నలుగురు ముస్లింల ఎన్నిక  | 4 Muslim candidates elected to Delhi Assembly Election Results | Sakshi
Sakshi News home page

నలుగురు ముస్లింల ఎన్నిక 

Published Sun, Feb 9 2025 6:29 AM | Last Updated on Sun, Feb 9 2025 6:29 AM

4 Muslim candidates elected to Delhi Assembly Election Results

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ముస్లింల ఓట్లు చీలాయి. అయినప్పటికీ, ముస్లింల ప్రాబల్యమున్న ఏడు నియోజకవర్గాలకు గాను ఆరింట్లో ఆప్‌ విజయం సాధించగలిగింది. ప్రస్తుత అసెంబ్లీలో ముస్లిం వర్గం ఎమ్మెల్యేలు ఐదుగురుండగా ఈసారి నలుగురు అసెంబ్లీలోకి అడుగిడనున్నారు. విజేతలు ఆప్‌కు చెందిన ఇమ్రాన్‌ హుస్సేన్‌(బల్లిమారన్‌), ఆలె మహ్మద్‌ ఇక్బాల్‌(మటియా మహల్‌), అమానతుల్లా ఖాన్‌ (ఓఖ్లా), చౌదరి జుబాయిర్‌ అహ్మద్‌(సీలంపూర్‌). 

2020 ఎన్నికల్లో ముస్లింలు అధికంగా ఉన్న ఏడు స్థానాల్లో దాదాపు అందరూ ఆప్‌కే ఓటేయడంతో ఆ పార్టీ విజయకేతనం ఎగరేసింది. ఈదఫా ఆ పార్టీ ముస్తఫాబాద్‌ మినహా ఆరింట్లో గట్టెక్కింది. ఈ ఎన్నికల్లో ముస్లింల ఓట్లు చీలాయి. అయినప్పటికీ ఆప్‌ విజయావకాశాలను దెబ్బతీసే స్థాయిలో చీలిక సంభవించలేదు. ముస్తఫాబాద్‌లో ముక్కోణ పోటీ నెలకొంది. 

ఆప్, ఎంఐఎం, కాంగ్రెస్‌లకు చెందిన ముగ్గురు ముస్లిం అభ్యర్థుల మధ్య ఓట్లు చీలాయి. ఫలితంగా, బీజేపీకి లాభం కలిగింది. ఆ పార్టికి చెందిన మోహన్‌ సింగ్‌ బిష్త్‌ ఇక్కడ 17,578 ఓట్ల తేడాతో విజయం సాధించగలిగారు. ముస్లిం అభ్యర్థులందరికీ కలిపి 1,12,874 ఓట్లు పోలయ్యాయి. ఇందులో, జైలులో నుంచి పోటీ చేసిన ఎంఐఎం అభ్యరి్థకి 33,474 ఓట్లు పడ్డాయి. ముస్లింల ప్రాబల్యమున్న ఓఖ్లా నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి 39,558 ఓట్లతో మూడో స్థానంలో నిలవడం గమనార్హం.  

ఆ మూడు కారణాలు ఏమంటే.. 
ముస్లింల ఓట్లలో చీలిక రావడానికి ప్రధానంగా మూడు కారణాలను విశ్లేషకులు చూపుతున్నారు. అందులో ఒకటి..ఏదేమైనా బీజేపీని గెలవకుండా చేయాలి. ఇందుకోసం ఆప్‌కు ఓటేయడం ముఖ్యం. ఢిల్లీలో కాషాయ పార్టీ దూకుడును ఆప్‌ గలిగింది ఆప్‌ చీఫ్‌ కేజ్రీవాల్‌ ఒక్కడేనని కొందరు ముస్లింలు నమ్మారు. రెండోది..2020 అల్లర్ల సమయంలో ఆప్‌ తమను పట్టించుకోలేదని కొందరు ముస్లింలు భావిస్తున్నారు. అంతేకాకుండా, కోవిడ్‌ వ్యాప్తికి తబ్లిఘి జమాత్‌ను తప్పుబడుతూ ఆప్‌ అనుమానాస్పదంగా వ్యవహరించడం కొందరికి నచ్చలేదు. 

ప్రత్యామ్నాయంగా, లౌకికవాదాన్ని బలంగా వినిపిస్తున్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాం«దీని బలపరచడం మేలని కొందరు ముస్లింలు నిర్ణయించుకోవడం. మూడోది..ఆప్, కాంగ్రెస్‌ వెంట నడవడం మానేసి, అసదుద్దీన్‌ ఒవైసీ పార్టీ ఎంఐఎంను అనుసరించడం మేలని, ఆయనైతే ముస్లింలకు సంబంధించిన ప్రత్యేక అంశాలు, సమస్యలను బలంగా వినిపిస్తారని కొందరు విశ్వసించారు. ఈ కోణంలోనే, 2020 అల్లర్లలో నిందితులకు ఎంఐఎం టిక్కెట్లిచ్చి బరిలో నిలిపింది. ఏదేమైనప్పటికీ ఇవన్నీ కలిసి అంతిమంగా బీజేపీకే లాభం చేకూర్చాయి. ముస్లింల ఓట్లు చీలి ఆప్‌పై సునాయాస విజయానికి కాషాయ పార్టికి బాటలు పరిచాయి.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement