కులగణన.. మూడు హిందీ హార్ట్‌ల్యాండ్ రాష్ట్రాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. బీజేపీ హిందూత్వ ఎజెండాని తిప్పికొట్టడానికి కాంగ్రెస్ పార్టీ కులగణన అనే బ్రహా్మ్రస్తాన్ని బయటకు తీసింది. వచ్చే నెలలో రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కులగణన చుట్టూ తిరుగుతున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటికే తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన చేపడతామని ప్రకటించిన కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కులగణన కోసం పట్టుబడుతోంది.
బీజేపీ కులగణన చేపడతామని అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఓబీసీ, ఎస్‌సీ, ఎస్టీ ఓట్లపై గురి పెట్టింది. మన దేశంలో 2011లో కులగణన చేపట్టినప్పటికీ అందులో వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. బిహార్‌లో కులగణన నిర్వహించి రాష్ట్ర జనాభాలో 63% మంది వెనుకబడిన వర్గాలు ఉన్నారని తేల్చి చెప్పడంతో అదే తరహాలో దేశవ్యాప్తంగా కులాల జనాభా వివరాలను సేకరించాలన్న డిమాండ్ ఊపందుకుంది. కాంగ్రెస్ కులగణన డిమాండ్‌ను తిప్పికొడుతున్న బీజేపీ సమాజాన్ని విభజించడానికే కాంగ్రెస్ ఇదంతా చేస్తోందని ఎదురు దాడికి దిగుతోంది.
రాజస్తాన్
రాజస్తాన్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని కుల సంఘాలు మహా సమ్మేళనాలు నిర్వహించి తమ బలాన్ని ప్రదర్శించాయి. కులగణన చేపట్టాలని, తమకు రిజర్వేషన్ల శాతం పెంచాలన్నది వారి ప్రధాన డిమాండ్‌గా ఉంది. సీఎం అశోక్ గెహ్లోత్ అన్ని కులాలకు ప్రత్యేకంగా సంక్షేమ బోర్డుల్ని ఏర్పాటు చేయడమే కాకుండా కులగణన కూడా చేపడతామని ప్రకటించారు.
కులాల జనాభాకనుగుణంగా రిజర్వేషన్లు కలి్పస్తామని హామీ ఇచ్చారు. దీనికి వివిధ కులాల దగ్గర్నుంచి మంచి స్పందన వచి్చంది. రాజస్తాన్‌లో అత్యంత కీలకమైన రాజ్‌పుత్‌లు ఓబీసీలకు ఉన్నారు. ఓబీసీల సంఖ్య ఎంతో ఎవరికీ తెలీకపోవడంతో రిజర్వేషన్లలో వారికి అన్యాయం జరుగుతోందనే వాదన వినిపిస్తోంది. రాజస్తాన్ జనాభాలో 50శాతానికి పైగా ఓబీసీలు ఉన్నారని అంచనాలుంటే ప్రస్తుతం వారికున్న రిజర్వేషన్లు 21% ఉన్నాయి.
రాజస్తాన్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా వ్యవస్థలో 64% రిజర్వేషన్లు ఉన్నాయి. ఇందులో ఎస్సీలకు 16%, ఎస్టీలకు 12%, ఓబీసీలకు 21%, మోస్ట్ బాక్‌వార్డ్ క్లాసెస్ (ఎంబీసీ)లకు 5%, ఆర్థికంగా బలహీన వర్గాల వారికి 10% రిజర్వేషన్లు ఉన్నాయి. జాట్లు, గుజ్జర్లు, రాజ్‌పుత్‌లు సహా 92 కులాలు ఓబీసీ కేటగిరీలో ఉన్నాయి. దీంతో తమకు అన్యాయం జరుగుతోందన్న ఆవేదన వారిలో తీవ్రంగా ఉంది.
మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్‌లో ఓబీసీ జనాభా 50% వరకు ఉంటుంది. కానీ ఆ జనాభాకు తగ్గట్టుగా పథకాలేవీ వారికి అందడం లేదు. రాష్ట్రంలో పార్టీల గెలుపోటములను శాసించే సత్తా వారికి ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఓబీసీ లో కిరార్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అయినప్పటికీ ఈ సారి బీజేపీ ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదు. బీజేపీ ఎంపీలు, ప్రముఖ నేతలు ఎన్నికల బరిలో ఉండడంతో ఎన్నికల్లో పార్టీ గెలిచినా చౌహాన్‌ను మరోసారి సీఎంను చేస్తారన్న నమ్మకం కూడా కేడర్‌లో లేదు.
బీజేపీ ఆయనను సీఎం ఫేస్‌గా ప్రకటించకపోవడం వల్ల పార్టీకే ఎదురు దెబ్బ తగులుతుందన్న ఆందోళన రాష్ట్ర బీజేపీలో ఉంది. కాంగ్రెస్ కులగణన చేపడతామని హామీ ఇవ్వడంతో కనీసం ఓబీసీ నాయకుడ్ని సీఎం అభ్యర్థిగా ముందుంచి ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర నేతలు డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్ర జనాభాలో ఆదివాసీలు 21%, ఎస్‌సీలు 15.6% ఉన్నారు. మరోవైపు కులగణన వల్ల కాంగ్రెస్‌కు ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందని చెప్పలేమని రాజకీయ విశ్లేషకుడు దినేష్ గుప్తా వ్యాఖ్యానించారు. బీజేపీ కులగణన హామీకి బదులుగా ఎక్కువ మంది ఓబీసీలకు టికెట్లు ఇస్తూ దానిని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు సీఎం చౌహాన్ ఓబీసీలకు తొమ్మిది సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేశారు.
ఛత్తీస్‌గఢ్
ఛత్తీస్‌గఢ్ గిరిజన రాష్ట్రంగా ఉన్నప్పటికీ ఓబీసీ జనాభా అధికం. అధికారిక గణాంకాల ప్రకారం 43.5% మంది ఓబీసీలే ఉన్నారు. 2018లో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన భూపేష్ బఘేల్ రాష్ట్ర మొట్టమొదటి ఓబీసీ ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కారు. ఓబీసీలకుండే రిజర్వేషన్లను 14 నుంచి 27శాతానికి పెంచుతూ బిల్లు తీసుకువచ్చారు. కానీ గవర్నర్ దానిని ఇంకా ఆమోదించలేదు. దీంతో బీజేపీ ఓబీసీలకు వ్యతిరేకమన్న ప్రచారాన్ని కాంగ్రెస్ విస్తృతంగా చేస్తోంది.
మళ్లీ అధికారంలోకొస్తే కులగణన చేపడతామన్న హామీ ఇచ్చి ఓబీసీల్లో పట్టు పెంచుకున్నారు. కాంగ్రెస్ ప్రచారానికి కౌంటర్‌గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఓబీసీ నేత అరుణ్ సావోను నియమించింది. ఇప్పటివరకు 90 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తే అందులో 29 మంది ఓబీసీ నాయకులే. కాంగ్రెస్ కులగణన అస్త్రం మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతవరకు పని చేస్తుందో వేచి చూడాలి.
గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నికల్లో కులం కార్డు అత్యంత కీలకంగా మారింది. కుల సంఘాలు నానాటికీ శక్తిమంతంగా మారుతున్నాయి. ఎన్నికల్ని శాసిస్తున్నాయి. టిక్కెట్ల కేటాయింపు దగ్గర్నుంచి ఎన్నికల తర్వాత పదవుల పందేరం వరకు కులాల లెక్కలపైనే జరుగుతున్నాయి. గెలిచిన వారికి సన్మానాలు, సత్కారాలు చేస్తున్నాయి. ఈ సారి ఎన్నికలు కులగణన చుట్టూనే తిరుగుతాయి
– నారాయణ్ బరేథ్, రాజకీయ విశ్లేషకుడు
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment