![BJP Parvesh Verma defeats Arvind Kejriwal by 4,089 votes](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/parv.jpg.webp?itok=FnAMT_yJ)
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై నెగ్గిన బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ(47) పేరు మార్మోగిపోతోంది. న్యూఢిల్లీ నియోజకవర్గంంలో కేజ్రీవాల్‌పై 4,089 ఓట్ల తేడాతో ఆయన జయకేతనం ఎగురవేశారు. జెయింట్ కిల్లర్‌గా అవతరించారు. వర్మకు 30,088 ఓట్లు, కేజ్రీవాల్‌కు 25,999 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్‌కు 4,568 ఓట్లు లభించాయి.
పశ్చిమ ఢిల్లీకి చెందిన పర్వేశ్ వర్మ రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వం ఖరారు కాకముందు నుంచే ప్రచారం ప్రారంభించారు. ఓటర్లకు చేరువయ్యారు. ఎన్నికలకు రెండు నెలల ముందే ఇంటికి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గరిష్ట స్థాయిలో ఓటర్లను కలుసుకున్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్‌సింగ్ వర్మ కుమారుడైన పర్వేశ్‌వర్మ ఈ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఓడించి, బీజేపీ తరపున నూతన ముఖ్యమంత్రి రేసులో ముందంజలో ఉన్నారు.
బాల్యం నుంచే సంఘ్ భావజాలం
పర్వేశ్ వర్మ 1977 నవంబర్ 7న ఢిల్లీలో జన్మించారు. చిన్నప్పుడే రాజకీయాలపై ఆసక్తి కనబర్చారు. తండ్రి బాటలో నడుస్తూ 1991లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. బాల స్వయంసేవక్‌గా పనిచేశారు. అనంతరం బీజేపీ యువమోర్చాలో చేరారు. యువమో ర్చా జాతీయ కార్యనిర్వాహక సభ్యుడయ్యారు. తర్వాత ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. 2013 ఎన్నికల్లో ఢిల్లీలోని మెహ్రౌలీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2015లో పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/11_35.png)
2019లో అదే నియోజకవర్గంలో 4.78 లక్షల ఓట్ల మెజార్టీతో మరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. తండ్రి సాహిబ్‌సింగ్ వర్మ స్థాపించిన ‘రా్ష్ట్రీయ స్వాభిమాన్’ అనే సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులను ఆదుకుంటున్నారు. ఆర్థిక సాయం అందిస్తున్నారు. మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్ అయిన పర్వేశ్ వర్మ మంచి వక్తగా పేరుగాంచారు. ఇప్పటి ఎన్నిల్లో కేజ్రీవాల్‌ను తానే ఢీకొట్టబోతున్నానని బహిరంగంగా ప్రకటించారు. రెండుసార్లు సీఎంగా పనిచేసిన షీలా దీక్షిత్‌ను ఓడించి కేజ్రీవాల్ సీఎం అయ్యారు. రెండుసార్లు సీఎంగా వ్యవహరించిన కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ శర్మ సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment