muslim
-
కోర్టులు కదిపిన తేనెతుట్టెలు
దేవుడు అంతటా, అందరిలో ఉన్నాడని నమ్మే గడ్డపై... ఆయనను నిర్ణీత స్థల, కాలాలకే పరిమితం చేసే సంకుచిత రాజకీయ స్వార్థాలు చిచ్చు రేపుతూనే ఉన్నాయి. విభిన్న వర్గాల మధ్య విద్వేషాగ్ని రగిలిస్తున్న ఈ ప్రయత్నాలకు తాజా ఉదాహరణ – యూపీలోని సంభల్ జామా మసీదు వివాదం, దరిమిలా అక్కడ రేగిన హింసాకాండ, ఆస్తి, ప్రాణనష్టం. ఈ ఏడాది జనవరిలో జరిగిన అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపనతో మందిరం – మసీదు వివాదాలు ముగిసిపోతాయని ఎవరైనా ఆశపడితే అది వట్టి అడియాసని మరోసారి తేలిపోయింది. మత రాజకీయాలకూ, వర్గ విభేదాలకూ ప్రార్థనా స్థలాలు కేంద్రాలు కారాదనే సదుద్దేశంతో చేసిన ప్రార్థనా స్థలాల పరిరక్షణ చట్టం–1991 స్ఫూర్తికే విఘాతం కలిగింది. ప్రార్థనా మందిరాల నిర్మాణమూలాలను తెలుసుకోవాలన్న ఒక వర్గం ఉత్సాహం తప్పేమీ కాదంటూ సర్వోన్నత న్యాయస్థానం ఒక దశలో అదాటున చేసిన వ్యాఖ్యలు చివరకు ఇక్కడకు తెచ్చాయి. వివాదం వస్తే చాలు... దేశంలో ప్రతి చిన్న కోర్టూ అనాలోచితంగా సర్వేలకు ఆదేశించేలా ఊతమిచ్చాయి. ఇది అత్యంత దురదృష్టకర పరిణామం. తాజా ఘర్షణలకు కేంద్రమైన సంభల్‌లోని షాహీ జామా మసీదు 16వ శతాబ్దికి చెందిన రక్షిత జాతీయ కట్టడం. వారణాసిలోని జ్ఞానవాపి, యూపీలోని మథురలో నెలకొన్న ఈద్గా, మధ్యప్రదేశ్ లోని ధార్‌లో ఉన్న కమాల్ మౌలా మసీదుల్లో లానే దీనిపై రచ్చ మొదలైంది. అక్కడ కేసులు వేసినవారే ఇక్కడా కోర్టుకెక్కారు. మొఘల్ చక్రవర్తి బాబర్ కాలంలో కట్టిన 3 మసీదుల్లో (పానిపట్, అయోధ్య, సంభల్) ఇదొకటి. ప్రాచీన హరిహర మందిర్ స్థలంలో ఈ మసీదును నిర్మించారని పిటిషనర్ల వాదన. జిల్లా కోర్టులో ఈ నెల 19న కేసు వస్తూనే జడ్జి మసీదులో ఫోటో, వీడియో సర్వేకు ఆదేశిస్తూ, 29వ తేదీ కల్లా నివేదిక సైతం సమర్పించాలన్నారు. తొలి సర్వే ప్రశాంతంగా సాగినా, నవంబర్ 24 నాటి రెండో సర్వే భారీ హింసకు దారి తీసింది. సర్వేకు వచ్చినవారిలో కొందరు జై శ్రీరామ్ నినాదాలు చేశారనీ, దాంతో నిరసనకారులు రాళ్ళురువ్వారనీ వార్త. కాల్పుల్లో అయిదుగురు మరణించారు. అమాయకుల ప్రాణాలు, పట్నంలో సామరస్య వాతావరణం గాలికెగిరి పోయాయి.శతాబ్దాల తరబడి అన్ని వర్గాలూ కలసిమెలసి జీవిస్తున్న చోట విద్వేషాగ్ని రగులుకుంది. ఎన్నో ఏళ్ళుగా ఉన్న అయోధ్య, వారణాసి వివాదాలకు భిన్నంగా సంభల్ కథ చిత్రంగా ఈ ఏడాదే తెర మీదకొచ్చింది. పశ్చిమ యూపీలో సంభల్ జిల్లా మూడు దశాబ్దాలుగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి కంచుకోట. 1980ల నుంచి అక్కడ అధికారం కోసం బర్ఖ్, మెహమూద్ కుటుంబాలు వేర్వేరు పార్టీల పక్షాన పరస్పరం తలపడుతూ వచ్చాయి. తర్వాత 1990ల నుంచి రెండు వర్గాలూ ఎస్పీతోనే అనుబంధం నెరపుతున్నాయి. అధికారంలో పైచేయి కోసం ఒకే పార్టీలోని ఈ రెండు వర్గాల మధ్య పోరాటమే తాజా హింసకు కారణమని బీజేపీ ప్రచారం చేస్తోంది. హిందూ – ముస్లిమ్‌ల తర్వాత, ఇక ముస్లిమ్‌లలోని ఉపకులాల మధ్య చీలికలు తీసుకురావడానికే కాషాయ ధ్వజులు ఈ ప్రచారం చేస్తున్నారని ఎస్పీ ఖండిస్తోంది. మొఘల్ శిల్పనిర్మాణ శైలికి ఈ మసీదు ప్రతీకైతే, ఈ సంభల్ ప్రాంతం విష్ణుమూర్తి పదో అవతారమైన కల్కి వచ్చే ప్రదేశమని హిందువుల నమ్మిక. భిన్న విశ్వాసాల మధ్య సొంత లాభం చూసుకొనే కొందరి రాజకీయంతో సమస్య వచ్చి పడింది. నిజానికి, 1947 ఆగస్ట్ 15కి ముందున్న ధార్మిక విశ్వాసాల ప్రకారమే అన్ని ప్రార్థనా ప్రదేశాలూ కొనసాగాలి. ఒక్క అయోధ్య రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదమే దానికి మినహాయింపని దీర్ఘకాలం క్రితమే కేంద్ర సర్కార్ చేసిన 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం. అయోధ్య తరహాలో మరిన్ని సమస్యలు రాకూడదన్నది దాని ప్రధానోద్దేశం. ఏ ప్రార్థనా స్థలాన్నీ పాక్షికంగా కానీ, పూర్తిగా కానీ ఒక మతవిశ్వాసం నుంచి మరోదానికి మార్పిడి చేయరాదనీ, చర్చ పెట్టరాదనీ చట్టంలోని 3వ సెక్షన్ స్పష్టంగా నిషేధించింది. అయితే, ప్రార్థనా స్థలాల ప్రాచీన స్వరూపమేమిటో నిర్ధారించడం చట్టవిరుద్ధం కాదంటూ 2002 మేలో జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు వివాదాలకు సందు ఇచ్చాయి. అనేకచోట్ల చిన్న కోర్టులు మందిర– మసీదు వివాదాలపై విచారణ చేపట్టి, పర్యవసానాలు ఆలోచించకుండా హడావిడిగా సర్వేలకు ఆదేశిస్తున్నాయి. సంభల్ ఘటన తర్వాతా అజ్మీర్‌లోని ప్రసిద్ధ షరీఫ్ దర్గాను గుడిగా ప్రకటించాలంటూ దాఖలైన కేసును రాజస్థాన్ కోర్ట్ అనుమతించడం ఓ మచ్చుతునక. సమస్యల్ని తేల్చాల్సిన గౌరవ కోర్టులే ఇలా తేనెతుట్టెల్ని కదిలించడం విషాదం.ప్రార్థనాస్థలాల చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీమ్‌లో ఇప్పటికే నాలుగు పిటిషన్లున్నాయి. దానిపై నిర్ణయానికి కేంద్రం, కోర్ట్ తాత్సారం చేస్తుంటే ఆ లోగా వారణాసి, మథుర, ధార్, సంభల్, తాజాగా అజ్మీర్... ఇలా అనేక చోట్ల అత్యుత్సాహం వ్యక్తమవుతోంది. ఇది శాంతి, సామరస్యాలకు పెను ప్రమాదం. ఈ ప్రయత్నాలను ఆపేందుకు సర్కారు కానీ, సర్వేలపై జోక్యానికి సుప్రీమ్ కానీ ముందుకు రాకపోవడం విడ్డూరం. ఒక వివాదాస్పద స్థలపు ధార్మిక స్వభావ అన్వేషణ చారిత్రక నిర్ధారణ, పురాతత్వ అన్వేషణతో ఆగుతుందనుకుంటే పొరపాటు. అది మత పరంగా, రాజకీయంగా రావణకాష్ఠమవుతుంది. కాశీ, మథురల్లో, ఇప్పుడు సంభల్ జరుగుతున్నది అదే. ‘ప్రతి మసీ దులో శివలింగాన్ని అన్వేషించాల్సిన పని లేద’ంటూ ఆరెస్సెస్ అధినేత రెండేళ్ళ క్రితం అన్నారు కానీ జరుగుతున్నది వేరు. అధికార వర్గాల అండదండలతోనే ఈ విభజన చిచ్చు రగులుతోందన్నదీ చేదు నిజం. 2019 నవంబర్‌లో ప్రార్థనా స్థలాల చట్టాన్ని సమర్థించిన సుప్రీమ్ మరోసారి గట్టిగా ఆ పని చేయకుంటే కష్టమే. ఓ హిందీ కవి అన్నట్టు, మసీదులు పోనివ్వండి... మందిరాలు పోనివ్వండి... కానీ రక్తపాతం మాత్రం ఆపేయండి. మతాలకు అతీతంగా మనిషినీ, మానవత్వాన్నీ బతకనివ్వండి! -
Pakistan: షియా-సున్నీల ఘర్షణ.. 10 మంది మృతి
పెషావర్ : పాకిస్తాన్లో ముస్లింలకు ముస్లింలే శత్రువులుగా మారారు. ఉత్తర-పశ్చిమ ప్రాంతంలో సున్నీ- షియా వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో 10 మంది మృతిచెందారు. మరో 21 మంది గాయపడ్డారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాక్‌లోని ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని కుర్రం జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ అలీజాయ్- బగన్ వర్గాల మధ్య ఘర్షణలు గత వారం శుక్రవారం ప్రారంభమయ్యాయి. గత శుక్ర, శనివారాల్లో జరిగిన హింసాకాండలో 37 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. అయితే గురువారం కాన్వాయ్‌పై జరిగిన దాడికి బాధ్యులమని ఎవరూ ప్రకటించలేదు.ప్రాంతీయ ప్రభుత్వ ప్రతినిధి బృందానికి షియా, సున్నీ వర్గాల పెద్దలకు మధ్య జరిగిన సమావేశంలో ఇరు వర్గాల మధ్య ఏడు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయినప్పటికీ అక్కడక్కడా ఘర్షణలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. తాజాగా మంగళవారం ఘోజాగరి, మతాసానగర్, కుంజ్ అలీజాయి ప్రాంతాల్లో ఎదురుకాల్పులు జరిగాయి. కుర్రం డిప్యూటీ కమిషనర్ జావేదుల్లా మెహసూద్ మాట్లాడుతూ, హంగూ, ఒరాక్జాయ్, కోహట్ జిల్లాలకు చెందిన మత పెద్దల సమక్షంలో శాంతి చర్చలు జరగనున్నాయని తెలిపారు. దీనికి కోహట్ కమిషనర్ నాయకత్వం వహించనున్నారని తెలిపారు.మరోవైపు ఈ ఘర్షణల తరువాత పరాచినార్‌కు వెళ్లే రహదారులను మూసివేయడంతో మందుల కొరత ఏర్పడిందని కుర్రం జిల్లా హెడ్‌క్వార్టర్స్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మీర్ హసన్ ఖాన్ తెలిపారు. సున్నీ ఆధిపత్యం కలిగిన పాకిస్తాన్‌లోని 24 కోట్ల జనాభాలో షియా ముస్లింలు 15 శాతం ఉన్నారు. సాధారణంగా ఇరువర్గాలు శాంతియుతంగా కలిసి జీవిస్తున్నప్పటికీ, ముఖ్యంగా కుర్రంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత హింస భూ వివాదంతో ముడిపడి ఉంది.ఇది కూడా చదవండి: భారత్‌లో ప్లాంట్లు పెట్టండి -
ముస్లింల గడ్డపై బీజేపీ జెండా.. లాలు, అఖిలేష్ రాజకీయాలకు అడ్డుకట్ట?
లక్నో: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన పలు ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో గల రామ్‌గఢ్, యూపీలోని మొరాదాబాద్ జిల్లాలోని కుందర్కి సీటు ఒక ప్రత్యేకతను దక్కించుకున్నాయి. ముస్లింల ప్రాబల్యం కలిగిన ఈ స్థానాల్లో బీజేపీ జెండా ఎగురవేసింది.ఈ పరిణామంపై పలువురు రాజకీయ నిపుణులు పలు విధాలుగా విశ్లేషణ చేస్తున్నారు. ఇది దేశంలో మారుతున్న ఓటర్ల సెంటిమెంట్‌ను తెలియజేసే విజయమని వారంటున్నారు. అలాగే రానున్న కాలంలో ఎన్నికల రాజకీయాలు శరవేగంగా మారబోతున్నాయనడానికి ఇది ఉదాహరణ అని చెబుతున్నారు. రామ్‌గఢ్ సీటు మేవాట్ ప్రాంతంలో ఉంది. ఇక్కడ ముస్లిం జనాభా అత్యధికం. అలాగే పంజాబీ, రాజ్‌పుత్, బనియా, సిక్కు, ఎస్సీలు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఇక్కడి రాజకీయాలన్నీ హిందూ-ముస్లిం వాదనపైనే ఆధారపడి ఉన్నాయి. ఇక కుందర్కి కూడా ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతం ఇక్కడ జనాభాలో 60 శాతం ముస్లింలు ఉన్నారు. ఈ సీటును చివరిసారిగా 1993లో బీజేపీ గెలుచుకుంది. ముస్లిం మహిళల్లో గణనీయమైన వర్గం బీజేపీకి ఓటు వేస్తున్నట్లు అనేక సర్వేలు పేర్కొన్నాయి.దేశ రాజకీయాల్లో అఖిలేష్ యాదవ్, లాలూ యాదవ్, మమతా బెనర్జీలు తమ తమ రాష్ట్రాల్లోని ముస్లిం ఓటు బ్యాంకుపై గుత్తాధిపత్యం కలిగిన నాయకులుగా గుర్తింపు పొందారు. ఈ ముగ్గురు నేతలు ఉంటున్న రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా ముస్లిం జనాభా అధికంగానే ఉంది. కాగా యూపీ, బీహార్‌లో అఖిలేష్, లాలూ యాదవ్‌ల పార్టీలు చాలా కాలంగా అధికారానికి దూరంగా ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ, దాని మిత్రపక్షాల ప్రభుత్వం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అఖిలేష్, లాలూ యాదవ్‌ల రాజకీయాలకు అడ్డుకట్ట పడినట్లయ్యింది. మైనారిటీ ఆధిపత్య స్థానాలపై బీజేపీ సాధించిన విజయాన్ని చూస్తుంటే భవిష్యత్తులో అఖిలేష్, లాలూల రాజకీయాలకు తాళం పడే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఇది కూడా చదవండి: అఖిలపక్ష భేటీ.. పార్లమెంట్ సమావేశాలపై చర్చ -
వక్ఫ్ సవరణ బిల్లుకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, విజయవాడ: ముస్లిం సంప్రదాయాలకు విరుద్దంగా ఉన్న వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఈద్గా మైదానంలో జమాతే ఈ ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో జరిగిన వక్ఫ్ పరిరక్షణ మహాసభలో ఆయన మాట్లాడుతూ, వైఎస్ జగన్ ఎప్పుడూ ముస్లింలకు అండగా నిలుస్తారన్నారు.‘‘ఈ బిల్లును కేబినెట్లో ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యతిరేకించలేదు. వక్ఫ్ సవరణలో 8 అంశాలను వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. వైఎస్సార్సీపీ తరఫున మేము డీసెంట్ నోట్ కూడా ఇచ్చాం. ముస్లింల తరఫున వైఎస్సార్సీపీ ఎప్పుడూ నిలబడే ఉంటుంది. వక్ఫ్ బోర్డుకు ఎలా ఆదాయం పెంచాలో, ఎలా ఖర్చు పెట్టాలో అధికారం ఉంటుంది. కానీ ఆ అధికారాలను తొలగించాలనే అంశాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కామన్ ఫండ్‌ని ఏడు నుంచి ఐదు శాతానికి తగ్గించడానికి కూడా వైఎస్సార్సీపీ వ్యతిరేకం’’ అని విజయసాయిరెడ్డి చెప్పారు.‘‘రైల్వే శాఖకు 4.88 లక్షల హెక్టార్లకు పైగా భూమి ఉంది. ఆ భూముల్లో చాలా భాగం వక్ఫ్ బోర్డు ఆక్రమించుకుందంటూ కొందరు చేస్తున్న ఆరోపణలు తప్పు. కుట్రపూరితంగా వక్ఫ్ బోర్డు మీద ఈ ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలను వైఎస్సార్సీపీ ఖండిస్తోంది. వక్ఫ్ బోర్డు భూములే 50 శాతం ఆక్రమణలకు గురయ్యాయి. 9.40 లక్షల ఎకరాల భూములు వక్ఫ్ బోర్డుకు ఉంటే అందులో 5 లక్షల ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి. ఢిల్లీ, మహారాష్ట్రలో ఎక్కువ భూములను ఆక్రమించారు. ఆ ఆక్రమణదారులకే భూములను కట్టబెట్టాలనే నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తుంది’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.‘‘ముస్లిం సంస్థలకు నాన్ హిందువులు విరాళాలు ఇవ్వకూడదన్న బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం. ముస్లింలు ఇతరులకు విరాళం ఇవ్వవచ్చు. ఇతరులు మాత్రం వక్ఫ్ బోర్డుకు ఇవ్వకూడదనటం చాలా అన్యాయం. వక్ఫ్ బోర్డు సీఈవోగా గతంలో ముస్లింలే ఉండేవారు. ఇప్పుడు నాన్ ముస్లింలు కూడా సీఈవోగా ఉండొచ్చని ఈ బిల్లులో నిర్ణయం తీసుకోవటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ముస్లింల హక్కులకు భంగం కలిగిస్తే మేము సహించం. వైఎస్ జగన్ ఆదేశాలతో మేము ముస్లింల హక్కుల కోసం పోరాడతాం’’ అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. -
ముస్లిం ఓట్ల చుట్టూ ముగ్గుపోత!
రెండు బలమైన కూటములు తలపడుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర పోటీ సూచనలే కనిపిస్తున్నాయి. మిత్ర విభేదాలు, పార్టీ చీలికలు, కొత్త కలయికలు, మారే సమీకరణాలు, ఒకరిపై ఒకరి పోటీ ప్రభుత్వాల ఏర్పాటు... వెరసి గడచిన అయిదేళ్లలో మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి రాజ్యమేలింది. గట్టి సంఖ్యాబలంతో ఈసారి స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న పట్టుదల అటు ‘మహాయుతి’, ఇటు ‘మహా వికాస్ అఘాడీ’ (ఎమ్వీఏ) కూటముల్లో స్పష్టంగా కనిపి స్తోంది. అందుకే, ఎవరూ ఏ అవకాశాన్నీ వదలకూడదనే తలంపుతో పావులు కదుపుతున్నారు. ప్రధాన స్రవంతి ప్రత్యర్థులైన బీజేపీ, కాంగ్రెస్‌కు తోడు ప్రాంతీయంగా ప్రాబల్యమున్న శివసేన, జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లూ ఈ ఎన్నికల్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. రెండు కూటముల్లో క్రియాశీలక పాత్ర పోషించే శివసేన, ఎన్సీపీలు ఈసారి ప్రత్యేకంగా నాలుగు పార్టీలుగా తలపడుతున్నాయి. 2022–23లో చోటుచేసు కున్న ‘పవర్ పాలిట్రిక్స్’లో ఒక్కో పార్టీ రెండుగా చీలిన విషయం తెలిసిందే! ఏక్నాథ్ షిందే నేతృత్వంలోని శివసేన బీజేపీతో చేతులు కలిపి ‘మహాయుతి’లో భాగమైతే, ఉద్ధవ్ థాక్రే నాయకత్వం వహిస్తున్న శివసేన కాంగ్రెస్‌తో కూడి ‘మహా వికాస్ అఘాడీ’ భాగస్వామి అయింది. అలాగే అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ మహాయుతిలో ఉంటే, శరద్‌పవార్ నేతృత్వపు ఎన్సీపీ... ఎమ్‌వీఏలో భాగంగా ఉంది. ఇప్పుడీ రెండు కూటములూ, రాష్ట్రంలో 12 శాతంగా ఉన్న ముస్లిం ఓట్లపై దృష్టి కేంద్రీకరించాయి. వాటి చుట్టూ ముగ్గుపోసి వ్యూహాలు అల్లుతున్నాయి. మైనా రిటీలుగా ఉండి కూడా మెజారిటీ వారిని ఓడించడమనే ఎత్తుగడతో ముస్లింలు ‘వోట్ జిహాద్’కు పాల్పడుతున్నారని బీజేపీ విమర్శిస్తోంది. అవన్నీ తప్పుడు లెక్కలనీ, ముస్లింల ఉనికిని, త్యాగాలను కించపరిచేలా మాట్లాడుతున్న బీజేపీ నాయకత్వం, వారికి క్షమాపణలు చెప్పి ఎన్నికల బరిలో దిగాలనీ ప్రత్యర్థులు అంటున్నారు.‘తాము బహుళ సంఖ్యాకులుగా ఉన్న ఒక నియో జకవర్గంలో ముస్లిం మైనారిటీలు మూకుమ్మడిగా బీజేపీ ప్రత్యర్థులకు ఓటువేసి మెజారిటీ వర్గమైన హిందువులను ఓడిస్తున్నారు’ అన్నది బీజేపీ నాయకుల వాదన. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ‘ధూలే’ స్థానం పరిధి అయిదు అసెంబ్లీ సెగ్మెంట్లలో కలిపి బీజేపీ అభ్యర్థికి 1.9 లక్షల ఓట్ల ఆధిక్యత లభించినా, ముస్లిం ఆధిక్యత ఉన్న ఒక్క ‘మాలెగావ్ సెంటర్’ అసెంబ్లీ స్థానంలో ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థికి లభించిన ఏకపక్ష ఆధిక్యత వల్ల బీజేపీ అభ్యర్థి నాలుగువేల ఓట్లతో ఓడిపోయినట్టు, ఉదాహరణతో పీపీపీ ప్రదర్శన ఇచ్చి ప్రచారం చేశారు. ఇదే కారణంగా మహాయుతి కూటమి 14 స్థానాలు కోల్పోయిందన్నది వారి వాదన.హిందువులు జాగృతం కావాలని బహిరంగంగానే చెప్తు న్నారు. కానీ ఎమ్వీఏ కూటమి నాయకులు దీన్ని ఖండి స్తున్నారు. అదంతా బీజేపీ చేస్తున్న ఓ ‘సానుకూల అన్వయ వాదన’ తప్ప వాస్తవాలు వేరంటున్నారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న 38 అసెంబ్లీ స్థానాల్లో, 2019తో పోల్చి చూస్తే 20 (సగానికి ఎక్కువ) స్థానాల్లో మహాయుతి కూటమి అభ్యర్థులు 2024 ఎన్నికల్లో తమ ఓటు శాతాన్ని పెంచుకున్నట్టు జాబితా వెల్లడించారు. కిందటిసారి అసెంబ్లీకి ఎన్నికైన పదిమంది ముస్లింలలో 8 మంది ఆ స్థానాల నుంచే వచ్చారు. ప్రస్తుత సభలోని మొత్తం పదిమంది ముస్లిం ఎమ్మెల్యేలలో బీజేపీ, శివసేన, కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీల నుంచి ఇద్దరేసి ఉండగా మజ్లిస్, ఎన్సీపీ నుంచి ఒక్కొక్కరి చొప్పున ఉండటాన్ని గుర్తుచేస్తున్నారు. అధిక ముస్లిం జనాభా స్థానాలు కూడా ఏకపక్షంగా ఏం లేవనీ, ఆ 38లో కాంగ్రెస్ 11, బీజేపీ 11, అవిభక్త శివసేన 9, అవిభక్త ఎన్సీపీ 3, మజ్లిస్ 2, ఎస్పీ 2 స్థానాలు గత అసెంబ్లీ ఎన్ని కల్లో గెలుచుకున్న విషయాన్ని ఎత్తిచూపుతున్నారు.హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ (ఎఐఎంఐఎం) మహారాష్ట్ర ఎన్నికల్లో దశాబ్ద కాలంగా పాత్ర పోషిస్తోంది. 2014 ఎన్నికల్లో రంగ ప్రవేశం చేసి, ఔరంగాబాద్ సెంట్రల్, బైసుల్లా–2 అసెంబ్లీ స్థానాలు గెలిచి చరిత్ర సృష్టించింది. ప్రకాశ్ అంబేడ్కర్ నాయకత్వంలోని ‘వంచిత్ బహుజన్ అఘాడీ’ (వీబీయే)తో అప్పుడు ఏర్పడ్డ పొత్తు, 2019 ఎన్నికలప్పుడు సీట్ల పంచాయితీలో వికటించి ఆ రెండు స్థానాలు నిలబెట్టుకో లేకపోయింది. కానీ మాలెగావ్ సెంట్రల్, ధూలే –2 అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక పార్లమెంట్ స్థానం (ఔరంగాబాద్ సెంట్రల్) గెలిచి మజ్లిస్ మరోమారు వార్తలకెక్కింది. మరో నాలుగు చోట్ల రెండో స్థానంలో నిలిచింది. అంతే కాకుండా 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మజ్లిస్ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల శాతం, అక్కడి గెలుపు మార్జిన్ కంటే అధికం. 2014 లో 22 చోట్ల పోటీ చేసి 0.9 శాతం ఓట్లు సాధిస్తే, 2019లో 44 చోట్ల పోటీచేసి 1.34 శాతం ఓటువాటా పొందింది. పరిమిత ప్రభావమే అయినా... తక్కువ ఓటు వ్యత్యాసాలతో గెలుపోటములు నిర్ణయమయ్యే తీవ్ర పోటీలో మజ్లిస్ అభ్య ర్థులు నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశాలు న్నాయి. ముస్లిం ఓట్లను చీల్చి పరోక్షంగా బీజేపీకి సహకరించేందుకే పోటీ చేస్తోందనే ఆరోపణలు బీజేపీ వ్యతిరేకపార్టీల నుంచి మజ్లిస్ ఎదుర్కోవాల్సి వస్తోంది. గణాంకాలు మాత్రం ఆ వాదనను ధృవపరచడం లేదు. ఉదాహరణకు విజేతల మార్జిన్ కన్నా మజ్లిస్ ఎక్కువ ఓట్లు పొందిన 13 నియో జకవర్గాల్లో, 7 చోట్ల బీజేపీ దాని భాగస్వాములు గెలిస్తే... 6 చోట్ల కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి నెగ్గింది. ‘హరియాణా, జమ్మూ–కశ్మీర్లో మేం పోటీ చేయలేదు కదా, ముస్లిం ఓట్లు చీల్చలేదు కదా, మరి కాంగ్రెస్ ఎందుకు గెలవలేదు?’ అన్న అసద్ ప్రశ్న హేతుబద్ధమే అంటారు పరిశీలకులు. 5 చోట్ల అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన మజ్లిస్ ఈసారి కూడా ఎక్కువ స్థానాల్లో పోటీచేసే అవకాశాలున్నాయి. పొత్తులకు కలిసి రావాలంటే 28 స్థానాలు ఇవ్వాలన్న ఆ పార్టీ ప్రతి పాదనకు ఎమ్వీఏ అంగీకరించక పోవడం వల్ల ఇంకా పొత్తు కుదరలేదు. పొత్తు లేకుంటేనే బెటర్ అని ఎమ్వీఏ భావిస్తున్నట్టుంది.పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాల్లో ముస్లిం ఓటింగ్ సరళి తమ అభ్యర్థుల గెలుపోటముల్ని కచ్చితంగా ప్రభావితం చేస్తుందనేది ప్రధాన పార్టీల ఆలోచన. బీజేపీ పక్షాలు ఆందోళన చెందితే, వ్యతిరేక పక్షాలు కొంత ఆశా వహంగా ఉన్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 2 శాతం కన్నా తక్కువ ఓట్ల తేడాతో 27 చోట్ల, 2–3 శాతాల మధ్య ఓట్ల వ్యత్యాసంతో 14 చోట్ల, 3–4 శాతాల మధ్య ఓట్ల తేడాతో 11 చోట్ల, 4–5 శాతాల ఓట్ల మధ్య తేడాతో 19 చోట్ల అభ్యర్థులు గెలుపొందారు. అంటే 5 శాతం లోప ఓట్ల వ్యత్యాసంతో మొత్తం 71 మంది అభ్యర్థులు గెలుపొందారన్నమాట. ఇలా తక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచిన వారిలో బీజేపీ (29), కాంగ్రెస్ (12), శివసేన (5)తో పాటు ఇండిపెండెంట్లూ (5) ఉన్నారు. ఇక ముస్లిం జనాభా 15 శాతానికి మించి ఉన్నవి 51 నిజయోజక వర్గాలు కాగా 10–15 శాతాల మధ్య ముస్లిం జనాభా ఉన్న నియోజక వర్గాలు 54 ఉన్నాయి. 5–10 శాతాల మధ్య జనాభా ఉన్నవి 91, ఐదు కన్నా తక్కువ ముస్లిం జనాభా ఉన్నవి 92 నియో జకవర్గాలు ఉన్నాయి. బీజేపీ, వారి మిత్రపక్ష అభ్యర్థులను ఎక్కడెక్కడ ఎవరు ఓడించగలుగుతారో... ఆ నమ్మకాన్ని బట్టే ముస్లిం ఓటర్లు అటువైపు మొగ్గవచ్చనే అభిప్రాయం ఉంది. ఏ అంశం ఏ మేరకు అభ్యర్థుల జాతకాలను మారు స్తుందో నవంబరు 23 వరకు వేచి చూడాల్సిందే!దిలీప్ రెడ్డి వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,పీపుల్స్ పల్స్ రీసెర్చి సంస్థ డైరెక్టర్ -
ఇమామ్, మౌజన్లకు వేతనాలేవి బాబూ!
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలకు అనేక హామీలు గుప్పించిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా ఒక్కటీ అమలు చేయలేదు. ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనాన్ని పెంచుతానని హామీ ఇచ్చి, అసలు ఉన్న వేతనాన్ని కూడా నిలిపివేయడం ముస్లిం మైనార్టీలను నివ్వెరపరుస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే గౌరవ వేతనాలను రెట్టింపు చేసి క్రమం తప్పకుండా ఇచ్చారని, ఆయన సీఎంగా ఉండి ఉంటే ఇప్పటికే ఆరు నెలల గౌరవ వేతనం కలిపి మొత్తం రూ.45 కోట్లకు పైగా అందించి ఉండేవారని రాష్ట్రంలోని ఇమామ్‌లు, మౌజన్లు చెబుతున్నారు. ఇదే కాదు.. ఆదాయం లేని మసీదుల నిర్వహణకు ప్రతి నెలా రూ.5 వేలు ఆర్థిక సాయం అందిస్తానని బాబు ఇచ్చిన హామీ కూడా నీటి మాటే అయ్యింది. రాష్ట్రంలోని ఆదాయం లేని 6 వేల మసీదులకు నెలకు రూ.5 వేలు నిర్వహణ సాయం అందించాలని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్, ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరిస్తాన్లకు స్థలాల కేటాయింపు, విజయవాడ వద్ద హజ్ హౌస్ నిర్మాణం, నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా రూ.100 కోట్లు కేటాయింపు, రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు, హజ్ యాత్రికులకు ఒక్కొక్కరికి రూ.లక్ష సాయం, ఇమామ్‌లను ప్రభుత్వ ఖాజీలుగా నియమించడం వంటి హామీలను ఇచ్చిన చంద్రబాబు ఒక్కటీ అమలు చేయకుండా మోసకారితనాన్ని ప్రదర్శిస్తున్నారని ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. 2014లో ముస్లిం మైనార్టీలను మోసగించిన బాబు రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో చంద్రబాబు ముస్లిం మైనార్టీలకు అనేక హామీలు గుప్పించి, నిలువునా మోసగించారని ముస్లిం సంఘాలు మండిపడితున్నాయి. రాష్ట్రంలో ముస్లింలకు ప్రత్యేకంగా వడ్డీలేని ఇస్లాం బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేస్తానని నాడు హామీ ఇచ్చి, ఐదేళ్లపాటు దాని ఊసే ఎత్తలేదు. ఈ ఎన్నికల్లోను అదే హామీ ఇచ్చి, మరోసారి బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. 2014లో హజ్ యాత్రికుల కోసం విశాఖపట్నం, విజయవాడ, రేణిగుంటలో హజ్‌హౌస్‌లు నిరి్మస్తానని, ముస్లిం జనాభా ప్రాతిపదికగా దామాషా ప్రకారం వారికి బడ్జెట్లో నిధులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తానని, వక్ఫ్ ఆస్తుల రికార్డులను పక్కాగా తయారు చేసి, పరిరక్షిస్తామని చెప్పి, ఒక్కటీ అమలు చేయలేదు. నిరుద్యోగ ముస్లిం యువత స్వయం ఉపాధికి రూ.5 లక్షలు, వ్యాపారం కోసం రూ.లక్ష వడ్డీ లేని రుణాలిస్తామని చెప్పి, అరకొరగా ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు.జగన్ పాలనలోనే ముస్లింలకు భరోసావైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనంగా రూ.300.68 కోట్లు చెల్లించింది. ముస్లిం మైనార్టీలకు వైఎస్ జగన్ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థితిని కల్పించారు. చంద్రబాబు గత పాలనలో ముస్లింలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, అనేక మంది ముస్లింలపై దేశ ద్రోహం కేసులు పెట్టి అన్యాయంగా వేధించారు. ముస్లిం యువతపై నాటి చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన దేశంద్రోహం వంటి అక్రమ కేసులను వైఎస్ జగన్ ప్రభుత్వం ఎత్తివేయడమే కాకుండా నవరత్నాలతోపాటు అనేక రకాల పథకాల ద్వారా అండగా నిలిచింది. ముస్లిం మైనార్టీలకు శాశ్వత జీవనోపాధి చూపించేలా వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా వంటి పథకాలను ప్రత్యేకంగా అందించింది. ఐదేళ్ల కాలంలో కేవలం వైఎస్సార్ చేయూత ద్వారా 2,24,334 మంది మైనారిటీలకు రూ.1,613.25 కోట్లు, వైఎస్సార్ ఆసరా ద్వారా 1,69,412 మందికి రూ.583.01 కోట్లు అందించింది. ప్రతి నెలా ఒకటో తేదీన సాయమందించాలి మసీదుల నిర్వహణకు నెలకు రూ.5వేల ఆర్థిక సాయం అందిస్తానని, ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం పెంచి ఇస్తానని చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలు గడిచినా హమీ అమలు చేయలేదు. ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెలా 1వ తేదీన మసీదుల నిర్వహణకు, ఇమామ్, మౌజన్లకు ఆర్థిక సాయం అందించాలి. –షేక్ నూరుల్లా హజరత్, ఉప్పలమర్రి మసీద్ ఇమామ్, నెల్లూరు జిల్లాఇమామ్లకు గౌరవ వేతనం పెంచి అందించాలి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇమామ్‌ల గౌరవ వేతనాన్ని రూ. 5 వేలు నుంచి రూ.10 వేలకు, మౌజన్ల వేతనాన్ని రూ. 3 వేల నుంచి రూ.5 వేలకు పెంచి, అందించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం రూ.300.68 కోట్లు, కోవిడ్ ప్రత్యేక సాయం రూ.100 కోట్లు కలిపి మొత్తం రూ.400.68 కోట్లు అందించి భరోసా ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కనీసం వేతనం కూడా ఇవ్వడంలేదు. ముస్లిం సమాజానికి చంద్రబాబు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలు చేయాలి. – షేక్ దస్తగిరి, అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముస్లిం దూదేకుల జేఏసీ -
పదేళ్లు అధికారంలో ఉంటాం: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలు వరుసగా రెండుసార్లు అవకాశం కల్పిస్తూ వస్తున్నారని, తాము కూడా పదేళ్ల పాటు అధికారంలో ఉండి మంచి పాలనతో పేదల అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని ఒక హోటల్లో ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా రహా్మనీ రచించిన ‘ప్రాఫెట్ ఫర్ ద వరల్డ్ (ప్రపంచానికి ప్రవక్త)’పుస్తకాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు. కొందరు రాజకీయ లబ్ధి కోసం నిరంతరం విషం చిమ్ముతుంటారని.. ప్రజల పక్షాన మాట్లాడేవారి కంటే విషం చిమ్మేవారు ఎక్కువైపోయారని వ్యాఖ్యానించారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండి దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మజ్లిస్ కలసి రావడం ఆనందంగా ఉంది ప్రభుత్వాన్ని నడిపించడంలో కొన్ని తప్పిదాలు జరగవచ్చని, వాటిని ఎత్తి చూపేందుకు బలమైన ప్రతిపక్షం అవసరమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలని, తర్వాత అభివృద్ధి, సంక్షేమంలో అంతా కలిసి రావాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ రాజకీయంగా విభేదించినా.. తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కలసి రావడం అనందంగా ఉందని చెప్పారు. మూసీ నది అభివృద్ధి, సుందరీకరణ పనుల్లో కొందరు పేదలు నివాసాలు కోల్పోయే అవకాశం ఉందని, వారికి ప్రభుత్వపరంగా డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని రేవంత్ ప్రకటించారు. అన్ని మతాలు చెప్పింది ఒక్కటేనని, అందరం కలసిమెలసి శాంతియుతంగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలని రేవంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టెమ్రిస్ వైస్‌చైర్మన్ ఫహీమ్ ఖురేïÙ, ఇస్లామిక్ స్కాలర్స్ పాల్గొన్నారు. -
Bangladesh: హిందువుల పూజలపై ఆంక్షలు
ఢాకా: బంగ్లాదేశ్‌లో అధికారం మారిన తర్వాత, అక్కడి హిందువులపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం హిందువుల పూజల విషయంలో ఆంక్షలు విధిస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.దీని ప్రకారం బంగ్లాదేశ్‌లోని హిందువులు ఇకపై ముస్లింలు నమాజ్ చేసే సమయంలో పూజలు చేయకూడదు. అలాగే ఆ సమయంలో భజనలు చేయడం, వినడం, లౌడ్ స్పీకర్లు వినియోగించడం లాంటి పనులు చేయకూడదు. ఈ ఉత్తర్వులను తాత్కాలిక ప్రభుత్వ హోం వ్యవహారాల సలహాదారు, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ జహంగీర్ ఆలం చౌదరి జారీ చేశారు.ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే, పోలీసులు ఎలాంటి వారెంట్ లేకుండా వారిని అరెస్టు చేస్తారని బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. బంగ్లాదేశ్‌లో అధికారం మారినప్పటి నుంచి ఇప్పటివరకూ 300 హిందూ కుటుంబాలు, వారి ఇళ్లపై దాడులు జరిగాయి. హిందువులపై మూక హత్యలు కూడా చోటుచేసుకున్నాయి. పదికి పైగా హిందూ దేవాలయాల్లో విధ్వంసం, దహనాలు జరిగాయి. ఇదేవిధంగా 49 మంది హిందూ ఉపాధ్యాయుల చేత బలవంతంగా రాజీనామాలు చేయించారు. ఇప్పుడు ఈ కొత్త ఉత్తర్వుల తర్వాత బంగ్లాదేశ్‌లోని హిందువులు ప్రశాంతంగా పూజలు కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇది కూడా చదవండి: NCPCR: మదర్సాల్లో బాలల హక్కుల ఉల్లంఘన -
ఏది ధర్మం? దేనికి రక్షణ?
చట్టం విరుద్ధం కానంత వరకు ఎవరేమి చేయాలో, ఎవరేం తినాలో చెప్పడానికి వేరొకరికి ఏమి హక్కు ఉంటుంది? కొద్దిరోజుల వ్యవధిలో హర్యానాలో వరసగా జరిగిన రెండు విచక్షణా రహిత హత్యలు ఆ మౌలిక ప్రశ్ననే మరోమారు ముందుకు తెచ్చాయి. ధర్మం పేరిట విద్వేషాన్ని నింపుకొని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొంటున్న స్వయం ప్రకటిత గోరక్షకులతో దేశానికున్న ముప్పును గుర్తుచేశాయి. పన్నెండో తరగతి చదువుతున్న 19 ఏళ్ళ టీనేజ్ కుర్రాడు ఆర్యన్ మిశ్రా హర్యానాలోని ఆగస్ట్ 24న మిత్రులతో కలసి కారులో వస్తుండగా, గోమాంసం రవాణా చేస్తున్నాడనే అనుమానంతో సాయుధ మూకలు 50 కిలోమీటర్ల దూరం ఛేజ్ చేసి మరీ, ఫరీదాబాద్ వద్ద అతణ్ణి కాల్చి చంపిన ఘటన అమానుషం. అలాగే, గొడ్డుమాంసం తింటున్నాడనే అనుమానంతో ఆగస్ట్ 27న చర్ఖీ దాద్రీ వద్ద 26 ఏళ్ళ వలస కార్మికుడు సబీర్ మాలిక్‌ను కొందరు సోకాల్డ్ ధర్మపరిరక్షకులు కొట్టి చంపిన తీరు నిర్ఘాంతపరుస్తోంది. సాక్షాత్తూ హర్యానా సీఎం సైతం ‘సెంటిమెంట్లు దెబ్బతింటే, ఎవరినైనా ఎలా ఆపగల’మంటూ బాధ్యతారహితంగా వ్యాఖ్యానించడం దీనికి పరాకాష్ఠ. ఇలాంటి పాలక వర్గాల భావజాలం కారణంగానే దాదాపు దశాబ్ద కాలంగా దేశంలో గోరక్షణ పేరిట హింస సాధారణమైపోయింది. సోమవారం మహారాష్ట్రలో ఓ రైలులో పశుమాంసం తీసుకెళు తున్న ఓ వృద్ధుడిపై మూకదాడి అందుకు మచ్చుతునక. అయితే, తాజా దాడులు మైనారిటీలపై హింస పెచ్చరిల్లుతున్న వైనాన్ని పట్టిచూపడమే కాక, ఈ మతపరమైన అసహనంపై విస్తృత చర్చను లేవనెత్తాయి. ఫరీదాబాద్ ఘటనలో చనిపోయింది అమాయక హిందువంటూ రచ్చ చేస్తున్న వాళ్ళు ఆ పోయిన ప్రాణాలు ముస్లిమ్వైనా ఇలాగే స్పందిస్తారా అన్నది ధర్మసందేహం. అప్పుడే ఇలా స్పందించి ఉంటే, దేశంలో అసలు గోరక్షణ పేరిట పరిస్థితులు ఇంత దూరం వచ్చేవి కావేమో! ప్రధాని మోదీ సైతం పశువుల వ్యాపారులపై, పశు మాంసం తినేవారిపై దాడులను గతంలో ఖండించక పోలేదు. కానీ, నోరొకటి మాట్లాడుతుంటే నొసలొకటి చెబుతున్నట్టుగా... అధికార బీజేపీ ఊదరగొ డుతున్న హిందూ జాతీయవాదం గోరక్షణ పేరిట దాడుల్ని పెంచిపోషించిందన్నది నిష్ఠురసత్యం. ఆర్యన్ ఘటనపై నిరసనలు వెల్లువెత్తే సరికి, ప్రభుత్వం సైతం దిద్దుబాటు చర్యలకు దిగకతప్పలేదు. ఛాందసవాద గోరక్షకుల జాబితా సిద్ధం చేస్తున్నట్టు పోలీసులు గురువారం ప్రకటించారు. గతంలోకి వెళితే, 2012– 2018 మధ్య కాలంలో గోరక్షణ పేరిట దేశవ్యాప్తంగా 120 దాకా హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి. ఆ హింసలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు కూడా అత్యధిక ఘటనలు ఉత్తర ప్రదేశ్‌లోనే జరగడం గమనార్హం. గడచిన ఏడెనిమిదేళ్ళుగా ఉత్తర ప్రదేశ్‌లోనే కాక హర్యానా, బిహార్, రాజస్థాన్, జార్ఖండ్ తదితర అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో గోసంర క్షకుల పేరిట హింస పెచ్చరిల్లుతూ వస్తోంది. ఈ ‘గోరక్షక ముఠాల’ దాడులు భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలనే దెబ్బతీస్తున్నాయి. నిజానికి, 19వ శతాబ్దం ద్వితీయార్ధం నుంచే మన దేశంలో గోహత్యపై చర్చ, అడపాదడపా హింస సాగుతూనే వచ్చాయి. ‘హిందువేతరులపై హిందూ ధర్మాన్ని రుద్ద కూడద’ని దేశ విభజన సందర్భంగా సాక్షాత్తూ గాంధీ సైతం నొక్కిచెప్పాల్సి వచ్చింది. భారతదేశం లౌకికవాద గణతంత్ర రాజ్యమనే స్ఫూర్తిని నిలబెట్టడం కోసం రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన సంఘం సైతం గోరక్షణను తమ డ్రాఫ్టులో చేర్చలేదు. గోరక్షణను ప్రాథ మిక హక్కుగా చేర్చాలన్న వాదనను తోసిపుచ్చి, దాన్ని ఆదేశిక సూత్రాల్లోనే చేర్చారని చరిత్ర. భారత ప్రజాస్వామ్య సౌధాన్ని నిర్మించిన మన పెద్దలు వివేకంతో వ్యవహరించి, మెజారిటీ ప్రజల ఒత్తిడికి తలొగ్గలేదు. భావోద్వేగభరిత ధార్మిక అంశాల కన్నా దేశంలోని లౌకికవాద చట్టాన్ని సమున్నతమని చేతలతో చాటారు. హిందూ ధర్మంలో గోవును పవిత్రమైనదిగా పూజిస్తాం. తప్పు లేదు. మరి, అదే ధర్మం మనిషిలో దేవుణ్ణి చూడమన్న మాటను గౌరవించవద్దా? దాదాపు 24 రాష్ట్రాల్లో గోవుల అక్రమ అమ్మకం, వధను నిషేధిస్తూ రకరకాల నియంత్రణలున్నాయి. కానీ, వీటిని అడ్డం పెట్టుకొని కొన్ని అతివాద బృందాలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని, హత్యలకు పాల్పడడం, మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి, విద్వేషాలు పెంచడం సహిద్దామా? భరిద్దామా? ఈ రకమైన హిందూ జాతీయవాదంతో దేశం ఎటు పోతుంది? దేశంలోని 20 కోట్ల పైగా ముస్లిమ్‌లను వేరుగా చూస్తూ, ఈ సమాజంలో తాము మరింత మైనారిటీలుగా మిగిలిపోయామనే భావన కల్పించడం సామాజిక సమైక్యతను దెబ్బతీయదా? అది పొరుగున పొంచిన శత్రువులకు ఊతం కాదా?సంఘమంటేనే విభిన్న వర్గాలు, భావాలు, సంస్కృతులు, అలవాట్ల సమ్మేళనమనే ప్రాథమిక అంశాన్ని అందరూ గుర్తెరిగేలా చేయాలి. వైమనస్యాలు పెంచి సామరస్యాన్ని దెబ్బతీస్తే మొదటికే మోసం. అందులోనూ మూగజీవాల్ని అడ్డం పెట్టుకొని ప్రదర్శిస్తున్న మతోన్మాదం రాజకీయ ప్రేరేపి తమైనది కావడం పెను ప్రమాదఘంటిక. రాజ్యాంగ నైతికతకే విఘాతం కలిగిస్తున్న ఈ చర్యలతో చివరకు సత్ పౌరులనూ, అమాయకులనూ హింసించడం మరింత విషాదం. సుప్రీమ్ కోర్ట్ సైతం ఈ రకమైన హింసను సహించరాదని పదే పదే ఆదేశించినా, పాలకవర్గ రాజకీయాలకు ఆశ్రితులైన దోషులు తప్పించుకుంటూనే ఉన్నారు. స్థానిక నేతలుగా ఎదిగి, చట్టసభల్లో స్థానం సంపాదించు కొని, ప్రజాస్వామ్య విలువల్ని పరిహాసప్రాయం చేస్తున్నారు. పశువుల్ని కాపాడే మిషతో మనిషే మృగంగా మారుతున్న ఈ ధోరణికి ఇకనైనా పాలకులు అడ్డుకట్ట వేయాలి. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకై దీన్ని ఇలాగే వదిలిస్తే ఆఖరికి ఆవుల రక్షణ పేరిట ఆటవిక రాజ్యం నెలకొంటుంది. -
వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: మరోసారి వైఎస్ జగన్ స్పష్టీకరణ
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముస్లిం మైనారిటీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ముస్లిం మైనారిటీల సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ప్రత్యేక దృష్టి పెట్టిందని.. వారి సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశామన్నారు.‘‘ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ప్రతి అంశంపై మా పార్టీ తొలి నుంచి అండగా నిల్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మీ వెంట నడుస్తుంది. వక్ఫ్ బిల్లుపై మీరు ప్రస్తావిస్తున్న అన్ని అంశాలను మా పార్టీ ఎంపీలు పార్లమెంటులో లేవనెత్తుతారు. ఇంకా పార్లమెంటు సంయుక్త కమిటీ (జేపీసీ)లో సభ్యుడిగా ఉన్న మా ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఈ విషయంలో చొరవ తీసుకుని, మీ అన్ని అభ్యంతరాలను పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తారు’’ అని వైఎస్ జగన్ చెప్పారు.మరో వైపు, ముస్లిం సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. వక్ఫ్ భూముల్లో దాదాపు 70 శాతానికి పైగా కబ్జాలో ఉన్నాయని, కొత్తగా ప్రతిపాదించిన వక్ఫ్ చట్టంలో రూపొందించిన నిబంధనల ద్వారా తమ (వక్ఫ్) భూములు తమకు దక్కకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. కొత్త వక్ఫ్ బిల్లును మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉందన్న వారు, ఆ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించడంపై హర్ష్యం వ్యక్తం చేశారు. బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించడం వల్లనే, కేంద్రం దాన్ని జేపీసీకి పంపిందని వారు గుర్తు చేశారు.కాగా, వక్ఫ్ భూముల పరిరక్షణకు వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ వెల్లడించారు. వక్ఫ్ బోర్డును బలోపేతం చేయడంతో పాటు, ఆ భూముల వివరాలన్నీ ఆన్లైన్ ఒక గొప్ప పరిణామం అన్న ఆయన, ముస్లింలకు జగన్ చేసిన మేలు, దేశ చరిత్రలో ఏ ఒక్కరూ ఇప్పటి వరకు చేయలేదని స్పష్టం చేశారు. వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కాకుండా దేశంలోనే తొలిసారిగా జీవో నెం 60 జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. -
పంద్రాగస్టున ప్రతి ముస్లిం ఇంటిపై త్రివర్ణ పతాకం
దేశంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని బీహారీపూర్ బరేలీలోని దారుల్ ఉలూమ్ షేన్ అలా హజ్రత్‌లో ఆల్ ఇండియా ముస్లిం జమాత్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షహబుద్దీన్ రిజ్వీ బరేల్వీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పంద్రాగస్టున ముస్లింలు తమ ఇళ్లు, దుకాణాలు, మదర్సాలు, దర్గాలు, పాఠశాలలు, కళాశాలలు, ఇస్లామిక్ సంస్థలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని విజ్ఞప్తి చేశారు.భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సంతోషకరమైన సందర్భంగా ప్రతి భారతీయుడు, ముఖ్యంగా ముస్లింలు తమ ఇళ్లు, దుకాణాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కోరుతున్నామన్నారు. మదర్సాలు, విద్యాసంస్థలు స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకోవాలని, ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని మౌలానా ముఫ్తీ షహబుద్దీన్ కోరారు.స్వాతంత్య్ర పోరాటంలో హిందూ, ముస్లిం సంఘాలు సహకారం మరువరానిదన్నారు. అన్ని వర్గాల త్యాగాల ఫలితంగానే స్వాతంత్య్ర పోరాటం విజయవంతమైందన్నారు. పంద్రాగస్టున ప్రత్యేక తపాలా బిళ్లలను విడుదల చేయాలని, వివిధ కూడళ్లకు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లను పెట్టాలని ఆయన సూచించారు. -
ముస్లింలపై మీ వైఖరేంటి?
సాక్షి, అమరావతి: వక్ఫ్ చట్టాన్ని పటిష్టం చేసి ఆక్రమణదారుల చెర నుంచి భూములను పరిరక్షించాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా సవరణ బిల్లు తేవటాన్ని ముస్లిం సమాజం, మత పెద్దలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లు ముస్లిం సమా జానికి గొడ్డలిపెట్టు లాంటిదని స్పష్టం చేస్తు న్నారు. సవరణ బిల్లుకు టీడీపీ మద్దతిచ్చిన నేప థ్యంలో ఆ పార్టీలోని ముస్లిం మైనార్టీ నేతలు పదవులకు రాజీనామా చేయాలని సూచిస్తున్నారు. పార్లమెంట్లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు మద్దతు తెలపడం ద్వారా సీఎం చంద్ర బాబు మరోసారి ముస్లింలపై తన వ్యతిరేకతను బయట పెట్టారని పేర్కొంటున్నారు. ముస్లిం మైనార్టీల హక్కుల పరిరక్షణకు చంద్రబాబు అనుకూలమో కాదో సూటిగా చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎన్డీఏ ప్రకటనలు చేసినప్పుడు కూడా చంద్రబాబు కనీసం నోరు విప్పలేదని ప్రస్తావిస్తున్నారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్లో టీడీపీ, జనసేన మద్దతు పలకగా వైఎస్సార్ సీపీ గట్టిగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. దీంతో దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు 21 మందితో నియమించిన జేపీసీలో తెలంగాణ ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీతోపాటు డీకే అరుణకు ప్రాతినిధ్యం కల్పించారు. మరోవైపు బిల్లును వ్యతిరేకించిన వైఎస్సార్ సీపీ సభ్యులకు అందులో స్థానం కల్పించకుండా టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులకు చోటు కల్పించడం గమనార్హం.వక్ఫ్ చట్టంలో పలు సవరణలు..దేశవ్యాప్తంగా ముస్లిం ధార్మిక సంస్థల ఆస్తుల పరిరక్షణకు ఆంగ్లేయుల హయాంలోనే 1937లో వక్ఫ్ చట్టం తెచ్చారు. స్వాతంత్య్రం అనంతరం 1955, 1995లో సవరణలు చేశారు. వక్ఫ్ భూములను ముస్లింలకు మాత్రమే లీజుకు ఇవ్వాలనే నిబంధనను సవరించి ఎవరికైనా ఇవ్వొచ్చని చేర్చారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సవరణ బిల్లులో ముస్లిం అనే పదం లేకుండా బోర్డులో సభ్యులను తీసుకోవచ్చని పేర్కొన్నారు. సాధారణంగా ఒక మతానికి చెందిన బోర్డు, సంస్థల్లో అన్య మతస్థులను అనుమతించరు. అందుకు విరుద్ధంగా వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా ముస్లిమేతరులను నియమించుకునేలా సవరణ బిల్లు అవకాశం కల్పిస్తోంది. వక్ఫ్ ఆస్తుల ఆజమాయిషీ అధికారాలను పూర్తిగా కలెక్టర్లకు అప్పగించేలా సవరణ ప్రతిపాదించారు.తక్షణమే ఉపసంహరించుకోవాలి: ఎస్.బి.అంజాద్ బాషా, మాజీ డిప్యూటీ సీఎం వక్ఫ్ చట్టంలో ఇష్టారాజ్యంగా సవరణలు చేయడాన్ని వైఎస్సార్ సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. రాజ్యాంగాన్ని కల్పించిన ప్రాథమిక హక్కులు, మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘిస్తూ సవరణలు తేవడం దారుణం. మైనార్టీల హక్కులు, మతస్వేచ్ఛను కాలరాసే యత్నాన్ని అడ్డుకుంటాం. ఒక్కసారి వక్ఫ్‌కు దానం చేస్తే అది ఎప్పటికీ వక్ఫ్‌దే. ఎన్డీఏ ప్రభుత్వం మైనార్టీలను శత్రువులుగా చూస్తోంది. దేశంలో 9 లక్షల ఎకరాల ఆస్తులు వక్ఫ్ కింద ఉన్నాయి. ఈ సవరణల ద్వారా కాజేసే యత్నాలు జరుగుతున్నాయి. వక్ఫ్ నిర్వచనాన్ని మార్చే చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి. వక్ఫ్ ట్రిబ్యునల్‌ను కూడా కాలరాసే యత్నం చేస్తున్నారు. తక్షణమే కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.రాజ్యాంగ విరుద్ధం: హఫీజ్ ఖాన్, వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్సార్ సీపీ వ్యతిరేకిస్తోంది. వక్ఫ్ ఆస్తి అంటే అది అల్లాకు సంబంధించినది. ఓ ముస్లిం సమాజ సంక్షేమం, మేలు చేయడానికి ఇచ్చిన ఆస్తి. అది ఒక్కసారి ఇచ్చిన తరువాత ఎవరు కొనుగోలు, అమ్మకాలు చేయరాదు. దీని నుంచి వచ్చే ఆదాయాన్ని సమాజం మేలు కోసం ఉపయోగించాలి. సవరణ బిల్లు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. కలెక్టర్‌కు పూర్తి అధికారాలు ఇవ్వడంతోపాటు వక్ఫ్ బోర్డును పూర్తిగా నిర్వీర్యం చేసేలా బిల్లులో అంశాలున్నాయి. ఇతర మతస్థులను నామినేట్ చేసేలా బిల్లులో ప్రతిపాదించటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని పార్లమెంటులో మా పార్టీ ఫ్లోర్ లీడర్ మిథున్‌రెడ్డి గట్టిగా వ్యతిరేకించారు. ముస్లిం సోదరులకు సంబంధించిన సున్నితమైన విషయాలపై పునరాలోచన చేయాలి. ఎన్నికల ముందు ముస్లిం సమాజానికి ఇచ్చిన వాగ్ధానాలకు టీడీపీ కట్టుబడి ఉండాలి. ఈ బిల్లును వ్యతిరేకించాల్సింది పోయి టీడీసీ మద్దతు ఇవ్వడం దారుణం. బిల్లును వ్యతిరేకించిన మాజీ సీఎం వైఎస్ జగన్‌కి ముస్లిం సోదరుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. టీడీపీ తీరు మారకుంటే తీవ్ర పరిణామాలు –షేక్ నాగుల్ మీరా. ఏపీ ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడుముస్లిం ప్రయోజనాలను దెబ్బతీసే యత్నాలకు టీడీపీ, జనసేన వంత పాడటం దుర్మార్గం. ముస్లింల పట్ల టీడీపీ తీరు మారకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. రాష్ట్రంలో వక్ఫ్ భూములకు సంబంధించిన వివాదాలు రెవెన్యూ, వక్ఫ్‌బోర్డు మధ్య ఉన్నాయి. కలెక్టర్లకు వక్ఫ్ భూములపై పూర్తి అధికారాలు అప్పగించడమంటే ముస్లిం సమాజానికి తీవ్ర అన్యాయం చేయడమే. ముస్లిం మత విశ్వాసాల్లో అన్య మతస్తుల జోక్యంతో మత సామరస్యానికి విఘాతం కలుగుతుంది. వక్ఫ్ భూములు కట్టబెట్టే కుట్ర –షేక్ మునీర్ అహ్మద్, ఏపీ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్అత్యధిక వక్ఫ్ భూములున్న యూపీ, మధ్యప్రదేశ్‌లో ఆక్రమణకు గురైన విలువైన వక్ఫ్ భూములను చట్టబద్ధం చేసేందుకే సవరణ బిల్లు తెచ్చారు. దీనికి మద్దతు ప్రకటించిన టీడీపీ, జనసేనకు ముస్లిం సమాజం స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడం ఖాయం. రెండు రోజుల్లో ఏపీతోపాటు అన్ని రాష్ట్రాల్లో సమావేశాలు నిర్వహించి ముస్లిం సమాజానికి ముంచుకొచ్చిన ప్రమాదాన్ని వివరిస్తాం. హక్కులను కాలరాయడమే –ఆలమూరు రఫీ, రాష్ట్ర అధికార ప్రతినిధి, వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్.వక్ఫ్ చట్ట సవరణ బిల్లు భిన్నత్వంలో ఏకత్వానికి వ్యతిరేకంగా ఉంది. వక్ఫ్ అనే పదానికి అర్ధమే మార్చేలా ఉంది. మతపరమైన అంశాల్లో బీజేపీ, టీడీపీ, జనసేన జోక్యం చేసుకోవడం తగదు. దగా చేయడమేముస్లింల ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఏరుదాటాక తెప్ప తగలేసిన చందంగా వ్యవహరిస్తోంది. వక్ఫ్ చట్ట సవరణకు టీడీపీ మద్దతు తెలిపి ముస్లింలను దగా చేసింది. దీనిపై పోరాటానికి ముస్లిం సమాజం సిద్ధం కావాలి. - అబ్దుల్ బషీరుద్దీన్, రాష్ట్ర వక్ఫ్‌బోర్డు, మాజీ డైరెక్టర్, కాకినాడవైఎస్సార్ సీపీ నిర్ణయం అభినందనీయంవక్ఫ్ చట్ట సవరణ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకించిన వైఎస్సార్ సీపీకి ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ముస్లింలందరూ స్వాగతిస్తున్నారు. ముస్లిం హక్కుల పరిరక్షణ విషయంలో వైఎస్సార్ సీపీ ముందుండి నడిపిస్తోంది. – డాక్టర్ మీర్జా షంషేర్ అలీబేగ్, ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ టీడీపీ మైనార్టీల ద్రోహిటీడీపీ తొలి నుంచి ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకమే. వక్ఫ్ ఆస్తుల విషయంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయానికి టీడీపీ మద్దతు తెలపడం సిగ్గుచేటు. దీనిపై ఎంతటి పోరాటానికైనా వెనుకాడేది లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మైనార్టీలకు అండగా నిలబడ్డారు. మొదటి నుంచి వైఎస్సార్ కుటుంబం మైనార్టీలకు అండగా నిలుస్తోంది. – షేక్ నూరిఫాతిమా, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, తూర్పు నియోజకవర్గం, గుంటూరు చట్ట సవరణ సరికాదువక్ఫ్ చట్ట సవరణ సరికాదు. దీన్ని వ్యతిరేకించాల్సింది పోయి టీడీపీ, జనసేన మద్దతు తెలపడం ముస్లింలను అగౌరవపరచడమే. వైఎస్సార్సీపీ ముస్లింలకు అండగా నిలవడం అభినందనీయం. – ఫయాజ్ అహ్మాద్, పురపాలక కౌన్సిలర్, ఆదోని, కర్నూలు జిల్లారాజ్యాంగ ఉల్లంఘనే...వక్ఫ్ బోర్డు నిబంధనల్లో సవరణ చేయటం ముస్లిం మైనారిటీల మనోభావాలను దెబ్బతీయడమే. వైఎస్సార్సీపీ ఎంపీలు వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించటం హర్షణీయం. – ఎంఏ భేగ్, వైఎస్సార్సీపీ మైనారిటీ సెల్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడురాజ్యాంగ మౌలిక స్వరూపంపై దాడివక్ఫ్ చట్టంలో ఇష్టారాజ్యంగా నవరణలు చేయడం రాజ్యాంగ మౌలిక నిర్మాణంపై దాడి చేయడమే. ఈ బిల్లుతో మసీదులు, దర్గాల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది. ముస్లిం సంస్థల ఆస్తులను దోచుకుంటామంటే ప్రతిఘటన తప్పదు. వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలి. ––ఎస్.అబ్దుల్‌కలీమ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ మాజీ డైరెక్టర్ -
వక్ఫ్ బోర్డులోకి మహిళలు, ముస్లిమేతరులు !
న్యూఢిల్లీ: ముస్లిం మతపరమైన, ధార్మిక ప్రయోజనాల కోసం దానంగా వచ్చిన ఆస్తులను పర్యవేక్షించే వక్ఫ్ బోర్డుల్లో మరింత పారదర్శకత సాధించే లక్ష్యంతో సంబంధిత చట్టంలో కీలక మార్పులకు కేంద్రం నడుంబిగించింది. ఇందులోభాగంగా వక్ఫ్ బోర్డుల పాలనా వ్యవహారాల్లో మహిళలు, ముస్లి మేతరులకు చోటు కల్పించాలని భావిస్తోంది. ఈ మేరకు వక్ఫ్ చట్టంలో సవరణలు తేవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వక్ఫ్ చట్టం,1995 పేరును యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫీషియెన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్,1995గా మార్చుతూ వక్ఫ్ (సవరణ)బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. సంబంధిత బిల్లు వివరాలు మంగళవారం లోక్‌సభ సభ్యులకు అందాయి. ఆ బిల్లులోని అభ్యంతరాలు, అందుకు కారణాల జాబితా ప్రకారం ప్రస్తుత వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40ని తొలగించనున్నారు. ఏదైనా ఆస్తి వక్ఫ్‌కు చెందినదిగా నిర్ణయించే అధికారం ప్రస్తుతం వక్ఫ్ బోర్డుకే ఉంది. ఇంతటి అపరిమిత అధికా రాలను తగ్గించాలని బిల్లులో ప్రతిపాదించారు. కేంద్ర వక్ఫ్ మండలి, రాష్ట్రాల వక్ఫ్ బోర్డుల్లో భిన్న వర్గాలకు, ముస్లిం పురుషులతోపాటు మహిళలు, ముస్లిమేత రులకూ ప్రాతినిధ్యం కల్పించనున్నారు. ముస్లింలలో బోరా, అగాఖనీల కోసం ప్రత్యేకంగా బోర్డ్ ఆఫ్ ఔఖాఫ్‌ను ఏర్పాటు చేయనున్నారు. కనీసం ఐదేళ్లుగా ఇస్లామ్ మతాన్ని ఆచరిస్తూ సొంత ఆస్తిని దానంగా ఇస్తేనే దానిని ‘వక్ఫ్’గా పేర్కొనాలని ‘వక్ఫ్’ పదానికి బిల్లు కొత్త నిర్వచనం ఇచ్చింది. -
లవ్ జిహాద్‌కు జీవిత ఖైదు: అసోం
గువాహటి: హిందూ అమ్మాయిలను ముస్లింలుగా మారుస్తున్న ‘లవ్ జిహాద్’ దోషులకు యావజ్జీవ ఖైదు పడేలా కొత్త చట్టం తెస్తామని బీజేపీ పాలిత అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదివారం ప్రకటించారు. ‘‘ఎన్నికల వాగ్దానాలనే నెరవేర్చబోతున్నాం. లవ్ జిహాద్‌తో సంబంధమున్న వారికి జీవితఖైదు తప్పదు. ఇకపై అసోంంలో పుట్టిన వారినే స్థానికులుగా గుర్తిస్తాం. వారికే ప్రభుత్వ ఉద్యోగాల అర్హత ఉంటుంది’’ అన్నారు. -
Sri Lanka: ముస్లింలకు క్షమాపణ చెప్పిన శ్రీలంక
కోవిడ్ సమయంలో ముస్లింల మనోభావాలు దెబ్బతీసినందుకు శ్రీలంక ప్రభుత్వం అధికారికంగా వారికి క్షమాపణలు చెప్పింది. కరోనా బారినపడి మృతి చెందిన ముస్లింలను బలవంతంగా దహనం చేసినందుకు తమను క్షమించాలని, భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లు జరగబోవని ప్రభుత్వం ముస్లింలకు భరోసా ఇచ్చింది.భవిష్యత్తులో ముస్లింలు లేదా మరే ఇతర కమ్యూనిటీ ప్రజలు అనుసరించే అంత్యక్రియల ఆచారాల విషయంలో ఉల్లంఘన జరగకుండా చూస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఖననం లేదా దహన సంస్కారాలకు సంబంధించిన విషయంలో కొత్త చట్టం హామీ ఇస్తుందని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని శ్రీలంక సభలోని ముస్లిం ప్రతినిధులు స్వాగతించారు. దేశ జనాభాలో ముస్లిం జనాభా 10 శాతం అని, కోవిడ్ కాలంలో జరిగిన ఘటనలపై ముస్లింలు ఇప్పటికీ ఆవేదన చెందుతున్నారని ముస్లిం ప్రతినిధులు పేర్కొన్నారు.కోవిడ్ కాలంలో శ్రీలంక ప్రభుత్వం కరోనా మృతులను ఖననం చేసేందుకు అనుమతించలేదు. దీనికి సంబంధించి శ్రీలంక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి కూడా విమర్శించింది. ముస్లింలు, కాథలిక్కులు, బౌద్ధుల మనోభావాలను గౌరవించడంలో శ్రీలంక ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు గతంలో వెల్లువెత్తాయి. -
వాడు బతకొద్దు.. ఉరితీయండి లేదా మేమే చంపేస్తాం..
-
ముస్లింల జనాభా పెరుగుదల జీవన్మరణ సమస్యగా మారింది: హిమంత
రాంచీ: జనాభా సమీకరణాల్లో మార్పు అస్సాంలో అతిపెద్ద సమస్యగా మారిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. ‘అస్సాంలో 1951లో ముస్లింల జనాభా 12 శాతం మాత్రమే. కానీ ఇప్పుడది 40 శాతానికి చేరుకుంది. నాకిది రాజకీయ సమస్య కాదు. జీవన్మరణ సమస్య. మనం ఎన్నో జిల్లాలను కోల్పోయాం’ అని హిమంత వ్యాఖ్యానించారు. 2021 జూన్‌లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక హిమంత మాట్లాడుతూ.. ‘జనాభా విస్పోటం అస్సాం ముస్లింలలో పేదరికానికి, ఆర్థిక అసమానతలకు మూలకారణం’ అని అన్నారు. రాంచీలో బుధవారం బీజేపీ సమావేశంలో మాట్లాడుతూ జార్ఖండ్ గిరిజన ప్రాంతాల్లో బంగ్లా చొరబాటుదారుల సంఖ్య పెరుగుతోందన్నారు. జార్ఖండ్‌ను సీఎం హేమంత్ మినీ బంగ్లాదేశ్‌గా మార్చేశారన్నారు. -
ముస్లిం మహిళలకు భరణం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ముస్లిం మహిళలకు భరణం ఇచ్చే విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. విడాకుల తర్వాత వారు కూడా భరణానికి అర్హులని స్పష్టం చేసింది. 125 సీఆర్పీసీ ప్రకారం విడాకులు తీసుకున్న తన భార్యకు భరణం చెల్లించాలంటూ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఓ ముస్లిం వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అగస్టీన్, జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. విడాకుల తర్వాత తమ భర్త నుంచి వారు భరణం కోరవచ్చని తీర్పునిచ్చింది. -
ముస్లిం సోదరులకు ఏపీ సీఎం చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు
-
హజ్‌యాత్రలో అంతిమ ఘట్టం షురూ
సౌదీ అరేబియాలో లక్షలాది మంది ముస్లిం యాత్రికులు ఆదివారం నాడు సైతానును రాళ్లతో కొట్టి చంపే ఆచారాన్ని ప్రారంభించారు. ఈ ఆచారం హజ్‌యాత్ర చివరి రోజులలో నిర్వహిస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు సంబంధించిన ఈద్ అల్-అధా వేడుకల ప్రారంభాన్ని సూచిస్తుంది.సైతాను(దుష్టశక్తి)ను రాళ్లతో కొట్టడం అనేది ఇస్లాంలోని ఐదు ప్రముఖ ఆచారాలలో ఒకటి. ఇది హజ్‌యాత్రలో చివరి ఆచారం. పవిత్ర నగరం మక్కా వెలుపల ఉన్న అరాఫత్ పర్వతం వద్ద లక్షలమంది ముస్లిం యాత్రికులు గుమిగూడి ఈ ఆచారాన్ని నెరవేరుస్తారు. ఐదు రోజుల పాటు ఈ హజ్ ఆచారం కొనసాగుతుంది.యాత్రికులు శనివారం సాయంత్రం ముజ్దలిఫా అనే ప్రదేశంలో గులకరాళ్లను సేకరించారు. వీటితో సైతానుకు ప్రతీకంగా నిలిచిన స్తంభాలను కొడతారు . ఈ స్తంభాలు మక్కాలో మీనా అనే పవిత్ర స్థలంలో ఉన్నాయి.హజ్‌కు వచ్చే యాత్రికులు మూడు రోజుల పాటు మీనాలో ఉంటారు. అక్కడ నుండి వారు భారీ స్తంభాలు కలిగిన బహుళ అంతస్తుల సముదాయానికి వెళ్తారు. యాత్రికులు ఇక్కడి మూడు స్తంభాలను ఏడు గులకరాళ్లతో కొడతారు. దీనిని వారు చెడును తరిమికొట్టడానికి చిహ్నంగా పరిగణిస్తారు. అనంతరం మీనా నుండి మక్కా చేరుకునే ముస్లింలు అక్కడ తవాఫ్ (ప్రదక్షిణ) చేస్తారు. -
ముస్లింలకు వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
గుంటూరు, సాక్షి: ముస్లిం సోదర, సోదరీమణులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం తన ఎక్స్ ఖాతాలో ఆయన సందేశం ఉంచారు. కరుణ, త్యాగం, భక్తి విశ్వాసాలకు ప్రతీక బక్రీద్. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) June 17, 2024అంతకు ముందు.. ఓ ప్రకటనలోనూ ఆయన బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగనిరతికి, ధర్మబద్ధతకు, దాతృత్వానికి బక్రీద్ ప్రతీకగా నిలుస్తుందన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకొంటారన్నారు. పేద, ధనిక తారతమ్యాలు లేకుండా, రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ ఈ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారని చెప్పారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని అభిలషించారు. -
‘ఆమెను ఇక్కడ ఉండనిస్తే.. మేం ప్రశాంతంగా ఉండలేం’!
ఆమె పేరు ఫాతిమా(పేరుమార్చాం). గుజరాత్‌లోని ఓ మంత్రిత్వ శాఖకు చెందిన విభాగంలో పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆవాస్ యోజన పథకం కింద వడోదర హార్నీ ఏరియాలో నిర్మించిన మోట్‌నాథ్ హౌజింగ్ క్లాంపెక్స్‌లో ఏడేళ్ల కిందట ఆమెకు ఫ్లాట్ కేటాయించారు. అయితే ఇన్నేళ్లు అయినా ఆమె అక్కడ అడుగుపెట్టలేకపోయింది. అధికారులు కారణం కాదు.. ఆమెతో పాటు ప్లాట్ పొంది హాయిగా అక్కడ నివసిస్తున్నవాళ్లలో కొందరు ఆమెను అడ్డుకుంటున్నారు.వడోదర మున్సిపల్ కార్పొరేషన్‌లోని కాంప్లెక్స్‌లో 462 ఇళ్లు ఉన్నాయి. అర్హత జాబితా ప్రకారం.. 2017లో ఫాతిమాకు అందులో ఇంటిని కేటాయించారు. అయితే ఆ హౌజింగ్ కాంప్లెక్స్‌లో ఉండే 33 మంది ఓనర్లు ఆమెకు ఇంటికి కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆమె ముస్లిం అని, ఆమె గనుక అక్కడ ఉంటే.. గొడవలు జరిగే అవకాశం ఉందంటూ 2020లో ముఖ్యమంత్రి కార్యాలయానికి, కలెక్టర్‌కు, స్థానిక అధికారులకు లేఖలు రాశారు. అంతటితో ఆగకుండా ధర్నాకు సైతం దిగారు. దీంతో.. ఆమె అక్కడికి వెళ్లకుండా ఆగిపోయారు.భర్తను కోల్పోయిన ఆమె.. ఇంతకాలం ఆమె పుట్టింట్లోనే ఉండిపోయింది. కొడుకు అదే ఏరియాలో మరో ఇంట్లో ఉంటున్నాడు. ఇన్నేళ్లు గడిచాయి కదా.. పరిస్థితులు శాంతించి ఉంటాయని, తాను తన కొడుకుతో అక్కడికి షిఫ్ట్ అయ్యిందని అనుకుంది. అయితే ఈ విషయం తెలిసి మళ్లీ ఆ 32 మంది ఓనర్లు ధర్నాకు దిగారు. ప్రశాంతంగా ఉంటున్న తమ సమముదాయంలో ఆమె వల్ల అలజడి చెలరేగడం తమకు ఇష్టం లేదని, అందుకే ఆమెను ఇక్కడ ఉండనివ్వబోమని నిరసన చేపట్టారు. దీనిపై స్పందించేందుకు అధికారులెవరూ ఇష్టపడడం లేదు. ఇది ఆ కాంప్లెక్స్‌లో ఉంటున్న నివాసితుల సమస్య గనుక వాళ్లే న్యాయస్థానాల్లో తేల్చుకోవాలంటూ చేతులెత్తేశారు.One flat was allotted under CM scheme to a #Muslim woman out of 461 flats in a residential building in #Vadodara, #Gujarat.The #Hindu residents started a protest demanding that no #Muslims should live there with them.Where our country is heading? 😞 pic.twitter.com/hQY7QA9Gae— Hate Detector 🔍 (@HateDetectors) June 14, 2024 -
కుమార్తెకు రైలు పేరు పెట్టిన మహిళ
మహారాష్ట్రలో ఓ విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. నిండు గర్భిణిగా ఉన్న ఓ ముస్లిం మహిళ ఊహించని రీతిలో రైలులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇతర మహిళా ప్రయాణికులు ఆమెకు పురుడు పోశారు. రైలులో తనకు పుట్టిన బిడ్డకు ఆ తల్లి ఆ రైలు పేరునే పెట్టింది. ఇకపై తన బిడ్డను ఆ రైలు పేరుతోనే పిలుచుకుంటానని తెలిపింది. వివరాల్లోకి వెళితే జూన్ 6న ఉదయం కొల్హాపూర్-ముంబై మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న గర్భిణి ఫాతిమా ఖాతూన్ (31)కు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని ఆమె రైలు లోనావాలా స్టేషన్‌కు చేరుకుంటున్న సమయంలో భర్త తయ్యబ్‌కు తెలిపింది. తయ్యబ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫాతిమాకు వాంతులు అవుతుండటంతో ఆమె రైలులోని టాయిలెట్‌కు వెళ్లింది. ఎంతసేపటికీ ఫాతిమా తిరిగి రాలేదు. దీంతో తయ్యబ్ టాయిలెట్‌లోనికి వెళ్లి చూశాడు. ఫాతిమా ఆడబిడ్డకు జన్మనిచ్చిందని గుర్తించాడు. రైలులో ఉన్న ఇతర మహిళా ప్రయాణికులు ఈ సంగతి తెలిపాడు. దీంతో వారు ఫాతిమాకు సహాయం అందించారు.ఈ విషయాన్ని తయ్యబ్ రైల్వే పోలీసులకు తెలియజేశాడు. రైలు లోనావాలా స్టేషన్‌కు చేరుకోగానే అక్కడి రైల్వే సిబ్బంది ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తల్లీబిడ్డకు చికిత్స అందించారు. వారి ఆరోగ్య పరిస్థితి కుదుటపడ్డాక వారిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు.ఈ సందర్భంగా తయ్యబ్ మీడియాతో మాట్లాడుతూ తన భార్య డెలివరీ తేదీ జూన్ 20 అని, అయితే ఇంతలోనే ఆమె రైలులో ఆడబిడ్డకు జన్మనిచ్చిందని తెలిపారు. తమకు ఇప్పటికే ముగ్గురు కుమారులు ఉన్నారన్నారు. తాము ఆ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తిరుపతి నుంచి మహాలక్ష్మి ఆలయానికి వెళ్తున్న కొందరు ప్రయాణికులు తమ బిడ్డను చూసి ‘మహాలక్షి ఎక్స్‌ప్రెస్’లో లక్ష్మీదేవి జన్మించిందని అన్నారని తయ్యబ్ పేర్కొన్నాడు. ఈ మాట విన్న తన భార్య తమ బిడ్డకు ‘మహాలక్ష్మి’ అనే పేరు పెట్టిందని ఆయన తెలిపాడు. -
కశ్మీరీల ప్రజాస్వామిక విశ్వాసం
1996 తర్వాత జమ్ము–కశ్మీర్లో అత్యధిక ఓటింగ్ శాతం మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో నమోదైంది. సమస్యాత్మక ప్రాంతంలో ఇది కొత్త శకానికి నాంది అనుకోవచ్చు. 2019లో ఆర్టికల్ 370 రద్దుతో రాజ్యాంగం ప్రకారం ఉన్న పరిమిత రాజకీయ స్వయంప్రతిపత్తిని మోదీ ప్రభుత్వం తొలగించిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు ఇవి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే కశ్మీరీలు, లద్ధాఖ్ వాసుల సంకల్పానికి ఈ పోలింగ్ శాతం ఒక సూచన. ప్రస్తుత రాజకీయ నాయకత్వంపై కోపం ఉన్నప్పటికీ, భారతదేశంపై కొత్త విశ్వాసం అక్కడి ప్రజల్లో ఉంది. రాజకీయ, సామాజిక సమస్యలకు పరిష్కారాలను తీసుకురాగల సామర్థ్యం తుపాకీ కంటే ప్రజాస్వామిక ప్రక్రియే కలిగి ఉందని ఓటు వేయడానికి వచ్చిన ప్రజలు చూపిస్తున్నారు.మునుపటి జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని జమ్మూ కశ్మీర్, లద్ధాఖ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఐదు దశల్లో ఎన్నికలు జరిగాయి. నివేదికల ప్రకారం, పరిణామంలో చిన్నదైనప్పటికీ ఎక్కువ మంది జనాభా నివసిస్తున్న కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో, 1996 తర్వాత అత్యధికంగా ఓటింగ్ శాతం ఈ ఎన్నికల్లోనే నమోదయ్యింది. శ్రీనగర్‌లో 38.49 శాతం ఓటింగ్ జరగగా, బారాముల్లాలో 59.1 శాతం నమోదైంది. జమ్మూ డివిజన్ లోని పూంచ్–రాజౌరీ జిల్లాల చేరిక వల్ల కశ్మీరీల ప్రాబల్యం తగ్గిపోయిన అనంత్‌నాగ్‌లో 54.84 శాతం ఓటింగ్ నమోదైంది.కొత్త శకానికి నాందిముస్లిం మెజారిటీ ప్రాంతాలైన కశ్మీర్, లద్ధాఖ్; హిందూ మెజారిటీ ఉన్న జమ్మూ మధ్య ఎన్నికల ఫలితాలు తీవ్రమైన మతపర విభజనను వెల్లడిస్తున్నాయి. పీర్ పంజాల్ పర్వతశ్రేణికి ఇరువైపులా ఉన్న పోటీదారులు ఓటర్లకు చేసిన మతపరమైన విజ్ఞప్తి ద్వారా కూడా ఈ విభజన ధ్రువీకరించబడింది. కశ్మీర్ లోయ వేర్పాటువాదం నుంచి బయటపడినప్పటికీ... జమ్మూలో రెండు స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ హిందుత్వ ఎజెండా (నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ద్వారా మతపరమైన అస్తిత్వాన్ని బలోపేతం చేయడానికి రూపొందించిన నియోజకవర్గాలివి) లోయలోని ప్రతి అభ్యర్థికి చెందిన విభిన్నమైన మతపరమైన ప్రాతిపదికతో సరిపోలింది. వాస్తవానికి, కశ్మీర్‌లోని షియా ముస్లిం సమాజపు మొదటి కుటుంబానికి చెంది, శ్రీనగర్ నుండి గెలుపొందిన నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి ఆగా సయ్యద్ రుహుల్లా తన కమ్యూనిటీ తరపున కశ్మీరీ పండితులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పడం ద్వారా అంతకుముందటి స్థితిని బద్దలుకొట్టారు. 1990–96 మధ్య కాలంలో జమ్మూ కశ్మీర్ ఇప్పటిలాగే కేంద్ర పాలనలో ఉన్నప్పుడు, కశ్మీర్ లోయ నుంచి కశ్మీరీ పండితుల భారీ వలసలను నిరోధించడంలో విఫలమైనందుకు ఆయన క్షమాపణ వేడుకున్నారు.అలాంటప్పుడు సమస్యాత్మక ప్రాంతంలో ఇది కొత్త శకానికి నాంది కాదా? 2019లో ఆర్టికల్ 370 రద్దుతో రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానికి ఉన్న పరిమిత రాజకీయ స్వయంప్రతిపత్తిని మోదీ ప్రభుత్వం తొలగించిన తర్వాత, ఇవి జమ్మూ కశ్మీర్లో జరిగిన మొదటి ఎన్నికలని గుర్తుంచుకోవాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే కశ్మీరీలు, లద్ధాఖ్ వాసుల సంకల్పానికి లోయలో, లద్ధాఖ్‌లో నమోదైన పోలింగ్ శాతం ఒక సూచన. స్వతంత్ర అభ్యర్థిగా లద్ధాఖ్ సీటును గెలుచుకున్న మాజీ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు మహమ్మద్ హనీఫాకు మొదటి నుండీ ట్రెండ్స్ అనుకూలంగానే ఉన్నప్పటికీ, ఇది ఆ పార్టీ పునరుజ్జీవనం కాదు. కేంద్రంలోని అధికార పార్టీని ఓడించడానికి దాని వెనుక సమీకరించే ప్రయత్నం. ఎందుకంటే నేషనల్ కాన్పరెన్స్ స్టార్ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బారాముల్లా నుంచి ఓడిపోయారు. అబ్దుల్లాకు 26 శాతం ఓట్లు రాగా, ఆయన మీద గెలిచిన ఇంజనీర్ రషీద్‌కు దాదాపు 46 శాతం ఓట్లు పోలయ్యాయి. ‘స్వతంత్ర కశ్మీర్’ను ప్రవచించే రషీద్ అదే కారణంగా ‘ఉపా’ కేసులో గత ఐదేళ్లుగా తిహార్ జైలులో ఉన్నారు. చివరి క్షణంలో ఆయన ఇద్దరు కుమారుల నేతృత్వంలో ప్రచారం ఊపందుకుంది.ఆర్టికల్ 370 రద్దుకు కారణమైన బీజేపీకి వ్యతిరేకంగా జరిగిన ఓట్ల ఏకీకరణకు మనం ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నాము. ఇంతకుముందు, కశ్మీర్లో పాతుకుపోయిన రెండు ప్రముఖ పార్టీలు ఎన్ సీ, పీడీపీలు బీజేపీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయని గుర్తుంచుకోవాలి. చివరిగా కశ్మీర్లో ఏర్పాటైన ప్రభుత్వం బీజేపీ, పీడీపీ కూటమి. ప్రతి ఒక్కరి ఎన్నికల ప్రచారాల ద్వారా వ్యక్తీకరించబడినట్లుగా, సజ్జాద్ లోన్ కు చెందిన పీపుల్స్ కాన్ఫరెన్స్ వంటి బీజేపీ మిత్రపక్షాలు కూడా ప్రజల మద్దతు కోసం ఏదైనా విజ్ఞప్తి చేయడానికి ముందు, ఆ పార్టీకి దూరంగా ఉండవలసి వచ్చింది.పునరావిష్కరించుకుంటేనే కమల వికాసంకశ్మీర్లోని ఏ స్థానం నుంచి కూడా బీజేపీ తన అభ్యర్థిని నిలబెట్టలేదు. కశ్మీర్లో కమలం వికసించడానికి సమయం పడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కానీ కశ్మీరీల కోసం, లద్ధాఖ్ ప్రజల కోసం పార్టీ తనను తాను తిరిగి ఆవిష్కరించుకుంటే తప్ప, ఇది అసంభవమని ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయి. ప్రధానమంత్రులుగా జమ్ము కశ్మీర్ చూసిన భారతీయ నాయకులందరిలోకీ అటల్ బిహారీ వాజ్‌పేయి అత్యంత ప్రియమైన వ్యక్తి.బీజేపీకి మద్దతివ్వడం పక్కన పెడితే, ఆ పార్టీతో అనుబంధం పెట్టుకోవడానికి కూడా శ్రీనగర్‌లో ఎవరూ లేరు. నేను మే మొదటి వారంలో లోయలో ఉన్నాను. డౌన్ టౌన్ తో సహా శ్రీనగర్‌లోని స్నేహితుల ఇళ్లలోనూ, సోపోర్‌లోనూ ఉన్నాను. ఒమర్ అబ్దుల్లాను సవాలు చేసే వ్యక్తిగా ఇంజనీర్ రషీద్ ఆవిర్భవించడం అప్పటికి ఇంకా స్పష్టీకరించబడలేదు. కానీ బీజేపీ పట్ల వ్యతిరేకత మాత్రం అక్కడ స్పష్టంగా, సార్వత్రికంగా ఉంది.ప్రచారంలో అభ్యర్థులు ఒకరి కంటే ఒకరు బీజేపీకి వ్యతిరేకంగానే ఎక్కువగా తమ గురించి చెప్పుకున్నారు. కేంద్రంలో బీజేపీ పాలనకు వ్యతిరేకంగా కశ్మీర్ రాజకీయ రంగంలోని వివిధ వర్గాలు ఏకమయ్యాయి. కశ్మీరీలు ఇచ్చిన సందేశం బిగ్గరగా, స్పష్టంగా ఉంది. ఎన్నికల క్రమంలో కుల్గామ్, పూంఛ్‌లలో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నప్పటికీ, ఈ కేంద్రపాలిత ప్రాంతంలో వాస్తవంగా హింస తగ్గుముఖం పట్టిందనే దృక్పథాన్నే నేను కొనసాగించాలనుకుంటున్నాను. బీజేపీ మీద వ్యతిరేకతకు కారణాలు ఏవంటే, ప్రస్తుతం ఉన్న పరిపాలన ప్రజలలో ఏ విధమైన సంతృప్తిని కలిగించకపోగా, పరాయీకరణను పెంచింది.తుపాకీ కన్నా ఓటు మేలుఅయినప్పటికీ, అదే సమయంలో, కశ్మీర్‌ను నాలాగే అభిమానిస్తున్న వారికి ప్రకాశవంతమైన భవిష్యత్తు ఉంది. అక్కడ పరాయీకరణ ఉన్నప్పటికీ, రాజకీయ, సామాజిక సమస్యలకు పరిష్కారాలను తీసుకురాగల సామర్థ్యం తుపాకీ కంటే ప్రజాస్వామిక ప్రక్రియే కలిగి ఉందని ఓటు వేయడానికి వచ్చిన ప్రజలు చూపిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ నాయకత్వంపై కోపం ఉన్నప్పటికీ, భారతదేశంపై కొత్త విశ్వాసం అక్కడి ప్రజల్లో ఉంది. ఓటు రూపంలో దేశం దాని ప్రజలకు ఇచ్చిన భరోసా కూడా కశ్మీరీల్లో వ్యక్తమైంది.ఈ ప్రాంతంలోని రెండు ప్రముఖ రాజకీయ కుటుంబాల ప్రతినిధులు, కశ్మీరీలే అయినప్పటికీ ప్రజల తిరస్కరణను ఎదుర్కొన్నారు. కానీ 1990ల నుండి గ్రహణం పట్టిన ప్రజాస్వామ్య ప్రక్రియ ఇంకా సజీవంగానూ, చైతన్యవంతంగానూ ఉంది. ఈ ప్రక్రియలో పాలుపంచుకోవాలనే ప్రజల విశ్వాసంలో, ఇతర భారతీయులకు లాగే దేశ పాలనలో తామూ భాగం కాగలమనే గుర్తింపునకు సంబంధించిన వ్యక్తీకరణలో ఇది కనబడుతోంది.వజాహత్ హబీబుల్లా వ్యాసకర్త జమ్ము కశ్మీర్ క్యాడర్ మాజీ ఉన్నతాధికారి; ‘నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్’ మాజీ చైర్పర్సన్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్‌గ్రౌండ్
ఒడిశా రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర శాసనసభకు తొలిసారిగా ముస్లిం మైనారిటీకి చెందిన మహిళ ఎన్నికైంది. ఆమె పేరు సోఫియా ఫిర్దౌస్.. వయసు 32 ఏళ్లు. కాంగ్రెస్ అభ్యర్థిగా బారాబతి-కటక్ స్థానం నుంచి పోటీ చేసి తన ప్రత్యర్థి బీజేపికి చెందిన పూర్ణ చంద్ర మహాపాత్రను ఎనిమిది వేల మెజార్టీ ఓట్ల తేడాతో ఓడించారు. ఇంతకీ ఈ సోఫియాకున్న ఆసక్తికర నేపథ్యాన్ని పరిశీలిస్తే.. ఫిర్దౌస్ ఒడిశా సీనియర్ కాంగ్రెస్ నేత మహమ్మద్ మోకిమ్ కుమార్తె. తండ్రిపై అవినీతి ఆరోపణలు ఉండడంతో ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడింది. దీంతో ఆయన స్థానంలో కూతురు ఫిర్దౌస్ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే తండ్రి అవినీతి మరక.. ఈ యువ నేత గెలుపును ఆపలేకపోయింది. అంతేగాదు స్వాతంత్యం వచ్చిన తర్వాత ఒడిశాలో ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా ఆమె విజయం ఒడిషా రాజకీయ పుటల్లోకి ఎక్కింది.కెరీర్..ఫిర్దౌస్ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చూశారు. ఆ తర్వాత 2022లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎంబీ) నుంచి ఎగ్జిక్యూటిబవ్ జనరల్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంను కూడా పూర్తి చేశారు.2023లో కాన్ఫెడరేషన్ ఆప్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసీయేషిన్ ఆఫ్ ఇండియా(సీఆర్‌ఈడీఏఐ) అధ్యక్షురాలిగా ఫిర్దౌస్ ఎన్నికయ్యారు. అలాగే సీఆర్‌ఈడీఏఐ మహిళా విభాగానికి ఈస్ట్ జోన్ కో ఆర్డినేటర్‌గా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఆమె ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్(ఐజీబీసీ)కి కో చైర్మన్‌గా కూడా చేశారు. అంతేగాదు మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించిన ఐఎన్‌డబ్ల్యూఈసీ సభ్యురాలు కూడా. ఆమె ప్రముఖ పారిశ్రామికవేత్త షేక్ మెరాజ్ ఉల్ హక్‌ను వివాహం చేసుకున్నారు. రాజకీయాల్లో ఒడిషా తొలి మహిళా ముఖ్యమంత్రి నందిని సత్పతి, ఫిర్దౌస్కు ఆదర్శమట. విశేషం ఏంటంటే.. 1972లో బారాబతి-కటక్ నియోజకవర్గం నుంచే నందిని సత్పతి గెలుపొందారు. కాగా, ఈ 2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు గణనీయమైన రాజకీయ మార్పును చవిచూశాయి. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 147 సీట్లలో 78 స్థానాలను గెలుచుకోని విజయం సాధించింది. దీంతో 24 ఏళ్ల పాటు ఏకధాటిగా పాలించిన బిజూ జనతాదళ్ (బీజేడీ) పార్టీ నాయకుడు నవీన్ పట్నాయక్ పాలనకు తెరపడింది. (చదవండి: మచ్చల జింక, దెయ్యం అంటూ అవహేళనలు..! ఐనా..)