
కులగణన.. మూడు హిందీ హార్ట్‌ల్యాండ్ రాష్ట్రాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. బీజేపీ హిందూత్వ ఎజెండాని తిప్పికొట్టడానికి కాంగ్రెస్ పార్టీ కులగణన అనే బ్రహా్మ్రస్తాన్ని బయటకు తీసింది. వచ్చే నెలలో రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కులగణన చుట్టూ తిరుగుతున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటికే తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన చేపడతామని ప్రకటించిన కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కులగణన కోసం పట్టుబడుతోంది. బీజేపీ కులగణన చేపడతామని అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఓబీసీ, ఎస్‌సీ, ఎస్టీ ఓట్లపై గురి పెట్టింది.
మన దేశంలో 2011లో కులగణన చేపట్టినప్పటికీ అందులో వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. బిహార్‌లో కులగణన నిర్వహించి రాష్ట్ర జనాభాలో 63% మంది వెనుకబడిన వర్గాలు ఉన్నారని తేల్చి చెప్పడంతో అదే తరహాలో దేశవ్యాప్తంగా కులాల జనాభా వివరాలను సేకరించాలన్న డిమాండ్ ఊపందుకుంది. కాంగ్రెస్ కులగణన డిమాండ్‌ను తిప్పికొడుతున్న బీజేపీ సమాజాన్ని విభజించడానికే కాంగ్రెస్ ఇదంతా చేస్తోందని ఎదురు దాడికి దిగుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్
గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నికల్లో కులం కార్డు అత్యంత కీలకంగా మారింది. కుల సంఘాలు నానాటికీ శక్తిమంతంగా మారుతున్నాయి. ఎన్నికల్ని శాసిస్తున్నాయి. టిక్కెట్ల కేటాయింపు దగ్గర్నుంచి ఎన్నికల తర్వాత పదవుల పందేరం వరకు కులాల లెక్కలపైనే జరుగుతున్నాయి. గెలిచిన వారికి సన్మానాలు, సత్కారాలు చేస్తున్నాయి. ఈ సారి ఎన్నికలు కులగణన చుట్టూనే తిరుగుతాయి – నారాయణ్ బరేథ్, రాజకీయ విశ్లేషకుడు
రాజస్తాన్
రాజస్తాన్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని కుల సంఘాలు మహా సమ్మేళనాలు నిర్వహించి తమ బలాన్ని ప్రదర్శించాయి. కులగణన చేపట్టాలని, తమకు రిజర్వేషన్ల శాతం పెంచాలన్నది వారి ప్రధాన డిమాండ్‌గా ఉంది. సీఎం అశోక్ గెహ్లోత్ అన్ని కులాలకు ప్రత్యేకంగా సంక్షేమ బోర్డుల్ని ఏర్పాటు చేయడమే కాకుండా కులగణన కూడా చేపడతామని ప్రకటించారు.
కులాల జనాభాకనుగుణంగా రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీనికి వివిధ కులాల దగ్గర్నుంచి మంచి స్పందన వచ్చింది. రాజస్తాన్‌లో అత్యంత కీలకమైన రాజ్‌పుత్‌లు ఓబీసీలకు ఉన్నారు. ఓబీసీల సంఖ్య ఎంతో ఎవరికీ తెలీకపోవడంతో రిజర్వేషన్లలో వారికి అన్యాయం జరుగుతోందనే వాదన వినిపిస్తోంది. రాజస్తాన్ జనాభాలో 50శాతానికి పైగా ఓబీసీలు ఉన్నారని అంచనాలుంటే ప్రస్తుతం వారికున్న రిజర్వేషన్లు 21% ఉన్నాయి.
రాజస్తాన్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా వ్యవస్థలో 64% రిజర్వేషన్లు ఉన్నాయి. ఇందులో ఎస్సీలకు 16%, ఎస్టీలకు 12%, ఓబీసీలకు 21%, మోస్ట్ బాక్‌వార్డ్ క్లాసెస్ (ఎంబీసీ)లకు 5%, ఆర్థికంగా బలహీన వర్గాల వారికి 10% రిజర్వేషన్లు ఉన్నాయి. జాట్లు, గుజ్జర్లు, రాజ్‌పుత్‌లు సహా 92 కులాలు ఓబీసీ కేటగిరీలో ఉన్నాయి. దీంతో తమకు అన్యాయం జరుగుతోందన్న ఆవేదన వారిలో తీవ్రంగా ఉంది.
మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్‌లో ఓబీసీ జనాభా 50% వరకు ఉంటుంది. కానీ ఆ జనాభాకు తగ్గట్టుగా పథకాలేవీ వారికి అందడం లేదు. రాష్ట్రంలో పార్టీల గెలుపోటములను శాసించే సత్తా వారికి ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఓబీసీ లో కిరార్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అయినప్పటికీ ఈ సారి బీజేపీ ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదు.
బీజేపీ ఎంపీలు, ప్రముఖ నేతలు ఎన్నికల బరిలో ఉండడంతో ఎన్నికల్లో పార్టీ గెలిచినా చౌహాన్‌ను మరోసారి సీఎంను చేస్తారన్న నమ్మకం కూడా కేడర్‌లో లేదు. బీజేపీ ఆయనను సీఎం ఫేస్‌గా ప్రకటించకపోవడం వల్ల పార్టీకే ఎదురు దెబ్బ తగులుతుందన్న ఆందోళన రాష్ట్ర బీజేపీలో ఉంది. కాంగ్రెస్ కులగణన చేపడతామని హామీ ఇవ్వడంతో కనీసం ఓబీసీ నాయకుడ్ని సీఎం అభ్యర్థిగా ముందుంచి ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర నేతలు డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్ర జనాభాలో ఆదివాసీలు 21%, ఎస్‌సీలు 15.6% ఉన్నారు. మరోవైపు కులగణన వల్ల కాంగ్రెస్‌కు ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందని చెప్పలేమని రాజకీయ విశ్లేషకుడు దినేష్ గుప్తా వ్యాఖ్యానించారు. బీజేపీ కులగణన హామీకి బదులుగా ఎక్కువ మంది ఓబీసీలకు టికెట్లు ఇస్తూ దానిని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు సీఎం చౌహాన్ ఓబీసీలకు తొమ్మిది సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేశారు.
ఛత్తీస్‌గఢ్
ఛత్తీస్‌గఢ్ గిరిజన రాష్ట్రంగా ఉన్నప్పటికీ ఓబీసీ జనాభా అధికం. అధికారిక గణాంకాల ప్రకారం 43.5% మంది ఓబీసీలే ఉన్నారు. 2018లో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన భూపేష్ బఘేల్ రాష్ట్ర మొట్టమొదటి ఓబీసీ ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కారు. ఓబీసీలకుండే రిజర్వేషన్లను 14 నుంచి 27శాతానికి పెంచుతూ బిల్లు తీసుకువచ్చారు. కానీ గవర్నర్ దానిని ఇంకా ఆమోదించలేదు. దీంతో బీజేపీ ఓబీసీలకు వ్యతిరేకమన్న ప్రచారాన్ని కాంగ్రెస్ విస్తృతంగా చేస్తోంది.
మళ్లీ అధికారంలోకొస్తే కులగణన చేపడతామన్న హామీ ఇచ్చి ఓబీసీల్లో పట్టు పెంచుకున్నారు. కాంగ్రెస్ ప్రచారానికి కౌంటర్‌గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఓబీసీ నేత అరుణ్ సావోను నియమించింది. ఇప్పటివరకు 90 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తే అందులో 29 మంది ఓబీసీ నాయకులే. కాంగ్రెస్ కులగణన అస్త్రం మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతవరకు పని చేస్తుందో వేచి చూడాలి.
రాజస్తాన్‌లో అప్పుల భారం పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం
కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్
జైపూర్: రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంపై అప్పుల భారం పెంచిందని∙కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఆరోపించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ద్రవ్యోల్బణ రిలీఫ్ క్యాంపుల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ఐదేళ్లలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆక్షేపించారు. రైతు రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి వంటివి ఏమయ్యాయని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంపై అప్పుల భారం పెరగడం తప్ప ప్రజలకు ఒరిగిందేమీలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో జీడీపీ దారుణంగా పడిపోయిందని మంత్రి మేఘ్వాల్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుపరిపాలన కాదు, దుష్పరిపాలన సాగుతోందని మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థ పతనం కావడంతో నిరుద్యోగం పెరిగిపోయిందని, నేరాలు పెచ్చరిల్లుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు, పెట్టుబడులు రావడం లేదని విమర్శించారు.
బుల్లెట్‌పై బ్యాలెట్ విజయం..!
రాయపూర్: ఉన్న ఊరు కదలకుండా ఓటు వేసుకొనే హక్కు వారికి వచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లకి ఆ గ్రామాల ప్రజలకి ఈ అపూర్వ అవకాశం దక్కింది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా మారుమూల విసిరేసినట్టున్న 120 గ్రామాల ప్రజలు ఈ సారి తమ స్వగ్రామాల్లోనే ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తొలిసారిగా ఆ గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఒకప్పుడు మావోయిస్టు ప్రాబల్యం కలిగిన ఈ గ్రామాల్లో ఇçప్పుడు శాంతి భద్రతలు నెలకొనడంతో పోలింగ్‌కు ఏర్పాట్లు చేసినట్టుగా ఎన్నికల అధికారులు చెప్పారు.
బుల్లెట్‌పై బ్యాలెట్ విజయం సాధించిందని చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు. గతంలో ఆ 120 గ్రామాల ప్రజలకి ఓటు వేయాలన్న ఉత్సాహం ఉన్నప్పటికీ 8 నుంచి 10 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి వచ్చేది. ఓటు వేయడానికి వెళ్లే ప్రతీసారి మావోయిస్టుల నుంచి ఎలాంటి ముప్పు వస్తుందోనన్న ఆందోళన కూడా ఉండేది. కానీ ఇప్పుడు బస్తర్ జిల్లాలో భద్రత పెరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా బలోపేతం కావడంతో 120 గ్రామాల్లో కొత్త పోలింగ్ కేంద్రాలు కళకళలాడిపోతున్నాయి.
రాజస్తాన్‌లో హెలికాప్టర్ అద్దెలకు రెక్కలు
జైపూర్: రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ హెలికాప్టర్ల అద్దెలకి రెక్కలు వచ్చాయి. సుడిగాలి ప్రచారానికి పార్టీల నాయకులు హెలికాప్టర్ల మీద ఆధారపడడంతో వాటి అద్దెలు అమాంతం పెరిగిపోయాయి. ఆరు నెలల క్రితం సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ అద్దె గంటకి లక్ష రూపాయలైతే , ఇప్పుడా అద్దెలు రెట్టింపు అయ్యాయి.
సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్ గంటకి అద్దె రూ.2 లక్షలు అంతకంటే ఎక్కువగా ఉంటే డబుల్ ఇంజిన్ హెలికాçప్టర్లు గంటకి అద్దె రూ.3–4 లక్షలుగా ఉంది. ఇంక అభ్యర్థుల జాబితా పూర్తిగా రాకముందే ఈ స్థాయిలో ధరలు ఉంటే వచ్చాక మరింతగా పెరిగిపోయే అవకాశం ఉంది. మున్ముందు హెలికాప్ట్టర్లకి ఇంకా డిమాండ్ పెరిగిపోతుందని జైపూర్‌కు చెందిన ప్రైవేటు హెలికాప్టర్ సంస్థ సీఈఒ సోహన్ సింగ్ చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ, ఆర్‌ఎల్‌పీ పార్టీల నాయకులు ముందస్తుగానే హెలికాప్టర్లను బుక్ చేసుకున్నారని డిమాండ్‌కు తగినన్ని హెలికాప్టర్లు తమ వద్ద లేవని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment