నిరాశలో బీజేపీ
సిటీబ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇక్కడ నగర బీజేపీ శ్రేణుల్లో నైరాశ్యాన్ని నింపాయి. బీజేపీ విజయ ఢంకా మోగిస్తుందన్న ధీమాతో ఉన్న నేతలకు ఫలితాలు తీవ్ర నిరాశ కలిగించాయి. ఎన్నికల ఫలితాలు వెలువడగానే అంచనాలకు మించి ఆమ్ ఆద్మీ ప్రభంజనం సృష్టించడంతో గ్రేటర్ బీజేపీలో పలువురు కీలక నేతలు ఉలిక్కిపడ్డారు. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు జరగనున్న ఎన్నిక లపై ఢిల్లీ ఫలితాల ప్రభావం పడుతుందన్న భయం వారిని కలవరపెడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో మార్చిలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది కొంతమేర ప్రస్ఫుటమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
గత నెలలో జరిగిన కంటోన్మెంట్ ఎన్నికల్లో బీజేపీ బలం తెలిసి కంగుతిన్న నాయకులు గ్రేటర్ ఎన్నికలకు పార్టీ క్యా డర్ను సన్నద్ధం చేసేందుకు జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఇదే తరుణంలో ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా రావడం పార్టీ శ్రేణులను ఆలోచనలో పడేసింది. ఇక అభివృద్ధి జపాన్ని వల్లెవేయకుండా స్థానిక సంస్యలు, ఆచరణ సాధ్యమయ్యే ఉచిత పథకాలు వంటి ప్రత్యేక ఎజెండాతో గ్రేటర్ ఎన్నికలకు వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.