four states Assembly elections
-
అనుభవానికే అగ్రాసనం
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడుచోట్ల–మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ కంచుకోటలను తుత్తినియలు చేసి ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మూడురోజుల తర్వాత రెండు రాష్ట్రాలకు కొత్త ఏలికలను ప్రకటించింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి కమ ల్నాథ్నూ, రాజస్తాన్‌కు అశోక్ గహ్లోత్నూ ఎంపిక చేసి యువ రక్తం కన్నా అనుభవానికే ప్రాధా న్యత ఇవ్వదల్చుకున్నట్టు తెలియజెప్పింది. ఆ రెండుచోట్లా సీఎం పదవుల్ని ఆశించిన జ్యోతిరా దిత్య సింధియా(మధ్యప్రదేశ్), సచిన్ పైలట్(రాజస్తాన్)లు ఉపముఖ్యమంత్రులవుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌పై నిర్ణయాన్ని శనివారం ప్రకటిస్తారు. తాజా ఎంపికలను గమనిస్తే పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ మార్క్ రాజకీయాలను సంపూర్ణంగా ఒంటబట్టించుకున్నట్టు అర్ధమవు తుంది. పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న కాలంలో తరచు ఆయన వారసత్వ రాజకీయాలు సరికాదని చెప్పేవారు. తమ పార్టీతోసహా దేశంలోని పార్టీలన్నీ కొద్దిమంది వ్యక్తుల ప్రాబల్యంతో నడుస్తు న్నాయని, ముఖ్యంగా కాంగ్రెస్ అనుసరించే హైకమాండ్ సంస్కృతికి తాను వ్యతిరేకమని చెప్పే వారు. ముఖ్యమంత్రులుగా ఎవరుండాలనే అంశాన్ని స్థానిక శాసనసభ్యులే నిర్ణయించాలి తప్ప హైకమాండ్ కాదని రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో సరిగ్గా అయిదేళ్లక్రితం జరిగిన మేధో మథన సదస్సులో ఆయన చెప్పారు. కానీ ఇప్పుడు మధ్యప్రదేశ్‌తోపాటు రాజస్తాన్‌కు కూడా సీఎంల ఎంపికలో తల్లి సోనియాగాంధీ, సోదరి ప్రియాంకల సాయం తీసుకున్నారు. వారు ముగ్గురూ చర్చించుకుని, ఆశావహులతో విడివిడిగా మాట్లాడి చివరకు తమ నిర్ణయాలను ప్రకటించారు. ఈ ప్రక్రియ కాంగ్రెస్‌కు కొత్తగాదు. కానీ పార్టీ శాసనసభ్యులు మాత్రమే నిర్ణయించుకోవాలని గతంలో చెప్పిన రాహుల్ అది ఆచరణ సాధ్యంకాదన్న అభిప్రాయానికొచ్చారని తేటతెల్లమవు తోంది. అంతేకాదు... ఎలాంటి ఆరోపణలూ లేనివారిని మాత్రమే ఎంపిక చేయాలన్న పట్టింపు కూడా ఆయనకేమీ లేదని అర్ధమవుతుంది. ఎంపికైన ఇద్దరు నేతలూ రాహుల్ కంటే సోనియాకు సన్నిహితులు. అశోక్ గహ్లోత్‌కు సమర్థ పాలకుడిగా పేరుంది. దానికితోడు అపారమైన అనుభవం ఉంది. పెద్దగా ఆరోపణలు లేవు. కానీ కమల్‌నాథ్ విషయంలో అలా కాదు. 1984లో ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన సిక్కుల ఊచకోత కేసులో ఆయనపై ఆరోపణలొచ్చాయి. ఈ ఊచ కోత కేసులను పరిశీలించేందుకు ఏర్పాటైన నానావతి కమిషన్ కమల్‌నాథ్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. రకబ్గంజ్ గురుద్వారా సమీపంలో హింస చోటుచేసుకున్నప్పుడు అప్పటికి కాంగ్రెస్ యువ నాయకుడిగా ఉన్న కమల్‌నాథ్ అక్కడే ఉన్నారన్నది ఆరోపణ. అయితే తగిన సాక్ష్యాధారాలు లభించని కారణంగా ఆయనపై కేసు ముందుకు సాగలేదు. రెండేళ్లక్రితం ఆయన్ను పంజాబ్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా నియమించినప్పుడు సిక్కుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావ డంతో ఆ నిర్ణయాన్ని కాంగ్రెస్ ఉపసంహరించుకుంది. కానీ అదే కమల్‌నాథ్‌ను ఇప్పుడు సీఎం పదవికి ఎంపిక చేయటం ద్వారా బీజేపీకి తగిన ఆయుధాన్ని కాంగ్రెసే అందించినట్టయింది. పంజాబ్‌లో మిత్రులుగా ఉన్న బీజేపీ, అకాలీదళ్ ఇప్పటికే దీనిపై విమర్శలు సంధిస్తున్నాయి. అయితే కమల్‌నాథ్ ఇందిరాగాంధీ కాలంనుంచీ పార్టీని నమ్ముకుని ఉన్నారు. అత్యవసర పరిస్థితి ఎత్తేశాక 1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీనుంచి ఎంపీగా గెలిచింది ఆయనొక్కరే. పొరుగునున్న ఉత్తరప్రదేశ్‌లో ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు సంజయ్‌గాంధీ సహా పార్టీ మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని గుర్తుంచుకుంటే ఈ గెలుపు ప్రాముఖ్యత అర్ధమ వుతుంది. చాలాకాలం తర్వాత పార్టీకి దక్కిన తొలి విజయాలు గనుక..మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో పార్టీకి లభించిన మెజారిటీ స్వల్పం గనుక ఆ రెండుచోట్లా దూకుడుగా వెళ్లటం అంత మంచి దికాదని రాహుల్ అనుకొని ఉండొచ్చు. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు 116మంది మద్దతు అవసరం కాగా కాంగ్రెస్‌కు 114, బీజేపీకి 109 వచ్చాయి. అయితే అక్కడ రెండు స్థానాలొచ్చిన బీఎస్పీ, ఒకటి గెల్చుకున్న ఎస్పీ కాంగ్రెస్‌కు మద్దతిస్తామని ప్రకటించాయి. ఓట్ల శాతం రీత్యా చూస్తే కాంగ్రెస్‌కన్నా బీజేపీకే అధికంగా వచ్చాయి. కాంగ్రెస్ 40.9శాతం ఓట్లు గెల్చుకోగా, బీజేపీ 41శాతం ఓట్లు సాధించుకుంది. అక్కడి బీజేపీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్థానంలో వేరెవరైనా ఉంటే కాంగ్రెస్‌ను సులభంగా అధికారానికి దూరం పెట్టేవారు. చౌహాన్ అందుకు అంగీకరించ లేదు. అలాగే రాజస్తాన్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు కావల్సిన మెజారిటీ 100 స్థానాలు కాగా, కాంగ్రెస్‌కు 99 లభించాయి. బీజేపీకి 73, స్వతంత్రులకు 13, ఇతర పార్టీలకు 14 వచ్చాయి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఓట్ల శాతం 39.3 కాగా, బీజేపీ ఓట్ల శాతం 38.8. మరో ఆర్నెల్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యువకులైన జ్యోతిరాదిత్య, సచిన్ పైలట్లకు అవకాశమిస్తే ఏమవుతుందోనన్న సంశయం ఏర్పడి ఉండొచ్చు. వీరిద్దరూ ఆ రాష్ట్రాల్లో కీలక బాధ్యతలు నిర్వ హించటం వల్ల చాలామంది తదుపరి సీఎంలు వీరే కావొచ్చునన్న అంచనాకొచ్చారు. జ్యోతి రాదిత్య మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్‌గా, సచిన్ పైలెట్ రాజస్తాన్ పీసీసీ అధ్య క్షుడిగా ఉన్నారు. ఆ రెండు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్‌గఢ్‌లో పార్టీ ముందున్న సవాళ్లు చిన్నవేమీ కాదు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న పెను సంక్షోభమే బీజేపీకి శాపమైంది. అధికారంలోకొచ్చిన పదిరోజుల్లో రుణమాఫీ అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించబట్టే రైతులు ఆ పార్టీకి మద్దతు పలి కారు. ఇవిగాక పంటలకు గిట్టుబాటు ధరలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన వగైరా సమస్య లున్నాయి. ఇవన్నీ అనుకున్నట్టు చేయలేకపోతే ముంచుకొస్తున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కష్టాలు ఎదురవుతాయి. ఈ విషయంలో కమల్‌నాథ్, అశోక్ గహ్లోత్‌ల అనుభవం ఏమేరకు పని కొస్తుందో వేచిచూడాలి. -
మౌన జ్ఞాని మన ఓటరు
తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయాన్ని వెతకటం లేదని విపక్షం గ్రహించలేదు. ఒకవేళ వెతుకుతున్నారనుకున్నా... తాము మెరుగైన ప్రత్యామ్నాయం ఇవ్వగలమని విపక్షం భరోసా కల్పించలేకపోయింది. ఈ రాష్ట్రంలో, దేశంలో వేదికలెక్కి, సామాజిక మాధ్యమాల్లో జొరబడి, టీవీ చర్చల్లో పూనకం వచ్చినట్టు మాట్లాడేవారి చేతుల్లో ఓట్లు లేవు. ఓట్లున్న సగటు పౌరులు మాట్లాడరు. అందుకే, పైపై పరిశీలకులకు, మీడియాకు ప్రజానాడి దొరకదు. నిన్న వెలువడిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్∙రాష్ట్రాల ఎన్నికల ఫలితాల విశ్లేషణలోనూ శాస్త్రీయత కొరవడింది. స్థానిక పరిస్థితుల్ని, దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాల్ని పరిగణనలోకి తీసుకోకుండానే నిర్ణయానికి వస్తున్నారు. రాజకీయ క్షేత్రంలో దృశ్యం ఎలా ఉన్నా ప్రజాక్షేత్రంలో అయోమయం, అస్పష్టత ఉండదు. ఎక్కువ సందర్భాల్లో సాధారణ ప్రభావాలకు, ప్రలోభాలకూ లొంగని ఏకరీతి జనాభిప్రాయాన్నే ప్రతి బింబిస్తుంది. సాధారణ చూపులకు ఆననిదేదో అంతర్లీనంగా ఉండటం వల్లే కడవరకు దృశ్యం ఆవిష్కృతం కాదు. పలు ఊహలకు, అంచనాలకు తావిస్తుంది. ఎక్కువ సందర్భాల్లో వాటి ఆధారంగానే ప్రసారమాధ్యమాల విశ్లేషణలు, మేధావి వర్గం వాదనలు రూపుదిద్దుకుంటాయి. కొన్ని సంకేతాలను శాస్త్రీయంగా పరిశీలించి, విశ్లేషించే వారికి ప్రజానాడి దొరి కినా వేర్వేరు కారణాల వల్ల వాటిని ప్రజలు నమ్మరు. ఎన్నికల సమయంలో తీవ్ర ఉత్కంఠ తర్వాత ఏకపక్ష ఫలితాలు చాలా మందికి విస్మయం కల్గించడానికి ఈ మర్మమే కారణం! తెలంగాణలో నిన్నటి ఎన్నికల ఫలితాలు అధికులకు ఆశ్చర్యం కలిగించాయి. ఘనవిజయం సాధించిన పాలక తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస)లోనూ, తమ అంచనాల్ని మించి ఎక్కువ స్థానాలు రావడంతో కొందరు విస్మయం చెందారు. గెలుపోటముల కారణాలను ఇప్పడు ఎవరికి వారు తమకు అనువైన, అవగాహన మేర విశ్లేషిస్తున్నారు. తెరాసకు లభించిన స్థానాలు, ఆధిక్యతలు, ఒకటీ అర జిల్లాలు మినహా రాష్ట్రమంతటా వెలసిన విజయ విస్తృతిని చూస్తే ఒక అంశం స్పష్టమౌతోంది. ప్రచారం జరిగిన ప్రభుత్వ వ్యతిరేకత ప్రజాక్షేత్రంలో లేదు. పైగా, సానుకూలత క్రమంగా బలపడింది. దానికి తోడు పలు పరిణామాలు పాలకపక్షానికి కలిసి వచ్చాయి. అన్నిటికన్నా ముఖ్యంగా నాయకత్వంపై ప్రజల్లో ఏర్పడ్డ ప్రగాఢ విశ్వాసం కడవరకూ చెదరక నిలవడం తుది ఫలితాల్ని శాసిం చింది. సదరు నాయకత్వంపై విశ్వాసాన్ని సడలింప జేసేందుకు జరిగిన యత్నాలను తిప్పికొట్టే క్రమంలో నాయకుడు, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు (కేసీఆర్) తీసుకున్న జాగ్రత్తలు, ఎత్తుగడలు వారి గెలుపును మరింత దృఢపరిచాయి. కేసీఆర్ తనను తాను ‘ఎజెండా’ చేసుకున్నారు. పార్టీ శ్రేణులన్నీ క్రమశిక్షణ కలిగిన సైన్యంలాగే తమ ‘జనరల్’ వెనుక కవాతులా నడిచాయి. ప్రజాభిప్రాయాన్ని మలచడమొక కళ! ఎన్నికల్లో రాజకీయ పక్షాలు తమ విధానాల ప్రచారం ద్వారా ప్రజాభిప్రాయాన్ని సానుకూలంగా మలచ జూస్తాయి. ఈ క్రమంలో... పాలక–విపక్షాలు కొన్ని మౌలిక విషయాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వాలపై ప్రజాభిప్రాయానికి వివిధ స్థాయిలుంటాయి. సామూహిక ప్రజా వ్యతిరేకత, తీవ్ర ప్రజా వ్యతిరేకత, వ్యతిరేక–సానుకూల భావనలు లేని తటస్థ స్థితి, సానుకూలత, బలమైన సానుకూలత.... ఇలా వైవిధ్యంగా ఉండే పరిస్థితుల్ని బట్టి ఎవరైనా నిర్దిష్ట కార్యాచరణతో ఎన్నికల పోరు జరపాలి. ఇక్కడ అంచనాలు ఏ మాత్రం తప్పినా వ్యూహం ఫలించదు. పుష్కర కాలం ఉద్యమించి తెలంగాణ సాధించిన పార్టీగా అధికారం చేపట్టిన తెరాస, నాలుగున్నరేళ్ల పాలన తర్వాత నాలుగయిదు మాసాలు ముందే ఎన్నికలు తెచ్చింది. అదొక వ్యూహం! విపక్షం అంచనా వేసినట్టు వ్యతిరేకత మొదలవుతోంది, అది బలపడక ముందే ప్రజాతీర్పుకు వెల్లడం మేలు చేస్తుందన్న భావనా పాలకపక్షానికి ఉండిందేమో! ప్రజావ్యతిరేకత స్థాయిని విపక్షం గ్రహించి ఉండాల్సింది. సామూహిక ప్రజా వ్యతిరేకత తెలంగాణ రాష్ట్రంలో లేదు. సంఖ్యాపరంగా అత్యధికులైన సామాన్యులు, మధ్యతరగతికి ప్రత్యక్ష లబ్ది చేకూరుస్తున్న పింఛన్లు, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్, రైతుబంధు, కేసీఆర్ కిట్, వృత్తులపరమైన మేళ్లు వంటి సంక్షేమ పథకాల అమలు సవ్యంగా ఉంది. లబ్దిదారులు సర్కారుపై కొంత కృతజ్ఞతతో ఉన్నారు. ముఖ్యంగా కొడుకులు సరిగా చూడని తలిదండ్రులు, భర్తల ఆర్థిక వెసలుబాటు కరువై కాన్పు ఖర్చులకు జడుస్తున్న భార్యలు, ఒంటరి మహిళలు, పెట్టుబడి ఖర్చులతో కృంగిన రైతులు... సర్కారు చేయూతకు సంతసించారు. ప్రభుత్వంపైన, నాయకుడు కేసీఆర్ పైన ప్రజా విశ్వాసం బలంగా ఉంది. పౌరుల ఇతరేతర వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేరనందున స్థానిక నాయకత్వం, ముఖ్యంగా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత బలంగా ఉంది. అది పలు సందర్భాల్లో కొట్టొచ్చినట్టు కనిపించింది. అందుకే, స్థూలంగా ప్రభుత్వంపైనో, నాయకుడిపైనో ప్రచారాన్ని కేంద్రీకృతం చేయకుండా విపక్షాలు స్థానిక నాయకత్వాన్నే లక్ష్యం చేసి పోరాడాల్సింది. ప్రజల్లోకి వెళ్లి, వారితో సంబంధాల్ని నెరపి, ప్రజాభిప్రాయాన్ని మలచడానికి ఈ దారి ఎంచుకొని ఉండాల్సింది. వారెదుర్కొంటున్న ప్రధాన సమస్యల్ని తీసుకొని క్రమంగా ఉద్యమాలు నిర్మించాల్సింది. అలా కాకుండా కేవలం పత్రికా ప్రకటనలు, టీవీ చర్చల్లో విసుర్లు, నిత్యం మీడియా వేదికగా విమర్శలతోనే ప్రజాభిప్రాయాన్ని నిర్మిస్తామనుకోవడం పొరపాటు అని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. సంక్షేమ పథకాల పట్ల సానుకూలతతో లబ్దిపొందాలనుకున్న పాలకపక్షం నియోజకవర్గాల వారిగా వివరాలు సేకరించింది. ప్రతి నియోజకవర్గంలోనూ, బహుళ పథకాల లబ్దిని కలగలిపి లెక్కించినా, నికరంగా సగటున 30 నుంచి 60 వేల మంది ఓటర్లు ప్రత్యక్ష లబ్దిదారులుగా తేలారు. ఆ జాబితాలు చేబూని నిర్దిష్ట ప్రచారమూ చేశారు. ఇవి కొనసాగడమా, నిలిచిపోవడమా? మీకేం కావాలి? అన్న తరహాలోనూ కొన్నిచోట్ల ప్రచారం వారికి లాభించింది. పెద్ద సంఖ్యలో ఓట్ల వ్యత్యాసాలతో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలో లక్షకు పైగా ఓట్లు పొందిన విజేతలు 26 మంది ఉండగా అందులో 24 మంది తెరాస వాళ్లే! బాబుతో ‘చేయి’ కలపడం నిలువునా ముంచింది సున్నిత మనోభావాలు, స్వీయ అస్తిత్వ ప్రభావం నుంచి క్రమంగా బయటపడుతూ పాలన–రాజకీయ అంశాల ఆధారంగానే ఇక తెలంగాణ రాష్ట్రం రెండో ఎన్నికలని అత్యధికులు భావించారు. తెలంగాణ మనుగడతోనే నిమిత్తం లేని తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రంగప్రవేశంతో పూర్తి ఎన్నికల అస్తిత్వ చిత్రమే మారిపోయింది. కాంగ్రెస్ నిర్హేతుకంగా టీడీపీతో జట్టు కట్టి, బాబును ముందు పెట్టి తెరాసను ఢీకొనడం రాజకీయ పరిశీలకుల్నీ విస్మయపరిచింది. అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చి ఆలోచనల్ని రగిలించే నిప్పందించినట్టయింది. విశ్వసనీయత, పాలనాదక్షత కొరవడిన పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి, తెరవెనుక వ్యవహారాలతో ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారన్న ఊహనే తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోయింది. దాన్నొక ప్రమాదంగానూ శంకించింది. పాలకుల ఒంటెద్దు పోకడ, నియంతృత్వ ధోరణిని నిరసించిన వారూ మనసు మార్చుకొని, తమ ‘ఓటింగ్’ నిర్ణయ దిశనే మార్చారు. సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చినట్టుగానే, ఏ ప్రచార పటాటోపాలకూ లొంగకుండా, ‘సర్వే’ జిమ్మిక్కులకూ బోల్తాపడకుండా, అయోమయానికీ గురి కాకుండా ఇచ్చిన ‘తీర్పు’నకు ఏపీలోనే కాక ఇతర రాష్ట్రాల్లోనూ అభినందనలు వ్యక్తమౌతున్నాయి. ఆర్థిక వనరులతో ఆదుకున్నాడన్న లాలూచీతో కాంగ్రెస్ ఇచ్చిన చనువు, చంద్రబాబు వ్యూహ తప్పిదం విపక్షాలకు తీవ్ర నష్టం కలిగించింది. సానుకూల అంశాలతో, స్థానిక నాయకత్వ వైఫల్యాల్ని ఎత్తిచూపడంతో సాగాల్సిన విపక్ష ప్రచారం భిన్నంగా సాగింది. ప్రచార హోరు... టీఆరెస్ వర్సెస్ కూట మిగా కాకుండా కేసీఆర్ వర్సెస్ చంద్రబాబుగా దిశ మార్చుకుంది. దాంతో కేసీఆర్ నాయకత్వ ఖ్యాతి ముందు చంద్రబాబు విశ్వసనీయత వెలవెలబోయింది. ఉద్యోగులు ఉద్యమించినా అణచివేసి ఏపీలో బలవంతంగా అమలు చేస్తున్న కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను తెలంగాణలో అధికారంలోకి రాగానే ఎత్తివేస్తామనడాన్ని తెలంగాణ ఉద్యోగులెవరూ నమ్మలేదు. ఏపీలో ప్రత్యర్థి పక్షమైన వైఎస్సార్సీపీ ఎమ్మేల్యేల్ని పెద్ద సంఖ్యలో తన పార్టీలోకి కొని తెచ్చుకొని, నలుగురిని మంత్రుల్ని చేసిన బాబే, ఇక్కడ పార్టీ మారిన వారిని చిత్తుచిత్తుగా ఓడించండని పిలుపునిస్తే... జనం నవ్వుకున్నారు. నాయకత్వ పరంగానే ప్రత్యామ్నాయం చూస్తారు ఇదివరకు ప్రజలు ఓటర్లు మాత్రమే! ఇప్పుడు ఓటర్లు తాము పౌరులమని ఆలోచిస్తున్నారు. తమకు గురి కుదిరిన, విశ్వాసం కలిగిన నాయకుడి ఆలోచనల్ని స్వాగతిస్తున్నారు. తమ అవసరాలు ఈ నాయకత్వంతో తీరుతాయా? ఇచ్చిన మాటయినా వీరు నిలబెట్టుకోగలరా? అనీ ఆలోచిస్తున్నారు. రాజకీయ పక్షాలు ఈ లోతుల్ని గ్రహించడం లేదు. తెలం గాణ ప్రజలు ప్రత్యామ్నాయాన్ని వెతకటం లేదని విపక్షం గ్రహించలేదు. ఒక వేళ వెతుకుతున్నారనుకున్నా... తాము మెరుగైన ప్రత్యామ్నాయం ఇవ్వగలమని విపక్షం ఏ దశలోనూ భరోసా కల్పించలేకపోయింది. ఈ రాష్ట్రంలో, దేశంలో వేదికలెక్కి, సామాజిక మాధ్యమాల్లో జొరబడి, టీవీ చర్చల్లో పూనకం వహించి... ఎక్కువగా మాట్లాడేవారి చేతుల్లో ఓట్లు లేవు. ఓట్లున్న సగటు పౌరులు మాట్లాడరు. అందుకే, పైపై పరిశీలకులకు, మీడియాకు ప్రజానాడి దొరకదు. నిన్న వెలువడిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్∙రాష్ట్రాల ఎన్నికల ఫలితాల విశ్లేషణలోనూ శాస్త్రీ యత కొరవడింది. స్థానిక పరిస్థితుల్ని, దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాల్ని పరిగణనలోకి తీసుకోకుండానే నిర్ణయానికి వస్తున్నారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో పదిహేనేళ్లుగా పాలకపక్షమై ఉండి బీజేపీ ఓడిపోయింది. రాజస్తాన్‌లో ప్రతిసారీ ప్రత్యామ్నాయ ప్రభుత్వాల్ని ఎన్నుకునే సంప్రదాయాన్ని కొనసాగించారు. అప్పటికీ మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో బీజేపీ గౌరవప్రదమైన సంఖ్యతో గట్టి పోటీ ఇచ్చింది. సదరు తీర్పు ప్రధాని మోదీకి వ్యతిరేకమనో, కాంగ్రెస్ అధినేత రాహుల్‌కు అనుకూలమనో అంకెలతో తేల్చేస్తున్నారు. దీంతో ఇక తమ రొట్టె నేతిలో పడిందని కొందరు అవకాశవాద రాజకీయులు చంకలు గుద్దుకుంటున్నారు. ఎన్నికల ముందు ఎన్డీటీవి జరిపిన సర్వేలో ఆయా రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు చౌహాన్, విజయ రాజె, రమణ్సింగ్లకన్నా ప్రజానుకూలత అదే పార్టీకి చెందిన ప్రధాని నరేంద్ర మోదీకి ఎంతో ఎక్కువగా ఉంది. రేపు ఏపీ ఎన్నికల్లో అయినా, పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో అయినా నాయకత్వ పటిమ, ఇచ్చిన మాట నిలబెట్టుకునే విశ్వసనీయత, ప్రజావసరాలు తీర్చే నిబద్దతే జనం దృష్టిలో ప్రామాణికమౌతాయి. రాజకీయ పక్షాలు ఇది గ్రహించాలి. ప్రచారాల మాయలో పడకుండా, నిండైన తమ విశ్వాసంతో, ఆశలతో, ఆకాంక్షలతో ప్రజలిచ్చిన తీర్పును ఏ పక్షాలూ వంచించ కూడదు. ముఖ్యమంత్రి కేసీఆరే అన్నట్టు, ‘‘గెలుపు ఎంత ఘనమో! బాధ్యత అంత బరువు’’. వ్యాసకర్త: దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
ప్రజా విశ్వాసం పొందని ‘రాణి’
రాజస్తాన్‌లో వసుంధరా రాజే స్వయం కృతాపరాధమే పార్టీ ఓటమికి దారి తీసింది. బీజేపీపై వ్యతిరేకత కంటే కూడా వసుంధరాపై ప్రజల్లో ఉన్న ఆగ్రహమే ఈ పరిస్థితికి దారి తీసింది. వసుంధరా రాజే ఈ ఎన్నికలను తన చుట్టూనే తిప్పుకున్నారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిసినా తాను ప్రవేశపెట్టిన ఆరోగ్య బీమా వంటి పథకాలే పార్టీని గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు. ఆ అతి విశ్వాసంతోనే అధిష్టానంతో ఢీ అంటే ఢీ అంటూ తన మాటే నెగ్గేలా చూసుకున్నారు. టిక్కెట్ల పంపిణీ దగ్గర్నుంచి ప్రచారం వరకూ అంతా తానై వ్యవహరించారు. చివరి నిమిషంలో కుల సమీకరణలపై రాజే ఆశలు పెట్టుకున్నప్పటికీ రాజ్పుట్లు, జాట్లు కలిసిరాలేదు. ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుసుకున్న అధిష్టానం 100 మంది సిట్టింగ్‌లకు టిక్కెట్లు నిరాకరించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో వసుంధర రాజే మెజారిటీ సైతం బాగా తగ్గిపోయింది. యూనస్ ఖాన్, రాజ్‌పాల్ సింగ్ షెకావత్, అరుణ్ చతుర్వేది, శ్రీచంద్ క్రిప్లానీ వంటి మంత్రులు కూడా ఓటమి పాలయ్యారు. సొంత పార్టీ నేతలే కలిసిరాలేదు.. అన్నదాతల ఆక్రోశాన్ని వసుంధరా రాజే సర్కార్ ఎన్నడూ పట్టించుకోలేదు. వారి అసంతృప్తిని చల్లార్చడానికి వీసమెత్తు ప్రయత్నం చేయలేదు. కుల సమీకరణలు అత్యంత కీలకమైన రాష్ట్రంలో ఈ సారి ఎన్నికలు రాజ్పుత్రులు వెర్సస్ రాజేగా మారిపోయాయి. రాజ్‌పుత్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ ఆనందపాల్ సింగ్ ఎన్కౌంటర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజ్‌పుత్ నాయకుడికి అవకాశం దక్కకుండా రాజే అడ్డుకోవడం వంటివి వసుంధరపై ఆ వర్గంలో తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. రహదారుల వెడల్పు, సుందరీకరణ అంటూ రోడ్డు పక్కనున్న చిన్న గుడుల్ని తొలగించడం, గోరక్షకుల పేరుతో జరిగిన మూకదాడులు కూడా బీజేపీపై వ్యతిరేకతను పెంచాయి. రాజే నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్న ఆరెస్సెస్ కూడా ఈ ఎన్నికల్లో మనస్ఫూర్తిగా పనిచేయలేదు. ఆరెస్సెస్ యంత్రాంగం రాజే సర్కార్‌ను గెలిపించడానికి పెద్దగా కృషి చేయలేదు. ప్రధాని మోదీ, అమిత్ షాలు కూడా బీజేపీని ముంచినా, తేల్చినా అందుకు రాజేదే బాధ్యత అన్నట్టుగా వదిలేశారు. మహిళా సీఎం ఉన్నప్పటికీ రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఆగలేదు. యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అంటూ ఇచ్చిన హామీలను రాజే ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. పైలెట్+ గెహ్లాట్= కాంగ్రెస్ గెలుపు బీజేపీ సర్కారుపై ప్రజల్లో, ముఖ్యంగా రైతుల్లో ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. వివిధ సంక్షేమ పథకాలను ప్రకటించింది. ముఖ్యంగా..అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే రుణ మాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఇచ్చిన హామీ బాగా పనిచేసింది. పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌లు సమన్వయంతో పనిచేయడం కాంగ్రెస్‌కి ప్లస్ పాయింట్ అయింది. సీనియర్ నేత గెహ్లాట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలతో మంచి అనుబంధం ఉంది. వారిలో ఉత్సాహం నింపి కష్టించి పనిచేసేలా చేయడం లో గెహ్లాట్ సక్సెస్ అయ్యారు. ఇక సచిన్ పైలెట్ పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర్రవ్యాప్తంగా బలపం కట్టుకొని తిరిగారు. ఉద్యోగాలు రాక అసహనంతో ఉన్న యువ ఓటర్లను ఆకర్షించేలా సచిన్ వ్యూహరచన చేశారు. వారి సమష్టి కృషి కాంగ్రెస్ విజయానికి కారణమైంది. కాంగ్రెస్‌కు సవాలే రాజస్తాన్‌లో కష్టపడి సాధించుకున్న ఈ విజయం కాంగ్రెస్‌కు ఏమంత ఆశాజనకంగా లేదు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించు కోవాలన్న ఆ పార్టీ ఆశలు నెరవేరేది అనుమానంగానే మారింది. ఈ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన రాష్ట్రీయ లోక్తంత్ర పార్టీ, భారతీయ ట్రైబల్ పార్టీ వంటివి గణనీయమైన ఓట్లను సంపాదించుకోవడం కాంగ్రెస్‌కు ఇబ్బందికరమే. టిక్కెట్ల పంపిణీ సరిగా లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ రెబెల్స్ ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటారు. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం కూడా ఆ పార్టీకి మైనస్‌గా మారిందని భావిస్తున్నారు. ఇప్పుడైనా సీఎంగా సరైన నేతను ఎంపిక చేయకపోతే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదనే అభిప్రాయం వినవస్తోంది. -
పీఠం ఎవరిది?
రాజస్తాన్ ముఖ్యమంత్రి పగ్గాలు ఎవరు చేపడతారనేది ఆసక్తికరంగా మారింది. రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత, రాజయాల్లో కాకలు తీరిన అశోక్ గెహ్లాట్ ఒకవైపు, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన యువనేత సచిన్ పైలెట్ మరోవైపు సీఎం పీఠం కోసం పోటీ పడుతున్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లోనూ ఘోర పరాజయాన్ని చూసిన తర్వాత కాంగ్రెస్ శ్రేణులు నిస్తేజంగా మారిపోయాయి. అప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే కాంగ్రెస్ నాయకులు భయపడ్డారు. అలాంటి సమయంలో పీసీసీ పగ్గాలు చేపట్టిన సచిన్ పైలెట్ పార్టీని పటిష్టం చేయడానికి తీవ్రంగా శ్రమించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ యువతను పార్టీ వైపు ఆకర్షించడంలో సక్సెస్ అయ్యారు. ఈ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేయడం వెనుక సచిన్ కృషి ఎంతైనా ఉంది. నియోజకవర్గాల వారీగా మేనిఫెస్టోలు రూపొందించి బీజేపీ ఓటు బ్యాంకును కాంగ్రెస్‌కు మళ్లించడానికి సచిన్ పాటుపడ్డారు. రాహుల్ ఆశీస్సులు కూడా తనకే ఉండడం సచిన్‌కు కలిసొచ్చే అంశం. ఇందిర మెచ్చిన గెహ్లాట్ అశోక్ గెహ్లాట్‌ను కూడా కాంగ్రెస్ పార్టీ తక్కువ చేసి చూడలేదు. గత ఎన్నికల్లో మోదీ ప్రభంజనాన్ని తట్టుకొని కాంగ్రెస్‌లో గెలిచిన శక్తిమంతుడైన నాయకుడు గెహ్లాట్. సంస్థాగత వ్యవహారాలను చక్కబెట్టడంలో ఆయనను మించిన వారు లేరన్న పేరుంది. ఇందిరాగాంధీ మెచ్చిన గెహ్లాట్ సోనియాకు సన్నిహితుడు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాజకీయ వ్యూహాలు రచించడంలో ఆయనది అందెవేసిన చెయ్యి. అంతేకాదు, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో అనుచరగణం ఆయనకు ఎక్కువే. వారు మళ్లీ గెహ్లాట్‌నే సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో గెలుపు మాత్రమే కాదు, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా గెలుపు కాంగ్రెస్‌కు అత్యంత అవసరం. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి పార్లమెంట్ ఎన్నికలను కూడా సమర్థంగా నడిపించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ హిందూత్వ కార్డు, రాహుల్ ఆలయాల సందర్శన వంటి వ్యూహాలు గెహ్లాట్‌వే. అలాంటి ఉద్ధండుడ్ని సీఎం పీఠంపై కూర్చోబెడితే లోక్‌సభ ఎన్నికల్ని కూడా సమర్థంగా నడిపిస్తారన్న అంచనాలున్నాయి. ఇక ప్రజాకర్షణ గెహ్లాట్‌కే అధికం. వివిధ సర్వేల్లో గెహ్లాట్ సీఎం కావాలని 35 శాతం మంది కోరుకుంటే, సచిన్ పైలెట్ సీఎం కావాలని 11 శాతం మంది మాత్రమే కోరుకోవడం గమనార్హం. వచ్చే ఏడాదే లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున గెహ్లాట్ సేవలను రాజస్తాన్‌కే పరిమితం చేయకుండా జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలనే ఆలోచనలో రాహుల్ ఉన్నట్టు సమచారం. -
బీజేపీ ఓట్ల శాతం తగ్గింది!
న్యూఢిల్లీ: బీజేపీ జోరుకు బ్రేకులు పడుతున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు మూడు ప్రధాన రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో గతంకన్నా భారీగా ఓట్ల శాతం కోల్పోయింది. ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో 2013 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓట్ల శాతం ఒక్కసారిగా తగ్గింది. అయితే ఆ ఓట్లు పూర్తిగా కాంగ్రెస్ వైపే మళ్లలేదు. ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా బీజేపీ ఓట్లను పంచుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లో అత్యధిక ఓట్లశాతంతో మొత్తం 65 స్థానాలకుగాను 62 స్థానాల్లో విజయం సాధించినా ఇప్పుడు అది తగ్గుముఖం పట్టింది. మరోవైపు తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే విజయం ఢంకా మోగించాయి. 2014 తర్వాత చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపేతర పార్టీలకు ఆదరణ పెరుగుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఫలితాలను చూస్తుంటే 2019 సాధారణ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలక పోషిస్తాయని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే మోదీకి వ్యతిరేకంగా బీజేపేతర పార్టీలు కూటమి ఏర్పాటు చేసే పనిలో ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో దిగజారిన బీజేపీ.. ఛత్తీస్‌గఢ్ 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 41 శాతం ఓట్లు రాగా, 2014లో అది 49 శాతానికి పెరిగింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అది 32.2 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్‌కు 2013లో 40.3శాతం రాగా, 2014లో 38.37 శాతానికి తగ్గింది. ఈ ఎన్నికల్లో 43.2 శాతానికి పెరిగింది. 2013లో బీఎస్పీకి 4.3 శాతం ఓట్లు రాగా.. ఈ సారి ఆ పార్టీ మాజీ సీఎం అజిత్ జోగి పార్టీతో కూటమిగా ఏర్పడి 10.7 శాతం ఓట్లు దక్కించుకుంది. మరోవైపు స్వతంత్రులు 2013లో 5.3 శాతం కొల్లగొట్టగా తాజాగా 6.3 శాతానికి మెరుగయ్యారు. రాజస్తాన్‌లోనూ అదే పరిస్థితి.. రాజస్తాన్‌లోనూ బీజేపీ పరిస్థితి అలాగే ఉంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 45.2 శాతం ఓట్లు బీజేపీకి రాగా, ఇప్పుడది 38.8కి పడిపోయింది. 2014లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ రికార్డ్ స్థాయిలో 55శాతం ఓట్లను కొల్లగొట్టి మొత్తం 25 స్థానాలూ గెలిచింది. గతంతో పోలిస్తే కాంగ్రెస్ మెరుగైంది. 2013లో 33.1 శాతం వస్తే, ఇప్పుడది 39.2కు చేరింది. 2014లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి 30 శాతం ఓట్లతో సరిపెట్టుకుని అన్ని స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోయింది. ఇక ఇక్కడ స్వంతత్రుల ఓటు షేర్ 8.2 శాతం నుంచి 9.5కి పెరిగింది. మిజోలో కాంగ్రెస్ చతికిల.. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించిన 5 రాష్ట్రాల్లో కేవలం మిజోరాంలోనే బీజేపీకి ఓట్ల శాతం పెరగడం, కాంగ్రెస్ తగ్గడం జరిగింది. అయితే ఇక్కడ కాంగ్రెస్‌ను ఓడించిన ప్రాంతీయ మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్)దే అత్యధిక ఓట్లు సాధించింది. 2013లో ఇక్కడ కాంగ్రెస్‌కు 45 శాతం ఓట్లు రాగా, తాజాగా అది 30 శాతానికి పడిపోయింది. ఇక బీజేపీ 0.4 నుంచి 8 శాతానికి పెంచుకోగలిగింది. ఇక ఎంఎన్ఎఫ్ ఓట్ల శాతం 28.8 శాతం నుంచి ఈసారి 37.6 పెరిగింది. హోరాహోరీగా మధ్యప్రదేశ్.. కాంగ్రెస్, బీజేపీకి మధ్య పోటీ హోరా హోరాగా ఉండటంతో మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఓట్ల శాతం ఆసక్తిగా మారింది. 2013తో పోలిస్తే తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 36.4 శాతం ఓట్ల నుంచి 41.4కి పెరిగింది. ఇక బీజేపీ 44.9శాతం నుంచి 41.3కు పడిపోగా, బీఎస్పీ 4.6 శాతానికి పడిపోయింది. ఇక స్వతంత్రులు అదే 5 శాతం వద్ద ఆగిపోగా..చిన్న పార్టీలు తమ ఓటు షేర్ పెంచుకున్నాయి. కాగా, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ రెండూ పతనమయ్యాయి. -
మధ్యప్రదేశ్‌లో హంగ్?
భోపాల్: మంగళవారం ఉదయం నుంచి ఎంతో ఉత్కంఠ రేపిన మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలు చివరకు ఏ పార్టీకీ విజయాన్ని అందించకుండా నిరాశపరిచాయి. కాంగ్రెస్, బీజేపీల మధ్య విజయం దోబూచులాడింది. పూర్తి ఫలితాలు ఇంకా వెల్లడి కానప్పటికీ మధ్యప్రదేశ్‌లో హంగ్ అసెంబ్లీ ఏర్పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగానే బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. 230 సీట్లున్న శాసనభలో సాధారణ ఆధిక్యానికి 116 సీట్లు అవసరం కాగా, బీజేపీ, కాంగ్రెస్‌ల్లో ఏ పార్టీ ఆ మార్కును చేరుకోలేక పోతున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో అతి తక్కవ సీట్లే ఉన్నా పలు చిన్నా చితకా పార్టీలు, స్వతంత్రులకు అత్యంత ప్రాధాన్యమేర్పడింది. వీరి మద్దతు ఎవరికి లభిస్తే ఆ పార్టీ అధికారం చేపట్టనుంది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ కాంగ్రెస్ నేతలు మధ్యప్రదేశ్ గవర్నర్‌ను ఆనందీబెన్ పటేల్‌ను మంగళవారం రాత్రి పొద్దుపోయాక కోరారు. మంగళవారం అర్ధరాత్రి 12.15 గంటల సమాయానికి 172 స్థానాల ఫలితాలు వెలువడగా బీజేపీ 83, కాంగ్రెస్ 85, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఒక సీటు గెలిచింది. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించారు. మరో 58 స్థానాల్లో లెక్కింపు కొనసాగుతుండగా 26 సీట్లలో బీజేపీ, 28 స్థానాల్లో కాంగ్రెస్, రెండు చోట్ల బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ), మరోచోట ఎస్పీ అభ్యర్థి, ఇంకో చోట స్వతంత్ర అభ్యర్థి ముందంజలో ఉన్నారు. మొత్తంగా గెలిచిన, ముందంజలో ఉన్న స్థానాలతో కలిపి బీజేపీకి 109, కాంగ్రెస్‌కు 113 సీట్లు ఉన్నాయి. ప్రయత్నాలు ప్రారంభించిన కాంగ్రెస్ సాధారణ ఆధిక్యం లేకపోయినప్పటికీ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించడం ఖాయం కావడంతో ఆ పార్టీ నేతలు ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బీఎస్పీ, ఎస్పీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులతోనూ కాంగ్రెస్ నేతలు చర్చలు ప్రారంభించారు. ఎంపీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్, కాంగ్రెస్ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియాలు గెలిచిన అభ్యర్థులతో చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే గతంలో కాంగ్రెస్‌తో పొత్తు అంశాన్ని మాయావతి కొట్టిపారేశారు. తాజాగా బీఎస్పీ నేత ఒకరు మాట్లాడుతూ ‘మాతో పొత్తు లేకుండా ఏ పార్టీ అధికారంలోకి రాలేదు. ఏ పార్టీకి మద్దతివ్వాలో మాయావతి నిర్ణయిస్తారు’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రాథమిక ఫలితాలను బట్టి రాష్ట్రంలో ప్రధాన పార్టీలయిన కాంగ్రెస్, బీజేపీలలో దేనికీ మెజారిటీ రాదని తేలడంతో ‘ఇతరుల’కు ప్రాధాన్యం పెరిగింది. బీఎస్పీ, ఎస్పీ, స్వతంత్రులకు కలిపి మొత్తంగా 7 స్థానాలు దక్కే అవకాశాలున్నాయి. హంగ్ వస్తే ప్రధాన పార్టీలు వీరి మద్దతుపై ఆధారపడక తప్పదు. సీఎల్పీ భేటీ బుధవారం జరగనుండగా, కాంగ్రెస్ కేంద్ర పరిశీలకుడిగా ఏకే ఆంటోనీ మంగళవారమే భోపాల్ చేరుకున్నారు. గవర్నర్‌కు లేఖ రాసిన కాంగ్రెస్ మధ్యప్రదేశ్‌లో అతిపెద్ద పార్టీగా నిలవడం దాదాపు ఖాయం కావడంతో తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌ను ఆ పార్టీ నేతలు ఇప్పటికే కోరారు. ఈ మేరకు ఎంపీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ గవర్నర్‌కు లేఖ రాశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు. వ్యతిరేకత ఉన్నా గట్టి పోటీ మధ్యప్రదేశ్‌లో బీజేపీకి చెప్పుకోదగ్గ ఫలితాలు భోపాల్: మధ్యప్రదేశ్‌లో పదమూడేళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. సహజంగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత బలంగానే ఉన్నా కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇస్తోంది. మేజిక్ ఫిగర్ 116కు కేవలం కొన్ని సీట్ల దూరంలోనే బీజేపీ ఆగిపోయేలా కనిపిస్తోంది. మరోవైపు 13 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఈ సారి కూడా సాధారణ ఆధిక్యం కూడా సాధించలేక పోతోందంటే అది ఆ పార్టీ వైఫల్యంగానే చెప్పుకోవాలి. మౌలిక సదుపాయాలైన కరెంటు, నీరు, రహదారుల విషయంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై ఎలాంటి అవినీతి ఆరోపణలూ లేకపోవడం బీజేపీకి లాభించింది. సంస్థాగతంగా చౌహాన్‌కు మంచి పట్టు ఉండటంతో ఎన్నికల్లో బీజేపీ, ఆరెస్సెస్‌లు కలిసి పని చేసి క్షేత్రస్థాయి వరకు వెళ్లగలిగాయి. భూమి పుత్రుడిగా(కిసాన్ కీ బేటా)పే రొందిన చౌహాన్ తన హయాంలో ఇంటా బయటా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. మురికివాడల్లోని ప్రజలు, ఆర్థికంగా బలహీన వర్గాల వారికోసం చౌహాన్ ఆవాస్ యోజన వంటి పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు పరచడంతో ఆ వర్గాల మద్దతు గణనీయంగా పొందగలిగారు. ఒకప్పుడు రోగిష్టి రాష్ట్రాలుగా ముద్రపడ్డ బీమారు (బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్) నుంచి మధ్యప్రదేశ్‌ను బయటకు తీసుకొచ్చి చౌహాన్ అభివృద్ధివైపు నడిపించారనే భావన అక్కడి ప్రజల్లో ఉంది. -
బీజేపీ అధికారం కోల్పోనుందా..?!
భోపాల్ : గత మూడు పర్యాయాలుగా మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీకి ప్రజలు మరోమారు అధికారం కట్టబెట్టడానికి సుముఖంగా లేనట్టు కనిపిస్తోంది. అక్కడ కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరి పోరు ఉన్నట్టు పలు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెల్లడించాయి. నవంబర్ 28న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగగా.. శుక్రవారం సాయంత్రం పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఏబీపీ-సీఎస్డీఎస్ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ 126 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకోనుందని అంచనా. బీజేపీ 94 సీట్లకే పరిమితమై అధికారాన్ని కోల్పోతుందని సర్వే వెల్లడించింది. ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధిస్తారని తెలిపింది. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ పాలనపట్ల ప్రజలకు పెద్దగా ప్రతికూలత లేనప్పటికీ సుదీర్ఘంగా అధికారంలో ఉండడం బీజేపీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా, వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల సరళి ఎలా ఉండొచ్చు అన్నది ఈ రాష్ట్ర ఎన్నికల ఫలితాల ద్వారా తెలుసుకోవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 116 అన్న సంగతి తెలిసిందే. ఇక ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వే కాంగ్రెస్‌కు 113, బీజేపీకి 111, బీఎస్పీకి 2, ఇతరులకు 4 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. బీజేపీ, కాంగ్రెస్‌లు మేజిక్ ఫిగర్‌కు కొంత దూరంలో ఉంటాయని విశ్లేషించింది. అయితే, టైమ్స్‌నౌ-సీఎన్ఎక్స్ ఇందుకు భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించింది. బీజేపీ పూర్తి ఆదిక్యంతో తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని తన సర్వేలో తెలిపింది. బీజేపీకి126 సీట్లు, కాంగ్రెస్‌కు 89 సీట్లు, బీఎస్పీకి 6, ఇతరులకు 9 సీట్లు వస్తాయని వెల్లడించింది. 2000 నవంబర్ 1న కేంద్రంలోని అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విభజించింది. మధ్యప్రదేశ్ నుంచి చత్తీస్‌గఢ్‌ను విడగొట్టి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసేటప్పటికి.. ఉమ్మడి మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. విభజన తర్వాత కూడా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోకాంగ్రెస్ ప్రభుత్వాలే ఉండడం గమనార్హం. -
చాంపియన్ ఎవరు?
సాక్షి : రాజస్తాన్ చరిత్రలో ఉదయ్‌పూర్‌ది ప్రత్యేక స్థానం. మొగలులకు ఎదురొడ్డి పోరాడిన మేవార్ వీరుడు మహారాణా ప్రతాప్.. తన తండ్రి రాణా ఉదయ్‌సింగ్ పేరుతో నిర్మించిన నగరమే ఇది. చుట్టూ సరస్సులతో అందంగా ఉంటుందీ నగరం. కానీ కాలక్రమంలో ఇదో బిజీ నగరంగా మారిపోయింది. నగరీకరణ కారణంగా.. ఆ సరస్సులన్నీ ఇప్పుడు మురికినీటితో నిండిపోయాయి. అద్భుతమైన కోటలు, రాజ మహల్‌ను చూసేందుకు వచ్చే వారికి ఇప్పుడు గుంతల రోడ్లు స్వాగతం పలుకుతాయి. చినుకుపడితే చిత్తడే. భారత చరిత్ర వారసత్వ సంపదను తనలో ఇమిడ్చుకున్న నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం.. స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చింది. కానీ పురోగతి మాత్రం నత్తనడక నడుస్తోంది. పెద్దనోట్ల రద్దు సమయంలో నగరంలో పర్యాటకం తీవ్రంగా ప్రభావితమైంది. వీటన్నింటికీ తోడు ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరున్నప్పటికీ.. మూడు దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఈ నగరాభివృద్ధికి సరైన చర్యలు తీసుకోకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కటారియా ఎదురీత గత మూడు ఎన్నికల్లోనూ ఉదయపురి నుంచే ఎన్నికవుతూ వస్తున్న కటారియాకు ఈసారి ఎదురీత తప్పేట్లు లేదు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలతో పాటు అక్రమ గైడ్లు పర్యాటకులకు కుచ్చు టోపీ పెట్టడం అక్కడ సర్వసాధారణంగా మారింది. ఉదయ్‌పూర్‌లో నిండా సమస్యలే ఉన్నప్పటికీ కటారియా కాంగ్రెస్‌నే టార్గెట్ చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. స్మార్ట్‌సిటీగా రూపాంతరం చెందే క్రమంలో రోడ్ల విస్తరణ , ఫ్లైఓవర్ల నిర్మాణం కారణంగా రోడ్లపై గుంతలు ఉన్నాయని ఆయన పేర్కొంటున్నారు. వ్యాస్.. తీస్ సాల్కే బాద్! జాతీయ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్, కేంద్ర మాజీ మంత్రి, నాలుగు సార్లు ఎంపీ అయిన గిరిజా వ్యాస్ 33 ఏళ్ల తర్వాత అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. 1985లో ఉదయ్‌పూర్ నుంచి అసెంబ్లీకి గెలిచారు. అనంతరం జాతీయ రాజకీయాల్లో ఉన్నారు. సీఎం అభ్యర్థుల రేసులో ఉన్న గెహ్లాట్, పైలెట్ మధ్య విభేదాలు ముదిరితే.. వీరిద్దరికీ చెక్ పెట్టేందుకే.. గిరిజా వ్యాస్‌ను రంగంలోకి దించారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మోదీ, షాలకు సన్నిహితుడు సిట్టింగ్ ఎమ్మెల్యే.. రాష్ట్ర హోం మంత్రి గులాబ్‌చంద్ కటారియా మరోసారి తన అదృష్టాన్ని ఇక్కడినుంచే పరీక్షించుకోబోతున్నారు. నగరంలో నేరాలను అదుపు చేయలేకపోయారని ఆరోపణలొచ్చాయి. ప్రధాని, అమిత్ షాలకు కటారియా అత్యంత సన్నిహితుడు. వసుంధరా రాజేపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గమనించిన మోదీ, షాలు ఒకానొక దశలో కటారియానే సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటించాలని యోచించారు. -
రోజూవారీ ప్రచార వ్యయం కుదింపు
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో మితిమీరిన నగదు ప్రవాహాన్ని అడ్డుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు దిగింది. ప్రచారం నిమిత్తం అభ్యర్థి రోజుకు జరిపే నగదు లావాదేవీలను రూ.20 వేల నుంచి రూ.10 వేలకు తగ్గించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) నుంచి అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. రూ.10 వేల పరిమితి దాటి కూడా ఖర్చు చేయాల్సి వస్తే, ఆ లావాదేవీలను అభ్యర్థి ఖాతా నుంచి చెక్కులు, డ్రాఫ్టులు, నెఫ్ట్/ఆర్టీజీఎస్ రూపంలో నిర్వహించాలని ఈసీ సూచించింది. నవంబర్ 12నే అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధన ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్ ఎన్నికలపై ప్రభావం చూపనుంది. ప్రచార సమయంలో అభ్యర్థి ఎవరైనా వ్యక్తి, సంస్థ నుంచి నగదు రూపంలో రూ.10 వేలకు మించి విరాళాలు, రుణాలు స్వీకరించరాదు. -
సం‘కుల’ సమరం.. ఎవరిదో విజయం
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కులాల ప్రతిపాదికన ఓట్ల సమరం సాగుతోంది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో కులం కార్డును బలంగా వాడుకుంటున్నాయి. ఒక కులానికి చెందిన వారిపై అదే కులానికి చెందిన వారికి పోటీ దించాయి ప్రధాన పార్టీలు. దాదాపు 31 నియోజకవర్గాల్లో ఇదే రకమైన పోటీ నెలకొంది. డిసెంబర్ 7న ఎన్నికలకు జాట్ సామాజిక వర్గానికి బీజేపీ, కాంగ్రెస్ 33 సీట్ల చొప్పున కేటాయించాయి. బీజేపీ 26, కాంగ్రెస్15 స్థానాల్లో రాజ్‌పుత్‌లను పోటీకి దించాయి. ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గానికి మొత్తం 60 సీట్లుపైగా దక్కాయి. బ్రాహ్మణులు, వైశ్యులు, ఇతర వెనుక బడిన కులాలకు కూడా ప్రాతినిథ్యం కల్పించాయి. కాంగ్రెస్ పార్టీ ఏకంగా 15 మంది ముస్లిం అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వగా, అధికార బీజేపీ కేవలం ఒఏ ఒక్క టికెట్ కేటాయించింది. 15 నియోజకవర్గాల్లో జాట్ సామాజిక వర్గానికి చెందిన వారినే బీజేపీ, కాంగ్రెస్ పరస్పరం పోటీకి నిలిపాయి. బ్రాహ్మణులు ఏడు చోట్ల, రాజ్‌పుత్‌లు నాలుగు స్థానాల్లో, గుజ్జర్లు, యాదవులు రెండు చోట్ల ముఖాముఖి తలపడుతున్నారు. రాజస్థాన్‌లో అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయించేప్పుడు రాజకీయ పార్టీలు తప్పనిసరిగా కులాన్ని దృష్టిలో పెట్టుకుంటాయని పరిశీలకులు చెబుతున్నారు. కొన్నేళ్లుగా రాజ్‌పుత్‌ల మద్దతుతో బీజేపీ ముందుకు సాగుతోందని, ఈసారి పరిస్థితి మారే అవకాశమున్నట్టు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంటే కాంగ్రెస్‌కు లాభించనుందని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 46.05 శాతం, కాంగ్రెస్‌కు 33.7 శాతం ఓట్లు వచ్చాయి. 2008 శాసనసభ ఎన్నికల్లో కమలం పార్టీ 34.27 శాతం, హస్తం పార్టీ 36.82 శాతం ఓట్లు దక్కించుకున్నాట్టు ఎన్నికల కమిషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈసారి సం‘కుల’ సమరంలో విజయం ఎవరిని వరిస్తుందో డిసెంబర్ 11న తేలనుంది. -
చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌దే హవా!
సాక్షి, న్యూఢిల్లీ : చత్తీస్‌గఢ్‌లో వరి కోతల సీజన్ అయిపోయింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. అయినా దాదాపు యాభై శాతం రైతులు వరి కోతల జోలికి వెళ్లడం లేదు. ఎందుకని చంద్రకురి గ్రామంలోని మహేశ్ చంద్రేకర్ అనే రైతును ప్రశ్నించగా ఎన్నికల ఫలితాల కోసం నిరీక్షిస్తున్నామని అన్నారు. ఎన్నికల ఫలితాలకు, వరి కోతలకు సంబంధం ఏమిటని ప్రశ్నించగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సరైన గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పిందని, అందుకని, తాను వరి కోతలు జరపక పోవడమే కాకుండా జరపకూడదని తోటి రైతులకు సలహా కూడా ఇచ్చానని ఆయన చెప్పారు. అప్పటి వరకు పంటను తరలించకపోతే నష్టం వాటిల్లా అది ప్రశ్నిస్తే, డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయని, అప్పటి వరకు భూమిలో తేమ ఉంటుంది కనుక నష్టం వాటిల్లదని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే అప్పటికైనా పాత రేటుకు అమ్ముకోవాల్సిందేనని ఆయన తెలిపారు. ఈసారి కోతల సీజన్ ప్రారంభమైన నవంబర్ ఒకటవ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు రాష్ట్రంలో వడ్ల సేకరణ 4,67,438 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. గతేడాది ఇదే కాలానికి సేకరించిన వడ్లతో పోలిస్తే ఇది సగానికిపైగా పడిపోయింది. గతేడాది ఇదే కాలానికి 10,47,454 మెట్రిక్ టన్నులు సేకరించినట్లు అధికారిక మార్కెట్ లెక్కలు తెలియజేస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభతో రైతుల్లో ఈ మార్పు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. నవంబర్ 13న మహాసముంద్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పది రోజుల్లో రైతుల రుణాలను మాఫీ చేస్తామని, వరి పంట కనీస మద్దతు ధరను 2500 రూపాయలను చేస్తామని చెప్పారు. గత బీజేపీ ప్రభుత్వం వరి మద్దతు ధరను 2100 రూపాయలను ప్రకటించినప్పటికీ 1750 రూపాయలనే చెల్లించిందని ఆయన విమర్శించారు. దేశంలో కేవలం 15 మందికి చెందిన మూడున్నర లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ రైతుల రుణాలను మాఫీ చేయలేక పోతున్నారని విమర్శించారు. చత్తీస్‌గఢ్ జనాభాలో 70 శాతం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు. వారిలో 46 శాతం మంది చిన్నకారు, సన్నకారు రైతులే. 2015 నుంచి 2017 మధ్య వ్యవసాయ సంక్షోభం వల్ల రాష్ట్రంలో 1,344 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రాహుల్ మాటలను పూర్తిగా విశ్వసించిన రైతులు రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నారు. 15 ఏళ్ల రమణ్ సింగ్ ప్రభుత్వం పట్ల తాము పూర్తిగా విశ్వాసం కోల్పోయామని రైతులు చెబుతున్నారు. 2022 సంవత్సరం నాటికల్లా దేశలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోదీ మాటలను గుర్తు చేయగా, ఈ నాలుగేళ్ల కాలంలో రైతుల ఆదాయం ఏమాత్రం పెరగక పోగా వ్యవసాయం సంక్షోభంలో పడిందని, అలాంటప్పుడు ఆయన మాటలు ఎలా నిజం అవుతాయని రైతులు అంటున్నారు. ప్రధాని పేదలు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారని, గ్యాస్ ఫిల్లింగ్‌కు 900 రూపాయలు ఎక్కడి నుంచి తేవాలని, ఉచితంగా బ్యాంక్ ఖాతాలు ఇప్పించారని, అది మురిగిపోకుండా ఉండాలంటే వెయ్యి రూపాయలు డిపాజిట్ చేయాలంటా, ఎక్కడి నుంచి తేవాలని రైతులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. వారి విశ్వాసం చూస్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌దే హవా! అనిపిస్తోంది. -
ఈసారి ‘వైఎంఏ’ మద్దతు ఎవరికో!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిసారి మిజోరమ్ అసెంబ్లీ ఎన్నికల్లో ‘యంగ్ మిజో అసోసియేషన్ (వైఎంఏ)’ ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తుందో ఆ పార్టీయే విజయం సాధిస్తూ వస్తోంది. 1998–2003 ఎన్నికల్లో మిజోరం నేషనల్ ఫ్రంట్‌కు మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీయే విజయం సాధించింది. ఆ తర్వాత 2008, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా వైఎంఏ మద్దతుతో కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నవంబర్ 28వ తేదీన జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వాన ‘ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి’ కూడా రంగప్రవేశం చేయడంతో వైఎంఏ ఈసారి ఎవరికి మద్దతు ఇస్తున్నది ఆసక్తిగా మారింది. యంగ్ మిజో అసోసియేషన్ ఏ రాజకీయ పార్టీతోని అనుబంధం లేకుండా పనిచేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థకు రాష్ట్రవ్యాప్తంగా 4,27,323 మంది సభ్యులు ఉన్నారు. సామాన్యంగా వీరంత నాయకత్వం మాటకు కట్టుబడి ఓటేస్తారు. మొత్తం రాష్ట్ర జనాభాలో వైఎంఏ సభ్యుల సంఖ్య దాదాపు 40 శాతం ఉండడంతో వారు ఎవరికి ఓటేస్తే ఆ పార్టీనే విజయం సాధిస్తూ వస్తోంది. అందుకని ఎన్నికల బరిలో దిగే ప్రతిపార్టీ వైఎంఏ మద్దతును కూడగట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈ సంఘంలోని వివిధ విభాగాలు, వివిధ కమిటీలు రాజకీయాలకు అతీతంగా చర్చలు జరిపి ఎవరికి ఓటు వేస్తే రాష్ట్ర ప్రయోజనాలకు మంచిది? ఏ పార్టీ అయితే రాష్ట్రంలో అభివృద్ధి కార్యకమాలు కొనసాగుతాయి? అన్న అంశాలతోపాటు గత ప్రభుత్వం పాలనాతీరును కూడా క్షుణ్ణంగా సమీక్షించి నిర్ణయం తీసుకుంటాయి. 91 శాతం అక్షరాస్యత కలిగిన మిజోరంలో ఈ సంఘం సభ్యులు చాలా చైతన్యవంతులు. వారికి రాజకీయాల పట్ల స్పష్టమైన అవగాహన ఉంటుంది. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో సభ్యులంతా చురుగ్గా పాల్గొంటారు. అన్నింటికీ ప్రభుత్వం మీద ఆధారపడరు. మురికి వాడలను శుద్ధిచేయడంలో స్వచ్ఛందంగా పాల్గొంటారు. అత్యవసరమైన ప్రాంతాల్లో సంఘం తరఫున రోడ్లు వేస్తారు. మంచినీటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. ఆపదలో ఉన్న పేదలను ఆదుకుంటారు. ఏ కుటుంబంలో ఎవరు చనిపోయినా సంఘం సభ్యులు వెళ్లి దగ్గరుండి దహన సంస్కారాల వరకు అన్ని చూసుకుంటారు. శ్మశానంలో సమాధి కోసం గోతులు కూడా స్వయంగా తవ్వుతారు. కుటుంబ సభ్యుడిని కోల్పోయిన కుటుంబం వెంట సంఘం సభ్యులు కనీసం మూడు రోజులు ఉంటారు. ఆ సందర్భంగా వారికి అన్ని విధాల అండగా ఉంటారు. ప్రకృతి వైపరీత్యాల సంభవించినప్పుడు కూడా సహాయక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. 804 బ్రాంచీలు, 17 కమిటీలు వైఎంఏకు రాష్ట్రవ్యాప్తంగా 47 గ్రూపు యూనిట్లు, 804 బ్రాంచీలు ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనే కమిటీతోపాటు సంగీతం, సాహిత్యం, క్రీడలకు కలుపుకొని మొత్తం 17 కమిటీలు ఉన్నాయి. వీటన్నింటిపైనా ఆరుగురు కార్యవర్గ సభ్యులతో సెంట్రల్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి మాత్రం ఆవిర్భావం నుంచి ఇంతవరకు ఒక మహిళ కూడా ఎన్నిక కాలేదు. గత మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుగురు మహిళలు పోటీ చేయగా, ఈసారి ఎన్నికల్లో 15 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. యువతే ఉండాల్సిన అవసరం లేదు యంగ్ మిజో అసోసియేషన్ అనగానే ఇందులో యువతీ యువకులే ఉంటారని ఎవరైనా అనుకోవచ్చు. 14 ఏళ్ల దాటిన మిజోలందరూ ఐదు రూపాయల రుసుము చెల్లించి ఈ సంఘంలో చేరవచ్చు. సభ్యత్వం పునరుద్ధరణకు వారు ప్రతి ఏటా ఐదు రూపాయలు చెల్లిస్తూ పోవాలి. అలా జీవితాంతం సంఘంలో సభ్యులుగా కొనసాగవచ్చు. సభ్యత్వం వద్దనుకుంటే ఏ వయస్సులోనైనా వదులుకోవచ్చు. ఈ సంఘాన్ని 1935లో ఓ క్రైస్తవ మిషనరీ ఏర్పాటు చేసింది. స్వాతంత్య్రానంతరం నుంచి ఏ క్రైస్తవ మిషనరీతో సంబంధం లేకుండా స్వచ్ఛంద సంస్థగానే ఇది పనిచేస్తూ వస్తోంది. ఇందులో మెజారిటీ సభ్యులు క్రైస్తవులే అయినప్పటికీ ఏ మతస్థులైనా చేరవచ్చు. మిజోరం మొత్తం జనాభాలో 85 శాతం క్రైస్తవులే అన్న విషయం తెల్సిందే. సంప్రదింపుల ద్వారా ఓ నిర్ణయం ఏ రాజకీయ పార్టీకి మద్దతివ్వాలనే అంశంపైన వీరు వివిధ స్థాయిల్లో, వివిధ గ్రూపులతో సంప్రతింపులు, చర్చలు జరిపి ఓ నిర్ణయానికి వస్తారు. ఆ నిర్ణయాన్ని అధికారికంగా బయటకు వెళ్లడించరు. లోపాయికారిగానే సందేశం వెళుతుంది. ఆ సందేశానికి దాదాపు 90 శాతం మంది సభ్యులు కట్టుబడి ఓటేస్తారు. ఈ సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా భయపడిందంటే సంఘానికున్న శక్తిని అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల అధికారికి వ్యతిరేకంగా ఆందోళన నవంబర్ ఆరవ తేదీన సంఘం సభ్యులు దాదాపు 50 వేల మంది తరలివచ్చి ఎన్నికల సంఘం కార్యాలయాన్ని చుట్టుముట్టారు. వారి ఒత్తిడికి తలొగ్గిన ఎన్నికల సంఘం ఓ ఉద్యోగిని బదిలీ చేసింది. త్రిపుర శిబిరంలో తలదాచుకుంటున్న 32 వేల మంది శరణార్థి బ్రూలు ఓటు హక్కు ఉపయోగించుకునేందుకు వీలుగా ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించినందునే వారు ఎన్నికల అధికారిపై మండిపడ్డారు. రాష్ట్రంలో మైనారిటీలైన బ్రూలన్నా, చక్మాలన్నా ఈ సంఘం సభ్యులకు పడదు. అందులో అగ్రవర్ణాల వారు ఎక్కువగా ఉండడం కారణమని మైనారిటీలు ఆరోపిస్తున్నారు. వీరంతా అక్రమంగా తమ రాష్ట్రానికి వలస వచ్చిన వారన్నది వైఎంఏ నమ్మకం. అందుకనే ప్రతి ఎన్నికల సందర్భంగా మైనారిటీల నుంచి ఎవరికి టిక్కెట్లు ఇవ్వరాదని ప్రధాన రాజకీయ పార్టీలకు ఈ సంఘం విజ్ఞప్తి చేయడం పరిపాటిగా మారింది. కొన్ని సార్లు వీరి మాటను రాజకీయ పార్టీలు విన్నాయి. కొన్ని సార్లు సున్నితంగా తిరస్కరించాయి. ఏదిఏమైనా సంఘం మద్దతే పార్టీకి విజయం. సంప్రతింపుల్లో సంఘం సభ్యులు ఈసారి కూడా కాంగ్రెస్ వైపే మొగ్గుచూపుతున్నట్లు తెల్సింది. -
అజిత్ జోగి కోడలి విజయం ఖాయం
సాక్షి, న్యూఢిల్లీ : చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కోడలు రిచా జోగి విజయం సాధించడం నల్లేరు మీద నడకేనని అకల్తారా అసెంబ్లీ నియోజక వర్గం ప్రజలు భావిస్తున్నారు. అజిత్ జోగి కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి జనతా కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ఆయన ఈసారి ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. ఈ కారణంగా ఆయన తన కోడలును బీఎస్పీ తరఫున ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజక వర్గంలో 45 శాతం మంది దళితులు, ఆదివాసీలు ఉండడమే కాకుండా బీఎస్పీకీ మంచి ప్రాబల్యం ఉండడమే అందుకు కారణం కావచ్చు. జాంజ్‌గిర్–చంపా జిల్లాలోని అకల్తారా నియోజక వర్గంలో 35 దళిత, ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి. వారంత ఈసారి అజిత్ జోగికే ఓటు వేయాలని ప్రతిజ్ఞ కూడా చేశారట. ఆ గ్రామాల గ్రామాల ప్రజలు రిచా జోగి ప్రత్యర్థులెవరిని తమ గ్రామాల్లో ప్రచారానికి అనుమతించడం లేదు. ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో గెలిచిన ప్రస్తుత కాంగ్రెస్ శాసన సభ్యుడు చున్నీలాల్ సాహు ఐదేళ్ల నుంచి తమ గ్రామాలకే రావడం లేదని, అక్కడక్కడ ఆయన పోస్టర్లు తప్ప ఆయన జాడ కనిపించడం లేదని ప్రజలు అంటున్నారు. అకల్తార పట్టణంలో ప్రజల సౌకర్యార్థం ఓ టాయ్‌లెట్ నిర్మంచమంటే కూడా ఆయన నిర్మించలేక పోయారని, అలాంటి వ్యక్తికి ఈసారి ఓటు ఎలా వేయగలమని చెబుతున్నారు. నియోజకవర్గంలోని ముర్లిది గ్రామంలో 1800 మంది ఓటర్ల ఉండగా 1600 మంది ఓటర్లు రిచా జోగికే ఓటు వేస్తున్నట్లు చెప్పారు. మిగతా 200 మంది ఓటర్లు బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సౌరభ్ సింగ్‌కు ఓటు వేస్తున్నట్లు చెప్పారు. ఈసారి ఈ నియోజకవర్గంలో బీజేపీ, బీఎస్పీకి మధ్యనే పోటీ ఉంటుందని, అయితే రిచా జోగిదే విజయమని చెబుతున్నారు. అకల్తారాలో మెజారిటీ ఇళ్లపై బీఎస్పీ జెండాలే కనిపిస్తోంది. ఆఖరికి చున్నీలాల్ సాహుకు మద్దతిస్తున్న కాంగ్రెస్ కౌన్సిలర్ పుణేశ్వర్ కుమార్ ఆనంద్ ఇంటిపై కూడా బీఎస్పీ జెండా ఎగరడం అందుకు నిదర్శనం. ఈ విషయమై ఆయన్నే ప్రశ్నించగా తన 10, 12 ఏళ్ల కొడుకులు తెలియక ఆ జెండాను ఎగరేశారని చెప్పుకున్నారు. -
మోసం ఆ పార్టీ రక్తంలోనే ఉంది
ఛింద్వారా/మహాసముంద్: మోసం కాంగ్రెస్ పార్టీ రక్తంలోనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘాటుగా విమర్శించారు. దళితుడైనందునే సీతారాం కేసరిని ఏఐసీసీ అధ్యక్ష పదవి నుంచి అర్ధంతరంగా తొలగించి సోనియాను అందలం ఎక్కించారని నిప్పులు చెరిగారు. ఆదివారం ఆయన మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా, ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. ‘కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. మోసం ఆ పార్టీ రక్తంలోనే ఉంది. కానీ, రాష్ట్ర ప్రజలు ఆ పార్టీని పట్టించుకోరు. గోవును కీర్తిస్తూ మధ్యప్రదేశ్ మేనిఫెస్టోలో పథకాలు కూడా ఆ పార్టీ ప్రకటించింది. కేరళలో మాత్రం ఆ పార్టీ నేతలు ఆవు దూడలను తింటూ పశుమాంసం తినడం తమ హక్కంటారా?’ అని ప్రజలను అడిగారు. ‘ఆధార్ ఆధారిత సాంకేతికతతో ప్రభుత్వ పథకాలను అనర్హుల పాలు కాకుండా చేసి ఏడాదికి 90 వేల కోట్ల రూపాయల దోపిడీని ఆపుతున్నా. అందుకే కాంగ్రెస్ నేతలు నన్ను తీవ్రంగా విమర్శిస్తున్నారని నాకు తెలుసు’ అని మోదీ అన్నారు. కేసరిని అర్ధంతరంగా తొలగించారు ఏఐసీసీ అధ్యక్షుడు(1996–98)గా ఉన్న సీతారాం కేసరి దళితుడైనందునే ఆ పార్టీ ఆయన్ను అర్ధంతరంగా పదవి నుంచి దించేసిందని మోదీ విమర్శించారు. పదవీ కాలం పూర్తి కాకుండానే సీతారాం కేసరిని పార్టీ ఆఫీసు నుంచి బయటకు నెట్టేసిన ఆ పార్టీ నేతలు సోనియా గాంధీని పదవిలో కూర్చోబెట్టారన్న విషయం అప్పట్లో దేశ ప్రజలకు కూడా తెలుసునని పేర్కొన్నారు. ‘ఆ ఒక్క కుటుంబం నాలుగు తరాలుగా అధికారంలో ఉంటూ లాభం పొందగా, వారి పాలనతో దేశానికి ఎటువంటి ప్రయోజనం కలగలేదు’ అని మోదీ అన్నారు. ఆ కుటుంబానికి చెందని సమర్థుడైన వ్యక్తిని అధ్యక్ష పదవికి ఎన్నుకోవాలని కాంగ్రెస్‌కు ఆయన సవాల్ విసిరారు. ‘రైతు రుణాలను రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలు చేస్తోంది. కర్ణాటకలో ఇచ్చిన అలాంటి హామీని అక్కడి ప్రభుత్వం ఏడాదవుతున్నా అమలు చేయలేదు. పైపెచ్చు రుణగ్రహీతలైన అక్కడి రైతులకు వారంట్లు జారీ చేస్తూ అరెస్టులు చేయిస్తోంది’ అని ప్రధాని మోదీ ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లో బరిలో 1,101 మంది ఛత్తీస్‌గఢ్‌లో చివరి దశలో ఈనెల 20వ తేదీన 72 స్థానాలకు జరగనున్న ఎన్నికలకు ఆదివారంతో ప్రచారం ముగిసింది. పోటీలో 1,101 మంది అభ్యర్థులున్నారు. రాయ్‌పూర్ సిటీ దక్షిణ స్థానం కోసం అత్యధికంగా 46 మంది పోటీ పడుతున్నారు. మొదటి దశలో మావోయిస్టు ప్రభావిత బస్తర్ ప్రాంతంలోని 18 స్థానాలకు 12న ఎన్నికలు జరిగాయి. ఫలితాలు డిసెంబర్ 11న వెలువడనున్నాయి. కేసరి దళితుడు కాదు: కాంగ్రెస్ న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సీతారాం కేసరి దళితుడు అంటూ ప్రధాని చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కేసరి దళితుడు కాదు, ఇతర వెనుక బడిన కులాల(ఓబీసీ)కు చెందిన వ్యక్తి అని స్పష్టం చేసింది. ‘సీతారాం కేసరి బిహార్ ఓబీసీల్లోని బనియా కులానికి చెందిన వ్యక్తి. ఆయన దళితుడు కాదు. ఆయనకు పార్టీ తగు గౌరవం ఇచ్చింది. అయినా.. నిజాలు, సత్యాలను ప్రధాని మోదీ ఎన్నడైనా చెప్పారా?’అంటూ కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘కొత్తకొత్త అబద్ధాలు చెప్పడం మోదీకి అలవాటుగా మారింది. ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, కల్రాజ్ మిశ్రా, కేశూభాయ్ పటేల్‌లాంటి బీజేపీ ప్రముఖ నేతలను ఎలా గౌరవించారో ఆత్మవిమర్శ చేసుకోండి’ అంటూ మోదీని వ్యంగ్యంగా అన్నారు. -
మాల్యా, అంబానీల నుంచి వస్తాయి!
కొరియా(ఛత్తీస్‌గఢ్): అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లో రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేసి తీరుతామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పునరుద్ఘాటించారు. అందుకు అవసరమైన నిధులు నీరవ్ మోదీ, అనిల్ అంబానీ, విజయ్ మాల్యా వంటి వారి నుంచి వస్తాయని వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో శనివారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. విజయ్ మాల్యా రూ.10 వేల కోట్ల బ్యాంకు రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయారని, నీరవ్‌మోదీ, మెహుల్ చోక్సీలు రూ. 35 వేల కోట్లతో పరారయ్యారని రాహుల్ ఆరోపించారు. పౌరసరఫరాల శాఖలో రూ. 36 వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి రమణ్‌సింగ్‌పై వచ్చిన ఆరోపణలపై ప్రధాని మోదీ నోరు మెదపడం లేదని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లో చివరిదైన రెండో దశలో 72 స్థానాలకు పోలింగ్ 20న జరగనుంది. -
కాంగ్రెస్‌కు నరేంద్ర మోదీ సవాల్
అంబికాపూర్: ధైర్యముంటే గాంధీయేతర కుటుంబానికి చెందిన నాయకుడిని పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని కాంగ్రెస్‌కు ప్రధాని మోదీ సవాలు విసిరారు. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడారు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నెలకొల్పిన ప్రజాస్వామ్య విలువల వల్లే చాయ్‌వాలా కూడా ప్రధాని కాగలిగారన్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టారు. తాను ప్రధాని అయినందుకు ఆ క్రెడిట్‌ను కాంగ్రెస్.. ప్రజలకు కాకుండా నెహ్రూకు కట్టబెట్టిందని మండిపడ్డారు. అనంతరం మధ్యప్రదేశ్‌లోని షాదోల్‌లో జరిగిన మరో ర్యాలీలో ప్రసంగిస్తూ.. ‘నాలుగున్నరేళ్ల చాయ్‌వాలా’ పనితీరుకు, ‘నాలుగు తరాల నెహ్రూ–గాంధీ కుటుంబ’ పాలనకు మధ్య జరిగే పోటీకి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ‘గాంధీ కుటుంబానికి చెందని, నిబద్ధత కలిగిన నాయకుడిని ఐదేళ్లు మీ పార్టీకి అధ్యక్షుడిగా నియమించండి. గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి కూడా కాంగ్రెస్ అధ్యక్షుడయ్యే లాంటి ప్రజాస్వామ్యాన్ని నెహ్రూ నిర్మించారని అప్పుడు నేనూ నమ్ముతా’ అని అన్నారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌లో తుదివిడత పోలింగ్ ఈనెల 20న జరగనుంది. మధ్యప్రదేశ్‌లో ఒకేవిడతలో 28న జరగనుంది. నాలుగు తరాలా? నాలుగున్నరేళ్లా?.. కాంగ్రెస్ 55 ఏళ్ల పాలనలో సమకూర్చని విద్యుత్, ఎల్పీజీ, బ్యాంకు సేవలు వంటి సౌకర్యాల్ని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేరువచేసిందని మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో మోదీ అన్నారు. ‘ నాలుగు తరాల కాంగ్రెస్ పాలన, నాలుగున్నరేళ్ల చాయ్‌వాలా పాలన మధ్య పోటీ పెడదాం. అందరికీ బ్యాంకింగ్ సేవలు అందించాలన్న లక్ష్యంతో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బ్యాంకుల్ని జాతీయం చేశారు. కానీ పేదలకు ఈ నిర్ణయంతో ఎలాంటి ప్రయోజనం కలగలేదు. కానీ మా ప్రభుత్వం నాలుగున్నరేళ్లలోనే అందరికీ బ్యాంకింగ్ సేవలు కల్పించింది అని పేర్కొన్నారు. -
బెయిల్‌పై ఉండి.. నన్ను విమర్శిస్తారా?
బిలాస్పూర్: కాంగ్రెస్ పార్టీ, గాంధీల కుటుంబంపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఛత్తీస్‌గఢ్ రెండో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం బిలాస్పూర్లో పర్యటించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన తల్లి సోనియా గాంధీలను ప్రస్తావిస్తూ ‘బెయిలుపై బయట ఉన్న తల్లీ కొడుకుల నుంచి నాకు నిజాయితీ ధ్రువపత్రమేమీ అవసరం లేదు’ అని మోదీ అన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నోట్లరద్దు నిర్ణయాన్ని సోనియా, రాహుల్‌లు వ్యతిరేకిస్తూ మోదీ అవినీతికి పాల్పడ్డారని వారు చేసిన ఆరోపణలకు సమాధానంగానే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు చెందిన నేషనల్ హెరాల్డ్ పత్రిక సంస్థలో ఆర్థిక అవకతవకల కేసుకు సంబంధించి 2015 డిసెంబర్లో ఢిల్లీ హైకోర్టు సోనియా, రాహుల్‌లకు బెయిలు మంజూరు చేయడం గమనార్హం. ‘నోట్లరద్దు నిర్ణయానికి మీకు సమాధానం కావాలా? ఆ చర్య వల్లే నకిలీ కంపెనీలను గుర్తించాం. అందువల్లే మీరు బెయిలు కోరాల్సి వచ్చింది. ఆ విషయాన్ని మీరెందుకు మర్చిపోతున్నారు’ అంటూ సోనియా, రాహుల్‌లపై మోదీ విరుచుకుపడ్డారు. మోదీ వ్యాఖ్యలు ప్రధాని పదవికి ఉన్న గౌరవాన్ని దిగజార్చేలా ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ అన్నారు. ఒకే కుటుంబంతో ఆరంభం, అంతం.. కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ఒకే కుటుంబంతో ఆరంభమై, అంతమవుతాయని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ ఓ అవినీతి పార్టీ అనీ, ఛత్తీస్‌గఢ్‌ను ఇప్పుడున్న స్థితికి తీసుకురావడానికి ఆ పార్టీకైతే 50 ఏళ్లు పట్టేదని పోల్చారు. మాజీ ప్రధాని, రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ 1985లో అన్న మాటలను గుర్తుచేస్తూ.. ‘ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతీ రూపాయిలో 15 పైసలే ప్రజలకు చేరుతోందని రాజీవ్ గాంధీయే అన్నారు. 85 పైసలను అదృశ్య హస్తం (కాంగ్రెస్ ఎన్నికల చిహ్నం) లాగేసింది? ఆ డబ్బంతా నోట్ల రద్దు తర్వాత బయటకొచ్చింది’ అని మోదీ ఆరోపించారు. జల మార్గాలపై తొలి టర్మినల్ వారణాసి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాను లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో అభివృద్ధి వేగాన్ని ప్రధాని మోదీ పెంచారు. మొత్తం రూ. 2,413 కోట్ల విలువైన ప్రాజెక్టులను సోమవారం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులను ఇంతకు ముందే ఎందుకు చేపట్టలేదంటూ గత ప్రభుత్వాలను దుయ్యబట్టారు. దేశీయ జల మార్గాలపై దేశంలోనే తొలి మల్టీ–మోడల్ టర్మినల్‌ను మోదీ ప్రారంభించారు. వారణాసి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో గంగా నదిపై ఈ టర్మినల్‌ను నిర్మించారు. జాతీయ జల రహదారి–1 ప్రాజెక్టు కింద ప్రభుత్వం మొత్తం నాలుగు టర్మినళ్లను గంగా నదిపై నిర్మిస్తుండగా, సోమవారం ప్రారంభమైన టర్మినల్ వాటిలో మొదటిది. ప్రభుత్వాధీనంలోని భారత దేశీయ జలమార్గాల ప్రాధికార సంస్థ (ఐడబ్ల్యూఏఐ – ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రపంచ బ్యాంకు సాయంతో ‘జల్ మార్గ్ వికాస్’ ప్రాజెక్టును చేపడుతుండటం తెలిసిందే. ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 5,369.18 కోట్లు కాగా కేంద్ర ప్రభుత్వం, ప్రపచం బ్యాంకు చెరి సగం భరించనున్నాయి. జల మార్గాలను అభివృద్ధి చేయడం ద్వారా దేశీయంగా సరకు రవాణా ఖర్చులను తగ్గించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. తొలి నౌకకు స్వాగతం పలికిన మోదీ టర్మినల్‌ను ప్రారంభించిన అనంతరం కోల్‌కతా నుంచి ఆహార, పానీయాలను మోసుకుంటూ జలమార్గంలో వచ్చిన తొలి సరకు రవాణా నౌకకు మోదీ స్వాగతం పలికారు. ఈ నౌక అక్టోబర్ చివరి వారంలో కోల్‌కతా నుంచి వారణాసికి బయలుదేరింది. కాగా, తన నియోజకవర్గంలో కొత్తగా నిర్మించిన, మొత్తంగా 34 కి.మీ. పొడవైన రెండు రహదారులను కూడా మోదీ ప్రారంభించారు. వీటిలో 16.55 కి.మీ. పొడవైన వారణాసి రింగ్‌రోడ్డు తొలి దశ రహదారి కూడా ఉంది. -
ఎన్నికల వేళ ట్వీట్ల మోత
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్, మిజోరం, మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ట్విట్టర్ ట్వీట్లతో మోగుతోంది. ఎన్నికలపై పలు సంభాషణలు, చర్చల ద్వారా గత వారంలో ఏకంగా 12 లక్షల ట్వీట్లు నమోదైనట్లు ట్విట్టర్ పేర్కొంది. ఎన్నికల కార్యక్రమాల్లో భాగంగా..ట్విట్టర్ రాష్ట్ర ఎన్నికల కోసం ఒక ప్రత్యేక ఎమోజి, హ్యాష్‌టాగ్‌తో ఎలక్షన్ ఆన్ ట్విట్టర్ ఈవెంట్స్‌ను రూపొందించింది. ప్రత్యక్షంగా ప్రశ్నలు అడిగే సౌకర్యాన్ని కూడా కల్పించింది. దీంతో డిసెంబర్ 23 వరకు ప్రజలకు ఈ ప్రత్యేక #AssemblyElections2018 అందుబాటులో ఉంటుందని ట్విట్టర్ తెలిపింది. దీని ద్వారా రాజకీయ నాయకులు, అభ్యర్థులు ఎన్నికల సమయం వరకు బహిరంగ సంభాషణలు జరపడానికి, వారు ప్రజలతో నేరుగా మాట్లాడి మద్దతు కూడగట్టడానికి అవకాశం ఉంటుంది. -
వారికే ఖజానా తాళాలు
చరమా(ఛత్తీస్‌గఢ్): ‘నాలుగేళ్లలో ప్రధాని మోదీ తనకు సన్నిహితులైన 15 మంది బడా పారిశ్రామికవేత్తలకు రూ.3.5 లక్షల కోట్ల రుణాల్ని మాఫీ చేశారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలుకు ఏడాదికి అయ్యే వ్యయానికి ఈ మొత్తం సుమారు 10 రెట్లు. మోదీ ఆ 15 మందికే దేశ ఖజానా తాళాలు అప్పగించారు. కానీ కాంగ్రెస్.. రైతులు, యువత, పేదలు, మహిళలు, గిరిజనులకు ఆ తాళాలు ఇవ్వాలనుకుంటోంది’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ శనివారం ప్రధాని మోదీ, ఛత్తీస్ సీఎం రమణ్‌సింగ్‌లపై విమర్శనాస్త్రాలు సంధించారు. చిట్‌ఫండ్, పౌరసరఫరా కుంభకోణాల్లో రమణ్‌సింగ్‌కు పాత్ర ఉందని, పనామా పత్రాల్లో రమణ్‌సింగ్ కొడుకు అభిషేక్ సింగ్ పేరు ఉన్నా, ఆయనకు ఎలాంటి శిక్ష పడలేదని అన్నారు. చేష్టలుడిగిన రమణ్‌సింగ్.. చరామాలో జరిగిన ర్యాలీలోనూ రాహుల్ మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్ చిట్‌ఫండ్ కుంభకోణంలో రూ.5 వేల కోట్లు అదృశ్యమయ్యాయని, సుమారు 60 మంది మరణించగా, 310 కేసులు నమోదయ్యాయని అన్నారు. అయినా ఎవరికీ శిక్షలు పడలేదని, ఈ వ్యవహారంలో చర్యలు తీసుకునేందుకు రమణ్‌సింగ్ వెనకడుగు వేశారని ధ్వజమెత్తారు. ఇక పౌర సరఫరా కుంభకోణంలో రూ.36 వేల కోట్లను దోచుకున్నారని, ఇందులో రమణ్‌సింగ్ పాత్రను తేటతెల్లంచేసే పత్రాలు లభ్యమయ్యాయని అన్నారు. రమణ్‌సింగ్ 15 ఏళ్ల పాలనలో 40 లక్షల మంది యువత నిరుద్యోగులుగానే మిగిలారని, 65 శాతం భూభాగానికి సాగునీరు లేదని, గిరిజనుల నుంచి 56 వేల ఎకరాల భూమిని లాక్కుని సీఎం స్నేహితులకు కట్టబెట్టారని ఆరోపించారు. స్థానికులు నిరు ద్యోగులుగా మిగలడానికి కారణమైన ఔట్సోర్సింగ్ విధానానికి స్వస్తి పలుకుతామన్నారు. స్నేహమే అర్హతా?..: ప్రధాని మోదీకి స్నేహితుడు అయినందుకే అనిల్ అంబానీ రఫేల్ ఒప్పందాన్ని దక్కించుకున్నారని రాహుల్ ఆరోపించారు. దేశానికి కాపలాదారుడిగా చెప్పుకునే మోదీ..తన స్నేహితుడికి లబ్ధిచేకూర్చడానికే యూపీఏలో కుదిరిన ఒప్పందంలో మార్పులు చేశారన్నారు. ఒక్కో విమానానికి రూ.526 కోట్ల చొప్పున మొత్తం 126 విమానాల్ని కొనడానికి యూపీఏ హయాంలో ఒప్పందం కుదిరితే, ఒక్కో విమానానికి రూ.1600 కోట్లు చెల్లించడానికి ఎన్డీయే అంగీకరించిందని ఆరోపించారు. ‘తొలి’ ప్రచారం సమాప్తం రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మొదటి విడత జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి గడువు శనివారం సాయంత్రం 3 గంటలకు ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 8 జిల్లాల్లోని 18 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 12వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ సహా మొత్తం 190 మంది అభ్యర్థులు మొదటి విడత ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ఉండగా జనతా కాంగ్రెస్(జే), బీఎస్పీ, సీపీఐల కూటమి కూడా ఈసారి తలపడుతోంది. మొత్తం 31,79,520 మంది ఓటర్ల కోసం 4,336 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఎన్నికలను బహిష్కరించాలంటూ ప్రజలకు మావోలు పిలుపివ్వడంతో భద్రత ఏర్పాట్లు పెంచారు.కొండ ప్రాంతాల్లోని పోలింగ్ బూత్‌లకు సిబ్బందిని, సామగ్రిని చేరవేసేందుకు హెలికాప్టర్లను వినియోగి స్తున్నట్లు అధికారులు తెలిపారు. మిగతా 72 నియోజకవర్గాలకు 20న రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. రాహుల్‌తో ప్రజలకు వినోదం రాయ్‌పూర్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారంతో ప్రజలకు వినోదం పంచారని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ ఎద్దేవా చేశారు. తమ రాష్ట్రం గురించి ఆయనకు ఏమీ తెలియదని దెప్పిపొడిచారు. ‘ఛత్తీస్‌గఢ్ గురించి రాహుల్‌కు ఏమీ తెలియదు. ఆయన విమర్శలను రాష్ట్ర ప్రజలు పట్టించుకోవడం లేదు. ప్రచార కార్యక్రమాలతో ప్రజలకు రాహుల్ కేవలం వినోదం పంచారు’ అని రమణ్ సింగ్ వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో రాహుల్ ప్రచారం బీజేపీ విజయావకాశాలను దెబ్బతీయలేకపోగా ఆయన సొంత పార్టీ కాంగ్రెస్‌కే హాని కలిగించేలా ఉన్నాయి’ అని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారీ మిత్రులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయన్న రాహుల్ విమర్శలపై ఆయన స్పందిస్తూ.. ఇలాంటివి కాంగ్రెస్ హయాం లో జరిగాయని తిప్పికొట్టారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోల ప్రభావాన్ని దాదాపు లేకుండా చేశారంటూ సీఎంపై బీజేపీ చీఫ్ బీజేపీ అమిత్‌షా ప్రశంసల వర్షం కురిపించారు. -
రామ్.. నర్మద.. గోమూత్ర
భోపాల్: త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో ‘వచన్ పత్ర’ను శనివారం విడుదల చేసింది. ఈ వచన్‌పత్రలో కాంగ్రెస్ ‘రామ్–నర్మద–గోమూత్ర’ అంశాలనే ప్రాతిపదికగా తీసుకుంది. వీటి ప్రకారం.. ‘రాష్ట్రంలో ఆధ్యాత్మిక విభాగ్ పేరుతో ఆధ్యాత్మిక శాఖ ఏర్పాటు, సంస్కృత భాష వ్యాప్తి, 14 ఏళ్ల అరణ్య వాసం సమయంలో శ్రీరాముడు సంచరించిన ‘రామ్ పథ్’ అభివృద్ధి, గో మూత్రం, పిడకలను వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేయడం, ప్రతీ గ్రామంలో గోశాల, హిందువులు పవిత్రంగా భావించే నర్మదా నదీ పరిరక్షణకు చర్యలు, నర్మద తీరాన ఉన్న పుణ్య క్షేత్రాల అభివృద్ధికి రూ.1,100 కోట్ల నిధుల కేటాయింపు వంటివి ఉన్నాయి. వీటితోపాటు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతోపాటు మెడిసిన్, ఇంజినీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించే ‘వ్యాపమ్’ను రద్దు చేస్తామని కాంగ్రెస్ పేర్కొంది. ఈ సంస్థ నిర్వహించిన పలు పరీక్షలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. వ్యాపమ్ బదులు మరో సంస్థను ఏర్పాటుచేసి అవినీతికి తావులేని విధంగా పరీక్షలను నిర్వహణ, 70శాతం మార్కులు సాధించే 12వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందజేస్తామని పేర్కొంది. కళాశాల విద్యార్థినులకు సబ్సిడీపై సైకిళ్లు ఇస్తామని తెలిపింది. -
ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రసార మాధ్యమాలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రచురించడం, ప్రసారం చేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్తాన్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈనెల 12–డిసెంబరు 7 మధ్య ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 12 ఉదయం 7 గంటల నుంచి డిసెంబరు 7 వ తేదీ సాయంత్రం 5.30 గంటల మధ్య ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించరాదని ఈసీ శుక్రవారం ప్రకటన జారీ చేసింది. అలాగే ఒపీనియన్ పోల్స్ సైతం పోలింగ్(విడతల వారీగా) ముగియడానికి 48 గంటల ముందు నుంచి ప్రసారం చేయరాదని ఆదేశించింది. -
'నాలుగు రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా...ఈ కీలక నిర్ణయం'
అమరావతి: చలామణీలో ఉన్న రూ. 500, 1000 నోట్ల రద్దు చేయాలన్న నిర్ణయం ఒక్క రోజు జరిగిన నిర్ణయం కాదని, కేంద్రంలో కీలకమైన ఇద్దరు ముగ్గురు వ్యక్తులు దీనిపై ఆరేడు నెలలుగా చర్చించి తీసుకున్న నిర్ణయమని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సిద్ధార్థనాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. దేశంలో కీలకమైన నాలుగు ప్రధాన రాష్ట్రాల ఎన్నికల ముందు కూడా చలామణీలో ఉన్న నోట్ల రద్దు చేయాలన్న కీలక నిర్ణయం ప్రకటించడం ద్వారా నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి అవినీతి నిర్మూలనపై ఉన్న చిత్తశుద్దిని తెలియజేస్తోందని చెప్పారు. ఒకట్రెండు నెలలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి డబ్బుల ప్రభావం తక్కువగా ఉంటుందన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో భవిష్యత్‌లో రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగే తీరులో భారీగా మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఆ పార్టీ నేతలు బుర్రలేని వ్యక్తులు మాదిరి మాట్లాడుతున్నారని విమర్శించారు. నోట్ల రద్దు వల్ల వ్యక్తిగతంగా ఇబ్బంది ఎదుర్కొంటున్న వ్యక్తులే ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ దీని వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నట్టు ప్రజలను తప్పుదారి పట్టించేలా మాట్లాడుతున్నారని సిద్ధార్థనాథ్ సింగ్ అన్నారు. -
ఈసారి పాలకపక్షం మారదా?
రెండు ప్రాంతీయపార్టీలు-డీఎంకే, ఆలిండియా అన్నా డీఎంకే- ఆధిపత్యం చలాయిస్తున్న రాష్ట్రం తమిళనాడు. ఈ రాష్ట్రం 15 అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ఇంతకు ముందులా తీవ్ర ఉత్కంఠ జనంలో కనిపించడం లేదు. గత 35 ఏళ్లలో(1989 నుంచి) జరిగిన ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి వచ్చాయి. 234 సీట్లున్న తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు 1989 నుంచీ వరుసగా రెండుసార్లు ఏ ఒక్క పార్టీని గెలిపించలేదు. అయితే ఈ ఎన్నికల్లో అలాంటి రాజకీయ వాతావరణం పైకి కనిపించడం లేదు. డీఎంకే తొలి ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై, ఏఐఏడీఎంకే స్థాపకుడు, మాజీ సీఎం ఎంజీ రామచంద్రన్ మార్గంలో జయలలిత అన్నా కేంటీన్ వంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలతో జనాదరణ పొందుతున్నారు. ఎన్నో ‘ఉచిత’ పథకాలతో జనరంజకంగా పాలిస్తున్నా ఐదేళ్ల ఏఐఏడీఎంకే సర్కారుపై అసంతృప్తి జనంలో లేకపోలేదు. అన్నాడీఎంకే ఫ్రంట్కే విజయమంటున్న రెండు సర్వేలు 2011 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే, రెండు కమ్యూనిస్ట్‌పార్టీలు, ఎంఎంకే, పుదియతమిళగం, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్‌తో కలసిపోటీచేసిన ఏఐఏడీఎంకే ఈసారి రెండు మూడు చిన్న పార్టీలతో కలసి పోటీచేసే అవకాశాలున్నాయి. ఏఐఎస్ఎంకే నేత, సినీనటుడు ఆర్.శరత్‌కుమార్ ఎన్డీఏను వదిలి కిందటి నెలలో ఏఐడీఎంకే కూటమిలో చేరారు. అన్నాడీఎంకే కూడా ఇంకా చిన్నాచితకా పార్టీలతో ఎన్నికల పొత్తులు ఖరారు చేసుకోలేదు. ఏప్రిల్ 22న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే లోపు కూటముల పొత్తులు ఓ కొలిక్కి వస్తాయని భావిస్తున్నారు. శుక్రవారం విడుదలైన రెండు ఎన్నికల సర్వేల ఫలితాలు- అన్నాడీఎంకే తమిళనాడు ఇటీవలి రాజకీయ ఆనవాయితీలకు భిన్నంగా వరుసగా రెండోసారి విజయం సాధిస్తుందని వెల్లడించాయి. ఇండియా టీవీ- సీఓటర్ సర్వే ప్రకారం పాలకపక్షానికి(ఏఐఏడీఎంకే కూటమి)కి 130 సీట్లు రావచ్చని అంచనా. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సాధారణ మెజారిటీకి కనీసం 118 సీట్లు అవసరం. అవినీతే ప్రచారాస్త్రం... ఈసారి తమిళనాట ఎన్నికల్లో అవినీతే ప్రధానాస్త్రం కానుంది. అక్రమాస్తుల కేసులో జయలలిత జైలుకెళ్లటం, టూజీ స్పెక్ట్రమ్, ఈడీ కేసుల్లో కరుణానిధి కుటుంబ సభ్యులు, మాజీ హోం మంత్రి చిదంబరం కుటుంబ సభ్యులపైనా ఈడీ కేసులు నమోదవటం ఎన్నికల ప్రచారంలో ప్రధానాంశంగా మారనుంది. అటు జయలలిత కూడా.. తమిళనాడులో రాజకీయమంటే అమ్మే అనేంతగా పరిస్థితులను మార్చేశారు. అయితే దీనిపై పార్టీలోనూ కాస్త అసంతృప్తి ఉంది. అమ్మ క్యాంటీన్లు, అమ్మ ఉప్పు ఇలా ప్రతిదానికీ అమ్మ బ్రాండింగ్ వేసుకుంటున్నా.. సంక్షేమపథకాలు ప్రజాక్షేత్రం వరకు చేరటం లేదనే విమర్శకూడా ఉంది. కాగా, ద్రవిడియన్ పార్టీల ప్రభావం పుష్కలంగా ఉన్న తమిళనాడులో ఓటర్లు బీజేపీని గుర్తించాలంటే చాలా కష్టమే. ఈ దిశగా కేంద్రం కొత్త పథకాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నా.. పెద్దగా ప్రభావం కనిపించటం లేదు. కన్యాకుమారి ఎంపీ సీటును గెలుచుకున్నా మిగిలిన ప్రాంతాల్లో బీజేపీకి పునాది లేదు. అయితే రజనీకాంత్ బీజేపీ తరపున ప్రచారం చేస్తారనే వార్తల నేపథ్యంలో పరిస్థితి కాస్త మారొచ్చనుకుంటున్నా.. మొదటి విడత సర్వే ప్రకారం బీజేపీ ఒక్కసీటు కూడా గెలవదని తెలుస్తోంది. 2011 ఎన్నికల్లో వివిధ పార్టీలు గెలుచుకున్న సీట్లు ఏఐఏడీఎంకే 150, డీఎండీకే(విజయ్‌కాంత్) 29, సీపీఎం 10, సీపీఐ 9, డీఎంకే 23, కాంగ్రెస్ 5, ఇతరులు 8, బీజేపీ ఖాతాతెరవలేదు కుటుంబ కలహాలతో కోలుకోని డీఎంకే 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన డీఎంకే 2014 లోక్‌సభ ఎన్నికల్లో చావుదెబ్బతింది. అంతకు ముందు గెలిచిన 18 సీట్లలో ఒక్కటి కూడా నిలబెట్టుకోలేకపోయింది. పాలకపక్షమైన ఏఐఏడీఎంకే 44.3 శాతం ఓట్లతో 37 శాతం ఓట్లు గెల్చుకోగా, డీఎంకే కేవలం 26 శాతం ఓట్లతో ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. పెద్ద కొడుకు ఎంకే అళగిరి మళ్లీ పార్టీలో చేరినా డీఎంకే విజయావకాశాలు కనిపించడం లేదు. మే 16న పోలింగ్ జరిగే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌కు కేవలం 30 సీట్లు మాత్రమే ఇవ్వడానికి డీఎంకే ప్రతిపాదించడంతో ఇంకా పొత్తు ఖరారు కాలేదు. విజయకాంత్ నేతృత్వంలో కొత్త ఫ్రంట్ రెండు వామపక్షాలు, ఎండీఎంకే, వీసీకేతో కూడిన పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్(పీడబ్ల్యూఎఫ్)తో మార్చి 23న సినీనటుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయకాంత్ నాయత్వంలోని దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం(డీఎండీకే) పొత్తుకుదుర్చుకుంది. విజయ్‌కాంత్‌ను కొత్త ఫ్రంట్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారు. మొత్తం 234 సీట్లలో డీఎండీకే 124 సీట్లకు పోటీచేస్తుంది. మిగిలిన సీట్లకు ఇతర భాగస్వామ్య పార్టీలు పోటీచేస్తాయి. అందరూ తెలుగు నాయుళ్లే ఎన్నో తరాలుగా తమిళనాట నివసిస్తున్న తెలుగావారిని అక్కడ నాయుళ్లనే పిలుస్తారు. కులాలను బట్టి కమ్మ నాయుడు, బలిజ నాయుడు, రెడ్డి నాయుడు, గవర నాయుడు అంటారు. కమ్మ, రెడ్డి కులాలకు చెందిన రాజకీయ నాయకులు అన్ని ప్రధాన పార్టీల్లో ఉన్నారు. కమ్మ నేతలు కోయంబత్తూరు ప్రాంతంలో అంటే కొంగునాడులోని సీట్ల నుంచి చట్ట సభలకు ఎన్నికవుతున్నారు. డీఎంకే తరఫున గతంలో లోక్‌సభకు ఎన్నికై కేంద్రమంత్రిగా పనిచేసిన సినీనటుడు నెపోలియన్(అసలు పేరు కుమరేశన్ దురైస్వామి), ఆయన సమీప బంధువు, రాష్ట్ర మాజీ మంత్రి కేఎన్ నెహ్రూ, మరో మాజీ మంత్రి కేకేఎస్సెస్సార్ రామచంద్రన్‌లు రెడ్డి కుటుంబాల్లో పుట్టినవారే. 1947-49 మధ్య మద్రాసు సీఎంగా ఉన్న ఓమండూరి రామసామి రెడ్డియార్ కూడా ఈ వర్గానికి చెందిన పెద్ద నేత. ఇక కమ్మ నాయుడు నేతల్లో ప్రముఖులు ఎండీఎంకే నేత వైకో(అసలు పేరు వి.గోపాలసామి), డీఎండీకే నేత, సినీనటుడు ‘కెప్టెన్’ విజయకాంత్, ప్రస్తుత చెన్నై నార్త్ అన్నాడీఎంకే ఎంపీ తుమ్మల గంగాధర వెంకటేష్‌బాబు ఉన్నారు. తమిళనాడు వృద్ధ నేతల్లో పెద్దవాడు డీఎంకే అధ్యక్షుడు ఎం.కరుణానిధి. ఆయన ప్రభుత్వా న్ని 1976 జనవరిలో(ఎమర్జెన్సీ కాలం) అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బర్తరఫ్ చేశాక మళ్లీ 13 ఏళ్లకు 1989 జనవరిలో తమిళనాడు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 1977 జూన్‌లో అన్నాడీఎంకే నేత ఎంజీఆర్ సీఎం పదవి చే పట్టి 1987లో మరణించాక అసెంబ్లీ రద్దయ్యాక జరి గిన ఎన్నికల్లో గెలిచాకే కరుణానిధి 1989లో సీఎం ప దవి చేపట్టగలిగారు. ప్రస్తుతం 93 ఏళ్లు దాటిన ఈ సీనియర్ నేత రాజకీయాల్లో చురుగ్గానే ఉన్నారు. మిత్రపక్షాలు లేని బీజేపీ కిందటి లోక్‌సభ ఎన్నికల్లో ఒక లోక్‌సభ సీటు గెల్చుకున్న బీజేపీకి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలు దొరకడం లేదు. డీఎండీకే, ఎండీఎంకే చేతులు కలిపి కొత్త ఫ్రంట్ ఏర్పాటుచేయడంతో బీజేపీకి బలమైన మిత్రుల కొరత ఏర్పడింది. మొత్తం 234 సీట్లకు మే 16న పోలింగ్ జరుగుతుంది. ఇంకా సమయం ఉన్న కారణంగా ప్రధాన జాతీయ పార్టీలు, రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు ఇంకా ఎన్నికల పొత్తులను ఖరారు చేసుకోలేదు. -
సమరానికి సై
నాలుగు రాష్ట్రాలు (పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ), ఒక కేంద్రపాలిత ప్రాంతం(పుదుచ్చేరి) అసెంబ్లీలకు జరిగే ఎన్నికల్లో పోలింగ్ సోమవారం ప్రారంభమౌతోంది. ఈ నెల 4న ఉదయం పశ్చిమబెంగాల్, అస్సాంలో మొదటి దశ పోలింగ్ మొదలవుతుంది. కిందటేడాది బిహార్ ఎన్నికల తర్వాత దేశంలో జరుగుతున్న పెద్ద ఎన్నికలివే. ఏప్రిల్ 4 నుంచి మే 16 వరకూ దాదాపు నెలన్నర పాటు జరిగే ఈ సమరంలో 824 అసెంబ్లీ స్థానాల్లో 17 కోట్లకు పైగా ఓటర్లు తమ ప్రతినిధులను నిర్ణయిస్తారు. దక్షిణాది రాష్ట్రాల్లో మే 16న ఒకే రోజు పోలింగ్ జరుగుతుంది. సమస్యాత్మక, కల్లోలిత ప్రాంతంగా భావించే బెంగాల్లో ఈ నెల 4, 11, 17, 21, 25, 30, మే 5న పోలింగ్ జరుగుతుంది. వచ్చే నెల 19న జరిగే ఓట్ల లెక్కింపులో ఈ రాష్ట్రాల్లో పాలకులెవరో తేలిపోతుంది. రెండు తూర్పు-ఈశాన్య రాష్ట్రాలు, రెండు ద క్షిణాది రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఈ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులందరినీ తిరస్కరించే అవకాశమిచ్చే ‘నోటా’ గుర్తు తొలిసారి ఈవీఎంల్లో కనిపిస్తుంది. కేంద్రంలో పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయ్యే సమయంలో జరుగుతున్న ఈ ఎన్నికలకు ప్రాధాన్యం ఉంది. ఈ 4 రాష్ట్రాల్లో దేంట్లోనూ బీజేపీ అధికారంలో లేనప్పటికీ-కిందటేడాది ఢిల్లీ, బిహార్ ఎన్నికల ఓటమి బాధ నుంచి బయట పడాలంటే ప్రధాని మోదీ అస్సాంలో మొదటిసారి కాషాయ పక్షాన్ని గెలిపించక తప్పదు. అలాగే, ఆర్ఎస్ఎస్ ద్వారా వేళ్లూనుకుని, ఎన్నో ఏళ్లుగా అసెంబ్లీలో ఖాతా తెరవలేకపోయిన కేరళలో ఒక్క సీటయినా గెలవాల్సిన అవసరం బీజేపీకి ఉంది. ఇక్కడ బీజేపీ కూటమికి ఊహించినదాని కన్నా ఎక్కువ ఓట్లు వస్తే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు అధికారం మళ్లీ దక్కే అవకాశముంటుంది. అలాగే, వామపక్షాలు గత ఐదేళ్లుగా చతికిలపడి ఉన్న బెంగాల్లో మమతాబెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఆవిర్భవించడం కూడా బీజేపీ కోర్కెల్లో ఒకటి. మరో మహిళా సీఎం ఏలుబడిలోని తమిళనాడులో బలం పెంచుకోవడం కూడా బీజేపీ లక్ష్యం. కాంగ్రెస్ విషయానికొస్తే, 2014లో 44 లోక్‌సభ సీట్లతో చావుదెబ్బతిని ఇంకా కోలుకోలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న అస్సాం, కేరళలో సత్తా నిలబెట్టుకుంటే అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి కొంత పరువు దక్కుతుంది. అయితే, కేరళలో ప్రతి ఐదేళ్లకూ పాలక కూటమిని మార్చే అలవాటు మలయాళీలకు అబ్బింది. అస్సాంలో 15 ఏళ్లుగా అధికారంలో ఉండడం కాంగ్రెస్‌కు అననుకూల అంశమే. 2009 నుంచీ వరుస ఓటములతో త్రిపురకే పరిమితమైన సీపీఎం, దాని మిత్రపక్షాలైన వామపక్ష పార్టీలకు బెంగాల్లో విజయావకాశాలు కనిపించకపోయినా, కేరళలో తప్పక గెలవాల్సిన పరిస్థితి. లేకుంటే ఈ మధ్య రెండు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో జరిగిన పరిణామాల నుంచి లభించిన ప్రయోజనం కమ్యూనిస్టులకు దక్కకుండా పోతుంది. రాష్ట్రాలవారీగా వివిధ రాజకీయ పక్షాల విజయావకాశాలెలా ఉన్నాయో పరిశీలిద్దాం. - నాంచారయ్య మెరుగుమాల పదిహేనేళ్ల కాంగ్రెస్ పాలన తర్వాత కాషాయం? అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాలుగింటిలో చిన్న రాష్ట్రమైన అస్సాంలో (అసెంబ్లీ సీట్లు 126) ప్రజలు కిందటి లోక్‌సభ ఎన్నిల్లో బీజేపీకి మొత్తం 14 సీట్లలో ఏడింటిలో పట్టంగట్టారు. 2011 శాసనసభ ఎన్నికల్లో కేవలం ఆరు సీట్లు గెలిచిన బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో అధిక అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిక్యం సాధించింది. అందుకే దాదాపు 30 శాతానికి పైగా ముస్లిం జనాభా ఉన్న ఈ ఈశాన్య రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకోవడానికి బీజేపీ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. కిందటేడాది బిహార్ ఎన్నికలకు ముందే అస్సాం కాంగ్రెస్ కీలక నేత హిమంతా బిశ్వ శర్మ మరో 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలసి బీజేపీలో చేరడం తో కాషాయపార్టీ వ్యూహం బయటపడింది. 2001 నుంచీ జరిగి న మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి బాటలు వేసిన బడా నేత శర్మ. అదీగాక 15 ఏళ్లుగా సీఎంగా ఉన్న 79 ఏళ్ల తరుణ్ గొగోయ్ పాలనపై అస్సామీలు విసుగెత్తిపోయారు. జాతుల మధ్య ఘర్షణలకు నిలయమైన ఈ రాష్ర్టంలో గడచిన ఐదేళ్లలో సాగిన ఊచకోతల్లో వందలాది మంది మరణించారు. మరో పక్క బంగ్లాదే శ్ నుంచి చొరబాటుదారులు ప్రవేశించి భారత పౌరులుగా మారుతున్నారన్న ఆరోపణ లు... 1980ల్లో తీవ్రమైన విదేశీయుల వ్యతిరేక ఉద్యమకాలం నుంచీ వినిపిస్తూనే ఉన్నాయి. చట్టవ్యతిరేకంగా వచ్చే బంగ్లాదేశీ ముస్లింలకు కాంగ్రెస్ ప్రోత్సాహం ఉందనే ప్రచారాన్ని బీజేపీ కొన్ని దశాబ్దాలుగా చే స్తూనే ఉంది. మూడు పర్యాయాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై ప్రజావ్యతిరేకత ఒక్కటే తమను గెలిపించదని బీజేపీ గ్రహించింది. అస్సాం ఉద్యమ నేతలు స్థాపించిన ఒకప్పటి పాలక పార్టీ అసోం గణపరిషత్(ఏజీపీ), ఆదివాసీ వర్గం బోడోలకు ప్రాతినిధ్యం వహించే బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్(బీపీఎఫ్)తో బీజేపీ పొత్తు పెట్టుకుంది. కిందటేడాది బిహార్ ఎన్నికల్లో చేసిన పొరపాట్లు అస్సాంలో చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ తెలివిగా ఎన్నికల ప్రచారం చేస్తోంది. బిహార్‌లో జేడీ యూ నేత, సీఎం నితీశ్‌కుమార్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగి నష్టపోయిన విషయం ప్రధాని మోదీ మరవలేదు. కీలకాంశాలివే.. అస్సాంలోని 126 సీట్లలో 38 చోట్ల తేయాకు ఓటర్లు మరోసారి క్రియాశీలకం కానున్నారు. దాదాపు 35 లక్షల మంది కార్మికులు (ఈ ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లోని మొత్తం ఓటర్లలో 30 శాతం) ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించనున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 32 సీట్లు గెలుచుకోగా.. బీజేపీ ఒకటి, ఏజీపీ మూడు, ఏఐయూడీఎఫ్ రెండుసీట్లు గెలుచుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారినట్లు కనబడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాల్లో బీజేపీ మూడు సీట్లు గెలుచుకోగా.. ఒకటి కాంగ్రెస్ వశమైంది. అయితే ఈ నాలుగు జిల్లాల్లో తేయాకు కార్మికుల కుటుంబాలకే అన్ని పార్టీలు టికెట్ ఇవ్వటంతో.. పోటీ రసవత్తరంగా మారింది. దీనికి తోడు వరదలు, పేదరికం, తిరుగుబాట్లు ఈ ప్రాంతంలో చాలాకాలంగా తీవ్రమైన సమస్యలుగా ఉన్నాయి. అయితే వెనుకబాటుకు గురైన అస్సాంకు యూపీఏ సర్కారు ప్రత్యేక హోదా కల్పిస్తే.. ఎన్డీఏ అధికారంలోకి రాగానే ఈ హోదాను వెనక్కు తీసుకుందని కాంగ్రెస్ విమర్శిస్తుండగా.. పదిహేనేళ్లుగా తరుణ్ గొగోయ్ అధికారంలో ఉన్నా రాష్ట్రం వెనుకబాటుకు గురైందని.. తమను గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని బీజేపీ ప్రచారంలో చెబుతోంది. సమస్య గొగోయ్ కాదు..గరీబీ అన్న మోదీ అందుకే పదిహేనేళ్లుగా అస్సాంలో అధికారపీఠంపై కూర్చొన్న సీఎం గొగోయ్‌ను బ్రహ్మపుత్రలో కలపాలని అనకుండా మోదీ, ‘‘ఇక్కడ సమస్య గోగోయ్ కాదు, గరీబీ(పేదరికం). గొగోయ్‌జీ, మీకు కొన్నేళ్లలో 90 ఏళ్లు నిండుతాయి. నాకంటే పెద్దగా మీరు నన్ను ఆశీర్వదించాలి’’అంటూ అస్సామీలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అలాగే బిహార్‌లో పోటీ నితీశ్‌కూ తనకే మధ్యే అన్నట్టు వ్యవహరించిన ప్రధాని ఇక్కడ ఆ పొరపాటు చేయలేదు. ప్రస్తుత కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్‌నే బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తూ ప్రచారం చేయడం విశేషం. ‘‘అస్సాంలో ఉన్న ఒకే ఒక ఆనందం సర్బానంద. ఆయనకు ఐదేళ్లు పాలించే అవకాశమిస్తే, బీజేపీ దాని మిత్రపక్షాలు రాష్ట్రాన్ని కష్టాల నుంచి బయటపడేస్తాయి’’ అని కూడా మోదీ సోనోవాల్‌ను ప్రశంసిస్తూ ఎన్నికల సభల్లో ప్రసంగించారు. మొదటి సర్వేలు బీజేపీకి అనుకూలం మూడు నెలల క్రితం జరిపిన ఎన్నికల సర్వేల్లో లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగానే బీజేపీ అస్సాంలో మెజరిటీ సీట్లు గెలిచే అవకాశాలున్నాయని విశ్లేషించారు. అయితే, ఈ మధ్య వేసిన అంచనాల ప్రకారం చూస్తే కాంగ్రెస్, బీజేపీ కూటమి మధ్య గట్టి పోటీ ఉంటుందని స్పష్టమౌతోంది. అయితే, కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్(78) తర్వాత ఎక్కువ సీట్లు గెలుచుకున్న ముస్లింల పార్టీ ఆలిండియా యునెటైడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్(ఏఐయూడీఎఫ్-18) నేత బద్రుద్దీన్ అహ్మద్ పలుకుబడి, జనాకర్షణ శక్తి తగ్గిందని చెబుతున్నారు. కోట్లాది రూపాయల అత్తరు వ్యాపారం చేస్తూ ‘పెర్ఫ్యూమ్ కింగ్’గా పేరుతెచ్చుకున్న అహ్మద్ ఈ విషయం గ్రహించి కాంగ్రెస్‌తో పొత్తుకు ప్రయత్నించి విఫలమయ్యారు. బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారుల సమస్య, అస్సాంలో పెరుగతున్న ముస్లింల జనాభాను ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తున్న బీజేపీ- మతాల ప్రకారం జనం చీలిపోయే పరిస్థితి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. మరో విశేషమేమంటే, కిందటేడాది కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన హిమంతా బిశ్వ శర్మ నేరుగా అహ్మద్‌పై విమర్శల బాణాలు విసురుతున్నారు. ‘‘ఇవి ఇతర ఎన్నికలలాంటివి కావు. బద్రుద్దీన్ అనే నేత సీఎం కావాలనుకుంటున్నాడు. దిగువ అస్సాంలో గత పాతికేళ్లలో పరిస్థితి మారిపోయింది. ఒకప్పుడు అసెంబ్లీకి ఎన్నికవ్వాలని ఆశించే అభ్యర్థులు నగావ్ జిల్లా బతద్రవలోని ప్రసిద్ధ వైష్ణవ సంఘసంస్కర్త శ్రీమంత శంకరదేవ ఆలయానికి వెళ్లి ఆయన ఆశీస్సుల కోసం ప్రార్థించేవారు. ఇప్పుడేమో అలాంటి ఆశావహులు బద్రుద్దీన్ ‘దువా’(దయ)కోసం ఆరాటపడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన్ను మనం ఆపాల్సిందే. దిస్పూర్(రాజధాని)లోకి ఆయనను అడుగుపెట్టనీయకూడదు.’’ అంటూ హిమంతా శర్మ హిందూ ఓటర్లను రెచ్చగొడుతూ ప్రసంగిస్తూన్నారు. సైకియా, మహంతా, గొగోయ్ అస్సాం మొదటి సీఎం గోపీనాథ్ బోర్దోలోయ్(1946-50). ఆయన తర్వాత ఎక్కువ కాలం సీఎంగా ఉన్న నేతలు హితేశ్వర్ సైకియా(1983-85, 1991-96), ప్రఫుల్ల కుమార్ మహంతా(1986-91, 1996-2001). రెండుసార్లు సీఎం అయిన సైకియా పదవిలో ఉండగా మరణించారు. సైకియాకు మంచి మిత్రుడైన మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ గువాహటీలోని సైకియా ఇంట్లో అద్దెకుంటున్నట్లు చూపించి అస్సాం నుంచి రాజ్యసభకు పలుమార్లు ఎన్నికయ్యారు ఈ క్రమంలో వివాదంలో ఇరుక్కున్నారు. అస్సాం ప్రతినిధిగానే మన్మోహన్ ప్రధాని పదవిని రెండుసార్లు చేపట్టారు. 34 ఏళ్ల వయసులో సీఎం పదవి చేపట్టిన అస్సాం ఉద్యమ నేత మహంతా ఏజీపీ తరఫున ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన పార్టీ 2001 ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచీ కాంగ్రెస్ తరఫున ప్రస్తుత సీఎం గొగోయ్ అధికారంలో కొనసాగుతున్నారు. చావని కాంగ్రెస్ ఆశలు 2014లో కేవలం మూడు లోక్‌సభ సీట్లతో సరిపుచ్చుకున్న కాంగ్రెస్ వరుసగా నాలుగో విజయానికి గట్టి ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ తరఫున పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్షులతోపాటు ముఖ్యమంత్రి గొగోయ్ కొడుకు, కాలియాబోర్ ఎంపీ గౌరవ్ గొగోయ్ విస్తృతంగా పర్యటిస్తూ కాషాయ కూటమిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. బ్రిటిష్ మహిళను పెళ్లాడిన గౌరవ్‌ను తండ్రి తరుణ్‌కు వారసునిగా భావిస్తున్నారు. ఒకవేళ బీజేపీ కూటమి విజయం సాధిస్తే కేంద్రమంత్రి సోనోవాల్ సీఎం అవుతారు. అప్పుడు ఆదీవాసీ అయిన సోనోవాల్ అస్సాం రెండో ఎస్టీ సీఎంగా చరిత్రకెక్కుతారు. 1979లో కచ్చా సోనోవాల్ వర్గానికే చెందిన ఆదివాసీ జోగేంద్రనాథ్ హజారికా జనతాపార్టీ తరఫున మూడు నెలలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ నెల 4న 65, 11న 61 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరుగుతుంది.