సాన్ ఫ్రాన్సిస్కోలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ట్విట్టర్లో మద్దతు తెలిపారు. ఆయన చెప్పింది అక్షరాలా నిజం. అందుకు ప్రస్తుత, గత ప్రభుత్వాలే పూర్తి బాధ్యత వహించాలన్నారు.
అందులో తప్పేంటి?
అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ సాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన "మొహబ్బత్ కీ దుకాన్" కార్యక్రమంలో మాట్లాడుతూ... ప్రస్తుతం భారతదేశంలో ముస్లింల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.1980ల్లో దళితుల పరిస్థితి ఎంత దీనంగా ఉండేదో అంతకంటే ఘోరమైన పరిస్థితులను వారు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలకు బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో స్పందించగా బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి మాత్రం సమర్ధించారు.
ట్వీట్ సారాంశమేమిటంటే...
" అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ చెప్పింది చేదు నిజం. కోట్లాది దళితులు, ముస్లింలు భారత దేశంలో దయనీయ స్థితిలో అభద్రతా భావంతో బ్రతుకుతున్నారు. ఈ పరిస్థితికి గతంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల ప్రభుత్వాలే బాధ్యత వహించాలి."
"యూపీలో కానివ్వండి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో కానివ్వండి. ఇప్పటికీ పేద, అణగారిన వర్గాల పట్ల అన్యాయాలు, దౌర్జన్యాలు, దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం మా హయాంలో మాత్రమే యూపీలో ప్రశాంతత నెలకొంది."
కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసం స్వార్ధ రాజకీయ నాయకులు మతపరమైన అల్లర్లు, కులాల మధ్య కొట్లాటలను రెచ్చగొట్టి చరిత్రను ఎన్నో చీకటి అధ్యాయాలతో నింపేశారని రాశారు.
చదవండి: ఆ ట్రెండ్ మొదలుపెట్టింది ఆయనే... కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment