ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (aam aadmi party)కి చుక్కెదురైంది. మరోసారి గెలిచి అధికారాన్ని నెలబెట్టుకోవాలన్న ‘ఆప్’ ఆశలపై హస్తినవాసులు నీళ్లు చల్లారు. దశాబ్ద కాలం పైగా ఢిల్లీలో పాగా వేసిన ఆప్ ప్రభుత్వానికి గుడ్ బై చెప్పారు. అందరూ ఊహించినట్టుగానే బీజేపీ (BJP) హస్తినలో తిరిగి అధికారంలోకి వచ్చింది. 27 ఏళ్ల తర్వాత హస్తినలో కాషాయ పార్టీ అధికార పీఠాన్ని దక్కించుకుంది. తాజా విజయంతో కమలనాథులు సంబరాల్లో మునిగిపోగా, ఆప్ శిబిరం నిరాశలో మునిగిపోయింది.
కేజ్రీవాల్‌కు ముళ్లబాట
ఢిల్లీలో అధికారం కోల్పోవడంతో మాజీ సీఎం, ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శి అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యమంత్రిగా ఉండగానే ఆయన ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో పాటు పలు అవినీతి ఆరోపణలకు గురయ్యారు. లిక్కర్ స్కామ్‌లో జైలుకు కూడా వెళ్లొచ్చారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన కేజ్రీవాల్.. అవినీతి ఆరోపణలతోనే జైలుకు వెళ్లడం గమనార్హం. ఇప్పుడు ఈ కేసుల్లో ఆయనకు మరిన్ని ఇబ్బందులు తప్పవు. కేంద్ర దర్యాప్తు సంస్థలు మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశముంది. కేసులు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ సహచరులకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఎమ్మెల్యేలను కాపాడుకోగలరా?
తాజా ఎన్నికల్లో గెలిచిన తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కేజ్రీవాల్‌కు పెద్ద సవాలు కానుంది. అధికారానికి దూరమైన ఆప్ శాసనసభ్యులు బీజేపీలో చేరకుండా కాచుకోవడం అంత సులువేం కాదని పొలిటికల్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఆప్ నాయకులు కూడా అధికార పార్టీవైపు చూసే అవకాశముంటుంది. ఆపరేషన్ ఆకర్ష్ నుంచి తమ పార్టీ నాయకులను కేజ్రీవాల్ ఎలా కాపాడుకుంటారనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
నాయకత్వం ప్రశ్నార్థకం
తాను పోటీ చేసిన న్యూఢిల్లీ నియోజకవర్గంలో 3 వేలకు పైగా ఓట్ల తేడాతో కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. జంగ్‌పురాలో ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కూడా ఓడిపోయారు. తాను జైలుకు వెళ్లినప్పుడు సీఎం పగ్గాలు ఆతిశికి అప్పగించిన కేజ్రీవాల్.. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి ఎలా బాధ్యత వహిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ పగ్గాలు ఎవరికైనా అప్పగిస్తారా లేక తానే కొనసాగుతారా అనేది వేచిచూడాలి. బీజేపీ ప్రభంజనాన్ని తట్టుకుని సీఎం ఆతిశి విజయం సాధించడం ఆమ్ ఆద్మీ పార్టీకి ఊరటకలిగించే అంశం.
భవిష్యత్ వ్యూహం ఏంటి?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కేజ్రీవాల్ మున్ముందు ఎలాంటి కార్యచరణతో ముందుకు వెళతారనేది చర్చనీయాంశంగా మారింది. కుదేలైన పార్టీని పునర్ నిర్మించడానికి ఆయన ఏం చేస్తారో చూడాలి. అధికారంలో లేనప్పుడే లెఫ్టినెంట్ గవర్నర్‌ను పావుగా వాడుకుని కేజ్రీవాల్‌ను బీజేపీ ముప్పుతిప్పలు పెట్టింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాషాయ పార్టీని దీటుగా ఎదుర్కొని నాయకులు, కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంది.
చదవండి: ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై అన్నాహజారే రియాక్షన్
కేజ్రీవాల్ మారతారా?
అవినీతి వ్యతిరేక పోరాటంతో రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్.. అధికారం చేపట్టాక సంప్రదాయక పొలిటిషియన్‌గా మారిపోయారన్న వాదనలు విన్పిస్తున్నాయి. మధ్యతరగతి ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఆయన తర్వాత ఆ వర్గానికి దూరమయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సామాన్యుడిని అని చెప్పుకుని ‘శీష్‌మహల్’ కట్టుకున్నారన్న విమర్శలు ఎన్నికల ప్రచారంలో బలంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ పూర్వ వైభవాన్ని తిరిగి పొందడానికి ఆయన ఎలా మారతారనేది చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment