు ఇచ్చింది. తెలంగాణలో ప్రభుత్వపు ఒంటెత్తుపోకడ నచ్చక, కాంగ్రెస్ వైపు ఏకీకృతం కావాలని భావించిన ఒకట్రెండు బలమైన సామాజిక వర్గాలు కూడా బాబు ‘ఆధిపత్యం’ కారణంగా.. కూటమికి దూరమయ్యారు. సర్వేల పేరుతో కొందరు చేసిన నానా యాగీ, బాబుకు అనుకూలంగా పనిచేసే కొన్ని ప్రసారమాధ్యమాలు ఉన్నవీ లేనివీ కల్పించి ప్రజాక్షేత్రంలో సృష్టించిన ‘అయోమయం’ కాంగ్రెస్ వర్గీయుల్లో లేని భ్రమల్ని కల్పించింది. నందమూరి వంశీయుల్ని తన ఎదుగుదలకు వాడుకునే తత్వంతో చంద్రబాబు వేసిన ఓ చౌకబారు ఎత్తుగడ కూడా ఫలించలేదు. -
పాపం పెద్దాయన..!
పెక్కు శాఖల మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో గుర్తింపు పొందిన కాంగ్రెస్ కురువృద్ధుడు కుందూరు జానారెడ్డి తన సుదీర్ఘ రాజకీయజీవితంలో రెండోసారి ఓడిపోయారు.తాజా ఎన్నికల్లో జానారెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య విజయం సాధించారు. 1983లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన వరుసగా 1983, 85, 89 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 1994లో వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో టీడీపీ అభ్యర్థి గుండెబోయిన రామ్మూర్తియాదవ్ చేతిలో 2 వేల పైచిలుకు ఓట్లతో ఓడిపోయారు. తాను ప్రచారం చేయాల్సిన పనిలేదని, ప్రచారం చేయకుండానే గెలుస్తానని చెప్పిన జానా ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం కొత్తగా ఏర్పడే ప్రభుత్వం సుపరిపాలన అందించాలి. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలి. అవి అమలు కాని పక్షంలో ఆందోళనలు జరిగే ప్రమాదం ఉంది. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయన్న విషయాన్ని ఎన్నికల సంఘానికి చెప్పినా పట్టించుకోలేదు. దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నాం. పోలైన ఓట్లకు వీవీ ప్యాట్లలో ఉన్న ఓట్లకు పొంతన లేదు. నా విజయం కోసం పార్టీ కార్యకర్తలు, నేతలు కష్టపడి పనిచేశారు. వారి కష్టాన్ని వృథాగా పోనివ్వను. నమ్మిన వారిని ఆదుకునేందుకు ఎప్పుడూ వెనుకాడబోను. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నది నా ఆకాంక్ష. పదవిరానందుకు, గెలవనందుకు బాధ లేదు. నాపై గెలిపొందిన నోముల నర్సింహయ్యకు శుభాకాంక్షలు. – జానారెడ్డి తన జీవితంలో తీరని కోరిక ఒకటి మిగిలిపోయిందని,మీరు సహకరిస్తే అది కూడా పూర్తవుతుందని నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు జానా గతంలో చెప్పారు. సీఎం కావాలన్న ఆయన కోరిక తీరకపోగా, సాగర్ ప్రజానీకం ఆయనను ఓటమిపాలు చేయడం గమనార్హం. – సాక్షి, హైదరాబాద్ -
హరీశ్ అదుర్స్...
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్, ఆ పార్టీ సిద్దిపేట అభ్యర్థి తన్నీరు హరీశ్‌రావు రికార్డుల మోత మోగించారు. తెలంగాణ జన సమితి అభ్యర్థి భవానీ మరికంటిపై ఏకంగా 1,18,699 ఓట్ల మెజారిటీతో గెలిచి అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో కొత్త రికార్డు సృష్టించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా హరీశ్ అరుదైన ఘనత సాధించారు. తెలంగాణతోపాటు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేగా హరీశ్‌రావు నిలిచారు. అలాగే అతిపిన్న వయసులో వరుసగా ఆరుసార్లు శాసనసభకు ఎన్నికై డబుల్ హ్యాట్రిక్ సాధించిన ప్రజాప్రతినిధిగా కూడా మరో రికార్డు సొంతం చేసుకున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత కె.ఎం. మణి (49 ఏళ్ల వయసులో) గతంలో అసెంబ్లీకి ఆరుసార్లు ఎన్నికవగా ప్రస్తుతం హరీశ్‌రావు 47 ఏళ్ల వయసులోనే ఈ రికార్డు సాధించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో సిద్దిపేట నియోజకవర్గం నుంచి వరుసగా ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు ఆయన వయసు 50 ఏళ్లు. అలాగే ఇప్పటివరకు ఐదుసార్లు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల డిపాజిట్ గల్లంతు చేసి హరీశ్ మరో రికార్డు నమోదు చేశారు. దీనికితోడు పోటీ చేసిన ప్రతిసారీ తన మెజారిటీని మరింత పెంచుకుంటూ విజయం సాధించారు. పోటీ చేసిన ఐదు వరుస ఎన్నికల్లోనూ పోలైన ఓట్లలో 80 శాతానికిపైగా ఓట్లు సాధించి ఇంకో రికార్డును సొంతం చేసుకున్నారు. గొప్ప గౌరవం ప్రజాజీవితంలో ఇంతకన్నా గొప్ప గౌరవం, ఇంతకన్నా అద్భుతమైన అనుభవం మరొకటి ఉండదు. సిద్దిపేటకు నేను ఇచ్చింది గోరంత. అది నాకు తిరిగి ఇచ్చింది కొండంత. జనం తిరగరాసినవి కేవలం ఎన్నికల రికార్డులనే కాదు... వారు ప్రతిసారీ తెలంగాణ చరిత్రనే తిరగరాస్తున్నారు. – టి.హరీశ్‌రావు -
కేసీఆర్ 2.0.. బ్లాక్ బస్టర్
మందలు, మందలుగా ‘స్టార్ క్యాంపెయినర్లు’ దండెత్తి వచ్చినా.. ‘సింహం సింగిల్‌గా’నే పోరాడింది. కేసీఆర్ జపించిన సంక్షేమ మంత్రానికి పల్లెలన్నీ పోలింగ్ బూత్‌లకు వరుసకట్టాయి. ఆయన మరోసారి సంధించిన ఆత్మగౌరవ బాణం పట్టణాల్లో ప్రభంజనాన్ని సృష్టించింది. బాబుతో పొత్తు కాంగ్రెస్ పుట్టి ముంచింది. బాబు అండ్ బావ మరిదిల ఓవర్ యాక్షన్‌ను జనం ఛీకొట్టారు. మరోసారి కేసీఆర్‌కు జైకొట్టారు. ఒక్క ఖమ్మం జిల్లా మినహా గులాబీ రథానికి ఎక్కడా ఎదురేలేకుండా పోయింది. హైదరాబాద్ నుంచే జాతీయ రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటా. ఇక్కడి నుంచి దేశంలో ఎక్కడికి వెళ్లాలన్నా పెద్ద సమస్య కాదు. రాష్ట్రాల్లో ఢిల్లీ పెత్తనం ఎందుకుండాలి? విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాలను రాష్ట్రాలకు వదిలేయకుండా కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటోంది. పాకిస్తాన్ సమస్యను పరిష్కరించే తెలివి లేదు గానీ.. రాష్ట్రాలపై పెత్తనమా?. తెలంగాణ వేదికగా దేశ రాజకీయాలను మార్చాల్సిన అవసరముంది. చంద్రబాబు ఇచ్చిన గిఫ్ట్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. లేకపోతే తెలంగాణ ప్రజలు సంస్కార హీనులు అనుకుంటారు. నేను ఇవ్వబోయే బహుమతి ప్రభావం ఎలా ఉంటుందో మీరే చూస్తారు. ఏపీలో బాబు పరిస్థితి సరిగా లేదు. ఆయనకు పైత్యం ఎక్కువైంది. ప్రధాని మోదీని చంద్రబాబు గతంలో హద్దులు లేకుండా పొగిడారు. అతిగా పొగిడే క్రమంలో ఆయన బోల్తా పడ్డారు. – మీడియాతో కేసీఆర్ తెలంగాణ గడ్డపై మళ్లీ టీఆర్ఎస్ జెండా రెపరెపలాడింది. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు జై కొట్టిన ప్రజలు ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వానికి అఖండ మెజార్టీతో ఆమోదం తెలిపారు. ధైర్యంగా ముందస్తు ఎన్నికలకు నిర్ణయం తీసుకోవడం, మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచిన కేసీఆర్.. ఫలితాల్లోనూ అదే జోరుకు కొనసాగించారు. ప్రచారంలో అన్నీ తానై పార్టీని ఒంటిచేత్తో నడిపించిన రాజకీయ యోధుడు మరోసారి తెలంగాణ ప్రజల ఆశీర్వాదాన్ని అందుకున్నాడు. కాంగ్రెస్‌కు ఊహించని దెబ్బకొట్టిన కేసీఆర్.. బీజేపీని దాదాపుగా గల్లంతు చేసినంత పనిచేశారు. తెలంగాణలో కారు జోరుకు ప్రొఫెసర్ కోదండరాం సార్ పార్టీ పత్తా లేకుండా పోయింది. ఈ అఖండ విజయంతో రాష్ట్ర రాజకీయాల్లో తనకు తిరుగులేదని గులాబీ దళపతి నిరూపించుకున్నారు. పదిహేను రోజుల్లో రాష్ట్రం మొత్తాన్ని చుట్టివచ్చిన ఒకే ఒక్కడుగా, టీఆర్ఎస్ ఏకైక స్టార్ క్యాంపెయినర్‌గా వాహ్వా అనిపించారు. సీఎంగా పగ్గాలు చేపట్టినప్పటినుంచి ప్రజా సంక్షేమంపైనే దృష్టిపెట్టి.. ఆ దిశగానే పథకాలు రూపొందించారు. అందుకే.. రైతుబంధు ఆయన్ను రారాజుగా నిలిపింది. కల్యాణæలక్ష్మి ఓట్ల వర్షం కురిపించింది. పింఛను పొందిన వారంతా బాసటగా నిలవడంతో టీఆర్ఎస్కు ఓట్ల పంట పండింది. మైనారిటీలు, బడుగు, బలహీనవర్గాల ప్రజలు మూకుమ్మడిగా అండగా నిలవడంతో గులాబీసేన తిరుగులేని ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు కూడబలుక్కుని కూటమిగా వచ్చినా కారు జోరు ముందు నిలవలేకపోయాయి. తెలంగాణను తామే అభివృద్ధి చేశానంటూ ప్రగల్భాలు పలికిన పచ్చపార్టీని 15 నుంచి 2 స్థానాలకే పరిమితం చేశారు. కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల్లో పాల్గొన్న తెలంగాణ జనసమితిని.. అయ్యా మీ కో‘దండం’ అంటూ ఇంటికి పంపించేశారు. రాహుల్ ‘షో’ లతో ఓట్లు రాలుతాయని భావించిన కాంగ్రెస్ పార్టీకి చివరకు ఘోర పరాభవమే మిగిలింది. మొత్తం 119 నియోజకవర్గాలకు గాను 88 స్థానాల్లో గెలిచిన టీఆర్ఎస్ ఎవరూ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. వరుసగా రెండోసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనం సృష్టించింది. రైతులు, పేద ప్రజల సంక్షేమ పథకాలు, పాలన సంస్కరణలతో తెలంగాణ ఉద్యమ రథ సారధి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చరిత్ర సృష్టించారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 88 స్థానాల్లో విజయఢంకా మోగించి వరుసగా రెండో సారి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. రైతన్నలకు ఎకరాకు 4 వేల రూపాయలు ఇవ్వడం ద్వారా యావత్ తెలంగాణను ఫిదా చేసిన కేసీఆర్.. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బీమా, రుణ మాఫీ, సామాజిక పింఛన్లు, కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్లు, కంటి వెలుగు వంటి పథకాలతో ప్రజల గుండెల్లో ఇంకా తానే ఉన్నానని నిరూపించారు. గత శాసనసభ ఎన్నికల్లో కేవలం తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగా 63 స్థానాలను నెగ్గిన టీఆర్ఎస్ ఈ సారి అభివృద్ధి, సంక్షేమం మంత్రంతో దూకుడు ప్రదర్శించి సంఖ్యా బలాన్ని 88కు పెంచుకుంది. సీఎం కేసీఆర్ గజ్వెల్లో 58,290 ఓట్ల భారీ మెజారిటీతో గెలవగా.. సిద్దిపేటలో మంత్రి తన్నీరు హరీశ్ రావు 1,18,699 ఓట్ల మెజారిటీతో విజయ దుందుభి మోగించి.. సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పారు. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కూడా 89,009 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. పార్టీ నుంచి మరో 15 మంది 50 వేలకు పైగా మెజారిటీని సాధించడం గమనార్హం. అంతటా టీఆర్ఎస్ గాలి వీచినా స్పీకర్ మధుసూదనాచారితో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పట్నం మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, చందులాల్ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ప్రజాకూటమికి పగటికలే! కాంగ్రెస్ నేతృత్వంలో టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీల కలయికతో ఏర్పడిన ప్రజాకూటమి ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని చవిచూసింది. కేసీఆర్‌ను గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతో ఎన్నికలకు ముందు పురుడుపోసుకున్న ఈ కూటమి కేవలం 21 అసెంబ్లీ స్థానాల్లో గెలుపుతో సరిపెట్టుకుంది. కూటమిలో సీట్ల సర్దుబాటులో భాగంగా 99 (నాలుగు సీట్లలో టీజేఎస్, కాంగ్రెస్ స్నేహపూర్వక పోటీ) చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 19 స్థానాల్లో గెలుపొందగా, 13 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ 2 స్థానాలకే పరిమితమైంది. 8 స్థానాల్లో పోటీ చేసిన టీజేఎస్, మూడు స్థానాల్లో పోటీ చేసిన సీపీఐ పార్టీలు కనీసం ఒక్క సీటునూ గెలవలేకపోయాయి. కేసీఆర్ హవా కారణంగా.. కాంగ్రెస్ సీనియర్ నేతలైన జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీకే అరుణ, జీవన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్‌అలీ, కొండాసురేఖ, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, బలరాం నాయక్, సర్వే సత్యనారాయణ, చిన్నారెడ్డి, బలరాం నాయక్, సుదర్శన్‌రెడ్డిలకు ఓటమి తప్పలేదు. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన ఏడు శాసనసభ స్థానాలను నిలబెట్టుకుని హైదరాబాద్ పాతబస్తీపై తన పట్టును నిలబెట్టుకుంది. రాజేంద్రనగర్‌లో పోటీ చేయడం ద్వారా పార్టీని నగరంలోని ఇతర ప్రాంతాలకు విస్తరింపజేసేందుకు మజ్లిస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీకి చావు తప్పి కన్ను లొట్టబోయింది. పార్టీ పోటీ చేసిన 118 స్థానాల్లో కేవలం ఒక్క స్థానంలోనే గెలుపొందింది. గోషామహల్ నుంచి రాజాసింగ్ గెలిచారు. ప్రధాని మోదీ, పార్టీ చీఫ్ అమిత్ షా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ప్రచారం నిర్వహించినా బీజేపీకి ఓట్లు రాలేదు. బీజేపీ ఎల్పీ నేత కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌లకు ఓటమి తప్పలేదు. ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్ పార్టీ రామగుండంలో, ఇండిపెండెంట్ అభ్యర్థి రాములు వైరాలో గెలుపొందారు. టీజేఎస్ ఎక్కడా కనీస పోటీని ఇవ్వలేకపోయింది. టీజేఎస్ పోటీ చేసిన చోట్లలో టీఆర్ఎస్కు భారీ మెజారిటీ దక్కింది. సీపీఎం, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కూటమి ప్రయోగం దారుణంగా విఫలమైంది. గత ఎన్నికల్లో ఒక సీటును గెలిచిన సీపీఎం ఈ సారి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మెజారిటీ రికార్డుల మోత 50,000+ టీఆర్ఎస్ నుంచి ఏకంగా 15 మంది సభ్యులు,ఎంఐఎం నుంచి ముగ్గురు ఈ ఘనతను అందుకున్నారు. టీఆర్ఎస్ నుంచి ఏకంగా 15 మంది సభ్యులు 50 వేలకు పైగా భారీ మెజారిటీతో గెలుపొందగా, ఎంఐఎం నుంచి ముగ్గురు ఈ ఘనతను అందుకున్నారు. వర్ధన్నపేట నుంచి ఆలూరి రమేశ్ (టీఆర్ఎస్) 99,240 ఓట్లు, మేడ్చల్ నుంచి జీహెచ్ మల్లారెడ్డి,(టీఆర్ఎస్) 87,990, బహదూర్‌పుర నుంచి మౌజం ఖాన్ (మజ్లిస్) 82,518 ఓట్లు, చాంద్రాయణగుట్ట అక్బరుద్దీన్ ఒవైసీ (మజ్లిస్)80,264, మల్కాజిగిరి నుంచి మైనంపల్లి హన్మంతరావు (టీఆర్ఎస్) 73,698, హుస్నాబాద్ నుంచి సతీష్‌కుమార్ (టీఆర్ఎస్) 70,530 ఓట్లు, దుబ్బాక నుంచి సోలిపేట రామలింగారెడ్డి (టీఆర్ఎస్) 62,500, జగిత్యాల నుంచి ఎం.సంజయ్‌కుమార్(టీఆర్ఎస్) 61,185 ఓట్లు, నారాయణ్‌ఖేడ్ నుంచి మహారెడ్డి గోపాల్ రెడ్డి (టీఆర్ఎస్) 58,508, రాజేంద్రనగర్ నుంచి ప్రకాశ్‌గౌడ్ (టీఆర్ఎస్) 58373, మహబూబ్‌నగర్ నుంచి శ్రీనివాస్ గౌడ్ (టీఆర్ఎస్) 57,775, నాగర్‌కర్నూల్ నుంచి మర్రి జనార్ధన్‌రెడ్డి (టీఆర్ఎస్) 54,354, పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు (టీఆర్ఎస్) 53,053, వనపర్తి నుంచి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (టీఆర్ఎస్) 51,586, కార్వాన్ నుంచి కౌసర్ మొహియుద్దీన్ (మజ్లిస్) 50,602 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. బొటాబొటిగా గట్టెక్కారు ఆసిఫాబాద్ నుంచి ఆత్రం సక్కు (కాంగ్రెస్) తన సమీప ప్రత్యర్థి కోవ లక్ష్మీ (టీఆర్ఎస్)పై కేవలం 171 ఓట్ల తేడాతో గెలుపొందగా, ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్(టీఆర్ఎస్) తన సమీప ప్రత్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (కాంగ్రెస్)పై 441 ఓట్ల తేడాతో గెలిచారు. ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (టీఆర్ఎస్) ప్రత్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి (బీఎస్పీ)పై 376 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. 37మంది తాజా మాజీల ఓటమి తెలంగాణ తొలి శాసనసభకు ఎన్నికైన 119 మంది తాజా మాజీ శాసనసభ్యుల్లో 82 మంది మళ్లీ శాసనసభకు తిరిగి ఎన్నిక కాగా, 37 మంది ఓడిపోయారు. 26 మంది తొలిసారిగా శాసనసభకు ఎంపికయ్యారు. వీరిలో టీఆర్ఎస్ నుంచి బాల్కసుమన్, సంజయ్‌కుమార్, సుంకె రవిశంకర్, మాణిక్‌రావు, చంటి క్రాంతి కిరణ్, నన్నపనేని నరేందర్, సీహెచ్ మల్లారెడ్డి, బేతి సుభాష్‌రెడ్డి, కొప్పుల మహేష్‌రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, పట్నం నరేందర్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, కంచర్ల భూపాల్ రెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జాజుల సురేందర్, కందాల ఉపేందర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, హరిప్రియా నాయక్, పైలట్ రోహిత్ రెడ్డి, టీడీపీ నుంచి మెచ్చ నాగేశ్వర్రావు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కోరుకంటి చందర్, స్వతంత్ర అభ్యర్థి లావుడ్య రాములనాయక్ ఉన్నారు. ఫలించిన కేసీఆర్ వ్యూహం 87సభలు 88సీట్లు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచార వ్యూహం ఫలించింది.2014 ఎన్నికల తరహాలోనే ముందస్తు ఎన్నికల్లోనూ ప్రచార ప్రణాళికను అమలు చేశారు. ప్రజా ఆశీర్వాద సభ పేరుతో నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో 119 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే 87 నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. వీటిలో 88 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రత్యర్థి పార్టీల కంటే ఉధృతంగా ప్రచారం చేశారు. ప్రజల దగ్గరికి నేరుగా వెళ్లి చేసిన పనులు, కొనసాగాల్సిన పనులను వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. కళ్ల ముందు అంతా కనిపిస్తోందని.. ప్రజలే అన్నీ పరిశీలించి ఓటు వేయాలని కోరారు. కేసీఆర్ ప్రచారంలో చెప్పిన అంశాలను ప్రజలు ఆమోదించారు. అన్నలు ఇంటికి.. తమ్ముళ్లు అసెంబ్లీకి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కొన్ని చోట్ల ఆసక్తికరంగా మారాయి. ఇప్పటి వరకు మండలికి ఎన్నికైన కొందరు మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే మరో ఆసక్తికర విషయమేంటంటే ఒకే కుటుంబంలో ఇద్దరు పోటీ చేయడం, వారిలో అన్నలు ఓడి పోయి ఇంటి దారిపడితే, తమ్ముళ్లు గెలిచి అసెంబ్లీ దారిపట్టారు. వికారాబాద్ జిల్లాలో తాండూరు నుంచి బరిలో ఉన్న మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో ఓడిపోయి ఇంటి బాట పట్టగా, మహేందర్‌రెడ్డి సోదరుడు నరేందర్‌రెడ్డి మాత్రం కొడంగల్‌లో రేవంత్‌రెడ్డిపై గెలిచి మండలి నుంచి అసెంబ్లీకి రాబోతున్నారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి సోదరుల్లో అన్న వెంకట్‌రెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి చేతిలో ఓడిపోగా, తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించి మండలి నుంచి అసెంబ్లీకి వెళ్లనున్నారు. మాజీ ఎంపీ మల్లు రవి జడ్చర్ల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మల్లు రవి సోదరుడు మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా మధిర నుంచి గెలుపొందారు. ఇక్కడ కూడా అన్న ఓటిమి పాలవ్వడం.. తమ్ముడు అసెంబ్లీకి వెళ్లనున్నారు. అయితే ఈ ముగ్గురిలో రాజగోపాల్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి ఇద్దరూ మండలి సభ్యులుగా ఉన్నారు. ఎమ్మెల్సీగా ఉంటూ అసెంబ్లీకి పోటీచేసిన మల్కాజిగిరి టీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు కూడా అసెంబ్లీకి ఎన్నికవడం విశేషం. మొత్తం ముగ్గురు ఎమ్మెల్సీలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. -
కేసీఆర్... ఎనిమిది సార్లు
సాక్షి, హైదరాబాద్ : ఈ మారు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కొందరు కొత్త రికార్డులు నమోదు చేశారు. పలువురు ఎక్కువసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. సీఎం కేసీఆర్ వరుసగా ఎనిమిదో సారి ఎమ్మెల్యేగా గెలిచి అందరి కంటే సీనియర్‌గా ఉన్నారు. సాధారణ, ఉప ఎన్నికలు కలిపి పలువురు పలుసార్లు విజయం సాధించారు. ఆరుమార్లు గెలిచిన వారు: ఎర్రబెల్లి దయాకర్‌రావు, డి.ఎస్.రెడ్యానాయక్, ముంతాజ్‌ఖాన్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, టి.హరీశ్‌రావు, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ముంతాజ్‌ఖాన్. ఐదుసార్లు : ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అక్బరుద్దీన్ ఓవైసీ, గంప గోవర్ధన్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జి.సాయన్న, నాలుగుసార్లు : ఎన్.దివాకర్‌రావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, చెన్నమనేని రమేశ్, సోలిపేట రామలింగారెడ్డి, పాషాఖాద్రి, వనమా వెంకటేశ్వర్రావు, బాజిరెడ్డి గోవర్దన్, కె.తారకరామారావు, తాటికొండ రాజయ్య, జోగు రామన్న, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, దాస్యం వినయ్‌భాస్కర్. మూడుసార్లు: హన్మంత్ షిండే, గంగుల కమలాకర్, తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, టి.ప్రకాశ్‌గౌడ్, మహ్మద్ బలాల, మౌజంఖాన్, టి.పద్మారావు, సి.లక్ష్మారెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, భట్టి విక్రమార్క, సండ్ర వెంకటవీరయ్య. -
రుజువైన గజ్వేల్ సెంటిమెంట్
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత నియోజకవర్గం సెంటిమెంట్ మరోసారి పునరావృతమైంది. గజ్వేల్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీ ప్రభుత్వం ఏర్పడుతోంది. ఈసారీ ఇదే జరిగింది. 2014లో కేసీఆర్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రచార గడువు ముగిసే రోజున గజ్వేల్‌లో నిర్వహించిన సభలో ‘గజ్వేల్‌లో ఏ పార్టీ గెలిస్తే అధికారం వారిదే. గజ్వేల్‌నుంచి నన్ను మీరు గెలిపిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలు టీఆర్ఎస్ను అధికారంలోకి తెస్తున్నారు’అని కేసీఆర్ అన్నారు. ఓటర్ల తీర్పు ఇలాగే వచ్చింది. కేసీఆర్‌కు ఇక్కడ ఈసారి భారీగా మెజారిటీ పెరిగింది. టీఆర్ఎస్కు సైతం సీట్లు అధికంగా పెరిగాయి. దేశం నలుమూలల నుంచీ... అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ రికార్డు స్థాయిలో స్థానాలు పొంది గెలుపొందడంతో కేసీఆర్‌కు దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖుులు మంగళవారం అభినందనలు తెలిపారు. దేశం నలుమూలల నుంచి ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, డీఎంకే కార్యదర్శి స్టాలిన్ ఫోన్లో సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలి పారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బిహార్ సీఎం నితీశ్‌కుమార్, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రసరస్వతి ఫోన్లో సీఎంకు అభినందనలు తెలిపారు. కేసీఆర్‌ను వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజాసంకల్పయాత్రలో ఉన్న జగన్ మంగళవారం కేసీఆర్‌కు ఫోన్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిని ఘన విజయం వైపు నడిపించినందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశారు. కేసీఆర్‌కు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. -
పనిచేయని ‘నమో’ మంత్రం!
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ ప్రజాకర్షణ శక్తి మంత్రం రాష్ట్రంలో పని చేయలేదు. అమిత్‌షా రాజకీయ చతురతకూ ఇక్కడ స్థానం లేకుండా పోయింది. భారతీయ జనతాపార్టీ జాతీయ స్థాయి రాజకీయ వ్యూహం తెలంగాణలో చతికిల పడిపోయింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధిక సీట్లను సాధించకపోగా, పార్టీకి ఉన్న స్థానాలను సైతం పోగొట్టుకుంది. గతంలో 5 స్థానాలు ఉంటే ఇప్పుడు ఒకే ఒక్క స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొత్తంగా 40 మందికి పైగా స్టార్ క్యాంపెయినర్లు రాష్ట్రంలో 20 రోజుల పాటు దాదాపు 180 బహిరంగ సభల ద్వారా ప్రచారం చేశారు. అయినా పార్టీ అభ్యర్థులు గెలువలేకపోవడం బీజేపీని తీవ్ర ఆందోళనలో పడేసింది. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటే 118 స్థానాల్లో బీజేపీ తొలిసారిగా పోటీ చేసింది. అందులో కేవలం ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకోవడం.. 117 స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఓడిపోవడం ఆ పార్టీని విస్మయ పరుస్తోంది. గత అసెంబ్లీలో పార్టీకి ప్రాతినిధ్యం వహించినవారిలో కూడా నలుగురు ఓడిపోవడంతో శ్రేణులు తీవ్ర నిరాశలో పడ్డాయి. కీలక భూమిక అనుకున్నా.. దేశంలో 19 రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తెచ్చింది మోదీ, అమిత్‌షా జోడి అని, తెలంగాణలో ఆ దిశగా కృషి చేస్తామని చెప్పిన పార్టీ నేతల మాటలను ప్రజలు పక్కన పెట్టేశారు. కాంగ్రెస్, టీడీపీల క్రియాత్మక పాత్రతో ఏర్పాటైన ‘ప్రజాకూటమి’ని సైతం ప్రజలు పెద్దగా నమ్మలేదు. మోదీ, అమిత్‌షా, ఇతర బీజేపీ పెద్దలు సుమారు 20 రోజుల పాటు రాష్ట్రాన్ని చుట్టేసినా ఓటర్లు పట్టించుకోలేదు. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని చెప్పిన బీజేపీ కనీసం కొత్త ప్రభుత్వంలో కీలక భూమిక పోషించాలన్న ఆలోచనతో భారీ ఎత్తున ప్రచారం చేపట్టింది. అయితే అది నిష్ప్రయోజనంగా మారింది. అతిరథుల ప్రచారం..ఆశ్చర్యకర ఫలితం.. గత నెల మొదటి వారం నుంచే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌చౌహాన్, మహరాష్ట్ర సీఎం ఫడ్నవీస్, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నితిన్‌గడ్కరీ, సాధ్వి నిరంజన్ జ్యోతి, సుష్మాస్వరాజ్, స్మృతి ఇరానీ, సంతోష్ గంగ్వార్, జేపీ నడ్డా, పురుషోత్తం రూపాల, జోయల్ ఓరమ్, స్వామి పరిపూర్ణానంద ప్రచారం చేసినా బీజేపీ అభ్యర్థులు గెలుపుబాట పట్టక పోవ డం ఆ పార్టీ శ్రేణులను ఆశ్చర్య చకితులను చేస్తోంది. ఓటర్లు ఈ ప్రచారానికి ప్రాధాన్యమివ్వలేదని రుజు వు చేశారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
కమలానికి దెబ్బ మీద దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: భారీ ఆశలు, అంచనాలతో ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీకి దారుణమైన దెబ్బ తగిలింది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఊహించని రీతిలో పార్టీ చతికిలపడిపోవడం పార్టీ శ్రేణులను తీవ్ర ఆందోళనలో పడేసింది. ప్రధాని నరేంద్రమోదీ సహా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బీజేపీ తన ప్రచారాన్ని హోరెత్తించినా రాష్ట్ర ఓటర్లను ప్రసన్నం చేసుకోలేకపోయింది. ఫలితంగా ఒక్కటి మినహా గతంలో ఉన్న స్థానాలను కూడా ఈసారి తిరిగి దక్కించుకోలేకపోయింది. పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, గతంలో పార్టీ అధ్యక్షుడిగా, శాసనసభలో పార్టీ పక్ష నేతగా ఉన్న కిషన్‌రెడ్డి కూడా ఓడిపోవడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్, మిజోరం, రాజస్తాన్‌లో ఆ పార్టీ పరాజయం పాలుకావడం, మధ్యప్రదేశ్‌లో పోటాపోటీగా ఉన్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో పడ్డాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వీలైనంత మేర ఓటుబ్యాంకును పెంచుకొని ఎక్కువ స్థానాలు గెలుపొంది సత్తా చాటాలనుకున్న పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలడంతో డీలా పడిపోయింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దిగవచ్చని ఆశలు పెట్టుకున్న కొంతమంది నేతలు ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాని స్థితిలో ఉన్నారు. 60కి పైగా స్థానాల్లో డిపాజిట్ గల్లంతు 118 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులను పోటీలో నిలిపినా 60కి పైగా స్థానాల్లో పార్టీ అభ్యర్థులకు దిపాజిట్ దక్కలేదు. 2014 ఎన్నికల్లో ఐదు స్థానాలను గెలుచుకున్న బీజేపీ మరో 10 స్థానాల్లో అప్పుడు రెండోస్థానంలో ఉంది. ఈసారి అంతకంటే దారుణమైన స్థితిలో పడిపోయింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అన్ని పార్టీల కంటే అత్యధికంగా 15 స్థానాలను మహిళలకు కేటాయించినా ఒక్క మహిళా అభ్యర్థి కూడా గెలవలేకపోయారు. ముగ్గురు తాజామాజీలైన కుంజ సత్యవతి(భద్రాచలం), బొడిగె శోభ (చొప్ప దండి), అరుణతార (జుక్కల్)లకూ ఓటమి తప్ప లేదు. గజ్వేల్‌లో పోటీ చేసిన మహిళామోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ కూడా ఓడిపోయారు. బీజేపీలో ఏక్ నిరంజన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదుగురు సిట్టింగుల్లో గోషామహల్ అభ్యర్థి రాజాసింగ్ మాత్రమే గెలుపొంది ఏక్ నిరంజన్‌గా నిలిచారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ తాజాగా అదే నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి గెలుపొందారు. దీంతో ఆ పార్టీకి అంసెబ్లీలో ఒక్కస్థానంతో ప్రాతినిథ్యం దక్కింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌సహా తాజా మాజీలైన కిషన్‌రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌తోపాటు సీనియర్ నేతలు ఎన్.రాంచందర్‌రావు, బద్దం బాల్‌రెడ్డి, యెండల లక్ష్మినారాయణ, తల్లోజు ఆచారి ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో పార్టీ కోలుకోలేని పరిస్థితిలో పడింది. తన గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు గోషామహల్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ పేర్కొన్నారు. తనను ఓడించడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని, ఓటర్లను డబ్బుతో ప్రలోభపెట్టారని, అయినా ప్రజలు తన పక్షానే ఉన్నారని అన్నారు. -
కూటమి ఓటమికి కారణాలెన్నో!
సాక్షి, హైదరాబాద్: కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు.. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాకూటమి ఓటమికి చాలా కారణాలే కనిపిస్తున్నాయి. భాగస్వామ్యపక్షాల మధ్య పొత్తు సర్దుబాట్ల నుంచి ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన వరకు అన్నీ ఆలస్యం కావడమే కూటమి కొంపముంచినట్లు తెలుస్తోంది. ఎన్నికల ఎత్తుగడలను అమలు చేయడంలో జాప్యం జరిగితే ఎంత నష్టం జరుగుతుందో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు చవిచూశాయి. లోపభూయిష్టంగా సీట్ల సర్దుబాటు, పొత్తు సర్దుబాట్లలో ఆలస్యం, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నామినేషన్ల గడువు ముగిసే రోజు వరకు తేలకపోవడం, స్నేహపూర్వక పోటీల పేరుతో గందరగోళం ఏర్పడటం, పార్టీ మేనిఫెస్టోలను ప్రజల్లోకి సరిగ్గా తీసుకెళ్లలేకపోవడంతో కారు జోరు ముందు కూటమి కునారిల్లింది. అడుగడుగునా సాగదీత : కూటమిని తుదిరూపు వరకు తీసుకురావడంలో ప్రతిపక్షాలు విఫలమైనందునే ఇంతటి ఘోరపరాభవాన్ని మూటకట్టుకోవాల్సి వచ్చిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. సెప్టెంబర్ 6న కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసిన తర్వాత 6 రోజులకే.. అంటే సెప్టెంబర్ 12న కూటమి పక్షాల తొలి సమావేశం జరిగింది. అక్కడి నుంచి నెమ్మదిగా అడుగులు వేస్తూ.. చర్చోపచర్చలు జరుపుతూ కూటమి ఏర్పాటును సాగదీశారు. చివరకు నామినేషన్ల గడువు ముగిసే నవంబర్ 19 ముందు రాత్రి వరకు అభ్యర్థులను ప్రకటిస్తూనే ఉన్నారు. నామినేషన్ల గడువు చివరి రోజున కూడా ఏ పార్టీ ఎక్కడ పోటీచేస్తుందనే దానిపై స్పష్టత లేకుండానే ఇష్టారాజ్యంగా నామినేషన్లు వేశారు. మొత్తం 90–95 స్థానాల్లో పోటీచేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఏకంగా 99 చోట్ల నామినేషన్లు దాఖలు చేసింది. టీజేఎస్‌కు కేటాయిస్తామని చెప్పిన చోట్ల కాంగ్రెస్ నామినేషన్లు వేయడంతో టీజేఎస్ కూడా కాంగ్రెస్ పోటీకి దిగిన చోట్ల నామినేషన్లు వేసింది. మహబూబ్‌నగర్‌లో టీడీపీ పోటీచేసిన స్థానంలోనూ టీజేఎస్ నామినేషన్ దాఖలు చేసింది. సీపీఐకిచ్చిన 3 స్థానాల్లో రెండు చోట్ల (హుస్నాబాద్, వైరా)లో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థులు బరిలో దిగారు. హుస్నాబాద్‌లో ఆ తర్వాత విరమించుకున్నా వైరాలో మాత్రం నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు. టీఆర్ఎస్కు కలిసొచ్చిన గందరగోళం సెప్టెంబర్ 12 నుంచి నవంబర్ 22 వరకు.. అంటే 72 రోజుల కసరత్తు తర్వాత కూడా సీట్ల సర్దుబాటులో స్పష్టత రాక స్నేహపూర్వక పోటీలతో గందరగోళం నెలకొంది. దీంతో కూటమి పక్షాల సర్దుబాటు సరిగా జరగలేదని, సీట్ల కోసం అన్ని పార్టీలు కొట్లాడుకుంటున్నాయనే భావన ప్రజలకు వచ్చింది. ఇదే గందరగోళం ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతుందనే ప్రచారం చేయడంలో టీఆర్ఎస్ సఫలీకృతమైంది. కూటమి సీట్లు పంచుకునేలోపు తాము స్వీట్లు పంచుకుంటామన్న టీఆర్ఎస్ నేతలు హేళన చేసే స్థితిలో సీట్ల సర్దుబాటు జాప్యం కావడం, గందరగోళం నెలకొనడం ప్రజల్లో కూటమి పట్ల సానుకూల అభిప్రాయాన్ని ఏర్పరచలేకపోయింది. ప్రజలకు చేరని మేనిఫెస్టోలు ఇక, ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తామనే విషయాన్ని కూడా కూటమి విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను పదేపదే వల్లెవేయడానికి పరిమితం అయ్యారే తప్ప ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆ పార్టీ నేతలు విఫలమయ్యారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, ఏడాదిలో లక్ష ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, పింఛన్లు రెట్టింపు, మహిళా సంఘాలకు గ్రాంట్లు, రుణాలు, పేద కుటుంబాలకు ఏడాదికి ఉచితంగా ఆరు ఎల్పీజీ సిలిండర్లు, ఉచిత రేషన్ తదితర ముఖ్య హామీలు ప్రజలను ఆకర్షితులను చేసే స్థాయిలో క్షేత్రస్థాయిలో ప్రచారం కాలేదు. దీనికి తోడు టీడీపీ మేనిఫెస్టోలో అమలు సాధ్యం కాని హామీలు, టీజేఎస్ మేనిఫెస్టోలోనూ ప్రజాకర్షక పథకాలు లేకపోవడం కూటమిని దెబ్బతీశాయి. అలాగే అమరుల ఎజెండా పేరుతో కూటమి పక్షాన ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా ప్రజలను ఆలోచింపజేసే హామీలను ఇవ్వలేదు. ఈ వైఫల్యాలన్నింటి నేపథ్యంలో ఓటరన్న కూటమిని కనికరించకుండానే కారుకు పట్టం కట్టాడని రాజకీయ విశ్లేషకులంటున్నారు. -
నోటాకు 2.24 లక్షల ఓట్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో నోటా (నన్ ఆఫ్ ద అబై వ్)కు గణనీయ సం ఖ్యలో ఓట్లు పడ్డాయి. 2,24,709 మంది ఓటర్లు (1.1 శాతం ఓట్లు) నోటాకు ఓటేశారు. రెండు చోట్లలో గెలుపొందిన అభ్యర్థుల మెజారిటీ కన్నా నోటాకు పడిన ఓట్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థిగా పోటీచేసిన మల్రెడ్డి రంగారెడ్డి కేవలం 376 ఓట్లతో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చేతుల్లో ఓటమి పాలు కాగా, ఇక్కడ నోటాకు 1,119 ఓట్లు పడ్డా యి. బీజేఎల్పీ మాజీ నేత జి.కిషన్‌రెడ్డి అంబర్‌పేటలో 1,016 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ చేతుల్లో ఓటమి పాలుకాగా, ఆ నియో జకవర్గంలో నోటాకు 1,462 ఓట్లు వచ్చాయి. ఖమ్మం, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో నోటా మూడోస్థానంలో నిలవడం విశేషం. ఇక 16 సీట్లలో నాలుగో స్థానంలో, 51 స్థానాల్లో ఐదోస్థానంలో నోటా నిలిచింది. ఓటర్లు ప్రధాన పార్టీల అభ్యర్థులపై తమ అసంతృప్తిని నోటాకు ఓటు వేయడం ద్వారా వ్యక్తం చేశారు. ఖమ్మంలో 3,513, శేరిలింగంపల్లిలో 3,637, హుజూరాబాద్‌లో 2,867 ఓట్లు నోటాకు పడ్డాయి. అలాగే అలంపూర్ (3,492), ములుగు (3,249), ఉప్ప ల్ (2,712), నర్సంపేట (2,436) అందోల్ (2,4 06), జగిత్యాల (2,203), చెన్నూర్(2,135), మంథని (2,083), నిజామాబాద్ –రూరల్ (2,2 03), సికింద్రాబాద్ (1,582), ముషీరాబాద్ (1,664), అచ్చంపేట (1,485), సనత్‌నగర్ (1,464), గోషామహల్లో 709 ఓట్లు వచ్చాయి. -
టీఆర్ఎస్లో ఫుల్ జోష్
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల్లో టీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ రావడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఫలితాల వెల్లడి మొదలైన నుంచి కారు జోరు చూపించడంతో మంగళవారం ఉదయం నుంచే తెలంగాణ భవన్లో కార్యకర్తలు ఫుల్‌జోష్‌లో కనిపించారు. టపాసులు కాలుస్తూ, నృత్యాలు చేస్తూ గులాల్ చల్లుకుంటూ ఆనందోత్సవాల్లో తేలిపోయారు. ‘జయహో కేసీఆర్’అంటూ ప్లకార్డులు పట్టుకొని జైతెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్, సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి కార్యకర్తలతో కలసి సంబరాల్లో పాల్గొన్నారు. ‘కేటీఆర్ జిందాబాద్, కాబోయే సీఎం’ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ టీఆర్ఎస్ భవన్‌కు వచ్చిన సమయంలో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మిగతా పార్టీల్లో నిస్తేజం.. టీఆర్ఎస్ జోరుతో మిగతాపార్టీల్లో పూర్తిగా నిస్తేజం అలముకుంది. గాంధీభవన్‌లో నేతల సందడి లేక వెలవెలబోయింది. సీనియర్ నేతలు జానారెడ్డి, రేవంత్, గీతారెడ్డి, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డీకే అరుణ, జీవన్‌రెడ్డి ఓటమి పాలవడంతో పార్టీ శ్రేణులు డీలాపడ్డాయి. మధ్యాహ్నం మూడు గంటలకు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గాంధీభవన్‌కు వచ్చినా సందడి లేదు కనబడలేదు. టీడీపీ, బీజేపీ, సీపీఐ కార్యాల యాలు పూర్తిగా కళతప్పాయి. నేతలెవరూ ఆ వైపు రాలేదు. టీజేఎస్ ఆఫీస్‌కు కోదండరాం ఒక్కరే వచ్చి మీడియాతో మాట్లాడి వెళ్లిపోయారు. -
నాలుగంటే 'నాలుగే'
2014 ఎన్నికల్లో గెలిచిన 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారి నాలుగు చోట్ల మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది.హుజూర్నగర్, పాలేరు, ఇల్లందు, మధిర నియోజకవర్గాలను మళ్లీ నిలబెట్టుకుంది. 2014లో గెలిచిన ముథోల్, జగిత్యాల, జహీరాబాద్, వనపర్తి, అలంపూర్, గద్వాల, నల్లగొండ, నాగార్జునసాగర్, కోదాడ, డోర్నకల్, ఖమ్మం, కల్వకుర్తి, చేవెళ్ల, నారాయణ్‌ఖేడ్, మిర్యాలగూడ, పరిగి, మక్తల్ స్థానాల్లో ఈసారి కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. అయితే, గత ఎన్నికలలో ఓడిపోయిన 15 స్థానాల్లో కాంగ్రెస్ ఈసారి గెలిచింది. ఎల్లారెడ్డి, కొల్లాపూర్, సంగారెడ్డి, మంథని, ములుగు, కొత్తగూడెం, ఆసిఫాబాద్, భూపాలపల్లి, మునుగోడు, నకిరేకల్, మహేశ్వరం, భద్రాచలం, పినపాక, వైరా, తాండూరు, ఎల్బీ నగర్ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ‘ఏజెన్సీలు’ హస్తగతం గిరిపుత్రులు హస్తానికే మొగ్గు చూపారు. తాజా ఎన్నికల ఫలితాల్లో కారు జోరు మీద ఉన్నా ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన ఓటర్లు మాత్రం కాంగ్రెస్‌వైపే ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో మూడు, ఏటూరు–నాగారం పరిధిలో రెండు, భద్రాచలం పరిధిలో 5 రిజర్వ్డ్ నియోజకవర్గాలున్నాయి. పది నియోజకవర్గాల్లో ఖానాపూర్, బోథ్ నియోజకవర్గాల్లోనే టీఆర్ఎస్ విజయం సాధించింది. వైరా నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందగా, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అశ్వారావుపేట నియోజకవర్గంలో కూటమి తరపున కాంగ్రెస్ బలపర్చిన టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. ఇటీవల ఏజెన్సీ ప్రాంతాల్లో లంబాడాలు, ఆదివాసీలకు మధ్య నెలకొన్న వివాదంలో ప్రభుత్వం సైతం పెద్దగా జోక్యం చేసుకోకపోవడంతో ఆదివాసీలు కాంగ్రెస్ వెపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. – సాక్షి, హైదరాబాద్ -
మంత్రివర్గంలో కొత్త ముఖాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరనున్న టీఆర్ఎస్ కొత్త మంత్రివర్గంలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. స్పీకర్ మధుసూదనాచారి, మంత్రు లు తుమ్మల నాగేశ్వర్రావు, ఆజ్మీరా చందూలాల్, జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్‌రెడ్డి ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో వారి స్థానాల్లో తీసుకోవాల్సిన కొత్త వారి జాబితాను సీఎం కేసీఆర్ ఇప్పటికే సిద్ధం చేశారు. తెలంగాణలో ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం ముఖ్యమంత్రితోపాటు 17 మందికి మంత్రివర్గంలో చోటు ఉండగా సామాజిక లెక్కల ప్రకారం చూస్తే సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, డి.ఎస్. రెడ్యానాయక్, పువ్వాడ అజయ్‌కుమార్‌లకు కొత్తగా అవకాశం లభించొచ్చని తెలుస్తోంది. జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్) స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన ఎర్రబెల్లి దయాకర్‌రావు (పాలకుర్తి) కు కేసీఆర్ అవకాశం ఇవ్వనున్నట్లు తెలిసింది. అలాగే పట్నం మహేందర్‌రెడ్డి (తాండూరు) స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (వనపర్తి)కి బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి అజ్మీరా చందూ లాల్ (ములుగు) స్థానంలో ఇదే జిల్లా నుంచి ఇదే సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి డి. ఎస్. రెడ్యానాయక్ (డోర్నకల్)ను కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ నుంచి పువ్వాడ అజయ్ కుమార్ (ఖమ్మం) మాత్రమే విజయం సాధించడం, ఈ జిల్లాకు చెందిన తుమ్మల ఓటమి పాలవడం, ఇద్దరూ ఒకే సామాజికవర్గం కావడంతో తుమ్మల స్థానంలో పువ్వాడకు కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది. భారీ మార్పులు ఉంటే... ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో మార్పులు చేయాలని భావిస్తే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, టి. పద్మారావుగౌడ్, జోగు రామన్న స్థానంలో అరూరి రమేశ్, కె.పి. వివేకానందగౌడ్, దానం నాగేందర్ పేర్లను పరిశీలించనున్నారు. సీఎం కేసీఆర్ తన జట్టును పూర్తిస్థాయిలో మార్చాలని భావిస్తే అనూహ్యంగా కొత్త వారి పేర్లు జాబితాలో ఉండనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారీ రెండు ఉప ముఖ్యమంత్రి పదవులను కొనసాగించే యోచనలోనే ఉన్నారు. ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డిలను మారిస్తే వారి స్థానంలో అరూరి రమేశ్ (వర్ధన్నపేట)కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన టి. పద్మారావుగౌడ్‌ను మారిస్తే కె.పి. వివేకానందగౌడ్ (కుత్బుల్లాపూర్)కు చోటు కల్పించే అవకాశం ఉంది. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంత్రి జోగు రామన్నను మార్చాల్సి వస్తే అదే సామాజిక వర్గానికి చెందిన దానం నాగేందర్ (ఖైరతాబాద్)కు బెర్త్ ఖాయం కానుంది. కాగా, సాధారణ ఎన్నికల్లో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రబెల్లి దయాకర్‌రావు, డి.ఎస్. రెడ్యానాయక్, ముంతాజ్‌ఖాన్ (యాకుత్‌పుర)లలో ఒకరిని ప్రొటెం స్పీకర్‌గా నియమించే అవకాశం ఉంది. అలాగే స్పీకర్‌గా ఈటల రాజేందర్ (హుజూరాబాద్) పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. నేడు టీఆర్ఎస్ఎల్పీ భేటీ కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల టీఆర్ఎస్ఎల్పీ సమావేశం బుధవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్లో జరగనుంది. ఈ భేటీలో టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్‌ను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. బుధవారం నుంచి ఆదివారం వరకు మంచి రోజులు ఉండటంతో సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు వాటిలో ఏదో ఒక తేదీని కేసీఆర్ ఎంచుకోనున్నారు. తెలంగాణ తల్లికి వందనం... ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ భవన్ చేరుకున్న కేసీఆర్... తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అలాగే ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ చిత్రపటానికి నివాళర్పించారు. ఆపై మీడియా సమావేశంలో పాల్గొని అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. -
పరాభవమే మిగిలింది
సాక్షి, హైదరాబాద్: సామాజిక వర్గాల అభ్యున్నతే ఎజెండాగా ఉద్యమించిన నేతలకు ఈ ఎన్నికల్లో పరాభవమే ఎదురైంది. బీసీ సంఘం నేతగా జాతీయస్థాయి ఖ్యాతి ఉన్న ఆర్.కృష్ణయ్య గత ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎల్బీనగర్లో పోటీ చేసి గెలుపొందగా ఈసారి కాంగ్రెస్ పార్టీ టికెట్‌తో మిర్యాలగూడలో పోటీ చేసి పరాజయం పొందారు. బీసీ కులాల ఐక్యవేదిక పేరుతో మనపార్టీని స్థాపించిన కాసాని జ్ఞానేశ్వర్ ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి మంత్రి పద్మారావు చేతిలో ఓటమిపాలయ్యారు. మరోవైపు ఆదివాసీల ఉద్యమాన్ని ఉదృతంగా నడిపించిన సోయం బాబురావు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. బాబురావు మినహా కాసాని జ్ఞానేశ్వర్, ఆర్.కృష్ణయ్యలు స్థానికేతర నేతలు కావడం, నామినేషన్లకు చివరి రోజున కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా వీరి పేర్లను ప్రకటించడంతో వారికి క్షేత్రస్థాయిలో ప్రచారం కత్తిమీదసాములా మారింది. ఊహించని విధంగా టికెట్లు ఇవ్వడమే వీరి ఓటమికి కారణాలని చెప్పొచ్చు. -
రెండు ఏనుగుల మధ్య నలిగిపోయాం: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్–కాంగ్రెస్ కూటమి అనే రెండు ఏనుగుల మధ్య నలిగిపోయామని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. ప్రత్యామ్నాయ విధానాలు–సామాజికన్యాయం నినాదంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పు తీసుకొచ్చేందుకు సీపీఎం–బీఎల్ఎఫ్ ప్రయత్నం చేసినా ఫలించలేదన్నారు. సామాజిక న్యాయ సాధనకు ప్రత్యామ్నాయ విధానాలు కావాలంటూ సిద్ధాంతాలు మాట్లాడిన సీపీఐ, టీజేఎస్, ప్రజాగాయకుడు గద్దర్, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణమాదిగ చివరకు కాంగ్రెస్ చంకలో చేరడంతో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయామని చెప్పారు. టీఆర్ఎస్ సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆ పార్టీకి సానుకూల ఫలితాలకు కారణమయ్యాయని తెలిపారు. -
‘ఫిరాయింపులకు’ ఓటమి
సాక్షి, హైదరాబాద్: గత సార్వత్రిక ఎన్నికల అనంతరం వేర్వేరు పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిన ఐదుగురు అభ్యర్థులు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. గతంలో 25 మంది వేర్వేరు పార్టీల ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరగా అందులో 20 మంది విజయం సాధించారు. ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మాత్రం భంగపాటు ఎదురైంది. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున గెలిచి టీఆర్ఎస్లో చేరిన పాయం వెంకటేశ్వర్లు పినపాక నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రేగా కాంతారావు చేతిలో ఓడగా, అశ్వరావుపేట నుంచి పోటీ చేసిన తాటి వెంకటేశ్వర్లు కూటమి అభ్యర్థి మచ్చా నాగేశ్వరరావు చేతిలో, వైరాలో బానోతు మదన్‌లాల్ ఇండిపెండెంట్ అభ్యర్థి రాముల్‌నాయక్ చేతిలో ఓటమి పాలయ్యారు. గతంలో ఇల్లందులో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన కోరం కనకయ్య ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రియ చేతిలో ఓడారు. మహేశ్వరంలో టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మరోవైపు గత ఎన్నికల్లో నర్సంపేట నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దొంతి మాధవరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. -
హైదరాబాద్ నుంచే..ఢిల్లీలో చక్రం తిప్పుతా!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ వేదికగా దేశ రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ముక్త భారత్‌ను నిర్మించేందుకు ప్రాంతీయ పార్టీల సహకారంతో త్వరలోనే జాతీయ పార్టీ నెలకొల్పనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల నాటికి ఈ నవశక్తి రూపుదిద్దుకుంటుందని తెలిపారు. తెలంగాణలో తీసుకొచ్చిన పథకాలు దేశవ్యాప్తంగా అమలయ్యేలా వ్యూహరచన చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో నూతన పార్టీ ఉంటుందని.. ఇందుకు సరిపోయే ఎజెండా తన వద్ద ఉందని ఆయన పేర్కొన్నారు. త్వరలో జాతీయ పార్టీకి సంబంధించిన విధివిధానాలను వెల్లడిస్తానన్నారు. వివిధ రంగాల ప్రముఖులు, నిపుణులతో చర్చించి విధానాలను ఖరారు చేయనున్నట్లు కేసీఆర్ చెప్పారు. నాలుగు పార్టీలను కలిసి సమావేశం పెట్టడం ద్వారా ఏదో చేస్తున్నట్లు హడావుడి చేయడం కాదని.. పరోక్షంగా చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశవ్యాప్తంగా ఏకం చేయాల్సింది పార్టీలను కాదనీ ప్రజలను ఒకే తాటిపైకి తేవాలన్నారు. ‘దేశ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయించుకున్నాను. నెల రోజుల్లో దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పును మీరే చూస్తారు. తెలంగాణలో ఏది అనుసరిస్తున్నామో దేశంలోనూ అదే జరగాలి. దేశంలో ఇప్పటికీ చాలాచోట్ల తాగునీటిని అందించడం లేదం టే అంతకంటే ఘోరం ఇంకేమైనా ఉంటుందా? మూ డు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచిందంటే అక్కడ మరో గత్యంతరం లేకనే. ఆ పార్టీ కాకుంటే ఈ పార్టీ.. ఈ పార్టీ కాకుంటే ఆ పార్టీయే అన్న పరిస్థితి నెలకొంది. ఒకరు రాఫెల్ అంటే మరొకరు భోఫోర్స్ అంటారు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉంది’అని కేసీఆర్ పేర్కొన్నారు. ‘దేశానికి కొత్త ఆర్థిక విధానం, కొత్త వ్యవసాయ విధానం అవసరం. కేవలం ఉత్పత్తిపైన మాత్రమే ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. ఇజ్రాయెల్, చైనాలతో పోలిస్తే మనం ఎక్కడ ఉన్నామో తేల్చుకోవాలి. విశ్లేషకులు అశోక్ గులాటి రైతులకు ఏం చేయాలన్న అంశాన్ని అద్భుతంగా రాశారు. టీఆర్ఎస్ తెలంగాణలో ఏం చేసిందో రాసి చూపారు. రైతు పెట్టుబడితో రైతు లకు స్వేచ్ఛనిచ్చాం. వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కూడా తెలంగాణ పథకాలను మెచ్చుకున్నారు’అని కేసీఆర్ తెలిపారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదని సుప్రీంకోర్టు బాధ్యతారహితంగా తీర్పు ఇచ్చిందన్నారు. బీసీ, ఎస్సీలు అమాయకులు కావడంతో అడగలేకపోయారన్నారు. సుప్రీంతీర్పును పార్లమెంటు అడ్డుకోదా అని ప్రశ్నిం చారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా పరిస్థితి ఉంటుందని.. 50 శాతం రిజర్వేష న్లు దాటొద్దంటే ఎలాగని కేసీఆర్ ప్రశ్నించారు. దేశానికి ఒకే సుప్రీంకోర్టు ఉంటే ఎలా అని ప్రశ్నించారు. అమెరికాలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సుప్రీంకోర్టు ఉందన్నారు. ప్రపంచంలో అనేక దేశాల్లో రైతులకు గౌరవం ఇస్తారు. అనేక పథకాలు ఉంటాయి. కానీ ఇక్కడ రైతుకు గౌరవమే లేదన్నారు. ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి.. శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనానికి తెలం గాణ ప్రజలు ఎంతగానో సహకరించారని, ఈ ఎన్నికల్లో తమకు లభించిన ఘన విజయం ప్రజలదేనని కేసీఆర్ అన్నారు. రైతులు, మహిళలు, నిరుపేదలు, వెనుకబడిన వర్గాలు, దళితు లు, మైనార్టీలు.. కులమతాలకతీతంగా దీవించి తమకు ఈ విజ యాన్ని అందించారన్నారు. తమకు ఘనవిజయాన్ని కట్టబెట్టిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ఎన్నికలు యావత్ దేశానికి ఓ మార్గాన్ని చూపాయని వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల బహిరంగ సభల్లో చెప్పినట్టుగానే కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమన్నారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు తమ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరుగుతుందని వెల్లడించారు. ‘టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులందరూ అహోరాత్రులు కష్టపడి పనిచేయడం వల్లే గొప్ప విజయం సాధించాం. తొలి నుంచి అనుకున్నట్టుగానే అణకువ, వినయం, విధేయత అవసరం. విజయంతో గర్వం, అహంకారం రావాల్సిన అవసరం లేదు. కర్తవ్యనిష్ఠతో బాధ్యతల్ని నిర్వహించడం పైనే మనం దృష్టి పెట్టాలి. రాష్ట్రం లో చాలా సమస్యలు ఉన్నాయి. కొత్త రాష్ట్రాన్ని ఓ బాటలో పెట్టాం. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. కోటి ఎకరాలు పచ్చబడాలనే లక్ష్యంలో ఏమాత్రం రాజీలేదు. అది జరిగి తీరాల్సిందే. టీఆర్ఎస్ను గెలిపిస్తే కాళేశ్వరం.. కూట మిని గెలిపిస్తే శనేశ్వరం అని ఎన్నికల ప్రచార సభల్లో అన్నాను. ఏది కావాలో తేల్చుకోవాలని ప్రజలకు చెప్పాను. తమకు కాళేశ్వరమే కావాలని ప్రజలు తీర్పునిచ్చారు. దాంతో పాటు మిగతా ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి కోటి ఎకరాలకు నీరు తెచ్చి తీరుతాం. ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తాం.’అని కేసీఆర్ అన్నారు. ఆరోగ్య తెలంగాణ దిశగా.. ‘రైతుల కోసం పనిచేస్తాం. వారికి ఏ బాధ లేకుండా చేస్తాం. గిరిజనులు, గిరిజనేతరుల సమస్యలకు సత్వర పరిష్కారం చూపేలా పనిచేస్తాం. నేనే చొరవ తీసుకుంటా. బీడీ కార్మికులు, గీత కార్మికులు, కుల వృత్తులన్నీ కుదుటపడాలి. వారికి ఆధునిక యంత్రాలను ఇచ్చి ఆదుకుంటాం. యువత కు ఉపాధి, ఉద్యోగాలు లభించేలా పని చేస్తాం. తమకు అవకాశాలు రావడంలేదనే బాధ వారిలో ఉంది. నిరు ద్యోగం దేశవ్యాప్త సమస్య. ఉద్యోగ ఖాళీలను కచ్చితంగా భర్తీ చేస్తాం. అలాగే ప్రభుత్వేతర రంగాల్లో ఉపాధి విరివిగా లభించేలా చర్యలు తీసుకుంటాం. విజయం ఎంత ఘనంగా ఉంటుందో.. బాధ్యత కూడా అంతే బరువుగా ఉంటుంది. సస్యశ్యామలమైన, శాంతియుతమైన, సంపూర్ణ ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణం దిశగా మేం పనిచేస్తాం. తెలంగాణ రాష్ట్రంలోని మైనార్టీలను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. దళితులు దశాబ్దాలుగా పేదరికంలో కూరుకుపోవడం రాచపుండులా క్షోభపెడుతోంది. దానికి చరమగీతం పాడాలి. కడియం శ్రీహరి నేతృత్వంలో కమిటీ వేశాం. దానిపై పనిచేస్తున్నాం’అని పేర్కొన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామన్నారు. ఏడాదికి రెండు, మూడు లక్షల నాణ్యతతో కూడిన ఇళ్లను కట్టిస్తామన్నారు. కంటి వెలుగు తర్వాత ఈఎన్టీ, డెంటల్ డాక్టర్లు వెళ్లి పరీక్షలు నిర్వహిస్తారన్నారు. అలాగే పూర్తి స్థాయి హెల్త్ డేటా రికార్డు చేస్తాం అది పెనుమార్పులకు దారితీస్తుందన్నారు. దరిద్రం ఏదో ఒక కులానికి కాదు అన్ని కులాల్లో ఉందన్నారు. దాన్ని నిర్మూలించాలన్నారు. ఖమ్మంలో మా కత్తి మాకే తగిలింది రాష్ట్రం వ్యాప్తంగా మాకు రావాల్సిన మరో 17, 18 సీట్లు పోయాయి. ‘ఖమ్మంలో మమ్మల్ని ఎవరూ చం పలే, మా వాళ్లే వాళ్లకు వాళ్లు చంపుకున్నారు. చెప్పినా మా కొలీగ్స్ కొంత మంది వినలేదు, వినే ఉంటే మరికొన్ని సీట్లు గెలిచేవాళ్లం. మంత్రులు, స్పీకర్ కూడా ఓడిపోయారు. బాధాకరం. వారితో ఫోన్లో మాట్లాడి ఓదార్చాను’అని కేసీఆర్ అన్నారు. ‘సింగిల్ బూత్‌లో కూడా రీపోల్ లేకుండా, ఎలాంటి దొమ్మీలు లేకుండా యావత్ దేశానికే ఓ మార్గం చూపే విధంగా ఎన్నిక లు నిర్వహించుకోగలగడం అందరం గర్వపడాల్సిన విషయం. శాంతిభద్రతల నిర్వహణ అంశంలో ఎక్క డా రాజీ లేకుండా పోలీసులు, ఈసీ అధికారులు పనిచేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి రజత్‌కుమార్‌కు ధన్యవాదాలు. మీడియా కూడా మంచి పాత్ర పోషించింది. రాష్ట్రం లో మీడియా గౌరవప్రదంగా ప్రవర్తించిం ది’అని కేసీఆర్ ప్రశంసించారు. ‘అంతిమ తీర్పు ప్రజలు అప్పగించారు కాబట్టి.. ఆ సమయాన్ని ప్రజా సేవచేయడానికి కేటాయించాలి. ఎన్నికల్లో ప్రత్యర్థులు ఎన్ని ఎదురుదాడులకు దిగినప్పటికీ అవన్నీ గతమే’అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అన్నారు. థ్యాంక్యూ ఒవైసీ ‘మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ధన్యవాదాలు చెబుతున్నా. సోమవారం ఆయనతో కలిసి భోజనం చేశా. అసదుద్దీన్ అసలు సిసలు లౌకికవాది, మేధావి. చాలా అంశాలపై ఆయన చాలా అవగాహన ఉంది. దేశవ్యాప్తంగా మైనారిటీలను ఏకం చేసేలా మేమిద్దరం పర్యటిస్తాం. అందుకోసం రెండు విమానాలు బుక్ చేసుకున్నాం. త్వరలో దేశనిర్మాణంలో మేం భాగస్వాములం అవుతాం. ఇక్కడ అన్ని చక్కదిద్ది.. ఆ తర్వాత ఢిల్లీవైపు అడుగులు వేస్తా. బీజేపీ ముక్త్ భారత్, కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదంతో ముందుకువెళ్తాను’అని కేసీఆర్ వెల్లడించారు. డీఎంకే అధినేత స్టాలిన్ రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలని అడిగారని ఓ ప్రశ్న కు సమాధానంగా చెప్పారు. దేశానికి తెలంగాణ ఓ దిక్సూచి ‘ఈ దేశానికి తెలంగాణ ఓ దిక్సూచి అందుకే తెలంగాణ వేదికగా జాతీయ రాజకీయాలకు కొత్త నిర్వచనం ఇస్తాం. దేశంలో గందరగోళం నెలకొంది. నూరు శాతం బీజేపీయేతర, కాంగ్రెసేతర పరిపాలన రావాలి. మాకు ఎవరూ బాస్‌లు లేరు. మేం ఎవరికీ ఏజెంట్లం కాము. ప్రజలకే ఏజెంట్లం. వారి కోసమే మేం పనిచేస్తాం. ఎవరికీ గులాంగిరీ చేయం. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ.. జాతీయ రాజకీయాలను కచ్చితంగా ప్రభావితం చేస్తాం’అని కేసీఆర్ పేర్కొన్నారు. ‘దేశంలో పరిపక్వత రావాలి. ప్రధాన మంత్రి, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు వచ్చి మాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. కానీ ప్రజలు అంతిమ నిర్ణయం ఇచ్చారు. మమతా బెనర్జీ, సీఎం నితీశ్ కుమార్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి ఆయా పార్టీల నేతలను కలుస్తా’అని ముఖ్యమంత్రి వెల్లడించారు. కొన్ని పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డ కేసీఆర్.. ఈ దేశానికి 70 వేల టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని, కానీ 30 వేల టీఎంసీలను మాత్రమే వినియోగిస్తున్నారన్నారు. విభజన రాజకీయాల నుంచి దేశం బయటపడాలని సూచించారు. ఏపీలో అడుగుపెడతాం తెలుగు ప్రజలు బాగుండాలని తాము కోరుకుంటున్నామని కేసీఆర్ అన్నారు. ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలంటూ తమకు లక్షల సంఖ్యలో ఫోన్లు, మెసేజ్‌లు వచ్చాయన్నారు. దేశ రాజకీయాలను బాగుచేసుకొనే క్రమంలో.. తెలుగు ప్రజల గౌరవం పెరగాలంటే తప్పకుండా తాము ఏపీలో కూడా అడుగు పెడతామని స్పష్టం చేశారు. చంద్రబాబు తెలంగాణకు వచ్చి పనిచేశారని, అలాంటిది తాను అక్కడికి వెళ్లి పనిచేయొద్దా? అని వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబు ఇచ్చిన గిఫ్ట్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. లేకపోతే తెలంగాణ ప్రజలు సంస్కార హీనులు అనుకుంటారు’అని బాబుకు చురకలంటించారు. తాను ఇవ్వబోయే బహుమతి ప్రభావం ఎలా ఉంటుందో మీరే చూస్తారు అంటూ భవిష్యత్ లక్ష్యాలను చెప్పకనే చెప్పారు. ఏపీలో బాబు పరిస్థితి సరిగా లేదని.. ఆయనకు పైత్యం ఎక్కువని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు గతంలో హద్దులు లేకుండా పొగిడారని, అతిగా పొగిడే క్రమంలో ఆయన బోల్తా పడ్డారన్నారు. ‘నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు, ఇతర సీఎంలతోపాటు నేను పాల్గొన్నాను. ఆ సమావేశంలో మోదీని ఎక్కువగా పొగిడే ప్రయత్నంలో.. ఏదేదో మాట్లాడి చంద్రబాబు పరువుపోగొట్టుకున్నారు. ఒక సీఎం ప్రధానమంత్రి అయ్యారంటూ బాబు వ్యాఖ్యానించారు. ఈ మాటలకు అప్పుడు అఖిలేష్ యాదవ్ వంటి వారు కూడా నవ్వుకున్నారు’అని కేసీఆర్ చెప్పారు. సీఎం ఎక్కడ కూర్చుంటే అదే సచివాలయమని.. ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. హైదరాబాద్ నుంచే.. కుల, మత గొడవలతోనే దేశంలో రాజకీయాలు జరుగుతున్నాయని.. ఈ పరిస్థితి కారణంగానే ప్రపంచంలోని ఇతర దేశాలకు మనం చులకనైపోతున్నామన్నారు. ‘భారతదేశ జనాభా 130 కోట్లు ఉన్నందున.. తమకేమైనా ఇబ్బంది ఉంటుందేమోనన్న అనుమానంతో చైనా ఓ అధ్యయనం చేయించింది. ఓ బృందం మూడు నెలల్లో సర్వే చేసి.. చైనా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. భారత్‌లో కులాలు మతాలతో కొట్టుకు చస్తున్నారని, ఇక వాళ్లు మనల్ని ఏం చేయగలరని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇదీ మన దేశ దుస్థితి’అని కేసీఆర్ వెల్లడించారు. ‘హైదరాబాద్ నుంచే జాతీయ రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటా. ఇక్కడి నుంచి దేశంలో ఎక్కడికి వెళ్లాలన్నా పెద్ద సమస్య కాదు. రాష్ట్రాల్లో ఢిల్లీ పెత్తనం ఎందుకుండాలి? విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాలను రాష్ట్రాలకు వదిలేయకుండా కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటోంది. పాకిస్తాన్ సమస్యను పరిష్కరించే తెలివి లేదు గానీ.. రాష్ట్రాలపై పెత్తనమా? ఎన్నికలు దగ్గర పడుతున్నందున సర్జికల్ స్రైక్‌లు, రామమందిర నిర్మాణం వంటి అంశాలను తెరపైకి తెస్తున్నారు. అలా ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు. తెలంగాణ వేదికగా దేశ రాజకీయాలను మార్చాల్సిన అవసరముంది’అని కేసీఆర్ పేర్కొన్నారు. ‘ఆర్బీఐ వద్ద 8, 9 లక్షల కోట్ల రూపాయలున్నాయి. నిల్వగా రెండు, మూడు లక్షల కోట్లు సరిపోతుంది. కానీ అంతంత నిల్వ ఉంచుకొని దేశాభివృద్ధికి ఏమీ చేయడంలేదు. వనరులను చేతిలో ఉంచుకొని పట్టించుకోవడంలేదు’అని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
ప్రభుత్వంతో ఈసీ కుమ్మక్కు
సాక్షి, హైదరాబాద్: ఆపద్ధర్మ టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఎన్నికల సంఘం (ఈసీ) కుమ్మక్కు అయిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సెప్టెంబర్ 6న అసెంబ్లీ రద్దు అయినప్పటి నుంచి అనేక సందర్భాల్లో ఎన్నికల ప్రక్రియ నిర్వహణపై తాము అనుమానాలు వ్యక్తం చేసినా ఈసీ మాత్రం దురదృష్టవశాత్తు ప్రజానీకానికి అనేక అనుమానాలు మిగిలిపోయేలా వివాదాస్పదంగా ఎన్నికలు నిర్వహించిందని ధ్వజమెత్తారు. ఓటర్ల జాబితా సవరణను పూర్తి చేయకుండా రాష్ట్ర సీఈఓ, ఈసీ కుదించిందని, ఎన్నికల జాబితా సరిచేయకుండానే ఎన్నికలు నిర్వహించారన్నారు. శాసనసభను రద్దు చేశాక కేసీఆర్ ఒక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారని, ముందుగా దానితో ఈసీ విభేదించినా చివరకు అదే షెడ్యూల్‌ను విడుదల చేసిందని ఆరోపించారు. మంగళవారం గాంధీ భవన్లో పార్టీ నాయకులు నిరంజన్, వంశీచంద్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, బొల్లు కిషన్లతో కలసి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. ఈవీఎంలలో నమోదైన ఓట్లకు బదులు పూర్తిగా ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్)లలో రిజిస్టర్ అయిన ఓట్లను లెక్కించాలని తాము కోరుతున్నా ఈసీ ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ప్రజల్లో ఏర్పడిన అనుమానాలు దూరం చేయకపోతే వారిలో అవి శాశ్వతంగా మిగిలిపోయే ప్రమాదం ఉందన్నారు. వందకు వంద శాతం వీవీప్యాట్లలో పడిన ఓట్లను లెక్కించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కాగితాలపై రికార్డ్ అయిన ఓట్లను లెక్కించకపోతే ఇక వీవీప్యాట్ల వల్ల ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. వీవీప్యాట్లను లెక్కించకపోతే ప్రజాస్వామ్యానికే ఇది చీకటిరోజుగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌తో కలసి ఈసీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించాల్సి వస్తుందన్నారు. ఎక్కడో ఏదో జరిగింది... అనేక పోలింగ్ బూత్‌లలో నమోదైన ఓట్లకు, ఈవీఎంలలో చూపిన ఓట్లకు తేడా ఉందని, చాలా పోలింగ్ బూత్‌లలో ఒరిజనల్ ఓటింగ్ సరళికి... ఈవీఎంలలో పడిన ఓట్లు, ఓట్ల లెక్కింపునకు మధ్య తేడాలున్నాయని ఉత్తమ్ ఆరోపించారు. ఈసీ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా వీవీప్యాట్లను లెక్కించడంలో అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. ఈ విషయమై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశామని ఉత్తమ్ చెప్పారు. ఎవరికి ప్రయోజనం చేకూర్చాలని ఈసీ ఈ విధంగా చేస్తోందని నిలదీశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందని, తాము కూడా దీనిపై చట్టపరంగా ఏ విధంగా వ్యవహరించాలన్న విషయమై నిర్ణయం తీసుకుంటామన్నారు. స్వల్ప మెజారిటీతో అధికార పార్టీ అభ్యర్థి గెలిచిన చోట ప్రత్యర్థి అభ్యర్థి కోరినా వీవీప్యాట్లను ఎందుకు లెక్కించడం లేదని ప్రశ్నించారు. ‘ఎక్కడో ఏదో జరిగింది, జరుగుతోంది’అన్నారు. ఈవీఎంలలో పడిన ఓట్లతో సంబంధం లేకుండా మెజారిటీలు వస్తున్నాయన్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే వారే ఎన్నికల్లో అక్రమాలేవీ జరగలేదని మాట్లాడతారని ఈ అంశంపై ఓ ప్రశ్నకు ఉత్తమ్ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. -
తగ్గిన మహిళా ప్రాతినిధ్యం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యం తగ్గింది. 2014 ఎన్నికల్లో మొత్తం తొమ్మిది మంది విజయం సాధించగా ఈసారి ఆ సంఖ్య ఐదుకి పడిపోయింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్లో ఆరుగురు, కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు మహిళలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఈసారి టీఆర్ఎస్ పార్టీ కొండా సురేఖ, బొడిగె శోభలకు టికెట్ నిరాకరించింది. దీంతో కోవా లక్ష్మి (ఆసిఫాబాద్), పద్మా దేవేందర్‌రెడ్డి (మెదక్), రేఖానాయక్ (ఖానాపూర్), గొంగిడి సునీత (ఆలేరు) ఎన్నికల్లో పోటీ చేశారు. వీరిలో కోవా లక్ష్మి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), హరిప్రియా నాయక్ (ఇల్లందు) గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థులు డీకే అరుణ (గద్వాల), గీతారెడ్డి (జహీరాబాద్), పద్మావతిరెడ్డి (కోదాడ), కొండా సురేఖ (పరకాల) కూడా పరాజయం పాలయ్యారు. ఇక బీజేపీ నుంచి పోటీ చేసిన బొడిగె శోభ (చొప్పదండి)కు కూడా ఓటమి తప్పలేదు. -
మోదీకి ఖేదం– కేసీఆర్‌కు మోదం
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్‌గా జరిగిన అయిదు రాష్ట్రాలు–మధ్యప్రదేశ్, రాజ స్తాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజో రాం ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ హవాకు అడ్డుకట్ట వేశాయని చెప్పవచ్చు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి, మిజోరాంలో మిజో నేషనల్ ఫ్రంట్ ఏక పక్షంగా సాధించిన విజయాలు చరిత్రాత్మకమైనవి. ఈ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోదీకి ఖేదం, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మోదాన్ని కలిగించాయి. అలాగే దేశంలో ఇప్పటి వరకూ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఏ రాజ కీయ పార్టీ విజయం సాధించిన దాఖలాలు లేవు. కాబట్టి ఆ రికార్డును టీఆర్ఎస్ కైవసం చేసుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా టీఆర్ఎస్ కారు వేగానికి కాంగ్రెస్‌లోని హేమాహేమీలు అడ్డుకట్ట వేయలేక ఓడిపోవడం గమనార్హం. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ పథకాలే టీఆర్ఎస్ భారీ విజయానికి దోహదపడ్డాయి. ఇక ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవాలన్న బీజేపీ కలలు కల్లలైనాయి. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఈ ఎన్నికలు మంచి గుణపాఠం నేర్పిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మైనారిటీ వ్యతిరేక రాజకీయాలు, మతం పేరిట ఓటర్లలో విభజన తెచ్చే వ్యూహాలు బీజేపీకి బెడిసికొడుతున్నాయని గ్రహించాలి. కేంద్రంలో అధికారంలోకొస్తే నల్లధనాన్ని వెనక్కి తెస్తామని, ప్రతీ నిరుపేద కుటుంబానికి పదిహేను లక్షలు వారి ఖాతాలలో జమ చేస్తామన్న హామీలు నీటి మూటలయ్యాయి. నోట్ల రద్దుతో సామాన్యులకు నరకం చూపించారు. బ్యాంకుల దివాలాకు కారణమయ్యారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకరణ, ఆర్థిక విధానాల వల్ల నిత్యావసరాల ధరలు, పెట్రోలు డీజిల్ రేట్లు అమాంతం పెరిగిపోయి సామాన్యుడు బతకలేని దుస్థితి దాపురించింది. మరోవైపు సంఘ్ పరివార్ వివాదాలు, విధ్వం సక పోకడలు బీజేపీ ప్రతిష్ఠను, మోదీ హవాను lతగ్గించివేస్తున్నాయి.అందువల్ల ఎన్నికలకు ముందు దేశ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కేంద్రం ఇకనైనా చిత్తశుద్ధితో కృషిచేయాలి. బట్టా రామకృష్ణ దేవాంగ, సౌత్ మోపూరు, నెల్లూరుజిల్లా -
మూడు నెలల వ్యూహంతో..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీసు శాఖ చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇచ్చింది. షెడ్యుల్ విడుదలైనప్పటి నుంచి పోలీస్ శాఖ వ్యూహాత్మంగా భద్రతా ఏర్పాట్లు చేస్తూ వచ్చింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిత్యం ముందస్తు భద్రత, బందోబస్తు, బైండోవర్లు, ఆయుధాల డిపాజిట్.. ఇలా అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనకు తావు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంది. సుమారు లక్ష మంది పోలీస్ సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేసి శభాష్ అనిపించుకుంది. రూ.వంద కోట్లపైగా స్వాధీనం ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు, అంతర్ జిల్లా చెక్‌పోస్టులు, ప్రత్యే క తనిఖీ బృందాలు ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ, నోటిఫికేషన్ అమల్లోకి వచ్చిననాటి నుం చి ఐటీ విభాగంతో కలసి రూ.125 కోట్లకుపైగా నగదు స్వాధీనం చేసుకుంది. ఎక్సైజ్ విభాగంతో కలసి 4 లక్షల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. 17 కిలోల బంగారం, 689 గ్రా ముల వజ్రాలు, 121 కిలోల వెండి, 267 కిలోల గంజాయి, రూ.1.68 కోట్ల బహుమతులను స్వాధీనం చేసుకుంది. ఏ ఎన్నికల్లోనూ లేని తీరుగా నాన్‌బెయిలబుల్ వారెంట్లను జారీ చేసింది. 14 వేలకుపైగా పెండింగ్‌లో ఉన్న నాన్‌బెయిలబుల్ వారెంట్లలో 11,862 వారెంట్లను అమలు చేసి సంబంధిత వ్యక్తులను కోర్టులో హాజరుపరచింది. నేరచరిత్ర ఉన్న 90,238 మందిని బైండోవర్ చేసింది. వ్యూహాత్మకంగా.. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలుగా ఉన్న ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని 13 నియోజకవర్గాల్లో మావో యిస్టుల ప్రభావం ఉంటుందని నిఘావర్గాలు ముందే పసిగట్టాయి. పోలీస్‌శాఖ గ్రేహౌండ్స్ బలగాలతో కూంబింగ్ విస్తృతం చేసి రాష్ట్ర సరి హద్దులోకి మావోలను అడుగుపెట్టనీయకుం డా చర్యలు చేపట్టింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ పోలీసులతో చేసుకున్న సమన్వయం విజయవంతమైనట్లు పోలీస్ శాఖ తెలిపింది. ఎన్నికల రోజు ఖమ్మం జిల్లా చర్లలో మావోలు పాతిపె ట్టిన ల్యాండ్మైన్లను నిర్వీర్యం చేసి పెద్ద ప్రమాదాన్ని తప్పించింది. ఈ చర్యకు పాల్పడ్డ యాక్ష న్ టీంను గుర్తించి అరెస్ట్ చేసేందుకు జిల్లా స్పెషల్ బృందాలను రంగంలోకి దించారు. కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థిపై దాడి తప్ప, ఎక్కడా ఎలాంటి ఘటనలు జరగలేదు. ప్రజల సహకారంతోనే: డీజీపీ ‘3 నెలలుగా అసెంబ్లీ ఎన్నికల కోసం భద్రతాచర్యలు చేపట్టాం. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు, అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో దిగ్విజయంగా ఎన్నికలు నిర్వహించాం. పోలీస్‌శాఖలోని కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు అంద రూ రాత్రిపగలు తేడా లేకుండా పనిచేశారు. పోలీస్ సిబ్బందికి, ప్రజలకు ధన్యవాదాలు’ అని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. -
అజేయుడు.. అద్వితీయుడు
ప్రజాకూటమి పేరిట కాంగ్రెస్, టీడీపీలు మూకుమ్మడిగా దాడి చేసినా.. ఓ వర్గం మీడియా చంద్రబాబుకు దన్నుగా తనపై తీవ్ర ప్రచారానికి దిగినా... మొక్కవోని దీక్షతో టీఆర్ఎస్ని అధికార పథంలో నిలబెట్టిన అద్వితీయ నాయకుడు కె. చంద్రశేఖర్‌రావు. ప్రజల నాడిని పసిగట్టడంలో, గెలుపు ఓటములను అంచనా వేయడంలో తన అనుభవాన్ని మొత్తంగా రంగరించిపోసిన కేసీఆర్ అటు కాంగ్రెస్‌ను, ఇటు చంద్రబాబును కోలుకోలేని విధంగా దెబ్బతీశారు. తెలంగాణలో కూటమి గెలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనూ మరొక్కసారి కాలర్ ఎగరేసుకోవాలనుకున్న చంద్రబాబు ప్రయత్నం ఘోరంగా బెడిసికొట్టింది. తెలంగాణ ఆత్మను తట్టిలేపిన కేసీఆర్‌కే ఈ ఘన విజయం దక్కుతుంది. తెలంగాణ శాసన సభకు జరిగిన ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అద్భుత విజయం సాధించింది. ఈ వార్తావ్యాఖ్య పూర్తి చేసే సమయానికి టీఆర్ఎస్ 88 స్థానాలు సాధించి ప్రజల్లో తన బలాన్ని చాటుకున్నది. టీఆర్ఎస్కు, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు అభినందనలు. అద్భుత విజయం అనడానికి కారణం ఆ పార్టీ గెలుచుకున్న స్థానాల సంఖ్యను బట్టి కాదు, ప్రత్యర్ధి కూటమిలో హేమాహేమీలు అందరినీ దాదాపుగా మట్టి కరిపిం చినందువల్ల. కూటమి గెలిస్తే ముఖ్యమంత్రి రేసులో ఉన్న ప్రముఖులు జానారెడ్డి, జీవన్ రెడ్డి, డీకే అరుణ, దామోదర రాజనరసింహ, పొన్నాల లక్ష్మయ్య, రేవంత్‌రెడ్డి మొదలైన వారంతా ఓటమి పాలయ్యారు. కేసీఆర్ వ్యవహార శైలి, ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ఆయనకు ఉన్న వైముఖ్యం, అప్రజాస్వామిక ధోరణి వెరసి టీఆర్ఎస్ ఓటమి ఖాయం అనుకున్న వారందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ గులాబీ జెండా తెలంగాణ శిఖరాగ్రాన మరొక్కసారి రెపరెపలాడింది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని మేధావులూ, మీడియా కచ్చితంగా టీఆర్ఎస్ ఓటమి పాలు కావడం ఖాయంగా భావించారు. వాళ్ళకు ప్రజల నాడి తెలుసుకునే అవకాశం తక్కువ అనుకుందాం. ప్రజాక్షేత్రంలో నిత్యం తిరుగుతూ తమ విజయావకాశాలను పరీక్షించుకుంటున్న రాజకీయ నాయకులకు, క్రియాశీల కార్యకర్తలకూ ఎందుకు అర్థం కాలేదు? టీఆర్ఎస్ అనుకూలత చాపకింద నీరులా ప్రవహించిం దనుకోవాలా? దానికి కారణం ఉంది. ప్రజల నాడి తెలుసుకునే పని మానేసి ప్రతిపక్ష రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం పని చేస్తున్న మీడియాను నమ్ముకోవడమే. నిన్న మొన్నటి దాకా కేసీఆర్, ఆయన ప్రభుత్వ కనుసన్నల్లో మెలుగుతూ తమ పత్రికలనూ, చానళ్లనూ అధికార పక్షం కరపత్రికలుగా, బాకాలుగా మార్చేసి హఠాత్తుగా యూటర్న్ తీసుకోవడం, తెలంగాణలో అధికార పక్షం ఓడిపోబోతున్నదని ప్రచారం మొదలుపెట్టడం వెనక దాగిన ఒక కుట్రను ప్రతిపక్ష రాజకీయ పార్టీలు గుర్తించలేక పోవడం అందుకు కారణం. మీడియా ఎత్తులూ, జిత్తులూ ప్రజలకు బాగా తెలుసు కాబట్టి తాము ఇవ్వదలచిన తీర్పు స్పష్టంగా ఇచ్చారు. తన స్వప్రయోజనాలను ఆశించి ‘‘పార్టీలు ఫిరాయించే’’ మీడియాను నమ్ముకున్న ప్రతిపక్షం తెలంగాణలో తగిన ఫలితాన్నే అనుభవించింది. నాలుగేళ్ళ మూడు నెలలు అధికారంలో ఉండి టీఆర్ఎస్ మూటగట్టుకున్న వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అధికారంలోకి రావాలనుకున్న కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక పెద్ద తప్పిదం ఇవాళ మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి గల కారణాల్లో ఒకటి అయింది. ఓటింగ్ సరళి, ఫలితాల సరళీ చూసినప్పుడు ముఖ్యంగా టీఆర్ఎస్ గెలుపునకు వివిధ రకాల పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా వంటి సంక్షేమ కార్యక్రమాలు కారణంగా చెప్పుకోవాలి. టీఆర్ఎస్ అనుకూల ఓట్లన్నీ నిశ్శబ్దంగా ఉంటే, కేసీఆర్ వ్యవహార శైలిని వ్యతిరేకించిన వర్గాలు బలమైన గొంతు కలిగి ఉండటం వల్ల టీఆర్ఎస్ వోటమి తప్పదనే అభిప్రాయం కలిగింది. నిజానికి కాంగ్రెస్ పార్టీ మరి కొన్ని పార్టీలతో కలిసి కూటమి కట్టాలన్న ఆలోచన చేసేసరికి టీఆర్ఎస్ తన గెలుపు పట్ల సందేహంలో పడిపోయింది. తెలంగాణ జనసమితి, భారత కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి కూట మిగా ఎన్నికలకు పోవాలనుకున్నంతవరకూ కాంగ్రెస్ ఆలోచన బాగానే ఉంది. తెలంగాణలో అంతవరకూ టీఆర్ఎస్ ్రçపభుత్వానికి కరపత్రాలుగా ఉన్న మీడియా సంస్థలు, చంద్రబాబు రాకతోనే ప్లేట్ ఫిరాయించి టీఆర్ఎస్ వ్యతిరేక వైఖరి తీసుకున్నాయి. అప్పుడే కాంగ్రెస్ బలహీనపడటం మొదలైంది. చంద్రబాబు తన పార్టీ టీడీపీని కూటమిలో చేర్చేవరకూ నిజానికి టీఆర్ఎస్కు ప్రతిపక్షాలను విమర్శించడానికి సరైన ఆయుధం లేదు. బాబు కూటమిలో చేరడమే కాకుండా ఆ కూటమి అంతటినీ తానే నడిపిస్తున్నాననే అభిప్రాయం జనంలో కలిగించే దాకా కూడా టీఆర్ఎస్ ఆయుధం కోసం వెతుక్కుంటూనే ఉంది. బాబు ఆలోచన వేరు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఆ ఘనత తనదే అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా కూటమిలో చేరడానికి ముందు జాతీయ ప్రయోజనాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ అనే రెండు బ్రహ్మ పదార్థాలను తీసుకుని రాహుల్‌ని మచ్చిక చేసుకున్నాడు. దీని వెనక ఎన్నికల కోసం బాబు అందించబోయే నిధులు ఆర్థికంగా దివాలా తీసిన కాంగ్రెస్ అధ్యక్షుడిని మరింత ఆకట్టుకున్నాయి. ప్రత్యేక విమానం వేసుకుని ఢిల్లీ వెళ్లి పత్రికా గోష్టి నిర్వహించి తిరిగి అమరావతి వెళ్ళిపోయే చంద్రబాబు నిజంగానే ఆకర్షణీయంగా కనిపించి ఉంటాడు రాహుల్ గాంధీకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆయన ఈ నాలుగున్నర ఏళ్ళ కాలంలో భ్రష్టు పట్టించిన తీరు రాహుల్ గాంధీ దృష్టికి రాలేదో లేక ఆ పార్టీ రాష్ట్ర బాధ్యులు ఆయనకు చెప్పలేదో కానీ బీజేపీయేతర పక్షాలన్నిటినీ కాంగ్రెస్ గూటికి చేర్చే పని తానే చేస్తానని నమ్మించిన బాబు ఉచ్చులో పడిపోయింది కాంగ్రెస్. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన చంద్రబాబు తెలంగాణ ప్రజల్లో భయాలు తొలగించి భరోసా కల్పించే విధంగా కాకుండా ప్రసంగాలన్నీ తన గొప్పలు చెప్పుకోడానికి, తెలంగాణ ఉద్యమంతో పెనవేసుకుని తద్వారా అధికారంలోకి వచ్చిన పార్టీని నిందించడానికే వెచ్చించారు. చంద్రబాబు ఆలోచన ఏమిటంటే తెలంగాణలో తాను పొత్తు కూడిన కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణలో చక్రం తానే తిప్పాననీ, జాతీయ స్థాయిలో కూడా తిప్పుతాననీ చెప్పుకుని ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న దుష్పరిపాలన నుంచి, ప్రజావ్యతిరేకత నుంచి అందరి దృష్టి మళ్ళించాలి. ఆయన ఆలోచనకు కొందరు మీడియా యజమానులు, మాజీ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వంటి వారు తోడయ్యారు. చంద్రబాబు నాయకత్వంలో ఈ ముఠా ఒక్క దగ్గర చేరి టీఆర్ఎస్ను ఓడించడానికి అవసరం అయిన ప్రణాళికలు కూడా వేసుకుందని వార్తలు వచ్చాయి. ఇదంతా బెడిసి కొట్టింది. బాబు కంటే రెండాకులు ఎక్కువే చదువుకున్న కేసిఆర్ దాన్నే ఆయుధంగా మలుచుకుని జనంలోకి వెళ్ళారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమరావతికి తాకట్టు పెడదామా, ఢిల్లీ వీధుల్లో అమ్ముదామా అని ప్రశ్నించే సరికి ఆయనను, ఆయన పరిపాలనను వ్యతిరేకిస్తున్న వర్గాలు కూడా చంద్రబాబునాయుడును నిలువరించేందుకు టీఆర్ఎస్కు ఓటేసే పరిస్థితి ఏర్పడింది. దాని పర్యవసానమే ఇవ్వాల్టి తెలంగాణ శాసన సభ ఎన్నికల ఫలితం. తన పార్టీ తరఫున కూటమి అభ్యర్థులుగా నిలబెట్టిన కొద్ది మందిని కూడా గెలిపించుకునే పరిస్థితి చంద్రబాబుకు లేకుండా పోయింది. నందమూరి కుటుం బాన్ని మచ్చిక చేసుకోడానికన్నట్టు దివంగత హరికృష్ణ కుమార్తెను కూకట్ పల్లిలో పోటీ చేయించి ఘోర పరాజయం పాలుచేశారు చంద్రబాబు. చంద్రబాబు పేరు కూడా తెలియని మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవడం, అదే సమయంలో బాబు వేలు పెట్టిన తెలంగాణలో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూడటం కాంగ్రెస్ పెద్దలకు, ముఖ్యంగా రాహుల్ గాంధీకి కనువిప్పు కావాలి. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలను కళ్ళప్పగించి చూస్తూ, చెవులు అప్పగించి వింటూ కూర్చున్న కాంగ్రెస్ పెద్దలు తప్పకుండా పునరాలోచనలో పడతారని ఆశిద్దాం. బీజేపీకి దూరం అయ్యాక జాతీయ రాజకీయాల్లో దూరి తన అస్తిత్వాన్ని చాటుకోవాలనుకున్న చంద్రబాబుకు తెలంగాణ ఫలితాలు పెద్ద దెబ్బ. తెలంగాణాలో కూటమి గెలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో కూడా మరొక్కసారి కాలర్ ఎగరేసుకోవాలన్న ఆయన ప్రయత్నం బెడిసి కొట్టింది. కూటమిలో చంద్రబాబు చేరిక కారణంగా తెలంగాణ ఉద్యమ పెద్దగా ఇంతకాలం గౌరవం పొందిన ప్రొఫెసర్ కోదండరాం, ప్రజాయుద్ధ నౌకగా పేరుపొందిన గద్దర్ వంటి వారి ప్రతిష్ట కూడా మసకబారిందనడంలో సందేహం లేదు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా తమ ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగ్‌ను, ఓటర్ల జాబితాలో అవకతవకలను కారణాలుగా చూపించే ప్రయత్నం చేయడం, కుంటిసాకులు వెతుక్కోవడం సరికాదు. దానికి బదులుగా స్థిమితంగా కూర్చుని ప్రజాకూటమి ఓటమికి కారణాలను విశ్లేషించి, ఆత్మ విమర్శ చేసుకుని, అధిష్టానవర్గానికి ఉన్నది ఉన్నట్టుగా రిపోర్ట్ చేస్తే, వాళ్ళు దాన్ని నిజాయితీగా అమలు పరిచి చంద్రబాబు వంటి వారిని దూరం పెడితే ముందు ముందు కాంగ్రెస్ కొంచెం అయినా బాగుపడటానికి, బలపడటానికీ ఉపయోగపడుతుంది. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి గెలిచిన సీట్లు 63, కాగా సుస్థిరత సాకుతో ఆ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి చేర్చుకున్న వారితో కలిపి మొన్న ఎన్నికలకు పోయేనాటికి 90 సీట్లు అయ్యాయి. ఈసారి ఆ అవసరం లేకుండానే జనం సుస్థిర పాలన చెయ్యడానికి అవసరం అయిన సంఖ్యాబలం ఇచ్చారు కాబట్టి కేసీఆర్ ఇక అవతలి పార్టీల వారికి కండువాలు కప్పే అనైతిక కార్యక్రమానికి స్వస్తి చెపితే మంచిది. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే ఎన్నికల ఫలితాన్ని గౌరవించడంతో బాటు, ప్రజలనూ, ప్రజాస్వామిక విలువలనూ, పౌర హక్కులనూ గౌరవించే వాళ్లకు అందుబాటులో ఉండే ప్రయత్నం ఈ రెండో పదవీ కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అలవరుచుకుంటే కూడా బాగుంటుంది. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
తెలంగాణ ప్రజలకు జేజేలు!
తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు నవంబర్ 12తో మొదలై ఈనెల 7వరకూ వివిధ దశల్లో జరిగిన ఎన్నికల్లో మంగళవారం ప్రజాభిప్రాయం వెల్లడైంది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ గెలుపు ఖాయమవుతుండగా... మిజోరంలో మిజోరం నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) గెలుపొందింది. హోరాహోరీగా జరిగిన తెలంగాణ పోరులో జనం టీఆర్ఎస్కు పట్టంగట్టారు. అయిదేళ్లకోసారి పాలకుల్ని మార్చే అలవాటున్న రాజస్తాన్‌లో నైనా... మూడు దఫాలనుంచి వరసగా బీజేపీవైపే మొగ్గుచూపుతూ వస్తున్న మధ్యప్రదేశ్లోనైనా విజేతలకూ, పరాజితులకూ మధ్య సీట్ల సంఖ్యలో పెద్దగా వ్యత్యాసం లేకపోవడం గమనించదగ్గది. బీజేపీకి గత మూడు దఫాలు పట్టంగట్టిన ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం కాంగ్రెస్ మంచి మెజారిటీ దిశగా సాగిపోతోంది. మరో ఆర్నెల్లలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా అభివర్ణిస్తున్న ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజల నాడి ఎలా ఉందో అర్ధమైంది గనుక జాతీయ పార్టీలూ, ప్రాంతీయ పార్టీలూ కూడా తమ తమ ఆచరణలనూ, ఎత్తుగడలనూ సవరించుకుంటాయి. భవి ష్యత్తు వ్యూహాలకు పదును పెట్టుకుంటాయి. ఎన్ని కబుర్లు చెప్పినా, ఎన్ని సిద్ధాంతాలు వల్లించినా ప్రజాప్రయోజనాలు ఇరుసుగా చేసుకుని పనిచేయని పార్టీలకు–అవి అధికారంలో ఉన్నా, ప్రతి పక్షంలో ఉన్నా జనం గట్టిగా గుణపాఠం చెప్పారు. నైతిక విలువలకు తిలోదకాలిచ్చి, అవకాశవాద పొత్తులతో అందలం ఎక్కుదామనుకున్నవారిని చాచికొట్టారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు అక్షరాలా ఒంటరి పోరాటం చేశారు. పొలోమంటూ తరలివచ్చిన జాతీయపార్టీల అతిరథమహారథులను ఎదుర్కొన్నారు. ‘నే తగుదు నమ్మా...’ అంటూ పొరుగు రాష్ట్రమన్న స్పృహ కూడా లేకుండా తెలంగాణలో కాళ్లూ చేతులూ పెట్ట బోయిన ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరిచిపోలేని గుణపాఠం నేర్పారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, పలువురు బీజేపీ సీఎంలు, కేంద్రమంత్రులు ఇక్కడ ప్రచారం చేశారు. ఈ నాలుగున్నరేళ్లలో ఏనాడూ, ఎక్కడా బహిరంగసభల్లో పాల్గొనని కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ హైదరాబాద్ నగరంలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు. తెలంగాణ స్థితిని చూసి తల్లిగా తల్లడిల్లుతున్నానని జనంలో సెంటిమెంటు పండించేందుకు ప్రయ త్నించారు. ప్రచారం ముగిసేరోజు సైతం వీడియో సందేశమిచ్చారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విస్తృతంగా పర్యటించారు. చంద్రబాబుతో కలిసి సభల్లో, విలేకరుల సమావేశాల్లో పాల్గొ న్నారు. కానీ విషాదమేమంటే సోనియాగాంధీ అయినా, రాహుల్ అయినా చంద్రబాబు స్క్రిప్టును మించి మరేమీ చెప్పలేకపోయారు. సొంత రాష్ట్రంలో అన్నిటా విఫలమైన బాబు ఇక్కడికొచ్చి కేసీ ఆర్‌ను విమర్శించడాన్ని చూసి జనం నవ్వుకున్నారు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవని అంటారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎవరూ హత్య చేయలేదు. అదే ఆత్మహత్య చేసుకుంది. తన మరణశాసనాన్ని తానే లిఖించుకుంది. ఒంటరిగా పోటీ చేస్తే మెజారిటీ రాకపోయినా, ఆ పార్టీకి గౌరవనీయమైన సంఖ్యలో సీట్లు లభిం చేవి. దురాశకు పోకుండా టీజేఎస్, సీపీఐలతోపాటు సీపీఎంని కూడా ఒప్పించి వాటితో కూటమికి సిద్ధపడితే పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేది. కానీ కాంగ్రెస్ అందుకు విరుద్ధంగా ‘టీఆర్ఎస్ పొమ్మన్నది గనుక మీతో చెలిమి చేస్తాన’ంటూ వచ్చిన చంద్రబాబును వెనకా ముందూ చూడ కుండా వాటేసుకుంది. వచ్చింది మనవాడా... మనకు పరాయివాడా అన్న సోయి లేకుండా పోయింది. కూటమి కట్టేముందు ఏ పార్టీ అయినా దానికి అర్ధం, పరమార్ధం ఏమిటో గ్రహించగల గాలి. తమ సిద్ధాంతాలేమిటో, లక్ష్యాలేమిటో, ప్రయోజనాలేమిటో... వాటిని సాధించడానికి కూటమి దోహదపడుతుందో, గండికొడుతుందో చూసుకోవాలి. చంద్రబాబుకు ఈ బాదరబందీ ఉండదు. అవకాశవాదమే ఆయన వేదం. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డి నిరంత రాయంగా సాగిస్తున్న ఉద్యమ ఫలితంగా ‘ప్రత్యేకహోదా’ అంశం ఆంధ్రప్రదేశ్‌లో సజీవంగా ఉన్న దని, అది వచ్చే ఎన్నికల్లో తనకు శరాఘాతం కాబోతున్నదని బాబు గ్రహించారు. అందువల్ల ఏదో ఒకసాకు చూపించి ఎన్డీఏ గోడ దూకి బయటికొచ్చారు. జాతీయ స్థాయిలో హడావుడి చేసి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను మభ్యపెట్టాలంటే అర్జెంటుగా ఒక వేదిక అవసరమని భావించారు. అందుకోసం ఆయన తొలుత టీఆర్ఎస్ను కదిపి చూశారు. ‘తెలుగువాళ్లం ఏకమవుదాం’ అని కబురంపారు. కానీ టీఆర్ఎస్ తిరస్కరించడంతో గత్యంతరం లేక కాంగ్రెస్ తలుపుతట్టారు. తన అవకాశవాదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ‘జాతీయప్రయోజనాలు, ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణ’ వంటి అమూ ర్తమైన పడికట్టు పదాలను అరువు తెచ్చుకున్నారు. ఆయన వందలకోట్లు నిధులు పారిస్తానని చెప్పి ఉండొచ్చు. కొమ్ములు తిరిగిన మీడియా సంస్థలతో హోరెత్తిస్తానని హామీ ఇచ్చి ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ విజ్ఞత ఏమైంది? ఎంత చెడ్డా బాబు సీనియారిటీతో పోలిస్తే ఆ పార్టీ అనుభవం ఎంతో ఎక్కువ. కానీ అదంతా బూడిదలో పోసినట్టయింది. తొమ్మిదేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో ఒంటరిగా బరిలోకి దిగి సునాయాసంగా గెలిచిన ప్రముఖులంతా ఇప్పుడు బోర్లాపడ్డారు. తమ చరిత్రను తామే మరిచి పోయి, అలవాటులేని రాజకీయాల్లో తలదూర్చి టీజేఎస్ అధినేత కోదండరాం, ప్రజా గాయకుడు గద్దర్ చేతులు కాల్చుకున్నారు. తెలంగాణ ప్రజలు డబ్బుకూ, ఇతర వ్యామోహాలకూ లొంగలేదు. తమకు మేలు చేసేదెవరో, ఆషాఢభూతులెవరో సులభంగా గ్రహించారు. అనైతిక రాజకీయాలనూ, అవకాశవాదాన్నీ తిరస్కరించారు. దొంగ సర్వేలతో మభ్యపెట్టబోయినవారిని బేఖాతరు చేశారు. తమ ఓటుతో జాతీయ రాజకీయాలకు ఎగబాకాలనుకున్నవారికి గుణపాఠం నేర్పిన తెలంగాణ ప్రజలు శతథా అభినందనీయులు! -
లోక్‌సభ టు అసెంబ్లీ బాట..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. మొత్తం 119 స్థానాలకుగాను 88 చోట్ల విజయదుందుభి మోగించింది. అయితే, ఈ ఎన్నికల్లో ఎలాగైనా మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించిన ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్లు పలువురు తాజా, మాజీ లోక్‌సభ సభ్యులను అసెంబ్లీ బరిలోకి దింపాయి. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించినవారు అసెంబ్లీ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తారనే నమ్మకం ఒకవైపూ.. సదరు ఎంపీల అంగబలం, అర్ధబలం ఉపయోగించి మరికొందరి ఎమ్మెల్యేలను సైతం గెలుపించుకోవచ్చనే వ్యూహం మరోవైపు ఆయా పార్టీలు ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయి. అయితే, ప్రజామోదం పొందిన ఎంపీలు గెలుపొందగా.. మరికొందరికి పరాజయం తప్పలేదు. పోటీచేసిన ఎంపీలు.. బాల్కసుమన్ (టీఆర్ఎస్-చెన్నూర్)-గెలుపు, చామకూర మల్లారెడ్డి (టీఆర్ఎస్-మేడ్చల్)-గెలుపు. పోటీచేసిన మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్-కరీంనగర్)-ఓటమి, సర్వే సత్యనారాయణ (కాంగ్రెస్-సికింద్రాబాద్ కంటోన్మెంట్)-ఓటమి, నాగం జనార్థన్‌రెడ్డి (కాంగ్రెస్-నాగర్‌కర్నూలు)-ఓటమి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (కాంగ్రెస్ మునుగోడు)-గెలుపు, సురేష్ షెట్కార్ (కాంగ్రెస్-నారాయణఖేడ్)-ఓటమి, నామా నాగేశ్వర్ రావు (టీడీపీ-ఖమ్మం)-ఓటమి, మల్లు రవి (కాంగ్రెస్-జడ్చర్ల)-ఓటమి, పోరిక బలరాం నాయక్ (కాంగ్రెస్-మహబూబాబాద్)-ఓటమి, రమేష్ రాథోడ్ (కాంగ్రెస్-ఖానాపూర్)-ఓటమి,. -
‘టీఆర్ఎస్ విజయం ఉద్యమ విజయమే’
సాక్షి, చెన్నై : తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ సాధించిన విజయం ప్రజాస్వామ్య విజయమని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ చేసిన త్యాగాన్ని ప్రజలు మరవలేదన్న విషయం ఈ ఫలితాలలో రుజువైందన్నారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఎవరెన్ని మాటలు చెప్పిన ప్రజలు నమ్మలేదని, అభివృద్ధికే పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో విజయం సాధించాలని కలలు కన్న పార్టీలకు ప్రజల తగిన విధంగా బుద్ధి చెప్పారన్నారు. ఎన్నికల్లో కుల, మతాలను ప్రోత్సహించిన పార్టీలతో ప్రజల తమ ఓటు అస్త్రంతో తగిన శాస్తి చెప్పారని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన చివరని ఉద్యమ వీరుడికే విజయ దక్కిందని, ఇది కచ్చితంగా ఉద్యమ విజయమేనని వ్యాఖ్యానించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ గుణాత్మకమైన మార్పు దిశగా అడుగులు వేసి ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
‘తెలంగాణలో ఓటమిని మా ఖాతాలో వేయొద్దు’
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ప్రజాకూటమి ఘోర ఓటమికి తామే కారణమంటూ ప్రచారం చేయడాన్ని టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు తప్పుబట్టారు. ప్రజాకూటమి ఓటమిని తమ ఖాతాలో వేయొద్దంటూ విన్నవించారు. తెలంగాణలో ప్రచారానికి కట్టుబట్టలతో వచ్చిన తాము రాష్ట సమస్యలతోనే తీరిక లేకుండా ఉన్నామన్నారు. కేసీఆర్ మాటకారి.. ఆయన ఏదైనా మాట్లాడగలడని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘స్పీకర్ సుమిత్రా మహాజన్ తో జరిగిన సమావేశంలో రాష్ట్ర సమస్యలపై మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని కోరాం. సమస్యలపై కేంద్రం స్పందించే తీరునుబట్టి నిరసన కార్యక్రమాలు చేస్తాం.రాష్ట్ర విభజన హామీలను అమాలు చెయ్యాలి. కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ లు చేస్తున్న చేస్తున్న దాడులపై కేంద్రం సమాధానం చెప్పాలి. నాయకులను డీమోరలైజ్ చెయ్యడానికి దాడులు చేయిస్తున్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మమ్మల్ని మోసం చేసింది. కాంగ్రెస్ ప్రత్యేక హోదా కోసం సహకరిస్తామని చెప్పడంతో వారితో కలిసాం. తెలంగాణలో ప్రజాఫ్రంట్ ఓటమిని మా ఖాతాలో వేయొద్దు’ అని కొనకళ్ల పేర్కొన్నారు. -
సీట్లూ తక్కువే... గెలిచిన స్థానాలూ తక్కువే
సాక్షి, హైదరాబాద్ : ఆకాశంలో సగం అంటూ ‘ఆమె’ను ఆకాశానికి ఎత్తేసే ప్రభృతులు రాజకీయంగా మాత్రం మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు సైతం మహిళలకు ఈసారి తక్కువ సీట్లు కేటాయించడమే ఇందుకు నిదర్శనం. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మహిళలకు వివిధ పార్టీలు కేటాయించిన సీట్లు తక్కువగా ఉండగా, గెలుపొందిన స్థానాలు కూడా తక్కువే. 2014లో టీఆర్ఎస్ 11 మంది మహిళా అభ్యర్థులకు అవకాశం ఇవ్వగా, బీజేపీ- టీడీపీ కూటమి 14 మందికి, కాంగ్రెస్ పార్టీ 9 మంది మహిళలను ఎన్నికల బరిలో నిలిపాయి. అయితే ఈ అభ్యర్థుల్లో కేవలం 9 మంది మాత్రమే గెలుపొందగా.. అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఒక్క మహిళకు కూడా మంత్రివర్గంలో చోటివ్వకపోవడంతో మహిళా ప్రాతినిథ్యమే లేకుండా పోయింది. అయితే ఈ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీ అత్యధికంగా 13 మంది మహిళా అభ్యర్థులకు సీట్లు కేటాయించగా.. ఒక్కరు కూడా విజయం సాధించలేకపోయారు. కాంగ్రెస్ తరఫున మొత్తంగా 11 మంది టికెట్లు దక్కించుకున్నారు. వీరిలో ముగ్గురు అభ్యర్థులు(మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హరిప్రియ నాయక్, సీతక్క) మాత్రమే గెలుపొందారు. తెలంగాణలో ఉనికి కోల్పోయిన టీడీపీ కూకట్పల్లి నియోజకవర్గంలో నందమూరి సుహాసినికి అవకాశం ఇచ్చినప్పటికీ ఆమె ఓటమి పాలయ్యారు. ఇక మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ టీఆర్ఎస్ ఈ దఫా కేవలం నలుగురు మహిళలకు మాత్రమే సీట్లు కేటాయించింది. కాగా వీరిలో ముగ్గురు అభ్యర్థులు గెలుపొందడం విశేషం. టీఆర్ఎస్ నుంచి అసెంబ్లీకి పోటీచేసిన మహిళలు పద్మాదేవేందర్ రెడ్డి (మెదక్), రేఖా శ్యాం నాయక్(ఖానాపూర్), కోవా లక్ష్మి (అసిఫాబాద్), గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి(ఆలేరు) కాంగ్రెస్ నుంచి టిక్కెట్లు దక్కించుకున్న మహిళా అభ్యర్థులు గండ్రత్ సుజాత (ఆదిలాబాద్), ఆకుల లలిత(ఆర్మూర్), సునీతాలక్ష్మారెడ్డి (నర్సాపూర్), జె.గీతారెడ్డి (జహీరాబాద్), సబితాఇంద్రారెడ్డి (మహేశ్వరం), డీకే అరుణ (గద్వాల), పద్మావతీరెడ్డి (కోదాడ), కొండా సురేఖ (పరకాల), సీతక్క (ములుగు), హరిప్రియ (ఇల్లందు), సింగాపురం ఇందిర (స్టేషన్ ఘన్పూర్) ఎన్నికల బరిలో నిలిచారు. బీజేపీ నుంచి బరిలో దిగిన మహిళా అభ్యర్థులు స్వర్ణారెడ్డి(నిర్మల్), అరుణతార(జుక్కల్ ), బొడిగె శోభ(చొప్పదండి), ఆకుల విజయ(గజ్వేల్), సయ్యద్షెహజాది(చాంద్రాయణగుట్ట), పద్మజారెడ్డి(మహబూబ్‌నగర్), రజనీ మాధవరెడ్డి(ఆలంపూర్), కంకణాల నివేదిత(నాగార్జునసాగర్), నాగ స్రవంతి(), రేష్మారాథోడ్(వైరా), కుంజా సత్యవతి(భద్రాచలం), పుప్పాల శారద(ఖమ్మం), చందుపట్ల కీర్తిరెడ్డి (భూపాలపల్లి). కాగా 2014 ఎన్నికల్లో మొత్తంగా 85 మంది మహిళా అభ్యర్థులు బరిలో దిగగా(ఏడీఆర్ నివేదిక ప్రకారం)... 9 మంది విజయం సాధించారు. ఈసారి 135 మంది పోటీ చేయగా కేవలం ఆరుగురు మాత్రమే శాసనసభలో అడుగుపెట్టనున్నారు. 2018 ఎన్నికల్లో గెలిచిన మహిళా అభ్యర్థులు అభ్యర్థి పేరు నియోజకవర్గం పార్టీ ప్రత్యర్థి పార్టీ మెజారిటీ పద్మాదేవేందర్ రెడ్డి మెదక్ టీఆర్ఎస్ ఉపేందర్‌రెడ్డి కాంగ్రెస్ 47983 గొంగిడి సునీతామహేందర్ రెడ్డి ఆలేరు టీఆర్ఎస్ బూడిద భిక్షమయ్య కాంగ్రెస్ 33086 సీతక్క ములుగు కాంగ్రెస్ అజ్మీరా చందూలాల్ టీఆర్ఎస్ 22671 రేఖా శ్యాం నాయక్ ఖానాపూర్ టీఆర్ఎస్ రమేష్ రాథోడ్ కాంగ్రెస్ 20710 సబితాఇంద్రారెడ్డి మహేశ్వరం కాంగ్రెస్ తీగల కృష్ణారెడ్డి టీఆర్ఎస్ 7607 హరిప్రియ ఇల్లందు కాంగ్రెస్ కనకయ్య కోరం టీఆర్ఎస్ 2907 2014 ఎన్నికల్లో విజయం సాధించిన మహిళలు అభ్యర్థి పేరు నియోజక వర్గం పార్టీ ప్రత్యర్థి అభ్యర్థి పార్టీ మెజారిటీ రేఖా శ్యాం నాయక్ ఖానాపూర్ టీఆర్ఎస్ రాథోడ్ రమేష్ టీడీపీ 38,551 బొడిగె శోభ చొప్పదండి టీఆర్ఎస్ సుద్దాల దేవయ్య కాంగ్రెస్ 54,981 డికె అరుణ గద్వాల్ కాంగ్రెస్ బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి టీఆర్ఎస్ 8,260 గొంగిడి సునీత ఆలేరు టీఆర్ఎస్ బూడిద భిక్షమయ్య కాంగ్రెస్ 31,477 జెట్టి గీత జహీరాబాద్ కాంగ్రెస్ కొనింటీ మానిక్ రావ్ టీఆర్ఎస్ 814 కొండా సురేఖ వరంగల్ ఈస్ట్ టీఆర్ఎస్ బసవరాజు సారయ్య కాంగ్రెస్ 55,085 కోవా లక్ష్మి అసిఫాబాద్ టీఆర్ఎస్ ఆత్రం సక్కు కాంగ్రెస్ 19,052 పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ టీఆర్ఎస్ విజయశాంతి కాంగ్రెస్ 39,660 నలమాద పద్మావతి రెడ్డి కోదాడ కాంగ్రెస్ బొల్లం మల్లయ్య యాదవ్ టీడీపీ 13,090