![BJP scored a massive win in Delhi Assembly election](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/635338-01-02.jpg.webp?itok=ND_JWz_f)
బీజేపీకి ప్రధానంగా లాభించింది అదే
ఆ పార్టీవైపు మొగ్గిన వేతన జీవులు
మధ్యతరగతి, పూర్వాంచల్ ఓటర్ల అండ
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంలో మోదీ సర్కారు తాజా బడ్జెట్లో ప్రకటించిన ఐటీ ఊరట ప్రధాన పాత్ర పోషించింది. ఈ నిర్ణయంతో రాజధాని నగరంలో ఏకంగా మూడింట రెండొంతుల దాకా ఉండే ప్రభుత్వోద్యోగులు, వేతన జీవుల్లో అత్యధికులు ఆ పార్టీవైపు మొగ్గారు. మధ్య తరగతి, పూర్వాంచల్ ఓటర్ల మద్దతు దానికి తోడైంది.
వీటికి తోడు 2015, 2020ల్లో ఆప్‌కు అండగా నిలిచిన పలు వర్గాల ఓటర్లు కూడా ఈసారి కమలం పార్టీ వైపు మొగ్గారు. సాధారణంగా కేజ్రీవాల్ పార్టీకి మద్దతుదార్లయిన మహిళలు సైతం ఈసారి బీజేపీకి జైకొట్టారు. వారికి నెలకు రూ.2,500 అందిస్తామన్న హామీ బాగా పేలింది. పంజాబ్‌లో మహిళలకు నెలకు రూ.1,000 ఇస్తామన్న హామీని గెలిచాక నిలబెట్టుకోకపోవడం ఆప్‌కు ప్రతికూలంగా మారింది.
ఢిల్లీలో మధ్య తరగతి ప్రజలు అధికం. ఉద్యోగాలు, చిన్నపాటి వ్యాపారాలతో వారు ఉపాధి పొందుతుంటారు. రూ.12 లక్షల వార్షిక ఆదాయానికి ఆదాయ పన్ను పూర్తిగా మినహాయిస్తూ ఢిల్లీ పోలింగ్ కేవలం నాలుగు రోజుల ముందు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో మోదీ సర్కారు ప్రకటించడం తెలిసిందే. పన్ను భారం తొలగిపోవడం ఆ ఎంతగానో ఊరటనివ్వడంతో వేతన జీవులు ఓటు రూపంలో బీజేపీ పట్ల కృతజ్ఞత చూపినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్ నుంచి వచ్చి ఢిల్లీలో స్థిరపడిన పూర్వాంచల్ ఓటర్లు మొత్తం ఓటర్లలో ఏకంగా 30 శాతం దాకా ఉంటారు. వారి ప్రగతిపై ప్రత్యేకంగా దృష్టి పెడతామన్న బీజేపీ హామీ ఆకట్టుకుంది. దీనికి తోడు యూపీ, బిహార్ల నుంచి పెద్ద సంఖ్యలో జనాన్ని తెచ్చి ఢిల్లీలో ఓటర్లుగా చేరి్పస్తున్నారన్న కేజ్రీవాల్ ఆరోపణలు, వారంతా ఫేక్ ఓటర్లన్న విమర్శలు పూర్వాంచల్ ప్రజలకు ఆగ్రహానికి కారణమయ్యాయి. దాంతో వారంతా బీజేపీకే ఓటేశారు. పదేళ్ల ఆప్ పాలనలో తమకు ఒరిగిందేమీ లేదంటూ ప్రజల్లో నెలకొన్న భావన కూడా కేజ్రీవాల్‌కు ప్రతికూలంగా మారింది.
ఆరెస్సెస్ నిశ్శబ్ద ప్రచారం
ఢిల్లీ ఎన్నికల్లో రా్ష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) బీజేపీ విజయం కోసం నిశ్శబ్దంగా పని చేసుకుంటూ వెళ్లింది. అవినీతి రహిత, పారదర్శకమైన పాలన కావాలంటే బీజేపీని గెలపించాలని సంఘ్ కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేశారు. వారు ఇంటింటా తిరిగారు. బీజేపీ గెలుపులో సంఘ్ పాత్ర తక్కువేమీ కాదు. చిన్నచిన్న సభలు వందల సంఖ్యలో నిర్వహించారు. ఆప్ ప్రభుత్వ వైఫల్యాలను సమర్థవంతంగా ఎండగట్టారు.
ఢిల్లీ మోడల్ అంటూ ఆప్ నేతలు చేస్తున్న ప్రచారంలోని డొల్లతనాన్ని బయటపెట్టారు. ఇక ఆప్ ప్రభుత్వ పెద్దల అవినీతి గురించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పగలిగారు. రాజకీయ పార్టీల కంటే ముందే సంఘ్ కార్యకర్తలు ప్రచారం ప్రారంభించారు. మురికివాడలు, అనధికారిక కాలనీల్లోకి వేగంగా చొచ్చుకెళ్లారు. అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. ప్రచారం చేసి పేరు ప్రతిష్టలు కోరుకోవడం, నిత్యం ప్రసార మాధ్యమాల్లో కనిపించడం సంఘ్ కార్యకర్తలకు ఇష్టం ఉండదు. తెరవెనుక నిశ్శబ్దంగా పని చేయడానికే వారు ఆసక్తి చూపుతారు.
8వ వేతన సంఘంతో లబ్ధి
సరిగ్గా ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఎనిమిదో వేతన సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం బీజేపీకి లబ్ధి చేకూర్చింది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎనిమిదో వేతన సంఘంతో వారి వేతనాలు పెరుగనున్నాయి. నిజానికి ఉచిత పథకాలకు బీజేపీ బద్ధ వ్యతిరేకి. అయినప్పటికీ ఢిల్లీ ఎన్నికల్లో ఉచిత పథకాలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఆప్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ యథాతథంగా అమలు చేస్తామని ప్రకటించింది.
దాంతో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు బీజేపీని ఆదరించారు. ఉచిత విద్యుత్, ఉచిత బస్సు వంటి పథకాలు ఎప్పటిలాగే అమలవుతాయి కాబట్టి బీజేపీకి ఓట్లు వేశారు. యమునా నదిని ఎగువన ఉన్న హరియాణా ప్రభుత్వం కలుషితం చేస్తోందంటూ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించడం వివాదాస్పదంగా మారింది. హరియాణా ప్రజలు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని హరియాణా ఓటర్లు కేజ్రీవాల్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment