ముస్లింలకు భారీగా టికెట్లిచ్చిన మాయావతి
యూపీలో కాంగ్రెస్, ఎస్పీలకు దెబ్బే!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరాదిలో బీజేపీ కోటను బద్దలు కొట్టాలన్న విపక్ష ఇండియా కూటమి ఆశలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి నీళ్లు చల్లేలా కని్పస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలఓల బీజేపీని నిలువరించేందుకు ఓట్ల సమీకరణకు కాంగ్రెస్ కిందా మీదా పడుతోంది. ఆ ప్రయత్నాలను వమ్ము చేసేలా బీఎస్పీ వ్యవహరిస్తోంది.
ముఖ్యంగా యూపీలో ముస్లిం ఓట్ల సమీకరణతో బీజేపీ స్థానాలకు భారీగా గండి కొట్టాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. కానీ ముస్లిం ఓట్లను నిలువునా చీల్చేలా రాష్ట్రంలో బీఎస్పీ ముస్లింలకు ఎక్కువ టికెట్లిచ్చింది! అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే ప్రాభవం కోల్పోయిన బీస్పీ లోక్‌సభ ఎన్నికల్లోనైనా ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఇండియా కూటమికి ప్రాణ సంకటంగా పరిణమిస్తున్నాయి.
యూపీలో కూటమికి దెబ్బే!
అత్యంత కీలకమైన యూపీలో 80 స్థానాలకు గానూ బీజేపీ ఈసారి సొంతంగానే 70 సీట్లపై గురిపెట్టింది. పొత్తులో భాగంగా కట్టిన కాంగ్రెస్ 13, ఎస్పీ 67 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. యూపీలో 21 శాతమున్న యాదవ ఓట్లకు 19 శాతం ముస్లిం ఓట్లు కలిస్తే భారీగా ఓట్లు రాలుతాయని ఆశ పడుతున్నాయి. రాష్ట్రంలో ఏకంగా 18 జిల్లాల పరిధిలోని పలు లోక్‌సభ స్థానాల్లో ముస్లింలు నిర్ణాయక శక్తిగా ఉన్నారు. వీటిలో పలు జిల్లాలో ముస్లిం జనాభా ఏకంగా 30 శాతం పైగా ఉంది. వీరంతా కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలకు సంప్రదాయ ఓటు బ్యాంకే.
దాంతో ముస్లింల ఓట్లను సంఘటితంగా తమవైపు సమీకరించుకునేందుకు కాంగ్రెస్, ఎస్పీ వారికి 11 సీట్లు కేటాయించాయి. మాయా నిర్ణయాలు వాటి ప్రయత్నాలకు గండి కొట్టేలా ఉన్నాయి. బీఎస్పీ ఈసారి ఏకంగా 18 స్థానాల్లో ముస్లింలకే టికెట్లిచ్చింది! దాంతో ముస్లిం ఓట్లకు గండిపడి ఎస్పీ/కాంగ్రెస్ అభ్యర్థుల అవకాశాలకు గండిపడేలా కని్పస్తోంది. ఇక దళిత ప్రాబల్య పశ్చిమ యూపీలో వాటి ఓట్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్/ఎస్పీ విశ్వప్రయత్నాలు చేస్తుంటే అక్కడా బీఎస్పీ ప్రచారాన్ని ఉధృతం చేసి కాంగ్రెస్‌పై ముప్పేట దాడి కొనసాగిస్తోంది. ఇది వాటికి మరో తలనొప్పిగా మారింది. రాజస్థాన్‌లోనూ బీఎస్పీ ఆరుచోట్ల ముస్లింలకు టికెటిచ్చింది! మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలోనూ ఇదే పరిస్థితి!
లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీఎస్పీ ప్రదర్శన
ఎన్నికలు సీట్లు ఓట్ల శాతం
2004 19 5.33
2009 21 6.17
2014 0 4.19
2019 10 3.67
ప్రభావం తగ్గలేదు బహుజన నేత కాన్షీరాం వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన మాయావతి నాలుగుసార్లు యూపీ ముఖ్యమంత్రిగా చేశారు. రాష్ట్రంలో 21 శాతమున్న ఎస్సీల్లో సగానికి పైగా జాతవ్‌లే. ఆ కులం నుంచి వచ్చిన మాయావతికి వారిపై పట్టు ఉంది. కానీ 2017, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీలు పూర్తిగా బీజేపీ వైపు మొగ్గడంతో మాయా ప్రభను కోల్పోయారు. 2017లో బీఎస్పీకి 19 సీట్లు రాగా 2022లో ఒక్కటంటే ఒక్క సీటే వచ్చింది! కాకపోతే ఆ ఎన్నికల్లో బీఎస్పీ 12.88 శాతం ఓట్లు సాధించింది.
ఇక 2004 లోక్‌సభ ఎన్నికల్లో 19, 2009లో 21 సీట్లు సాధించిన బీఎస్పీ, 2014లో మాత్రం ఖాతాయే తెరవలేకపోయింది. 2019లో ఎస్పీ, రాష్ట్రయ లోక్‌దళ్‌తో పొత్తుల వల్ల 10 సీట్లు గెలుచుకుంది. కానీ వారిలో ఐదుగురు ఎంపీలు పార్టీని వీడారు. ఈ ఎన్నికల్లో మాయవతి ఒంటరిగా పోరాడుతున్నారు. యూపీలో 80 స్థానాలకు గానూ 64 చోట్ల అభ్యర్థులను నిలిపారు. అలాగే రాజస్థాన్‌లో 25, మధ్యప్రదేశ్‌లో 7, ఛత్తీస్‌గఢ్‌లో 8 స్థానాల్లోనూ బీఎస్పీ పోటీ చేస్తోంది. ఈసారి కూడా ముస్లిం దళిత ఫార్ములాతోనే ఆమె బరిలో దిగారు. ఆమె ప్రచార సభలకు జనం భారీగా వస్తున్నారు. దాంతో మాయా దెబ్బకు మోదీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని కాంగ్రెస్ తదితర విపక్షాలు భయపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment