తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయాన్ని వెతకటం లేదని విపక్షం గ్రహించలేదు. ఒకవేళ వెతుకుతున్నారనుకున్నా... తాము మెరుగైన ప్రత్యామ్నాయం ఇవ్వగలమని విపక్షం భరోసా కల్పించలేకపోయింది. ఈ రాష్ట్రంలో, దేశంలో వేదికలెక్కి, సామాజిక మాధ్యమాల్లో జొరబడి, టీవీ చర్చల్లో పూనకం వచ్చినట్టు మాట్లాడేవారి చేతుల్లో ఓట్లు లేవు. ఓట్లున్న సగటు పౌరులు మాట్లాడరు. అందుకే, పైపై పరిశీలకులకు, మీడియాకు ప్రజానాడి దొరకదు. నిన్న వెలువడిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్∙రాష్ట్రాల ఎన్నికల ఫలితాల విశ్లేషణలోనూ శాస్త్రీయత కొరవడింది. స్థానిక పరిస్థితుల్ని, దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాల్ని పరిగణనలోకి తీసుకోకుండానే నిర్ణయానికి వస్తున్నారు.
రాజకీయ క్షేత్రంలో దృశ్యం ఎలా ఉన్నా ప్రజాక్షేత్రంలో అయోమయం, అస్పష్టత ఉండదు. ఎక్కువ సందర్భాల్లో సాధారణ ప్రభావాలకు, ప్రలోభాలకూ లొంగని ఏకరీతి జనాభిప్రాయాన్నే ప్రతి బింబిస్తుంది. సాధారణ చూపులకు ఆననిదేదో అంతర్లీనంగా ఉండటం వల్లే కడవరకు దృశ్యం ఆవిష్కృతం కాదు. పలు ఊహలకు, అంచనాలకు తావిస్తుంది. ఎక్కువ సందర్భాల్లో వాటి ఆధారంగానే ప్రసారమాధ్యమాల విశ్లేషణలు, మేధావి వర్గం వాదనలు రూపుదిద్దుకుంటాయి. కొన్ని సంకేతాలను శాస్త్రీయంగా పరిశీలించి, విశ్లేషించే వారికి ప్రజానాడి దొరి కినా వేర్వేరు కారణాల వల్ల వాటిని ప్రజలు నమ్మరు.
ఎన్నికల సమయంలో తీవ్ర ఉత్కంఠ తర్వాత ఏకపక్ష ఫలితాలు చాలా మందికి విస్మయం కల్గించడానికి ఈ మర్మమే కారణం! తెలంగాణలో నిన్నటి ఎన్నికల ఫలితాలు అధికులకు ఆశ్చర్యం కలిగించాయి. ఘనవిజయం సాధించిన పాలక తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస)లోనూ, తమ అంచనాల్ని మించి ఎక్కువ స్థానాలు రావడంతో కొందరు విస్మయం చెందారు. గెలుపోటముల కారణాలను ఇప్పడు ఎవరికి వారు తమకు అనువైన, అవగాహన మేర విశ్లేషిస్తున్నారు. తెరాసకు లభించిన స్థానాలు, ఆధిక్యతలు, ఒకటీ అర జిల్లాలు మినహా రాష్ట్రమంతటా వెలసిన విజయ విస్తృతిని చూస్తే ఒక అంశం స్పష్టమౌతోంది. ప్రచారం జరిగిన ప్రభుత్వ వ్యతిరేకత ప్రజాక్షేత్రంలో లేదు. పైగా, సానుకూలత క్రమంగా బలపడింది.
దానికి తోడు పలు పరిణామాలు పాలకపక్షానికి కలిసి వచ్చాయి. అన్నిటికన్నా ముఖ్యంగా నాయకత్వంపై ప్రజల్లో ఏర్పడ్డ ప్రగాఢ విశ్వాసం కడవరకూ చెదరక నిలవడం తుది ఫలితాల్ని శాసిం చింది. సదరు నాయకత్వంపై విశ్వాసాన్ని సడలింప జేసేందుకు జరిగిన యత్నాలను తిప్పికొట్టే క్రమంలో నాయకుడు, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు (కేసీఆర్) తీసుకున్న జాగ్రత్తలు, ఎత్తుగడలు వారి గెలుపును మరింత దృఢపరిచాయి. కేసీఆర్ తనను తాను ‘ఎజెండా’ చేసుకున్నారు. పార్టీ శ్రేణులన్నీ క్రమశిక్షణ కలిగిన సైన్యంలాగే తమ ‘జనరల్’ వెనుక కవాతులా నడిచాయి.
ప్రజాభిప్రాయాన్ని మలచడమొక కళ!
ఎన్నికల్లో రాజకీయ పక్షాలు తమ విధానాల ప్రచారం ద్వారా ప్రజాభిప్రాయాన్ని సానుకూలంగా మలచ జూస్తాయి. ఈ క్రమంలో... పాలక–విపక్షాలు కొన్ని మౌలిక విషయాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వాలపై ప్రజాభిప్రాయానికి వివిధ స్థాయిలుంటాయి. సామూహిక ప్రజా వ్యతిరేకత, తీవ్ర ప్రజా వ్యతిరేకత, వ్యతిరేక–సానుకూల భావనలు లేని తటస్థ స్థితి, సానుకూలత, బలమైన సానుకూలత.... ఇలా వైవిధ్యంగా ఉండే పరిస్థితుల్ని బట్టి ఎవరైనా నిర్దిష్ట కార్యాచరణతో ఎన్నికల పోరు జరపాలి. ఇక్కడ అంచనాలు ఏ మాత్రం తప్పినా వ్యూహం ఫలించదు.
పుష్కర కాలం ఉద్యమించి తెలంగాణ సాధించిన పార్టీగా అధికారం చేపట్టిన తెరాస, నాలుగున్నరేళ్ల పాలన తర్వాత నాలుగయిదు మాసాలు ముందే ఎన్నికలు తెచ్చింది. అదొక వ్యూహం! విపక్షం అంచనా వేసినట్టు వ్యతిరేకత మొదలవుతోంది, అది బలపడక ముందే ప్రజాతీర్పుకు వెల్లడం మేలు చేస్తుందన్న భావనా పాలకపక్షానికి ఉండిందేమో! ప్రజావ్యతిరేకత స్థాయిని విపక్షం గ్రహించి ఉండాల్సింది. సామూహిక ప్రజా వ్యతిరేకత తెలంగాణ రాష్ట్రంలో లేదు. సంఖ్యాపరంగా అత్యధికులైన సామాన్యులు, మధ్యతరగతికి ప్రత్యక్ష లబ్ది చేకూరుస్తున్న పింఛన్లు, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్, రైతుబంధు, కేసీఆర్ కిట్, వృత్తులపరమైన మేళ్లు వంటి సంక్షేమ పథకాల అమలు సవ్యంగా ఉంది.
లబ్దిదారులు సర్కారుపై కొంత కృతజ్ఞతతో ఉన్నారు. ముఖ్యంగా కొడుకులు సరిగా చూడని తలిదండ్రులు, భర్తల ఆర్థిక వెసలుబాటు కరువై కాన్పు ఖర్చులకు జడుస్తున్న భార్యలు, ఒంటరి మహిళలు, పెట్టుబడి ఖర్చులతో కృంగిన రైతులు... సర్కారు చేయూతకు సంతసించారు. ప్రభుత్వంపైన, నాయకుడు కేసీఆర్ పైన ప్రజా విశ్వాసం బలంగా ఉంది. పౌరుల ఇతరేతర వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేరనందున స్థానిక నాయకత్వం, ముఖ్యంగా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత బలంగా ఉంది. అది పలు సందర్భాల్లో కొట్టొచ్చినట్టు కనిపించింది. అందుకే, స్థూలంగా ప్రభుత్వంపైనో, నాయకుడిపైనో ప్రచారాన్ని కేంద్రీకృతం చేయకుండా విపక్షాలు స్థానిక నాయకత్వాన్నే లక్ష్యం చేసి పోరాడాల్సింది. ప్రజల్లోకి వెళ్లి, వారితో సంబంధాల్ని నెరపి, ప్రజాభిప్రాయాన్ని మలచడానికి ఈ దారి ఎంచుకొని ఉండాల్సింది.
వారెదుర్కొంటున్న ప్రధాన సమస్యల్ని తీసుకొని క్రమంగా ఉద్యమాలు నిర్మించాల్సింది. అలా కాకుండా కేవలం పత్రికా ప్రకటనలు, టీవీ చర్చల్లో విసుర్లు, నిత్యం మీడియా వేదికగా విమర్శలతోనే ప్రజాభిప్రాయాన్ని నిర్మిస్తామనుకోవడం పొరపాటు అని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. సంక్షేమ పథకాల పట్ల సానుకూలతతో లబ్దిపొందాలనుకున్న పాలకపక్షం నియోజకవర్గాల వారిగా వివరాలు సేకరించింది. ప్రతి నియోజకవర్గంలోనూ, బహుళ పథకాల లబ్దిని కలగలిపి లెక్కించినా, నికరంగా సగటున 30 నుంచి 60 వేల మంది ఓటర్లు ప్రత్యక్ష లబ్దిదారులుగా తేలారు. ఆ జాబితాలు చేబూని నిర్దిష్ట ప్రచారమూ చేశారు. ఇవి కొనసాగడమా, నిలిచిపోవడమా? మీకేం కావాలి? అన్న తరహాలోనూ కొన్నిచోట్ల ప్రచారం వారికి లాభించింది. పెద్ద సంఖ్యలో ఓట్ల వ్యత్యాసాలతో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో లక్షకు పైగా ఓట్లు పొందిన విజేతలు 26 మంది ఉండగా అందులో 24 మంది తెరాస వాళ్లే!
బాబుతో ‘చేయి’ కలపడం నిలువునా ముంచింది
సున్నిత మనోభావాలు, స్వీయ అస్తిత్వ ప్రభావం నుంచి క్రమంగా బయటపడుతూ పాలన–రాజకీయ అంశాల ఆధారంగానే ఇక తెలంగాణ రాష్ట్రం రెండో ఎన్నికలని అత్యధికులు భావించారు. తెలంగాణ మనుగడతోనే నిమిత్తం లేని తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రంగప్రవేశంతో పూర్తి ఎన్నికల అస్తిత్వ చిత్రమే మారిపోయింది. కాంగ్రెస్ నిర్హేతుకంగా టీడీపీతో జట్టు కట్టి, బాబును ముందు పెట్టి తెరాసను ఢీకొనడం రాజకీయ పరిశీలకుల్నీ విస్మయపరిచింది. అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చి ఆలోచనల్ని రగిలించే నిప్పందించినట్టయింది. విశ్వసనీయత, పాలనాదక్షత కొరవడిన పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి, తెరవెనుక వ్యవహారాలతో ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారన్న ఊహనే తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోయింది.
దాన్నొక ప్రమాదంగానూ శంకించింది. పాలకుల ఒంటెద్దు పోకడ, నియంతృత్వ ధోరణిని నిరసించిన వారూ మనసు మార్చుకొని, తమ ‘ఓటింగ్’ నిర్ణయ దిశనే మార్చారు. సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చినట్టుగానే, ఏ ప్రచార పటాటోపాలకూ లొంగకుండా, ‘సర్వే’ జిమ్మిక్కులకూ బోల్తాపడకుండా, అయోమయానికీ గురి కాకుండా ఇచ్చిన ‘తీర్పు’నకు ఏపీలోనే కాక ఇతర రాష్ట్రాల్లోనూ అభినందనలు వ్యక్తమౌతున్నాయి. ఆర్థిక వనరులతో ఆదుకున్నాడన్న లాలూచీతో కాంగ్రెస్ ఇచ్చిన చనువు, చంద్రబాబు వ్యూహ తప్పిదం విపక్షాలకు తీవ్ర నష్టం కలిగించింది. సానుకూల అంశాలతో, స్థానిక నాయకత్వ వైఫల్యాల్ని ఎత్తిచూపడంతో సాగాల్సిన విపక్ష ప్రచారం భిన్నంగా సాగింది. ప్రచార హోరు... టీఆరెస్ వర్సెస్ కూట మిగా కాకుండా కేసీఆర్ వర్సెస్ చంద్రబాబుగా దిశ మార్చుకుంది.
దాంతో కేసీఆర్ నాయకత్వ ఖ్యాతి ముందు చంద్రబాబు విశ్వసనీయత వెలవెలబోయింది. ఉద్యోగులు ఉద్యమించినా అణచివేసి ఏపీలో బలవంతంగా అమలు చేస్తున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను తెలంగాణలో అధికారంలోకి రాగానే ఎత్తివేస్తామనడాన్ని తెలంగాణ ఉద్యోగులెవరూ నమ్మలేదు. ఏపీలో ప్రత్యర్థి పక్షమైన వైఎస్సార్‌సీపీ ఎమ్మేల్యేల్ని పెద్ద సంఖ్యలో తన పార్టీలోకి కొని తెచ్చుకొని, నలుగురిని మంత్రుల్ని చేసిన బాబే, ఇక్కడ పార్టీ మారిన వారిని చిత్తుచిత్తుగా ఓడించండని పిలుపునిస్తే... జనం నవ్వుకున్నారు.
నాయకత్వ పరంగానే ప్రత్యామ్నాయం చూస్తారు
ఇదివరకు ప్రజలు ఓటర్లు మాత్రమే! ఇప్పుడు ఓటర్లు తాము పౌరులమని ఆలోచిస్తున్నారు. తమకు గురి కుదిరిన, విశ్వాసం కలిగిన నాయకుడి ఆలోచనల్ని స్వాగతిస్తున్నారు. తమ అవసరాలు ఈ నాయకత్వంతో తీరుతాయా? ఇచ్చిన మాటయినా వీరు నిలబెట్టుకోగలరా? అనీ ఆలోచిస్తున్నారు. రాజకీయ పక్షాలు ఈ లోతుల్ని గ్రహించడం లేదు. తెలం గాణ ప్రజలు ప్రత్యామ్నాయాన్ని వెతకటం లేదని విపక్షం గ్రహించలేదు. ఒక వేళ వెతుకుతున్నారనుకున్నా... తాము మెరుగైన ప్రత్యామ్నాయం ఇవ్వగలమని విపక్షం ఏ దశలోనూ భరోసా కల్పించలేకపోయింది.
ఈ రాష్ట్రంలో, దేశంలో వేదికలెక్కి, సామాజిక మాధ్యమాల్లో జొరబడి, టీవీ చర్చల్లో పూనకం వహించి... ఎక్కువగా మాట్లాడేవారి చేతుల్లో ఓట్లు లేవు. ఓట్లున్న సగటు పౌరులు మాట్లాడరు. అందుకే, పైపై పరిశీలకులకు, మీడియాకు ప్రజానాడి దొరకదు. నిన్న వెలువడిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్∙రాష్ట్రాల ఎన్నికల ఫలితాల విశ్లేషణలోనూ శాస్త్రీ యత కొరవడింది. స్థానిక పరిస్థితుల్ని, దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాల్ని పరిగణనలోకి తీసుకోకుండానే నిర్ణయానికి వస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో పదిహేనేళ్లుగా పాలకపక్షమై ఉండి బీజేపీ ఓడిపోయింది. రాజస్తాన్‌లో ప్రతిసారీ ప్రత్యామ్నాయ ప్రభుత్వాల్ని ఎన్నుకునే సంప్రదాయాన్ని కొనసాగించారు. అప్పటికీ మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో బీజేపీ గౌరవప్రదమైన సంఖ్యతో గట్టి పోటీ ఇచ్చింది.
సదరు తీర్పు ప్రధాని మోదీకి వ్యతిరేకమనో, కాంగ్రెస్ అధినేత రాహుల్‌కు అనుకూలమనో అంకెలతో తేల్చేస్తున్నారు. దీంతో ఇక తమ రొట్టె నేతిలో పడిందని కొందరు అవకాశవాద రాజకీయులు చంకలు గుద్దుకుంటున్నారు. ఎన్నికల ముందు ఎన్డీటీవి జరిపిన సర్వేలో ఆయా రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు చౌహాన్, విజయ రాజె, రమణ్‌సింగ్‌లకన్నా ప్రజానుకూలత అదే పార్టీకి చెందిన ప్రధాని నరేంద్ర మోదీకి ఎంతో ఎక్కువగా ఉంది. రేపు ఏపీ ఎన్నికల్లో అయినా, పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో అయినా నాయకత్వ పటిమ, ఇచ్చిన మాట నిలబెట్టుకునే విశ్వసనీయత, ప్రజావసరాలు తీర్చే నిబద్దతే జనం దృష్టిలో ప్రామాణికమౌతాయి. రాజకీయ పక్షాలు ఇది గ్రహించాలి. ప్రచారాల మాయలో పడకుండా, నిండైన తమ విశ్వాసంతో, ఆశలతో, ఆకాంక్షలతో ప్రజలిచ్చిన తీర్పును ఏ పక్షాలూ వంచించ కూడదు. ముఖ్యమంత్రి కేసీఆరే అన్నట్టు, ‘‘గెలుపు ఎంత ఘనమో! బాధ్యత అంత బరువు’’.
వ్యాసకర్త: దిలీప్ రెడ్డి
ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment