![JP Nadda meets Amit Shah as BJP gets down to picking new Delhi CM](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/PARVESH11.jpg.webp?itok=l6Pg4ADn)
అమిత్ షాతో నడ్డా భేటీ
రేసులో ముందంజలో పర్వేశ్
తెరపైకి మరికొందరి పేర్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ దంగల్‌లో ఆప్‌ను చిత్తు చేసిన బీజేపీ నూతన ముఖ్యమంత్రి ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. కొత్త సీఎం ఎంపికపై వారిద్దరూ చర్చించారు. ముఖ్యమంత్రి రేసులో పర్వేశ్ వర్మ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. సతీశ్ ఉపాధ్యాయ, విజేందర్ గుప్తా, ఆశిష్ సూద్, పవన్ శర్మతో పాటు పార్టీ ఎంపీ మనోజ్ తివారీ పేరు కూడా చక్కర్లు కొడుతోంది.
జాట్ నేత అయిన పర్వేశ్ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించి సంచలనం సృష్టించడం తెలిసిందే. ఆయనే సీఎం అవుతారని ప్రచారం జరుగుతున్నా రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మాదిరిగా కమలనాథులు అనూహ్య నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు. పూర్వాంచల్ నేపథ్యమున్న నేతను, లేదా మహిళను, లేదంటే సిక్కు వర్గం నాయకుడిని సీఎం ఎలా చేస్తే ఎలా ఉంటుందన్న దానిపైనా బీజేపీ పెద్దలు సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
సామాజిక సమీకరణాలు, భవిష్యత్తు అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో పెద్దగా పేరు ప్రఖ్యాతుల్లేని నేతలను ముఖ్యమంత్రులుగా బీజేపీ నియమించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఏం చేస్తారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. కొత్త సీఎం ఎంపికపై తుది నిర్ణయం అధిష్టానానిదేనని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా పునరుద్ఘాటించారు. తమ కొత్త ఎమ్మెల్యేలందరికీ సీఎంగా రాణించగల సత్తా ఉందన్నారు.
అతిశీ రాజీనామా
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ రాజీనామా చేశారు. ఆదివారం లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనాకు రాజీనామా లేఖ సమర్పించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరేదాకా కొనసాగాలని ఆయన కోరారు. మరోవైపు ఫలితాల నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీని ఎల్జీ రద్దు చేశారు. ఈ నిర్ణయం శనివారం నుంచే అమల్లోకి వచి్చంది. అతిశీ గతేడాది సెపె్టంబర్‌లో అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాతో సీఎంగా ఆతిశీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం తెలిసిందే. తాజా ఫలితాల్లో కేజ్రీవాల్ ఓడినా ఆమె మాత్రం నెగ్గారు.
పథకాలను బీజేపీ ఆపకుండా చూస్తాం: ఆప్
22 మంది ఆప్ కొత్త ఎమ్మెల్యేలతో పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సమావేశమయ్యారు. ప్రజల కోసం పనిచేయాలని, వారి సమస్యలను పరిష్కరించాలని వారిని కోరారు. తమ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని అనంతరం ఆతిశీ మీడియాకు చెప్పారు. ‘‘మార్చి 8 నుంచి మహిళలకు బీజేపీ నెలకు రూ.2,500 కచ్చితంగా ఇవ్వాలి. ప్రజలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇతర సౌకర్యాలు కల్పించాలి. పదేళ్లుగా ఆప్ అమలు చేసిన ఉచిత సేవలు, పథకాలను నిలిపేయకుండా మేం చూస్తాం’’ అన్నారు.
మోదీ అమెరికా నుంచి తిరిగి వచ్చాకే!
ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా దేశాల్లో పర్యటించనున్నారు. 13వ తేదీన ఆయన తిరిగొస్తారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం ఆ తర్వాతే జరిగే అవకాశముందని బీజేపీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. సీఎం ఎంపిక కూడా మోదీ వచ్చాకే జరగవచ్చని తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment