అనుభవానికే అగ్రాసనం | Editorial On Five State Assembly Elections And Results | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 15 2018 1:19 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Editorial On Five State Assembly Elections And Results - Sakshi

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడుచోట్ల–మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ కంచుకోటలను తుత్తినియలు చేసి ఘన విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ మూడురోజుల తర్వాత రెండు రాష్ట్రాలకు కొత్త ఏలికలను ప్రకటించింది. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవికి కమ ల్‌నాథ్‌నూ, రాజస్తాన్‌కు అశోక్‌ గహ్లోత్‌నూ ఎంపిక చేసి యువ రక్తం కన్నా అనుభవానికే ప్రాధా న్యత ఇవ్వదల్చుకున్నట్టు తెలియజెప్పింది. ఆ రెండుచోట్లా సీఎం పదవుల్ని ఆశించిన జ్యోతిరా దిత్య సింధియా(మధ్యప్రదేశ్‌), సచిన్‌ పైలట్‌(రాజస్తాన్‌)లు ఉపముఖ్యమంత్రులవుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌పై నిర్ణయాన్ని శనివారం ప్రకటిస్తారు. తాజా ఎంపికలను గమనిస్తే పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ మార్క్‌ రాజకీయాలను సంపూర్ణంగా ఒంటబట్టించుకున్నట్టు అర్ధమవు తుంది.

పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న కాలంలో తరచు ఆయన వారసత్వ రాజకీయాలు సరికాదని చెప్పేవారు. తమ పార్టీతోసహా దేశంలోని పార్టీలన్నీ కొద్దిమంది వ్యక్తుల ప్రాబల్యంతో నడుస్తు న్నాయని, ముఖ్యంగా కాంగ్రెస్‌ అనుసరించే హైకమాండ్‌ సంస్కృతికి తాను వ్యతిరేకమని చెప్పే వారు. ముఖ్యమంత్రులుగా ఎవరుండాలనే అంశాన్ని స్థానిక శాసనసభ్యులే నిర్ణయించాలి తప్ప హైకమాండ్‌ కాదని రాజస్తాన్‌ రాజధాని జైపూర్‌లో సరిగ్గా అయిదేళ్లక్రితం జరిగిన మేధో మథన సదస్సులో ఆయన చెప్పారు. కానీ ఇప్పుడు మధ్యప్రదేశ్‌తోపాటు రాజస్తాన్‌కు కూడా సీఎంల ఎంపికలో తల్లి సోనియాగాంధీ, సోదరి ప్రియాంకల సాయం తీసుకున్నారు. వారు ముగ్గురూ చర్చించుకుని, ఆశావహులతో విడివిడిగా మాట్లాడి చివరకు తమ నిర్ణయాలను ప్రకటించారు. 

ఈ ప్రక్రియ కాంగ్రెస్‌కు కొత్తగాదు. కానీ పార్టీ శాసనసభ్యులు మాత్రమే నిర్ణయించుకోవాలని గతంలో చెప్పిన రాహుల్‌ అది ఆచరణ సాధ్యంకాదన్న అభిప్రాయానికొచ్చారని తేటతెల్లమవు తోంది. అంతేకాదు... ఎలాంటి ఆరోపణలూ లేనివారిని మాత్రమే ఎంపిక చేయాలన్న పట్టింపు కూడా ఆయనకేమీ లేదని అర్ధమవుతుంది. ఎంపికైన ఇద్దరు నేతలూ రాహుల్‌ కంటే సోనియాకు సన్నిహితులు. అశోక్‌ గహ్లోత్‌కు సమర్థ పాలకుడిగా పేరుంది. దానికితోడు అపారమైన అనుభవం ఉంది. పెద్దగా ఆరోపణలు లేవు. కానీ కమల్‌నాథ్‌ విషయంలో అలా కాదు.

1984లో ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన సిక్కుల ఊచకోత కేసులో ఆయనపై ఆరోపణలొచ్చాయి. ఈ ఊచ కోత కేసులను పరిశీలించేందుకు ఏర్పాటైన నానావతి కమిషన్‌ కమల్‌నాథ్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. రకబ్‌గంజ్‌ గురుద్వారా సమీపంలో హింస చోటుచేసుకున్నప్పుడు అప్పటికి కాంగ్రెస్‌ యువ నాయకుడిగా ఉన్న కమల్‌నాథ్‌ అక్కడే ఉన్నారన్నది ఆరోపణ. అయితే తగిన సాక్ష్యాధారాలు లభించని కారణంగా ఆయనపై కేసు ముందుకు సాగలేదు. రెండేళ్లక్రితం ఆయన్ను పంజాబ్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమించినప్పుడు సిక్కుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావ డంతో ఆ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ ఉపసంహరించుకుంది. కానీ అదే కమల్‌నాథ్‌ను ఇప్పుడు సీఎం పదవికి ఎంపిక చేయటం ద్వారా బీజేపీకి తగిన ఆయుధాన్ని కాంగ్రెసే అందించినట్టయింది.

పంజాబ్‌లో మిత్రులుగా ఉన్న బీజేపీ, అకాలీదళ్‌ ఇప్పటికే దీనిపై విమర్శలు సంధిస్తున్నాయి. అయితే కమల్‌నాథ్‌ ఇందిరాగాంధీ కాలంనుంచీ పార్టీని నమ్ముకుని ఉన్నారు. అత్యవసర పరిస్థితి ఎత్తేశాక 1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీనుంచి ఎంపీగా గెలిచింది ఆయనొక్కరే. పొరుగునున్న ఉత్తరప్రదేశ్‌లో ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు సంజయ్‌గాంధీ సహా పార్టీ మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని గుర్తుంచుకుంటే ఈ గెలుపు ప్రాముఖ్యత అర్ధమ వుతుంది.    

చాలాకాలం తర్వాత పార్టీకి దక్కిన తొలి విజయాలు గనుక..మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో  పార్టీకి లభించిన మెజారిటీ స్వల్పం గనుక ఆ రెండుచోట్లా దూకుడుగా వెళ్లటం అంత మంచి దికాదని రాహుల్‌ అనుకొని ఉండొచ్చు. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు 116మంది మద్దతు అవసరం కాగా కాంగ్రెస్‌కు 114, బీజేపీకి 109 వచ్చాయి. అయితే అక్కడ రెండు స్థానాలొచ్చిన బీఎస్‌పీ, ఒకటి గెల్చుకున్న ఎస్‌పీ కాంగ్రెస్‌కు మద్దతిస్తామని ప్రకటించాయి. ఓట్ల శాతం రీత్యా చూస్తే కాంగ్రెస్‌కన్నా బీజేపీకే అధికంగా వచ్చాయి. కాంగ్రెస్‌ 40.9శాతం ఓట్లు గెల్చుకోగా, బీజేపీ 41శాతం ఓట్లు సాధించుకుంది. అక్కడి బీజేపీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్థానంలో వేరెవరైనా ఉంటే కాంగ్రెస్‌ను సులభంగా అధికారానికి దూరం పెట్టేవారు.

చౌహాన్‌ అందుకు అంగీకరించ లేదు. అలాగే రాజస్తాన్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు కావల్సిన మెజారిటీ 100 స్థానాలు కాగా, కాంగ్రెస్‌కు 99 లభించాయి. బీజేపీకి 73, స్వతంత్రులకు 13, ఇతర పార్టీలకు 14 వచ్చాయి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఓట్ల శాతం 39.3 కాగా, బీజేపీ ఓట్ల శాతం 38.8. మరో ఆర్నెల్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యువకులైన జ్యోతిరాదిత్య, సచిన్‌ పైలట్‌లకు అవకాశమిస్తే ఏమవుతుందోనన్న సంశయం ఏర్పడి ఉండొచ్చు. వీరిద్దరూ ఆ రాష్ట్రాల్లో కీలక బాధ్యతలు నిర్వ హించటం వల్ల చాలామంది తదుపరి సీఎంలు వీరే కావొచ్చునన్న అంచనాకొచ్చారు. జ్యోతి రాదిత్య మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ కన్వీనర్‌గా, సచిన్‌ పైలెట్‌ రాజస్తాన్‌ పీసీసీ అధ్య క్షుడిగా ఉన్నారు.

ఆ రెండు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్‌గఢ్‌లో పార్టీ ముందున్న సవాళ్లు చిన్నవేమీ కాదు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న పెను సంక్షోభమే బీజేపీకి శాపమైంది. అధికారంలోకొచ్చిన పదిరోజుల్లో రుణమాఫీ అమలు చేస్తామని కాంగ్రెస్‌ ప్రకటించబట్టే రైతులు ఆ పార్టీకి మద్దతు పలి కారు. ఇవిగాక పంటలకు గిట్టుబాటు ధరలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన వగైరా సమస్య లున్నాయి. ఇవన్నీ అనుకున్నట్టు చేయలేకపోతే ముంచుకొస్తున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కష్టాలు ఎదురవుతాయి. ఈ విషయంలో కమల్‌నాథ్, అశోక్‌ గహ్లోత్‌ల అనుభవం ఏమేరకు పని కొస్తుందో వేచిచూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement